బరి తెగింపే ఊరేగింపు

నిత్యం అనేక పెత్తనాల కింద నలిగి పోయే మనిషి సృష్టించుకునే ఆల్టర్ నేటివ్ స్పేస్ ఈ ఊరేగింపు. రోజువారీ యాతనల నుంచి తాత్కాలికంగా పారిపోయి ఇమాజినరీ వేషంలోకి దిగిపోయి ఉండగలిగిన సన్నివేశం

రి తెగింపు అనేదానికి తెలుగులో నిందార్థం స్థిరపడి ఉంది. అర్థ సంకోచం అనొచ్చు. ఈ అర్థ సంకోచ పరిణామం ఇటీవలిదేమీ కాదు. ఎప్పటినుంచో దాని అర్థం సంకోచమై ఉంది. బహుశా ఇది పెత్తనమంత పాతది. బరికి అంటే గీతలకు, ఆధిపత్య దొంతరలకు ఉన్న లెజ్జిమసీ రీత్యా వచ్చిన ఫ్యూడల్ వారసత్వం ఈ అర్థ సంకోచం. నిజానికి బరితెగింపు కొత్త శ్రేణులకు అవసరం. వివక్ష కు గురవుతున్న సమూహాలకు అవసరం. బరులు పైనున్న వారు గీసినవి.

సరే, ఈ సామాజిక వ్యాకరణాన్నుంచి వర్తమానానికి వద్దాం.

మొన్నామధ్య దసరా రోజున దిల్లీలో ఆఫీసు నుంచి ఇంటికి వస్తుంటే రోడ్డు పొడువునా ఊరేగింపులు. మతపరమైన ఊరేగింపులు ఎలా ఉంటాయో చెప్పక్కర్లే. అందరికీ అనుభవమే. ఊగుతూ తూగుతూ రోడ్డును రోడ్డుమీద వెళ్లే ట్రాఫిక్కునూ అదిరిస్తూ బెదిరిస్తూ ఊరేగుతున్న జనం. తలలకు రంగు రిబ్బన్లు, కొందరి చేతుల్లో కర్రలు. కారు డ్రైవ్ చేస్తున్న ‘పాజీ’ విసుక్కుంటున్నాడు. ఇదేం భక్తి సార్, తాగి, గంజాయి తాగి ఇష్టమొచ్చినట్టు రోడ్డంతా అల్లరి చేసుకుంటా అని. మనకందరికీ గణేశ్ మండపాల ఊరేగింపులు, అమ్మోరి ఊరేగింపులు, జుమ్మే రాత్ ఊరేగింపులు, బక్రీద్ సీజన్లో రోడ్డుపక్కన గొర్రెల హడావుడి అనుభవమే.

అన్నింట్లో మందు ఉండకపోవచ్చు. మత్తు అయితే ఏదో రూపంలో ప్రవహిస్తుంది. కొన్ని సార్లు భయమేస్తుంది అ సమయంలో వాటి పక్కనుంచి వెళ్లడానికి. గుంపు మాబ్ లక్షణం సంతరించుకునే సన్నివేశమిది.

మనుషులు ఎందుకలా చేస్తారు.

గణేశుడి పండగ సందర్భంగా గతంలో రాసి ఉన్నాను. ‘‘వారి ఇండ్లు ఏ సంబరాన్నీ విషాదాన్నీ తట్టుకోలేనంత చిన్నవి. వారి ఇంటి ముందు నీటి పంపుల వలె, డ్రైనేజీ కాలువల వలె సకల ఎమోషన్లు పొంగి పొర్లుతూ చిత్తడి చేస్తుంటాయి’’ అని. అదొక పార్శ్వం మాత్రమే. బస్తీలు పండగ పూట రోడ్డుమీదకు వచ్చి చేసే హంగామాలో ఇంకా  చాలా అంశాలు ఉన్నాయి.

అందులో మొదటిది అబ్వియస్ వన్. డబ్బు ముందు అధికారం ముందు వినయంగా వంగే నడుములను నిటారు చేసి విశృంఖల నాట్యం చేసే సన్నివేశం. మార్జిన్లకు పరిమితమైన బతుకులు సెంటర్ లో తలలెగరేసి ఊరేగే సన్నివేశం.  రోజువారీ దైన్యాన్ని కాసేపైనా మర్చిపోగల సన్నివేశం. అది కాకుండా మరో కారణం. క్లెయిమ్ ఆన్ రోడ్స్. ఇల్లు చిన్నవైన వారికి రోడ్లతో ఉండే సంబంధం పెద్దది.

రోడ్లు రెండు విధములు. ఇంటి ముందున్న బస్తీ రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు. ఇంటిముందున్న బస్తీ  రోడ్డును పూర్తిగా స్వాధీనం చేసుకోవడానికి పెళ్లిళ్లు/సమర్తలు/అయ్యప్ప పడిపూజలు వారికొక అవకాశం. మామూలుగా కూడా బస్తీల్లో తమ ఇంటిముందున్న రోడ్డు ఇంటిలో భాగంగానే భావించడం ఆనవాయితీ. ప్రభుత్వాలు కమ్యూనిటీ హాళ్ల పరిష్కారంతో ముందుకొచ్చినా ఈ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంటది. అక్కడ రోడ్డు మూసేసి టెంట్ వేస్తే  అందరూ చుట్టూ తిరిగి వెళ్లడమే. అదొక అలిఖిత ఒప్పందం. బస్తీలో పేరున్న నాయకుడు అయితే ఆర్టీసీ బస్సు తిరిగే రోడ్డును కూడా మూసివేసి టెంట్ వేసేయ్యగలడు. ఎంత పెద్ద వాహనం తిరిగే రోడ్డును మూసేస్తే అంత పరపతి కింద లెక్క, అదొక అధికార ప్రదర్శన. వీలును బట్టి అధికారం అందరూ ప్రదర్శిస్తారు.

కానీ మరీ పెద్ద రోడ్డును అంటే నగరంలోనే పెద్ద రోడ్డును ఎప్పుడు ఓన్ చేసుకోవాలె. వాళ్లేమో మార్జిన్స్‌లో బతికే జనం. దైనందిన జీవితంలో ఆ రోడ్ల మీద వాళ్లు పరాయి వాళ్లు. అది మరీపెద్ద మాట అనుకుంటే రోడ్లమీద మార్జిన్స్లో మాత్రమే వెళ్లగలిగిన వాహనాలు కలిగినవారు. ఇదిగో పెద్ద పండుగలు అటువంటి అవకాశమిస్తాయి. ప్రమాదకరం కాకుండా చట్టాన్నిధిక్కరించడంలో ఒక కిక్ ఉంటుంది. గణేశుడితో మొదలై శ్రీరామనవమిదాకా ఎన్ని అవకాశాలో.

పొలిటికల్ ప్రాజెక్టులో భాగంగా జరిగే యాత్రలను ఇక్కడ చర్చించడంలేదు. అది వేరే. మౌలికంగా సంప్రదాయ లక్షణమున్న యాత్రల గురించి మాట్లాడుతున్నాను. మౌలికంగా పొలిటికల్ లక్షణమున్న శోభాయాత్రల గురించి, జమాతుల గురించి కాదు.

బక్రీద్ సందర్భంగా హైదరాబాద్లో టోలీచౌకీ నుంచి మొహదీపట్నం దాకా అంత పెద్ద రోడ్డును గొర్రెలు గొర్రె పెండలతో మూడో భాగం నింపేసినా ముందూ వెనకా మూడు కిలోమీటర్లు జామ్ అయినా అందరూ ముక్కు అదీ మూసుకుని మిగిలిన మార్జిన్ లో పోతానే ఉంటారు. జుమ్మే కిరాత్ రాత్రి చూడాలె  పోరగాళ్ల హంగామా, రోడ్డుమీదకు ఎందుకొచ్చినంరా భయ్ అనిపిస్తది.

అది మార్జిన్లు సెంటర్ లోకి వచ్చి నాట్యం చేసే సన్నివేశం. సో రోజువారీగా ఎవరైతే ఈ  రోడ్డు తమది అని భావించి రకరకాల వాహనాల్లో హడావుడిగా తిరుగుతూ ఉంటారో అటువంటి వారు మార్జిన్లలో పోవాల్సి రావడం, రోజువారీగా అది తమది కాదు అనుకునే మార్జిన్స్ సమూహం రోడ్డులో సింహభాగాన్ని స్వాధీనం చేసుకోవడం ఈ ఊరేగింపుల్లో ప్రత్యేకత.

కర్ర పట్టుకుని నాలుక మడతపెట్టి రోడ్డు మీద ఆడతంటే ఎంత పెద్ద కారైనా ఆగి ఆగి ముక్కుతూ మూలుగుతూ పోవాల్సిందే. అలా ఆగిఆగిపోవాల్సిన పరిస్థితిని కల్పించడమే ఇక్కడ కిక్కు. వారొచ్చి కారుకు గుద్దినా కారొచ్చి వారికి గుద్దినా కారుకి అందులోని వారికి నష్టం జరిగే సన్నివేశం. ఇటీవలి ఉదాహరణలే ఉన్నాయి. ఉత్తరాదిన అయితే మనుషులే అక్కర్లే, ఆవు చాలు. ఆవు కారు మీదకు వచ్చినా కారు ఆవు మీదకు పోయినా కారుకే ప్రమాదం కాదు, కారులోని వారికి ప్రమాదం. ఉదాహరణలు ఉన్నాయి.  అందుకే ఈ ఊరేగింపుల్లో మామూలు రోడ్డు న్యాయానికి భిన్నంగా కార్లు అతి జాగ్రత్తగానూ కర్రలతో నడిచే గుంపు విశృంఖలంగా ఉంటుంది.

అది కృత్రిమ అధికారాన్ని తాత్కాలికంగా అభినయించగలిగిన సన్నివేశం. తలకు ఆరెంజో, గ్రీనో రిబ్బన్ కట్టుకున్న ఒక పోరడు గుట్కానో గంజాయో నములుతూ ఊగుతూ తూలుతూ రకరకాల కార్లను అందులోని మనుషులను అడ్డదిడ్డంగా ఆపుతూ వాటిని కంట్రోల్ చేస్తున్నట్టు నటిస్తూ ఉండే ఆధిపత్యపు కిక్కు ఇక్కడ ప్రధానమైనది. తమ మానాన తాము యాత్ర మౌనంగా చేసుకుంటూ పోవడంలో కిక్ ఏమీ ఉండదు. ఆ తల రిబ్బన్లు, చేతుల్లో కట్టెలు తీసేసి రోడ్డు వారగా బుద్ధిగా మతయాత్రలు చేయమనండి. కిక్ ఉండదు. అపుడింతగా యాత్రలు పాపులర్ అవ్వవు. ఈకిక్ మొత్తంగా ఏదో పొలిటికల్ ప్రాజెక్టులో భాగంగా పుట్టుకొచ్చింది కానక్కర్లే. అది మనిషికి ఆధిపత్యంలో ఉండే కిక్. ఆల్ రెడీ ఉన్న దాన్ని మరింత పెంచి ఉపయోగించుకోవడం పొలిటికల్ ప్రాజెక్టులు చేసే పని.

అధికారిక దొంతరలనుంచి తాత్కాలికంగానైనా విముక్తిపొంది యుటోపియన్ ఫ్రీడమ్ ఫీలయ్యే సన్నివేశంగా కార్నివాల్ ను అభివర్ణిస్తారు బక్తిన్. ఎక్స్ ప్రెషన్ ఆఫ్ సెకెండ్ లైఫ్ అని కూడా అంటారు. బక్తిన్ కార్నివాలస్య్కూ అని పేర్కొన్న కొన్ని లక్షణాలు ఈ మతపరమైన ఊరేగింపులకు ఉంటాయి.

ముఖ్యంగా బక్తిన్ కార్నివాల్ కు ఆపాదించిన నాలుగు లక్షణాల్లో రెండో లక్షణం బాగా సూట్ అవుతుంది. ఎస్సెంట్రిక్- మామూలు సమయాల్లో విడ్డూరంగా కనిపించే ఎస్సెంట్రిక్ లక్షణాలు ఈసందర్భాల్లో సాధారణ లక్షణంగా మారతాయి. పల్లెటూళ్లలో ‘వాడు తాగినోడురా, వాడితోటి ఏంటి’ అంటారు కదా అలాంటి లెజ్జిమసీ భక్తి ప్రదర్శనలో ఉంటుంది. భక్తి పూర్వకంగా ఉంటుంది.

దైనందిన జీవితపు యాతనలను, పైనున్న వారు తమ చుట్టూ గీసినగీతలను దాటి విశృంఖలం కాగలగినసన్నివేశం. నిరంతరం తమపై చెలాయించే అనేక పెత్తనాలను మర్చిపోవడమే కాకుండా తామే పెత్తనం చెలాయించగలిగిన ఒక స్థితిని సృష్టించుకునే సన్నివేశంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే బక్తిన్ కార్నివల్ కాన్సెప్ట్ లో అధికారాల పరిధులను కాలదన్ని సమానత్వం ఫీలవడం అనేదాని గురించి కూడా అంతర్లీనంగా చర్చిస్తారు. వాస్తవానికి ఈ మత ఊరేగింపుల సందర్భాల్లో అది సమానత్వం కాదు, ఆధిపత్యం.  సమానత్వం కిక్ ఇవ్వదు. ఆధిపత్యం ఇస్తుంది ఎంత తాత్కాలికమైనా.

పూర్తి కాంట్రాస్టు లేదా విలోమం అనదగినది బక్తిన్ నాలుగో ప్రతిపాదన. అఫ్ కోర్స్ ఆయన వర్ణించిన కార్నివాల్స్ వేరు, ఈ మత ఊరేగింపులు వేరు అనుకోండి. ఆధిపత్యపు చిహ్నాలను భక్తి చిహ్నాలను ఆనవాయితీగా వచ్చిన సంప్రదాయ చిహ్నాలను హేళన చేసే సన్నివేశంగా కార్నివాల్ను భక్తిన్ వర్ణిస్తారు. అది మాత్రంఇక్కడ రివర్స్. ఈ ఊరేగింపుల్లో తమ మీద రోజువారీ చేస్తున్న పెత్తనాన్ని తమదైన భౌతిక చిహ్నాల్లో ఇమిటేట్ చేయడం ఉంటుంది. భక్తి పేరుతో సంప్రదాయం పేరుతో చేయడం ఉంటుంది. ఆ సంప్రదాయ చిహ్నాలనే ఆధిపత్యం కోసం ఆశ్రయించడం ఉంటుంది.

గ్రెటోస్కూ అని మరో కాన్సెప్ట్ ఉంది బక్తిన్ ప్రతిపాదించినవాటిలో. అది కొత్తదేమీ కాదు. మనం నిత్యం ఇలాంటి ఊరేగింపుల్లో చూసేదే. గుడ్లు మిటకరించడం(బల్జింగ్ ఐస్) నాలుక బయటపెట్టడం, మడతపెట్టడం(ఓవర్ సైజ్డ్ మౌత్) ఓవరాల్ గా తాను తాను కాకుండా ఫాంటసైజ్డ్ బీయింగ్ గా మారడం (అనదర్ బాడీ ) ఈ లక్షణాలు అన్నీ మన ఊరేగింపుల్లోనూ పుష్కలంగా ఉంటాయి.

నిత్యం అనేక పెత్తనాల కింద నలిగి పోయే మనిషి సృష్టించుకునే ఆల్టర్ నేటివ్ స్పేస్ ఈ ఊరేగింపు. రోజువారీ యాతనల నుంచి తాత్కాలికంగా పారిపోయి ఇమాజినరీ వేషంలోకి దిగిపోయి ఉండగలిగగిన సన్నివేశం.  Sigh of the oppressed creature అనే మార్క్స్ ఎక్స్ ప్రెషన్ సరిగ్గా వర్తించే సన్నివేశం. రోజూ అంట్లు తోమే ఎల్లమ్మ ను కాదు, నేను ఆ అమ్మోరి అవతారమైన ఎల్లమ్మ తల్లిని అని తనకు తాను హిప్నటైజ్ చేసుకుని అభినయించగలిగిన సందర్భం. అంతకంటే ముఖ్యంగా తాను రోజూ మార్జిన్లలో నడిచే స్పేసెస్ ను సొంతం చేసుకుని కాసేపైనా పెత్తనం చేయగల సన్నివేశం. ఊరేగింపులో పాల్గొనే  గుంపులు, వారి మానసిక స్థాయిని బట్టి ఈ లేయర్లలో ఏవైనా వర్తించొచ్చు. చెమట చిందించే శరీరాలు సంపన్నవంతమైన విశాలమైన రహదారులపై మైమరిచి చేసే కృత్రిమ జైత్రయాత్ర. కాకపోతే ఆ జైత్రయాత్ర ఎంత కృత్రిమమో వారి ఆధిపత్యం కూడా అంతే కృత్రిమం, తాత్కాలికం. అది ఉపశమనం కూడా కాదు. మైమరుపు.

*

జీ.ఎస్. రామ్మోహన్

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘కృత్రిమ జైత్రయాత్ర’ – బరితెగింపు అలియాస్ ఊరేగింపుల వంటి మొరటు మూక వ్యక్తీకరణలు, వర్తనలు.. దుర్మార్గమైన, బీభత్సభరితమైన సామాజిక వ్యవస్థ ఫలితమేనన్ననీ విశ్లేషణ సారాంశం ఈ ఒక్క మాటతో పీక్ కి చేరి భలే కిక్కిచ్చింది రామూ!

  • చాలా బాగా చెప్పారు సర్. ఈ ఊరేగింపుల పట్ల నాకు ఒక దృక్కోణం ఇచ్చారు. ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు