ప్రైవేట్ చదువుల దోపిడీపై వేదనే….

ప్రతి రచయితకీ తనకిష్టమైన కథ వొకటి వుంటుంది. ఆ కథ వెనక కథ కూడా వుంటుంది. అట్లాంటి ఆసక్తికరమైన కథానుభవాల శీర్షిక ఇది!

తెలుగు కథా సాహిత్యంలో పెద్దింటి అశోక్ కుమార్ పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ కథకు మారు పేరు. మాయి ముంత, ఊటబాయి, జుమ్మేకి రాత్ మే,  మా ఊరి బాగోతం వంటి ప్రముఖ కథా సంకలనాలతో, జిగిరి లాంగ్ మార్చ్, ఇంకెంత దూరం వంటి నవలలతో తెలంగాణ ప్రాంత జీవితాన్ని సహజంగా చిత్రించిన కథకుడు. అంతరించిపోతున్న కులవృత్తులని, గ్లోబలైజేషన్ దాటికి ధ్వంసమైన తెలంగాణను అద్భుతంగా కథలుగా మలిచారు. బోనం కుండకు పూసిన పసుపు మెరిసినట్లు….పెద్దింటి కథలనిండా తెలంగాణ భాష, యాస, సంస్కృతి పరిమళిస్తుంటాయి. కేవలం తెలంగాణ గోసను మాత్రమే కాదు, మా ఊరి బాగోతం కథల్లో పల్లెటూరి జనాల్లోని అమాయకత్వాన్ని, కళాపోషణను కడుపుబ్బ నవ్వించారు. ఇటు వేదం, మల్లేశం, వంటి సినిమాలకు రచయితగా పనిచేసి తెలుగు తెరమీద తెలంగాణ అస్తిత్వాన్ని చాటుతున్నారు.  ఒక ముక్కలో చెప్పాలంటే పెద్దింటి సాహిత్యం చదవడమంటే ఒక తరం తెలంగాణను దర్శించినట్టే…

*

చుక్కలు రాని ఆకాశం

కొన్ని కథలు కదిలిపోయి రాస్తాము. కొన్ని కథలు రాస్తూ కదిలిపోతాము. కాని కొన్ని మాత్రం కదిలిపోయి రాస్తూ…. రాస్తూ కదిలిపోతాము. అందులో లేవనెత్తిన సమస్యకు పరిష్కారం దొరుకక రోజూ నలిగిపోతాం.నేను రాసిన రెండువందలకు పైగా కథల్లో ఇలాంటివి పాతిక పైనే ఉన్నాయి. అందులో ఒకటి చెప్పాలంటే “చుక్కలు రాని ఆకాశం “. ఇది ప్రస్తుతం అందరిని తొలుస్తున్న సమస్య కాబట్టి ఇక్కడ దీనిని ప్రస్తావిస్తున్నాను. ఈ కథను  నేను 2014 లో రాసాను. అందరు అప్రధానం అనుకుంటున్న ఒక ప్రధాన సమస్య మీద రాసిన కథ ఇది. చాలా మథనపడి, ఏం చెయ్యాలని ఆలోచించి ఏం చెయ్యలేక, సమస్యను ప్రజలు పాలకుల ముందుకు  తెచ్చిన కథ ఇది. తర్వాత కాలంలో ఈ కథ తర్వాత విద్యా విధానంలో కొన్ని మార్పులు వచ్చాయి.

కథ చుక్కలు రాని ఆకాశం చదవండి.

       అది జూన్  2014 నూతన విద్యా సంవత్సరం. అప్పుడే తెలంగాణ ఆవిర్భావం జరిగింది. మేము కోటి ఆశలతో స్కూళ్లు తెరిచి కూర్చున్నాము. నేను పాఠశాల ప్రధానోపాధ్యాయున్ని. రాబోయే తెలంగాణలో విద్యావిధానం ఇలా ఉంటుంది అలా ఉంటుందని స్టాప్ లో అప్పటికే చర్చలు పెట్టుకున్నాం. మాది UPS పాఠశాల.  అప్పటికి మా స్కూల్ లో విద్యార్థుల సంఖ్య 90. ప్రైవేట్ స్కూళ్లు ఇంగ్లీష్ మీడియం లో చదువుకుంటే తప్ప రాబోయే తెలంగాణలో భవిష్యత్తే లేదని అప్పటికే బాగా ప్రచారం చేసారు.
పాఠశాల మొదటి రోజు కాబట్టి పిల్లలు బిక్కు బిక్కు మంటూ చాలా తక్కువగా… ఒక్కొక్కలే వస్తున్నారు. నేను తరగతులన్నీ తిరిగి పిల్లల సంఖ్యను లెక్క వేసుకుని మిడ్ డే మీల్స్ వారికి బియ్యంలెక్క చెప్పి తరగతి గదిలోకి వచ్చాను.  అది మూడవ తరగతి  అందులో పిల్లల సంఖ్య 16. కానీ ఐదుగురు పిల్లలు మాత్రమే వచ్చారు. ఆరోజే బడి బాట కార్యక్రమం మొదలు. మొదటి రోజు కదా వస్తారులే అనుకుని అటెండెన్స్ తీసుకుంటున్నాను. పావని అనే అమ్మాయి చలాకీ పిల్ల. నేను అటెండెన్స్ రిజిస్టర్ మూసి వేయగానే “అందరు సిరిసిల్ల పోతుండ్రు సార్  “అని ఓ బాంబ్ పేల్చింది.
నాకు అర్ధం కాక “ఎందుకు బుక్స్ కొనుక్కోడానికా ” అన్నాను.
“కాదు సార్…. సిరిసిల్ల బడికి. వ్యాన్ లో పోతుండ్రు ” అన్నది.
నాకు గుండె దడీలు మంది. వెంటనే బయటకు వచ్చాను. అప్పటికి మా అసిస్టెంటు టీచర్స్ ఐదుగురు విషాద వదనాలతో బయటకి వచ్చారు. ఏం జరిగిందో అర్ధం చేసుకున్నాను.
ప్రమాదం మించిపోక ముందే పరిస్థితిని చక్కదిద్దాలని అందరం ఊరిలోకి బయలుదేరాం.
అది ఇల్లంతకుంట గ్రామంలోని రామోజిపేట అనే చిన్నఊరు. రాజన్నసిరిసిల్ల జిల్లా. ఇల్లిల్లు తిరిగాం. నిజమే… పిల్లలంతా పొద్దున్నే వ్యాన్ లో వెళ్లారట. మమ్మల్ని చూసి పేరెంట్స్ తప్పుకుంటున్నారు. నాకు ఊరితో అటాచ్ మెంట్ ఎక్కువ. వారికి పింఛన్ల విషయంలో, ప్రభుత్వ పథకాల విషయంలో, ఇంకేమైనా ఆరోగ్య సమస్యల్లో తోచిన సహాయం చేస్తుంటాను కాబట్టి నన్ను చూసి నిజం చెప్పలేక కొంత ఇబ్బంది పడుతున్నారు. మా బడి గురించి చదువులో స్వేచ్ఛ గురించి వారికి నచ్చజెప్పాలని చూసాను కాని కుదరలేదు. వందరూపాయలు కూలీ చేసుకునే వారు కూడా వచ్చిన వందలో యాభైరూపాయలు పిల్లల చదువుకోసం ఖర్చుపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కాని ఉచితంగా మేమిచ్చే చదువు, బట్టలు, పుస్తకాల ను ఒప్పుకునేలా లేరు.
మరునాడు పేరెంట్స్ మీటింగ్ పెట్టాను. వాళ్ళ అభిప్రాయాలు సూటిగా చెపారు. సార్ పేరు చెప్పితేనే పిల్లలు భయపడాలట. ఎప్పుడూ రాసుకుంటూనో చదువుకుంటూనో ఓ మూలకు కూర్చోవాలట. ఇలా మేము ఏనాడో వదిలిపెట్టిన నిర్బంధ విద్య కావాలని చెప్పారు. అది నిజమైన విద్య కాదంటే ఎవరూ ఒప్పుకోలేదు. పైగా తమకు ఇంగ్లీష్ విద్య కావాలన్నారు. ప్రాథమిక విద్య తెలుగులోనే ఉండాలంటే ఎవరూ ఒప్పుకోలేదు.
ఏదో చెప్పి అందరిని ఒప్పిస్తూ అలా రోజూ పొద్దున సాయంత్రం వారం రోజులు ఊరిలో పిల్లల ఇండ్ల చుట్టు తిరిగాం. కిక్కిరిసిన వ్యానులో కుక్కికుక్కి పంపించడానికైనా ఒప్పుకుంటున్నారు కాని పిల్లలను మా బడికి పంపడానికి ఒప్పుకోవడంలేదు. మా స్టెంత్ 90 నుంచి ముప్పయిరెండుకు పడిపోయింది. ఈ ముప్పయిరెండు మంది పిల్లల తల్లిదండ్రుల్లో కూడా ఆత్మన్యూనతా భావం మొదలైంది. తమ పిల్లలు ఎక్కడ వెనకబడి పోతారో అని వారు మా మీద నిఘా పెట్టి మాకు తోచిన సలహాలు ఇస్తూ దొరికిన పుస్తకాలను తెచ్చి చెప్పుమంటున్నారు.
అదిగో ఆ వారం రోజులు ఊరిలో తిరిగినప్పుడు నేను చూసిన సంఘటనలు, ప్రైవేటు నిర్బంధ చదువుల మీద పేదలకున్న భ్రమలు… ప్రైవేట్ దోపిడి…ప్రభుత్వ నిర్లక్ష్యం… పిల్లల తల్లిదండ్రుల మానసిక పరిస్థితి… నా ఏడుపు, దుఃఖం, బాధను దించుకోవడానికి… కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వానికి విద్యావిధానం మీద  నేనిచ్చిన ఒక వినతిపత్రం ఈ కథ.
ఈ కథ రాసిన తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులు జరిగాయి. అంటే నా కథను చదివి ఏదో మార్పు వచ్చిందని మాత్రం కాదు. నా ఆలోచనల్లో వచ్చిన మార్పు. జనాన్ని నమ్మించడానికి మేమూ కొన్ని ట్రిక్కులు నేర్చుకున్నాము. పిల్లలు బడికి రాకపోవడానికి ప్రధానకారణం ఉపాధ్యాయులే అని నిందలు వస్తున్న కాలం కూడా అదే కాబట్టి బాగా ఆలోచించి  ఈ కథకు కొనసాగింపుగా 2016 లో ఊరిలో మేము మా పాఠశాల పని తీరు మీద ఏకంగా ప్రజల మద్య  రెఫరెండం పెట్టుకున్నాము. ప్రజలు మా పని తీరును మెచ్చుకుంటూనే ఇంగ్లీష్ విద్య కావాలని బలంగా డిమాండ్ చేసారు. అప్పట్లో ఈ వార్త ఒక సంచలనమై అందరి దృష్టినీ ఆకర్షించింది. తర్వాత ప్రభుత్వ పెద్దల్లో మార్పు … ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చింది.
బడి అనంత విజ్ఞాన ఆకాశం
 పిల్లలు తలతల మెరిసె  చుక్కలు
పండు వెన్నెల చంద్రుడే గురువు
 మరిప్పుడు ఆ ఆకాశం నిండా చుక్కలున్నాయా అంటే…?
అది మరో కథ అవుతుంది!!

*

శీర్షిక లోగో: సృజన్ రాజ్ 

పెద్దింటి అశోక్ కుమార్

13 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రభుత్వ విద్యా రంగములో ఇప్పటికీ తీరని వేదన గురించి ఎంత మదన పడ్డవో, పెట్టినవో తెలుసు..

    • ఔను సార్. కథకుడిగానే కాకుండా… తెలంగాణ విద్య కోసం పెద్దింటి చాలా కృషి చేస్తున్నారు

  • విద్యా రంగంలో పరిణామాన్ని పదిలబరిచిన కథ. రచయితకు అభినందనలు

  • నాకెంతో ఇష్టమైన తెలుగు రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. ఆయన కథలన్నీ వాస్తవ జీవితాలకు ప్రతిబింబాలు. ఆయన రాసిన చుక్కలు రాని ఆకాశం వెనుక ఉన్న కథను తెలుసుకుని చాలా నేర్చుకున్నాను. విద్య కోసం ఆయన పడిన తాపత్రయం అర్థమై మనసు ఆర్ధ్రమైయ్యింది. చక్కని శీర్షిక చందూ గారూ.. బహు చక్కని నిర్వహణ.. మరిన్ని ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలని ఎదురుచూస్తూ ఉన్నా

    • థాంక్యూ మేడం. మంచి కథకుల అనుభవాలు అందించేందుకు ప్రయత్నిస్తాను

  • *చుక్కలు రాని ఆకాశం* టైటిల్ లోనే బలమైన కథ కనిపిస్తుంది. వాస్తవికతను అందించారు… అభినందనలు సార్ 💐💐

  • ప్రతి కథ ఆవిర్భావం వెనుక ఏదో ఒక నేపథ్యం ఉంటుంది. చాలా సందర్భాల్లో రచయితకు నేపథ్యం చెప్పుకునే అవకాశం రాదు. ఈ కథానుభవం శీర్షిక ఆ అవకాశం కల్గించేలా ఉంది.
    సమకాలీన సమస్యపై చక్కని కథ. చాలా మంది ఉపాధ్యాయులెదుర్కొంటున్న సమస్యను లేవనెత్తి.. దాన్ని పరిష్కారం దిశగా నడిపిన పెద్దింటి వారికి, శీర్షికా నిర్వాహకులు చందు తులసి గారికి కృతజ్ఞతాపూర్వక అభినందనలు.

  • పాలకులకు చిత్తశుద్ది లేనంత వరకు ఈ సమస్య రాచపుండులా భాదిస్తుంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు