ప్రేక్షకుడి హక్కుతోనే ఈ సంగతులన్నీ!

బాధ్యత లేని సినిమాలను తిప్పికొట్టాలి. అప్పుడు మాత్రమే సినిమా బాగుపడ్తది.

ప్రసేన్ కవిగా, సాహిత్యజీవిగా మనకి తెలుసు. అయితే, అతనిలో ఇంకో “పాపులర్” కోణం కూడా వుంది. ఆ కోణం కన్ను తెరుచుకుని, తరచూ సామాజిక, సాంస్కృతిక విషయాల మీదే కాకుండా, పాపులర్ మీడియా మీద తీక్షణ దృష్టితో బాణాలు రువ్వుతుంది. అట్లా అప్పుడప్పుడూ ప్రసేన్ రాస్తూ వచ్చిన సినిమా సంగతులు ఇప్పుడు పుస్తకం రూపంలో మన ముందుకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రసేన్ తో కాసిని కబుర్లు-

ఒక సమీక్షకుడిగా సినిమాని తూచడానికి మీకేం అర్హత ఉంది అంటే ఏమంటారు..? 

* నేను ప్రేక్షకుడిని. అదే నా అర్హత. అయామ్ ది బాస్. నీ సరుకు నేను కొనుక్కున్నాక అది బాగుందో బాగాలేదో చెప్పే హక్కు నాకు కచ్చితంగా ఉంటుంది. మొదటి రోజు మార్నింగ్  షో చూసి బయటకు వస్తున్న ప్రేక్షకుడిని మాట్నీ కి వెళ్లే ప్రేక్షకుడు ఎలావుంది అని సైగ రూపంలో అడుగుతాడు. తల అడ్డంగా ఊపో నిలువుగా కదిల్చో సమాధానం వస్తుంది. అదే అతి పెద్ద రివ్యూ. అతనికి ఆ హక్కు లేదనగలమా. నేను అదే సమాధానాన్ని అక్షరాల్లో సవివరణాత్మకంగా చెపుతున్నాను.. అంతే.  నాకు సినిమా ఒక పాషన్ .  సినిమాద్యమం అత్యంత బలమైనదని నమ్మకం. దాంతోపాటు సమాజానికి మంచి జరగాలనే కోరిక కూడా నా చేత రాయిస్తుంది. అర్హత సంగతి పక్కన పెడితే.. నా విశ్లేషణ ధర్మంగా ఉందా లేదా చూడండి.

సినిమా నిర్మాణం టెక్నీకల్ అంశాల మీద మీకు ఇంత పట్టు ఎక్కణ్ణుంచి వచ్చింది..? 

* పట్టు ఉందని నేననుకోను.  ఒక వేళ ఉన్నట్టు అనిపిస్తే అది విపరీతంగా చూడడం వల్ల అంటింది  కావచ్చు. తెలుగులో సంవత్సరానికి 130 నుంచి 140 సినిమాలు విడుదలయేవి. నేను రెండో మూడో మినహా అన్నీ చూసేవాడిని. హిందీ ఇంగ్లీష్ తదితర భాషా సినిమాలు అదనం. ఇప్పటికీ నా వయసు వాళ్ళు చూసే సినిమాల సంఖ్యకంటే నేను చాలా ఎక్కువే చూస్తుంటాను. సినిమా చూడడం మితిమీరాక లోతుగా చూడడం అలవాటైంది. అందులోంచే ఈ రాయడం కూడా. మందు పాన్ బీడీ పేకాట ఎలాగూ లేవు, సినిమా నాకు ఇష్టమైన వ్యసనం. అంతే. చాలా మంది సినిమా చూసేపుడు తరవాతి సీన్ ఏంటో చెప్పగలరు. నేను తరవాతి షాట్ ఏంటో చెప్పగలుగుతున్నాను. అయినా  నా అంచనాలు తప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అద్భుతం అనుకున్న సినిమా ఫ్లాప్ బస్టర్ అయి నేను చెత్త అని రాసిన సినిమా సూపర్ హిట్ అవడమూ నాకు అనుభవమే.

 భారతీయులకు సినిమా తప్పా వేరే ఎంటర్టైన్మెంట్ లేదు అనే వాదనని ఒక విమర్శకుడి గా మీరు సమర్థిస్తారా..?

* లేదు. తాజా లెక్కల్లో తేడా వుంది. వీడియో గేమ్స్ ను వినోదంగా భావిస్తున్న వారి సంఖ్య 26 శాతం. సినిమా వినోదం అనుకుంటున్న వారు 22 శాతం. టీవిలో వినోదం వెతుక్కునే వారు 24 శాతం,మ్యాగజైన్స్, వెబ్సైట్లు వినోదం మార్గాలు అనుకునే వారు 12 శాతం… మీరు చెప్పే శుభ్ర సాహిత్యం చదివే వాళ్ళ సంఖ్య కేవలం 2 శాతం. అయితే కుటుంబం మొత్తం కలిసి ఆస్వాదించే వినోదం మాత్రం భారత దేశంలో ఇప్పటికీ సినిమాయే…రంగస్థలం, నృత్యప్రదర్శనలు, సంగీత విభావరులు, సాహిత్య సమావేశాల వైఫల్యం అందుకు కారణం కావచ్చు. సీరియస్ అంశాల పట్ల ప్రజల ఆసక్తి పెంచే కళారూపాలేవీ మనకు లేకపోవడం ప్రధాన వైఫల్యం. అందుకే ఆ ఆసక్తిని కలిగించే సినిమాను మార్చుకోవాలన్నది నా ఆకాంక్ష.

 మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం నేరుగా సినిమాకి సెట్ అవ్వదు అంటారు నిజమేనా?

* గాడ్ ఫాదర్ నవల కొన్ని వేల సినిమాలకు మూలం. రోమియో అండ్ జూలియట్ కూడా. సరే అవి పల్ప్ అనుకుందాం. మాక్బెత్ కథ తో చాలా సినిమాలొచ్చాయి. క్రైమ్ అండ్ పనిష్మెంట్ నేరము శిక్ష  కాదా. ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ కూడా సినిమా అయింది కదా. వాళ్ళు చెప్పలేదు కానీ జూలియా రాబర్ట్స్ ప్రెట్టి ఉమన్ మన కొకు ‘మనసున్న మనిషి ‘ కథే కదా. కింగ్ లియర్ గుణసుందరి కథ కాదా. అందరూ సెవెన్ సమురాయ్ అంటారు కానీ రామాయణం నుంచే షోలే వచ్చిందంటాను నేను. మహా భారతం మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం అవునా కాదా. అందులోంచి కొన్ని వేల సినిమాలొచ్చాయి. ఇలా కొన్ని వందల ఉదాహరణలున్నాయి. ఈ మధ్య వస్తున్న మలయాళ, తమిళ దళిత సినిమాలన్నీ సీరియస్ సాహిత్యమే. అసలు మెయిన్ స్ట్రీమ్ అంటే ఆబాలగోపాలానికీ పనికొచ్చేది అని అర్ధం. అలా పనికొస్తే సినిమా ఎగబడి దాని వెంట పడతది. అలా పడట్లేదు అంటే అది మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం కాదు అని అర్ధం.

అందరూ సత్యజిత్ రే లు కాదు, జేమ్స్ కామెరూన్ లూ కారు కానీ,  ఒక దర్శకుడి ప్రతిభ ని మనం కేవలం ఆ సినిమా స్క్రీన్ ప్లే తోనే లేదా కథ చెప్పిన విధానం తోనే కొలవగలమా..? 

* కబడ్డీ కోర్టులోకి దిగి నేను క్రికెట్ బాగా ఆడతానంటే నవ్వరూ. సినిమాను ఉత్పత్తి చేస్తున్నపుడు 24 ట్రేడ్స్ లో కొన్నయినా అద్భుతంగా ఉంటేనే దర్శకుడి ప్రతిభ. రే, కామరున్ లేం ఊడిపడలేదు. ధృక్పధం,నిష్ణాణత, చిత్తశుద్ధి వాళ్ళ బలం. లేదూ ఆ దర్శకుడి బలం ఇంకేదో అయి ఉంటే  అది సినిమాలో కనపడాలి. అదే కొలమానం.

తెలుగు సినిమా భారతీయ సినిమాని  కమర్షియల్ పరంగా చెడగొట్టింది అంటే ఒప్పుకుంటారా..? 

* ఒప్పుకుంటాను.. కానీ ప్రపంచమంతా అమితాబ్ గురించి షారుఖ్ గురించి మాట్లాడుకోవడాన్ని, నాటు నాటు ఘన కీర్తిని మనం ‘ ఇండియాస్ సాఫ్ట్ పవర్ ‘ అని సంబరపడిపోతున్నాం కదా. ఒకటి చెడగొట్టడమై మరొకటి సాఫ్ట్ పవర్ ఎలా అయింది. అది  కమర్శియలా, చెడగొట్టడమా, పవరా అనేది మనకే స్పష్టత లేదు. అది చెడగొట్టడమే అయితే ఆ పని ఒక్క తెలుగు సినిమాయే చెయ్యడం లేదు. కన్నడ సినిమా అదే చేస్తోంది. హిందీ సినిమా అదే చేస్తోంది. కనుకనే కదా దృక్పధం ముఖ్యం అన్నది.

 కొంత ఆరోగ్యకరమైన చర్చ తర్వాత మీరు అంతకుముందు ఇచ్చిన రివ్యూని ఏమైనా  మారుస్తారా..? మెచ్చుకోలు కావొచ్చు ఇంకా ఎక్కువ విమర్శ కావొచ్చు!

* లేదు. నేను నా దృష్టికోణాన్నే నమ్ముతాను. రజనీకాంత్ కాలా విషయం లో నాకో అనుభవం ఎదురైంది. నేను అందులో లోపాలున్నాయని రాసాను. కానీ చాలా మంది ఆ సినిమాను ఆకాశానికి ఎత్తేశారు. నా మీద నాకే సందేహం కలిగి రెండో సారి చూసాను. కానీ నా అభిప్రాయం మారలేదు.

మీరేమైన సినిమాలకి పని చేశారా…? చేస్తే ఆ సినిమా ఫలితం ఏంటి..?

* నేనే సినిమాకీ పని చెయ్యలేదు. చెయ్యాలనే ఆలోచన కూడా లేదు. అది నా కప్ అఫ్ టీ కాదు.

తెలుగు సినిమా హీరోలచే ప్రభావితం చేయబడుతుంది, మీరేమో నిష్కర్షగా రాస్తారు, ఫ్యాన్స్ నుంచి మీకేం ఇబ్బందులు ఎదురు కాలేదా…? 

*ఫ్యాన్స్ తో ఎప్పుడూ ఇబ్బందే.  చాలా ట్రోలింగ్ కు గురయ్యాను. పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అభిమానులు విమర్శను అస్సలు సహించలేరు. నేనైతే ట్రోలింగ్ ను ఆస్వాదిస్తా.

 ఒక సినిమా సక్సెస్ ఫార్ములా అంటే కమర్షియలా ఆర్ట్ ఫిల్మా….?

* డబ్బులొస్తే కమర్శియల్ రాకుంటే  పారలల్ అని సినిమా బాక్సాఫీస్ డెఫినేషన్. నేనందుకే నా విశ్లేషణలో మంచి చిన్న సినిమా పట్ల ఎక్కువ ప్రేమగా ఉంటాను. చెడ్డ పెద్ద సినిమా పట్ల నా విశ్లేషణ నిష్కర్ష గానే ఉంటది. వంద కోట్ల లక్ష్యం తో తీసే సినిమాల మీద నాకు కోపం. అవే తెలుగు సినిమాను చెడగొడుతున్నాయి. ఇక ఫార్ములా అంటారా… అసలాంటిదేమీ లేదు. అదే ఉండుంటే ఫెయిల్యూర్ సినిమా అనేదే ఉండదు కదా.

విమర్శకుని వ్యక్తిగత ఇష్టాలు  సమీక్షని ప్రభావితం చేస్తాయా …?

* చేయకూడదు, కానీ చేస్తాయి. నేను నా ఇష్టాలను దూరమే పెట్టాను. నాకు ఆర్జీవి చాలా ఇష్టం. అట్లానే కొరటాల శివ కూడా. కానీ నేను వాళ్ళ సినిమాలనూ నిర్దాక్షిణ్యంగానే తూచా. ఇంత చెప్పీ నేను కూడా మంచి చిన్న సినిమాల పట్ల పక్షపాతంగానే ఉంటాను. చిన్న సినిమాను బతికించాలన్నది నా దృష్టి కోణం.

 సినిమాకి సామాజిక బాధ్యత తప్పని సరిగా ఉండాలా…?

*తప్పక ఉండాలి.  నా గోలంతా అదే. ప్రస్తుతం సినిమా కేవలం డబ్బుకోసమే ఉంది. డబ్బు కోసం సినిమా ఏమైనా చేస్తది. ఇప్పుడు సామాజిక సమస్యల మీద వచ్చే సినిమాలు సొమ్ము చేసుకుంటున్నాయని అర్ధం కాగానే సినిమా ప్లేట్ ఫిరాయించేసింది కదా. అదే అవసరం. బాధ్యత లేని సినిమాలను తిప్పికొట్టాలి. అప్పుడు మాత్రమే సినిమా బాగుపడ్తది.

సామాజిక మాధ్యమాల ప్రభావం, ఓ టీ టీ ల ప్రభావం వల్ల సినిమా కి ఎక్కువ మంది విమర్శకులు వచ్చి చేరారు ? ఇది సినిమా రంగానికి సవాలా లేక కొత్త ద్వారాలు తెరిచింది అనుకోవాలా..?

* అవును విమర్శకులు పెరిగారు. అది అవసరం. ఇది కచ్చితంగా సినీ రంగానికి సవాలే. దానితో పాటు కొత్త ద్వారాలు కూడా తెరుచుకున్నాయి . వ్యాపార ప్రకటనల కోసం రివ్యూ లు కాక నిష్పక్షపాత విమర్శ తీవ్రం కావడం తో సినీ రంగం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటోంది. నిపుణులే కాక సామాన్య ప్రేక్షకులు కూడా సినిమాను తూచడం మొదలుపెట్టారు. ఫేస్ బుక్ లో యు ట్యూబ్ చానళ్ళలో మంచి రివ్యూలు వస్తున్నాయి. దాంతో సమీక్షకులు కూడా ఒళ్ళు దగ్గరపెట్టుకుని రాయాల్సి వస్తోంది. అది మంచి పరిణామం.

శుభ్రంగా సాహిత్యం రాసుకోక ఈ సినిమాల విశ్లేషణ ఎందుకు…? 

* శుభ్రం అనే మీ మాట వెనుక సినీ విమర్శ అశుభ్రం అనే నేనొప్పుకోని అర్ధం ఉంది. సినిమా కూడా సీరియస్ సాహిత్యమే అని నేను నమ్ముతాను. అనేక కళలను తనలో ఇముడ్చుకున్న అత్యంత శక్తివంతమైన 65 వ కళ
సినిమా. దాని రీచ్ వైశాల్యం చాలా చాలా ఎక్కువ. సరైన మార్గం లో వెళితే శుభ్ర సాహిత్యం ఏమేం సాధించగలదో సినిమా అంతకన్నా ఎక్కువ సాధించగలదు. అందుకే ముళ్ళపూడి నీ కొడవటిగంటి నీ వేటూరినీ అడపా దడపా రాసిన బాలగోపాల్ నీ రంగనాయకమ్మనీ ఎవరూ ఈ ప్రశ్న అడగలేదు. ఆ సరైన మార్గం చూపాలన్నదే నా ప్రయత్నం కూడా. దారి మరల్చలేనని స్పష్టంగా తెలుసు. అయినా ఉడతా భక్తి. ఖాదర్ మొహియుద్దీన్ లాంటి సాహితీ వేత్త ‘ప్రసేన్ సినిమా విమర్శలో కవితా నిర్మాణ పద్ధతులను పాటిస్తాడు ‘ అనడం నా శుభ్రతే అని నేను అనుకుంటున్నాను.

*

అనిల్ డ్యాని

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అనిల్ నీ ప్రశ్నలు బాగున్నాయి. ప్రసేన్ గారి సమాధానాలు మరింత బాగున్నాయి

  • నమస్కారం సార్ అనిల్ డానీ సార్. ఒక సాహిత్య శిఖరం ప్రసేన్ సార్, మీరడిగిన ప్రశ్నలకు చాలా మంచి సమాదానాలు ఇచ్చారు. సినిమాల మీద పెద్దగా ఆసక్తి, అవగాహన లేని నాకు రివ్యూలు మొత్తం చదివేయాలన్నంత ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ఎంతో ఉత్సాహంతో ప్రశ్నలుడిగిన మీకు, ఓపికతో సమాదానాలు ఇచ్చిన ప్రసేన్ సార్ కు ధన్యవాదాలు

  • Prasen sir మా గురువు గారు.. ఆయన దేనికైనా సమాధానం సూటిగానే ఉంటుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు