ప్రకృతే దైవమై ఎదురొచ్చే వేళ………..

యాత్రాస్మృతి-4

చల్లని సాయంత్రం చోప్టా లో అడుగు పెట్టగానే మాకు ఎదురుగా కనిపించినది గంటలతో ఉన్న తుంగనాథ్ ప్రవేశద్వారం. ఎప్పటినుండి అనుకుంటున్నదో ఇక్కడికి రావాలని. నాలుగేళ్ల క్రితం అనుకున్నది, తరువాత మూడు సంవత్సరాలు కూడా చాలా కారణాల చేత వాయిదా పడింది. ఎలా అయితేనేం ఈసారి సాధ్యపడింది.

తుంగనాథ్ పంచ కేదార్ లలో అన్నింటికంటే ఎత్తైనది 3,680 మీటర్ల( 12,073 అడుగుల) ఎత్తులో ఉంది. అందుకే ఆ పేరు కూడా .ఈ పంచ కేదార్ లలో ఆలయాలన్నీ పాండవుల స్థాపితం అంటారు. తుంగనాథ్ నుండి ఇంకా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం మీదకు వెళితే చంద్రశిల శిఖరం. చలికాలం అంతా కోవెల మూసి ఉంటుందని తెలుసు. అయినా ఆ పరిసరాలకు వెళ్ళగలిస్తే చాలు దర్శనం అయినట్టే అనుకున్నాం. ఈ ప్రకృతినంతా ఇలా చూడగలగడం కూడా దైవదర్శనానికి ఏం తక్కువ అనిపిస్తుంది.

చోప్టా 2,608 మీటర్ల (8,556 అడుగుల) ఎత్తులో ఉన్న తుంగనాథ్ ట్రెక్కింగ్  బేస్ .ఇక్కడి నుండి మూడున్నర కిలోమీటర్ల దూరంలో తుంగనాథ్ ఆలయం. చోప్టా లో ఆలయ దర్శనం కోసం వచ్చే యాత్రికులకు, ట్రెక్కింగ్ చేయడానికి వచ్చే వారి కోసం ఉండడానికి, తినడానికి కొద్దిగా సదుపాయాలు ఉంటాయి.

ప్రవేశ ద్వారం దగ్గరే మాకు ఒక చిన్న గది దొరికింది. గది బయటనే ఒక పెద్ద డ్రమ్ముతో నీళ్లు నింపి ఉన్నాయి. చలికాలంలో పైప్ లైన్స్ లో నీరు గడ్డకట్టిపోతుంది కాబట్టి ఇదే మార్గం. బేగ్స్ రూమ్ లో పెట్టి బయటికి వచ్చాం. అక్కడి నుండే ఆలయానికి దారి కూడా. చాలా చల్లగా ఉంది అంతవరకు వేసుకున్న స్వెటర్ తీసి జాకెట్ వేసుకోవాల్సి వచ్చింది .గది ఎదురుగా ఉన్న ఒక చిన్న కొట్లో టీ తాగి పకోడీలు తిని అక్కడే అద్దెకు దొరుకుతున్న రెండు కర్రలు తీసుకుని ట్రాకింగ్ చేసే దారంట అలా నడుస్తూ కొంత దూరం వెళ్ళాం. ఎర్రటి గులాబీ రంగు పువ్వుల చెట్లు ఆధారంట రెండు వైపులా ఉన్నాయి. గుత్తులు గుత్తులుగా ఆ పువ్వులు కిందకు వేలాడుతున్నాయి. ఇద్దరం చిన్నపిల్లల్లా ఆ పువ్వులు పట్టుకుని ఎంత మురిసిపోయేమో!గొప్ప అందం వాటిది నిజంగా!

కొంతమంది మీద నుండి కిందకి దిగుతూ వస్తున్నారు. అంతవరకు జీపులోనే తిరిగేం కానీ నడిచి ఎక్కడా తిరగలేదు. నడవడం మొదలుపెట్టాక తెలిసింది ఎంత త్వరగా అక్కడ అలసి పోతున్నామో. కొంత దూరం వెళ్ళాక  మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ట్రెక్కింగ్కు అనుమతి ఇవ్వరని తెలిసింది.ఆ సాయంత్రం కాస్త దూరం వెళ్లి తిరిగి వద్దాం అనుకున్నాం. వెడల్పాటి పలకలుగా ఉన్న రాళ్లతో పేర్చిన దారి బాగానే ఉంది.నడవడానికి ఇబ్బంది లేదు. మెట్ల దారి కూడా కాదు. అక్కడ అలసిపోవడం అంతా ఎత్తు వల్లే. అయినా మెల్లిగా నడుచుకుంటూ వెళుతున్నాం. మీద నుండి వస్తున్న వారిని కొంతమందిని పైన వాతావరణం ఎలా ఉంది అని అడిగాం. ఆ ఉదయం మంచు పడిందట. మరి రేపు మా అదృష్టం ఎలా ఉంటుందో అనుకున్నాం.

వాతావరణం మెల్లగా మారుతోంది. దూరంగా పర్వతాల మీద నుండి ఉరుముతున్న చప్పుళ్ళు.  నల్లటి మేఘాలు కూడా కమ్ముకోవడం మొదలైంది. కాస్త దూరం వెళ్లి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాం. గదికి వెళ్లాలని కూడా లేదు. చాలా చలిగా ఉన్నా, అక్కడే ఆ చెట్ల మధ్య అలా తిరుగుతూ ,ఫోటోలు తీసుకుంటూ సమయం గడుపుతున్నాం. ఫోన్లో పీక్ ఫైండర్ ఆప్ వేసుకు రావడం మంచిదైంది. దాని సాయంతో ఎక్కడెక్కడ ఏయే శిఖరాలు ఉన్నాయో చూసుకున్నాం కానీ మేఘాలు ముసిరేయడం వల్ల ఏవీ తెలియడం లేదు. ప్రవేశద్వారం కి ఎదురుగా రోడ్డుకి రెండవ వైపు పెద్ద ఖాళీ స్థలం గడ్డితో వుంది. చోప్టా పక్షులకి చాలా ప్రసిద్ధం. ఆ మైదానంలో కొంతమంది  బర్డ్ వాచర్స్       కెమెరాలు పట్టుకొని ఆ చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద పక్షులని గమనిస్తున్నారు. ఎంత ఓపిక కావాలో ఆ పనికి. మాకు పక్షుల రకరకాల అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి.

అక్కడే ఇద్దరం కూర్చుని రేపటి ఉదయం గురించి ఆలోచించుకుంటున్నాం. అప్పటి వాతావరణం చూస్తే వర్షం తప్పదు అనిపిస్తోంది. రేపు ఉదయానికి కూడా ఇదే పరిస్థితి ఉంటుందా? ఉంటే ఏం చేస్తాం? ఎన్ని గంటలకు బయలుదేరాలి? ఎంత సమయం పడుతుంది? ఈరోజు పడిన మంచు ఎక్కువగా ఉంటుందా? దారిలో మంచు ఉంటే దాటగలమా? చంద్రశిల వైపు కూడా వెళ్లగలమా? ఇలా ఎన్నెన్నో…ఇంతలో మెల్లిగా మబ్బులు విడి ఓ పక్క వెలుగు కనిపించింది. దూరంగా మంచుతో నిండిన హిమాలయ శిఖరాలు. మేఘాలు విడిపోతున్న కొద్దీ ఒక్కో శిఖరం మెల్లగా కనిపిస్తోంది. వెంటనే మళ్ళీ ఫోన్ తీసి అవి ఏయే శిఖరాలో వాటి పేర్లు ఏంటో చూస్తూ కూర్చున్నాం. మాకు బాగా తెలిసిన, వింటున్న పేర్లు కేదార్ డోమ్, కేదార్ మెయిన్, చౌకంభా ఇవి కనిపించేయి. అంత స్పష్టంగా మాత్రం లేవు. ఆమాత్రానికే ఎంత సరదా పడిపోయామో ఇద్దరం .రేపు ఉదయం వాతావరణం బాగుంటే సూర్యోదయం తర్వాత వెలిగిపోతున్న శిఖరాలను చూడాలి .అదే మా మనసులో ఉంది. ఆ శిఖరాలు ఎంత మైమరపిస్తాయి అంటే ఆ సమయంలో మా ఆలోచనలలో తుంగనాథ్ ఆలయం, చంద్రశిల, ట్రెక్కింగ్…  ఇవేవీ లేవు. ఆ శిఖరాలను ఎంత బాగా చూడగలుస్తామా అన్న ఒక్క ఆలోచన తప్ప.

మెల్లిగా రోడ్డుమీద మనుషుల సంచారం కూడా తగ్గింది. సాయంత్రం 5:30 ప్రాంతంలో అక్కడే ఉన్న ఒక చిన్న కొట్టులో వేడిగా మేగీ తిని అక్కడ వాళ్లను సాధారణంగా ఎన్ని గంటలకు ట్రెక్కింగ్ మొదలెడతారు అని అడిగాం. ఉదయం నాలుగు అయ్యేసరికి బయలుదేరి పోవచ్చు, అలా అయితే శిఖరాల మీద సూర్యోదయాన్ని చూడొచ్చు ,మంచు ఉన్నా ఎండ వేడి ఉండదు కాబట్టి కరగడం మొదలవదు అని చెప్పారు. మర్నాడు ఉదయం తినడానికి మరింక ఏమీ ఉండదు కాబట్టి చాక్లెట్స్ కొనుక్కున్నాం.

గదికి వచ్చి ఉదయానికి కావలసినవన్నీ చిన్న బేక్  పేక్స్ లో సర్దుకున్నాం. ఏడున్నర ప్రాంతంలో మేము ఉంటున్న హోం స్టే లోనే కిందికి వచ్చి భోజనం చేసాం .అక్కడే మా  థర్మాస్ ఫ్లాస్క్ లలో తాగడానికి వేడి నీళ్లు పోయించుకున్నాం.

మెల్లగా వర్షం మొదలైంది. ఎక్కడా మరిక మనిషి అలికిడి కూడా లేదు. అంతవరకు రోడ్డు మీద తిరుగుతున్న కుక్కలు కూడా గదుల దగ్గరకు వచ్చి వెచ్చగా ముడుచుకుపడుతున్నాయి. ఉరుములు, వర్షం చాలా ఎక్కువ అయ్యాయి. రేపటి పరిస్థితి ఎలా ఉంటుందో అసలు ఊహించుకోలేకపోయాం. మధ్యాహ్నం వచ్చిన దగ్గర నుండి రాత్రి వరకు అక్కడకు వచ్చిన వాళ్ళని చూశాం. ఎవరూ కూడా ఇలా మేం వచ్చినట్టు ఇద్దరే రాలేదు అదీ  ఆడవాళ్లు ఒక్కరే .వచ్చిన వాళ్ళందరూ పెద్ద గ్రూప్స్ లోనే.

రేపు ఉదయం కనీసం మూడు గంటలకి లేవాలి .వాతావరణం బాగుంటే నాలుగు గంటలకల్లా ట్రెక్కింగ్ మొదలు పెట్టాలి. ఇలా రకరకాల ఆలోచనలతో త్వరగా పడుకున్నాం.

*

స్వాతి పంతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు