పునరపి……

 ఒక్కుమ్మడిగా మేఘబాలికలందరూ
వందలాది వానచీపురులు పట్టుకుని
కొండకొమ్ముల పైన చేరి
తమ నడుము లొంచి వుల్లాసంగా
నేల మీది చెత్తను వూడుస్తూ
ఏకకాలంలో కల్లాపి కూడా చల్లుతున్నారు

ఈ లోకం ఎట్టి పరిస్థితుల్లోనూ
ఆకలితో అల్లాడి పోకూడదని
బృహదాకారపు భూమి వాకిట
నాగేటికర్రులతో అన్నదాతలంతా
ముగ్గుకర్రలు వేస్తున్నారు లోతుగా

మేలిమి విత్తనాలు చల్లడం ఆలస్యం
మేదిని మీద పచ్చదనం కర్రల పెత్తనం ఆరంభం

నిండు గర్భిణులు నెమ్మదిగా ప్రసవానికి
తొమ్మిది నెలలు ఆగుతుంటే ఓ వైపు
మరప్పుడే మొక్క జొన్నల తల్లులు
తమ చంకల్లో కంకుల పాపలతో
ఉన్నచోటే వుత్సాహంగా వూగిపోతున్నారేమిటి?

గరీయఃప్రతిభుల కీర్తి కిరీటాల్లో
అదనంగా ఎప్పటికప్పుడు మరో ఫెదర్ చేరినట్లు
వరీ జొన్నల విశ్వ సస్య సుందరీమణుల
నెత్తుల మీది కంకుల మకుటాలకు
ఒకటా రెండా పుట్టెడు గట్టి గింజలు
అధికంగా చేరిపోతున్నాయేమిటి?

నెలకు మూడు వానలు కురిసి
రోజూ ముప్పూటలా తినేందుకే!
మన నాలుగు వేళ్ళు  నోట్లోకి పోయేందుకే!!

ఇక కోతలయ్యాక భూమితల్లిని సూర్యుడు
వేసవిలో కాసేపు ఓవెన్లో వుంచుతాడు
ఆ తర్వాతే ధరిత్రి  మరో ఈత ఈనేందుకు
తన ఒళ్ళంతా నెర్రెల కళ్ళతో మరలా
మబ్బుల స్వీపర్లకై వర్షపు చీపుర్లకై
ఊపిర్లు బిగబట్టి నిరీక్షిస్తూ.. నిరీక్షిస్తూ-

*

నలిమెల భాస్కర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు