పాటని ఖైదు చెయ్యలేరు!

  రెండు దశాబ్దాలుగా ఇథియోపియాలో జాతుల మధ్య వైరుధ్యం ఆ దేశాన్ని సంక్షోభంలోకి నెడుతూనే వుంది. ఇది ప్రధానంగా ఒరోమో మరియు ఇతర జాతుల మధ్య తీవ్రంగా వుంది. ఒరోమియా రీజియన్లో దీని ప్రభావం రాజ్యహింసకు దారితీసింది. పర్యవసానంగా ఒరోమియా ప్రజలు కవులు, కళాకారులు పిడికిల్లెత్తి పోరాట బాట పట్టి నిరసన గళాల స్థాయిని పెంచారు. గత రెండు దశాబ్దాల కాలంలో రాజకీయ, సామాజిక వుద్యమాలల్లో పాల్గొన్న ఏ ఒరోమో గాయకుడిని కూడా రాజ్యం వదలలేదు. వీరిని బెదిరించడం, అపహరించడం, హింసించడం, హత్యగావించడం, బహిష్కరించడం పరిపాటిగా మారాయి. కొందరైతే అజ్ఞాతం లోకి వెళ్ళిపోయారు.

ఒరోమో రీజియన్ ఇథియోపియాలో అధిక జనాభాగల, సాంస్కృతికంగా ప్రత్యేక అస్తిత్వంగల పెద్ద రాష్ట్రం. ఇక్కడ కళాకారులు కూడా ఎక్కువే. ప్రభుత్వ పక్షపాత పరిపాలనను నిరసిస్తూ గొంతెత్తి పాటలు పాడినందుకు 1996 లో ఒరోమో ఐకానిక్ గాయకుడు ‘ఎబిసా అడుజ్ఞా,’ను రాజ్యం పోట్టనపెట్టుకుంది. ఒరోమో సాంప్రదాయ సంగీతాన్ని సమకాలీన సంగీత శైలులతో మిళితం చేసి పాట ఔనత్యాన్నీ వృద్దిచేసిన ‘దావిత్ మెకోనెన్’ ను 1998లో ఇథియోపియా-ఎరిట్రియా యుద్దసమయంలో సైనికుల కోసం ప్రదర్శన ఇవ్వడానికి నిరాకరించడంతో ఆనాటి ప్రభుత్వం దావిత్ ను బహిష్కరించింది. ఇలాంటి కారణాలచేత మరో సుప్రసిద్ధ గాయని ‘ఎలిఫెనేష్ కేనో’ మరియు గాయకుడు ‘హిర్పా గన్‌ఫురే’ అదే సమయంలో దేశం వదిలి వెళ్ళాల్సివచ్చింది. ఒరోమో కళాకారులపై రాజ్యం సాగిస్తున్న అణచివేతకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే.

గత కొన్ని సంత్సరాలుగా ఇథియోపియా లో ప్రజా కళలపై, కళాకారులపై నిషేధాలు, నిర్భంధాలు కొనసాగుతున్నాయి. న్యాయమైన ప్రజా పోరాటాలకు మద్దతునిస్తున్న గాయకులను, సంగీత నిర్మాతలను, సంగీత కళాకారులను అరెస్టులు చేస్తూ సంత్సరాలుగా జైలుల్లో నిర్భందిస్తున్నారు. హత్యలు చేయిస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, కుటుంబ సభ్యులను వేదిస్తున్నారు, వారి ఆస్తి పాస్తులను కొల్లగొడుతూ జీవితం లేకుండా చేస్తున్నారు. సామాజిక మాద్యమాలను, అంతర్జాలలను వారాలకొలది, నేలలకొలది అందుబాటులో లేకుండా చేస్తున్నారు. నోబుల్ శాంతి బహుమతి గ్రహీత ఆ దేశ ప్రధాని డా.అభి ఆహేమ్మద్ అధికారం చేపట్టాక జాతుల సమస్యను పరిష్కరించలేకపోయారు, హింసను అరికట్ట లేక పోయారు. గత రెండు సంవత్సరాలుగా దేశామంతా హింస చెలరేగుతూనే వుంది. ఒరోమియా కళాకారులు తమ ఆట-పాటలతో కళారూపాలను సృష్టించి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం మూలానా ఉద్యమాలను ప్రేరేపిస్తున్నారనే నెపంతో జూన్, 2016లో ఏడుగురు సంగీత నిర్మాతలను, గాయకులను అరెస్టు చేసి, ఎలాంటి విచారణ లేకుండా చాలా కాలం వరకు నిర్బంధంలో ఉంచారు. ఈ క్రమంలోనే ఒరోమో పోరాట గాయకుడు హచాలు హుందేస్సాను జూన్ 29 న గుర్తు తెలియని దుండగులు కాల్చడం, అక్కడికక్కడే హచాలు మరణిచడం కలకారులపై అక్కడ పెరుగుతున్న హింసకు పరాకాష్ట.

నిర్భందానికి మూలాలేంటి?  

హింస చెలరేగడానికి ఈ అరెస్టుల పర్వం కొనసాగడానికి  ప్రధాన కారణం “అడిస్ అబాబా (ఫెడరల్) పరిపాలన పరిధిని విస్తరించుకునేందుకు ఇథియోపియా  ప్రభుత్వం తలపెట్టిన ప్రణాళిక (Addis Plan), ఈ ప్లాన్ వల్ల ఒరోమో రీజియన్ లోని ముఖ్యమైన ప్రాంతాలు, పట్టణాలు కేంద్ర ప్రభుత్వం ఆధీనం లోకి వెళతాయి. పర్యవసానంగా  ఈ రీజియన్ లోని ప్రజలు నిర్వాసితులవుతారు, వ్యవసాయ భూములు, గడ్డి భూములు కోల్పోతారు, పశుగ్రాసం కొరతతో ప్రజలకు జీవానాధారం లేకుండా పోతుంది, పరిశ్రమలు మూతబడుతాయి, వ్యాపారం కుంటుపడుతుంది, కూలి నాలీలు ఉపాధి కోల్పోయి నిరుద్యోగం పెరిగి మల్లీ 1984 నాటి ఆకలి చావులను చూడాల్సి వస్తుంది.”

ఈ ప్రణాళిక అమలుతో వీటితో పాటు ఒరోమియా అస్తిత్వం కనుమరుగవుతుందని భావించిన ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, రైతులు, స్త్రీలు అన్ని వర్గాల వారు ఒక్కటై ఈ ప్ర్రాంతంలో విస్తృత స్థాయి నిరసనలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా ప్రభుత్వం హింసాత్మక చర్యలకు పాల్పడి అణిచివేతలకు పూనుకున్నది.

సీనా సోలమన్ కళా బృందం:

ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒరోమియా యువ గాయని ‘సీనా సోలమన్’ ఉంది. ఈమెతో పాటు ఈ బృందంలో ప్రసిద్ధ పాటల రచయిత, గాయకుడు, సంగీత దర్శకుడు ‘ఎలియాస్ కిఫ్లూ’, మరో ఇద్దరు గాయకులు ‘గెమెచ్చిస్ అబెర్రా’, ‘ఒలియాడ్ బెకెలే’, మరియు ముగ్గురు నృత్యకారులు ‘ఇఫా గెమెచ్చు’, ‘తామీరు కెనేని’ మరియు ‘మాబెల్ మిస్గాను’ కూడా ఉన్నారు. వీరందరూ రాజ్య అణచివేతకు గురవుతున్నారు. డిసెంబర్ 2016లో, సీనా బృందాన్ని అరెస్ట్ చేసి చిత్రహింసలకు ప్రత్యేకమైన మాకెలావి (central) జైలులో బంధించారు. అరెస్టు చేసిన కొద్దిసేపటికే సామాజిక మాద్యమాల కార్యకర్త, ప్రవాస సెటేలైట్ టెలివిజన్ డైరెక్టర్ జవార్ మొహమ్మద్ ఇలా రాశారు:

“ఒరోమో కళాకారులపై ఇథియోపియా ప్రభుత్వం నిర్భందం తీవ్రతరం చేసింది. కొందరు కలకారులు అయితే జైలులో ఉన్నారు, మరి కొందరు దేశం వదిలి వెళ్ళారు, ఇంకా కొంత మంది అజ్ఞాతం లోకి వెళ్ళారు. స్టూడియోలు మూసివేయబడ్డాయి మరియు వాటి ఆస్తులు, పరికరాలు వస్తు సామాగ్రి జప్తు చేయబడ్డాయి. ప్రతిఘటన పాటలకు, ప్రదర్శనలకు మారుపేరైన ‘సీనా సోలమన్’ మరియు ‘ఎలియాస్ కిఫ్లు’ అనే ఇద్దరు గాయకులు ప్రభుత్వ అణచివేతకు వర్తమాన బాధితులుగా మిగిలారు.”

దీనిని నిరసిస్తూ ఒరోమో కళాకారులు వారి ఆట-పాటలతో గలమెత్తి పోరాట పిడికిళ్ళతో చేయి కలపి ఉద్యమానికి ప్రేరణ కావడం జరిగింది. తమ ప్రాంత పరిరక్షణకు ‘సీనా సోలమన్’ బృందం 2014-2016 కాలంలో విద్యార్థి ఉద్యమాలకు బాసటగా నిలిచి ఒరోమో భాషలో మ్యూజిక్ వీడియోలను నిర్మించి ఈ ఉద్యమానికి సమానంగా సౌండ్‌ట్రాక్‌లను సృష్టించి ఉద్యమాన్ని మరింత పదును పెట్టగలిగారు. దేశంలో అలజడికి కారణమౌతూ అశాంతిని నెలకోలుపుతున్నారనే నెపంతో ప్రభుత్వ సంస్థ అయిన ‘ఫనా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్’ సీనా మరియు ఆమె సహచరులు రూపొందించిన మ్యూజిక్ వీడియోలు, కవితలు మరియు ఇంటర్వ్యూలను నిషేదించి వీరిని అరెస్టులు చేయించింది. వీరి పైన దాఖలైన చార్జ్ షీట్ లో వీరు “నిరసనలను ప్రేరేపిస్తున్నారని, వీరి పాటలు, ప్రదర్శనలు 2014 నుండి 2016 కాలం లో చెలరేగిన ఉద్యమాలకు ఆజ్యం పోస్తూ నిరసనలను తీవ్రతరం చేసారని” అభియోగాలు మోపారు.

ఈ బృందం రూపొందించిన ప్రతిఘటన పాటల సంకలనాలు చాలా ప్రసిద్ది పొందాయి. ప్రముఖంగా వీళ్ళు పాడిన పాటలు “అక్కమిన్  దిన గోమ్బిసు (Akkamin diina gombissu), ఆవ్వారేస్సీ (Awwaaressee), హాటి దీరా బూస్సీ (hati Diiraa Boossee), బికిల్తూ కూ (Biqtil Koo), సాన్యీ కూ సీనా (Saaynii koo seenaa), యా హవ్వీ (Ya hawwii),” మొదలైన పాటలు ఆత్యంత ప్రాచుర్యంపొంది ఉద్యమాలకు చోదక శక్తి లా పని చేశాయి.

హవ్వీ తెజేర్రా బృందం:

ఇలాంటి అణచివేతను ఎదుర్కొన్న మరో బృందం హవ్వీ తెజేర్రా బృందం. జనవరి 2016 లో, తన పాటల ద్వారా నిరసనకారులను ఉత్తేజపరిచిందనే కారణంతో ఒరోమో గాయని ‘హవ్వీ తెజేర్రా’ ను చిత్రహింసలకు గురిచేసి జైలులో బంధించారు. ఒరోమో సాంస్కృతిక గుర్తింపును, అస్తిత్వాన్ని కీర్తిస్తూ మరో ఒరోమో గాయకుడు ‘తెఫారి మెకోనెన్’ తన పాటలలో ఇథియోపియా అధికార పార్టీ చట్టబద్ధతను సవాలు చేసి అరెస్టయ్యాడు. హవ్వీ తరువాత విడుదల చేయబడింది, కాని తెఫెరి ఎక్కడున్నాడో, ఉన్నాడో లేడో తెలియని స్థితి, ఇలాంటి నిర్భంధ మేఘాలు ఒరోమో భూభాగామంతా కొండల అంచులదాక ఆవరించి వున్నాయి. హవ్వీ తెజేర్రా ఆలపించిన పాటలు ‘క్వీరూ (Queerroo), అభిచూ (Abichuu), జిమ్మా (Jimmaa), వాలీ యా వాలీ (Walee yaa Walee) అలాగే తెఫారి మెకోనెన్ పాడిన ప్రతిఘటనా పాటలు “నమిట్టీ (Namittee), కుల్లి  మగాళ్ (kulli magaal), అక్క ఫేటే తాయ్ (Akka fete ta.i), జలాల దుగా (Jalaala dhuga), నుమా ఒరోమి (Numa Oromi). ఈ పాటలన్నీ ఒరోమో అస్తిత్వాన్ని చాటి చెబుతాయి. ఈ పాటలు వింటుంటే భాష అర్థం కాకున్నా మన రోమాలు నిక్కబొడుసుకుంటాయి, మనలో కూడా ఉత్తేజాన్ని నింపుతాయి, ఆ పాటలకు సమ్మోహన శక్తి ఎక్కువ, తెలియకుండానే ఆ పాటల విద్యుత్తరంగాలలో చిక్కుకుంటాము. అధ్బుత అనుభూతికి గురవుతాము.

తాత్కాలికంగా వీరి చేతులకు సంకెళ్ళు వేసి గళాలకు తాళాలు వేయొచ్చు కాని వీరి  గొంతుకలు నిరంతరంగా ప్రజా హృదయాల్లో మార్మోగుతూనే వున్నాయి. సీనా సోలమన్ బృందం ఇతర కళాకారులు జైలులో ఉన్నప్పటికీ వారి  ప్రతిఘటన సంగీతం, పాటలు యూట్యూబ్‌లో పెరుగుతూనే వున్నాయి వీక్షించే వారి  సంఖ్య మూడున్నర మిలియన్లు దాటింది అంటే వాళ్ళ ప్రజాదరణ ఎంతవుందో అర్థమవుతుంది. అందుకే ఏ ప్రభుత్వాలు కూడా నిర్భంధంతో స్వేచ్చా గానాలను, తిరుగుబాటు బావుటాలను, ప్రశ్నిచే గొంతుకలను నిలువరించలేవని చరిత్ర చెప్పిన సత్యం.

చివరగా……

ఒరోమో పాటలు, భాష అర్థం కాకున్నా వినడానికి చాల శ్రావ్యంగా వుంటాయి, మన తెలుగు బాణీల్లానే వుంటాయి. విన్నకొద్దీ వినాలనిపించే ఆకర్షణ ఒరోమో పాటలకు వుంది. నిజానికి ఇథియోపియన్ ఏ భాష పాటలైనా మనం ఇష్టపడుతాము. ముఖ్యంగా తిగ్రే, అమ్హారా, సొమాలి పాటలు, సంప్రదాయ వాయిద్యాలతో మేళవించిన ఆ పాటల కూర్పు చాల శ్రావ్యంగా వుంటుంది. అవి మనలో ఒక శక్తిని ఆవాహం చేస్తాయి. పాట-నృత్యం ఇథియోపియన్ సమాజపు దైనందిన జీవితాల్లో అంతర్భాగం. పుట్టుక నుంచి చావు వరకు సాగే ఆన్ని సోపానాలల్లో పాట, నృత్యం ప్రజలతో కలిసే జీవిస్తూ వుంటాయి. ఇథియోపియాలో ప్రజలు వారి మూలాలను మరిచిపోకుండా ఇప్పటికి వారి అస్తిత్వాన్ని దృడంగా కాపాడుకుంటున్నారు. అందుకే వుద్యమాలల్లో వీటి పాత్ర చాలా ప్రముఖంగా వుంటుంది. పాటా-ఉద్యమం విడదీయరానివి. ఒకటి ఇంకొక దానిని ప్రేరేపిస్తుంది. కళాకారులు శృంఖలాలను పగులగొట్టుకుని గొంతులు సవరిస్తూనే వుంటారు, ప్రపంచ కళాకారులు, కవులు, మేధావులూ ఒరోమియా, ఇథియోపియా  కళాకారులకు ఎల్లప్పుడూ మద్దతిస్తూనే వుంటారు. ప్రపంచ ప్రజా కళలు వర్ధిల్లాలి. పాటపై, ప్రజా సాహిత్యం పై అన్ని రకాల దాడులు అంతం కావాలి. ఒరోమో కలాలకు, గొంతుకలకు మన సౌబ్రాత్రుత్వం కొనసాగాలి. ఏ నియంతృత్వ ప్రభుత్వాలు పాటను-స్వప్నాన్ని బంధించలేవు, ఇది చారిత్రిక సత్యం.

*

 

శ్రీనివాస్ శ్రీ రంగనాయకుల

శ్రీనివాస్ శ్రీరంగనాయకుల, సిరిసిల్ల ఊరు, సహచర శీను గా పరిచయం, ఉపాద్యాయ వృత్తి లో వుండి 2017 వరకు ఇథియోపియా లో ప్రభుత్వ యూనివర్సిటీ లో (హరమాయా యూనివర్సిటీ , జిగ్-జిగా యూనివర్సిటీ) లో ఆచార్యునిగా పనిచేశారు.. విద్యావేత్త, సాహితి ప్రియుడు.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇథియోపియా ప్రభుత్వ కుట్ర , ప్రజల హక్కులు, వారి పోరాటాలు బాగా వివరించారు. ఒక కొత్త చరిత్ర తెలిసింది మీ ఆర్టికల్ ద్వారా. పోరాట, ధిక్కార స్వరాలు కూడా మీరన్నట్టుగా బాష అర్థం కాకపోయినా విన సొంపుగా ఉన్నాయి. ఇక్కడ ఒక యూట్యూబ్ లింక్ జతచేస్తున్నాను నేను విన్న పాట. https://youtu.be/DrC_9evP3cw

  • మంచి వ్యాసం. విలువైన సమాచారం. ఇథియోపియా సామాజిక నేపథ్యాన్నీ, ధిక్కార సంగీత సృజననీ పరిచయం చేసినందుకు అభినందనలు..

  • mee rachana chala bavundi, i stayed in Addis Ababa in the Journalism & Comm and with film studies, i had the opportunity to work closely with the country’s most popular and unpopular artists of all genres. huge collection of music too i have. somehow i missed to meet you during my stay in between 2011-2015. However i really appreciated your writing.

    • Thank you, Srinath garu. I worked there between 2006 to 2017, mainly in Haramaya later in Jigjiga. I am fond listening music mainly Amharic, Oromo, Tigrigna, Hamer, Gurage and Somali. Also please see one of articles in Kolimi online journal. Thank you a lot, I live in Hyderabad.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు