పల్లపు స్వాతి కవితలు మూడు

వాళ్ళు మళ్ళీ వస్తారు, ఎర్ర సెలకల్లో కురిసే మోదుగుపూల వానలా.

జీవనోపాధికోసం వలసపోయిన తండ్రి. ముగ్గురు ఆడపిల్లల్ని కనురెప్పల్లో దాచుకుని పెంచిన తల్లి. తరతరాలుగా అక్షరాలంటని మట్టిమనుషుల బిడ్డ స్వాతి. ఈ నేపథ్యంలోంచి వచ్చిన స్వాతికి కావలిసిందల్లా ఈ వ్యథాభరిత నేపథ్యాన్ని అర్ధం చేయించగల చూపు. అక్షరాల సాహచర్యం దొరికింది. అక్షరాలను దిక్సూచిగా, ఆయుధాలుగా, చీకటిలో కూడా దారిచూపగల వెలుతురుగా మార్చుకునే తొవ్వ వెతుకున్నది.
కవిత్వం రాయడం మొదలు పెట్టింది. కొత్త కాబట్టి నిర్మాణంపై దృష్టిపెట్టకపోయినా పర్వాలేదనుకోలేదు. ఇప్పటికి ఇరవై మాత్రమే కవితలే రాసింది కానీ విరివిగా రాయగలదన్న భరోసా ఇచ్చింది. ఇటీవలే ‘మోదుగుపూల వాన’ పేరుతో సంకలనాన్ని విరసం ప్రచురణగా తీసుకువచ్చింది. స్వాతి  కవితలు కొన్ని ఇవిగో.

నా అక్షరాలు…

 

నాగలి సాళ్లల్లో విత్తనాలు చల్లుతున్నపుడు
భూమి పొరల్లోంచి పెల్లుబికిన ఆరుద్ర పూలు
నా అక్షరాలు.
చెంగున ఎగిరే లేగదూడల మూపురాన్ని ముద్దాడినపుడు
నా పెదాలకు అంటుకున్న పదాలివి.
మా అమ్మ పగిలిన పాదాల్లో కనిపించే
మట్టిగుండెల అలజడి నాలో పోటెత్తే సంద్రమైంది.
పార ఎత్తి ఒరం చెక్కేటపుడు
నా కాళ్లకు అంటుకున్న రేగడి చల్లదనమే
ఈ అక్షరాల గుండె తడంతా.
పచ్చని చేన్లపై ఊపిరితిత్తుల్ని ఆరేసుకుంటున్నపుడు
వానయి కురిసే పైరగాలి పాటలే
నా అక్షరాలు.

వెలివాడల జ్వలితాక్షరాలు

 

బీడువారిన భూముల్లోంచి…
ఎలుగే లేని గుడిసెల్లోంచి
అవమానాల ఎతల్లోంచ
మత్తడి దుంకే దుఃఖంలోంచి…..
నడిచొచ్చిన వాళ్ళు
నెర్రెలిచ్చిన నేలలు
పుష్పించాలని స్వపించినవాళ్లు
ఎలుగులేని గుడిసెల్లో
మిణుగురులవ్వాలని కలలు కంటున్నవాళ్ళు
పల్లేరుగాయల్ల నడిచి
నెత్తురోడుతున్న నగ్న పాదాలకు
లేలేత చిగురుల లేపనామద్దుతున్నవాళ్ళు
పల్లె పేగుబంధం నుంచి
నిప్పుల గుండంలో ఖణ్ ఖణేల్మని మండే
మేదరి డప్పుల గుండెలు వాళ్ళు
వెలివాడల్లోంచి వెల్లువలా
దూసుకువస్తున్న జ్వలితాక్షరాలు వాళ్ళు…

చిమ్మ చీకటిలో

ఈ ఇసుక దారుల్లో
నేనెప్పుడు ఒంటరిగా నడిచినా
మిణుగురు పూల వెలుగుల్లో
నీ పాద ముద్రలు కనిపిస్తయ్….
నీ నెత్తురంటిన గడ్డిపూలు
ఆత్మీయంగా పలకరిస్తయ్
ఇసుకలో ఊరే సెలిమెలూ
నీకు ఒడిని పరిచిన పరుపు బండలూ
నీళ్లు తాపిన బావులూ
ఎర్రెర్రగా ఎదురువుతయ్….
నీ చూపు
చిమ్మ చీకటిలో మెరిసే మిణుగురుల వెలుగు
మోదుగుపూల వాన
ఇప్పుడు
ఈ నేలనేలంతా సరికొత్త పాతలల్లుతున్నది
ఈ నేలన గాలంతా
ముక్తకంఠంతో నినదిస్తూ
తెలంగాణ వీరగాథల్ని పాడుతున్నది
పోరాట గాథల్లో వాళ్ళు మళ్ళీ వస్తారు
ఫీనిక్స్ పక్షుల్లా
ట్రిగ్గర్ మీది వేళ్ళతో
తిరగబడుతూ
మర్లబడుతూ
వాళ్ళు మళ్ళీ వస్తారు
వాళ్ళు మళ్ళీ వస్తారు
తడారిన భూముల గుండెల్ని తడిపేందుకు
ఎండిన బతుకుల్లో వసంతాల్ని పూసేందుకు
వాళ్ళు మళ్ళీ వస్తారు

ఎర్ర సెలకల్లో కురిసే మోదుగుపూల వానలా.

*

పల్లపు స్వాతి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు