పద్మావతి రాంభక్త కవితలు రెండు

1

జీవించే క్షణమొకటి….

 

దయం నుండే మొదలవుతుంది
ఒక ఆరాటం
ప్రత్యర్ధిని దాటి
మునుముందుకు సాగాలనే
ఒక పరుగు పోరాటం

అక్కడే  శాంతికి అశాంతికి మధ్య
సరిహద్దురేఖ ముళ్ళకంచెలా మొలుస్తుంది

ఏదో కొల్లగొట్టాలని
సర్వం సొంతం చేసుకోవాలనే
కుదురులేనితనం
ఏమీ తోచనీయకుండా
చర్నాకోలుతో మెదడును అదిలిస్తుంది

సూర్యుడు ఎర్రగా చూస్తున్న సమయం
సగం కాలిన మొక్కజొన్నై శరీరం
అలసటకు ఆరాటానికి మధ్య
గందరగోళంలో వేళ్ళాడుతుంది
పాదాలు మొరాయిస్తున్నా విననితనం
ఎగుస్తున్న విసుగుపొగను జోకొడుతుంది

ముదురుతున్న సాయంసంధ్యలో
చీకటి రెక్కలు విప్పి
వాలడానికి సన్నద్ధమవుతున్న వేళ
మనసుకు మెదడుకు
ఒక భీకరయుద్ధం ఆరంభమవుతుంది

గెలుపు ఓటముల ప్రసక్తి లేకుండా
ప్రతిదినం ఇదే మూసలో
చవి లేని చప్పిడిబ్రతుకు మూలుగుతుంది
తెల్లారగానే
మళ్ళీ పరుగుపందానికి తెర లేస్తూ
నింగిలో మేఘాలు
నిస్తేజంగా పరుగులు తీస్తాయి

ఆ మూలన నిలబడ్డ  మొక్క
మౌనంగా పూలు పూస్తూ
పరిమళపు భాషను
శ్రద్ధగా ప్రపంచానికి నేర్పుతుంది
ఆనందానికి భాష్యం చెబుతుంది
ఉరుకుల పరుగుల మధ్య
గమనించీ గమనించనట్టే
రెప్పపడని రాత్రి అంచుల్లో
జీవించే క్షణమొకటి
కన్నీటిచుక్కను అద్దుకుని
నిశ్శబ్దంగా జారిపోతుంది.

*

నిన్నటి మాట

నిన్నటి మాట
వెంటాడుతుంది వేధిస్తుంది
కలతచీకటి నలతలా వ్యాపిస్తుంది
వెలుగు ఉదయాలనిండా
కన్నీటికొలను పొంగి పొరలుతుంటుంది

నిన్నటిని పారేసి
నేటిని మాత్రమే కొంగుకు కట్టేసుకోమని కొందరంటారు అతితేలికగా

మాటే కదా
గాలి అప్పుడే ఎగరేసుకుపోయిందిగా
ఇప్పుడెందుకు ఆ గోల
అంటూ ముఖం చిట్లిస్తారు
మరి కొందరు

నిన్నటి మాట
ఉత్సాహంగా ఎగురుతున్న
గుండెబుడగను సూదిలా గుచ్చగానే
అదాటున నేల రాలుతుంది
హఠాత్తుగా నీరసించి చతికిలపడుతుంది

నవ్వులపరదాలు కప్పిన
మాటే కావచ్చు అది
సంభాషణానదుల నడుమ
మొలిచిన పలుకురాయిలాంటి
మొనదేలిన మాట
నున్నటి బాటపై నడుస్తున్నపుడు
మేకులా లోతుగా దిగబడిన మాట

మరపుపూత ఎంత పూసినా
ఆలోచనల నడుమ దొంగలా జొరబడుతూ
ముందుకు కదులుతున్నపుడు
వెనుకకు లాగుతున్న మాట

అవునూ
మాటలు మరణించవని
మళ్ళీ మళ్ళీ మనసును తవ్వినప్పుడల్లా
అవశేషాలు బయటపడతాయని
నిద్రిస్తున్న దుఃఖాన్ని  మేల్కోలిపి
బయటపెడతాయని
మాటలను బాణాలలా సంధించే వారికి
తెలియదంటారా?!

*

పరిచయం:

కథలు కవిత్వం నవలలు చదవడం ఇష్టం
కవిత్వమంటే మరింత ఇష్టం
నా కవితలు కథలు ఎన్నో పత్రికలలో ప్రచురింపబడ్డాయి
2021లో సాహిత్య అకాడమీ వారి
ఆన్ లైన్ కవితాపఠనంలో పాల్గొన్నాను
మొదటి కవితాసంపుటి
“కొత్త వేకువ” 2020లో వచ్చింది
మొదటి కథాసంపుటి
“కురిసి అలసిన ఆకాశం” 2021లో వచ్చింది.

*

పద్మావతి రాంభక్త

11 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు