దొంతం చరణ్ కవితలు రెండు

నా పేరు దొంతం చరణ్. సొంత ఊరు వింజమూరు,చింతపల్లి మండలం. కాని పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ లోనే.
స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఒంటరిగా చీకట్లో నడుచుకుంటూ నాతో నేనే మాట్లాడుకోవడం అలవాటు(ఇప్పటికీ కొనసాగుతూనే వుంది). అలా నేను ఒక్కడినే మాట్లాడుకునే మాటలు రాను రాను చిన్న చిన్న కవిత్వాలుగా అయ్యాయి.
చాలా రోజులు వాటిని రాసిపెట్టుకోవాలనే చేసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు. ఒకరోజు సండే మ్యాగజైన్ లో కవిత్వాలు రావడం చూసాను. అప్పటి నుండి నేను కూడా  పేపర్లల్లో రాసి పెట్టుకోవడం స్టార్ట్ అయింది (ఇంటికి ఒచ్చేలోపు ఎన్ని లైన్లు గుర్తుంటే అన్ని లైన్లు). జ్ఞాపకశక్తి కొంచం తక్కువగా ఉండడంతో అలా చాలానే ఎగిరిపోయేవి. ఇప్పుడిప్పుడే కష్ట పడుతున్న అల్లుకున్న వాటిని మరిచిపోకుండా ఉండేందుకు.
ప్రస్తుతం డిగ్రీ 2nd year చదువుతున్నాను.

1

బెంగాలీ కండ్లు~రాత్రి ప్రయాణాలు

1.
సత్యజిత్ రే సినిమా వర్షంలో తడిసిపోయి
ఒంటరి చీకటికి తోడుగా
ఒంటి కన్నుతో నడుస్తున్నాను
తడి ఆకులన్నీ పద్యాలు పాడుతున్నప్పుడు
చెట్టుపై నుండి పసుపురంగు చీరలో
కన్నె వయసు పువ్వులా నా భుజం మీద వాలి
తన చూపులతోనే పిల్లనగ్రోవిని వాయించింది
“పిల్లా..చాయ్ కి పోదామా”
దోస్తులతో అన్నట్టుగా ఊరమాస్లో అడిగిన
“పోదాంపా..ఓ మాంచి జానపదం తాగిపిస్తా” అంది
గప్పుడే అనుకున్న గీ పిట్ట కూడా ఊరమాసే అని.
గరం గరం జానపదం చాయ్ లో
తన చూపులను అల్లం ముక్కల్లా మరుగబెట్టి
నా గుండెకు ఆ రతిరంతా ఊపిర్లూదింది.
2.
రాలే పువ్వులు సితార్ తీగలను వాయిస్తూ వుంటే
అలలొచ్చి నన్ను గుంచుకెళ్లినయ్
అప్పుడే తెలిసింది తన చూపులో సముద్రముందని.
3.
చూపులు నల్లమబ్బు పతంగులై
నా హృదయంలో కదలాడి, కాసేపు ఆకాశంవైపు ఎగిరి,
చీకటి నగ్నత్వంలో ఇంకిపోయి
రాత్రిలా మారి నా దేహంమీద సంచరిస్తున్నాయి
నిశ్శబ్దం అనబడే సున్నిమైన రాగాన్ని ఆలాపిస్తూ…
4.
కలకత్తా గోడల మీద
ఒక పురాతన కన్నును దొంగలించిందనుకొని
ఓ కాలీ గోడను చూపిస్తూ “నువ్వొక అందమైన దొంగవి”
ఇలా అన్నానో లేదో
తాను రెప్పలిప్పి ఒక పాట పాడటం మొదలెట్టింది
ఆ కన్ను తనేనని తెలిసి ముద్దాడుతూవున్న
జానపదం చాయ్కప్ లో మిగిలిన చాయ్ని హాయిగా ప్రేమిస్తూ.
5.
చెరువులోకి తొంగి చూసినప్పుడల్లా
నీ చూపులు నక్షత్రాలై
నా కనుగుడ్లమీద నవ్వులాడుతున్నయ్
నాకస్సలు తెలియనేలేదు
చెరువులో నా కండ్లల్లో నేనే కండ్లు పెట్టుకునే దాకా
అవునా.. అంతలా అతికిపోయాయా
నువ్వు నా దేహానికి అతికినట్టు
నేనెప్పుడు నీ దేహానికి….
రాత్రి అనే వేషంలో నన్ను కట్టడి చేసావు కదా
అబ్బో..మీకు కవిత్వాలు బాగానే ఒస్తయ్ అనుకుంటా
మరి బెంగాలీ కన్నులతో మాట్లాడాలాంటే
ఈమాత్రం అల్లిక ఉండకపోతే ఎలా..!?
6.
నా మొఖం ఎదురుగ్గా నిలబడి
వాన చినుకులు మొటిమల్లాగా అనిపిస్తేను
తనే పసుపురంగు కొంగుతో నా ముఖం తుడిచి
“ఎంత అందంగా ఉన్నావో..ఇంతకీ నీ రెండో కన్నేది”
అంటూ అడగాలో వొద్దో అన్నట్టుగ అడిగేసింది.
నేను జవాబిచ్చాను ::
“ఇదిగో నా ఒంటి కన్ను ఎదురుగ్గా
సిగ్గాడుతూ జానపదం పాడుతుంది చూడు..!!”

2

కశ్మీర్…ఎ పెయింటింగ్

 

1.

నీ స్థనాల్లోకి దూకి నీ పాలల్లో ఈదాలని వుంది

తల్లీ…నీ కోసం ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన వాడ్ని కదా

నీ పాలల్లో నా గొంతును కాస్త తడుపుకుంటాను

అని ఇలా అడిగానో లేదో రెప్పపాటు కాలంలోనే

మళ్ళీ ఇంకో రెండు స్థనాలు తెగిపడ్డాయి

నల్లటి చనుమొలలు ఎరుపు కాంతితో ఉబ్బిన సూర్యుడిలాగా

ఏ మూలనో మూగగా ఓ పాట పాడుతూ వుంటాయి.

 

వును నా గొంతుకింకా పాలు తాకనేలేదు

నెత్తుటి సముద్రంలో మాత్రం ఆ పాటింకా నాకు వినిపిస్తూనే వుంది

పగిలి పెచ్చెలుగా పడివున్న నా గుండెను ఏరుకుంటూ

చిందరవందరగా పడివున్న నీ శరీరంలో

ఏ భాగాన్ని ముందుగా ఏరుకోవాలో అని గాడంగా ఆలోచిస్తున్న

ఎక్కడ పల్లవి వినిపిస్తే అటుదిక్కే నా చూపు వెళ్తుంది.

 

వరో అంటున్నారిక్కడ ఇదంతా ఒక పెయింటింగ్ అని

పోరు పాటలో ఉన్నదంతా

మొదటిసారి కూలిపోయిన నీ శరీరానికి

బొడ్డులోకి ఇంకిపోయేలా నువ్వు రాసి పోసిన కవిత్వమేనట..!!

 

2.

ప్రేమగా ఏరుకుంటే నీ గర్భంలో ఉన్న పిండాన్నే ఏరుకోమని

అది పిండం కాదని, అదొక వీరుడి బతుకు మాంసం అని

ఇక్కడ ఎవరో ఒక కోకిల వేషంలో పదే పదే చెబుతూనే వున్నారు

నా చూపు నీ కనుగుడ్డు వైపు మళ్లింది.

 

నేను confuse అయిపోయా

నా చూపు నీ గుండె వైపు మళ్లింది

నేను ఇంకా confuse అయిపోయా

అంతలోనే నీ పిండం వైపు నుండి ఓ పాట వినబడింది.

 

నేను నీ స్థనాల్లోకి దూకుతానని అన్నప్పుడు

అచ్చం నీ చనుమొలలు పాడిన పాటలాగే వుంది

వెంటనే నీ పిండాన్ని ముద్దు పెట్టుకున్నాను

నిజమే..ప్రపంచంలోనే నువొక అందమైన పెయింటింగ్వి

అందుకే అనుకుంటా పూటకొకరికి నిన్ను అమ్మేస్తూ వుంటారు.

 

నువ్ వెళ్లిన ప్రతీ చోట నాలాంటి వాడు ఒస్తూనే వుంటాడు

పొరుగీతాన్ని కొనసాగించడానికి

నీ పసిబిడ్డల పిండాన్ని ఏరుకోటానికి..!!

*

ప్రేమా పోరూ రెండు కళ్ళు!

రెండు కవితలు : ఒక ప్రేమ పాట, ఒక పోరు పాట. ప్రేమ లేకపోతే పోరూ లేదు. వ్యత్యాసం లేదు, రాగాలు వేరు, తాళాలు వేరు. ప్రత్యేక మనోధర్మ సంగీతం.
ఎప్పుడైనా నిశ్శబ్దపు రాగం విన్నారా? ఆ సందర్భంలో ఏ శబ్దం పలికినా శృతి తప్పుతుంది. అది ఒక సంపూర్ణ రాగం. చెరువులో తన కంటి ప్రతిబింబంలో ఆమె నక్షత్రాల్లా తిరిగి తన కళ్ళలో చూడటం.
ఇక కశ్మీర్ గురించి. కడుపులో ఉన్న పిండం, స్తన్యంలో జీవధార. అవి కలవకుండానే తెగిపడుతున్న స్తన్యాలు. ప్రతి ఇంటా replicate అవుతున్న ఆ చిత్రం పొరుపాటను నిరంతరాయంగా పాడేలా చేస్తుంది.
-పరేశ్ దోశి

దొంతం చరణ్

19 comments

Leave a Reply to NS Murty Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా కొత్తగా ఫ్రెష్ నెస్ నిండిన అభివ్యక్తితో మనసును తాకే పదబంధం. అభినందనలు.

  • కుర్రాడు కొంచెం సాధన, బాగా చదవడం చేస్తే మంచి కవి అవుతాడు. ఓ పచ్చి గాలి వాసన పీల్చి నట్టుంది. బ్రివిటీ కూడా ముఖ్యం. A good attempt.

  • చాలా బాగున్నాయి కవితలు బెంగాలి కండ్లు ….నుంచి.చూపుతిప్పంకోలెకపోతున్నాను.అభినందనలు.

  • రెండు కవితలు యవ్వనంగా మెరిసిపోయాయి… కవితలు రెండూ అప్పుడే పైట వేసిన అందమైన అమ్మాయి నవ్వులా..ఆమె అందమైన తడబాటు లా చాలా అందంగా కనిపించాయి…

    చరణ్ వర్తమాన కవిత్వాన్ని చూస్తే…మంచి కవి గా మిగిలిపోతాడన్నది నా జోస్యం!!

    అభినందనలు చరణ్!!

  • తెలంగణానికో డిలాన్ ధామస్. ఇది కాళోజీ, అఫ్సర్ ల కవిత్వపు నేల. ప్రేమరాగంలో పోరు వాయులీనంలా వినిపిస్తూనే వుంటుంది.kudos Charan.

  • కవిత్వం మౌలికంగా ప్రపంచాన్ని చూసే చూపులో ఉంటుంది… లోపలి
    ప్రపంచమైనా, బాహ్యప్రపంచమైనా. అభివ్యక్తికేముంది… రాయగా రాయగా అదే వస్తుంది. మీకు కవితాత్మకమైన మంచి చూపు ఉంది. అనుభూతులను సాంద్రీకరించుకుని సాధన చెయ్యండి. కవిత్వం బయటికి వచ్చినా రాకున్నా ఆ కవిత్వానుభూతిని మించిన ఆనందం మరొకటి ఉండదు. హృదయపూర్వక అభినందనలు దొంతం చరణ్ గారూ.

  • యువ కవిగా, మంచిరచయిత గా,పేరు తెచ్చుకునే అవకాశం ఉంది,అందుకే అక్షర ఒడిలోఆక్షరాలు దిద్దారు. జయహో..keepitup..!💐👌

  • బాగుంది చరణ్. ఉద్వేగం ఏ అవయవానిదో సంశయంలో పడేశారు. మీలో ఒక ఆకర్షణ ఉంది. దానికి హృదయపూర్వక పూల గుచ్చము.

    💕

    శీర్షిక చాలా వినూత్నంగా ఉంది. ఎడిటర్ గారికి అభినందనలు

  • ‘ఇక్కడ ఎవరో ఒక కోకిల వేషంలో పదే పదే చెబుతూనే వున్నారు’ – సమూలంగా కదిలిచిన పదాలు.. తనకే స్వంతమైన భావాల పొందిక, పేర్పు! ఎందరెందరి దుఃఖాలనో రోజూ చూస్తూ వింటూ అలవాటు చేసేసుకున్న వాళ్లందరికీ కొత్తగా తగిలే పదును పదాలివి! అభినందనలు – ఆశీస్సులు కూడా!

  • తనచూపులో సముద్రముంది. , ఈ కన్నెవయసు అక్షరాల పువ్వు నా గుండెలపై వాలింది .చరణ్ నీకు అభినందనలు

  • మీకు మంచి future ఉంది. please have a look on Mohan Babu గారి comments. heartly congrats చరణ్.

  • కొత్త అభివ్యక్తి , కొత్త శైలి.
    అభినందనలు .💐💐💐💐

  • అద్భుతమైన కవితలు తమ్మీ..మాది చింతపల్లి పక్కన మాడ్గుల మండలం.

  • కొత్తదైన అభివ్యక్తి…. రాపిడి పెడితే మరింత నిగ్గుతేలే కవి.. he has bright future as a poet….

  • కాశ్మీరు కవిత ఒక జోల్ట్ లా బాగుంది

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు