దారివ్వండి..పక్కకు తొలగండి

హైదరాబాద్ పేరు వినంగనే పెయి పులకరిత్తది. దేన్నెైనా తన బాహువుల్లో పొందికగా అమురుకోగల, తల నిమరగల గుణమున్న నగరమిది. గుండెకాయ అసొంటి నగరం కుతికెల దాక మునిగినంక ఎవలకూ మొసమొర్రలేదు. ‘మూసీ’ ఒక నది పేరని ఎప్పుడో యాదిమర్శినం. మంచినీటిని అందించే దాని గొంతులో విషం నింపిన వైనాన్ని ఆరాతీయకుండానే వదిలేశినం. మురికి కాల్వగా పేరు మార్చబడిన మూసీ నది ఉదంతం నేటి (2020, అక్టోబర్ 14) వరదల నేపథ్యం నుండి   మాట్లాడుకుంటున్నం. “నీళ్ళంటుకున్నాయ్” కవిత దాని చరిత్రను గుర్తుచేస్తూనే ప్రకృతి సమతుల్యత ప్రాధాన్యతను నొక్కి చెప్తుంది.
*
నీళ్ళంటుకున్నాయ్
● స్కైబాబ 
~
ఇక్కడొక నది ఉండేదని విన్నాం
ఇప్పుడు చూస్తున్నాం
నదిని మురిక్కాల్వ చేస్తివి
ఇప్పుడది తేట పడ్డది
నగరం మురుగంతా కడిగి
తాను మోసిన పేరుని కడుక్కుంటున్నది
దారివ్వండి
చెరువుల్నిండా ఇండ్లు కట్టుకొని
నీళ్లొచ్చాయని గగ్గోలు పెడితే చెరువు నవ్వుకోదా..
మీ ఇండ్లలోకి నేను కాదు
నా ఇంట్లోకే నువ్వొచ్చావని..
పక్కకు తొలగండి
పట్నవాసం పేరు మీద 
నీళ్లను తరిమేవు
ఇవాళ నీళ్లు నిన్ను తరుముతున్నాయి
మంచి నీటిని 
మురికి నీటిని చేస్తే
నీ కంట్లో 
ఉప్పు నీటిని పోసింది ప్రకృతి
అలనాటి జీవజలం 
రంగు మార్చుతూ వచ్చావు
నీ రంగు తేల్చే పని పెట్టుకుంది జలమే
నువ్వు సముద్రాన్ని ఆక్రమిస్తే
సముద్రం నిన్నాక్రమించదా
వానంటే పులకరించే స్థితి నుంచి
వర్షమంటే వణుకు పుట్టే స్థాయికి చేరడమే వికృతి
కట్టడి చేస్తే
ప్రాణమిచ్చే నీరే
తీయగలదు కూడా..
అసుంట అసుంటా అని 
నీళ్లను కుదించావు
ఇవాళ నీ నిండా
నీళ్లు నిండి ఊపిరాడకపోడమే
షాక్ ట్రీట్ మెంట్
ప్రాణవాయు చెట్లను  ఊచకోత కోశేవు..
మట్టి నుంచి పుట్టి
భూమికే ద్రోహం చేశేవు..
నది నీళ్లు తాగి 
రొమ్ము మీద తన్నేవు..
నింగీ నీరూ నిప్పూ నేలా గాలితో చెలగాటమొద్దు రా అంటే విన్నావా
ఇవాళ నిన్ను చెరపట్టే వంతు నీళ్ళది
రేపు గాలిది..
ఎల్లుండి నేల విశ్వరూపం చూస్తావు
అంజామ్ ఔర్ బాఖీ హై
*
ఒకప్పుడు విన్నది..యిప్పుడు చూడడం రోమాంచిత పర్వమే కానీ ఇదొక మహావిషాదం. 112 ఏండ్ల కిందట 1908 సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో (అప్పటి నిజాం ‘మీర్ మహబూబ్ ఆలీఖాన్’ ఏలుబడిలో) అత్యధికంగా 16 సెంమీ వర్షపాతం నమోదు కావడంతో మూసీ నదికి వరదలొచ్చినయి. ‘అఫ్జల్, ముస్సాలం జంగ్, చాదర్ ఘాట్’ వంతెనలు కూలిపోవడం, ఇరవై వేల ఇండ్లు నేలమట్టం అవడం, పదిహేను వేల మంది గల్లంతవడం జరిగింది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సమర్పించిన నివేదికను అనుసరించి విపత్తు నిర్వహణ కార్యక్రమాలకు బీజం పడింది. మూసీ వరదనీటి ఉధృతిని తగ్గించడానికి ఉస్మాన్ సాగర్ (1920), హిమాయత్ సాగర్ (1927)ఆనకట్టలు కట్టడం జరిగింది. అయితే రాచరిక పాలన అంతమై ఆతర్వాత్తర్వాత వలసాధిపత్యపాలన కొనసాగిన క్రమంలో పాలనావ్యవస్థ పనితీరు మూలంగా నగరంలోని చెరువులు, కుంటలు మాయమై ఇండ్లు మొలవడం ప్రారంభమైంది. ఇదే ఇప్పటి వరదనష్టానికి కారణమైంది.
*
కవి ‘మనిషి’ స్వార్థం గురించి మాట్లాడుతాండు. తన సుఖసంతోషాల కోసం ప్రకృతిని పీడించిన తీరును నిరసిస్తున్నడు. నదిని ఆక్రమించుకుని అన్యాయం జరిగిందని లబోదిబోమంటున్న జనాన్ని చూస్తే నవ్వొస్తుంది. తప్పు తమది కాకపోయినా ఫలితం అనుభవిస్తున్న అమాయకుల పక్షమే నిలబడాల్సి వుంటుంది. కొందరి స్వార్థప్రయోజనాల కోసం వ్యవస్థను భ్రష్టు పట్టించిన తీరుపై దుమ్మెత్తిపోయాలనిస్తుంది. కానీ ఇప్పుడేం చేయగలం? పెరిగిపోతున్న జనాభాకు నదులేం ఖర్మ సముద్రాలు కూడా కబ్జాకు గురవుతాయనిపిస్తుంది. ఇది నది తన అస్తిత్వాన్ని నిలుపుకున్న సందర్భం. ఎవల జాగలకు ఎవలు సొచ్చుకొచ్చిండ్లో కవి తేటతెల్లం జేశి చెప్తున్నడు. ఇది నీళ్ళ ముచ్చట. రేపు గాలి, ఎల్లుండి నేల తన ఉనికిని కాపాడుకుంటుందని ప్రకృతిని తెర్లు తెర్లు జేశిన మనిషికి పట్టే గతేంటో ఒక అంచనా వేసుకొమ్మంటుందీ కవిత. ఒక హెచ్చరిక లాంటి ముగింపు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలుకొమ్మంటుంది. మరోవైపు మన భద్రతావ్యవస్థను వెక్కిరిస్తుంది.
**
కవితలోని టోన్  కొంత సాధారణీకరణగా, నర్మగర్భంగా నిర్ధిష్టతను దాచుకొని వినాశకారకులను లక్ష్యంగా చేసుకుని కొనసాగుతుంది. అంతిమంగా ప్రకృతిని నాశనం చేస్తే ఫలితం అనుభవించాల్సిందేనని బోధిస్తుంది.
*

బండారి రాజ్ కుమార్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవిత చాలా బాగుంది.ఎన్నో విషయాలు,మనుషుల తప్పిదాలు ,మనసుకి హత్తుకొనేలా చెప్పారు.మరి మనకి బుధ్ధి వచ్చేది ఎన్నడో!-T.T.N.Rao,SanJose ,(CA) US

  • Very good poem….. మీరు విడమర్చి చెప్పిన విధానం చాలా బావుంది👌👌👌

  • షుక్రియా రాజ్ కుమార్ 🌿
    హైదరాబాద్ ను రక్షించుకునే ఉద్యమం నడిస్తే తప్ప హైదరాబాద్ మనకు మిగలదు!
    పర్యవసానాలు ఆలోచించని వాళ్ళ వల్ల ఇవాళ హైదరాబాదీ పేదలు ఇబ్బందులు పడుతున్నారు..😓

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు