తెలుగు కథలో తండా జెండా ‘పురుడు’

క్కోసారి కథకి రెక్కలొచ్చి ఎక్కడెక్కడికో ఎగిరిపోతూ ఉంటుంది. కథలోంచి కథలోకి  దూకుతుంది. పువ్వుల్నీ, పిట్టల్నీ, చెట్టునీ, రాయినీ తాకి మాటలు తెప్పిస్తుంది.  ఇదో మాయలమరాఠీ కథావిధానం. దీని మూలం జానపదంలో ఉంది. ఏడిపిస్తుంది.. భయపెడుతుంది.. వెంట లాక్కునిపోతుంది.కట్టిపడేసుకుంటుంది. నోటికతలోంచి రాతకథలోకి బట్వాడా అయిన కథనపద్ధతి ఇది. పట్టణం ఇంకా పూర్తిగా రెక్కలు విప్పుకోని పల్లెబతుక్కి దగ్గరగా ఉండే రచయితల కథల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కథలోంచి కథను పుట్టించి నడిపించే నైపుణ్యాన్ని, ఇప్పటికీ అడివంచు పల్లెలోనే ఉన్న యండపల్లి భారతి కథల్లో చూడచ్చు.  రమేశ కార్తీక్‌ నాయక్‌ కూడా తండా బిడ్డ. అతను రాసిన  ‘పురుడు’ నన్ను ప్రత్యేకంగా ఆకట్టుకోవడానికి బహుశా ఈ కథనవిశేషం కారణం కావచ్చు.

పేరుకు తగ్గట్టే పురిటి కష్టాలను చెప్పిన చిన్న కథ ‘పురుడు. పురుటి నొప్పులు ఆడవాళ్లందరికీ ఒకటే కావచ్చుగానీ, గుట్టలు అడవుల తండాల్లోని ఆడవాళ్ల పురిటి కష్టాలను, పట్టణాల్లోని ఆడవాళ్ల పురిటి కష్టాలతో పోల్చలేం. తండాబిడ్డలు మాత్రమే దాన్ని బలంగా చెప్పగలరు. బర్రెల కొట్టంలో పేడా ఉచ్చా ఎత్తిపోస్తూ ఉండగానే నొప్పులు మొదలైన ఝమ్లి కథే ‘పురుడు’. నొప్పులతో మెలితిరిగిపోతున్న పదహారేళ్ల ఝమ్లికి  తండా ఆడవాళ్లంతా కలిసి పురుడు పోసిన వైనాన్ని రమేశ కార్తీక్‌ నాయక్‌ కథగా మలిచారు. ఇది మాత్రమే అయితే, కథగా దీనికి ప్రత్యేకత ఏముంటుంది?

పందిరి కింద నుంచి వేపచెట్టు కిందకీ, అక్కడి నుంచీ మరొక తావుకీ ఝమ్లి పడుకున్న మంచాన్ని తిప్పుతూ ప్రసవం కోసం ఎదురు చూస్తున్నారు. ‘యే బా..యే  యా.. యేబాయియే మరియే.. మన బచాడో’ అంటూ మూలుగుతోంది ఝమ్లి. మంచం చుట్టూ చేరిన ఆడవాళ్ల నుంచి తలా మూడేసి వెంట్రుకలు తీసుకుని తాయత్తుగా పేని, ఆమె ఎడమకాలికి కట్టారు. ‘నీకు మంచి బిడ్డ పుడ్తడు’ అని అనునయిస్తూ తండా ఆడవాళ్లలో ఒకరు తన చిన్ననాటి అనుభవాన్ని కథగా మలిచి చెప్పడం మొదలు పెట్టారు. అది కూడా పురుటి కష్టం కథే! కాకపోతే ముప్పయ్‌ నలబై ఏళ్ల కిందటిది. ఆనాటి హింగ్ళా పురుటి కష్టం ముందు, ఈనాటి ఝమ్లి కష్టం ఎంత?

బంగారంలా మెరిసే జుట్టు.. తేనె కళ్లు.. ఎర్రటి పిల్ల హింగ్ళా. ఆమె కడుపులోపడ్డ పిండం మూడుసార్లు కరిగిపోయింది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి.

మొదటిసారి- ఇప్పపూలను  ఏరడానికి పోయినపుడు చూసుకోకుండా నెమలి గుడ్లమీద కాలేసింది. అవి పగిలిపోయాయి, హింగ్ళా కడుపులోని పిండంలాగే!

రెండోసారి- హింగ్ళా మొగుడు వేటాడి తెచ్చిన కుందేలును కోసినపుడు, దాని కడుపులో పది పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలను తీసి పారేసి కూర వండేశారు. హింగ్ళా కడుపులోని పిండం కూడా జారిపోయింది.

మూడోసారి- హింగ్ళా ఇంట్లోకి ఉడుము దూరింది. ఆచారం ప్రకారం దాని కాళ్లను దాని తోకతోనే కట్టి, కుండలో పెట్టి, ఎర్రటి లేదా తెల్లటిగుడ్డతో కుండ మూతిని బిగించి, ఇంటి గడప ముందు రెండడుగుల లోతలో దాన్ని పూడ్చిపెట్టాలి. కానీ హింగ్ళా అలా  చేయలేదు. ఆ పూట ఎందుకో ఉడుము మాంసం తినాలపించింది ఆమెకి. ఇంట్లోకి వచ్చిన ఉడుముని వండుకుని తినేసింది. కడుపు  పోయింది.

ఆతర్వాత  రెండేళ్లూ ఆమె కడుపు పండలేదు.

వానాకాలం చివరి రోజున హింగ్ళా కలలోకి ఒక జింక వచ్చి ఇలా చెప్పింది.. ‘నేను సచ్చిపోతున్నాను. నా బిడ్డ , నీ మేకలమందలో ఉంది. ఆకలికి నీరసించిపోయింది. దాన్ని నువ్వు జాగర్తగా చూసుకో’. ఈ మాట చెప్పిన జింక,  చెట్టులా మారిపోయింది. ఆ చెట్టుకి జింక కొమ్ముల వలే కొమ్మలు మొలుస్తూ ఉంటే, ఆ చప్పుడుకి హింగ్ళాకి మెలకువ వచ్చేసింది. మొగుడ్ని వెంటబెట్టుకుని మేకల మందలోకి వెళ్లి వెతికింది. మేకలన్నీ ఒక వైపునకు చేరి నిలుచుని ఉంటే, బుజ్జి జింకపిల్ల మాత్రం  ఒక మూలన పడి ఉంది. రెండు రోజుల కిందటే ఈనిన మేక పొదుగు దగ్గరకు జింకపిల్లను తీసుకువెళ్లింది. ఆ మేక జింకపిల్లకు పాలు ఇవ్వకపోగా, కాలితో ఎగిసి తన్నింది. జింకపిల్లని హింగ్ళా ఇంట్లోకి తీసుకువెళ్లింది. మొగుడ్ని కింద పడుకోమని చెప్పింది. మంచంమీద తన పక్కనే జింకపిల్లను పడుకోబెట్టుకుని జోలాలి పాడింది. పాడుతూ పాడుతూ తన రొమ్మును జింకపిల్ల నోటికి పట్టించింది. ఆ రాత్రంతా జింకపిల్ల పాలు తాగుతూనే ఉంది.

తెల్లారి నిద్రలేచి చూస్తే, హింగ్ళా రెండు రొమ్ముల నుంచి లేత పసుపురంగులో పాలు కారుతూ ఉన్నాయి. కానీ, పక్కన జింకపిల్ల లేదు. చాపమీద పడుకున్న మొగుడ్ని లేపి, జింకపాప  ఏమైందని అడిగింది. అతను, ‘కలగన్నావా” అని అడిగాడు.

రాత్రి జరిగింది నిజమా, కలా? అర్థం కాలేదు హింగ్ళాకి. ఇంటి చుట్టూ వెతికింది. తనకు దోస్తు అయిన అమ్మాయిని జింకపిల్ల గురించి అడిగింది. అప్పుడామె, జింకపిల్ల గురించి చెప్పలేదు గానీ, ‘నిన్న రాత్రి మూత్రం  వస్తుందని నిద్రలేచి ఇంటి బైటికి అచ్చిన. అప్పుడు ఓ నక్క తండాలో తిరగడం చూసిన’ అని చెప్పింది.

‘పిల్లజింక నక్కకు బలైపోయిందే’ అని హింగ్ళా కొన్ని రోజులపాటు దుఃఖించింది. దుఃఖబాధ నుంచి బయటపడుతున్న కాలంలో హింగ్ళాకి నాలుగోసారి కడుపు వచ్చింది.

ఈసారి కూడా మునుపటి లాగే హింగ్ళాకి కడుపు నిలవదని తండా అంతా అనుకున్నారు. కానీ, ఏడు నెలలకే పురిటి నొప్పులు మొదలైనాయి. రెండు రోజులైనా ప్రసవం కాలేదు. నొప్పులు తగ్గలేదు. తండా ఆచార పద్ధతిలో పురుడు పోయాలని ఆడవాళ్లంతా అనుకున్నారు. పొయ్యి వెలిగించి మరిగే నీళ్లలో గోనె సంచులు ముంచి నానబెట్టారు. వాటిని ఎడ్లబండి మీద ఒత్తుగా పరిచి హింగ్ళాని  పడుకోబెట్టారు. ఇద్దరు మనుషులు కాడెను లేపి చేతులతో పట్టుకుని ఎత్తు పల్లాలున్న రాళ్లదారిగుండా వేగంగా పరుగులు తీశారు. డప్పులు, ఇనుప పళ్లేల మీద శబ్దాలు చేస్తూ తండాజనం బండి వెనుకే ఉరికారు.  అటువంటి  భీకర సమయంలో ప్రసవం జరిగింది. అట్లా అమ్మ కడుపులోనుంచి బయటకొచ్చి, ఎడ్లబండి వెదురు బొంగుల సందుల్లోంచి జారి కిందపడిపోకుండా దక్కిన బిడ్డే ఝమ్లి.

తన తల్లి పడ్డ పురుటి కష్టం ముందు, తన బాధ ఎంత!

కథ  వింటూనే బిడ్డను కనేసింది ఝమ్లి.

ఇదీ కథ. ఇదే కథ. కానీ ఇది మాత్రమే కథ కాదని ఈ కథలోని కథ చెబుతుంది.

పైకి ఇది ఝమ్లి కథ. నిజానికిది హింగ్ళా కల కథ. చెప్పదలచుకున్న అసలు కథంతా ఈ కలలోనే ఉంది.

అడవి దాటిన జింక, మేకలమందలో ఈనడం ఏమిటి? అడవి బయటి అభద్ర జీవితానికి ఇది సూచిక. పిల్లజింకకు పొదుగు కుడపాల్సిన తల్లిజింక ఏమైంది? యే మెకం బారిన పడిందో! బేలకళ్ల జింకబిడ్డని చూసి మేకతల్లిలో మాతృత్వం పొంగలేదు ఎందుకు? జింకా, మేకా జాతులు వేరు. జింక అడవిజీవి. మేకది మైదానజీవనం. అడవి మీద హక్కు మైదానానికే కావాలి. ఆధిపత్య హింస. నాలుగుకాళ్ల వనజీవికి పాలు పంచే హింగ్ళా వంటి మానవీయ జీవులూ ఉంటారు. కానీ అది ఆమోదనీయ ప్రేమ కాదు. కునుకు తీస్తే చాలు కాటేసే కుట్రలు పన్నుతుంటారు. మానవత్వాన్ని కల దాటనివ్వరు. ఎర వేసి ఎత్తుకుపోవడానికి జింకపిల్లల కోసం రాత్రి తండాలో నక్కలు తిరుగాడుతూనే ఉంటాయి.  అవును..మైదానమంతా నక్కలమయం. అడవి జీవి ఆదమరిస్తే ప్రమాదం. మణిపూర్‌ చెబుతున్నది ఇదే కదా? అవునవును ఇదే కథ!

తెలుకు కథకు తండా పరిమళాలను అద్దిన కథ ఇది. అక్కడక్కడా యధాతధంగా బంజారా మాటలు వాడడం బావుంది. ‘గుండ్రంగా మర్రికాయాల మెరుస్తున్నడు’ అని  సూర్యుడినీ, ‘ఆకాశంల నుండి నల్ల చీమల్లా దిగుతా ఉంది’ అని చీకటినీ వర్ణించడం తండాబిడ్డ అయిన రమేశ కార్తీక్‌ నాయక్‌కి మాత్రమే సాధ్యం అవుతుంది. సంచార, అర్ధ సంచార తెగల గురించి తప్ప, ఆ తెగల నుంచి కథాసాహిత్యం తగినంతగా పుట్టలేదు. ఈ కొరత ఇప్పుడిప్పుడే కొంత తీరుతోంది రమేశ కార్తీక్‌ నాయక్‌ వంటి వారివల్ల.  ముప్పయ్యేళ్లు కూడా లేని ఈ పిలగాడు ‘ఢావ్లో’ పేరుతో ఇప్పటికే ఒక కథా సంపుటినే వెలువరించాడు. ముందు ముందు తండా జెండాను తెలుగుకథావీధిలో రెపరెపలాడిస్తాడనే నమ్మకం కలిగిస్తున్నాడు.

*

‘ పురుడు ‘ కథ ధావ్లో కథా సంపుటి లోనూ, వేంపల్లి షరీఫ్ సంకలన పరచిన ‘ యువ ‘ కథల పుస్తకం లోనూ ఉంది.

 

పురుడు

పొద్దున్న ఎత్తాల్సిన పెండ కొట్టంలో అలాగే ఉండిపోయింది. నిద్రపోతున్న ఝమ్లికు ఇది గుర్తొచ్చి హాట్కు పోయినోల్లు రాకముందుకే పెండనంత ఎత్తెద్దాం అనుకుంటు బర్రెల కొట్టం ముకాన మెల్లగా నడ్సింది. కొట్టంలో నీళ్ళ తొట్టికి పక్కనే కాసింత దూరంలో ఉన్న ఓ రాయిపై కూసొని పెండ కప్పను గమనిస్తాంది. పెండ ఆ పాటికే బయటి వైపు ఎండిపోయింది. నల్లని గీతలు పెండ కుప్ప చుట్టు, అక్కడక్కడ కోళ్ళు మెతుకుల కోసం గీరినట్లు ఉన్నయి. అక్కడక్కడ పెండ లోంచి చిన్న చిన్న పురుగులు పాకుతున్నయి.
      ఉచ్చలో నానిన పాత ఎండుగడ్డి వీర్యం వాసనలా ఉంది. కొట్టంలో రేకులకు కింద అంచుల్లో రంగు రంగుల సాలీడు పురుగులు ఏలాడుతున్నాయి. ఝమ్లికి ఆ పురుగులు రంగురంగుల పూసళ్ళా అనిపిస్తున్నయి. గుడిసె పక్కనే ఉన్న ఏప సెట్టు ఆకులు కాయలు అన్ని గుడిసె ముందు నిండిపోయినయి.
జల్ది జల్దిన అవగొట్టి తౌడుతో రొట్టెలు, రేలా పూల పప్పు చెయ్యాలి అనుకుని తన ఫేట్యాను కొంచం నడుముకు పైకి జరిపి కట్టి తల పైన టూక్రిని జడ చుట్టు చుట్టేసి ఊడ కుండా కట్టి పని చాలు చేసింది.
 పెండ ఎత్తుతున్న ఝమ్లి తనకేదో అయినట్లు అనుకుని తన సేతులకున్న పెండను ఆ పక్కనే ఉన్న గడ్డిపై తుడ్సుకుని గుడిసెకు ముందు పందిరికి కింది మంచం పై కూసొని తన ఇంటి దారి నుండి ఎళ్తున్న పిక్ణినీ పిల్సింది.
“ఏమైనది ఝమ్లి” అని పిక్ణి ఝమ్లితో అడ్గింది.
“కడుపులో నొప్పిగా ఉంది. తల తిర్గుతాంది. పురుడు దగ్గర పడినట్లు ఉంది బాయి” అంటూ పిక్ణితో ఝమ్లి నీర్సంగా సెప్పింది.
“పడుకో, నేనిప్పుడే అస్తా” అంటూ పిక్ణి తన సోబత్ బాయిలను పిల్సుకరానీకి పోయింది.
 ఆ తండాలో పెద్ద మన్షులు మోగోల్లు ఎవరూ లేరు. అందరూ హాట్కు పోయిర్రు. ఉన్న కొందరు బాయిలు పిక్ణి పిలుపుకి పందిరి దగ్గరికి చేరుకున్నరు.
    ఝమ్లి ఓ సేతును తన పొట్ట పై పెట్కుని ఇంకో సేతిని మంచానికి ఒక పక్కనుండి కిందికి ఏలాడదీసి
“యే బా…..
యే యా….
యే బాయియే మరియే…..
మన బచాడో ” అంటూ సన్నగా మూల్గుతా ఉంది.
       పందిరి కింది నుండి మంచాన్ని ఏప సెట్టు కిందికి లేపుకొచ్చి పెట్టిర్రు.
         మంచానికి సుట్టు కూకున్నరు బాయిలు. నలుగురు మంచం పై పండుకొని ఉన్న ఝమ్లికి రెండు పక్కల కూసుని ఝమ్లిని ఓదారుస్తూ
” ఇగొ అయితది. అగొ అయితది. ఓపిక అవసరం” అంటూ సెప్తున్నరు.
      సూరీడు కొండల్లోకి దిగనికి ఎనకా ముందు అయితా ఉన్నడు. గుండ్రంగా మర్రి కాయల మెరుస్తున్నడు. సంతకి పోయినోళ్ళు ఆపాటికే అస్తారు అని అందరూ అనుకున్నర్రు. కాని ఎవరు రాలే. అడ్వికి పోయిన బర్రెలు, ఆవులు , ఎడ్లు , గొఱ్ఱెలు ఇంకా మేకలు తండా చేరుకున్నయి. పందిరి దగ్గర బాయిలు లేచి ఎవరింటికి ఆళ్లు పోయి ఎవరి మందలను వారు కొట్టాల్లో ఏసి ఝమ్లి దగ్గరికి అచ్చేసిండ్రు. ఝమ్లి బర్రెలు కొట్టంలో అరుస్తా ఉన్నయి. అది సూసిన పిక్ణి కొట్టంలోకి పోయి బర్రెలను కట్టేసి ఝమ్లి దగ్గరికి అచ్చేసింది.
         సీకటి ఆకాశంల నుండి నల్ల చిమల్లా దిగుతా ఉంది. నొప్పులు తట్టుకోలేక ఝమ్లి ఏడుస్తాంటే ఆమె నొప్పులు తగ్గించనీకి పావు లోట సారా తెమ్మని చెప్పింది పిక్ణి. గుంపులోని ఓ బాయి పోయి లోటాలో సారా తెచ్చి పిక్ణికి ఇచ్చింది. పిక్ణి ఆ లోటా సారాను ఝమ్లితో తాగించింది . కొంత సేపు ఆరాం చేసినా కడుపులో నొప్పి ఆమెను సతాయించుడు మళ్ళి షురూ జేసింది.
   ఆమె వయసు 16 సంవత్సరాలు. ఆమె పెయ్యి కంటే ఆమె కడుపే మస్తు పెద్దగా ఉంది. కవలలు అయ్యుంటారని అందరూ అనుకున్నరు. ఆమె నొప్పి తట్టుకోలేక అరిచే అర్పులకి సుట్టు ఉన్న ఆ బాయిలు ఏడ్సుడు షురూ జేసిర్రు.
        కింద కూసున్న గుంపులోంచి ఒక బాయి లేచి అందరి దగ్గరి నుండి మూడు మూడు ఎంట్రుకలు తీస్కొని ఒకదగ్గర తాయిత్తులా పేని ఝమ్లి ఎడమ కాలికి కట్టి ఝమ్లి తల దగ్గర కూసుని
“నీకు మంచి బిడ్డ పుడ్తడు. నీకు తెలుసో లేదో పూర్వం మన పురుడు ఎట్లా అయ్యేదో. నేను నీకు ఇప్పుడు చెప్తా. నేను చిన్నగున్నప్పుడు నా కళ్ళతో సూసినా” అంటూ హింగ్ళా కథ సెప్పుడు షురూ జేసింది. ఝమ్లి కాసేపు నొప్పులతో బాధ పడినా ఆ తర్వాత కథ వినడంలో మున్గిపోయింది. ఝమ్లితో పాటు అందరూ విననీకి సిద్దమైనరు.
     హింగ్ళా ఎర్రగా, తేనె కను గుడ్లతో , బంగారం లెక్క మెరిసే జుట్టుతో బొమ్మలా ఉండేది. మూడు సార్లు ఆమె కడ్పులో పిండం కరిగిపోయింది.
 ఒకటో పారి ఆమె ఇప్పపూలను ఏరనీకి పోయినప్పుడు. నెమలి గుడ్లను సూసుకోకుండా వాటిపై కాలు పెట్టిందట. అవి పగ్లిపోయినయి.
రెండో పారి తను కడుపుతో ఉన్నప్పుడూ హింగ్ళా మొగుడు ఓ కుందేల్ను ఏటాడుకొని తెచ్చినాడట. దాన్ని కూర వండనీకి కోస్తే ఆ కుందేలు కడుపులో పది కుందేలు పిల్లలు ఉన్నాయట. వాటిని తీసి పడేసి కూర వండినారట.
మూడో పారి కడుపుతో ఉన్నప్పుడు ఇంట్లోకి ఓ ఉడుము అచ్చినాదట. మన సంప్రదాయం ప్రకారం ఇంట్లోకి అచ్చిన ఉడ్ముని పట్టి దాని కాళ్ళను దాని తోకతో కట్టి ఓ కుండలో పెట్టి కుండ మూతిని తెల్లని లేదా ఎర్రని బట్టతో కట్టి ఇంటి గడపకు ముందు రెండడుగులు తవ్వి పాతి పెట్టాలి. రోజు దాన్ని తొక్కుకుంటూ పోతే మన ఇంట్లో దరిద్రమంత పోతదని నమ్మకం. కాని హింగ్ళా మాత్రం
“ఉడుము మాంసం తినాలని ఉంది” అంటూ దాన్ని వండించుకుని తిన్నదట.
అలా మూడుసార్లు తన పిల్లలను తన కడుపులోనే పోగట్టుకుంది.
ఇదంతా జరిగిన రెండేళ్ల దాకా హింగ్ళాకు కడుపు రాలేదు. అయితే ఓ వర్షాకాలం చివరి రోజున ఓ జింక హింగ్ళా కలలోకి అచ్చి
“నేను సచ్చిపోతున్నాను. నా బిడ్డ నీ మేకల మందలో ఉంది. ఆకలికి నిరసించిపోయింది. దాన్ని నువ్వు జాగర్తగా చూసుకో” అని చెప్పి జింక ఓ చెట్టులా మారిపోయింది. ఆ చెట్టుకు జింక కొమ్ముల్లా కొమ్మలు మొలుస్తుంటే ఆ సప్పుడుకు నిద్ర నుండి మేల్కుని మొగుడ్ని తీస్కుని మేకల మందలోకి ఏళ్లి సూసింది. మేకలన్ని ఒక వైపు నిల్చున్నయి. జింక పిల్ల మాత్రం ఓ మూల పడిఉంది. రెండు రోజుల కింద ప్రసవించిన ఓ మేక దగ్గరికి తీసుకెళ్లి పాలు తాగించనీకి యత్నం చేసింది. కాని మేక పాలు ఇవ్వకపోగా జింక పిల్లను కాలితో తన్నింది. ఇట్లా కాదనుకుని హింగ్ళా జింక పిల్లను తీస్కుని ఇంట్లోకి ఎళ్లిపోయింది. మొగుడ్ని కింద పండుకోమని సెప్పింది. అతను సాప కిందేసుకుని పండుకున్నడు. హింగ్ళా ఆ జింక పిల్లను తన పక్కనే మంచం పై పడుకోబెట్టుకొని జోలాలి పాడింది. పాడుతూ పాడుతూ తన రొమ్మును జింకకు పట్టించింది. జింక రాత్రంతా పాలు తాగుతానే ఉంది. హింగ్ళా పండుకుంది.
      తెల్లారింది. పొద్దున్న నిద్రలేచి సూస్తే తన రెండు రొమ్ముల నుండి లేత పసుపు రంగులో పాలు కారుతా ఉన్నయి. పక్కన జింక లేదు. జింక గురించి మొగుడ్ని అడిగింది.
“కల ఏమైనా కన్నావా” అంటూ హింగ్ళాతో అన్నాడు.
ఆశ్చర్య పోయింది. రాత్రి జరిగింది నిజమా? అబద్దమా ? హింగ్ళాకు అర్దం కాలేదు.
కాసేపు సుట్టూ వెత్కింది. తనకు దోస్తైన ఓ బాయిని జింక గురించి అడ్గింది. అప్పుడామె
“నిన్న రాత్రి మూత్రం అస్తుందని నిద్రలేచి ఇంటి బైటికి అచ్చిన. అప్పుడు ఓ నక్క తండాలో తిరగడం చూసిన” అని ఆ బాయి హింగ్ళాతో సెప్పింది.
   “అయ్యో పిల్ల జింక నక్కకు బలైపోయిందేమో” అని కొన్ని రోజులు బాధపడింది. తర్వాత నెలకే హింగ్ళాకు కడుపొచ్చింది. ఈసారి కూడా ముందులాగే అవుతదని అందరూ అనుకున్నరు. కాని అలా ఏం కాలేదు. ఏడు నెలలకే పురిటి నొప్పులు మొదలైనయి. రెండు రోజులు ఎదురు చూసిన్రు. దాయి సలహా మేరకు మన సంప్రదాయ పద్ధతిలో పురుడు పోయ్యాలని అనుకున్నరు. పోయ్యి ఎలిగించి ఉడుకుతున్న నీళ్లలో గొన సంచుల్ని నానబెట్టిర్రు.
        ఓ ఎడ్ల బండిని తెచ్చి దాని పైన వేడి నీళ్లలో నానపెట్టిన గోన సంచుల్ని పెట్టి, దానిపై హింగ్ళాను పడుకోబెట్టిర్రు. తండాలో కొందరు డప్పు ఇనుప పళ్ళెం తీస్కుని భయంకర శబ్దాలను చెయ్యడం షురూ చేసిర్రు.
      ఇద్దరు పెద్దమనుషులు ఎడ్ల బండి కాడెను లేపి తమ సేతులతో పట్టుకుని ఎత్తు పల్లాలు రాళ్లు ఉన్న దారి గుండా వేగంగా పరిగెత్తుతున్నరు. తండాలోని వారందరు బండి ఎనకే ఉర్కుతున్నరు. మొత్తం మీద చానా సేపటికి ప్రసవం జరిగింది. శిశువు ఏడ్పు విని బండిలోని వేగాన్ని తగ్గించి, బండిని తండా వేపు తీసుక పోయిర్రు.
     ” మా అమ్మ నన్ను అది సుడొద్దన్నా సూసిన, నేనైతే ఆ శిశువు బండి వెదురు బొంగుల సందులోంచి ఎక్కడ జారిపోతుందో” అనుకున్నాను.
కానీ ఏం కాలేదు.
ఆ తర్వాత మావాళ్ళు అక్కడి నుండి అవుల మందల్ను అమ్మనీకి వేరే ప్రాంతానికి వలస చాలు జేసిర్రు. ఆ వలసలో నేను ఎడ్ల బండి దిగనే లేదు. అలా ఇటుగా మన తండాను దాటి పోతుంటే వలస ఎళ్తూ వయసుకు అచ్చిన ఆడబిడ్డను ఇలా అడవుల ఎంట తిప్పడం మంచిది కాదని ఈ తండాలో నాకు పెళ్ళి చేసి ఎల్లిపోయిర్రు.
         కథ ఖతం అయ్యింది. కథ చెప్పిన బాయి ఝమ్లి తలను నిముర్తూ ఉంది. ఝమ్లి ఆ కథ నుండి బయట పడలేదు. ఇంకా దాని గురించిన దృశ్యాలు ఆమె తలలో కదుల్తా ఉన్నయి. తను ఆ ఎడ్ల బండి పద్దతి ద్వారా పుట్టిందని తన దాది సెప్తే అది ఓ కట్టు కథ అంటూ కొట్టిపారేసేది ఝమ్లి. కానీ ఇప్పుడు ఆమెకు నమ్మకం కల్గింది. తను కథ వింటూనే బిడ్డకు జన్మనిచ్చేసింది.
   ఝమ్లి మొదట పిక్ణిని పిలిచి సాయం అడ్గింది. కాబట్టి పిక్ణి శిశువు బొడ్డు పెగును మట్టి రంగు చేకుముకి రాయితో కత్తిరించి తన తల పై నుండి కప్పుకున్న టూక్రిని తీసి బిడ్డను తుడ్సి ఆ టూక్రితో అతని పెయ్యి సుట్టు సుట్టింది. చికటైపోయింది. చుట్టూ వాతావరణం కీచురాళ్ళ చప్పుళ్లతో నిండిపోయింది.
ఒక్కొక్కరిగా అందరూ తమ తమ ఇళ్లకు చేరుకున్నరు.
పిక్ణి మాత్రం ఆ రోజు రాత్రి ఝమ్లికి తోడుగా వాళ్ళ గుడిసెలోనే ఉండిపోయింది.
*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు