తీస్తా నది వెంట ప్రయాణం

సాంకృత్యాయన్ కి ఇష్టమైన ప్రదేశం కాళింపాంగ్. ఆయన టిబెట్ మీద చేసిన అనేక పరిశోధనలకి కాళింపాంగ్ ముఖ్య మజిలీ.

హిమాలయాలలో పర్యటించడం నాకు ఇదే మొదటిసారికాదు. ఇరవై ఏళ్ళ క్రితం బదరీనాథ్ వెళ్ళినప్పుడు హిమాలయాల సౌందర్యం మొదటిసారి చూసి మంత్రముగ్ధుడినయ్యాను. తర్వాత కులుమనాలి రోహతంగ్ పాస్ లను చూడడం, ఈ సంవత్సరమే డార్జిలింగ్ కొండల్లో విహరించడం జరిగింది. డార్జిలింగ్ పర్యటనలోనే సిక్కిం యాత్రకు బీజం పడింది. అపుడే సిక్కిం గురించి అన్ని వివరాలు సేకరించి పర్యటనకు సమయం కోసం ఎదురుచూడటం అయింది. ఆల్ ఇండియా ఎల్ టీసీలో సిక్కిం పర్యటనకు అనుమతి రాగానే యాత్రా సన్నాహాలు ఆరంభమయాయి.

ఈశాన్య భారతంలోని హిమాలయ పర్వతాలలో నేపాల్, భూటాన్, టిబెట్ల మధ్య వున్న రాష్ట్రం సిక్కిం. 1975లో ఇది భారత దేశంలో భాగమయింది. ఏడు వేల చదరపు కి.మీ. ప్రాంతంలో విస్తరించిన యీ రాష్ట్రం ఆరు లక్షల జనాభామటుకే కలిగి వుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కాంచనగంగా పర్వత శ్రేణి సిక్కింలోనే వుంది. గాంగ్ టక్ సిక్కిం రాజధాని.

డిశంబరు మాసంలో ఉత్తర భారతమంతా అప్పటికే చలిలో వణుకుతుంది. మేము సిక్కిం ప్రయాణం కావాలనే డిసెంబర్‌లో పెట్టుకున్నాం.

హిమాలయాలలో అపుడే మంచు ఏర్పడటం మొదలవుతుంది, ఎక్కువగా.

జనావాస ప్రాంతాల దగ్గరలో కూడా మంచు చూడొచ్చు. అప్పుడు పర్యటించి మంచులో ఆడుకోవడమే మా ప్రధాన ఉద్దేశ్యం. కాబట్టి ఇంటి నుంచి వూలు దుస్తులు వున్నవన్ని పట్టికెళ్ళాం.

చెన్నై నుంచి మా విమానం బాగ్ డోగ్రా విమానాశ్రయంలో దిగేటప్పటికి ఉదయం తొమ్మిది కావస్తోంది. ఫొటోలు తియ్యద్దు బాగ్ డోగ్రా మిలటరీ ఆధీనంలో వున్న విమానాశ్రయం అని విమానం దిగకుండానే ప్రకటన చేసారు. భారతదేశపు కోడిమెడ (చికెన్స్ నెక్) గా ప్రఖ్యాతి గాంచిన సిలిగురి బాగ్ డోగ్రా పక్కపక్కనే. ఈ ప్రదేశం బంగ్లాదేశ్, నేపాల్ కి, భూటాన్ కి, చైనాకు కూడా అతి దగ్గరలో వున్న ప్రాంతం. ఈశాన్య భారతానికి, మిగతా భారతాన్ని కలిపే అతి ముఖ్య ప్రదేశం. ఈ మధ్య వార్తల్లో వున్న డొక్లామ్ చైనాకీ, భారతదేశానికీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న ప్రాంతం. సిలిగురికీ బాగా దగ్గర. ఈ ప్రాముఖ్యతకి సరిపడినట్టుగానే అక్కడ ఎక్కువగా సైనికుల కోలాహలం కనబడింది. బాగ్ డోగ్రా విమానశ్రయం గురించి కొన్ని ఆలోచనలు. బాగ్ డాగ్రా విమానాశన్ని మొదటిసారి చూసినపుడు నాకు విశాఖ పట్నం విమానాశ్రయం గుర్తొచ్చింది. అది డిఫెన్సు విమానాశ్రయం కావడమో, లేక కొండల పక్కనే వుండటమో లేక సుమారు రెండూ చిన్న విమానాశ్రయాలు కావడమో కావచ్చు.

ఈ మధ్య హైదరాబాదు, ఢిల్లీ, మద్రాసు విమానాశ్రయాలు చూసిన తరువాత నా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. నగరాల కోసం కట్టిన యీ విమానాశ్రయాలు నగరాల్లోనే చూడదగిన స్థలాల్లా మారిపోయాయి. ఇపుడు విమానాశ్రయాలు కేవలం ఒక విమానంలో, ప్రయాణం చేసే స్థలాలు కాదు, అవి సరికొత్త జీవన విధానానికి చిహ్నాలు. పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క అత్యంత సుందర ఖరీదయిన ప్రదర్శనా స్థలాలు.

ఇంకా బాగ్ డోగ్రా, విశాఖ లాంటి విమానాశ్రయాలు ఈ కోవలోకి రాలేదు. అవి యింకా ప్రయాణికుల్ని రవాణా చేసే స్థలాలు గానే వున్నాయి.

నేను మొదటిసారి విమానం నా 33 ఏళ్ళకి ఎక్కాను. నా బాల్యంలో ఎన్నడూ విమానాన్ని చూసి ఎరగను. నా సామాజికీకరణలో (సోషలైజేషన్) విమానాశ్రయాలు లేవు. అందుకే ఎన్నిసార్లు విమానంలో ప్రయాణం చేసినా, విమానాశ్రయాల్లో గడిపినా నాకు సహజ సిద్ధంగా, ఆత్మీయంగా అనిపించదు. కృత్రిమంగా, నాకు చెందనిది అసహజమైనదేదో నా మీద రుద్దినట్టే అనిపిస్తుంది. చిన్నపుడు బెజవాడ బస్టాండులో నడుస్తున్నపుడు ఇదే అనుభూతి కలిగేది. అయితే ఇపుడిపుడే నేను వీటన్నింటికీ అలవాటు పడుతున్నాను. పెద్ద నగరాలల్లో నగరాలను తలదన్నే విమానాశ్రయాల్లో యీ పరాయీకరణ అధికంగా వుంటుంది. బాగ్ డోగ్రా, విశాఖ లాంటి విమానాశ్రయాల్లో కొంతలో కొంత నా జీవితానికి ఇవి దగ్గరగా వున్నట్టు అనిపిస్తుంది.

అయితే విమానాశ్రయాల్లో నాకు నచ్చే గుణం ఒకటుంది. అది ప్రవాహ గుణం. అందరూ ఏదో ఒక కదలికలో వుండటం ఏదీ ఎవరి కోసం ఆగకుండా నడుస్తూ వుండటం. ఈ చలనశీలతలో జీవితం వుంది. చలన శీలత, జీవితానికి పర్యాయపదం. బాగ్ డోగ్రా విమానాశ్రయం డార్జిలింగ్ కి, సిక్కింకి వచ్చే యాత్రికులతోనే కాక, చుట్టుపక్కల బెంగాల్, బీహార్ లోని అనేక పట్టణాలకు కేంద్రంగా వుంది. 24 గంటల్లో ఇక్కడున్నంత రద్దీ ఇంకే చిన్న విమానాశ్రయంలో లేదేమో.

ఇపుడు విమానాశ్రయాలు కేవలం ధనవంతులకి మటుకు సేవలందించే స్థలాలు కావు. గత దశాబ్దంలో వచ్చిన అతి పెద్ద మార్పు. ధనిక, మధ్య తరగతి బీద అనే వర్గ బేధం పోయి విమానాలు దూరాన్ని బట్టి అన్ని వర్గాలు వుపయోగించే స్థితి రావడం, అవసరాన్ని బట్టి అందరూ ఉపయోగించే సాధనం కావడం. బాగ్

డోలో వర్గ బేధాలకి అతీతమైన కేవలం ప్రయాణానికి మటుకే ప్రాధాన్యత కలిగిన ప్రవాహ శీలత కనబడింది. జీవితం సమాజం యొక్క అన్ని రంగులూ ఛాయలు అక్కడ పరుచుకుని కనబడ్డాయి.

ముందుగానే ఏర్పాటు చేసుకున్నట్లుగా గాంగ్ టాక్ నించి మమ్మల్ని తీసుకెళ్ళడానికి కారు వచ్చింది. ఇది మేము దిగబోతున్న మాటలు వారి యాత్రా విభాగం ఏర్పాటు చేసింది. తేలిక పాటి మంచుపొర గాలిలో తేలాడుతుంది. ఉదయపు చల్లదనం మమ్మల్ని తాకింది.

హిమాలయాల నించి వీస్తున్న గాలుల ప్రభావమేమో ఆహ్లాదంగా వుంది వాతావరణం. సామాన్ల లోంచి అందరం స్వేట్టర్లని, తీసి వేసుకున్నాం.

గాంగ్ టక్ లో మేము ఎంచుకున్న మాటలు పేరు తాషిడిలిక్. దాదాపు వారం రోజులు సిక్కింలో గడపడానికి మా నిర్ణయం. మా శ్రీమతి, అబ్బాయి హిమాలయాలలో విహరించడం గురించి చాలా కలలు కంటున్నారు అప్పటికే.

మా కోసం వచ్చిన కారు డ్రైవరు పేరు ‘ఇలు’ మా సిక్కిం యాత్రలో మొదట్నించి చివరి రోజు వరకు అతనే అన్ని చోట్లకి మాతో వచ్చాడు.

సిలిగురి నగరానికి శివార్లలో వున్న ఫుడ్ కోర్టు దగ్గర ఆగాం. అక్కడ ‘శాంతా బాంటా’ అనే రెస్టారెంట్ లో ఉదయపు అల్పాహారం చేశాం. సిలిగురి నుంచి గాంగ్ టక్ కి కొండ దారుల్లో ప్రయాణించి ఆలస్యమవచ్చు కాబట్టి బ్రేక్ ఫాస్టు గట్టిగా చేస్తే భోజనం ఆలస్యమయినా, లేక ఎక్కడా కుదరకపోయినా పరవాలేదని నిర్ణయించాం. శాంతాబాంటాలో ఆలు పరాటా,

గోబీ పరాటా, వూరగాయతో పాటు చెన్నా మసాలా రుచి చూసి మా ఆకలి రెండింతలయింది. ఈ మధ్య కాలంలో మేము అంత మంచి పరాఠాలు తిన లేదు. ప్రయాణం హడావిడిలో వున్నా చాలా నింపాదిగా అక్కడి నించి కడుపు నిండా తిని అక్కడ్నించి బయలు దేరాం. కొంత దూరంలోనే తీస్తానది మమ్మల్ని పలకరించింది.

సిక్కిం యాత్ర’కి ఇంకేదేనా పేరు పెట్ట మంటే ‘తీస్తా నది వెంట ప్రయాణం’ అని పెట్టచ్చు. మేము అక్కడ్నించి మొదలు దాదాపు తీస్తా నది పుట్టిన టిబెట్ సరిహద్దుల వరకు ప్రయాణం చేసాము. మేము వెళ్ళిన దారుల ఎక్కువ అన్నిచోట్లా తీస్తానది మాతో ప్రయాణం చేస్తూనే వుంది.

హిమాలయ పర్వత సానువుల్లో ఒక నదీ మూలం వెతుక్కుంటూ మేము చేసిన ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే అత్యంత అద్భుతంగా అనిపిస్తోంది. కానీ, ప్రయాణం చేస్తున్నప్పుడు మటుకు అంత ఎత్తు కొండదారుల్లోంచి లోయలో పరిగెడుతున్న నదిని చూస్తే చాలా భయం గొలిపేలా అనిపించింది. ఒకపక్క అందం ఇంకోపక్క భయం ఇవి రెండు కలగలిసిన వింత అనుభవం.

నేను చూసిన మిగతా పర్వతాలకీ హిమాలయాలకీ వున్న ముఖ్య బేధం ఒక్క మంచు వుంటమే కాదు.

హిమాలయాలలో ఎక్కువ కొండలు నిటారుగా దాదాపు గోడలంత నిట్టనిలువుగా వుంటాయి.

అంటే దాదాపు 90 డిగ్రీల నిలువు. దీని వలన హిమాలయాలలో కొండల మీది రాళ్ళు దొర్లడం మట్టి పెళ్ళలు జారిపోతూ వుండటం ఎక్కువ. ఇది వర్షాకాలంలో మరీ ఎక్కువ. నీళ్ళ ప్రవాహం వున్న చోట అన్ని కాలాల్లో ఈ రాళ్ళు మట్టి జారి రోడ్లు పూడిపోడం, జారిపోవడం ఎక్కువ. అందుకే హిమాలయాలలో ప్రయాణం ఎంత అద్భుతమో అంత భయంగొలిపేది కూడా. ఇక మంచు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో పైన చెప్పిన విషయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుచేత హిమాలయాల సందర్శనకు వానాకాలం కాకుండా చూసుకోవడం ముఖ్యం.

తీస్తానది పక్కనే మేము వెళ్తున్న రహదారి సహవాసం మొదలు పెట్టిన వెంటనే ఒక పెద్ద ‘టి’ ఆకారంలో వున్న వంతెనకి కారనేషన్ బ్రిడ్జి అని పేరు ఈ వంతెన మీద నుంచి జలపాయగురి, గౌహతికి వెళ్ళే రహదారి చీలిపోతుంది. ఈ రహదారి భారతదేశాన్ని ఈశాన్య భారతంతో కలిపే అతి ముఖ్య రహదారి. ఈ వంతెన నించి కుడివేపు మళ్ళితే ఈశాన్య భారతం, నేరుగా వెళితే సిక్కిం దారి.

ఈ కారనేషన్ వంతెనకి వెళ్ళే దారిలో కొండ మీద నించి రాళ్ళు ఎక్కువగా దొర్లే ఒక ప్రాంతం వుంది. ఇక్కడ ద్విచక్ర వాహనాల మీద వెళ్ళే వాళ్ళకి ప్రాణాపాయం కూడా వుండేంత ఎక్కువగా పర్వతాలు మీంచి రాళ్ళు పడటం వుంది.

ఈ ప్రాంతంలో తీస్తా నదికి ఒక డామ్ లాంటిది కట్టారు. తీస్తా నది ఈ ప్రాంతం తర్వాత బంగ్లాదేశ్ కి వెళ్లి అక్కడ బ్రహ్మపుత్రలో కలుస్తుంది.

ఈ ప్రాంతంలో తీస్తానది అత్యంత విశాలంగాను నది నీళ్ళు లేత నీలం రంగులో కనువిందు చేస్తూ కనబడ్డాయి. ఈ నది ఒడ్డున దగ్గరికి వెళ్ళద్దు, ప్రమాదకరం అనే బోర్డులు చాలా కనబడ్డాయి.

కారనేషన్ వంతెన దాటగానే కొద్ది దూరంలోనే ఎడం వేపు ‘మంగ్ పు’ 12 కి.మీ అని బోర్డు కనబడింది. ‘మంగ్ పు’ లో టాగోర్ రవీంద్ర భవన్ వుంది. తన జీవన చరమాకంకంలో విశ్వకవి చాలా కాలం అక్కడే గడిపాడు. మే నెలలో నేను డార్జిలింగు వెళ్లినపుడు ‘మంగు’ కూడా చూసాను.

సిలిగురి మైదాన ప్రాంతం. అక్కడ్నించి గాంగ్టక్ 124 కి.మీటర్ల దూరం సుమారు 5500 అడుగుల ఎత్తులో వుంది. సిక్కిం రాజధాని డిశంబరు నుంచి మార్చి వరకు మంచు చూడ్డానికి వచ్చే యాత్రికులతో కిటకిట లాడుతుంది.

మంగ్ ఫు మంచి ఇంకొంచెం దూరం ప్రయాణించాకా తీస్తానది మీద ఒక పెద్ద వంతెన వుంది. ఈ ప్రాంతాన్ని తీస్తా బజార్ అంటారు. ఇక్కడ్నించి డార్జిలింగ్ కి వెళ్ళే దారి విడిపోతుంది. అక్కడ్నించి ఇంకొంచెం దూరం ప్రయాణించగానే కుడి వేపు “కాళింపాంగ్” వెళ్ళే దారి కనబడుతుంది.

కాళింపాంగ్ బెంగాల్ లోని గుర్ఖాలాండ్ కౌన్సిల్ లో డార్జిలింగ్ తర్వాత ముఖ్యమైన పట్టణం. మంగ్ పు

నించి వైద్యానికి టాగోర్ ని చిట్ట చివరి దశలో కాళింపాంగ్ కి తీసుకెళ్ళారు. కాళింపాంగ్ కూడా డార్జిలింగ్ లాగానే అత్యంత సుందరమైన ప్రాంతం. టిబెటన్ మోనాస్టరీలు, ఉద్యానవనాలతో పాటు టిబెట్ కి అతి దగ్గరగా వున్న ప్రాంతం. టిబెట్ సంస్కృతి ప్రభావం విస్తృతంగా ఇక్కడ చూడవచ్చు. భూటాన్ కి కూడా అతి దగ్గరగా వుంది.

ఇప్పటికే కాళింపాంగ్ గురించి చాలానే విన్నాను. కాళింపాంగ్ కు వెళ్ళే దారి విడిపోతున్నప్పుడు ఎప్పుడైనా భవిష్యత్తులో కాళింపాంగ్ లో వెళ్ళాలనే కోరిక కలిగింది.

రాహుల్ సాంకృత్యాయన్ కి ఇష్టమైన ప్రదేశం కాళింపాంగ్. ఆయన టిబెట్ మీద చేసిన అనేక పరిశోధనలకి, ప్రయాణాలకి కాళింపాంగ్ ముఖ్య మజిలీగా నిలిచింది.

అక్కడ్నుంచి కొంచెం దూరంలోనే ‘మెల్లి’ అనే వూరు వుంది. ఇక్కడ తీస్తానది మీద రివర్ రాఫ్టింగ్ తెప్ప మీద నదిలో ప్రయాణం చాలా ప్రసిద్ది చెందినది. రబ్బరు గాలి బెలూన్ల లాటి తెప్పల్లో ఎంతో మంది విదేశీయులు మంచు అపుడే కరిగిన తెల్లని నీళ్ళల్లో కుటుంబ సమేతంగా రివర్ రాఫ్టింగ్ కోసం బారులు తీరడం కనిపించింది. బహుశ మెల్లి నుంచి తీస్తా బజార్ వరకు తెప్ప మీద ప్రయాణం. చాలా సురక్షిత మైనదిగా కూడా అనుకోవచ్చు. తీస్తా మీద తెప్ప మీద ప్రయాణం ఎలా వుంటుందో తెలియదుగానీ చిన్నప్పటి జ్ఞాపకం ఒకటి గుర్తొచింది. ధవళేశ్వరం బారేజీ కడుతున్నప్పుడు మా నాన్నగారు నది మధ్యలో నిర్మాణ స్థలంలో పని చేశారు. అపుడపుడు ఆయనకి క్యారేజీ తీసుకుని పడవలో వెళ్ళి ఇచ్చి వస్తూ వుండేవాడ్ని. ఆ పడవలు చిన్న నాటు పడవే అయినా నెమ్మదిగా నది మీద కదిలి వెళుతుంటే దృశ్యం అద్భుతంగా వుండేది.

ఎపుడైనా కుదిరితే మళ్ళీ వచ్చి తీస్తానది తెప్పమీద ‘మెల్లి’ నుంచి తీస్తా బజార్ వరకు ప్రయాణించాలనే కోరిక కలిగింది. తెల్లని చల్లని తీస్తా నీళ్ళు ఎగిరెగిరి మీద పడుతుంటే తెప్ప ప్రయాణం నది దారుల్లో ఎలా వుంటుందో చూడాలి.

అక్కడ్నుంచి మేమెక్కిన కారు కొంచెం దూరంలోనే ‘రంగ్ పు’ అనే వూరు చేరింది. పశ్చిమ బెంగాల్ సరిహద్దులు దాటి అక్కడే మేము సిక్కింలోకి ప్రవేశించాం. సిక్కింకి ఆహ్వానం పలుకుతూ ఒక ముఖ ద్వారం మమ్మల్ని పలకరించింది.

‘ఇలు’ మా కారు డ్రైవరు సిక్కింలోకి ప్రవేశించగానే సీటు బెల్టు తీశాడు. మేము అవాక్కయాం. సిక్కింలో సీటు బెల్టు అక్కరలేదు. ఇక్కడ ఎక్కువ రహదార్లు పర్వత ప్రాంతాల్లో ఎత్తులో వుంటం వలన సీటు బెల్టు వలన ప్రమాదం జరిగినపుడు తప్పించుకోడానికి మార్గం లేక ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పాడు. ఇదో కొత్త కోణం.

సిక్కింలో ప్రవేశించిన తర్వాత ముందుకన్నా అభివృద్ధి పరిశ్రమలు విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు వరసగా కనబడ్డాయి.

హిమాలయ పర్వత సానువుల్లో వున్న ప్రగతిశీల పురోగతి చెందిన రాష్ట్రంలోకి ప్రవేశించిన భావన కలిగింది. ఒక పక్క ప్రకృతి సౌందర్యం, ఇంకో పక్క అభివృద్ధి కలగలసి కనబడ్డాయి. ఎక్కడా వెనకబాటుతనం కనబడలేదు.

(ఇంకా వుంది)

ఆకెళ్ళ రవిప్రకాష్

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నేను కూడా కుటుంబ సభ్యులతో కలిసి 2010లో ఎల్టీసీ మీద సిక్కిం చూసొచ్చాను. అద్భుతమైన అనుభవం. మీరిప్పుడు వివరంగా రాస్తుంటే మళ్ళీ ప్రయాణం చేస్తున్నట్లుంది. యాత్రా కథనం ప్రత్యేక సాహిత్య ప్రక్రియ. దృశ్య వివరణలోనే భౌగోళికం, చరిత్ర, సమాజం వివరాలు రావాలి. అప్పుడే పాఠకుడు పూర్తిగా మమేకం కాగలడు. మీరలాగే రాస్తున్నారు.

  • మీ తీస్త నది వెంట ప్రయాణము చాల బాగుంది ఎంత అంటే నేను మీకూడ నడిచి ప్రయాణము చేస్తున్న అనుభవము నాకు కార్ ఏసి బస్ ఇలాంటి ప్రయాణసాధనాలు అస్సలు పడవు అందుకే మీ వెంట నడుస్తున్నా- తీస్తానది అనుభవాన్ని నా మనస్సుతో చూస్తున్నా–

  • చాలా బాగా వ్రాశారు రవిప్రకాష్ గారు. కళ్ళకు కట్టినట్లు వ్రాయటమే యాత్రాకథనాలకు బలాన్నిస్తుంది.అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు