చెన్నై Pub! ఒక రౌండప్ – భాగం 6

ర్దరాత్రి 2 తర్వాత..

అర్ధరాత్రి గంట రెండు దాటాక, మత్తు తలకెక్కాక, సిగ్గు బిడియం విడిచిపోయాక, అమ్మాయిల స్వేచ్ఛా ప్రపంచం చూడడానికి విచిత్రంగా ఉంటుంది. ప్రియుడితోనో, భర్తతోనో వచ్చి అప్పటిదాకా బెరుగ్గా వేలాడుతూ ఉన్న అమ్మాయిలు ఇక అప్పుడు తన ప్రియుణ్ణో భర్తనో దగ్గరకు లాక్కుని రొమాన్స్ చేస్తారు. వాడేమో అయిష్టంగా, పట్టించుకోకుండా, ఏదో తప్పదన్నట్టు ఆమెకు కంపెనీ ఇస్తుంటాడు. ఆమేమో పీకలదాకా తాగి ఎదలో పొంగి పొరలే ప్రేమతో పరవశించి పోతూ డాన్స్ చేస్తూంటుంది. అతనికెందుకో అది నచ్చదు. వాడి చూపు అక్కడున్న మిగతా అమ్మాయిల మీద ఉంటుంది. అంటి పెట్టుకుని ఉన్న ప్రేయసో పెళ్ళామో పెద్ద థ్రిల్ కాదని తెలిపే దృశ్యం అది. ఈ లోపు ఎవరో కొందరు చిన్నపాటి సెలిబ్రిటీలు వచ్చి హడావిడి చేసి వెళ్ళిపోతారు.

దీన్ని పబ్ హాప్పింగ్ అంటారు – అర్ధరాత్రి తర్వాత ఒక్కో పబ్బుకూ వెళ్ళి ఓ రౌండ్ తాగి, కొందరికి హాయ్ చెప్పి, కొన్ని ముద్దులు విసిరి, చివర్లో మత్తెక్కి ఎవరితోనో సెటిల్ అవుతారు ఈ సెలిబ్రిటీలు. జనం మూడ్ ని గ్రహించి, పబ్బు చివరి పాట ప్లే చేస్తారు. ఆ పాట అన్ని రకాల పాటలనూ కలిపిన కలగాపులగంలా ఉంటుంది. ఇప్పుడు దయ్యం పూనినవారికి మల్లే డాన్స్ చేస్తారు. చివరిదాకా కూలబడకుండా నిలబడినందువల్ల కొందరికి కొందరమ్మాయిల హగ్గుల దొరకవచ్చు. కొన్ని ముద్దుల కూడా. మత్తు పుణ్యమా అని దక్కిన అదృష్టాలివి.

ఇక్కడింత ఖర్చు పెట్టిన వాళ్ళు, పబ్బు నుండి బయటకొచ్చి ఆటోవాళ్ళతో ఇరవైకీ, ముప్పైకీ అంత మత్తులో కూడా బేరాలాడుతూ ఉండటం చూస్తే వీళ్ళు నిజ జీవితపు మెలకువలోకి వచ్చేశారన్నది తెలిసిపోతుంది. చివరికి తెలిసొచ్చేదేంటంటే పబ్బులో ఎటువంటి ఊహించని వింతా జరగదన్నదే. నిజానికి చాలా మందికి అదొక బాధగానే మిగులుతుంది. మరుసటి రోజు చిరాకుగానే తెల్లారుతుంది. పబ్బుని ఆస్వాదించాలంటే తన జంటతో మందు తాగి, కాసేపు తనివితీరా డాన్స్ చేసి రావడానికే వెళ్ళాలి. మరేదో ఆశించి కాదు.
మంచి మందు, మంచి సంగీతం, కాస్త డాన్స్ అంటూ మితంగా ఆస్వాదించి సమయం మించకుండా ఇల్లు చేరుకుంటేనే పబ్బు అనుభవం సుఖమయమవగలదు. వేట కుక్కలా పబ్ హంటింగ్ అని వెళ్తే బాధే మిగులుతుంది. అమ్మాయిలు, మగవాళ్ళలా వైను షాపుల్లో మందు కొని తాగలేకే పబ్బుకొచ్చి తాగుతున్నారు. రిలాక్స్ అవ్వడానికీ, మందు మత్తుకోసమే వాళ్ళు పబ్బుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఉండటమే వాళ్ళకు చేసే పెద్ద ఉపకారం. పబ్బుకొచ్చిన అమ్మాయిని అదే పనిగా మింగేసేలా చూడటం, వాళ్ళను గోకడం, ఆమె సెక్స్ కోసం వస్తుందన్న దృష్టితో అప్రోచ్ అవ్వడం వంటివి వారి స్వాతంత్రానికి, స్వేచ్ఛకీ విరుద్ధమైన చర్యలు.

ఇన్ని ఇబ్బందులు భరించగలిగితేనే అమ్మాయిలు పబ్బులకొచ్చి మందు కొట్టగలరన్నది మన చెన్నైకి ఎంత అవమానమో ఆలోచించాలి. చెన్నై పబ్ నైట్ లైఫ్ ముగించుకుని అందరూ ఇళ్ళు చేరుకుని మంచాన పడే ఈ సమయంలో ఈ శీర్షికను ముగించేయొచ్చు. అయితే, ఓ విషయం, చెన్నై పబ్బులు పొద్దున పదకొండు గంటలకే తెరుస్తారు. పద్దెనిమిదేళ్ళకు పైబడిన వాళ్ళే లీగల్ గా లోనికి ప్రవేశించ గలరు. బడి, జూనియర్ కాలేజి పిల్లలకు అనుమతి ఉండదు. జూనియర్ కాలేజీల్లో చదివే హై సొసైటీ పిల్లలు కొందరు పగటి వేళే చెన్నై పబ్బుల్లో చూడగలము. జూనియర్ కాలేజీల్లో బళ్ళలో ఇలాంటి గ్యాంగులు కొందరుంటారు. ఆ గ్యాంగ్ లీడర్ పబ్బు మేనేజర్ ని మచ్చిక చేసుకుని ప్రైవేటు పార్టీ పేరిట పబ్బునంతా మొత్తంగా బుక్ చేసుకుని రహస్యంగా ఆన్లైన్ గ్రూపుల్లో బళ్ళలో, జూనియర్ కాలేజీల్లో టిక్కెట్లమ్మి పగటి వేళ పబ్బుల్లో పార్టీలు చేసుకుంటుంటారు.

వీళ్ళ పార్టీల్లో అడపా దడపా గొడవలు కొట్లాటలు కూడా జరుగుతాయి- అంటే వ్యాపార పరమైన కొట్లాటలు. గ్యాంగులలోనే జరుగుతాయి. ఇవేవీ బయటకు రావు.

పగలంతా తాగి మజా చేసేసి సాయంత్రం ఐదింటికి ఇంటికొచ్చి తలనొప్పి అని బెడ్డెక్కి నిద్రపోతారు.  ఇందులో చాలా డబ్బు చేతులు మారుతుంటుంది.  ఇటువంటి ప్రైవేటు పార్టీల్లో ముద్దులు, హగ్గులు అని మొదలయ్యి కొన్ని సంభోగందాకా వెళ్తాయి. విద్యార్థులకు మత్తెక్కితే? చిన్న వయసు, వేడి రక్తం కదా? అయితే పేద పిల్లల్లా వీళ్ళు అమాయకంగా జీవితాలను నాశనం చేసుకోరు.  మంచి కాలేజీల్లో చేరి, విదేశాలకెళ్ళి ఓ రేంజిలో సెటిల్ అవుతుంటారు. కొందరు ఐక్యరాజ్య సమితి దూతలుగా కూడా ఎదుగుతారు.

(సమాప్తం)

అనువాదం: అవినేని భాస్కర్

* * *

 

 

అరాత్తు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు