చెడుగుడు

 “హల్లో నాకు కార్డియాలజిస్ట్ డాక్టర్ విలియమ్స్ గార్ని చూడ్డానికి ఎప్పుడు కుదురుతుంది?”

“ఏ విలియమ్స్ గారు కావాలి మీకు? ఇక్కడ హరాల్డ్ విలియమ్స్, హోబార్ట్ విలియమ్స్ అని ఇద్దరున్నారు.”

“అన్నదమ్ములా?”

“కాదు తండ్రీకొడుకులు.”

“అయితే ఎక్స్ పీరియన్స్ ఉన్న పెద్దాయనదే చూడండి.”

“పదహారో తారీఖున మధ్యాహ్నం మూడున్నరకి ఉంది ఖాళీ, లేదా మరో రెండు నెలలదాకా ఏమీ లేదు.”

“అవునా, ఓ, అయితే పదహారునే ఖాయం చేయండి.”

“మీ ఇన్స్యూరెన్స్ ఏమిటి, కో పే ఇప్పుడు కడతారా, ఎక్కడ పనిచేస్తున్నారు, ఇంటి ఎడ్రస్, సోషల్ అన్నీ ఇవ్వాలి ఇప్పుడు దీన్ని ఖాయం చేయడానికి.”

“సరే రాసుకోండి చెప్తాను. పేరు జేమ్స్ ఏండర్సన్, వయసు నలభై ఆరు…. …. …. ….”

“అన్నీ రాసాను. మీ అపాయంట్ మెంట్ పదహారో తారీఖున మధ్యాహ్నం మూడున్నరకి.  ఒక అరగంట ముందు రండి, కాయితాల మీద సంతకాలకీ దానికీను.  సుఖ వారాంతం.”

* * * * * *

“పేరు, డాక్టర్ హరాల్డ్ విలియమ్స్, మీరు వచ్చినందుకు సంతోషం. చార్ట్ లో మీ పేరు జేమ్స్ అని ఉంది. మొదటిసారి వచ్చిన్నట్టున్నారు, ఏమిటి సమస్య?”

“ఒక నాలుగు నెలలబట్టీ నీరసం, నిద్రలేమి, కళ్ళు తిరగడం అనేవి ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ లో గ్లూకోజ్ రెండు వందలకి పైన, రక్త పోటు అధికం అని చెప్పారు. మందులు వాడినా అంత తగ్గినట్టు లేదు. మిమ్మల్ని కలవమని మా డాక్టర్ చెప్తే వచ్చాను.”

“అవునా రక్త పరీక్ష నాకు పంపారు; ఒక్క నిముషం చూడనీయండి…..”

“….  ….  ….”

“మందులు రోజూ వాడుతున్నారా? ఆఫీసులో ఏదైనా గొడవలు ఉన్నాయా? ఏం పని చేస్తూంటారు మీరు?”

“కంప్యూటర్ మీద ప్రోగ్రామింగ్, మిగతా నెట్ వర్క్ పనులు.”

“అవి అంత స్ట్రెస్ కలిగించే పనులా?”

“కాదు కానీ ఒక కుర్రాడితో పనిచేయాలి. వాడికి ఏమీ రాదు. నేను నేర్పుదామని చూస్తే నేర్చుకోడు. రోజూ గొడవపడవల్సి వస్తోంది.”

“మీరు ఆయనా మీ బాస్ తో కలిసి కూర్చుని చర్చించుకోవచ్చు కదా?”

“అదీ అయిందండి. నేను చెప్పేవన్నీ రూడ్ గా అనిపిస్తున్నాయిట, నన్నందరూ అసహ్యించుకుంటారుట, కాస్త మామూలుగా మాట్లాడవచ్చు కదా, అందరితోనూ దెబ్బలాటలు ఎందుకు, మీరు నాతో మాట్లాడే భాషకీ మిగతా కస్టమర్లతో మాట్లాడే భాషకీ తేడా ఉంది అది గమనించారా? అని బాస్ ముందు అన్నాడు నాతో ఆయన.”

“మీరు రూడ్ గా ఉంటారా?ఆ భాష తేడా గమనించారా?”

“నేను కొంచెం అలా ఉండొచ్చేమో కానీ మరీ అంత కాదనుకుంటున్నాను. ఈయన్ని వదిలించుకుంటే తప్ప నా ఆరోగ్యం బాగుపడదేమో. ప్రస్తుతానికి ఏమి చేయమంటారు?”

“బాస్ ని అడిగి చూసారా? పని చేయకపోతే ఎవరినైనా ఉద్యోగంలోంచి తొలగిస్తామని చెప్తారు కదా సాధారణంగా?”

“ఆ కుర్రాడి మీద ఇప్పటివరకూ పది సార్లు కంప్లైంట్ ఇచ్చాను. ఆయనేమీ చేయలేదు.”

“అదేమిటి? చాలా ఆశ్చర్యంగా ఉందే?”

“కర్ణాకర్ణిగా విన్న విషయం ఏమిటంటే, “నేను ఇప్పటివరకూ మునపటి ఉద్యోగులమీదా, ఈయన మీదా కంప్లైంట్ ఇచ్చాను. అందువల్ల ఏసోప్ కధలో ‘పులి పులి’ అనే అరుపులాగా తయారైంది. నేను ఏమి చెప్పినా ఎవరూ పట్టించుకోవట్లేదు.”

“సరే అదలా ఉంచండి. మీ కుటుంబంలో గుండె జబ్బులూ, స్ట్రోక్ వచ్చినవాళ్ళెవరైనా ఉన్నారా?

“అంత సరిగ్గా తెలియదు. తల్లీ తండ్రీ కేన్సర్ తో పోయారు.”

“సరే ఇలా పడుకోండి. మీ గుండె సంగతి చూద్దాం. …”

“….  ….  ….”

“….  ….  ….”

“లేవవచ్చు. రెండు విషయాలు. మీ ఆరోగ్యం మరీ అంత చెడ్డగా లేదు. గుండె గురించి ఎందుకైనా మంచిది ఒకసారి స్ట్రెస్ టెస్టూ, స్ట్రెస్ ఎకో అనేవి చేయిద్దాం. అందులో ఏదైనా తెలిస్తే ఏమి చేయాలో ఆలోచిద్దాం. బయట రెసెప్షనిస్ట్ ని కలిసి ఎప్పుడు ఈ టెస్ట్ లకి టైమ్ కుదురుతుందో చూడండి మా లేబ్ లోనే ఇక్కడే చేయవచ్చు అన్నీ. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం.”

“ప్రస్తుతం నా ఆరోగ్యం ఎలా ఉన్నట్టు లెక్క? గుండె పోటు వచ్చే ఛాన్స్ ఉందా?”

“రక్తపోటు ఎక్కువగా ఉంది. అదొకటి, సుగర్ ఎక్కువ అనేదొకటి. బరువు కొంచెం ఎక్కువగానే ఉన్నారు. రోజూ ఎక్సర్ సైజు చేస్తారా?ఒక్క మందులతోనే అన్ని చక్కబడవు కదా? గుండె పోటు ఎవరికైనా ఎప్పుడైనా రావొచ్చు.”

“అంత టైము లేదండి ఎప్పుడైనా నడుస్తాను. ఈ మధ్యన ఈ కొలీగ్ వల్ల మరింత టెన్షన్. రోజుకి పదీ పన్నెండు గంటలు పని ప్రోజెక్ట్ అయ్యేదాకా. అదెప్పుడౌతుందా, వీణ్ణి ఎప్పుడు వదుల్చుకుందామా అని చూస్తున్నాను.”

“సరే, టెస్ట్ లు చేసాక మళ్ళీ మాట్లాడదాం. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా?”

“ప్రస్తుతానికి లేవు. థాంక్ యూ”

* * * * * *

“హల్లో నాకు కార్డియాలజిస్ట్ డాక్టర్ విలియమ్స్ గార్ని చూడ్డానికి ఎప్పుడు కుదురుతుంది?”

“ఏ విలియమ్స్ గారు కావాలి మీకు? ఇక్కడ హరాల్డ్ విలియమ్స్, హోబార్ట్ విలియమ్స్ అని ఇద్దరున్నారు.”

“అన్నదమ్ములా?”

“తండ్రీకొడుకులు. పెద్దాయన కొత్త పేషేంట్లని తీసుకోవడం లేదు. హోబార్ట్ గారిని చూడాలంటే పదో తారీఖున పొద్దున్న పదిన్నరకి ఉంది ఖాళీ, లేదా ఇరవై రెండో తేదీన, ఇరవై నాలుగున మధ్యాహ్నం రెండింటికి.”

“ఓ…. …. …. సరే ఇరవై రెండున మధ్యాహ్నం రెండింటికి ఖాయం చేయండి.”

“మీ ఇన్స్యూరెన్స్ ఏమిటి, కో పే డబ్బులు ఇప్పుడు కడతారా, ఎక్కడ పనిచేస్తున్నారు, ఇంటి ఎడ్రస్, సోషల్ అన్నీ ఇవ్వాలి ఇప్పుడు దీన్ని ఖాయం చేయడానికి.”

“సరే రాసుకోండి చెప్తాను. పేరు మయాంక్ నటరాజన్, వయసు ముప్ఫై ఎనిమిది …. …. …. ….”

“అన్నీ రాసాను. మీ అపాయంట్ మెంట్ ఇరవై రెండున మధ్యాహ్నం రెండింటికి.  ఒక అరగంట ముందు రండి, కాయితాల మీద సంతకాలకీ దానికీను.“

* * * * * *

“పేరు, డాక్టర్ హోబార్ట్ విలియమ్స్, మీరు వచ్చినందుకు సంతోషం. చార్ట్ లో మీ పేరు మయాంక్ అని ఉంది. మీరు వచ్చినది ఇండియా నుంచి  వచ్చిన్నట్టున్నారు అనుకుంటున్నాను, ఏమిటండి సమస్య?”

“అవును వచ్చినది ఇండియానుంచే. ఒక నాలుగు నెలలబట్టీ నీరసం, కళ్ళు తిరగడం అనేవి ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ లో గ్లూకోజ్, రక్త పోటు కొంచెం పెరిగినట్టు చెప్పారు. మందులు ఏమీ వాడడం లేదు. మిమ్మల్ని కలవమని మా డాక్టర్ చెప్తే వచ్చాను.”

“అవునా రక్త పరీక్ష నాకు పంపారు; ఒక్క నిముషం చూడనీయండి…..”

“….  ….  ….”

“ఆఫీసులో ఏదైనా గొడవలు ఉన్నాయా? ఏం పని చేస్తూంటారు మీరు?”

“కంప్యూటర్ మీద ప్రోగ్రామింగ్, మిగతా నెట్ వర్క్ పనులు.”

“అవి అంత స్ట్రెస్ కలిగించే పనులా?”

“కాదు కానీ ఒక టీమ్ లీడ్ తో పనిచేయాలి. ప్రతీదానికీ తప్పులెన్నే రకం; రోజూ గొడవపడవల్సి వస్తోంది. ఎంత కరక్ట్ గా చేసినా అది తప్పే. ఇప్పటివరకూ ఆయన మొహంలో నవ్వు అనేది చూడలేదు నేను.

“మీరు ఆయనా మీ బాస్ తో కలిసి కూర్చుని చర్చించుకోవచ్చు కదా?”

“అయిందండి. ఉద్యోగం అంత కష్టం కాదు. కానీ ఈ జేమ్స్ ఏండర్సన్ గారు సులభంగా సంతోషంగా నవ్వుకుంటూ చేయగలిగే అన్నింటినీ అతి కష్టంగా మార్చగల సమర్ధుడు. ఒక్కోసారి ఈయన టేక్స్ డిపార్ట్ మెంట్ నుంచి వచ్చాడా అని అనుమానం కలుగుతుంది నాకు.  బాస్ ముందు కూర్చుని నేను అన్నీ క్లియర్ గా చెప్పాను, ‘జేమ్స్ గారూ మీకు మంచి నాలెడ్జ్ ఉంది. నేను మీ దగ్గిర్నుంచి నేర్చుకోవడానికి సిద్ధం. నాకు వచ్చినది ఇది. రానివి అడుగుతాను. ఇద్దరం కలిసి సంతోషంగా పనిచేయవచ్చు. ఇదొక విన్-విన్ పరిస్థితి నాకు’ అని.  అయితే  ‘ఇవన్నీ నీకు ముందే తెల్సి ఉండాలి; నేను నీకి నేర్పేదేమిటి? నిన్ను ఎవడు ఉద్యోగంలోకి తీసుకున్నాడో వాడిని అనాలి’ అని అరిచాడు, నాతో ఆయన.”

“మీ బాస్ కలగజేసుకోరా?”

“మా బాస్ చెప్పాడు. ఈ మయాంక్ ని ఉద్యోగంలోకి తీసుకున్నది నేనే. కాస్త జాగ్రత్తగా మాట్లాడు అన్నాడు ఆయన్తో. దాంతో మరింత కోపం వచ్చినట్టుంది. మర్నాటి నుంచి ఎక్కువ గొడవపడుతున్నాడు నాతో. ఆయన పంపే ఈమెయిల్ లో రూడ్ గా ఉంటుంది భాష. ఆ తేడా కూడా చూపించాను. కొంతమంది కష్టమర్లు కూడా ఏండర్సన్ గారి గురించి చెప్పారు. కానీ ఆయన టీమ్ లీడ్ కనక ఎవరూ ఏమీ చేయలేరు. ఆయన వంటి మీద ఈగ వాలదు.”

“ఇటువంటివి సాధారణంగా కూర్చుని మాట్లాడుకుంటే సర్దుకోవూ?”

“ఆయన నా మీద ఇప్పటివరకూ పది సార్లు కంప్లైంట్ ఇచ్చాడు. మొదటి రెండూ మూడు సార్లు బాస్ నన్ను పిల్చి మాట్లాడేడు. నేను చెప్పాను, ‘ఈయన అంతేనండి, మరీ ఎలిమెంటరీ స్కూల్లో కుర్రాడిలాగా ‘వా, నా చాక్లెట్ లాగేసుకున్నాడో’ అని ప్రతీదానికీ ఏడిచే రకం. బాస్ తో అదే చెప్పాను కూడా. ఆయన కూడా నేను చెప్పినది విని నవ్వి ఊరుకున్నాడు.

“ఆశ్చర్యంగా ఉందే?”

“అంతటితో అయిందా, ఆయన ఈ గిల్లికజ్జాలు చూడలేక, వినలేక కాబోలు మా ఇద్దరికీ ఉన్న బాస్ వేరే ఉద్యోగంలోకి మారాడు. ప్రస్తుతానికి మాకు బాస్ లేడు, ఎవర్నో ఒకర్ని ఏక్టింగ్ బాస్ గా వేసారు, కొత్తాయన వచ్చేదాకా.”

“మీ కుటుంబంలో గుండె జబ్బులూ, స్ట్రోక్ వచ్చినవాళ్ళెవరైనా ఉన్నారా?

“ఎవరికీ లేదు కాని డయాబెటిస్ ఉంది. రోజూ రెండుపూట్లా తినేది ఉడకేసిన తెల్లటి అన్నం కదా?”

“హా, హా అవును సరే ఇలా పడుకోండి గుండె సంగతి చూద్దాం. …”

“….  ….  ….”

“….  ….  ….”

“సరే లేచి కూర్చోండి. మీ గుండెలో పైకి ఏమీ లోపం ఉన్నట్టులేదు కానీ ఎందుకైనా మంచిది ఒకసారి స్ట్రెస్ టెస్టూ, స్ట్రెస్ ఎకో అనేవి చేయిద్దాం. అందులో ఏదైనా తెలిస్తే ఏమి చేయాలో ఆలోచిద్దాం.”

“నాకు గుండె పోటు వచ్చే ఛాన్స్ ఉందా?”

“రక్తపోటు సుగర్ కొంచెం ఎక్కువే; వాటిని మందులతో సరిచేయవచ్చు. ఒక్క మందులతోనే అన్ని చక్కబడవు కదా? గుండె పోటు ఎవరికైనా ఎప్పుడైనా రావొచ్చు. ప్రస్తుతం మీ ఆరోగ్యం, మీరు చూపించిన టెస్టులు  ప్రకారం చూస్తే అప్పుడే ఏమీ కంగారు పడకండి. ఎక్సర్ సైజు చేస్తారా?”

“రోజూ తప్పనిసరిగా ఒక రెండు మైళ్ళు నడుస్తాను. ఈ కొలీగ్ వల్ల కాస్త టెన్షన్ తప్ప మరేం లేదు. రోజుకి పదీ పన్నెండు గంటలు పని. ఈ కోవిడ్ వల్ల ఇంట్లోంచి పని కనక కాస్త బరువు పెరిగానని చెప్పుకోవాల్సిందే.”

“సరే, టెస్ట్ లు చేసాక మళ్ళీ మాట్లాడదాం. ఇంకేమైనా ప్రశ్నలున్నాయా?”

“ప్రస్తుతానికి లేవు. థాంక్ యూ”

“చిన్న ప్రశ్న ఏమీ అనుకోనంటే, మయాంక్ అనే మీ పేరుకి అర్ధం ఏమిటి?”

“షైనిన్ంగ్ మూన్”

“భలే పేరు. మళ్ళీ కలుద్దాం, హావ్ ఎ గుడ్ వన్.”

* * * * * *

“ఏరా అబ్బాయ్ ఈ రోజు విశేషాలేమిటి?”

“ఒక ఇండియన్ వచ్చాడు. ఇండియన్స్ అందర్లాగే కంప్యూటర్ల మీద పనిచేస్తాట్ట. టీమ్ లీడ్ రోజూ గొడవపెడుతున్నాడనీ అందువల్ల టెన్షన్ పెరుగుతోందనీ కాస్త ఛాతీ నెప్పి అనీ వచ్చాడు. నవ్వొచ్చింది, గుండెలో ఏమీ లోపం లేదని తెల్సినా, స్ట్రెస్ టెస్ట్ అదీ చేయించమని చూద్దాం ఏముందో అని చెప్పాను. మిగతా కేసులన్నీ రొటీన్.”

“ఏమిటి పేరు? ఎక్కడ పనిచేస్తాడో తెలుసా?”

“వింతైన పేరు. మయాంక్ అని చెప్పాడు. మయాంక్ అంటే షైనింగ్ మూన్ అని అర్ధం ట. పనిచేసేది మన ఊర్లో ఉన్న జెన్ సాఫ్ట్ వేర్ కంపెనీలోనే. టీమ్ లీడ్ ఇచ్చే కంప్లైంట్ లు వినీ వినీ వాళ్ళ బాస్ వేరే ఉద్యోగం చూసుకున్నాట్ట.”

“జేమ్స్ ఏండర్సన్ అనేపేరు వినిపించిందా?”

“అవును అదే పేరు చెప్పాడు టీమ్ లీడ్ అని. మీకెలా తెల్సింది?”

“ఏమి ఇన్స్యూరెన్స్ కంపెనీ?”

“బ్లూ స్టార్ బ్లూ క్రాస్”

“ఆ జేమ్స్ ఏండర్సన్ నాదగ్గిరకొచ్చాడులే. అందుకే అడిగాను.”

“ఆయనకేమైనా గుండె జబ్బా?

“గుండె జబ్బూ లేదు గాడిదగుడ్డూ లేదు. ఇద్దరు మనుషులు ఒకర్నొకరు నిరంతరం ద్వేషించుకుంటూ ఒకేచోట పనిచేస్తే ఇలాగే ఉంటుంది జీవితం. జేమ్స్ గారికి ఎవరూ నచ్చరు. ఆయన నోటికొచ్చినట్టూ మాట్లాడ్డంలో సిద్ధహస్తుడు. ఆయనకి ఈ విషయం తెలుసు కానీ తను మారలేడు. అందువల్ల ఈ గొడవలు ఎప్పుడూ రాజుకుంటూనే ఉంటాయ్. మనం మందులివ్వడం తప్ప ఏమీ చేయలేం. వీరి గొడవలు ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే అతి సులభంగా సమసిపోయేవి కానీ ఒకరి అహంకారం మరొకరికి నచ్చదు. నిరంతరం అలా తన్నుకుంటూ ఉంటారు.”

“అవును. మయాంక్ ఛాతీ నెప్పికి, ఇంట్లో పనిచేస్తూ తినేసి అస్తమానూ కూర్చోవడం అనీ గాస్, ఎసిడిటీ అనే చెప్దామనుకున్నాను. కానీ టెస్ట్ లు వచ్చేదాకా ఎందుకులే నోరు విప్పడం అని ఊరుకున్నా.”

“ఎప్పుడూ అటువంటివి పేషెంట్లకి చెప్పకు. బ్లూ క్రాస్ బ్లూ స్టార్ బాగా మంచి పేరున్నది; డబ్బులు సరిగ్గా సమయానికి చెల్లించే కంపెనీ. ఇద్దరిదీ అదే కంపెనీ కనక వీళ్ళిద్దర్నీ మన ఖాతాలో ఉండేటట్టు చూసుకుంటే మనకీ మన ప్రాక్టీసుకీ మంచిది.”

“హా .. హ… హా అలాగే. మరీ అంత వరకూ ఆలోచించలేదు”

“అప్పుడే అయిందా, మన లేబ్ లో ఉన్న అన్ని ఎక్విప్ మెంట్లూ లక్షలు పోసి కొన్నాం. అవి ఆపరేట్ చేసేవాళ్లకి జీతాలివ్వాలి. ఒక్కో టెస్టూ చేయించాలి వీళ్ళకి ఏదో ఉన్నట్టు అనుమానం అని చెప్తూ. ఈ కంప్యూటర్ ఉద్యాగాలున్నాయి చూసావ్? ప్రోజక్ట్ అవ్వగానే ఉద్యోగాలు పోతాయి. అందువల్ల మనం వీళ్ళు ఉన్నంతవరకూ జాగ్రత్తగా పిండుకోవాలి. నేను మరో మూడేళ్లకి రిటైర్ అవుదామనుకుంటున్నా. ఈ లోపుల ఈ బిజినెస్ టెక్నిక్ లు అన్నీ నువ్వు నేర్చుకుంటే ఇటువంటి కేసుల్తో చెడుగుడు ఆడుకోవచ్చు.  నీ ప్రాక్టీస్ కి ఏమీ తిరుగుండదు.”

“థేంక్స్ డాడ్. అయాం రడీ”

*

చిత్రం: సృజన్ రాజ్ 

ఆర్. శర్మ దంతుర్తి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు