చిన్న పత్రికల పెద్ద దిక్కు!

న భారతీయ సంస్కృతిలో పురాణాలకు అత్యధిక స్థానం కల్పించాం. భారత, రామాయణాలు, పురాణాలు కేవలం మతరచనలు కాదు. అవి భారతీయ చేతనలో జీర్ణించుకుపోయాయి. అన్ని దేశాల్లో  పురాణాలు సాహిత్యంలో భాగమయ్యాయి. అన్నిటిలోనూ ఒక కథానాయకుడి కథ ఉంటుంది. లేదా మనందరి జ్ఞాపకాల్లో పంచుకున్న కొన్ని ఘట్టాలు ఉంటాయి. చెడుపై మంచి ఎప్పుడూ గెలుస్తుంది. ఒక జాతి కోరికను అవి నెరవేరుస్తాయి. ‘ఒక రకంగా పురాణాలు మనిషి ఆదర్శంగా తీసుకునే కలలు’ అని మనం భావించాము.

ప్రతి చెడు వ్యక్తిలోనూ రావణుడిని, దుర్యోధనుడిని, శకునిని మంచి వ్యక్తిలో రాముడిని, యుధిష్టిరుడుని  చూసే సంస్కృతి మనది . రాజారావు రచించిన కాంతాపురలో గాంధీజీని కూడా కృష్ణుడుగా చిత్రించిన సంస్కృతి మనది. కవులు మంచి చేసిన వారెవరినైనా రాముడితో పోల్చారు. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ను కందుకూరి రుద్రకవి మల్కిభరామా అని పొగడుతూ పద్యాలు రాశారు. మన సంస్కృతి ఎప్పుడూ స్థిరమైనది కాదు, అది నిరంతరం మారుతూ ఉంటుంది.

 స్థానిక దేవతల్ని కూడా మన సంస్కృతిలో భాగంగానే చూశాము. పురాణాల అధ్యయనం ద్వారా నాటక రచనల్లో మానవ సంబంధాలను తెలియజేసిన మహారచయితలెందరో ఉన్నారు. కాళిదాసు మహాభారతంలోని అభిజ్ఞాన శాకుంతలం అనే ఘట్టాన్ని ఎంచుకుని గొప్ప సాహిత్యాన్ని సృజించారు.  భాసుడు, భవభూతి భారత, రామాయణాలను భిన్నంగా చిత్రించారని విశ్లేషించారు.  ఆధునిక భారతీయ నాటకాన్ని ప్రారంభించిన రవీంద్రనాథ్ టాగోర్ సంస్కృత నాటకాల రచయితల నుంచి స్ఫూర్తిని పొంది అనేక నాటకాల్లో ప్రజల సార్వత్రిక సమస్యల చిత్రణకు పురాణాలను ఉపయోగించారు.ఎందరో రచయితలు పురాణాల వెలుగులో  సమకాలీన సమాజంలో మానవ సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించారు.

రెండవది, మన సాహిత్యంలో ప్రశ్నించే సంస్కృతి, ధిక్కరించే సంస్కృతి కూడా ఎప్పటి నుంచో  ఉన్నది. జిజ్జ్ఞాసకు, అన్వేషణకు మనం అవకాశం కల్పించాం. మన నిత్యజీవితంలో ప్రశ్నకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ప్రశ్నించడం ద్వారానే శాస్త్ర విజ్ఞానం, అన్వేషణ, తద్వారా అభివృద్ది జరుగుతుంది. మన జీవితాల్లో ఎంత అభివృద్ది సాధించినా, ఎన్ని మెట్లు పైకెక్కినా మనలో ప్రశ్నలు  చల్లారవు.  జీవితం గురించి మనం ప్రశ్నలు  వేసుకోకుండా ఉండలేము. అన్నీ అనుభవించిన తర్వాత కూడా ఒక అన్వేషణ మిగలక తప్పదు. అదే ఆధ్యాత్మిక అన్వేషణ. జిజ్ఞాస. పిపాస. వీటన్నింటినీ తీర్చి మనను సరైన మార్గంలోకి మళ్లించేవారే గురువులు. ప్రశ్నలు వేసుకోవడాన్నీ, వాటిని గురువుల ద్వారా తీర్చుకోవడాన్నీ మన సంస్కృతి ప్రోత్సహించింది.

స్వతంత్రానికి  ముందు, ఆ తర్వాత మన కవులు, రచయితలు, జర్నలిస్టులు ఈ సంస్కృతిని పాటించారు.ముందు ప్రజలను సంస్కరించేందుకు మన వాళ్లు ఉద్యమాలు చేపట్టారు.  ఆ తర్వాత సాహిత్యం, పుస్తకాలు ప్రజలకు చేరువలో రావాలంటే భాష ప్రజలు వ్యవహారికంలో ఉపయోగించే భాష అయి ఉండాలనే అభిప్రాయం 18వ శతాబ్దంలోనే నెలకొంది. 19వ శతాబ్ది ద్వితీయార్థంలో కొన్ని తెలుగు పత్రికలు వచ్చాయి వాటిలో కొన్ని సంఘ సంస్కరణకు తోడ్పడ్డాయి. కాని 20వ శతాబ్దిలోనే పత్రికలు స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో భాగమయ్యాయి. కృష్ణా పత్రిక , ఆంధ్రపత్రిక ఆవిర్భావంతో తెలుగు పత్రికల చరిత్ర ప్రారంభమైంది. ఆ తర్వాత స్వరాజ్య పత్రిక మొదలైంది.మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో జరిగిన స్వాతంత్ర్య పోరాటాలు, సామాజిక ఉద్యమాలనుంచి కూడా మనం ప్రేరణ పొందాం. అణగారిన వర్గాల తరఫున రచయితలు నిలబడానే భావనను ఫ్రెంచి విప్లవం నుంచి పారిశ్రామిక విప్లవం నుంచి పొందాం. వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, తాపీధర్మారావు, నార్లవేంకటేశ్వరరావు, త్రిపురనేని రామస్వామి చౌదరి,  ఎందరో మహానుభావులు తెలుగు ప్రజల భావాల్ని, భాషల్ని సంస్కరించేందుకు, ప్రజల్ని చైతన్యపరిచేందుకు కృషి చేశారు.

 గాడిచర్ల సర్వోత్తమరావు లాంటి వారు జైలు పాలయ్యారు. చాలా మంది కవులు,రచయితలు ప్రాంతీయ విభేదాలు లేకుండా అన్ని పోరాటాలతో మమేకమయ్యారు. తాపీధర్మారావు  నిజాం వ్యతిరేక పోరాటంలో తెలంగాణ ప్రజల పక్షాల నిలిచి పోలీసులను ధిక్కరించారు. ‘నేను వాస్తవాలు తెలిపాను. ప్రభుత్వం ఏమి చేస్తుంది? నిన్నూ, నన్నూ కాల్చి చంపుతారా? చంపనీ.’ అని రాసిన ధర్మారావుకు ఆ తెగింపు ఎక్కడినుంచి వచ్చింది? ‘ఒక వీరుడు మరణిస్తే వేలకొలది మరణింతురు. ఒక నెత్తుటి చుక్కలోన ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లు ‘ అని విజయనగరం లో ఉన్న సోమసుందర్ లాంటి కవులు గర్జించారు. ఆచార్య గారు అదే కోవకు చెందుతారు. నేనెందరో ప్రముఖ తెలుగు జర్నలిస్టుల గురించి అధ్యయనం చేసి వారి నుంచి ఎంతో నేర్చుకునే ప్రయత్నం చేశాను.  చలపతిరావు, ఖాసాసుబ్బారావు, ఉప్పులూరి కాళిదాసు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, గోరాశాస్త్రిలాంటి వారి కాలంలో పత్రికలను పరిశీలించాను. వారందరికీ వరంగల్ జిల్లాకు చెందిన ఎంఎస్ ఆచార్య గారు ఏ మాత్రం తీసిపోరు. మానవ విలువలు తప్ప ఏ విలువలూ తమను శాసించకూడదని, ప్రజా హితమే తమ కర్తవ్యమని  నమ్మిన వారు.

తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికంటే భిన్నమైన వాతావరణం ఉన్నది.మద్రాస్ నుంచి తెలుగు పత్రికలు వస్తున్న రోజుల్లోనే నిజాం రాష్ట్రంలో 1913లో తెలుగు పత్రికలు ప్రారంభమయ్యాయి. 1913లో మహబూబ్ నగర్ లో హితబోధిని అన్న పత్రికల ప్రచురిమైంది. నిజాం పాలనలో ప్రజలకు వాస్తవాలను తెలిపేందుకు పత్రికల్ని ప్రచురించడమే అత్యంత సాహసం. పైగా ప్రింటింగ్ ప్రెస్ లను స్థాపించి పత్రికల ద్వారా ప్రజలను చైతన్యపరిచిన సంస్కృతి తెలంగాణది. అన్ని నిషేధాలను ఉల్లంఘించి నిజాం రాజరిక పాలనను ఎదుర్కొన్న చరిత్ర తెలంగాణ పత్రికలది. ఏ ప్రచురణనైనా నిలిపివేసే అధికారం పోలీసులకు అచ్చారు. తెలంగాణ లో ధిక్కార స్వరం ఎప్పటి నుంచో ఉన్నది.

సాహిత్యాన్ని కీచకులకు అమ్మబోనని ప్రతిన చేసిన పోతన గడ్డ తెలంగాణది. సురవరం ప్రతాప్ రెడ్డి స్థాపించిన గోలకొండ పత్రిక తెలంగాణ అస్తిత్వాన్ని 1926లోనే చాటి చెప్పింది. నిజాం కాలం నాటి దుర్భర పరిస్థితులను కూడా ఎదుర్కొని దాదాపు పాతికేళ్లు సాగింది. నిజాం దుర్మార్గాలను ఎండగట్టేందుకు షోయబుల్లాఖాన్ నిర్వహించి నఇమ్రోజ్, తాడిత పీడిత వర్గాలకోసం భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించిన భాగ్యనగర్, నల్గొండ నుంచి నీలగిరి, ఒద్దిరాజు సోదరులు ప్రారంభించిన తెనుగు పత్రిక,గడియారం రామకృష్ణ శర్మ ప్రారంభించిన సుజాత, దేవులపల్లి రామానుజరావు ప్రారంభించిన శోభ, పాములపర్తి సదాశివరావు, పివి నరసింహారావు నిర్వహించిన కాకతీయ నుంచి ఎంఎస్ ఆచార్య గారు ప్రారంభించిన జనధర్మ ఇవన్నీ తెలంగాణ భావజాలాన్ని సంస్కృతిని ప్రజల దృష్టికి తీసుకువెళ్లాయి. తెలుగు మాట్లాడితే నేరం క్రింద భావించే రోజుల్లో వీరు తెలుగు పత్రికల్ని నడిపారు.

ఎంఎస్ ఆచార్యగారు 1948 నుంచి 32 ఏళ్ల పాటు ఆంధ్రపత్రికలో పనిచేశారు.అనేక పత్రికలను, కరపత్రాలను రజాకార్ల కన్ను గప్పి ప్రజలకు చేరవేశారు. ఈ క్రమంలో దౌర్జన్యాలను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత స్వంత పత్రికలను ప్రారంబించారు. పెద్ద పెద్ద పత్రికల పోటీని కూడా తట్టుకుని జనధర్మను 36 సంవత్సరాలు, వరంగల్ వాణిని 13 సంవత్సరాలు నిర్వహించారంటే మాటలు కాదు. సమకాలీన ప్రజల సమస్యలను చిత్రించడమే కాదు, పరిశోధనాత్మక వార్తల్ని ఎలా రాయాలో భావితరాలకు నేర్పిన వ్యక్తి ఎం ఎస్ ఆచార్య.ఆ పత్రికలో ప్రాంతీయ భేదాలు లేకుండా అనేక మంది కవుల్ని, రచయితల్నీ ప్రోత్సహించారు. ఒక ప్రాంతం నుంచి వచ్చిన ఒక చిన్న పత్రికలను అంత ప్రామాణికంగా నడిపి ప్రజల జీవితంలోనూ, సంస్కృతిలోనూ భాగం చేయడం ఆంత సులభం కాదు. జనమూ ధర్మమూ వేరు వేరు కాదని భావించినందువల్లే ఆయన జన ధర్మ అనే పేరు పెట్టారని ఆ పత్రికను ప్రారంభించిన పాములపర్తి సదాశివరావు అన్నారు. జనమూ ధర్మమేకాదు, ధర్మమూ న్యాయమూ కూడా వేరు వేరు కాదని వారు నమ్మారు. బహుశా ఆ రోజుల్లో ప్రముఖ కవి, రచయిత, జర్నలిస్టు ధర్మవీర్ భారతి నేతృత్వంలో వచ్చిన ధర్మయుగ్ ఆచార్య గారికి ప్రేరణ అయి ఉండవచ్చని కోవెల సంపత్కుమార చార్య ఒక వ్యాసంలో రాశారు. ‘ప్రజాస్వామ్య సుస్థిరతకు పత్రికలు ప్రధాన సాధనాలు.

కొందరు పార్టీలుగా ఏర్పడి, ఎన్నికల్లో అభ్యర్థులను నిలపడం, ఓట్లు వేయడం వంటివి మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యంఒక స్వతంత్ర దేశ ప్రజల జీవన విధానం. అధికారపు పెనుగులాటలో నిమిత్తంలేని అపారమైన  సమాజం తన జీవనానికీ, విలువలకు, విశ్వాసాలకూ భద్రత నిచ్చే సాంఘిక వ్యవస్థ నిర్మాణానికి పురోగమించాలి. ప్రభుత్వం అందుకు అవసరమైన వాతావరణం కల్పించాలి. ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ వేసే తప్పటడుగులను వారించి పురోగమించుటకు తగు సూచనలు చేసి ఉన్నత సంప్రదాయాన్నేర్పర్చు విమర్శనాశీలురగు విజ్ఞ ప్రజలకు పత్రిక ఉత్తమ సాధనం.’ అని ఆయన 1958 నవంబర్ లో జన ధర్మ తొలి సంపాదకీయాల్లో రాశారు.ఎంతో లోతుగా ఆలోచించి రాసిన వాక్యాలివి. చచ్చుపుచ్చు రాజకీయాలే ప్రజాస్వామ్యం కాదని, స్వతంత్ర దేశ ప్రజల జీవన విధానం అని ఎంతమంది చెప్పగలుగుతారు?

రజాకార్ల కాలంలో ఒక ముస్లిం పాలకుడు మరో వ్యక్తిని దారుణంగా చితకబాదుతుంటే చలించిపోయిన సంఘటనే ఎంఎస్ ఆచార్య ను జర్నలిస్టుగా మలిచింది.  పివి నరసింహారావు లోపలి మనిషిలో ఇలాంటి ఘటనే మనకు కనపడుతుంది. నిజాం దారుణాలను ఎండగడుతూ వార్తలు రాయడమే ఆ పత్రికలను రహస్యంగా పంచిపెట్టేవారు. రజాకార్ల దౌర్జన్యాలకు భయపడి వరంగల్లు వదిలి వందలాది కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతే జనం లేని వీధుల్లో కందిలీ ఒక చేత, లాఠీ మరొక చేత పట్టుకుని కాపలా కాసిన చైతన్యం ఆయనది ఇప్పుడా చైతన్యం ఎంత మంది జర్నలిస్టులకు ఉన్నది. ?

ఆచార్య గారి జర్నలిస్టు ప్రమాణాల్లోంచి నేటి జర్నలిస్టు ప్రమాణాల్ని మనం నిర్ణయించాలి. జర్నలిస్టుకు కావల్సింది తటస్థత, అనేక విషయాలపై పరిజ్ఞానం. భాషా సాహిత్యాలపై పట్టు. ఆచార్య గారి  సంపాదకీయాలు చదివితే ఆయన అనుసరించిన ప్రమాణాలు, విషయ వైవిధ్యం మనకు అర్థమవుతాయి. అనేక అంతర్జాతీయ, జాతీయ ఘటనలు ఆయన వరంగల్ నుంచి చూసి రాసిన సంపాదకీయాలు ఆయనకు అధ్యయనం, పరిశీలన, ప్రాపంచిక దృక్పథం గురించి మనకు తెలియజేస్తాయి. ఇవి నేటి జర్నలిస్టులకు అవసరమైనవి.

ఇరాన్ లో అయతుల్లా ఖొమైనీ నియంతృత్వ పాలన గురించి రాస్తూ అధికారం కోసం మతాన్నీ, దేవుడినీ దుర్వినియోగం చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు ఇరాన్ ఒక ఉదాహరణ అని రాశారు. ఇది నేటికీ వర్తిస్తుంది. పాక్  ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని తెలిసినప్పటికీ అమెరికా దానికి సహాయం చేయడాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఆయన అప్పుడే సంపాదకీయం రాశారు. దేశంలో రాజకీయ పరిస్థితులపై ఆయన ఎన్నో సార్లు తన ఆవేదనను వ్యక్తపరిచారు.అసలు ఈ దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. దేశ రాజకీయాలు పూర్తిగా భ్రష్టమయ్యాయని, నైతికత అనేది కనుమరుగైందని, డబ్బూ, ఓట్లు, పదవి చుట్టూ చక్రభ్రమణంలా రాజకీయాలు మారాయని చెప్పారు. ఆచార్య గారు ఒక పార్టీని భుజానికెత్తుకుని వంధిమాగధుడిలా వ్యవహరించలేదు. జనసంఘ్ నిర్మాత, బిజెపి సిద్దాంత కర్త అయిన దీనదయాళ్ ఉపాధ్యాయ మరణించినప్పుడు బాధపడుతూ అద్భుతమైన సంపాదకీయం రాశారు. అదే మహాకవి శ్రీశ్రీ మరణించినప్పుడు కూడా అంతే శక్తివంతంగా సంపాదకీయం రాశారు. తెలంగాణ ఎదుర్కొన్న జల సమస్యను, ప్రాజెక్టులు నిర్మించాల్సిన అవసరాన్ని ఎన్నో సంపాదకీయాల్లో రాశారు. తెలుగు భాష ను పరిరక్షించుకోవాలన్నారు. స్త్రీలపై అత్యాచారాలను ఖండిస్తూ స్త్రీలు ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. ఇందిరాగాంధీకి రాజకీయాల మధ్య స్త్రీల సమస్యలు పట్టించుకునే తీరిక లేదన్నారు. స్త్రీలపై కవిత్వం రాసేవారు కూడా ,సిద్దాంత కర్తలు కూడా నాలుగుగోడల మధ్య స్రీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తారని ఆయన విమర్శించారు. ఆచార్య గారి ప్రగతిశీల ఆలోచనా దృక్పథం, తటస్థత, ప్రజాస్వామ్య వైఖరి జర్నలిస్టులు నేర్చుకోవల్సింది.

నేను సాహిత్యంలోంచి జర్నలిజం లోకి ప్రవేశించాను. నాకు రచయిత కావడానికి పత్రికలు తోడ్పడుతున్నాయి. లోకం తీరు అర్థం కావడం వల్ల సాహిత్యంలో దాన్ని ప్రవేశపెట్టగలుగుతున్నాను. కాని ఇప్పుడు ఆచార్య గారు జర్నలిస్టుగా ఉన్ననాటి రోజులు లేవు. మన దేశంలో మనుషులుండీ నిర్మానుష్యంగా కనిపించే వాతావరణం చాలా కాలం నుంచీ ప్రారంభమైంది. మన కాళ్ల క్రింద నేల జారిపోయి చాలా కాలమైంది. కళ్లముందు కనపడేవేవీ వాస్తవం కావు. రహదారులపై వేగంగా పరిగెత్తే వాహనాలు సజీవంగా కనిపిస్తాయేమో కాని అది సజీవ మానవుల శవాలపై పరిగెత్తే యంత్రాలు. నెత్తుటి మరకను తుడిచేసిన తర్వాత రోడ్డు నిర్లిప్తంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇదేనా మనకు కావాల్సిన ప్రశాంతత? చట్టసభలు వాయిదా పడతాయి. అంతా స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది. కాని చట్ట సభలకూ, ఆఫీసులకు తెలియని రహస్య ఒప్పందాలు ఎక్కడోజరుగుతాయి. అంతా చట్టబద్దంగా కనిపిస్తాయి కాని వేల కోట్ల ప్రజాధనాన్ని నిర్లిప్తంగా కొల్లగొట్టిన నేతలు ప్రజాస్వామ్యం గురించి అనర్గళ ప్రసంగాల్ని ఇస్తుంటారు. కుళ్లిపోయిన వ్యవస్థ గురించి మాట్లాడలేని వారు దేశభక్తి గురించి ప్రవచనాలు ఉల్లేఖిస్తారు. ఉద్యమాలలో నీరసత్వం ఆవహిస్తుంది. వాట్సాప్, ఫేస్ బుక్ ల్లోనేపోరాటాలుజరుగుతాయి. అమాయకులైన ఆదివాసీలకు ఎందుకు ఏళ్లతరబడి తాము నిర్బంధంలో ఉన్నామో తెలియదు. మనకు తెలియకుండా మన హత్యలు జరుగుతున్నాయి. మన చైతన్యాలు ముక్కలు ముక్కలై, కులాలై, వర్గాలై, అస్తిత్వాలై, అభిమాన సంఘాలై లక్ష్యాన్ని కోల్పోతున్నాయి.

భారత దేశంలో ఈ పరిస్థితికి కారణం మొత్తం వ్యవస్థ కొన్ని వర్గాల చేతుల్లోకి పోవడం, దాదాపు 33 సంవత్సరాలు ఢిల్లీలో పనిచేసిన నాకు ఈ వ్యవస్థలోని దుర్మార్గాలకు సంబంధించి అనేక విషయాలు అవగతమయ్యాయి. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పార్లమెంట్‌లో ప్రవేశిస్తున్న అనేకమందికి ప్రజల దైనందిన సమస్యలతో సంబంధం లేదు. వ్యాపారస్తులు, మాఫియాలు, నేరచరితులు ప్రజాప్రతినిధులుగా అవతరిస్తున్నారు. వారు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చట్టసభల్ని ఉపయోగించుకుంటున్నారు. సామాన్యులు ఎన్నికల బరిలో ప్రవేశించే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు అభివృద్ది పేరిట అత్యధికంగా ఉన్నతవర్గాలు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. దేశం రూపురేఖల్ని, వేలాది మంది ప్రజల భవిష్యత్తులకు  సంబంధించి చట్టాల్ని ఒక గంటలో ఎటువంటి చర్చ లేకుండా ఆమోదిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి నిలయమైన పార్లమెంట్, ప్రధానమంత్రి కార్యాలయాల్లో లక్షల కోట్ల విలువైన నిర్ణయాలు జరుగుతుంటాయి. రాష్ట్రాల భవిష్యత్తులు మారుతుంటాయి. పార్లమెంట్ భవనానికి అతి సమీపంలోఉన్న ఇండియాగేట్ వద్ద గాలిబుడగలు అమ్ముకునేవారు, వేరుసెనగలు అమ్ముకునేవారు, బూట్‌పాలిష్ చేసే వారు, అడుక్కునేవారికి తమకు అత్యంత సమీపంలో ఎంతటి దారుణాలు జరుగుతాయో అర్థం కాదు. ఢిల్లీ వీధుల్లో గజగజ చలికి వణికిపోతూ ప్రతిఏడాదీ వందలాది మంది చనిపోతారు. అదే ఢిల్లీలో చెమట చుక్క కూడా చిందించకుండా కోట్లాది రూపాయలు సమూపార్జించేవారున్నారు. ఒకే కిలోమీటర్ పరిధిలో మనకు రెండు భారత దేశాలు కనిపిస్తుంటాయి. దీన్ని చిత్రించే మీడియా లేదు. మన దేశంలో ఫైవ్‌స్టార్ హాస్పిటల్స్ అనేకం ఉండవచ్చు. కాని కనీసం 20 కోట్ల మంది జనాభాకు కనీస వైద్య వసతులు అందడం లేదు.

 

కనిపించేది అధునాతనంగా ఉన్నా నేడు అసలు విషయం నిర్జీవమైంది. ఈ డొల్లల్ని బద్దలు కొట్టి, విశ్వాసాల్ని ప్రశ్నించి, మూసల్ని ఛేదించి, చితుల్ని వదిలించుకుని, శవాలను భుజాలపైనుంచి నెట్టేసి నిత్యనూతనంగా, అధునాతనంగా నిలబడే ధిక్కార స్వరాన్ని మనం వినిపించాల్సి ఉన్నది. ఇందుకు మన పురాణాలు.ప్రాచీన సాహిత్యంనుంచి నేటి సాహిత్యం వరకు మనకు స్ఫూర్తి నివ్వాలి. మరో సారి ప్రశ్నోపనిషత్తులు రాసే వారు, ప్రశ్నించేవారు మనకు కావాలి.

చిన్న పత్రికలు ఇవాళ జనధర్మ, వరంగల్ వాణిలాగా స్వతంత్రంగా పనిచేసే పరిస్థితులు ఇప్పుడు లేవు. అవి ఏ రాజకీయ పార్టీ ప్రాపకం కోసమో, ఏ రాజకీయ నాయకుడి ప్రాపకం కోసమో పనిచేస్తున్నాయి. జాతీయస్థాయి మీడియా సంస్థలే కొందరు బడా వ్యాపార వేత్తల అధీనంలో ఉంటే చిన్న పత్రికలు ఏమి చేయగలుగుతాయి. అయినప్పటికీ ఇవాళ చిన్న పత్రికలు, కొన్ని సోషల్ మీడియా ఛానెల్స్ స్వతంత్రంగా వ్యవహరిస్తూ పరిస్థితిని ఆశాజనకంగా మారుస్తున్నాయి.పత్రికలు, ప్రసార సాధనాలు చెప్పలేని అంశాల గురించి ప్రజలకు వివరించేందుకు సోషల్ మీడియా అద్బుతంగా పనిచేస్తున్నప్పటికీ రానురానూ అది కూడా కొన్ని వర్గాల ఆధిపత్యంలోకి వెళ్లే క్రమం కొనసాగుతున్నది. అంతటా పెట్టుబడి మాయే కనుక సోషల్ మీడియాను కూడా కొన్ని వర్గాలు, పార్టీల కిరాయిమూకలు ఆవరించాయి. వాస్తవాలను వక్రీకరించేందుకు, మసిపూసి మారేడు కాయ చేసేందుకు, ప్రత్యర్థులపై బురద చల్లేందుకు పార్టీలు సోషల్ మీడియాకోసం ప్రత్యేక విభాగాలే ఏర్పర్చుకున్నాయి. చరిత్రను వక్రీకరించి, ఒక నాయకుడిని ఉన్నతంగా చిత్రించి, వ్యతిరేకులపై అసత్య ప్రచారం ఉధృతంగా చేసి ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ అక్రమ ప్రచారం కూడా దోహదం చేసింది.

తెలుగు జర్నలిజానికి రచయితలు, సాహితీ వేత్తలు అవసరం. ఆచార్య గారి లాంటి మేధావులు, సాహితీ వేత్తలు, రచయితలు లేని లోటు పత్రికల్లో కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

ఆ రోజుల్లో సాహిత్యం జర్నలిజం వేరువేరు అంశాలు కావు. ఎందరో మహాకవులు, రచయితలు  తెలుగు జర్నలిజంలో భాషకూ, భావజాలానికీ కాగడాలు. వారు రాసిన కవితా వాక్యాలే తెలుగు పత్రికల్లో శీర్షికలైన సందర్భాలు ఎన్నో. శ్రీశ్రీయే కాదు, చిలకమర్తి, ఉన్నవ లక్ష్మీనారాయణ, రాయప్రోలు సుబ్బారావు, త్రిపురనేని రామస్వామి చౌదరి, ఆలూరి బైరాగి, పఠాభి, శ్రీరంగం నారాయణ బాబు, ఆరుద్ర, చలం, కొడవటి గంటి కుటుంబరావు, మహీధర రామ్మోహనరావు, రంగనాయకమ్మ, రావిశాస్త్రి, బీనాదేవి, అల్లం రాజయ్య, గద్దర్ లాంటి ఎందరో మహానుభావులు తెలుగు సాహిత్యాన్నే కాదు తెలుగు జర్నలిజాన్ని ప్రభావితం చేశారని చెప్పక తప్పదు. పతంజలి పోలీసుల దుర్మార్గాన్ని, రావిశాస్త్రి కోర్టుల బూటకత్వాన్ని చిత్రించినట్లుగా ఏ జర్నలిస్టూ చిత్రించలేదు. అభ్యుదయ, దిగంబర, విప్లవ, దళిత, స్త్రీవాద, అనేక అస్తిత్వ సాహితీ ఉద్యమాలు తెలుగు సాహిత్యాన్నీ, జర్నలిజానికి ప్రేరణగా నిలిచాయి.

కాని సంస్కరణల యుగం తర్వాత పరిస్థితి మారిపోయింది. రాజకీయాలు దట్టంగా మారాయి. అధికారం కోట్లకు పడగెత్తడానికి ఆధారంగా మారిపోయింది. పత్రికలు ఈ ఉచ్చులో చిక్కుకున్నాయి. రాజకీయపార్టీలు,, కార్పొరేట్లు, వ్యక్తిగత ప్రయోజనాలున్న వారికి ఉపకరణాలుగా మారాయి. ఈ క్రమంలో సాహిత్యం కూడా పత్రికల్లో క్షీణించసాగింది. ఒకప్పుడు మనం చదివే పుస్తకాలు, మనకున్న భాష పత్రికల్లో ప్రవేశించడానికి తోడ్పడేవి. ఇప్పుడు ఆ అవసరం లేదు. రైతుల ఆత్మహత్యలకన్నా రాజకీయనాయకుల  వార్తలు, సంచలనాలు, పత్రికలకు ప్రధానమవుతున్నాయి. ప్రజలపై అమలు అవుతున్న దారుణాలు వార్తలు కావడం లేదు. కార్పొరేటీకరణ పెరుగుతున్న కొద్దీ పత్రికల్లో, మీడియాలో విస్మృత వర్గాలకు (సబాల్ట్రన్ ) స్థానం తగ్గిపోవడం ఇందుకు నిదర్శనం. చాలా చోట్ల ప్రజల ప్రతిఘటనను, పోరాటాన్ని పత్రికలు రికార్డు చేయడం లేదు. అసలు ప్రజల ప్రతిఘటననే అభివృద్ది నిరోధకంగా పత్రికలు చిత్రించే స్థితికి చేరుకున్నాయి.ప్రజల అభిప్రాయాలను ఫలానా రాజకీయ పార్టీకి అనుగుణంగా ఎలా ప్రభావితం చేయాలన్నదే పత్రికల సమస్యగా మారింది. తటస్థంగా వ్యవహరించే పత్రికలను, ప్రసార సాధనాలను వెతుక్కోవాల్సి వస్తోంది.  మార్కెట్ పత్రికల తీరుతెన్నులను పూర్తిగా శాసించే స్థితి నెలకొన్నది.

ఆధునిక మార్కెట్‌లో ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే కారణాలు వేరు. మార్కెట్ ద్వారాభయాన్ని కల్పించవచ్చు. మార్కెట్ ద్వారా అభిమానాన్ని కల్పించవచ్చు.మార్కెట్ ద్వారా ఏ ఆలోచననైనా దారి మళ్లించవచ్చు. ఈ క్రమంలో కారణం అనే దాన్ని సులభంగా హతమార్చవచ్చు. అసలెందుకు ఇలా జరిగింది? ఇది నిజమా కాదా అని తార్కికంగా ఆలోచించే వివేచనా శక్తిని హతమార్చవచ్చు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు అల్‌గోరే సైతం టీవీల ద్వారా ప్రచారాన్ని కొనుగోలు చేయడం ద్వారా తాను ఎన్నిక కాగలిగానని ‘అసాల్ట్ ఆన్ రీజన్’ (కారణంపై దాడి) అన్న పుస్తకంలో రాశారు.ప్రజాస్వామ్యం అనేది ఒక కొనుగోలు వస్తువు.. అని ఆయన స్పష్టంగా చెప్పారు.ఇవాశ కార్పొరేట్ వ్యవస్థ.  అన్ని వ్యవస్థల్నీ ప్రభావితం చేసేంతగా విస్తరించింది. పార్లమెంట్‌లోనూ, చట్ట సభల్లోనూ, ప్రభుత్వ యంత్రాంగాల్లోనూ, చివరకు న్యాయవ్యవస్థలోనూ దాని ప్రభావం చొచ్చుకుపోయింది

‘మేం వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండడానికీ, పేదలకు అనుకూలంగా ఉండడానికి మధ్య వైరుధ్యం ఏమీ లేదు ‘ అని కేంద్ర ఆర్థిక మంత్రి గా అరుణ్ జైట్లీఉన్నప్పుడు పార్లమెంట్‌లో ప్రకటించారు. ఎవరి ప్రయోజనాలు కొల్లగొడితే ఎవరికి ప్రయోజనం జరుగుతుందో ఆయనకు తెలియనిది కాదు. ఆర్థిక వ్యవస్థలో అభివృద్ది అసమానతలను తగ్గిస్తోందా, లేక పెంచుతున్నదా అన్నది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అరుణ్ జైట్లీ లాంటి వారు చెబుతున్న, అమలు చేస్తున్న విధానాల కారణంగా కేవలం 3 శాతం వర్గాలకే సంపద చేరిందని ప్రముఖ ఆర్థిక శాస్త్ర వేత్త థామస్‌పికెటీ లాంటి వారు విశ్లేషించారు. సంపద అనేది ప్రతిభకు సూచకం కానే కాదని ఆయన చెప్పారు విదేశాల్లో నల్లధనం గురించి ఆలోచిస్తున్నాం కాని మన దేశంలో ఎన్నికల్లో నెగ్గేందుకు కోట్లాది రూపాయలు ఎలా ఖర్చుపెడుతున్నారని ఆరా తీసిన వారు లేరు.

న్యాయవ్యవస్థలోన్యాయం గురించి ఎంత తక్కువమాట్లాడితే అంత మంచిది. ‘అబద్దం లేకుండా సాక్ష్యం కావాలంటే ఈ భూప్రపంచకమందు ఎక్కడైనా సాక్ష్యం అనేది ఉంటుందా, మీరు అనుభవం లేకుండా నీతులు చెబుతున్నారు కాని.. హైకోర్టులో వకీళ్లు కూడా తిరగేసి కొట్టమంటారు.. నీ పుణ్యం ఉంటుంది బాబూ.. నిజం, అబద్దం అని తేలగొట్టక ఏదో ఒక తడక అల్లి తయారు చేస్తే కాని ఆబోరు దక్కదు’ అని  గురజాడ కన్యాశుల్కంలో హెడ్ కానిస్టేబుల్ గిరీశంతో అంటాడు. ఆయన కన్యాశుల్కం రాసి నూటా పాతిక సంవత్సరాలు సమీపిస్తున్నప్పటికీ న్యాయవ్యవస్థ తీరుతెన్నులు ఏమీ మారలేదు. ‘ఈ నోకంలో డబ్బూ, యాపారం తప్ప మరేట్నేదు.’ అని ముత్యాలమ్మ పాత్ర ద్వారా రావిశాస్త్రి జీవితసత్యాన్ని చెప్పిస్తారు.   మనం రాసుకున్న భారత రాజ్యాంగం కులం, మతం, జాతి, ప్రాంతం మొదలైన వాటి ఆధిపత్య స్వభావాన్ని మార్చివేసిందా? పేదలకు, ధనికులకు మధ్య అగాధాన్ని చెరిపివేసిందా? అగ్రకులాలకూ, దళితులకు మధ్య తేడాను తగ్గించిందా? గిరిజన ప్రయోజనాలను కాపాడుతోందా? స్త్రీలకు, పురుషులకు మధ్య తేడా తగ్గించిందా? స్వాతంత్య్రం తర్వాత రాజ్యాంగ యంత్రాంగపు వర్గ స్వభావం ఎంత మేరకు మారింది? ఇవాళ న్యాయవ్యవస్థ ఏది ముఖ్యమైన కేసు అని భావిస్తుందో చెప్పడం కష్టం. ఫలానా న్యాయమూర్తి వద్దకు కేసు వస్తే ఫలానా తీర్పు వస్తుందని చెప్పడం సులభం. పైనుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముఖ్య నేతలకు అనుగుణంగా తీర్పులు వస్తాయని ప్రచారం జరుగుతుంది. న్యాయవ్యవస్థలో జరుగుతున్న అక్రమాన్ని, అవినీతిని ప్రశ్నించే ధైర్యంఎవరికీ లేదు. కాని ప్రజలు అన్నీ గమనిస్తుంటారు.

ఆచార్య గారి లాంటి తరం సంపాదకులు, పత్రికా నిర్వాహకులు ఇప్పుడు లేరు. ఆచార్య, గోరాశాస్త్రి లాంటి సంపాదకులు తన తర్వాతి కాలం జర్నలిస్టులకు అనుసరించాల్సిన ఎన్నో విలువలని తమ ఆచరణ ద్వారా తెలియజేశారు. సంకుచితంగా కాకుండా విశాల దృక్పథంతో ఆలోచించడం, ఎవర్నీ ద్వేషించకపోవడం, ఒక సిద్దాంతానికే గుడ్డిగా కట్టుబడి ఉండడం, రాజకీయ పార్టీల కొమ్ము కాయడం, తప్పు ఎక్కడుంటే అక్కడ విమర్శించడానికి వెనుకాడకపోవడం వంటి విలువలుజర్నలిస్టులు పాటించాలని వారు తన ఆచరణ ద్వారా తెలిపారు.ఒక వార్తకు రంగు, రుచి, వాసన కాని ఏమీ ఉండవు. ఆ వార్తకు ప్రాణం సమాచారమే. సంపాదకీయాల్లో అభిప్రాయాలను చెప్పవచ్చు కాని వార్తకు ఎలాంటి మసాలాలూ, రంగులూ పులమకూడదనే అభిప్రాయం వారు వ్యక్తం చేశారు. ఇవాళ అలాంటి వారు జర్నలిస్టులకు ఆయన అందుకే ఆదర్శం కావాలి.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆచార్యగారి ప్రేరణతో మీ ప్రత్యక్షరాన్ని ఆయుధం చేశారు సార్! ఆచార్యగారిని అపూర్వంగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.👍👌👏🏻👏🏻👏🏻💕💐🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు