పెళ్లి అనే వ్యవస్థ ఎందుకు ఏర్పాటైంది..!? ఇది నన్ను ఎన్నో నెలలుగా వెంటాడుతున్న ప్రశ్న. కేవలం వంశవృద్ధి లేదా మన శారీరిక అవసరాలు కోసమే అని నేను అనుకోవడం లేదు.. ఎందుకంటే ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే సెక్స్ లేదా పిల్లలు అనేది రెండో విషయం. ముఖ్యంగా మనకు అంటూ ఒక తోడు, మన కష్ట సుఖాలను పంచుకునే వ్యక్తి కోసమే వివాహం అని చెప్తున్నారు.
తోడు కోసమే ఐతే అది కేవలం Opposite Sex వాళ్ళతోనే ఎందుకు ఉండాలి అనేది నా మరో ప్రశ్న.. ఇలా అడిగిన వెంటనే.. నన్నో విధంగా చూసి, సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.. సరే అసలు తోడులో సెక్స్ పాత్ర ఎంత అని నాకు నేనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే Sex కి Gender కి చాలా వ్యత్యాసం ఉంది అని, నేను జెండర్ నే సెక్స్ అనుకొని గందరగోళ పడుతున్నా అని తెలుసుకున్న.. ఇంకా లోతుగా తెలుసుకుంటే LGBTQ+ గురించి తెలిసింది. ఐతే LGBTQ+ లా గురించి ఏదైనా కథలు కానీ, నవల కానీ మన తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిందా అని చూస్తే.. కొన్ని పుస్తకాలు/కథలు తెలిశాయి.. కానీ వాటిల్లో కన్నడలో వసుధేoద్ర రాసి రంగనాథ రామచంద్రరావు గారు అనువాదం చేసిన “మోహనస్వామి” నన్ను బాగా ఆకర్షించింది. ఎందుకంటే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తూ తను “గే” అని వసుధేoద్ర ప్రకటించారు. అలా ఈ పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేశాను.
ఒక మారుమూల పల్లె ప్రాంతం నుంచి వచ్చిన మోహనస్వామి తనను తాను అందరిలాంటి వాడు కాదు అని తెలుసుకున్న తర్వాత, తన జీవితంలో జరిగిన గాయాలు, అవమానాలు, నిరాశ క్షణాలు, సంపాదించుకున్న, పోగొట్టుకున్న ప్రేమికులు, మిత్రులు.. ఇలా తన జీవితంలో ఎలాంటి మార్పులు జరిగాయో తెలియచేయడం అనేది ఈ పుస్తకంలో ముఖ్య ఉద్దేశ్యం.
ఈ పుస్తకాన్ని నవల అనలేము, అలా అని కథలు అనలేము ఎందుకంటే ప్రతి కథలో మోహనస్వామి ఉన్నా, ఇది కేవలం మోహనస్వామి కథ కాదు.. ఇలా తను “గే” అని తెలిసి లేదా తెలియని ఎంతో మంది ఎదుర్కొన్న సంఘటనలు ఇందులో ఉన్నాయి.
ఈ కథలు అన్నీ కాస్త ఆత్మకథ లేదా Memoir ఏమో అని నా అభిప్రాయం ఎందుకంటే కొన్ని విషయాలు గురించి చదువుతుంటే అవి కేవలం స్వయంగా తెలుసుకునే అవకాశమే కానీ వేరే వాళ్ళ జీవితాల ప్రేరణ అనిపించదు. ముఖ్యంగా “గే” లు పడే మానసిక ఒత్తిడి, సమాజం తమ పై చేసే అభియోగాలు లాంటివి చదివినప్పుడు మనం ఆ పాత్రలతో లీనమైపోతాము.
కన్నడ నుంచి అనువాదం చేసిన కారణంగా, మూలానికి కి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశ్యంతో రాశారేమో తెలియదు కానీ, కొన్ని చోట్ల తెలుగు పదాలు చదువుతుంటే, ఇలాంటివి మనం తరచుగా వాడము కదా అని అనిపిస్తుంది. ఆ ఒక్కటి పక్కన పెడితే, LGBTQ+ ల గురించి, ముఖ్యంగా “గే” ల గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకం “మోహనస్వామి”.
ఈ పుస్తకం Telugubooks.in లో ఉంది. లేదా పుస్తకం కావాల్సిన వాళ్ళు 9848023384 నంబర్ కి ఫోన్ చేసి కొనుక్కోవచ్చు.
దయచేసి పుస్తకాలను కొని చదవండి.
*
Nice review A.Bunny