గిరీశానికి గొంతుకనిచ్చిన నటరాజు!

కుప్పిలి వెంకటేశ్వరరావుశతజయంతి సంవత్సరం సందర్భంగా!

మా చిన్నతనంలో మాలో  మంచి అభిరుచి పెంపొందడానికీ, చక్కని సంస్కారం అలవడడానికీ ఆలిండియా రేడియో కొంతవరకూ దోహదం చేసిందని చెప్పుకోవచ్చు.

మేము ఆలిండియా రేడియోలో వచ్చే కార్యక్రమాలు వింటూ పెరిగాము. అవి మాలో చెరగని ముద్రవేశాయి. కర్ణాకటక సంగీతం వినేవాళ్లం, లలిత సంగీతం వినేవాళ్లం, సినిమాపాటలూ, సంక్షిప్త శబ్దచిత్రాలు సరేసరి.వీటన్నిటితో పాటూ మంచి మంచి క్లాసిక్స్ అనదగిన వాటిని నాటకాలుగా రూపొందించి అందించే వారు.

అలా విన్న నాటకాలలో  నా జ్ఞాపకాలలో చెరిగిపోకుండా నిలిచినవి గురజాడ అప్పారావు గారి “కన్యాశుల్కం”,కాళ్లకూరి నారాయణరావుగారి “వరవిక్రయం”,చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి “గణపతి”,విశ్వనాథ కవిరాజు గారి “నాటికి నేడు”.

ఆనాడు ఆలిండియా రేడియో విజయవాడ కేంద్రం నుండీ ప్రసారమైన “కన్యాశుల్కం” నాటకంలో గిరీశం గొంతు ఈనాటికీ నన్ను వెంటాడుతూనే వుంటుంది. ఆ గొంతులో పలికే మాడ్యులేషనూ, గంభీరతా సమయానుకూలంగా ఒలికే మార్దవమూ ,విజయనగరం జిల్లా యాసా మరే గొంతులోనూ నేను వినలేదు.ఎంతమందో లబ్దప్రతిష్టులు గిరీశం పాత్ర లో నటించి వుండవచ్చు కానీ నాకు మాత్రం అప్పుడూ,ఇప్పుడూ, ఎప్పుడూ గిరీశమంటే ఆ గొంతే.ఇంతకీ అలా  మెస్మరైజ్ చేసే ఆ గొంతు యెవరిదంటే కె.వెంకటేశ్వరరావుది. అయితే ఆయనని ప్రత్యక్షంగా నాటకాలలో నటిస్తుంటే చూసే అదృష్టం నాకు కలగలేదు.

కె.వెంకటేశ్వరరావు పూర్తి పేరు కుప్పిలి వెంకటేశ్వరరావు. ఆయన గురించి అప్పుడు నాకు పెద్దగా తెలియదు.ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుంటున్న కొద్దీ ఆయన సామాన్యుడు కాదని అర్థమయింది. ఆయన గురించి నేను సేకరించిన వివరాలు కొన్ని ఇక్కడ పొందు పరుస్తున్నాను.

ఆయన నాటకరంగంలో పెను సంచలనం సృష్టించిన నటుడు. నటుడుగానూ, దర్శకుడుగానూ పేరొందినవాడు. ఆయన నటన అనేకమంది నటులకు మార్గదర్శకంగా వుండేది. అంతేకాదు అనేకమంది నటులను ఆయన తీర్చిదిద్దారు. ఇప్పుడు వారంతా నటులుగా ఉన్నత స్థానాలలో వున్నారు.  వారి శిష్యులెవరంటే – చాట్ల శ్రీరాములు, పొట్టిప్రసాద్, కనకాల దేవదాస్, సాక్షిరంగారావు , వంకాయల సత్యనారాయణ, మిశ్రో ,థమ్ ,తంబు, పావలా శ్యామల,గణేశ్ పాత్రో మొదలైన వారు. ఇంకా చాలా మంది వున్నారు. అన్నట్టు రాజబాబు కూడా ఆయన దర్శకత్వంలో నటించి నటనకు మెరుగులు దిద్దుకున్నాడట. గణేశ్ పాత్రో ని ఆయన   అల్లుడుగా కూడా చేసుకున్నారు.గణేశ్ పాత్రో రాసిన “పావలా,కొడుకు పుట్టాల ” నాటకాలలో కె.వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు, నటించారు.

రంగస్థలం మీద ఆయన నటనచూసి ముగ్థులయిన వారు ఆయనకు “నటరాజు” అనే బిరుదు నిచ్చారు.  ఇంకా చాలా బిరుదులున్నప్పటికీ ఆయనను” నటరాజు వెంకటేశ్వరరావు “అనే పిలిచేవారు. ఆయన అనేక నట సమాఖ్యలు నెలకొలిపి  నడుపుతూ వుండేవారు. ఆయన ఆధ్వర్యంలో ప్రదర్శించిన నాటకాలు “కీర్తిశేషులు,కన్యాశుల్కం,టీ కప్పులో తుఫాను,రాగరాగిణి,నా బాబు,కనకపుష్యరాగం,కప్పలు ” మొదలైనవి.

గొల్లపూడి మారుతీ రావు గారి మీద కూడా ఆయన ప్రభావముందని చెబుతారు “రాగరాగిణి” ఆయన రాసిన నాటకమే.మారుతీ రావు గారు తన స్వీయచరిత్ర “అమ్మకడుపు చల్లగా” లో కె.వెంకటేశ్వరరావు గారి స్వభావాన్నీ జీవితాన్ని ప్రతిబింబిస్తూ “మహానటుడు” అనే నాటకం రాసి వారికి ఇస్తే ,అద్భుతంగా ప్రదర్శించారని రాశారు.అందులో “మహానటుడు”గా కె.వెంకటేశ్వరరావు నటించారనీ,అతని శిష్యుడుగా సాక్షి రంగారావు నటించారనీ రాశారు.

ఆయన వ్యక్తిగత వివరాల విషయానికి వస్తే కుప్పిలి వెంకటేశ్వరరావు తల్లి సీతయ్యమ్మ,తండ్రి ప్రకాశరావు.తండ్రి దక్షిణమధ్య రైల్వేలో హమాలీ గా పనిచేసేవారు.కె.వెంకటేశ్వరరావు జన్మించింది కూడా ఖాళీ గా పడి వున్న ఒక రైలుపెట్టెలోనే! ఆయన జన్మస్థలం పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చాగల్లు.ఆయన 1923 నవంబర్ 20 న జన్మించారు .ఇది ఆయన శతజయంతి సంవత్సరం. చిన్నతనం నుండీ చనిపోయేవరకూ ఆయన ఉబ్బసం జబ్బుతో బాధపడేవాడు. సంభాషణలు పలకడంలో అసమాన ప్రతిభ చూపే వెంకటేశ్వరరావుకి అనారోగ్యం వలన యెనిమిదో యేడు వచ్చేవరకూ మాటలు సరిగా రాలేదట..విచిత్రం!

చిన్నతనం లో  సుమారు పదేళ్ల వయసులో ఒక బిచ్చగాడిని అనుకరిస్తుంటే చూసి  అందరూ చాలా మెచ్చుకున్నారట.బహుశా అదే ఆయన నటనకు పునాది వేసి వుండవచ్చు. కె.వెంకటేశ్వరరావు పెద్దగా చదువుకోలేదు .రాజమండ్రి ఆర్ట్ కాలేజ్ లో ఇంటర్మీడియెట్ చదువుతూ ఆర్థికకారణాల వలన చదువు మధ్యలోనే నిలిపివేశారు. అయితే కళాశాలలో చదువుతుండగా ఇతనిలో నటనా ప్రతిభ వుందని గుర్తించిన ఆ కాలేజ్ ఫిజిక్స్ లెక్చరర్ పింగళి వెంకట్రామయ్య ప్రోత్సాహంతో “కరణీకం” అనేనాటకం లో నటించి,మొదటి నాటకంతోనే ఉత్తమ నటుడుగా బహుమతి అందుకున్నాడు.

1945లో చిరుద్యోగిగా  దక్షిణ మధ్య రైల్వేలో చేరి శ్రీకాళహస్తిలో ఒక సంవత్సరం పాటు పని చేశారు.1946 లో విజయవాడ  చేరుకున్నాక నాటకం ఆయన ఊపిరిగా మారింది.ఎన్నో నాటకాలలో నటించారు,దర్శకత్వం వహించారు .ర.స.న అనే నాటక సమాఖ్యను స్థాపించి యెంతో మందికి శిక్షణనిచ్చారు.అప్పుడే ఆకాశవాణి కి కూడా కొన్నినాటకాలు సమర్పించారు.1960 వరకూ విజయవాడ కేంద్రంగా నాటకాలాడుతూ వుండేవారు.

1958లో దేశ రాజధాని ఢిల్లీ చేరుకుని అక్కడఏషియన్ థియేటర్ ఇన్స్టిట్యూట్ లో కొన్నాళ్లు వుండి నాటక రంగంలోని మెళుకువలు తెలుసుకున్నారు. ఆ సమయంలో అక్కడ దక్షిణ భారత నటీనట సమాఖ్య ను స్థాపించి యెన్నో తెలుగు నాటకాలాడారు.ఆ సంస్థ ఆ తర్వాత కూడా చాలా కాలం కొనసాగింది.

1961లో విశాఖపట్టణం లోని ఆంధ్రా యూనివర్సిటీలో స్థాపించిన థియేటర్ ఆర్ట్స్ విభాగంలో స్టేజీ డైరక్టర్ గా కె.వి.గోపాలస్వామి చేత నియమితులయ్యారు .ఎంతో మంది నటీ నటులను తీర్చిదిద్దారు.

ఆయన పరిషత్తు నాటకాలకి జడ్జిగా వుండి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ప్రతిభ గల నటులను వెతికి పట్టుకుని ప్రోత్సహించే వారు. ప్రసిధ్ధ రచయిత రా.వి.శాస్త్రి సాంఘిక నాటకాలలో కె.వెంకటేశ్వరరావుకు సాటి వేరెవరూ లేరని మెచ్చుకునే వారు.

ఆత్రేయ రచించిన “నాబాబు” నాటకంలో అద్భుతంగా నటిస్తున్న కె.వెంకటేశ్వరరావుని చూసి డి.వి.సుబ్బారావు గారు “నటరాజు” అనే బిరుదు ప్రదానం చేశారు.ఆ నాటకంతో ఆత్రేయతో  పెరిగిన సాన్నిహిత్యం ,ఆత్రేయ సొంత సినిమా “వాగ్దానం” కు వెంకటేశ్వరరావు అసిస్టెంట్ గా పనిచేసేందుకు దోహదం చేసింది.ఆ సినిమాలో ఆయన హీరో తండ్రిగా చిన్న వేషం కూడా వేశాడు.

సినిమా రంగంలో కొంతమంది ఆయనంటే అభిమానంగా వున్నప్పటికీ ఆయనకు సినిమా వ్యామోహం పెద్దగా లేదు.ఆయనను అభిమానించే వారిలో. బి.యన్ .రెడ్డి, చక్రపాణి కూడా వున్నారు. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన “ఇద్దరు మిత్రులు “లో ఆయన ఒక నౌఖరు వేషం వేశారు.సంభాషణలు పలకడం లో దిట్ట అయిన ఆయనకు అందులో మూగ,చెవిటి వేషం ఇవ్వడం వెనక ఒక నటుడు ఆయన గొంతు వినపడకూడదని పెట్టిన ఆంక్ష కారణమంటారు.  “కన్నెవయసు” లో ఆయన హీరోయిన్ తండ్రిగా  వేయడానికి కారణం ఆ చిత్రం నిర్మించిన  ఆయన శిష్యులేనని విన్నాను.అందులో ఆయన అద్భుతంగా నటించాడు. అదే ఆయన ఆఖరు సినిమా. ఆసినిమా విడుదలవకుండానే ఆయన మరణించారు. “నటరాజు,రంగస్థల నటసామ్రాట్ ,నట చతురాసన,రంగ భాస్కర “మొదలైనవి ఆయన బిరుదులు.

రంగస్థలమే తన ప్రయోగ శాలగా,నాటకమే జీవితంగా,నటనే తన ఊపిరిగా భావించే ఆయన1973 మే 12 తారీఖున  సికింద్రా బాద్ లో లలితకళాసంస్థ చేత ఘనంగా సత్కరించబడిన మూడురోజులకే మే 15 వతేదీన ఆ నటరాజులో ఐక్యమవడం ఒక విషాదం. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వారి తనయుడు ప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ విభాగానికి స్టేజ్ డైరెక్టర్ గా పని చేస్తూ వుండటం గొప్పవిషయం. తెలుగు నాటక రంగం  మరిచిపోలేని నటుడు కె.వెంకటేశ్వరరావు కి వారి శతజయంతి సందర్భంగా నివాళి.

పి.యస్ … ఈ సమాచార సేకరణకు బి.వి .అప్పారావు గారు రాసిన వ్యాసాలూ ,ఆన్ లైన్లో లభించిన సమాచారమూ,తనికెళ్ల భరణి గారు చెప్పిన  విశేషాలూ ఉపకరించాయి. వారి శతజయంతి  సందర్భంగా నైనా వారు నటించిన “కన్యాశుల్కం” నాటకం అభిమానులకి వినడానికి అందుబాటులో వుంచితే బాగుంటుంది .ప్రస్తుతం యూట్యూబ్ లో వినపడే నాటకంలో ఆయన పేరు అనౌన్స్ చేస్తున్నారు కానీ వినపడే నాటకం ఆయన నటించింది కాదు.జే.వి.రమణ మూర్తి,జే.వి.సోమయాజులూ నటించింది.

*

రొంపిచర్ల భార్గవి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Great introduction of a great Telugu Drama actor. He along with Potti Prasad started Dakshina Bharata Natee Nata Samakhya, a Telegu theatre group in 1958 in Delhi . I had the good fortune join this group in 1975 and over the years (having settled in Delhi) became a well known theatre activist in Telugu states.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు