ప్రయాణంలో అయిదవ రోజున- జనవరి మూడు- నేను పెట్టుకొన్నవి రెండు లక్ష్యాలు: కావేరీనది సముద్రంలో కలిసేచోటు చూడటం, కేప్ కలిమెరె చేరుకోవడం.
మధ్యలో కడలూరు, పిచ్ఛావరం, పూంబుహార్, కరైక్కాల్, నాగపట్నం, తరంగంబాడి, వేలాంగిణిలాంటి ప్రసిద్ధ స్థలాలు వస్తాయని తెలుసు. పూంబుహార్, ట్రాంక్వోబార్ లలో తప్పకుండా కాసేపయినా ఆగాలని ఆలోచన. పిచ్చావరం, వేలాంగిణి అంతకుముందు చూసినవే. వదిలెయ్యవచ్చు. మిగిలిన ప్రదేశాలలో సమయం అనుకూలిస్తే ఆగడం, లేదా ముందుకు వెళ్లిపోవడం- అదీ ఆలోచన.
సారంగ చానల్ లో చూడండి
మద్రాసునుంచి మహాబలిపురం దాకానూ, ఆపైన పాండిచ్చేరిదాకానూ ‘హైవేల మీద రావడం’ అన్న పాపం ఇంకా సలుపుతూనే ఉంది. ఈనాటి ప్రయాణంలో వీలయినంతవరకూ హైవేను వదిలి చిన్న చిన్న రోడ్లమీద మారుమూల గ్రామాలగుండా సాగాలని గట్టి పట్టుదల… పాపం రామకృష్ణ నాకోసం అతి విపులమైన తమిళనాడు, కేరళ మ్యాపులు సేకరించి ఇచ్చాడు. నిన్నటి అర్ధరాత్రివరకూ వాళ్లింట్లో ఇంటర్నెట్ మీద గూగుల్ మ్యాపులూ మరోసారి అధ్యయనం చేశాను. ఒక అవగాహన వచ్చింది.
పాండిచ్చేరి ఇంట్లోంచి బయల్దేరేసరికి విపరీతమైన పొగమంచు. కొంచెం దూరందాకా రామకృష్ణ తోడువచ్చి మెయిన్ రోడ్డు ఎక్కించాడు. సులభంగానే పాండిచ్చేరి ప్రాంతపు పొలిమేరలు దాటి కడలూరు దారిపట్టాను. అరగంటలో కడలూరు… కడలి ఊరు కడలూరు అయిందట. స్వాతంత్ర్యం రాకముందు మా కుటుంబాలలోని ఒకరిద్దరు కడలూరు జైలులో ఉన్నారు. అంచేత ఆ పేరు వింటే చిరపరిచిత భావన.
“కడలూరు దాటాక ఓల్డ్ టౌను వస్తుంది. అక్కడ కొంచెం జాగ్రత్తపడితే ‘సిల్వర్ బీచ్’కు వెళ్లేదారి దొరుకుతుంది. అక్కడ్నించి పరంగిపట్నం దాకా ఓ ఏభై అరవై కిలోమీటర్లు మీకు ‘కోస్టల్ రోడ్’ దొరుకుతుంది. మీరన్నట్టుగా అది సముద్రాన్ని హత్తుకొని వెళుతుంది…” వివరం చెప్పాడు రామకృష్ణ.
కాస్త జాగ్రత్తపడి ఆ కోస్టల్ రోడ్ పట్టుకోగలిగాను.
సన్నపాటి రోడ్డు. గభాలున ఎదురుగా మరో వాహనం వస్తే నిమ్మళించి దాటుకొని వెళ్లవలసిన అవసరం ఉండే రోడ్డు. అయినా అది అక్షరాలా నేను కలలుగన్న రోడ్డు కదా- చాలా ఇష్టంగా అనిపించింది. రెడ్డియార్పేట, సోఠికుప్పం, కుమారపేట- నేను ఎపుడూ విని ఉండని ఊళ్లు, పేర్లు… బహుశా మరోసారి జన్మలో చూడనేమో ఈ ప్రదేశాలు…
ఇంతకీ సముద్రం ఎక్కడా?… నే చదివిన మ్యాపు చెపుతోంది… కనిపిస్తోన్న ఉప్పుమళ్లు చెపుతున్నాయి… నీటికయ్యలు చెపుతున్నాయి… ఉప్పటిగాలి చెపుతోంది… పక్కనే సముద్రముందని తెలుస్తోంది- మహా అయితే కిలోమీటరు ఎడంలో అనంతజలరాశి ఉన్న స్ఫురణ కలుగుతోంది… కానీ ఆ దృశ్యం కంటికి మాత్రం కానరావడం లేదు. విచిత్రమైన పరిస్థితి… ఏదన్నా ఊరిలో ఎడమకు మళ్లి సముద్రపు ఒడ్డుదాకా వెళ్లి వద్దామా అనిపించింది.
ఓ గంటా గంటన్నరలో ‘పరంగి పెట్టాయ్’ చేరుకొన్నాను.
ఎందుకో ఈ ఊరి పేరు బాగా పరిచయం నాకు- ఎలా ఎక్కడ పరిచయమో తెలియదు… ఆ పేరే కాస్తంత విలక్షణంగా ఉందిగదా- ఏ తమిళ సహోద్యోగి దగ్గరో విని ఉండాలి… ఊళ్లో కాసేపు గడపాలనిపించింది.
అపుడే ఒళ్లు విరుచుకొంటోన్న ఓ బడ్డీ హోటలు దగ్గర టిఫిను కోసం ఆగాను. కాఫీ మాత్రం దొరికింది. ఇద్దరు నడివయస్కులు… ముస్లిం వస్త్రధారణ… పలకరించారు.
‘ఈ పరంగిపేటలో ముస్లింల సంఖ్య చాలా ఎక్కువ. మెజారిటీ… భాష కూడా తమిళంతో పాటు ఉర్దూ…’ అని వివరం అందించారు. తనివితీరేలా హిందీ-ఉర్దూ సంభాషణ సాగించాను. తదుపరి మజిలీ పిచ్చావరం మీదుగా అని విని తమకు తెలిసిన దారి చెప్పారు. ఆ ఊరి రోడ్లమీద ముస్లిం వ్యక్తులు బాగా కనిపించారు.
ఈలోగా అక్కడి రైల్వేగేటు మూతపడింది. ఆ గేటుకు అనుకొనే పరంగిపట్నం రైల్వేస్టేషను… ‘ఇదీ బావుందిలే’ అనుకొని ఆ ప్లాట్ఫాం మీద కాస్తంత పచార్లు… పక్కనే ఉన్న ఓ స్కూటరు మెకానిక్కు షాపు కనబడింది. ఓసారి బండి నడిపి ప్రాధమికమైన విషయాలన్నీ సవ్యంగా ఉన్నాయో లేదో నిర్ధారించమని అడిగాను. ఆ మెకానిక్కు మహాసౌమ్యుడు. మృదుభాషి. ఎంతో మర్యాదగా ప్రవర్తించాడు. శ్రద్ధగా బండిని పరిశీలించాడు. బ్రేకు కాస్త బిగించి పెట్టాడు. ముందూ వెనకా చక్రాల నట్లూ, బోల్టులూ ఓసారి సరిచూశాడు. ‘బండి చక్కని కండిషన్లో ఉంది. సాగిపోండి,’ అని పచ్చజెండా ఊపాడు.
ఎంత వద్దనుకొన్నా స్థానికుల సలహాలు విని, పాటించి, పల్లెదారులు వదిలి ఓ పదినిముషాల్లో NH 45ఎ మీదకు చేరుకొన్నాను. ముట్లూరు అన్న ఓ మోస్తరు గ్రామం… అది దాటీదాటగానే ఏదో రెండు మూడు వందల అడుగుల వెడల్పున్న నది… వంతెన… అదే కావేరీ నదా?… కావేరి అపుడే రాగూడదే… చిదంబరం దాటిన తర్వాత రావాలి గదా- ఎవర్నో వివరమడిగాను. నిజమే- ఈ నది పేరు వెల్లార్ నది. మరో ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కలవబోతోంది- అందుకే ఆ విశాలత. హైదరాబాదు-విజయవాడ రహదారిలో కీసర దగ్గర మరో పది కిలోమీటర్లలో కృష్ణానదిలో కలవబోయే మునేరు మహా విశాలంగా కనిపించడం గుర్తొచ్చింది.
వెల్లారు నది మీది బ్రిడ్జి దాటి రెండు నిమిషాలు గడవకముందే పిచ్చావరం వెళ్లేదారిని చూపే బోర్డుల సముదాయం కాస్తంత అట్టహాసంగా కనబడింది. అంతకుముందు ఒకసారి చూసిన ప్రదేశంగదా వదిలిపెడదాం- అనిపించినా మనసు అటువేపుకు మళ్లింది. బండిని ఆ వేపుకు తిప్పాను. ఎవరో ఓ కుర్రాడు లిఫ్టు కోసం అడుగుతూ కనిపించాడు.
“లిఫ్టుదేం భాగ్యంగానీ బాగా ఆకలేస్తోంది, మంచి టిఫిను దొరికే చోటు చూపిస్తావా?” అడిగాను. సరేనన్నాడు.
అతగాడు స్థానికుడు కాదుగానీ అక్కడి ఏదో పోస్టాఫీసులో ఉద్యోగిగా ఏడాది క్రితం వచ్చాడట. ఇంగ్లీషు మాట్లాడాడు. చెప్పినట్టే అతి చక్కని ఇడ్లీలు, దోశలు దొరికే ఓ మంచి హోటల్ కు తీసుకువెళ్లాడు. తొందర లేకుండా కబుర్లు చెప్పుకొంటూ టిఫిన్ చేశాం. ఉద్యోగంలో తొలి అడుగులు వేస్తోన్న అతను- మలి అడుగులు కూడా వేసేసిన నేను! అయినా కబుర్లు సమస్థాయిలో సాగాయి. నన్నూ నా ఏక్టివానూ ఫోటోలు తియ్యమన్నాను. అతి తియ్యటి జ్ఞాపకాల్లా మిగిలిపోయే
రెండు ఫోటోలు తీశాడు!
పిచ్చావరం మరో రెండు కిలోమీటర్లుందనగా అతగాడు దిగిపోయాడు. అతను దిగీ దిగిపోగానే ఓ మలుపులో రోడ్డు దాటుతూ అతి దగ్గరలో నాలుగడుగుల నల్లపాము! నీటిపామా నాగుపామా?! అది ఏ పాము అయినా ఆ విషయాల్లో పరిజ్ఞానం లేదుగాబట్టి గుండె గుబేలుమనడం, ఒళ్లు జలదరించడం తప్పలేదు. అతి కష్టంమీద పాము మీదకు స్కూటరు ఎక్కకుండా తప్పించగలిగాను. మరో ఏభై అడుగులు ముందుకు వెళ్లి స్కూటరాపి గుండె వేగం మామూలు స్థాయికి చేరేవరకూ ఆగి ముందుకు సాగాను.
పిచ్చావరం ఓ చిన్నపాటి పులికాట్ సరస్సు… చిల్కా సరోవరం… ఉందని మ్యాపులు చెప్పాయి.
కడలూరుకు దక్షిణాన అరవై కిలోమీటర్ల దూరాన, చిదంబరానికి తూర్పున ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న విహారకేంద్రమది. చొచ్చుకు వచ్చిన ఉప్పునీటి సముద్రపు కయ్యలు, వాటి నిండుగా మడ అడవులు, అనేకానేక మరీ లోతులేని జలమార్గాలు, వంద పై చిలుకు పక్షిజాతులు, శీతాకాలంలో వలసపక్షులు, రకరకాల జలక్రీడా సదుపాయాలు- పిచ్చావరాన్ని పర్యాటక ‘పక్షుల’ కేంద్రంగా మార్చాయి. ఉత్తరాన వెల్లార్ నది, దక్షిణాన కొళ్లిడం అనే మరోనది, తూర్పున బంగాళాఖాతం, మధ్యలో మడ అడవులతో పది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణపు పిచ్చావరం ఉప్పునీటి సరోవరం…
ఇరవై ఏళ్ల క్రితం నేనూ సహచరి లక్ష్మీ చిదంబరంలోని అన్నామలై యూనివర్శిటీలో దూరవిద్య ద్వారా ఎమ్మేలు చేస్తున్నపుడు చిదంబరం రావడం, పిచ్చావరం చూడటం జరిగాయి. అయినా పక్కనుంచే వెళుతున్నాగదా ఓ పదినిమిషాలు ఆగుదాం అనే ఉద్దేశ్యంతో అక్కడికి చేరాను.
అప్పటికీ ఇప్పటికీ ఎంతో మార్పు కనిపించింది. అప్పట్లో ఏదో ఓ గ్రామీణ సరోవరతీరంలా అనిపించిన పిచ్చావరం ఈనాడు నవనాగరిక ఆధునిక టూరిస్టు కేంద్రంలా కనిపించింది. ఓ రిసెప్షను ఆఫీసు, బుకింగు కౌంటరు, ఓ చక్కని శిల్పమాలిక, క్యాంటిను, పక్కనే మానేజిమెంటు వారి ఆఫీసులు, నదిలో రంగురంగుల ఫైబర్ పడవలు- బావుంది. అన్నట్టు ఆ నది పేరు ఉప్పనాఱు రివర్ అట. బహుశా తెలుగులో ఉప్పుటేరు అనవచ్చనుకొంటాను.
అప్పుడే బోటింగుకు కౌంటరు తెరుస్తున్నారు. మనసటు ఊగింది. ఓ అరగంటే గదా అనిపించింది. వెళ్లాను. బోటు బోటుల లెక్కన అద్దెకిస్తారట. ఒక్కొక్కళ్లకి విడిగా టికెట్లు ఇవ్వరట! ఇదెక్కడి నియమంరా బాబూ అనిపించింది. బోటుకొక్కటికీ ఆరుగురు పడతారు.
కౌంటరు దగ్గరి కుటుంబాలను పరిశీలించాను. ఓ ఇద్దరు పిల్లలు, నలుగురు సభ్యుల కుటుంబం కనిపించింది. ‘అయిదో మనిషిగా నన్ను చేర్చుకోండి,’ అని అడిగాను. భార్యభర్తలిద్దరూ కళ్లతో కూడబలుక్కుని కుదరదని చెప్పేశారు. ఈ విషయం గమనిస్తోన్న మరో దంపతులు, ‘రండి మాతో,’ అని ఆహ్వానించారు. ఇద్దరు చిన్నపిల్లలు వీరికి.
బోటు సముద్ర ముఖద్వారందాకా వెళుతుందేమో అనుకొన్నాను. వెళ్లదట. ఆ ముఖద్వారం రానూ పోనూ పది కిలోమీటర్లట- రెండు గంటలు. అరుదుగాగానీ అక్కడికి బోట్లు ఉండవట. సరే అనుకొని ఆ తమిళ దంపతులతో నదిలో ముందుకు సాగాను.
విశాలమైన నది కాస్తా కాసేపట్లో అతి సన్నని జలమార్గాల్లోకి ప్రవేశించింది. అటూ ఇటూ దట్టంగా మడ అడవులు. అక్కడక్కడ చెట్ల మీద తెల్ల తెల్లని పక్షులు. ఆ మడ కొమ్మల్నే నరికి నెత్తిన పెట్టుకొని మొలలోతు నీళ్లలో నడిచి వెళుతోన్న స్థానికులు- ఓ నలభై నిమిషాలు… ఆ కుటుంబంతో, పిల్లలతో సరదాగా కబుర్లు.
బోటు దిగాక పక్కనే ఓ అబ్జర్వేషన్ టవర్ ఉందనీ, అక్కడో టెలిస్కోపు కూడా ఉందనీ తెలిసింది. గబగబా ఆ మెట్లు ఎక్కాను. పలమనేరులోలాగా నేను పైన, ఆకాశం క్రింద!! అడవులన్నీ ఎంతో దిగువన, దూరాన లీలగా సముద్రం… టెలిస్కోపులోంచి చూడగా అతి స్పష్టంగా కెరటాలు… గంట పది కొట్టేసింది!
పిచ్చావరం మనసులో నింపిన ఉత్సాహం పుణ్యమా అని బండి అప్పటిదాకా ప్రణాళికలో లేని చిదంబరం వేపుకు మళ్లింది.
అంతా కలిసి ఇరవై కిలోమీటర్లు. ఈ లోపల మైలోమీటర్లో 44444 అన్న రీడింగు… ఆ చరిత్రాత్మక సంఘటనను కెమెరాలో బంధించాను బయలుదేరి 724 కిలోమీటర్లు గడిచాయన్నమాట.
మరో అరగంటలో చిదంబరం ఊరు చేరుకొన్నాను ఇంకో పావుగంటలో గుడిలో.
గుడి మహా హడావుడిగా ఉంది. ఇరవై ఏళ్ల క్రితం వచ్చినపుడు గుడి ఆవరణ అంతా చక్కగా విశాలంగా ఖాళీగా ఆత్మీయంగా అగుపించింది. ఇపుడు మరి ఏం మార్పులు చేర్పులు వచ్చాయోగానీ క్రిక్కిరిసినట్టు అనిపించింది. ఇరవై సంవత్సరాలకే నాకు ఇలా అనిపిస్తోంటే ఏభై అరవై ఏళ్లనుంచీ చూస్తున్నవాళ్లు ఇంకెంత అసౌకర్యంగా ఫీలవుతారో గదా!! స్పీడు పెరగడమంటే గుడులు కూడా కార్పొరేటీకరణకు గురి అయి, ప్రశాంతతను కోల్పోవడమేనా? మరీ పాతకాలం మనిషిలా ఆలోచిస్తున్నానా? ఏది ఏమైనా నేను గుడులకు వెళ్లేది విగ్రహాలకోసం కాదు- ప్రశాంత రమణీయ వాతావరణం కోసం….
గుడి ఆవరణలో ఓ పాతిక ముప్ఫైమంది అమెరికా టూరిస్టులు కనిపించారు. చాలావరకూ యువతీ యువకులే… చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా వాళ్లంతా చీరలు, ధోవతులు, అంగవస్త్రాలు, చెవుల దుద్దులు, మెడల దండలు, నుదుట విభూతులు, పూలచెండుల జడలు, చెరగని సంతోషపు నవ్వులు- ఎడారిలో ఒయాసిస్సులా అనిపించారు. ఓ న్యూయార్కు యువజంటను పలకరించి వాళ్లు ఇబ్బంది పొలిమేరలలోకి చేరేవరకూ కబుర్లు సాగించాను.
మండపాల్లో వేదపారాయణం చేస్తోన్న పిల్లలు, లక్ష దీపార్చనా అనిపించేలా అనేకానేక దీపాల వరుసలు, బయట రాసులు పోసి మాలలు కడుతూ పూలమ్ముతున్న ఆడవాళ్లు, ధీరగంభీరంగా గుడి గోపురాలు… గర్భగుడి దగ్గర ఉన్న భక్త జనసందోహాన్ని చూసి విగ్రహదర్శనం అన్న పని పెట్టుకోకుండా బయటపడ్డాను. అయినా ఓ గంట గడిచిపోయింది.
*








Add comment