కొత్త వ్యాఖ్యతో కుంతి కథ!

రేణుక  అయోలా గారి పృథ ఇప్పుడే చదివాను. అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టింది నేను బైరప్ప గారి పర్వ పూర్తిగా చదవలేదు ఒకటి ప్రింట్ కాపీ దొరకకపోవడం రెండోది డిజిటల్ లో అంత చిన్న ప్రింట్ చదవలేకపోవడం! సరే అది పక్కన పెడితే కుంతీదేవి పేరు ఒరిజినల్ పేరు పృథ అని నాకు తెలియదు. ముందు మాటతో సహా కూర్చోబెట్టి చదివించింది ఈ లాంగ్ పోయెమ్.

రేణుక   వచనంలో కవిత్వంలో కొన్ని మేజిక్ రియలిజం లాంటి ఇమేజరీ లు ఉంటాయి. మొదట పేజీ తీయగానే.. ఎవరిదో ఒక మాట మీకు అద్దానికి తగిలి ముక్కలు అవుతూనే ఉంటుంది ముక్కలవుతూనే ఉంటుంది… అనగానే ఇది పృథ కి ఏంటీ అందరికీ వర్తిస్తుంది కదా అనిపిస్తూంది. కుంతి కథ  కొత్తదేం కాదు చిన్నప్పుడు నుంచి విన్నదే..కానీ సహజమైనది మాత్రం కాదు.

రేణుక  మాటల్లో చెప్పాలంటే

అందమైన దేహం చుట్టూ కథ

కథ చుట్టూ నమ్మకాలు బానిసత్వాలు

చరిత్ర జాతరలో వంశం కోసం

తెచ్చుకున్న బలమైన

పెయ్య దూడలు ఆడవాళ్ళు…

ఎంత పురాదుఃఖం లేకపోతే ఎంత బలమైన ప్రకటన వస్తుంది అనిపించింది.

పృధ మాత్రమే కాదు చాలా వరకు ఇప్పటివరకు ఇంకా ముందు వరకు కూడా ఆడవాళ్లు పెయ్యదూడలే.. పితృస్వామ్యం ముందు, వంశ పరిరక్షణ ముందు, ఆస్తి సంరక్షణ ముందు.. ఆడదానికి ఒక మనసు, సేన్సిటివిటి వుంటుంది అని ఆలోచించే సమూహాలు ఉన్నాయా అంటే, సందేహమే.

వరం ఇచ్చేది వాళ్లే దాన్ని పరీక్షించేది వాళ్లే కోరిక తీరాక వదిలిపోయేది వాళ్లే కానీ ఆ బరువు శరీరంలో మోసి తర్వాత మనసులు మోసి తర్వాత వంశాల చిట్టాలు లెక్కలు తెలియని అయోమయంలో సందిగ్ధంలో కొట్టుకునేది మాత్రం పృథ లే. సేవలకు పంపినప్పుడు ఆడపిల్ల అని స్పృహ లేని కుటుంబాలకి రాజరికాలకి, ఒక ఆడది పెట్టిన బిక్షతో వెలిగిన రాచరికాలకి, వాళ్లు దీపాల్లా వెలగడానికి కింద నూనె పైన నల్లటి మరకలుగా మిగిలిపోయిన ఆడవాళ్ళ వ్యధలకి ఇదొక తార్కాణం.

ఇదేనా జీవితమంటూ.. వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుంది కుంతి.

స్త్రీ పనికి వస్తుందో లేదో

ఒక సంతానం ఇస్తుందో లేదో

బేరాలు ఆడుకొని బేరగాళ్ళకి

స్త్రీ ని సుఖపెట్టే సత్తా ఉందా?

అని అడిగే నాగరికత లేదని… సూటిగా అడుగుతుంది..

 

కాలితో ఇసుక మేడని తన్నిన

పాదాల మంటని చల్లార్చుకోవడం ఎలా?

అని జ్వలిత ఆగ్రహంతో మండిపోతుంది

కానీ ఆ మంట మళ్ళి తనని కాలుస్తోందనే స్పృహ లేని మనిషి కాదు తాను..

ఈ కథలో చాలా కోణాలు ఉన్నాయి ఆమె జీవితం లాగే సరోగసి మాత్రమే కాదు ఇంపోటెన్సీ వల్ల కూడా నలిగిపోయిన జీవితం పృధ ది. ఇప్పుడైతే పాండురాజుకి టెస్టులు చేయించి విడాకులు తీసుకునేదేమో ఆమె కానీ తాను బతికిన జీవితంలో కాలంలో ఒక అవకాశం లేదు ఇప్పటికి చాలామంది కి ఆ అవకాశం లేనే లేదు.

ఇంపోటెంట్ ఆయన భర్తని అతని పరువు ని కాపాడడానికి గొడ్రాలితనం తన నెత్తి మీద వేసుకొని జీవితాంతం ఆ శాపం ధరించిన ఆడవాళ్ళందరూ వరుసగా గుర్తొచ్చారు నాకు. అదే నరకంలోకి సవతిగా మాద్రి అడుగు పెట్టినప్పుడు, తను ఆడదాన్ని అని నిరూపించుకోవడం అమ్మని అవ్వగలను అని నిరూపించుకోవడం ఒక అవసరంగా మారుతుంది కుంతికి..

చదువుతుంటేనే ఒళ్ళు గగుర్పాటుకి గురయ్యే వాక్యాలు రాశారు రేణుక.  ఆమెని పృథ ఆవహించిందని  అనిపించింది. కుంతీ రాచరికల భావోద్వేగ నపుంసకత్వాలు కూడా గమనిస్తోనే ఉంది. వ్యంగ్యం, దుఖం, నిర్వేదం, వేదన కలసిన.. జీవితం పృధది.

ఒకపక్క పోగొట్టుకున్న కొడుకు దుఖం.. మరోపక్కన ఏ సుఖం అనుభవించనీయని నిర్వేద సూక్తం..

గతం గాయాలు భవిష్యత్ కి బేడీలలా మారిన ఎందరో ఆడవాళ్ళ కధ ఈ పృధ.

కుంతి కధే కదా .. మళ్ళీ ఎందుకు చెప్పారు అనుకున్నాను. కానీ, ద్రౌపది శృంగారంలో ఎలా ఉండేదో ఊహించి రాసిన వాయూరిస్తిక్ రచనలు కొనియాడబడుతున్న ఈ రోజుల్లో.. కుంతీ దుఖం చాలా కాంటెంపరారీ కదా అనిపించింది.  కేవలం క్షత్రం గా మాత్రమే ఉపయోగ పడ్డ ఒక అద్దె తల్లి కుంతి. కోరిక తీరని భార్య కుంతి. తన సొంతం అంటూ ఏమీ లేకపోయినా బిడ్ల హక్కుల కోసం దీర్ఘ ప్రయాణం, వనవాసాలూ, అజ్ఞాత వాసాలూ చేసిన ఒక యోగిని కుంతి. పేరుకి అందరూ ఉన్నా, ఉపయోగ పడని కర్ణుడి శాపాల్లా, సమూహంలో వొంటరిగా బ్రతికిన ధీర కుంతి.

రేణుక గారి మాటల్లో చెప్పాలంటే…

కుంతీ జీవితం ముగిసిందీ లేదు

బతికిందీ లేదు

సమాధి కట్టబడింది అంతే.. !

ఎందరో జనావాసాల్లో, వొంటరిగా వ్యధని అనుభవిస్తున్న అభినవ కుంతిల వ్యథ ఈ పృధ .. !!

హేట్స్ ఆఫ్ రేణుక గారూ.. ఆడవాళ్ళు మాత్రమే సంధించగల ప్రశ్నల్ని చాకచక్యంగా, స్థిమితంగా ఒక సహానుభూతి తో సంధించారు.

*

సాయి పద్మ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు