కొత్త ‘దారి తెలిసిన వేకువ’

రోజుక్కొంత శిథిలమైపోతున్న మానవ సంబంధాలను, విధ్వంసమౌతున్న మధ్య తరగతి జీవన శైలిని కథీకరిస్తున్న అరుదైన తెలంగాణ కథా రచయిత బెజ్జారపు వినోద్ కుమార్. 2003లోనే ‘గవ్వల మూట’ పేరుతో కథా సంపుటి ప్రచురించిన వినోద్ కుమార్ తరువాత రాసిన కథలన్నీ ఇంకా పుస్తకంగా రాలేదు. ఇదొక లోటు. బెజ్జారపు వినోద్ కుమార్ పేరు చెప్పగానే ‘తాతయ్య వాచి’, ‘పక్షులు వాలిన చెట్టు’, ‘వేరు మర్చిన చెట్టు’ తదితర కథలు గుర్తుకు వస్తాయి. తాను చెప్పదల్చుకున్న పాయింట్ చుట్టూ కథ అల్లుకుంటూ పోవడం వినోద్ కుమార్ ప్రత్యేకత. అలాంటి మరో గొప్ప కథ దారి తెలిసిన వేకువ’. నిజానికి వినోద్ కుమార్ అవార్డుల రచయిత తాను రాసిన కథల్లో చాలా వాటికి వివిధ పోటీల్లో బహుమతులు వచ్చాయి. ఈ కథకు కూడా 2013లో స్వాతి వార పత్రిక నిర్వహించిన అనిల్ అవార్డ్ కథల పోటీల్లో 25000/- బహుమతి లభించింది.

కథకుడు రెండు నెలల క్రితం సాఫ్ట్ వేర్ ఉద్యోగం పోగొట్టుకొని కాసింత ప్రశాంతత కోసం ఏదో రిజర్వాయర్ దగ్గరికి వచ్చి రెయిలింగ్ పై కూర్చోవడంతో కథ మొదలవుతుంది. అక్కడే ఒక నడీడు మనిషి సెనగలు, బఠానీలు అమ్ముతుంటాడు. కథకుడు ఆగమ్య గోచరమైన తన జీవితం గురించి తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. ఇంతలో అక్కడ ఏదో గొడవ ప్రారంభం అవుతుంది. తన కొడుకుకు కొనిచ్చిన సెనగల్లో పురుగు కనిపించిందని ఒక తండ్రి సెనగలు అమ్ముతున్న వ్యక్తి పైకి పెద్ద పెద్దగా అరుస్తుంటాడు. చూస్తుండగానే గొడవ పెద్దదైపోతుంది. పిల్లాడికి ఏమైనా అయితే నువ్వు వాడి ప్రాణాలు తెచ్చిస్తావా? అంటూ ఆ తండ్రి ఆ సెనగలు అమ్మే వ్యక్తిని కొడుతాడు. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా సెనగలు అమ్మే వ్యక్తి ఏమీ చేయలేక మిన్నకుండి పోతాడు. క్రమంగా ఆ తండ్రి చల్లబడుతాడు. కథకుడు మళ్ళీ తన ఏకాంతంలోకి దూరిపోతాడు. తనను కంపెనీ ఎందుకు ఉద్యోగంలోంచి తీసేసిందో కథకుడికి అర్థం కాదు. చివరికి ప్రాజెక్ట్ మేనేజర్ ని కారణం అడుగుతాడు. “ఇంటలేక్చువాలిటీ, కమిట్ మెంట్, లాయల్టీ ఈ మూడింటిలో ఏది లోపించినా ఏ కంపెనీ సహించదు. వ్యవస్థ ఎప్పుడూ అతని మీద ఆధారపడి వుండే వాడినే పోషిస్తుంది. ఆధిపత్యం చలాయించేవాడిని కాదు. మరో విషాధం ఏమిటంటే నీ గురించి పాజిటివ్ గా మాట్లాడే వ్యక్తి ప్యానల్లో ఒక్కరు కూడా లేరు నా తో సహా..” అంటాడు. కథకుడికి ఇన్నేళ్ల జీవితంలో ఏం మిగిలిందో అర్థం కాదు. చిన్నప్పటి నుంచి తన చుట్టూ తాను ఒక వృత్తాకార గీత గీసుకొని అందులోనే ఉండిపోతాడు.

చిన్నప్పటి నుంచి గోపి అనే తన క్లాస్ మేట్ తో పోటీ. ఎప్పుడూ కథకుడే ఫస్ట్ వచ్చేవాడు. గోపీది ఎప్పుడూ సెకండ్ ర్యాంకే. కానీ గోపి ఎప్పుడూ ఫీలైయ్యేవాడు కాదు. “తన స్టైఫండ్ లోంచి సగం డబ్బులు మానసిక వికలాంగుల ఆశ్రమానికి ఇచ్చేవాడు. తనకు అన్యాయం అనిపించిన ప్రతి విషయంలో దూరి పొయేవాడు… ఎగరాలనిపిస్తే ఎగిరేవాడు. సిగరెట్ తాగాలనిపిస్తే ఫాకల్టీ ముందైనా తాగే వాడు… ఏంట్రా నువ్వు చేసే పనులతో ఈ సమాజం, మనుషులు మారుతారా? ఎంత మందినని మారుస్తావు?” అని అడుగుతాడు ఒక రోజు కథకుడు గోపిని. దానికి గోపి నవ్వి “మార్పు అనేది ఒక వ్యక్తి చేతనో, ఒక సంఘటన చేతనో జరిగేది కాదు. ఒక క్షణంలోనో, ఒక రోజులోనో జరిగేది కాదు. మార్పు అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ. లెక్క లేనన్ని అనుభవాల, అనుభూతుల, సంఘర్షణల తుది ఫలితం. ప్రపంచంలో అత్యంత మూర్ఖమైన పని ఎదుటి వారిని మార్చాలనుకోవడమే.” అంటాడు. చివరికి ఓ రోజు పోలియో సోకి కుంటుతూ నడిచే చేతన అనే గ్రూప్ 1 ఆఫీసర్ని పెళ్లి చేసుకుంటాడు గోపి. కథకుడు ఒక్కసారి షాక్ కు గురౌతాడు. గోపీకి వాళ్ళ ఆఫీస్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా ప్రమోషన్ ఇస్తారు. కానీ గోపి అంతకు ముందే జాబ్ కి రిజైన్ చేస్తాడు. కథకుడి ఉద్యోగం పోవడం, గోపి రిజైన్ చేయడం ఇంచుమించు రెండూ ఒకేసారి జరుగుతాయి.

ఉద్యోగం పోయాక జీవితాన్నే కోల్పోయినట్టుగా కథకుడు ఫీలవుతాడు. గోపి మాత్రం మరింత బలాన్ని పుంజుకున్నట్టుగా ఫీలవుతాడు. గోపిలోని నిరంతర చైతన్యానికి, తనలోని పరాకాష్ఠనొందిన స్తబ్దతకు మూలాలు ఎక్కడున్నాయో కథకుడికి అస్సలు అర్థం కాదు…. ఇన్ని ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే ఒక్కసారిగా తన చుట్టూ చెలరేగిన కలకలానికి కథకుడు ఈ లోకంలోకి వస్తాడు. చూస్తుండగానే ఇందాకటి సెనగల గొడవకు కారణమైన పిల్లవాడు రిజర్వాయర్లో పడి పోతాడు. కథకుడికి కాస్త ఈత వచ్చినా వెంటనే స్పందించి నీటిలోకి దూకలేకపోతాడు. ఏ మాత్రం ఆలోచించకుండా సెనగలు అమ్మే నడీడు మనిషి నీటిలోకి దూకి పిల్లవాడిని కాపాడుతాడు. ఆ పిల్లవాడి తల్లి సెనగలు అమ్మేవాడి కాళ్ళు మొక్కి కార్లో వెళ్ళి పోతుంది. “ఏమయ్యా ఇంతకు ముందే అతడు నిన్ను కొట్టాడు కదా! వాళ్ళ బాబును రక్షించడానికి దూకేటప్పుడు నీకేమీ అనిపించలేదా?” అని ప్రశ్నిస్తాడు కథకుడు. “నాకప్పుడు ఆ పిల్లాడ్ని కాపాడాలని మాత్రమే అనిపించింది. ఇంకేమీ అనిపించలేదు.” అంటాడు ఆ సెనగలు అమ్మేవాడు. “అతను తనకు ఎదైతే చేయాలని అనిపించిందో అదే చేశాడు. సమాజమూ, నేపథ్యమూ, ప్రక్రియలు, పరిణామాలు, పర్యవసానాలు, లాభాలు, నష్టాలు, తర్కమూ, కారణమూ, భయమూ… దేనిలోనూ, దేనితోనూ అతను తన మనసును బంధించలేదు.“ సెనగలు అమ్మే వాడి ఈ చర్యతో కథకుడు చాలా మారుతాడు. ఆఖరుకు అక్కడి నుంచి వెళ్ళి పోతున్న కథకుడికి అంతా ప్రేమమయమే అనిపిస్తుంది.

చదువు, ఉద్యోగం, హోదా ఇవేవీ మనిషిని నిలబెట్టవని, కేవలం మానవత్వమే మనిషిని మనీషిగా తయారు చేస్తుందనే పాయింట్ చుట్టూ కథకుడు వివిధ సంఘటనలను అల్లుకుంటూ పోయాడు. సన్యాసులు, గురూజీలే కాదు మనకు గ్రహించే నేర్పుంటే ఏ పార్క్ లోనో, సినిమా టాకీస్ ముందో సెనగలు, బఠానీలు అమ్ముకునే వాడు కూడా జీవిత పరమార్థాన్ని బోధిస్తాడని ఈ కథ చెప్తుంది. ఒక రకంగా మహాభారతం లోని ధర్మవ్యాధుని కథను పోలిన కథ ఇది. వర్తమానం-గతం-వర్తమానం అనే టెక్నిక్ తో నడిచిన కథ. మనిషితనపు లోతుల్ని తడిమిన కథ. ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలు ఎంత బలహీనంగా ఉన్నాయో ఈ కథ అక్షరాలా వివరిస్తుంది. మనం నాలుగు రూకలు సంపాదించి పక్కవాడి కన్నా అయిదు మెట్లెక్కువ ఎత్తులో ఉన్నామనుకుని విర్రవీగేలోపు పక్కవాడు అన్నీ మెట్లూ దిగేసి మట్టి మనిషి పక్కన నిలబడుతాడు. అప్పుడు ఏది అభివృద్ధో, ఏది దివాలాకోరుతనమో మనకు అర్థం కాదు. మానవ సేవలోనే మాధవ సేవ దాగి ఉందని చెప్పే ఈ కథ నిజానికి ఆధునిక మానవుడి నిచ్చెనలోని లుకలుకల్ని పట్టి చూపుతుంది. కథకుడి విజయమంతా వస్తువులోనే ఉన్నా దాన్ని బంగారు గోడ చేర్పులాంటి మంచి శిల్పంలో చెప్పడం వల్లనే ఈ కథ పాఠకుల మనసులో చిరస్థాయిగా నిల్చి పోతుంది. బలమైన పాత్ర చిత్రణ, చక్కని శిల్పం, భాష, సంఘటనలు అన్నీ సరిగ్గా కుదిరి ఒక గొప్ప కథ రూపొందింది. చివరాఖరికి ఒక కొత్త వేకువకు దారి తీస్తుందీ కథ.

*

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు