కనిపించని గాయాల కలవరింత

క్లిష్టమైన పదజాలం లేదు. గొట్టు పద బంధాలు లేవు. అతి మామూలు భాష. సహజమైన వ్యక్తీకరణ. జీవితంలోని ఆర్ద్రత ను తవ్వి తోడి పోసుకుని ఒక వాక్యంలో ఇమడ్చగల శక్తిని పునికి పుచ్చు కోవడం వల్ల కవిత్వమైంది. ఒక బలమైన ముగింపు పాఠకుని మనసులో మరింత బలమైన ముద్ర వేసుకుంటుంది. అందుకు “మనసెందుకో సున్నితం” కవితే  నిదర్శనం. ఆ కవి వరంగల్ జిల్లాకు చెందిన బి.అంజనీదేవి. అనుభవ సారపు చిక్కదనం ఆమె కవిత్వపు సొత్తు.

*

మనసెందుకో సున్నితం

~

మొదటిసారి వేడి తగిలినపుడు

వేళ్ళు చురుక్కు మన్నాయి

వయసు పెరిగే కొద్దీ 

చర్మం ముదిరిందో

అలవాటయిందో

తట్టుకునే శక్తి పెరిగిందో  ఇపుడు అమాంతం 

వేడి గిన్నెను దించగలను

 

మొదటి అడుగు సున్నితంగా

ముల్లు తగిలినా రాయి తగిలినా

నొప్పితో తడబడింది

ఎముక ముదిరిందో

అవసరాల అనివార్యతనో

ఇపుడు ముళ్లపై నడవగలను

కంకరపై పడుకోగలను

అనుభవం పెరిగే కొద్దీ

అన్నీ తట్టుకున్న ఈ శరీరంలోని

మనసెందుకనో అందుకు భిన్నం

 

అమ్మ తిట్టినపుడు 

ఏడ్చి మరిచిపోయా

మళ్ళీ అమ్మా అన్నాను

దోస్తు కొట్టినప్పుడు దెబ్బలాడి

మరిచిపోయాను

మళ్ళీ ఆడుకున్నాను

సార్ కొట్టినప్పుడు 

వెక్కి వెక్కి ఏడ్చిన 

 

ఇప్పుడెందుకో

గుట్టలుగా పేరుకున్న దుఃఖం

ఉబికి రానేరాదు

గుండెలో భారం తగ్గనే తగ్గదు

 

మనసు చేతికి దొరికితే బాగుండు

ముండ్లు గుచ్చో

సెగను తగిలించో

రాతితో బాదో

గట్టిపడేసే దాన్ని

వయసు పెరిగేకొద్దీ

ఈ మనసెందుకో

మరింత సున్నితమవుతుంది

*

జెరంటాలజీ –  వృధ్ధాప్య శాస్త్రం. ఇది వయసు మీద పడుతున్న కొద్దీ శారీరకంగా, మానసికంగా, సామాజికంగా వ్యక్తి ప్రవర్తనలో వచ్చే మార్పులను అధ్యయనం చేస్తుంది. కోపం, అసహనం, చికాకు, సహచరులను కోల్పోవడం వల్ల కలిగే ఒంటరితనం, దిగులు, పసిపిల్లల చేష్టలు మొ.నవి సాధారణమైన లక్షణాలు. సముచితమైన గౌరవం, మాటలకి విలువ ఇవ్వడం, చెప్పింది ఓపికతో వినడం మొ.నవి కోరుకోవడం అతి సాధారణమైన విషయాలు. ‘వయసు పెరిగే కొద్దీ ఈ మనసెందుకో మరింత సున్నితమవుతుంది’ అని సూత్రీకరించినట్టు వ్యక్తమవటంలో- అనుభవం పెరిగే కొద్ది శరీరము, మనసు రాటుదేలుతుందనే నిశ్చితాభిప్రాయంతో ఏకీభవించినపుడు మరింత సున్నితమవటం ‘విరోధాభాస’గా ధ్వనించటంలో తప్పు లేదు. ఒక పురోగమన చర్యకు ప్రతిస్పందనగా ఒక తిరోగమన చర్యను ఆమోదించడం కష్టం అవుతుంది. శరీరం, మనసు రెండింటినీ ఒకే గాటన కట్టిపడేయాలనుకోవడం వల్ల జనించే వైరుధ్యాలుగా చెప్పవచ్చు.

*

ఇవాన్ పావలోవ్ కుక్కపై జరిపిన ప్రయోగాల వల్ల మనకు ఉద్దీపన(stimulus), ప్రతిస్పందన(response) అనే రెండు అంశాలు పరిచయమయ్యాయి.వీటి ఆధారంగా పావ్లోవ్ నిబంధిత ప్రతిస్పందన సిద్దాంతం రూపొందించారు. మాంసం ముక్క(unconditional stimulus) చూసినపుడు కుక్క నోటిలో లాలాజలం ఊరడం(unconditional response) సహజ ప్రతిస్పందన. అంటే సహజమైన ఉద్దీపనకు సహజమైన ప్రతిస్పందనలు వుంటాయి. మాంసం ముక్కకు గంటను జోడించడం వల్ల లాలాజలం ఊరడం అనే ప్రతిస్పందనను చూస్తాం. మాంసం ఇవ్వకున్నా కేవలం గంట శబ్దానికి లాలాజలం ఊరడం గమనిస్తాం చివరకు గంట లాంటి ఇతర శబ్దాలకు సుత లాలాజలం ఊరడం పరిశీలిస్తాం. ఆ తర్వాత పునర్భలనం, విరమణం, సాధారణికరణం చర్యల ప్రతిఫలనాలను నమోదుచేసుకుంటాం. ఇవి నిబందిత వుద్దీపనల తీవ్రతల్లోని మార్పుల వల్ల సంభవిస్తాయి.

వేడి తగిలినపుడు వేళ్ళు చురుక్కుమనడం, ముళ్ళు/రాయి తగిలినపుడు నొప్పితో అడుగు తడబడటం, అమ్మ తిట్టినప్పుడు ఏడవడం, దోస్తు కొట్టినప్పుడు దేబ్బలాడడం, సార్ కొట్టినప్పుడు వెక్కి వెక్కి ఏడవడం …ఇవన్నీ ఇవాన్ పావ్లోవ్ ప్రయోగంలోని అనిబందిత (UCS)వుద్ధిపనలకు కలిగే అనిబందిత ప్రతిస్పందనలు(UCR)గా చెప్పవచ్చు. పడే పడే పునరావృతమయ్యే వుద్దీపనల మూలంగా సాధారణికరణ స్థితి(Generalization of stimulus)లోకి రావడం గమనించవచ్చు. మళ్ళి అమ్మ అనడం, మళ్ళి ఆడుకోవడం సాధారణికరణ కోవలోకి వస్తాయి. అమాంతం వేడి గిన్నెను దించడం, ముళ్ళపై నడవడం, కంకరపై పడుకోగలగడం – మనసు మనసులో లేని స్థితిని, ఎవరూ పూరించలేని లోటును వ్యక్థీకరించే గతకాలపు సందర్భం ఏదో దాగి వుండి వుంటుంది. గుట్టలుగా పేరుకున్న దుక్కం వుబికిరాకపోవడంలో, గుండెలో భారం తగ్గకపోవడం – ముందెన్ని వుద్దీపనల ప్రభావం వుందో అంచనావేసుకోవచ్చు. ప్రతిస్పందనలు లేకపోవడం ఇక్కడ బాధాకరమైన విషయం. ఒక వోదార్పు, ఒక చల్లని ఆత్మీయ స్పర్శ దొరక్కపోవడం ఇక్కడొక లోపంగా భావించవచ్చు.

*

ఇక్కడ వయసు పెరిగినా కొద్దీ మనసు మరింత సున్నితమవటం, మరింత కఠినమవటం అనేవి వైయక్తికపరమైన అంశాలే కాని సామూహికమైన ఆమోదం కల్గిన సాధారణికరణలు కావు. కవి ఇచ్చిన ముగింపు ఇక్కడ వైయక్తికమే. కనిపించని గాయాల సలపరింపు అందుకు కారణమై ఉండొచ్చు.

*

బండారి రాజ్ కుమార్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Tq రాజకుమార్ గారు,
    నేను కూడా సాదారణీకరించ లేదు.
    ఇది వైయుక్తికమే.
    BUT
    నాకు వచ్చిన కనీసం 70 కాల్స్ లో
    “నా ఫీలింగ్ కూడా అలాగే ఉంది”
    అంటూ కన్నీళ్ళతో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు.
    ******
    ఆత్మీయ స్పర్శ లు దొరక క పోవడం
    బాధాకర మో ,లోపమో ఏమి కాదు.
    అవి దొరకలేదు అని నిర్ధారించి
    రచయిత మీద జాలి చూపాల్సిన అవసరం లేదు
    నాదృష్ట్టి లో ఆత్మీయ స్పర్శ కు లొంగీ సంతృప్తి పొందడం అనేది ఒక బలహీనత.
    బాధలు పడడం వేరు, సున్నితత్వం వేరు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు