కథా మూలాలు  తెలిసిన పతంజలి శాస్త్రి

థ ఎప్పుడు మొదలై ఉంటది ? కథకు మూలం ఏమయి ఉంటది ? బహుశా అమ్మ పుట్టిన దగ్గర నుండి కథ ఉంది. అసలు కథ ఎందుకు అనే ప్రశ్న రావొచ్చు. కథలు ఏం చేస్తాయి అనే ప్రశ్న ఉత్పన్నం కావొచ్చు. మన అజ్ఞానం తో కథకు దాని ఎత్తు, పొడవు, లోతు, విస్తృతి చర్చలు చేస్తాము కానీ నాగరికతా వికాసానికి ఉన్నంత విస్తృతి  ఉంది కథకు. సామాజిక ఇతిహాసానికి ఉన్నంత జీవితం ఉంది . కథవాస్తవానికి ఆశుసాంప్రదాయం. లిఖిత సాంప్రదాయం లోకి మారినా అది పండిత  పామర జగత్తుతో మమేకమై కలిసినడిచింది.

లిఖిత మాధ్యమం అయినా ఆశు లక్షణాలను పుణికి పుచ్చుకున్న పరంపర మనకు పంచతంత్రం, జాతక కథలు. ఆశు సాంప్రదాయం నుండి మొదలై లిఖిత మాధ్యమానికి మారే క్రమంలో ఆయా కాలసామాజిక,సాంస్కృతిక,వైయుక్తికఅభివ్యక్తులు అందులో సంలీనమై కథకు గౌరవాన్ని  తెచ్చిపెట్టాయి. తెలుగు కథను ఏది ముందు ? ఏది వెనక ? ఎవరు  ఆద్యులు?  ఎవరు పోషకులు ?  అనే సంవాదాల చుట్టే తిప్పారు కానీ, తెలుగులో  కథ, దాని చుట్టూ ఆవరించి ఉన్న పొరలను తడిమే పని తక్కువ మందే  చేసారు. కథను శాస్త్రబద్దంగా అధ్యయనం చేసిన అధ్యయన పరులు బుద్ధిజీవులు  తక్కువగా ఉన్నారు.

కథ జీవనాడి పట్టుకున్న కథకులు అరుదు. కథా మూలాలు ఎరిగిన అధ్యయన పరులు మరీఅరుదు. కథ ఒక కథగా కాకుండా కథనానికి యుక్తి  వివేచనతో,  రూపసారాలను మరింత విస్తృతం చేసిన వాళ్ళు మరీ అరుదు. ఆ అరుదైన ఈ కాలపు కథకుడు తల్లావజ్ఝల పతంజలి. తరాలపండిత పరంపర ఉన్న ఆ కుటుంబం గురించి పరిచయం చేసే విద్వత్, వివేచనా నాకు లేవు కానీ సంస్కృత,పాళీ,ఆంగ్ల,తెలుగు భాషలకు మేధోవారధి ఆ కుటుంబం. ‘కథా సరిత్సాగరం’ మొదలు ‘జాతకకథలు ’త్రిపధ, ‘రామేశ్వరం కాకుల’  మేధోధారకు  ఆ ఇల్లు చిరునామా . నాలుగు ఐదు తరాల నిరంతర అధ్యయన పరంపర తల్లావజ్జల కుటుంబం.

తల్లావజ్ఝల పతంజలి  నేటికి డెబ్బై ఏళ్ళ కింద ఒంగోలులో మొదలైన బాల్యం తిరుపతి, పూనే దక్కన్ కళాశాల మీదుగా రాజమండ్రి గోదావరి అలలతో మేధో సంవాదం చేస్తూ  కథ, కవిత్వం,నవల, నాటకం,సినిమా,అనువాదం, పర్యావరణ రంగాలలో దశాబ్దాల మమేకత కలిగి ఆయన రాసిన ‘రోహిణి’  కథ గురించి నాలుగు మాటలు. ఈ కథ ఏడేళ్ళ కింద కథా సాహితిలో చోటు సంపాదించుకుంది.

కథ తొలిదశలో మధ్య తరగతి కౌటుంబిక మందహాసమే జీవికగా బ్రతికింది. తర్వాత సామాజిక సమస్యలు జాతీయ ఉద్యమ అలజడులూ పెనవేసుకుని నడిచింది. వలసవాద పీడన పట్ల నిరసన, రెండు ప్రపంచయుద్దాల మధ్య జరిగిన క్షామము, ప్రజాఉద్యమాల నాడిగా ‘కొండగాలి’ కి కొడవలి ఎత్తిపట్టింది. ఎత్తిన పిడికిలి దించము అని నిందించింది. తూర్పుగాలులకు తల వంచింది, సిరిసిల్ల, జగిత్యాల, జంగల్ మహల్ పెనుకేకలు ఆవాహన చేసుకుంది. పులి చంపిన లేడి నెత్తురు సెగలు తడిమింది. కులంపేరా,మతం పేర జరిగిన అమానుసాన్ని కళ్ళారా చూసింది. కథ స్వాభిమాన ప్రకటనకు మోకరిల్లింది. సామాజిక సంవాదాలకు సాకబోసింది, మొత్తంగా రెండు వందల ఏళ్ళుగా ఈ వర్తమాన చరిత్ర చిత్రపటం మీద నెత్తుటి మరకలు మాత్రమె కాదు, జరిగిన గాయాలకు కాయ పసరు పూసింది. సామాజిక అలజడులను కథ తన కడుపులో దాచుకుంది.

కాలం ఎంతమారినా సామాజిక సంవాదం ఇంతకాలం భూమి, నీరు, అధికారం, సంపద చుట్టూతానే తిరిగింది. అందుకే మానవ జీవితంలో మార్పు కోసం జరిగిన ప్రతి సంఘర్షణ చుట్టూ కథ బ్రతికింది. మొత్తంగా జీవిత అంతసారాన్ని అంటిపెట్టుకుని కథా గమనం సాగింది. ఇది కథ వెనక దాగిన బడబాగ్ని , కథతో నడిచిన అలజడుల సవ్వడి. కథ కాలంతో కరచాలనం చేసి మమకారంతో పెనవేసుకుంది.

బహుశా భూమి పట్ల అనురక్తి, సంపద పట్ల అవ్యాజ ప్రేమ అధికారం పట్ల వ్యామోహం ‘రోహిణి’ కథ మన ముందు గడిచిపోయిన కాలాన్ని చూపించింది. రోహిణి తెలుగు కథా గౌరవాన్ని పెంచిన కథనం. దానికి కారణం అది తీసుకున్న ఇతివృత్తం. దానివెనక దాగిన తాత్వికత లోతు. కథ చదువుతుంటే మనల్ని రెండు వేల ఏళ్ళ కింద సామాజిక సంవాదంలోకి తీసుకుని పోతుంది. ఒక మాయా ప్రపంచంలోకి, ఒక మానవీయ సంభాషణలోకి  మనల్ని తీసుకొని పోతుంది. రోహిణి కథ శాక్య-కోలీయు తెగల మధ్య జరిగిన పంపకాల వ్యవహారం. ఒక సుహృధ్బావ వాతావరణంలో ఉన్న రెండు తెగల  మధ్య నీటి  ప్రాకృతిక వనరుల పంపకాల కోసం జరిగిన ఘర్షణ. అది రెండు వర్గాల మధ్య సంపద కోసం రాజేసుకున్న కోరికల కుంపటి. అది రెండు ప్రాతాల మధ్య పెరిగిన అసమ విలువల సజీవ సాక్షం.

నదులు భూమికి సిరలు,ధమనులు లాంటివి అవి కేవలం నీళ్ళను మాత్రమే వెంటేసుకుని రావు జీవితాన్ని తనతో మోస్తుంది.  అవేశ పూరితం అయిన జలపాత అంతిమ దశనే నది. నదీ పరీవాహక  నాగరికతా వికాసానికి మూలంఅంటారు. ప్రపంచంలో గొప్ప నాగరికతలు మొత్తం నదీపరీవాహక ప్రాంతాల లోనే పురుడుపోసుకున్నాయి.  నదులు దేశాలకు, రాష్ట్రాలకు సరిహద్దులు. నది పక్కన ఏ రెండు నాగరికతలు ఒకే రకంగా ఉండవు. భిన్న స్రవంతుల, తెగల, జాతుల మధ్య వైరుధ్యాలవారధి నది. పారే నదికి కట్టిన ఆనకట్ట ప్రకోపిస్తే మహాగొప్ప మొహెంజోదారో నాగరికత నేల మట్టం అయ్యింది అని ఒక ఐహిత్యం. ఆ విషాదానికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది. ఆ విషాదం కేవలం రోహిణి,ఇండస్ నది దగ్గర నే మొదలు కాలేదు. చరిత్ర పొడవునా ఆ విషాదాలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రపంచం లో ఎన్ని నదులు ఉంటె అన్ని వివాదాలు దాని చుట్టూ ఆవరించి ఉన్నాయి. ప్రపంచం లో అతి పెద్ద నైలు నది జలాల కోసం పదకొండు దేశాలు, యూప్రటిస్ టైగ్రిస్ కోసం మూడు దేశాలు, ఆఫ్ఘన్ – ఇరాక్,  చైనా లావోస్, సోమాలియా, టర్కీ మొదలు కావేరి , శ్రీశైలం దాకా నీటి మీద  ఆధిపత్యం కోసం ఎన్ని నదులు రక్తంతో ఎరుపెక్కి ఉంటాయి.  ఒక్కొక్క చుక్క ఒడిసి పట్టుకోవడం కోసం ఎంత స్వేదం ఎన్ని కన్నీళ్ళు కడగండ్లు రాలిఉంటాయి ? ఏళ్ళుగా ఈ ధరిత్రి భరిస్తూనే ఉంది.‘నది భిన్న నాగరికతలకూ, సమాజాలకు, సమూహాలకూ సరిహద్దుగా ఉన్నప్పటికీ అది ప్రకోపిస్తే దేశ, రాష్ట్ర సరిహద్దులను కూడా గౌరవించవు, మనమే వివేచన,విజ్ఞతతో వాటి గమనాన్ని పరిశీలించి ఆ నీటిని ఉపయోగించు కోవాలి’  అనే చిన్న మకుటంతో మొదలైన ఈ  కథ ప్రధాన చర్చ రోహిణి నదికి ఇరువైపులా ఉన్న శాక్య, కోలీయులు ఆ నదీ గమనాన్ని గౌరవించకుండా యుద్దానికి సిద్దం అవడమే .     

ఎప్పుడో రెండు వేల ఏళ్ళ కింద సామాజిక సంఘర్షణ అది. ఒక ఆలోచనా ధార ప్రోదిచేసిన వ్యక్తిగత ఆస్తి, సంపద, కీర్తి పట్ల మనిషికి ఉండాల్సిన వివేచన చుట్టూ తిరిగిన ఇతివృత్తం .సాధన,శోధన మాత్రమె జీవిత ధ్యేయంగా ఉండాల్సిన సమూహాల మధ్య ఈర్ష్యాసూయలు, ద్వేషాల  చుట్టూ ముడిపడ్డ తగువు చుట్టూ పేర్చిన శకలం రోహిణి కథ. నేటికీ రగులుతున్న ద్వేష కుంపటి.

రోహిణి నది చుట్టూ ఆవరించి ఉన్న రెండు తెగల మధ్య వచ్చిన తగువు చుట్టూ నడిచిన  కథ ఇది. కథా కాలం దాదాపు రెండు వేల ఏళ్ళ కింద  జరిగింది. రోహిణీ నది కి ఉన్న రెండు తీరాలు. ఒక తీరాన శాఖ్యులు, మరొక తీరాన కోలీయులు ఉంటున్నారు. శాక్యులతీరం భగవానుడి పుట్టుక వల్ల పునీతమైనది; కోలీయుల తీరం భగవానుడి నివాసం వలన పవిత్రమైనది. ఒక తీరాన కపిలవస్తు, మరొక తీరాన రామ గ్రామం. ఒక తీరం పండిన పంటను సంపదగా మార్చుకుంటున్న వైనం, మరొక తీరం పంట కేవలం బ్రతుకు గడిస్తే చాలు అనుకుంటున్న. రెండు తీరాల ప్రజలూ రోహిణీ నది నీటిని సమంగా పంచుకుంటూ ఉన్నారు. ఆ ఏడు ఎందుకో నది నీరసించి నీటి కొదవ ఏర్పడ్డది. ఆ నీటిని వాడుకునే దగ్గర మొదలైన వైరం ఇరుపక్షాలు ఆయుధాల సమకూర్చుకోవడంతో నిమగ్నం అయ్యారు. కర్రలు,విల్లమ్ములు,వెదురుశూలాలు సమకూర్చుకునే పనిలో ఉన్నారు.  ఒక తీరం సంపద, అహంకారం, సుఖలౌల్యంలోమునిగితేలుతోంది. మరొకతీరం వాళ్ళతో పోటీపడలేక ఘర్షణ దిశగా తీసుకొని పోయారు.శాక్యరాజు కొడుకే తదాగతుడు. కనుక కోలీయులు న్యాయంకోసం తథాగతున్ని ఆశ్ర యించారు.

రోహిణి శాక్య కోలీయులను రాజ్యాన్ని విడదీస్తూ వెళ్ళే నది. నదికి ఇరువైపులా ఒకనాడు ధర్మం నది అంత పవిత్రంగా ఉండేది. కోలీయులు అమాయకులు, శాక్యులు వ్యాపార లౌక్యం తెలిసిన వాళ్ళు. శాక్యులతో వ్యవహారం లో వ్యాపారం లో పోటీపడలేని మనుషులు. నీళ్ళకోసం వచ్చిన తగువులో న్యాయంకోసం తథాగతున్ని ఆశ్రయించిన క్రమంలో న్యాయ ధర్మ విచక్షణతో ఉండాల్సిన పాలకులకు హితబోధ చేసే క్రమంలో ఒక మాట నన్ను కట్టి పడేసింది. ‘పండ్ల చెట్టు విడిచిన పండ్లను ఏరుకొని తినడం వేరు చెట్టును కుదిపి కుదిపి కాసిని పండ్లు తీసుకొని ఎక్కువ పండ్లను వదిలి వేయడం అపరాధం. ప్రకృతి మనకు ఒనకూర్చిన నియతిని అర్ధం చేసుకోవడం పౌరుల ధర్మం’ అనే మాట రోహిణి కథ మూల తాత్వికత. అ తాత్వికత చుట్టూ పెనవేసుకున్న కథనమే రోహిణి కథ. ‘కోపం వచ్చినపుడు పాము లాంటి నాలిక కాటు వేస్తుంది. సగోత్ర ఆచారం మీద శాక్యులు అక్కాచెల్లల్ల తో సంసారం చేసిన జాతి అని నిందించారు. వాళ్ళు అనాధలు అనీ,కుష్టు వారికి పుట్టిన సంతానం అనీ శాక్యుల మీద కోలీయులు అపనిందలు వేసారు. పంపకాల గురించి మాట్లాడుకోవాల్సిన ఇరు పక్షాలూ వ్యక్తిగత దాడి నిందాస్త్రుతి తో ఒకరి మీద మరొక నైతిక బౌతిక దాడి దిశగా గర్షణ జరిగింది.

తథాగతుడు శాఖ్యుడు. కనుక వారిని ఒప్పించి న్యాయం చెబుతారనే అనే ఆశతో వచ్చారు. అన్నీ త్యజించి వచ్చిన తథాగతనీతో కోలీయులు ఇలా అడిగారు. “భన్తే, మన్నించండి. శాక్యులు మీ స్వజనులు శాక్య రాజు  అన్యుడు కాదు మీ కన్నతండ్రి. ఘర్షణ వారించడం  మీ బాధ్యత అని కూడా మేము భావిస్తున్నాము’ అని ఎటువంటి సంకోచం లేకుండా కోలీయులు అన్నప్పుడు తథాగతు “మీరు ఎవరి గురించి అంటున్నారు ? బంధాలు తెంచుకుని రాజకుటుంబం వీడిన రాకుమారుడు వేరు. అతనిప్పుడు లేడు. అందుచేత సుద్దోదనుడు అతనికి తండ్రికాదు. బంధాలు లేనందున   అతనికి స్వజనులు లేరు. నేను వేరు, నేను వేరు కావడం వలన నాకు ఎటువంటి బాధ్యతలు ఉండవు” అంటూ మంచిచెడులు తన ప్రజలకు చెప్పడం రాజు బాధ్యత అది రాజ ధర్మం. మధ్యలో యేరు ఉండగా ఇరువైపులు రైతులు యుద్దానికి దిగడం రాజు అసమర్ధత,బాధ్యతారాహిత్యం అని,నిర్ణయం తీసుకోవాల్సింది పాలకుడు అంటూ తాను త్యజించిన బంధాలను మరింత బలంగా చెప్పడం ఈ కథలో కీలకమైన అంశం. తాను సమష్య  పరిష్కరించే పని మీద రాలేదని వాటిని ఎలా చూడాలో మాత్రమే చెబుతా అంటూ మనిషి సంయమనం తో బ్రతకడానికి అధికారుల శాసనాలు అవసరం లేదని కేవలం విచక్షణ ఉంటె చాలు అనీ ప్రతి మనిషి తనకు ఎంత వరకు అవసరమో దానిని గుర్తించక పోవడమే దుఃఖహేతువు అంటాడు. మనిషికి పరివర్తన, నిష్కృతి ద్వారానే లభించుద్ది అనే అతఃసూత్రం ఈ కథా గమనం లో మనం చూడగలం.

బహుశా ఈ దేశంలో తలెత్తిన మొదటి నదీ జలవివాదం రోహిణి అనుకోవచ్చు. మనిషి వేట వదిలి స్థిర నివాసం ఏర్పరుచుకునే క్రమంలో నీటి వినియోగం వాటికి ఆనకట్ట కట్టుకోవడం పంపకాల కోసం యుద్దానికి  సిద్ధపడడం కేవలం రోహిణి నది వొడ్డున మాత్రమె జరిగిందా అనే అనుమానం రావొచ్చు. మన కాయంలో ఎన్ని రక్త నాడులు ఉంటె ఈ ధరిత్రి లో అన్ని నదీపాయలు పాయలు ఉన్నాయి. వెతికితే ప్రతి నదీపాయ మూలంలో ఇటువంటి వివాదాలు వేలల్లో ఉండే అవకాశం ఉంది. మనకు కావాల్సిందల్లా చూసే ద్రుష్టి కోణం. వెతికితే వేల ఏళ్ళకింద  మన తాత ముత్తాతల పాదముద్రల ఆనవాళ్ళు కూడా మనకు కనబడతాయి అంటాడు కోశాంబి. అలాంటి చరిత్ర రాయడానికి చరిత్ర నే ఒక చరిత్ర కారుణ్ణి కాలం కడుపుతో ఉండి కంటది. అంతటి కీలకమైన నదీ వివాదం ఆధునిక చట్టాలు న్యాయ విధానాలు ప్రాధమిక దశలో ఉన్న కాలం లో ఉద్భవించిన  రోహిణీ నదీ మూలాల కోసం దాని చుట్టూ ఆవరించిన ఒక నాటి ఐతిహ్యం వెలికితీయడానికి  మన తల్లావజ్జల పతంజలి ని కన్నది.

మనిషి ఆధునికుడిగా మారుతున్న క్రమంలో పెరుగుతున్న  వ్యాపార విస్తృతి, కుటుంబాలు విస్తరించడం, ఆ విస్తరణలో పెరిగిన వలస, ఆ వలస మూలంగా ఒనకూరిన వనరుల అసమతుల్యత,దాని మూలంగా పెరిగిన సంపద విస్తరణ తత్ ఫలితంగా ఏర్పడిన విస్తాపన, అసమవిలువలు, ఇదొక చక్రభ్రమణం. ఇది ఒక నాటి నీటి పంచాయితి రెండు తెగల మధ్య రగిలిన విద్వేశం.  ఇది జానపదాల కాలంలో, మధ్యయుగాలలో వర్తమాన సమాజం లో తిష్టవేసిన వైతరిణి. అది రెండు దేశాల మధ్య మొదలై, రెండు కుటుంబాల దాకా పరివ్యాప్తం అయ్యింది. ఇది జాతక కథలా, పంచతంత్ర కథలా తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఆ సమస్త వైపరీత్యాలకు కారణ భూతం అయిన వ్యక్తిగత ఆస్తి, వ్యాపార విస్తరణ మూలంగా జరిగిన అనర్ధాల పట్ల ఒక ఎరుక. మన చుట్టూ జరుగుతున్న పర్యావరణ విధ్వంసం మూలంగా పచ్చటి ప్రకృతిని ద్వంశం చేస్తున్న వినిమయ సంస్కృతి మూలంగా మనం అనుభవిస్తున్న అనర్ధాల పట్ల  ఒక ఎరక ఉండాలని పడిన తపన. ఆనకట్టల కింద కనుమరుగు అవుతున్న మానవ జాడల పట్ల వలపోత. రెండు ఎలా ఏళ్ళ కింద జరిగిన ఒక చిన్న సంఘటన వర్తమాన రాజకీయ ఫలకం మీద చిందిస్తున్న విద్వేష భాషకు ఒక అనునయింపు. ఒక రచన భూత వర్తమాన భవిష్యత్ తరాలనూ వెంటాడి  వేదిస్తుంది కనుక రోహిణి కథ ప్రాసంగికత ఎన్నటికీ ఉంటుంది. ఒక ఊరిలో జరిగిన  అంశాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి రాసినట్టే ఉన్నా అందులో ఒక విస్వజననీయ మైన, సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపడం ఈ కథ సాధించిన విజయం అది కథకుడి ప్రతిభకు నిదర్శనం.

*

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు