ఎలుగెత్తిన ‘నిశ్శబ్ద’ గీతాలు

ఈ కవి యువకుడిగా చెలామణీ అయిపోతున్న ఒక చిన్న పిల్లవాడు

నిజమే. కథకులకూ, నవలాకారులకూ ఉండే వెసులుబాటు కవులకు ఉండదు. తమలో వెలిగిన నిప్పు కణాలను వెనువెంటనే పాఠకులలో రగిలించాలి, వాళ్లకు శాంతిలేకుండా చెయ్యాలి. ఈ విద్య నరేష్కుమార్ సూఫీకి పట్టుబడింది. ఏదో ఒకటీ అరా కవితలలో కాదు. మొత్తం ‘నిశ్శబ్ద’ కవితా సంపుటిలోని ఎన్నెన్నో కవితలలో. ఈ సంపుటిని మొత్తంగా చదివాక నాకేమనిపించిందంటే – ఈ కవి యువకుడిగా చెలామణీ అయిపోతున్న ఒక చిన్న పిల్లవాడు; అత్యంత సున్నిత మనస్కుడు; అన్నింటినీ నిశితంగా పరికించేవాడు. వాళ్ల ఊరునీ, అమ్మనీ, బాల్యాన్నీ వొదులుకోలేకపోతూనే హైదరాబాదు మహానగరంలో కలియతిరుగుతూ, కొత్త స్నేహాలు చేస్తూ, కొత్త అనుభవాలను జోడించుకుంటూ తప్పిపోయి తబ్బిబ్బు అయిపోయినవాడు.
మరీ ముఖ్యంగా ఇతడు సరళ, మానవీయ గ్రామీణ భావ ప్రకటనకూ, అమానుష నగరజీవనపు ఉదాసీనతకూ మధ్య గుండెల్లో గుచ్చుకొనే పదబంధాలతో వంతెనలు నిర్మించినవాడు. అతని అంతరంగంలోని విషాద కాసారంలో మొదట మనల్ని ముంచి, ఆ తరవాత మన స్వంత జీవితానుభవాల దారులలో వదిలిపెడతాడు.
వాళ్ల ఊరి నుండి నగరానికి తరలి వచ్చిన తొలిదినాలను ఇలా గుర్తుచేసుకుంటాడు (‘ఒకమ్మకోసం’) –
‘ప్రేమలు తెలియనట్టుగా నటించే ఒక బస్సు
నన్ను అమ్మ నుంచి, మా అమ్మ నుంచి తెచ్చి నగరంలో పడేస్తుంది –
….
వేలాది అమ్మల్ని చుట్టూ చూస్తూ
రోడ్డుపై తిరుగుతుంటాన్నేను’.ఇతడు సృష్టించే పద చిత్రాలను చూడండి (‘నా గడ్డి ఆకాశపు మరణం’) –
‘మద్యం సేవించిన ఒక నిరాయుధ ముసలి సైనికుడు
తన యుద్ధరంగపు గాథని పాడుతూంటాడు’అప్పుడేం జరుగుతుందో మీరు ఊహించగలరా?
‘హఠాత్తుగా ఒక సాయింత్రం వచ్చిన అమ్మ అడుగుతుంది –
“అయ్యా! మీరు వాణ్ణి చూసారా? ఆనాటి రాత్రి వాడు చచ్చిపోయాక
నాకు కనబడలేదు. మీరు చూసారా?”’

సూఫీ వాళ్ల ఊరినుంచి ఏమేమి వెంటబెట్టుకొని వచ్చాడూ? కొన్ని జ్ఞాపకాలూ, కడివెడు కన్నీళ్లూనూ. తన చిన్ననాటి స్నేహితురాల్నిగుర్తుచేసుకుంటాడు – ‘నువ్వు యాదీకచ్చినప్పుడు’ కవితలో –
‘మన పదోతర్గతిల నీ సామాన్యపుస్తకపు కమ్మల నుంచి
నీకు తెల్వకుంట కొట్టేశిన
నెమలీకకు పెన్సిల్ పొట్టు తినిపిచ్చుకుంట.
నీ పెండ్లైన తెల్లారే…
నువ్వు ఉరివెట్టుకున్న చెట్టుకొమ్మలకింద కూసోవాలనిపిస్తది…’

నగరజీవనం ఎదుటనిలిపే ఛిద్ర దృశ్యాల అధివాస్తవికతను సూఫీ ఇట్టే పట్టుకుంటాడు; వాటి అసంబధ్ధ అర్థరాహిత్యం వెనుక దాగిన విషాదాన్ని మన గుండెల్లో పలికిస్తాడు (‘ఎదుర్చూస్తున్నప్పుడు’) –
‘నీ గురించి నీవు కొత్తగా ఏం కాదు గానీ చాలానే తెల్సుకుంటావు
ఇంకా రాని మిత్రుల కొరకు నిరీక్షణలో
ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ వాచ్ మేన్ పేరూ
అతని పల్లె జీవితం గురించీ తెలుసుకుంటావు
నీ గదిని చేరుకోవడానికి నూటాపద్దెనిమిది మెట్లున్నాయనీ
ఎనభైఏడో మెట్టు కాస్త పగిలిందనీ నీకు కొత్తగా తెలుస్తుంది’.

ఆకలితో ఒక రాత్రంతా ఒక స్నేహితుడితోబాటు హైదరాబాద్ రోడ్లపై తిరుగుతూ, సూఫీ అంటాడు కదా (‘ఎక్ షహర్ దో షాయర్’) –
‘నీకూ నాకూ తప్ప కిస్కూ పతా నవాబ్
హైదరాబాద్ అర్థరాత్రికూడా కన్లు దెరుస్తదనీ
చాయ్ వాలా దోస్తాన్ల డబల్ శక్కరేస్తడనీ
ఏమిచ్చెరా గీ శహర్ నీకూ నాకూ
షేర్ సిగరెట్ పొగంత దోస్తానా తప్ప’

చుట్టూ జరుగుతూన్న వికృతకాండలకు చలించిపోతాడు (‘అప్పుడిక ఏం చెప్పగలనని’) –
‘మగవాడినైనందుకు సిగ్గుపడుతున్నానని ఆమెకెలా చెప్పను?
అప్పుడు రెండు చేతులనిండుగా ఆమెని కౌగలించుకొని
ఆమెను మనసులో ఇలా వేడుకున్నాను
“వచ్చే జన్మలో నన్నూ, సమస్త పురుషులనీ బిడ్డలుగా కను
కనీసం అప్పుడైనా మాకు ప్రేమించడం నేర్పించూ” అని’.

ఈ సంకలనానికి థీమ్ సాంగ్ లేక మకుటగీతం అని నేను భావించే కవిత ‘ఒక కాస్మోపాలిటన్ జానపదం’ – ఆ పేరును కలిగి ఉండడం యాదృచ్ఛికం కాజాలదని నాకనిపిస్తుంది. ఆ కవితలో సూఫీ అంటాడూ –
‘ఎనుకులాడొకోరా తండ్రీ!
నీ నీడని మోసే దేహమెవ్వారిదని
నేలంతా మన్ను దేహంతో పొర్లాడు, అంబాడు
కనిపించే ప్రతి తల్లి రొమ్మునీ
చేతుల్జోడించి గుక్కెడు పాలకోసం వేడుకో’

‘నువ్వు నగరం సగం రాత్రిలో పాడుకొనే పల్లెగీతానివి’

అనే ముగింపు వాక్యాన్ని చదివినప్పుడల్లా నాకొక గగుర్పాటు కలుగుతుంది; కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి ప్రతీ సారీ – ఇప్పుడు కూడా.
ఇలా రాసుకుంటూపోతే ఇంకా చాలా ఉన్నాయి. సూఫీ కవితల్లోని మూలవాసుల అమాయకపు స్వాప్నికత, ఆధునిక సంక్లిష్టతతో అడుగడుగునా తలపడుతున్న పదఘట్టన వినిపిస్తాయి. టక్కుటమార విద్యలు అతడు నేర్వలేదు. ‘చూశారా! ఎంత బాగా రాశానో?’ అన్నట్లుగా వినిపించే చమక్కులూ, చమత్కారాలూ ఉండవు అతని కవితల్లో.

నిరంతర అన్వేషణలో, ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ, జీవితపు అంచులలో సంచరించే యువతరానికి ప్రతినిధి సూఫీ. అటువంటి వాళ్ల అన్వేషణలో తపన, నిబధ్ధత నిండుగా ఉంటాయిగానీ దురదృష్టవశాత్తూ ఇది పరిష్కారాల యుగం కాదు. సమాజపు సర్వరోగాలనూ నయం చేయగల దివ్యౌషధాలేవీ ఎవరికీ అందుబాటులో లేవు. ముందు తరాల అనుభవాలు నేటి తరాలకు పనికొచ్చేది కొంతవరకే. కానీ వీళ్ల గొంతులోని నిజాయతీయే వీళ్లని ముందుకి నడిపిస్తుంది; దారి చూపిస్తుంది. అందుకే వీళ్లంతా దూసుకొస్తున్నారు.

అలా దూసుకొచ్చిన నరేష్కుమార్ సూఫీ ఎలుగెత్తి చాటిన ‘నిశ్శబ్ద’ కవితా సంపుటి మొదటిసారిగా శ్రోతల చెవులను సోకి, హృదయాలను తాకి, గాయపరచిన వృత్తాంతాన్ని రాబోయే రోజుల్లో తెలుగు సమాజం పదేపదే గుర్తు చేసుకుంటుంది.

రాక్షసుడు, మహాకాయుడు అయిన గొలాయత్ కు ఎదురొడ్డి నిలబడిన సాహసి, లేలేత యువకుడు అయిన డేవిడ్ కథ విన్నవాళ్లంతా డేవిడ్ పక్షమే వహిస్తారు. ఈ సంగతి మహాశిల్పి మైఖేల్ ఏంజిలో ఎప్పుడో గుర్తించాడు. ఈ రాక్షస సమాజంపై విరుచుకుపడే సూఫీలాంటి యువకవుల పక్షానే సహృదయులైన పాఠకులుకూడా నిలబడతారు. సందేహం అక్ఖర్లేదు.

[‘నిశ్శబ్ద’ కవితా సంకలనం. రచయిత నరేష్కుమార్ సూఫీ. ప్రచురణ కవి సంగమం బుక్స్. 151 పేజీలు. వెల రూ. 150/-. ప్రతులకు నవతెలంగాణా పబ్లిషింగ్ హౌస్, నవోదయ, బోధి, తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని అన్ని ప్రముఖ పుస్తక విక్రేతలు].

ఉణుదుర్తి సుధాకర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు