ఎదగవమ్మా  వెర్రితల్లీ!

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి – సారంగ తొలి కథలపోటీ విజేతలు

నా పేరు శ్రీచరణ్ మిత్ర,విశాఖపట్నం నివాసిని. 24.8.1964 న జన్మించాను.

గత ముప్పై సంవత్సరాలుగా అడపా దడపా రచనలు చేస్తూ, తోచిన విధంగా సాహితీసేవ చేసుకునే నేను, 1986లో ఆంధ్ర భూమి దిన పత్రిక ద్వారా కథల మాష్టారుగా ఖ్యాతి గడించిన కాళీపట్నం రామారావు మాస్టారు గారు నిర్వహించిన “నేటికథ” శీర్షిక ద్వారా రచనా రంగానికి పరిచయం అయ్యాను.

అప్పటి నుండి వివిధ పత్రికల్లో కథలు, వ్యాసాలు, విశాఖ సంస్కృతి అనే మాస పత్రికలో సీరియల్ గా ఒక నవల ప్రచురింపబడ్డాయి.

వివిధ పత్రికల్లో రకరకాల బహుమతులు  పొందినా, అభ్యుదయవాది, సంస్కరణాభిలాషి, కార్మికలోక న్యాయవాది కమ్యూనిస్టు బాలకృష్ణ రెడ్డిగారి ఈ స్మారక బహుమతిని అందుకోవడం గర్వంగా, అదృష్టంగా భావిస్తున్నాను.

*

“అమ్మా…నాన్నను ఇంటికి రానీయమ్మా” నచ్చచెబుతున్నట్టుగా అడుగుతోంది జయ.
అలా ఆమె అడగడం  ఏ పాతికసార్లో జరిగింది ఇప్పటికి.

జయ కేసి చిరాగ్గా చూసింది సావిత్రి.

“అవునమ్మా! నాన్నకూడా మనింటికి వచ్చి, మనతో కలిసి ఉండాలని ఆశ పడుతున్నారు. నాన్న తన తప్పు తెలుసుకుని, పశ్చాత్తాపంతో వస్తానంటే మంచిదే కదమ్మా” చెప్పింది జయ.

“ఎవరికి మంచిదమ్మా? నువ్వు పదేళ్ల వయసులో ఉండగానే నిన్ను తండ్రి లేనిదానినీ, నన్ను మొగుడొది లేసిన ఆడది అని జనాలతో అనిపించి, కేవలం తన సుఖం కోసం, పరాయి స్త్రీ మోజులో పడి మనలను అనాధలుగా వదిలేసిన ఆ మనిషి  రాక ఇప్పుడు ఎవరికి మంచిది?” అంటూ అడిగింది సావిత్రి.

జయ కాసేపు మౌనంగా ఉండిపోయింది.
తల్లిని ఎలా అయినా ఒప్పించి..,తండ్రిని తమ కుటుంబంలో చేర్చుకోవాలని జయ ఆరాటం.
అది ఆమెకు చాలా అవసరం.

కానీ, తల్లి ససేమిరా ఒప్పుకోకపోవడంతో ఏమిచేయలో జయకు పాలుపోవడం లేదు.

‘ఆలు మగల మధ్య వైషమ్యాలు రావడం, విడిపోవడం సర్వసాధారణమే. తల్లి ఇంత పట్టుదలగా ఉండటం కూడా సరైన కారణమే. అయినా తన గురించి కూడా ఆలోచించాలి కదా?’ విసుగ్గా  అనుకుంది జయ.

భర్త వదిలేసినావిడ కూతురుని తమ ఇంటికి కోడలిగా రావడం గోపి అమ్మానాన్నలకు అసలు ఇష్టం లేదు. అందుకే గోపి మరీ మరీ చెబుతున్నాడు.
‘మీ అమ్మానాన్నలు ఇరువురూ వచ్చి తమ తండ్రిని కలిసి సంబంధం కలుపుకోమని’.

కానీ అమ్మే తన మొండి పట్టుదలను వదలటం లేదు.
అందుకే ఇంత కాలం ఎంతో ఆత్మీయమూర్తిగా కనిపించిన తల్లి  ఇపుడు పెద్ద తలనొప్పిగా తయారైంది జయకు.
తమ పెళ్లికి గోపి ఇలాంటి కండీషన్ పెట్టాక తానే స్వయంగా తండ్రిని కలిసింది జయ.

అమ్మను విడిచి పెట్టాక…ఇంతకాలం సహజీవనం చేసినామె మరణించడంతో ఆ ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడు జయ నాన్న.

తనను చూడగానే కళ్లనీళ్లు పెట్టుకున్నాడు. తనది వంటరి బ్రతుకైపోయిందని వాపోతూ తనకింత చదువుకున్న కూతురున్నందుకు గర్వపడుతున్నానంటూ పొంగిపోయాడు. తన పెళ్లి కోసం గోపి తల్లిదండ్రుల కండీషన్  ఆలకించి, ఇకపై అమ్మతో కలిసి ఉండటానికి తన సమ్మతిని తెలియజేశాడు.

తానెన్ని ప్రయత్నాలు చేసినా అమ్మ,  తండ్రితో కలిసి జీవించడానికి అసలు ఇష్టపడటం లేదు.
ఆ మధ్య ఏదో సినిమాలో విడిపోయిన తల్లిదండ్రులను మళ్లీ కలిపి పెళ్లి చేసిన గొప్ప పెళ్లికూతురిలా తనూ అవాలనుకున్నా అది సాధ్యమయ్యేటట్టు లేదు జయకు.

నిజానికి జయ కేవలం తల్లి సంరక్షణలో పెరిగి, చదువు  సంధ్యలు పూర్తిచేసి ఎమ్మార్వో ఆఫీసులో ఎల్.డి.సి గా చేస్తున్న జయకు, అదే ఆఫీసులో పని చేస్తున్న గోపీనాధ్ తో పరిచయం ప్రేమగా మారాక…,అందగాడైన గోపీతో పెళ్లికి తన తల్లిదండ్రుల ఎడబాటే   పెద్ద అడ్డంకి అయి కూర్చుంది.

సంప్రదాయాలంటే పడి చచ్చే గోపీనాధ్ కుటుంబానికి.., భర్త వదిలేసినావిడ కూతురును తమ ఇంటి కోడలిగా చెప్పుకోవడం ఇష్టం లేదట. ఎలా అయినా మీ అమ్మానాన్నలను ఒక్కటి అయేలా చేసి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకోవాలని ఆంక్ష పెట్టారు.
అందుకే ఇన్ని తంటాలు పడుతోంది జయ.

“నేనెన్ని సార్లు చెప్పినా నీవు అర్ధం చేసుకోవా అమ్మా” దాదాపు అరిచినట్టుగానే అంది జయ.
జయ కేసి స్థిరనిశ్చయంతో చూసిన సావిత్రమ్మ….

“ఎలా జయా?  ఎలా అర్థం చేసుకోమంటావు? పర స్త్రీ వ్యామోహంలో నన్ను అవమానానికి గురిచేసి, ఈ శరీరం పై వాతలు తేలేలా కొట్టిన దెబ్బలు ఈ శరీరం పై ఇప్పుడు కనిపించక పోయినా….మనసులో ఇప్పటికీ కలుక్కుమంటున్నాయి.
మగ దిక్కు లేని ఆడదాన్నని తెలిసి సమాజంలో విషపురుగులు నన్ను లొంగదీసుకోవడానికి ప్రయత్నించినపుడు నేను వారిని తప్పించుకోవడానికి ఆకలిదప్పులతో అల్లాడిపోయిన రోజులు ఇంకా గుర్తున్నాయి.
పసిపాపగా నీ ఆలనాపాలనా తీర్చలేక అలమటించిన క్షణాలను ఎలా మరిచిపోగలను?  ఆడపిల్లవైన నీ పెంపకపు  బాధ్యతలు అన్నీ ఆడదాన్నైన నాపై వదిలేసి, ఇప్పుడు నీవు ప్రయోజకురాలైనాక….నీకు తండ్రి స్థానంలో వచ్చేది నీపై, నాపై జాలి పడి కాదు. అతడికి వేరే గత్యంతరం లేక.” అంది సావిత్రి.

“ఎలాగో ఒకలాగ వస్తానన్నారు కదా! తన తప్పు తాను తెలుసుకుని, తన కూతురి పెళ్లికి తానే ఆటంకం కాకూడదు అనుకుని ఆయన వస్తానంటే…చిన్నప్పట్నించీ అన్నీ అందించిన తల్లివి. నీవు కాదంటావేమిటి?” కోపంగా అరుస్తూ అంది జయ.
“జయా! నన్ను అపార్థం చేసుకోకు తల్లీ..నీవు పెళ్లిచేసుకొని చక్కగా ఒకింటిదానివి కావాలనే నా కోరికానూ..కానీ, మీ నాన్నతో కలిసి ఉండాలని నేను ఏ మాత్రం అనుకోవడం లేదు.
ఒంటరితనం నాకెంతో ఆత్మ స్థయిర్యాన్ని, మనశ్శాంతిని నేర్పింది. మళ్లీ ఆ మగాడి అనుబంధం అనే ఉచ్చులో పడి అల్లాడిపోయేందుకు నేను సిద్ధంగా లేను.” అంటూ చెప్పింది సావిత్రి.

తల్లి స్థిర నిశ్చయం విన్న జయ కళ్ళు ఎరుపెక్కాయి. కోపంతో  టేబుల్ పై ఉన్న బ్యాగును నేలకు గట్టిగా విసిరికొట్టి………”ఇక నీ ఇష్టం. ఇద్దరం ఇలా కొయ్యబొమ్మల్లా..మొగుడు లేని మొండిగడ్డల్లా ఇంట్లో ఉందాం. నీ రాతే నాకు కూడా తగలెట్టు…” అంటూ విసురుగా బయటకు వెళ్ళిపోయింది.

నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయింది సావిత్రి.
కళ్ళల్లో నీళ్ళు చిమ్ముకొచ్చాయి.
‘నీలాగే మొగుడు లేని మొండిగడ్డలా ఉంచెయ్’ అన్న జయ మాటలు హృదయాన్ని కలుక్కుమనిపించాయి.
ఏం చేయాలో తోచలేదు.
దీనిని పెంచి, చదివించి ఇంతదాన్ని చేయడానికి, తానెన్ని కష్టాలు పడిందో తనకు తెలియదా? అప్పుడే అవన్నీ మరిచిపోయిందా?
తానిలా భర్త లేని దానిగా ఉండటానికి కారణం ఎవరు?
తానెవరితో  సహజీవనం కొన సాగించినా… దీనిని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తాననో భయంతోనే కదా తానిలా ఉండిపోయింది?.
తన శరీరాన్ని కాంక్షించి పెళ్లాడతామన్న వారంతా…ఆడపిల్ల అడ్డుగా ఉన్నదని తెలిసి….ఎవరికైనా ఇచ్చేయమనో.., లేదా ఏ అనాధ ఆశ్రమంలో వదిలేయమనో సలహాలు ఇచ్చినా, కేవలం కూతురు కోసం మోడులా మిగిలిపోయిన తననేనా ఇన్ని మాటలు అంటున్నది?
సావిత్రమ్మ మనసు బాధగా మూలిగింది.

ఇంతలో తలుపు చప్పుడైన శబ్దం విని తలుపు తెరిచింది సావిత్రి.

ఎదురుగా అలివేణమ్మ… పరిచయస్థురాలే….ఆమె ఎందుకొచ్చిందో కూడా అర్ధం అయింది సావిత్రికి.

ఏదైనా కీలక విషయంలో తనకు నచ్చ జెప్పడానికి జయ ప్రయోగించే ఈ ఆయుధం ఈ అలివేణమ్మ.
తనకు మొదటినించీ సన్నిహితురాలు ఆవిడ.
అవీ, ఇవీ మాట్లాడాక నేరుగా విషయంలోకి వచ్చి తనకు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తోంది.

“కాస్తా నీవు ఆలోచించాలి సావిత్రీ!  దాని అదృష్టం కొద్దీ.. గవర్నమెంట్ జీతగాడైన యువకుడు, పైగా ఒకరిని ఒకరు ప్రేమించుకున్నవారు…,అది ప్రేమించినవాడు నీకు అల్లుడుగా వస్తున్నాడు. పైగా ఈ రోజుల్లో ఉద్యోగస్థుడైన పెళ్ళికొడుకును తేవాలంటే లక్షలకు లక్షలు కట్నాలు పోయాల్సి వస్తోంది…నీవు తేగలవా? ఒక చిన్న విషయంలో నీకింత పట్టుదల  ఏం బాగులేదు” అంది.

“నాది పట్టుదల కాదు ఆలివేణీ! ఆత్మాభిమానం. పెళ్లి చేసుకున్న నన్ను కాదని, వేరొక స్త్రీని చేరదీసి…,నా స్త్రీత్వాన్ని అవమానపరిచిన అతగాడితో
‘నీవే మా అవసరాలకు ఆధారభూతుడవని మళ్లీ ఆతనిని చేరదీయడం అవమానం కాదూ” అంది.

“మొగుడూ పెళ్లాల మధ్య అవమానాలేమిటే?  మరీ విడ్డూరం కాకపోతేనూ…మగాడన్నాక ఏవో తప్పులు చేస్తుంటాడు..మళ్లీ మనదగ్గరకే చేరుకుంటాడు. ఆ చేరుకున్న ప్పుడు చేరదీసుకోకపోతే.. మోడుల్లా మిగిలేది మనం కాదూ..”అంటూ దీర్ఘం తీసింది ఆలివేణి.
“ఇప్పటివరకూ మోడులానే ఉన్నాను అలివేణీ..” కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరుగుతుండగా అంది సావిత్రి.

“అందుకే  ఆ జీవితాన్ని చిగురింప చేసుకోమంటున్నాను. రేప్పొద్దున్న జయ పెళ్లై అత్తారింటికి వెళ్ళాకైనా నీకు సమాజంలో భద్రతకు ఒక మనిషి అవసరం ఉండాలి కదా…. ఆ మనిషి వల్లనే నీవింత కాలం పెంచి పెద్ద చేసిన  నీ కూతురికి మంచి జీవితం ఏర్పడుతుందంటే…. నీవు బావ గారితో సర్దుకపోక తప్పదు.  సమాజంలో స్త్రీకి హోదా, గుర్తింపు కోసం ఎలాంటివాడైనా భర్త అనేవాడు ఒకడు ఉండక తప్పదు కదా..”అంటూ హితబోధ చేయసాగింది.

చెప్పిందే చెప్పి తనను ఒప్పించడానికి శాయశక్తులా పనిచేస్తుందామె.
ఇలా చాలా సార్లు  చాలామందితో తనకు చెప్పించింది జయ.
ఇప్పుడు ఈ ఆలివేణి తో.
చాలాసార్లు ఆపద సమయాల్లోనూ, అవసర సమయాల్లోనూ తనను ఆదుకున్న అలివేణి మాటను, మిగతావారి మాటల్లా అంత తేలిగ్గా  తీసివేయ లేని స్థితి సావిత్రిది.
చివరకు జయే గెలిచేలా ఏర్పాట్లు చేయబడ్డాయి.

*    *    *    *
పెళ్లి కూతురు తండ్రి హోదా వల్ల కొత్తబట్టల్లో హడావిడి పడిపోతున్నాడు సావిత్రి భర్త.

మధ్య మధ్య అతిధులతో జోకులు కూడా వేసేస్తున్నాడు.

జనాలందరూ చూస్తుండగా మాటమాటికి
“సావిత్రీ..అమ్మాయేది?” అంటూ ఆతృత పడిపోతున్నాడు.

ఈ ఆప్యాయత, ప్రేమ ఇన్నాళ్లు ఏమయింది?
పర స్ర్తీ వ్యామోహంలో పడి తనని అకారణంగా చావ గొడుతున్నప్పుడు అడ్డుపడ్డ ఈ పదేళ్ల పిల్లని..
“తప్పుకోవే…లంజముండా! మిమ్మలినందరినీ చంపేస్తాను ఈవేళ” అంటూ చిన్నపిల్ల అని కూడా చూడకుండా రెక్క పట్టి ఈడ్చేసిన ఈ తండ్రి..,
నేడు కన్యాదానం చేసేందుకు కసరత్తులు చేసేస్తున్నాడు.

మృగం మానవత్వం ముసుగులో ముచ్చట్లాడుతున్నట్టుగా…..సాంప్రదాయం పేరిట తనలో లేని సౌమ్యతను  అద్భుతంగా నటించేస్తున్నాడు.
చిత్రంగా చూస్తోంది సావిత్రి.

జయ తన మెడలో తాళి  పడటానికి….తల్లినైన తన మెడలో గుదిబండను తగిలిస్తునట్లుగా అనిపించిదామెకు ఆ క్షణంలో.

జయే కాదు ఈ నాటి ఆడపిల్లలందరూ ఇంచుమించు అలానే ఉన్నారు.
ఎంత చదువుకున్నా, ఎంత సంపాదన ఉన్నా తాము మోజుపడిన అబ్బాయికోసం కుటుంబానికి కుటుంబాన్నే తమ వివాహ యజ్ఞానికి సమిధల్లా వాడేసుకుంటున్నారు.. తాను మాత్రం మినహాయింపు కాదు కదా’ అనుకుంటూ కన్నీళ్లను తుడుచుకుంది సావిత్రమ్మ.

“సావిత్రీ! పెళ్లి  టైమయ్యేటప్పటికి….ఆ తంతు చాలా సేపవుతుంది గానీ.. నాకు అందాక ఏదైనా లైట్ గా టిఫిన్ ఏర్పాటు చెయ్!” అంటూ చెప్పాడు సావిత్రి భర్త.

ఇలాంటి పురమాయింపులు ఆయన పునరాగమనంతో మళ్లీ మొదలైపోయాయి.
అలాగే అన్నట్టుగా తలూపింది సావిత్రి.

“కాస్తా సంతోషంగా. ముఖం పెట్టమ్మా…” అంటూ ఇందాకనే విడిది రూంలో హెచ్చరించింది కూతురు.

‘కరిగే కొవ్వొత్తి పై కనికరం ఎవ్వరికి? అది కాలుతున్నా… వెలుగులే కావాలి అందరికి’ అన్నట్టుగా ఇబ్బందిగా నవ్వింది సావిత్రి.

పెళ్లి పీటలపై వరుడు, వధువు కూర్చున్నాక, పురోహితుడు జరుపుతున్న తంతులో భాగంగా, భర్తతో అన్నీ మౌనంగా జరుపుతున్న సావిత్రితో..

“సావిత్రీ.. ఎందుకంత ఇబ్బందిగా ఉన్నట్టుగా వ్యహరిస్తావు? చూసేవారు ఏమనుకుంటారు? జరిగిన విషయాలు ఒక్కోసారి మరిచిపోవాలి” అన్నాడొక సారి సావిత్రమ్మతో.

“దెబ్బకొట్టిన వారు త్వరగా మరిచిపోతారండీ.. దెబ్బకాసినవారు అంత వేగంగా మరువలేరు కదా” అంది ముక్తసరిగా.

“సరి సర్లే! అమ్మాయి వచ్చి అడిగిందని ఒప్పు  కున్నాను.  తరువాత అవన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం గానీ…ముందు అమ్మాయి పెళ్లి సవ్యంగా జరగనీ” అన్నాడు కాస్తా ముఖం ముడుచుకొని.

అమ్మాయి పెళ్లి కోసం తండ్రి త్యాగం?
తండ్రి రాక కోసం అల్లాడిన అమ్మాయి అనురాగం?
ఇక్కడ తానే ఒంటరిననే భావం గుండెల్లో కలుక్కుమనిపించింది సావిత్రి కి.

*      *      *
జయకు పెళ్ళై నెల రోజులైనాక ఆఫీసు అడ్రసుకు తన పేరున వచ్చిన పోస్టల్ కవరును ఆసక్తిగా చూసింది జయ.
అది తల్లి రాసిన ఉత్తరం. గబగబా తెరిచి చదవసాగింది.
“జయా…..
కొత్త కాపురం ద్వారా, కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన  చిట్టితల్లీ నీకు నా ఆశీస్సులు.
నా విడిపోయిన భర్తను నాకు అందించి నీవు చేసిన పనికి  లోకం నిన్ను ఎంతో మెచ్చుకుంది.
నీ పెళ్లి వలన విడిపోయిన భార్యా భర్తలు కలిసారని అందరూ సంతోషపడి పోయారు.
కానీ…
నేనే మీ నాన్నతో కలిసి ఉండలేకపోతున్నాను. ఆయనను నీవు తండ్రిగా భావించవచ్చు కానీ, నేను భర్తగా అంగీకరించలేక పోతున్నాను.
అవకాశం తలుపుతట్టినప్పుడు ఇంట్లో ఉండాలి అంటారు.
కానీ ఆ అవకాశం అవకాశవాద భర్త అనే ముసుగేసుకుని వచ్చింది.
అతగాడికి భార్య అంటే సేవకురాలు,
భార్య అంటే  తన శారీరక వాంఛలు తీర్చుకునే యంత్రం.,
కొడితే కిక్కురుమనకుండా పడి ఉండాల్సిన బానిస.
ఇవన్నీ ఆయన ఒకప్పటి ఆలోచనలు..ఇప్పటి ఆచరణలు కూడా.

ఆ విపరీత పురుష భావజాలాన్ని..అప్పుడే ఎదిరించి ఆయనచే గెంటివేయబడ్డాను.
మళ్లీ ఆయననే నమ్ముకుని భర్తగా కీర్తిస్తూ..,నేను ఆయన భార్యగా జీవించడం కంటే…నాకు నేనుగా  బ్రతకాలని ఉంది.
అప్పుడూ, ఇప్పుడూ నా ఆలోచన అదే.

అప్పట్లో నాకు ఒక ఆడకూతురుండేది. నా ఆలోచనలకు ఆమె  ఊతమిస్తుందనుకున్నాను.
కానీ నాకు ఇప్పుడే తెలిసింది.
స్త్రీల శత్రువు కేవలం పురుషుడే కాదు కొందరు స్త్రీలు కూడా నని.
లేకుంటే నీ పెళ్ళి కావడం కోసం..ఒక దుర్మార్గుడైన తండ్రి సాహచర్యంలోకి నన్ను పంపిస్తావా? పులి బోనులోకి మేకను తోసినట్టు లేదూ….
అలా అని నిన్ను శపిస్తున్నాననుకోకు.
ఒకప్పటి మా తరంలో ఆడవాళ్లకు చదువు అంతగా రాకపోయినా ఆలోచనల్లో  స్పష్టత ఉండేది. నిర్ణయాలలో నిర్భీతి ఉండేది.
పాశవికుడైన భర్తకు స్త్రీని దూరంగా ఉంచాలనే దూరాలోచన ఉండేది.
ఇప్పుడు చదువులు పెరిగాయి. బ్రతికేందుకు అవకాశాలూ పెరిగాయి.
కానీ..
పురుషుల అసంబద్ధ  ఆలోచనలకు నీ లాంటి ఆడవాళ్లే  ఆలంబన ఇస్తున్నారు.
ప్రేమించిన భర్త నిన్ను పెళ్లాడటానికి…. నీ తల్లి బ్రతుకుని బలి ఇవ్వాలా?  అది నీవు ఆలోచించనే లేదు.
నీకు నీవు ప్రేమించిన భర్త కావాలి అంతే.
అమ్మ ఆత్మాభిమానం నీకొక లెక్కలోనిదే కాదు.
కాబోయే భర్త పురుషాధిక్యతను నీవు గమనించనే లేదు.
మీ తరం ఇంతేలాగుంది.
మోసగించిన మగాడి ఇంటిముందు టెంట్ వేసుకుని ‘వాడు నన్ను పెళ్లి చేసుకునేట్టు చేసి న్యాయం జరిపించండి’ అని అడుక్కోవడం తప్ప……
‘ఆ దోషిని కఠినంగా శిక్షించండి’ అని అడగకుండా మొత్తం స్త్రీ జాతినే అవమానిస్తున్నారు.
ఏ నాటికైనా  స్త్రీప్రపంచాన్ని ..స్త్రీలే రక్షిస్తారు అనుకునేదాన్ని…..కానీ నిన్ను చూశాక ఆలా భావించడం లేదు.
దాంపత్యం అనే స్వీయదృశ్యాన్ని ఊహించేసుకొని సంబరపడిపోతున్న
ఓ వెర్రి తల్లీ! నీవు ఎప్పుడు ఎదుగుతావు?
నీలాంటి కూతుర్లు  ఉండటం నా లాంటి తల్లుల దౌర్భాగ్యం.
చివరగా నేను ఎక్కడికి వెళుతున్నానంటే..
సాంప్రదాయపు ఉచ్చును బలవంతంగా తగిలించి ఊరేగమనే  మన బంధువుల దగ్గరకు మాత్రం కాదు.
నా స్వశక్తిని నమ్ముకుని, నన్ను నేను గౌరవించుకునే చోటు ఎక్కడుందో అక్కడకు వెళతాను. దయచేసి నా కోసం వెతకకు….. సావిత్రి.”

***

 

శ్రీ చరణ్ మిత్ర

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా చాలా బావుంది సర్! స్త్రీల సమస్యల గురించి ఓ క్రొత్త కోణంలో ఆలోచించి రాశారు. మమ్మల్ని కూడా ఆలోచింపజేసింది. అభినందనలతో పాటు ధన్యవాదాలు సర్!👌💐🌷🌹👏👏👏

  • చాలా చాలా బావుంది సర్! స్త్రీల సమస్యలకు స్త్రీలే ఎలా కారణమవుతారో ఓ క్రొత్త కోణంలో రాశారు. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. అభినందనలతో పాటు ధన్యవాదాలు!👌🌷💐🌷👏👏

    • ఎదగవమ్మా వెర్రితల్లీ అంటూ…కూతురుకు ఉత్తరం రాసి తాను నిష్క్రమించడం సావిత్రి చేసిన మంచి నిర్ణయం.
      జయ తన పెళ్ళి కోసం తల్లిని తండ్రితో కలపడం గొప్ప పని చేసిందని అందరికీ అనిపించినా… నిజానికి ఎప్పుడో విరిగిపోయిన సావిత్రి మనసు అతకదని కూతరు అర్థం చేసుకోలేకపోయింది. ఓ ఆడదాన్ని ఆడదే అర్థం చేసుకోలేని ఈ సమాజం ఉన్నంత వరకూ…ఎదుగుదల లేని మరుగుజ్జులాగే ఉంటుంది స్త్రీ జీవితాలు అన్నట్టు చక్కగా ఓ కొత్తపద్దతిలో మంచి కథను అందించిన శ్రీచరణ్ మిత్ర గారికి అభినందనలు💐

  • శ్రీ చరణ్ గారు ఒక మంచి విషయాన్ని తీసుకున్నారు……

  • కథలో రచయిత సరికొత్త కోణాన్ని అద్భుతంగా సృశించారు. స్త్రీ ఆత్మాభిమానం నిలిపేందుకు కాసింత అజ్యాన్ని అందిందించారు. నూత్న ఒరవడికి ఊతమిచ్చారు. కథ ముగింపులో తల్లి సావిత్రి నిర్ణయం సమాజానికి ఆకళింపుకాని ఆలోచనే అయినా, అది సహేతుకమైనదిగానే భావిస్తున్నాను. రచయితకు అభినందనలు!

  • బంధాలన్నీ బంధీలే అయితే, ఆత్మాభిమానం గల వ్యక్తులు ఆశ్రయించేది ఒంటరితనమనే ఓదార్పునే కదా? మానవ సంబంధాలకు గండి పెట్టే ఇలాంటి వ్యక్తిత్వాలు ఉన్నంత కాలం సావిత్రీ వంటి సున్నిత మనస్కులకు సుఖమెక్కడుంటుంది… మంచి కథను అందించిన మిత్ర గారికి హృదయపూర్వక అభినందనలు!

  • కథనం, భాష బాగున్నాయి సర్. కరిగే కొవ్వొత్తిని ఎవరూ కనికరించరు. వెలుగులే అందరికీ కావాలి అన్న లైన్ ఆకట్టుకుంది. ఇక్కడ కొవ్వ త్తి లా కరిగిన సావిత్రి తనకు నచ్చిన వైపు వెలుగు పంచే ప్రయత్నం చేయటం…చివరిలో కొస మెరుపు. అభినందనలు సర్.

  • చాలా చాలా బాగుంది గురువుగారు “కరిగే కొవ్వొత్తి పై కనికరం ఎవ్వరికి ”

    అప్పటి.తరం ఆలోచనలలోని స్పష్టత గురించి. ఇప్పటి తరం ఆలోచనాధోరణి , మీడియా ప్రభావం ఎప్పట్లానే మీ కలం ఆలోచింపజేసే సమకాలిన కథ
    చాలా బాగుంది గురువు గారు

  • చాలా చాలా బాగుంది అండీ.. స్త్రీ గురించి మరో స్త్రీ నే ఆలోచించకపోతే,అర్థం చేసుకోకపోతే ఇంక ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు ఆలోచిస్తారు..? అందులోనూ కూతురే, తన పెళ్ళికోసం కన్నతల్లి జీవితాన్ని సమిధగా చేయడం మనసును కలచివేసింది…ఆ తల్లి, కూతురు కోసం బలవంతంగా వదులుకున్న బంధాన్ని మళ్ళీ ఆహ్వానించినా ,ఆ బాధలు భరిస్తూ చచ్చే దాకా బతకకుండా, మంచి నిర్ణయం తీసుకుంది…తన భర్త మారలేదు అనే దానికి సాక్ష్యం అతని ప్రవర్తన. కథనం చాలా ఆకట్టుకుంది… ఒకచోట మీరు రాశారు “పోరాటాలు చేస్తూ తప్పు చేసిన మనిషిని స్వంతం చేసుకోవాలి అనుకుంటున్నారు తప్ప, అతన్ని శిక్షించబడాలి”అనుకోవట్లేదు అని….సూపర్బ్ అండీ ఆ లైన్… అక్షరసత్యం కూడా… చాలా మంచి కథ సర్

  • నేటి తరంలో ఆలోచనలో స్పష్టత కొరవడిందని చాలా స్పష్టంగా చెప్పారు.. తల్లి ఉత్తరంలో వ్యక్త పరచిన భావాలు చాలా సూటిగా, నిక్కచ్చిగా, స్పష్టంగా ఉన్నాయి.. ఇదే కథకు గాఢతను ఇచ్చిందనవచ్చును.. ఇందులో సూక్ష్మమైన విషయాలను, ఆలోచింపచేసే అంశాలను పొందుపరిచారు.. చక్కటి కథ, కథనం, సంభాషణలతో ఎంతో బాగుంది.. అందుకే విజేతగా నిలిచింది ఈ కథ.. మీ ఈ కథ విజేతగా నిలిచినందుకు మరొకసారి అభినందనలు 💐💐💐

  • పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే స్త్రీయే అవసరమైతే దుర్మార్గుడైన భర్తకు ఎదురు తిరగాలి.. తన ఆత్మాభిమానాన్ని చంపుకొని బానిసలా అతని కాళ్ళ వద్ద పడి ఉండకూడదు.. అంటూ మీరు తీసుకున్న సున్నితమైన కథాంశం చాలా బాగుంది సర్. కథ ఆద్యంతం ఆసక్తిగా చదివించింది. నిజమే.. నేటితరం యువతులు తమ భర్తలు తమకు అన్యాయం చేస్తున్నప్పుడు, వారి ఇళ్ళ ముందు టెంట్లు వేసుకొని న్యాయం కోసం ఆక్రో శిస్తున్నారు, లేదా స్త్రీ సహజ బేలతనoతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు తప్పా.. వాళ్ళని ధైర్యంగా ఎదిరించి వారికి శిక్ష పడేలా చేయడమో, లేదా స్వశక్తితో తమ కాళ్లపై తాము బ్రతకాలనే ఆలోచనలు చేయడం లేదు. స్త్రీలు భయపడినంతకాలం సమాజంలో మగాళ్ళ అకృత్యాలకు, అక్రమాలకు అడ్డూ అదుపూ వుండదు. మీ కథ నేటితరం స్త్రీమూర్తులకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీకు నా అభినందనలు సర్.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు