ఈ పక్షం కవి: కంచరాన భుజంగరావు

విత్వంతో ప్రేమలో ఉన్నప్పుడు కాలం నిత్య నూతనంగా, మరింత వడిగా దూసుకొస్తుంది. సవాళ్ళు విసురుతుంది. దుఃఖిస్తూ, ఆస్వాదిస్తూ, ప్రతిస్పందిస్తూ కవితాకాలంతో పాదం కలపడం నన్ను సజీవంగా ఉంచుతుంది. రెండు దశాబ్దాలుగా సాహిత్యంతో పరిచయం. పుట్టింది శ్రీకాకుళం జిల్లా బడగాంలో. నాన్న  కంచరాన పాపారావు సన్నకారు రైతు, అమ్మ పార్వతి గృహిణి. పాఠం చెప్పటం, కవిత్వం చెప్పటం ఇష్టమైన పనులు.
ముద్రిత రచనలు: 1) వలస పక్షుల విడిది – తేలినీలాపురం (నవంబర్ 2005),    2) కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా… (నానీ సంపుటి) (2010)

గుప్పెడు వెలుతురు

1
ళ్లు తెరిచామంటే
రంగుల ప్రపంచంలోకి మేల్కొన్నట్టే,
కళ్లు మూతలు పడితే
రంగుల కలలకు చోటులేని
ఏ అరోరా వర్ణాల కొత్త లోకంలోకి
మేల్కొంటామో!
బతుకంటే –
కాల ప్రమాణం దాటని
ఒక అనిమిష ప్రయాణమే కావొచ్చు!
ఊపిరి దారిలో –
ఉలిపిరి చలనమే
జీవిత సత్యమై కానరావొచ్చు!
ప్రాణమంటే –
గుప్పెడు వెలుతురే కావొచ్చు!
లేదూ
ఓ ఆరు లీటర్ల నెత్తురే కావొచ్చు!
ఇంద్రధనుర్వర్ణాలతో
ఇంద్రియాల సందిట పూసిన
అనుభూతుల పూదోట
తీపి పరిమళాలతోనో
చేదు రూపాలతోనో కానుకవ్వొచ్చు!
తేనె క్షణాల మురిపెం
పెదవి చివర మొలకెత్తి
తనువంతా చెట్టై తిరుగాడుతుండొచ్చు!
ఏటి కొసల్ని ముడివేసిన నీటికీ..
ఆయువురేఖ నిడివికి
కొలతలతో పనేముంది?
రేణువంత చిగురుకి రేణువంత ములుకు
విశ్వమంత కాంతికి విశ్వమంత వెలుగు!
అడుగుల్లో ఆశల సడి
చూపుల్లో మమతల తడి..
మన ఉనికిని చాటుతుండొచ్చు!
గుండెల్లో శబ్దించే సంగీతమో
శ్వాసల్లో దీపించే సంకల్పమో
ప్రేమకళ తొణికిసలాడేలా
పసినవ్వుల తెలిరేఖల్లో
మన రుజువులు చూపుతుండొచ్చు!
వెలుగు నీడల భాష
ఎంతో మక్కువతో
మనసు మీద రాసుకునే దినచర్య
మన కళ్లముందు సాక్షాత్కరించొచ్చు!
కాల వలయం చుట్టూ
ఊహల ఊనికతో అల్లుకున్న సాలెగూడు
ఎన్ని కలల్ని ఊరిస్తుందో!?
కావాలనుకుని తపించేవి కొన్ని
వొద్దొద్దనుకునేవి కొన్ని.
ఈ అసంఖ్యాక ద్వంద్వాల నడుమ
తెరిచే రెక్కలూ,మూసే రెప్పలుగా
యిమిడిపోయిన ఒంటరి పొద్దుపువ్వు
ఒక అద్వంద్వ బతుకు చిహ్నం!
                       ~ ~ ~

2

క్రష్

నా గురించి నాకేమీ తెలియదు
నీకంతా తెలుసు
నేనేంటో…
చెప్పినా, విన్నా
నీ మాటల్లోనే బాగుంటుంది –
దేహమంతా తవ్విపోస్తే
ఒక మట్టి పొర
మనసంతా గాలిస్తే
ఒక నీటి తెర!
బొట్లు బొట్లుగా
రోడ్డు మీదికి జారిపోయే
క్షణాల తుంపర
ఈ అవిశ్రాంత జీవితం!
యుగాలుగా యుద్ధరంగాన్ని వీడలేని
తరాల ప్రారబ్ధం మీద
ముసుగేసి దాచినా, రేగుతుండే
సన్నని పొగమంట
ఈ అంతరంగ ప్రయాణం!
బహుశా
కన్నీళ్ళుబికిన కళ్ళ కంటే
నిర్మలమైన ఆకాశం,
నవ్వులు చిమ్మే మొహం కంటే
ప్రకాశవంతమైన నేల
దొరికే వరకూ వేట కొనసాగుతుంది.
బ్రతుకు వైశాల్యాన్ని మించినదేదో
ఆశించిన ప్రతిసారీ
అవకాశం
అందని ముచ్చటై మురిపిస్తుంది!
అయినా, కొన్నిసార్లు
కొండరాయిలా క్రష్ అవుతున్నప్పుడు
రాతిపిండిలా
పొడిపొడిగా రాలిపోతుంటాం.
కనీసం కవిత్వం మూలంగానైనా
క్రష్ అయినపుడే కదా!
గుండెలోని కొండగుహల్లో
తేనెపట్టు పూసేది!
పెదవంచున తృప్తి తరక
తేనెవానకు మురిసేది!?
                  ~ ~ ~
3

స్పినోజా చెప్పిన దేవుడు

నీకున్న ఒకే ఒక్క ఉనికిని
రెప్పపాటు నిడివి కాలశకలాన్ని,
ఆనంద విషాదాల్లో ఒకేలా ఉబికే
కన్నీటి బొట్టంత దాని పరిమళాన్ని,
బంధాల పొదరింట్లో ఆస్వాదించడానికి
మొక్కుబడులేవీ అక్కర్లేదని చెప్పే
తాత్వికుని లాంటి దేవుడు –
నవ్వుతూ తుళ్లుతూ
సృష్టి సమస్తంతో మమేకమై గడపమనీ,
పచ్చనాకుల పైటకొంగుతో
కార్చిచ్చు రేగిన నేల కన్నీటిబొట్లు తుడవమనీ,
జీవరాశులన్నిటితో తోబుట్టువులా మెలగమనీ
ఆదరం చూపించే ఆత్మీయుని లాంటి దేవుడు –
తడిగుండె పొద్దుపొడుపుల్లో
సంతోష సాయంతనాల్లో
స్వచ్ఛమైన వెలుతురు చివురింతల్లో
గడ్డిపూసలు నిర్భయంగా కళ్లుతెరిచే
నీరవ నిర్జన మైదానాల్లో
తన్మయత్వంతో కాళ్ళకు గజ్జెలుకట్టి
గాలి నర్తించే కొండ లోయల్లో
చిరు తరగల చక్కిలిగింతకు పడిపడి నవ్వే
పసిమిరేకల గడ్డిపూ నదీ తీరాల్లో
అలల ఊయల జోలపాటకు
జాబిలమ్మలు నిద్దురోయే
సముద్రపొడ్డు ఇసుక పడకల్లో
“నీలోకి నువ్వు ప్రియమారా చూసుకునే
లోచూపుల్ని” వెతుక్కోమని గుర్తుచేసే
కవిలాంటి దేవుడు –
తలనిండా పోగుచేసుకున్న
విలాస సరంజామాతో
నీకు నువ్వే గాలమేసుకోవడం మానుకోమనీ,
నీ ప్రిడేటర్ నీవే ఎందుకౌతున్నావో
యోచించమనీ తెలియజెప్పే
విరాగి లాంటి దేవుడు –
యుద్ధ సందర్భాలను ఎగదోసుకునే సెగల్లో
నేలమట్టమయ్యే నెత్తురూ,
బుగ్గిపాలయ్యే ఊపిరీ…
విధ్వంసానికి కొనసాగింపే కోరుతుందని
హెచ్చరించే అహింసావాది లాంటి దేవుడు –
పచ్చి పాలచుక్కల్లాంటి పసిబిడ్డ కళ్ళలో
అవధుల్లేని ప్రేమకు ఆనవాళ్లు పట్టమనీ
ఆప్తుల తడిచూపు ఆత్మీయ స్పర్శలో
కొత్త లోకాల వెలుగు చూడమనీ
దీపదానం చేసే కొత్త నక్షత్రం లాంటి దేవుడు –
మనిషి అంటే మహా ఇష్టంతో
గుండె చేతులు చాచి
సరిహద్దులన్నిటినీ చెరిపి
కంచెలన్నీ కూల్చి
విభజన రేఖలన్నింటినీ రద్దుచేసి
అందరినీ ఒకేలా హత్తుకునే మనిషి కోసం
వెదుకులాడే దేవుడు
అభాగ్యుల జారుడు రెక్కలు
పొదివిపట్టుకునే దేవుడు
ప్రేమమయ ప్రపంచంలోకి వెళ్లి
నిత్య జాగృతిలో హాయిగా బతకమనే దేవుడు
జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించమనే
వైతాళికుడి లాంటి దేవుడు –
ఏ దేవుడయినా
మానవాకారంలోనే ఎందుకున్నాడోనని
ఆశ్చర్యపడినపుడు మాత్రం
ఆంత్రోపోమార్ఫిజం చదివి
ఆన్సర్ వెతుక్కోమని ఎరుక చెప్పే
శాస్త్రజ్ఞుని లాంటి దేవుడు
స్పినోజా చెప్పిన ఈ కాలజ్ఞాని లాంటి దేవుడు
తన లోపలి చీకటినీ, బయటి పెంజీకటినీ
ఒకేచోట కుప్పపోసి నిప్పు పెట్టడానికి
ఒకేసారి తనువునూ, మనసునూ
తనకు తానుగా వెలిగించుకునే
అగ్గిపుల్ల లాంటి
ఒక మామూలు మనిషి!
                    ~ ~ ~
గమనిక: 
ఈ శీర్షిక కోసం మూడు అముద్రిత కవితలు పంపించండి.  ఒక ఫోటో, క్లుప్తంగా పరిచయం కూడా పంపించండి. 

కంచరాన భుజంగరావు

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Good poems. Spinoza is a father of biological fascism. He dismantled the humanity and pawed way for Hitler Nazism. I appreciate you for taking him as a metaphor.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు