ఆ జాలిలోంచి రాసిన కథ!

“మీ కథల్లో మీకు బాగా అంటే బాగా నచ్చిన కథ ఏది?” అని ఒక రచయితని అడిగితే…ఆ రచయితకి కష్టమే! అయినా సరే, అడిగి చూద్దామని “సారంగ” ఆలోచన! రచయితలకు నచ్చిన కథలు ఇక నుంచి వరసగా… ఈ శీర్షికకు రాయాలనుకున్న వారు editor@saarangabooks.com కి తమ రచనలు పంపించండి.

మా ముందుతరం కుటుంబం చాలా రాజకీయ చైతన్యం కలిగిన కుటుంబం. అంటే అందరూ కూడబలుక్కుని ఒకే గూటి పాట పాడే కుటుంబం కాదు. స్వతంత్రం  వచ్చే టప్పటికి యువకులుగా ఉన్న తరం అది. కామన్ గా దాదాపు అందర్నీ ఏకంచేసిన స్వాతంత్ర్య కాంక్షదాటి ఎవరి సిద్ధాంత కూటమిలోకి వాళ్ళు స్పష్టంగా చేరిన తరం అది.  స్వాత్రంత్రోద్యమ కాలంలోనే ఎన్ని సైధ్ధాంతిక కూటములున్నా ఒక సమిష్టి కార్యాచరణ ముందు అవి పెద్దగా బయటపడలేదనుకుంటాను. అంచేత  మా కుటుంబాల్లో ఒకవైపు వామపక్ష భావాలనించి ఆర్.ఎస్.ఎస్/జనసంఘ్ దాకా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. బహుశా మా కుటుంబానికి మాత్రమే చెందిన ప్రత్యేకత అయ్యుండదు ఇది.  మోడర్న్ చదువు చదువుకున్న మొదటి (?) తరం కృష్ణా/గుంటూరు జిల్లాల మధ్యతరగతి కుటుంబాల సమీకరణం ఇలాగే ఉండి ఉండాలి.

కానీ మా ఇళ్ళలో రాకపోకలు, బంధుత్వాలు, ప్రేమలు ఏవీ వీటి వల్ల దెబ్బ తినలేదు. మా నాన్న పొట్ట చేతబట్టుకుని ఖమ్మం జిల్లా ఉద్యోగానికి వచ్చేశాక మాకు మిగతా బంధువుల్ని వేసవి సెలవల్లోనే కలుస్తుండేవాళ్ళం.  మా నాన్న కమ్యూనిష్టు నిష్టాగరిష్టుడు. అది ఆయనకి కొన్ని చోట్ల గౌరవాన్నీ తెచ్చిపెట్టింది అలాగే కొంత చిరాకునీ కలిగించింది.   కొన్ని టెన్షన్ పెట్టిన సందర్భాలు కూడా లేకపోలేదు.

మా తరం వచ్చేసరికి మాకూ ఏదోఒక వయసులో, స్థాయిలో ఇవ్వన్నీ అంటుకున్నయి.  వొడుగులూ, జంధ్యాలూ వదిలేయడం ఆరోజున తెగింపే.  మాకు తెలియని వయసులో మా అమ్మానాన్నలు చెయ్యలేదు, మాకు తెలిసొచ్చాక  మా తిక్కే చాలు అటువైపుచూడకుండా ఉండటానికి.

ఏదో ఒక దానికి కన్ ఫర్మిస్ట్ కాకపోతే గౌరవం లేని తరం అది. ఖమ్మం జిల్లాలో  70, 80 ల్లో పెరిగి, ఖచ్చితమైన అభిప్రాయాలు లేని వాళ్ళు ఉండే అవకాశమే లేదు! ముఖ్యంగా ఇంటర్ నించి డిగ్రీ అయ్యేదాకా ఏదో ఒక వెర్రిలో ఊగిపోయే వయసు. నేను నాస్తికుడినీ అనుకుంటే అది కావాలని అందరికీ తెలియాలనే తిక్క. భక్తులమధ్యలో కెళ్ళి నేను నాస్తికుణ్ణొహో మీరంతా మూర్ఖులూ అని వాళ్ళు అడక్కపోయినా చెప్పాలనే వెర్రి.  అలా అటువైపు శిబిరంలో భక్తుడయినా అది ఎడ్వర్టయిజ్ చెయ్యాల్సిందే.   రాజీపడని కన్ ఫర్మిస్ట్ కమిట్ మెంట్ అవి.

కానీ  ఇవన్నీ ఎవర్నించి అందుకున్నా మో వాళ్ళు, మా ముందు తరం వాళ్ళు ఇన్ని ఖచ్చితమైన అభిప్రాయాలని పెట్టుకుని కూడా అంత కలివిడిగా ఉండటం అర్థమయ్యేది కాదు. వీళ్ళు రాజీ పడిపోయారా, సైధ్ధాంతిక నిబద్ధత లెదా? లేక హిపోక్రాట్లా అనేది తెలిసేది కాదు.

నలభై ఏళ్ళొచ్చాక నేను మొదటిసారి పీటలమీద కూర్చుని పూజ చేయాల్సివచ్చినప్పుడు నాకు నేనే వింతగా కనపడ్డాను. ఇక్కడ వివరాలు అనవసరం గానీ, అదో పూర్తి ఆబ్లిగేషన్.  అయినాగానీ  అప్పటిదాకా దేనికీ తలొగ్గని నేను ఎందుకు వప్పుకున్నాను?  ఈ ఆలోచన నన్ను నిలవనీయలేదు.

అప్పుడు నాకర్థమయింది మా ముందు తరం గురించి. వాళ్ళకి నిబద్ధత లెకపోవడమూ కాదు, హిపోక్రసీ అంతకన్నా కాదు. మనమీద మనకి నమ్మకం పూర్తిగా కలగటం. యుక్తవయసులో ఉన్నప్పుడు, కొత్తగా వచ్చిన నిబద్ధతల్లో ఓ అమాయకత్వం ఉంటుంది. నేను సరయిన కమ్యూనిష్టులానే ఉన్నానా, సరయిన నాస్థికుడిగానే ఉన్నానా, ఈ మాత్రం భక్తి సరిపోతుందా… ఏదన్నా కానీ ఓ స్కేలు పట్టుకుని మనని మనం కొలుచుకుంటూ ఉంటాం. అంటే నాస్తికుణ్ణి అని ఎదుటి వాణ్ణి నమ్మించడానికి కాదు ఆ కుర్రాడు అంత యాగీ చెయ్యడం, తనని తాను నమ్మించుకోడానికి.  ఒకసారి తానెవరో తన స్థానం ఏమిటో అర్థమయ్యాక ఒక స్థిరచిత్తం ఏర్పడ్డాక చాదస్తాలు తగ్గుతాయి.

ఇదిలా ఉండగా రజని గారు చేసిన చలం ఇంటర్వ్యూ విన్నాను. అందులో చలం తనని తానే ఉద్దేశించుకుని ‘ఈ చలం అనేవాడు ఇవ్వన్నీ రాయకపోతేనేం, వీడికి ఆ ఆలోచనరాకపోతేనేం?’  అంటూ బేలగా మాట్లాడ్డం వింతగా తోచింది. అప్పుడెప్పుడో రాసిన రచనలతో ఇంక తనకి సంబంధం లేదు అంటూనే తాను సృష్టించిన పాత్రల పట్ల అమితమైన ప్రేమని మోస్తున్న చలం, పాపం తన మాటల్లోని అసంబద్ధతని గమనించుకుని ఉండడు.  కానీ ఆయన మాటల్లోనే, ‘చలం’ నించి పారిపోదామని చూసిన ప్రాణి ఆ ఇంటర్వ్యూలో చలం పేరుతో నే మాట్లాడింది. జాగ్రత్తగా గమనిస్తే తన ఏ ఒక్క ఆలోచన పట్లా, రచన పట్లా తనకి అపరాధ భావన ఉన్నట్టు ఆ ఇంటర్వ్యూలో ఎక్కడా చెప్పలేదు. ఆలోచనలనించీ, అలోచించకుండా ఉండలేని అశక్తతనించీ పారిపోవాలని చేసిన బేల ప్రయత్నం చలం.  చాలా జాలేసింది.

ఆ జాలిలోంచి రాసిన కథ జంధ్యం. ఏ ఆదర్శమో, సిద్ధాంతమో, ఆచారమో  ఓ ముళ్ళకిరీటమవడం, మోయలేని బరువవడం, చుట్టూ ఉన్న మనుషుల్లో అశాంతిని లేపడం… ఏమిటివన్నీ?

ఇంత ఆలోచించి రాసినకథా ఎంతమందికి అందింది అనేది సందేహమే. ఓ సామ్యవాదినీ, ఓ సాంప్రదాయవాదినీ ఎదురెదురుగా నిలిపి, మధ్యతరగతి ఆబ్లిగేషన్ కూడా జొప్పించి చేసిన ప్రయోగం అది. నిజానికి ప్రయోగం కూడా కాదు… నేను చూసిన ప్రపంచం అది.  ఈ కథలో ఉన్న తాత్విక వేదన చెప్పడానికి ఈ పాత్రలూ సంఘటనలే అక్కర్లా.  న్యూయార్క్  లో ఉండి గోగ్రీన్ గోగ్రీన్ అని తపించే పాత్రని కూడా చొప్పించి భిన్న మయిన సంఘటనలతో కూడా చెప్పొచ్చు.  కానీ నేను  ఎన్నుకున్న సంఘటనలూ పాత్రలూ నమ్మకం కలిగించేలా సాధికారికంగా ఉండాలంటే ఇలాగే రాయాలి.  దీనివల్ల జరిగిన విషాదం ఏమిటంటే జంధ్యాన్నీ, బ్రాహ్మణ్యాన్నీ ఈ కథ నెత్తినెక్కించుకుందేమో అని అనుమానాలు మన ‘ప్రోగ్రెసివ్ ‘ లకి వచ్చినట్టుంది. లేదా, రచయితగా నేను సమర్థవంతంగా ఆ పాత్రలని, సంఘటనలని దాటి కథ వెనక ఉన్న ఉద్దేశ్యం వైపు పాఠకులని నడిపించలేకపోయాను.  ఏదో ఓ కొద్దిమంది తప్పా పెద్దగా ఎవరూ ముచ్చటించని కథ ఇది.

నాకు మాత్రం నేను రాసిన కథల్లో నాకిష్టమయిన కథల్లో మొదటివరసలోది.

*

జంధ్యం

“వాన పడుతోంది. కాస్త డీజిల్, పాత టైర్లు తెప్పించండి. తడికట్టెలతో దహనం పూర్తవడం కష్టం” ఓ పెద్దాయన చెప్పాడు.

ఏ భావమూ ప్రకటించకుండా పర్సు లోంచి ఓ వెయ్యిరూపాయలు తీసి ఆ పెద్దమనిషికి ఇచ్చాడు మూర్తి. “కావల్సిన వన్నీ తెప్పించండి. నాకు చెప్పక్కర్లా” అన్నాడు,

“అలాగే నాయనా. ఈ అర్థరాత్రి ఏవీ సమకూరవు. అయినా వెలుతురు వచేటప్పటికల్లా అన్నీ తెప్పిచ్చేస్తాగా. నువ్వు మాత్రం శాస్త్ర ప్రకారమే అన్నీ జరిపించునాయనా. నిష్ఠగా బతికిన గొప్ప మనిషి. మీ మామయ్య ” ఆయన మాటలో అపనమ్మకం, అనుమానం స్పష్టంగా ధ్వనించాయి. చొక్కాలేని ఆయన ఒంటి మీద జంధ్యం కూడా స్పష్టంగానే కన పడింది మూర్తికి.

బంధువులకీ, పరిచయస్తులకీ అందరికీ అనుమానమే. వాళ్ళ నాన్న ఆలోచనల్ని పుణికి పుచ్చుకున్న మూర్తి ఈ కార్యక్రమాన్ని ఎలా నడిపిస్తాడని. కమ్యూనిష్టుగా, హేతు వాదిగా జీవితం గడిపినవాడు మూర్తి తండ్రి.

నిశ్శబ్దంగా ఉండిపోయాడు మూర్తి. సెల్ ఫోన్ తీసి సమయం చూశాడు. కనీసం ఇంకో మూడు నాలుగు గంటలదాకా వెలుతురు రాదు అనుకున్నాడు.

మరో సారి శవాన్ని చూశాడు. మొహంలో గొప్ప ప్రశాంతత కనపడింది. శవం మొహంలో ప్రశాంతత ఉంటుందా? అని ఆలోచన రాకపోలేదు. కానీ ఆ ఆలోచన ఓ రూపంతీసుకునే లోపే ఓ కెరటంలా బాధ గుండెల్ని పిండేస్తూ. తల తిప్పుకుని బయటకు నడిచాడు.

బయటకు వచ్చి ఓ ఫర్లాంగు నడిచి సిగరెట్ వెలిగించాడు. సన్నటి తుంపర పడుతోంది. ఇంటివైపు చూశాడు. చిన్న బల్బు వెలుతుర్లో ఇంటి బయట వేసిన టెంట్ కనపడుతోంది. ఎవరో ఒకళ్ళిద్దరు ఊరి వాళ్ళు తప్పా ఇంకా ఎవరూ రాలేదు. తెల్లారి బస్సులు రావడం మొదలయితే గానీ బంధువులు రాలేరు.

“గౌరవ మయిన బతుకే బతికాడు మామయ్య” అనుకున్నాడు.

“మూర్తీ” గేటు దగ్గరకి వచ్చి వీధిలోకి చూస్తూ తల్లి పిలిచింది.

“వస్తున్నా అమ్మా” సిగరెట్ కింద పడేసి చెప్పు కాలితో నలిపి తల్లి వైపు నడిచాడు.

“అత్తయ్య మాట వినట్లేదురా. కాసేపు నిద్ర పోతే బావుణ్ణు. ఇందులో నిద్ర మాత్ర ఏమిటో చూడు” అంది.

ఓ సారి తల్లి వైపు చూశాడు.

“వద్దమ్మా. ఆవిణ్ణి బలవంతంగా అక్కణ్ణించి కదల్చద్దు. ఈ కొన్ని గంటలే ఆవిడకి మిగిలింది, ఆయన్ని చూసుకోవడానికి”

తల్లి కళ్ళలో నీటి పొర చూశాడు.

ఇంట్లో తంతు నంతా ఆవిడే నడిపించాలి. అన్న పోయిన బాధ లోపల దిగమింగుకుని నిబ్బరాన్ని బలవంతాన మోస్తోంది.

ఇద్దరిలో మరింక సంభాషణ జరగలా. నిశ్శబ్దంగా ఉండి పోయారు. ఎవరూ కదల్లా.

“నాన్న గుర్తు రావట్లా” అంది కాసేపయ్యాక

“ఆయన మీద ఎర్ర జెండా. ఈయన మీద అంగవస్త్రం. మొండి ఘటాలు” అన్నాడు మూర్తి. అంటుండగానే అతనికి స్ఫురణకి రాకపోలేదు, తన గురించికూడా అందరూ అలాగే అనుకుంటారని.

“మళ్ళీ ఇద్దరికీ ఇష్టమేరా ఒకళ్ళంటే ఒకళ్ళకి” అంది సావిత్రమ్మ.

ఏమీ మాట్లాడలా మూర్తి. మరో సారి శవం వంక చూశాడు. పొద్దున దాకా మడిలో ఉన్న మనిషి చుట్టూ ఇప్పుడు మైల. మడికీ మైలకీ తేడా ఏంటి? రెంటిలోనూ మనిషి అస్పృశ్యుడే. వికటమయిన ఆలోచనలకి స్వస్తి చెప్పి లోపలికి నడిచాడు.

గోడకి చారగిల పడి నిద్రలోకి జారిపోయి ఉంది మూర్తి భార్య మాలతి. తన పక్కనే గోడనానుకుని కూలబడ్డాడు. అతడి రాకతో మెలకువ వచ్చింది మాలతికి.

“కాసేపు పడుకో మూర్తి” భర్తకి సలహా ఇచ్చింది మాలతి

“నిద్రపట్టట్లేదు మాలా. అమ్మనీ అత్తయ్యనీ చూడు.”

“ఏమో నాకు అర్థమేకాదు మీ గొడవలేంటో. మన పెళ్ళికి రాలేదుగా మీ మామయ్య”

“మరి నువ్వు బ్రాహ్మల్లో పుట్టలేదుగా. అయినా మనం పీటల మీద పెళ్ళిచేసుకోలేదుగా. అది మరో కోపం”

“మరి ఇప్పుడు నేను ఇక్కడ ఉండచ్చా”

“ఇప్పుడీ డౌటెందుకొచ్చింది. మనింటికి చాలాసార్లే వచ్చి, చాలాసార్లే నీ వంట తిన్నాడు గా” అన్నాడు మూర్తి.

“మాలతీ, మెలకువగా ఉన్నావమ్మా. కాస్త మంచినీళ్ళు తెచ్చివ్వుతల్లీ” అన్న అత్తగారి పిలుపుతో లేచింది. వదినని పొదివి పట్టుకుని ఉన్న సావిత్రమ్మని చూసింది.

“మెలుకువగానే ఉన్నానత్తయ్య గారూ. తెస్తున్నా” నంటూ వెళ్ళింది.

మంచినీళ్ళు తీసుకుని వెళ్ళి ఇచ్చింది. శాంతమ్మ మంచి నీళ్ళు తాగి అంది సావిత్రమ్మతో

“మంచి కోడలే దొరికింది నీకు”

“అవునొదినా బంగారం” అంది సావిత్రమ్మ. మనసులో హమ్మయ్య అనుకుంది కాస్త వేరే విషయం మాట్లాడింది కదా అని.

“ఆయనకూడా అనుకునే వాడు. మూర్తి అదృష్ట వంతుడు అని.” మళ్ళీ దుఃఖపడింది.

“ఊర్కోండి” అంది మాలతి మరేమనాలో తెలీక

“కూర్చోమ్మా” అంది మాలతిని చూస్తూ శాంతమ్మ.

అనుమానంగా చూసింది మలతి.

“కూర్చోమ్మా” అని అత్తగారుకూడా అనడంతో కూర్చుంది మాలతి.

శాంతమ్మ భర్త శవం వంక మరో సారి చూసుకుంది. ఆవిడ దుఃఖం కాస్త తగ్గించుకుని అడిగింది. “నీకు మావాడు మన కుటుంబాల గురించి ఎప్పుడన్నా చెప్తాడే?”

తన అత్తగారుకూడా తనని ఏమే అనదు. మొదట్లో మాలతికి ఈ పిలుపు అభ్యంతరంగా ఉన్నా, పెద్దావిడ గొంతులో కనపడే ఆప్యాయత అర్థ మయ్యాకి అది అలవాటయిపోయింది.

తనని కూడ దీసుకుని మొదలు పెట్టింది శాంతమ్మ సమాధానం కోసం చూడకుండా.

“నాకు పెళ్ళయ్యే టప్పటికి సావిత్రికి, అంటే మీఅత్తగారికి ఇంకా పెళ్ళి కాలా. చెల్లెలి పెళ్ళి చేయకుండా ముందు తాను చేసుకున్నందుకు ఆయన్ని చాలా మాటలే అన్నారు. మొండి మనిషి పట్టించుకోలా. మా నాన్న దగ్గిరే ఈయన వేదం నేర్చుకున్నారు. మానాన్న తనతో పాటు ఈయన్ని పౌరోహిత్యాల కి కూడా తీసుకెళ్ళాడు. కొన్ని పౌరోహిత్యాలు ఇప్పించాడు కూడా. నాకు పెళ్ళీడు వచ్చేటప్పటికి ఇంట్లో దంతా కొమ్ముచెంబులోంచి నెయ్యితో పాటు ఖాళీ అయిపోయింది. మా నాన్నకి కన్యాదానం చేసిన పుణ్యం ఇప్పించడానికి ఈయన నన్ను వెంటనే పెళ్ళి చేసుకున్నాడు. గురు దక్షిణ అన్నమాట”

అంత దుఃఖం లోనూ ఆవిడ మాటల్లో దొర్లిన వెటకారానికి నవ్వాలో నవ్వకూడదో తెలీలేదు మాలతికి. మళ్ళీ మొదలు పెట్టింది శాంతమ్మ.

సావిత్రికి వెతికి వెతికి మంచిసంబంధమే చేశారు. మీ మావగారు, అప్పట్లో నే గ్రాడ్యుయేట్. చిన్నదో, చితకదో గవర్నమెంటు ఉద్యోగం. బాధ్యతగా ఉంటాడని అందరూ చెప్పారు. ఇంకేం కావాలి. పెళ్ళి చేసేశారు. పెళ్ళిలో స్నేహితులు కమ్యూనిష్టు పుస్తకాలు ఇచ్చేదాకా మీ మావగారు కమ్యూనిష్టు అని ఎవరికీ తెలీదు. ముందు తెలిస్తే ఆ సంబంధమే చేసేవారు కాదు” ఆలోచనలని కూడగట్టుకుంటూ ఆగింది శాంతమ్మ.

“ఇప్పుడవన్నీ ఎందుకొదినా” అంది సావిత్రమ్మ. ఏనాడో జరిగిన తన పెళ్ళి ప్రస్తావన వచ్చేసరికి.

“ఆ మనిషిని అట్లా చూస్తుంటే గుర్తురావట్లేదా సావిత్రీ” అంటూ మళ్ళీ ముప్పిరి గొన్న దుఃఖంలో మునిగి పోయింది శాంతమ్మ.

ఇక అక్కడే ఉంటే ఆవిడ ని ఆపడం కష్టమని లేచి ఖాళీ గ్లాసు తీసుకుని లోపలికి నడిచింది మాలతి.

గోడకి జారగిల పడి నిద్రలో జోగుతున్న భర్తని గమనించింది.

“అందరూ తెలివయిన వాళ్ళే. ఎవ్వరూ ఎవరికీ అన్యాయం చెయ్యని వాళ్ళే. ఆస్తుల తగాదాలు లేవు. ఇంట్లో వాళ్ళనేకాదు, బయట వాళ్ళని కూడా ప్రేమించగల సంస్కార వంతులు. ఈ అన్నాచెల్లెళ్ళ కుటుంబాల్లో ఉన్న సంక్లిష్టత ఏంటి?” విద్యావంతురాలయిన మాలతికి అర్థంకాని విషయమది. ఆలోచనల్లో తానుకూడా తనకి తెలీకుండానే నిద్రలోకి జారుకుంది భర్త పక్కనే కూలబడి.

2

కిటికీలోంచి వెలుతురు మీద పడటంతో లేచింది మాలతి. పక్కన భర్తలేడు. ముందుగదిలో శవం పక్కనే పడి నిద్రపోతోందో, స్పృహ తప్పిందో తెలీకుండా శాంతమ్మ.

“పడుకోమ్మా కాసెఫు. ఈ రోజంతా నీకూ నాకూ రవంత కునుకు తీసే అవకాశంకూడా ఉండదు. ఇంకో గంట లో అందరూ రావడం మొదలవుతుంది.” అంటూ వంట గది లోంచి వచ్చింది సావిత్రమ్మ.

“లేదత్తయ్య గారూ. మూర్తిని చూస్తే ఆశ్చర్యంగా ఉంది. బతికున్నన్నాళ్ళూ మామయ్య తో తనకి పడదు అని చెప్పిన మనిషి చేస్తున్న ఈ శవ జాగారం నాకు అర్థం కావట్లా. అవునులెండి, కనపడ్డప్పుడు మళ్ళీ మంచిగానే ఉండేవాళ్ళుగా. ఆలోచిస్తూ తెలీకుండా నిద్రలోకి జారుకున్నా. నాకా మీ బ్రాహ్మల అలవాట్లు ఇప్పటికీ తెలీవు. ఏం చేస్తే ఏం తేడా వస్తుందో అర్థం కాదు. ఇప్పుడందరూ వస్తే నన్ను ఇలా మధ్య గదిలో ఉండనిస్తారా?” అంది మాలతి.

చిన్న చిర్నవ్వు నవ్వి అంది సావిత్రమ్మ “ఇంకా నిన్ను కాదనే వాళ్ళెవరమ్మా ఈ ఇంట్లో. ఇహ మీ ఆయనంటావా, వాళ్ళ నాన్న సిద్ధాంతాలూ, వాళ్ళ మామయ్య మొండితనం కల గలిపి పుట్టాడు అంది.

అయో మయంగా చూసింది మాలతి.

పక్కనే కూర్చుని మొదలు పెట్టింది సావిత్రమ్మ.

“మీ మామ గారు చదువుకునే టప్పుడే ఆ కమ్యూనిష్టుల్లో కలిసిపోయారు. పరమ నాస్తికుడు కూడా. కుటుంబ బాధ్యతల కోసం మళ్ళీ పార్టీని వదిలి గవర్నమెంటు ఉద్యోగాన్ని వప్పుకున్నారు. ఆయనకి తెలియని వయసులో వొడుగు చేశారు. తెలిశాక జంధ్యాన్ని తీసేశారు. పెళ్ళి కోసం పీటలమీద కూర్చున్నారు. జంధ్యం కూడా వేసుకుని పద్ధతిగా పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళి అయిందాకా మావాళ్ళెవ్వరికీ ఈ సంగతి తెలీదు. నిజం చెప్పొద్దూ, మనిషి లో చెప్పలేని నమ్మకం ఉండేది తన మీద తనకే.” ఆగింది సావిత్రమ్మ

“మరి మీ నమ్మకాలో? మీరు ఇలా ఆచారాల్లో పెరిగి ఉన్న మిమ్మల్ని అలా మోసం చేసి చేసుకున్నట్టు అనిపించలా” అంది మాలతి.

ఓ చిన్న నవ్వు నవ్వింది సావిత్రమ్మ.

“అని పించకేం. అయినా ఈ నమ్మకాల గురించి నాకేమీ తెలీదు. అయినా కమ్యూనిష్టు అంటే నాకేం తెలుసు. నాకు ఎదురయిన సమస్యలు వేరు. మడిలేని వంట. ఆ రోజుల్లో మా పుట్టింట్లో బయట వాళ్ళకి పెట్టే కంచాలు వేరు, మా కంచాలు వేరు. పాలూ, నెయ్యి కొనుక్కోవటం అసలే తెలీదు. ఒకటేమిటిలే. నా బ్రాహ్మణ ఆలోచనలకి పూర్తిగా తిలోదకాలిచ్చిన కుటుంబం నా మెట్టినిల్లు. కమ్యూనిష్టు గానీ, బ్రాహ్మడు గానీ, మరొకడు గానీ ఆడ వాళ్ళ విషయంలో పెద్ద తేడా లేదమ్మాయ్ ఆ రోజుల్లో.” సాలోచనగా అంది సావిత్రమ్మ.

“నిజం చెప్పొద్దూ, జంధ్యం అలా చొక్కాతగిలించుకునే కొక్కానికి తగిలించి ఉంచడం గమ్మత్తుగా ఉండేది. మా మామగారి తద్దినం పెట్టడానికి మాత్రం ప్రతి సంవత్సరం, ఆ ఒక్క రోజు వేసుకునేవారు. కొద్ది రోజులు పోయాక ఈ పైపై సమస్యలకి అలవాటు పడిపోయాను . పోనీ తప్పక సర్దుకు పోయాను అనుకో. అప్పుడు కాస్త అర్థమయింది మీ మావ గారి సిద్ధంతాలేంటో, తాపత్రయం ఏంటో. ఆ పుస్తకాలు చదవటం. వ్యాసాలు రాయడం. ఎప్పుడూ ఏదో తన చుట్టూ ప్రపంచం తిరుగున్నట్టు ఓ వెర్రిలో ఉండే వారు. నాక్కూడా మా పుట్టింటిలో ఉండిన ఇరుకు దనం కన్నా, మా ఆయన చూపించినట్టు అందర్నీ కలుపుకు పోవడం గొప్పగా అనిపించేది. అంతెందుకు, మూర్తికి వొడుగు చెయ్యలా, నీకు తెలుసుగా”

“మిమ్మల్ని అడిగారా? మీరు ఒప్పుకున్నారా. వొడుగు గిడుగూ లేవంటే” సావిత్రమ్మ మాటలకి అడ్డొస్తూ అడిగింది మాలతి.

“లేదు. అలా ఇంట్లో ఆడ వాళ్ళని అడాగాలనే ఆలోచన ఆనాడు ఎవరికీ వచ్చెది కాదమ్మాయ్. ఇప్పటి మీ ఆలోచనలు వేరు అప్పటి వాళ్ళ పద్ధతులు వేరు. ఆ సంగతి వదిలేయ్. వొడుగు చేయను అన్నది ఆయన నిర్ణయం. చేయలేదు. మూర్తి తొమ్మిదో తరగతిలో ఉండగా ఆయన పోయారు. ఏదో తెలియని గుండె జబ్బు. ఇవ్వాల్టిలా కాదుగా. పార్టీ వాళ్ళు వచ్చి ఎర్ర జెండా కప్పి కార్యక్రమం జరిపారు. మా అన్నయ్య కి చాలా కోపం వచ్చింది. నేను కూడా పార్టీ వాళ్ళు ఏంచేస్తే అదే సరేనన్నాను. మా అన్నయ్య నిశ్శబ్దంగా జరిగే తంతు అంతా చూసి తిరిగి వెళ్ళి పోయాడు”

“ఆయన బతికుండగా మీ కుటుంబాల మధ్య రాక పోకలు ఉండేవా” అడిగింది మాలతి

“లేకనేం. ఉన్నాయి. బావ బావ మరుదులిద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం కూడా ఉండేది. మా అన్నయ్య ఇక్కడ గుళ్ళో అర్చకత్వం తీసుకుని పోయే దాకా ఇదే నాజీవితం అన్నాడు. మేం ఉన్నది చిన్న పాటి పట్టణం. ఈ పల్లెటూళ్ళో వీళ్ళు. రాకపోకలు కష్టం కదా ఆరోజుల్లో. మొదట్లో ఇద్దరూ చాల తిక్కగా ఉండేవాళ్ళు. ఆయన కమ్యూనిష్టు చాదస్తం, ఈయన బ్రాహ్మణ్యం ఒక్క విషయంలో పడేది కాదు. ఏ విషయంలోనూ సర్దుకు పోయేవాళ్ళు కాదు.”

“గొడవలేమన్న జరిగాయా” అడిగింది మాలతి

సాలోచనగా చూసి మళ్ళీ మొదలు పెట్టింది సావిత్రమ్మ. “ పెద్ద గొడవలు పడ్డట్టుగా నాకేమీ గుర్తు లేదు. వీళ్ళిద్దరూ ఒక చోట ఉంటే మాత్రం చుట్టూతా ఉన్న వాళ్ళం ఓ రకమైన కంగారులో ఉండే వాళ్ళం. ఈ వూళ్ళో గుళ్ళోకి అప్పట్లో అందర్నీ రానిచ్చేవారు కాదు. అది కాస్తా పెద్ద గొడవయింది. మా అన్నయ్య ఎటూ మాట్లాడలా. పెద్ద కులస్తులంతా ఏకమయి మాగుళ్ళోకి ఎవ్వణ్ణీ రానివ్వ మన్నారు. చిన్న కులాల వాళ్ళు మా అన్నయ దగ్గరకి వచ్చి పంతులుగారూ ఈ గొడవ తేలే దాకా గుడి తెరవద్దు అన్నారు. తీస్తే పెద్ద కులాల వైపు, మూస్తే చిన్న కులాల వైపు. చివరికి గుడి తీయటం నా పని. ఎవరొచ్చినా అర్చన చేస్తాను అని గుడి తీసి లోపల కూర్చున్నాడు. అది ఈ వూళ్ళో అందరికీ కోపం తెప్పించింది. అటు పెద్ద కులాల వాళ్ళకీ, చిన్న కులాల వాళ్ళకీ కూడా. ఈ వూరి వాడు కాకపోయినా మా వారిక్కూడా చాలా కోపం పోయిందాకా ఆవిషయంలో. ఏం మనిషే? అవసరం, అవకాశం వచ్చినప్పుడు కూడా ఇది న్యాయం అని నిలబడ లేక పోయాడు అనేవారు. మా అన్నయ్య దృష్టిలో తన పని తను చేశాడు. ఎవరు గుడి లోపలికి రావచ్చో నిర్ణయించడం తన పని కాదు అనుకునేవాడు. ఏమిటో వింత రోజులు.” నిట్టూర్చింది సావిత్రమ్మ.

“మళ్ళీ వాళ్ళీద్దరూ మంచి గానే ఉండేవాళ్ళంటాడు మూర్తి” అడిగింది మాలతి.

“అవునమ్మాయ్. విచిత్రంగా ఇద్దర్లో మార్పు వచ్చింది కొంత కాలానికి. మిగతా అందరికన్నా వీళ్ళిద్దరూ మంచి బంధువులయి పోయారు. వాళ్ళు వాళ్ళ ఆలోచనల్తో రాజీ పడ్డారా, నమ్మకాలనే పోగొట్టుకున్నారా అనేది నాకిప్పటికీ తెలీదు. ఒక్క సారిగా ఒకళ్ళమీద ఒకళ్ళకి అంత గౌరవం ఎలా వచ్చేసిందో నాకూ మావదినకీ ఇప్పటికీ తెలీదు“ అంది.

“మీరు చెప్పిన దాన్ని పట్టి వాళ్ళేమీ రాజి పడ్డట్టు నాకనిపించట్లా. అంతెందుకు మూర్తి ఇలాగే ఎల్లకాలం ఉంటాడని నేనను కోను. సొంత ఆకలిని పట్టించుకోకుండా ఎదురుగా ఉన్న వాడికి తిండి పెడితే త్యాగం అంటాం. వాళ్ళ నమ్మకాలని కాసేపు పక్కన పెట్టి ఎదుటి వాళ్ళకి కాస్త వెసులు బాటు కల్పిస్తే వాళ్ళని అనుమానిస్తాం” సాలోచనగా అంది మాలతి.

“బలే చెప్పావమ్మా. నిజమే. అంతెందుకూ, మా అన్నయ్య నీ వంట తింటాడని ఏనాడూ అనుకోలా. అదేదో నీకు మేలు చేశాడని కాదు. కుటుంబ బాధ్యతలు పెరిగిన కొద్దీ ఇద్దరి మొండితనాలు కాస్త తగ్గుతూ వచ్చాయి. మీ మామ గారు పోయాక అన్నయ్య నా బాధ్యతలు తీసుకున్నాడు. మేం ఊరు వదల్లా. మావారి పెన్షన్ డబ్బులూ, ఎప్పట్నించో వచ్చిన ఇంటిని మొత్తం అద్దెకిచ్చేసి, చిన్న పోర్షన్ లో ఉండి మూర్తిని చదివించా. దూరంగా ఉన్నా మా అన్న్యయ్యే నాకు పెద్ద దిక్కు. అప్పుడప్పుడూ వచ్చి నా సంగతులు చూసి పోయే వాడు.“

“మరెప్పుడు మూర్తికీ వాళ్ళ మావయ్యకీ చెడింది?” అడిగింది మాలతి

“నిజానికి పెద్దగా ఏమీ చెళ్ళా. ఇద్దరూ అలా బుకాయించారు అంతే. వీడికి ఆయనంటే ప్రాణం. అమ్మకి అవసరమయినప్పుడు నిలబడ్డాడు మావయ్య అని వాడికి చాలా కృతజ్ఞతా భావం వాళ్ళ మావయ్య అంటే. సమస్య ఏమిటంటే వాళ్ళ నాన్న పోయేటప్పటికే మూర్తి ని ఆయన తన ఆలోచనలకి అనుగుణంగా తయారు చేసేశారు. వాడు తొమ్మిదో తరగతిలోనే గోర్కీ అమ్మ, హేలీ ఏడు తరాలు చదివేశాడు”

ఆ పుస్తకాల పేర్లు అత్తగారి దగ్గర్నించి విని ఆశ్చర్య పోయింది మాలతి. “మీరు కూడా చదివారా అవి?” అంది.

చిన్నగా నవ్వి అంది సావిత్రమ్మ. “అన్నీ తెలుగులోనే ఉండేవి. ఆయన కూడా పోయాక అన్నీ చదివాను. ఇంటినిండా పుస్తకాలే. మా ఇద్దరికీ అవే గొప్ప కాలక్షేపం. వాళ్లనాన్నకి ఆ పుస్తకాలే ప్రతిరూపాలు. మూర్తి పూర్తిగా వాళ్ళ నాన్నలా తయారయాడు. ఆయన్ని మించిపోయాడు. నా పెళ్ళి సమయానికి మావారు ఎలా ఉన్నారో అలాగే తయారయాడు వీడు. వీడికి మా అన్నయ్య బ్రాహ్మణీకం మళ్ళీ భరించలేనిది అయింది”

“నాకు తెలీదా” అంది మాలతి

“నీకెందుకు తెలీదు. నువ్వూ ఆ తానులో ముక్కవేగా” అంది సావిత్రమ్మ

“ఢిల్లీ యూనివర్సిటీలో తెలుగు వాడిగా చూశా అంతే మొదట్లో. తెలుగూ, ఇంగ్లీషూ, హిందీ ఏ భాషలో అయినా అనర్గళంగా అన్నివిషయాలూ మాట్లాడ గలిగే మూర్తి అంటే ఎవరికి తెలియదు.” తన ప్రేమ కథ గుర్తు తెచ్చుకుంది మాలతి.

“నిజానికి ఎక్కువ మాట్లాడే వాడు కాడు మూర్తి. చుట్టాలంతా మమ్మల్ని వదిలేశారు. గుళ్ళో కి రాడు. ప్రతి దాంట్లోనూ పేచీనే. అరిచి కేకలు పెట్టడు కానీ ప్రతి ఆచారంతోనూ, వ్యవహారంతోనూ పేచీనే. అంతా విసుక్కునే వాళ్ళు.” సావిత్రమ్మ

“యూనివర్సిటీలోనూ అంతే. యూనివర్సిటీ డబ్బుని రాక్ షోకీ పెట్టనివ్వలా, వినాయక చవితికీ పెట్ట నివ్వలా. బర్త్ డే కార్డు ఎవరో ఇస్తే నిర్మొహమాటంగా విసిరి గొట్టి ఇంకెప్పుడూ ఇలాటివి చెయ్యొద్దని చెప్పాడు” తాను చూసింది చెప్పింది మాలతి.

“వీడు మళ్ళీ వాళ్ళ నాన్న లా తయారవడంతో మళ్ళీ మా అన్నయ్య మాకు దూరమయి పోయాడు. దూరమవడం అనే కంటే బాధ్యతల్నించి తప్పుకున్నాడు అంటం కరెక్టు. కనపడ్డప్పుడు మళ్ళీ మంచిగానే ఉండే వాళ్ళం.” మూర్తి లోపలికి రావడంతో సంభాషణ ఆగి పోయింది.

“ఊళ్ళో వాళ్ళంతా చూడ్డానికి వస్తున్నారు. ఈ వచ్చిపోయే వాన, బయట ఆ టెంట్ ఆగేలా లేదు. ఇంకో గంటలో బయట ఊళ్ళనించి వచ్చేవాళ్ళు కూడా వచ్చేస్తారు. త్వరగా కానియ్యడమే మంచిది.” తల్లితో అన్నాడు మూర్తి.

“మగ పిల్లలు ఎలాగూ లేరు. ఎక్కడో ఢిల్లీ లో ఉన్న కూతురా వచ్చే పరిస్థితిలో లేదు. అత్తయని అడుగుతా. కానిచ్చేద్దాం” అంటూ ముందు గదిలోకి వెళ్ళింది సావిత్రమ్మ.

“మీది ఓ వింత కుటుంబం” అంది మాలతి భర్తతో

“కొత్తగా ఏం చూశావ్” అన్నాడు మూర్తి.

“ఇటు ఈ ఆచారాలేంటో, అటు మీ విప్లవాలేంటో. మామూలుగా ఉండరా?” అంది మాలతి

“నిజమే నాక్కూడా విసుగొస్తోంది. ఎన్నాళ్ళు ఎదురు నడవడం? నేను కనపడితే చాలు ఎందుకొచ్చాడా అనుకునే చుట్టాలు. ఎర్ర జెండానా, బ్రాహ్మణీకమా, మరొకటా అని కాదు. ఒక దానికి కట్టుబడి ఉండాలను కోవడం పెద్ద శిక్షే మనిషికి. నిజానికి చుట్టూతా ఉన్నవాళ్ళతో గొడవ పడుతున్నట్టుంటుందిగానీ, నిజ మయిన క్షోభ మనిషిలోపల్లోపల అనుభవిస్తుంటాడు. తనని తానే ఎప్పటికప్పుడు తూకం వేసుకుంటూ. మా నాన్న, మావయ్య ఎందుకు తర్వాత కాలంలో మళ్ళీ అందర్నీ కలుపు కునే ప్రయత్నం చేశారో ఇప్పుడర్థమవుతోంది” విషాదంగా అన్నడు మూర్తి.

ఆశ్చర్య పోయింది మాలతి. తన భర్త అంత బేలగా మాట్లాడ్డం ఎప్పుడూ వినలా.

“మూర్తీ. నువ్వు ముసలాడివి అయి పోతున్నావా, లేక చుట్టూతా ఉన్న ఈ వాతావరణం నీతో ఇలా మాట్లాడిస్తోందా తెలీట్లేదు. నువ్వేంటీ ఈ రాజీ మాటలేంటి” అంది మాలతి.

“వయసే అనుకో మాలా. విసిగి పోయాను. పూర్తిగా విసిగి పోయాను.” అదే ధోరణిలో అన్నాడు మూర్తి.

అయిదేళ్ళ క్రితం పక్కింటి వాళ్ళు తిరపతి ప్రసాదం పంపిస్తే తిప్పి పంపిన మూర్తి. ఎవర్నన్నా గుడికి తీసుకెళ్ళాల్సి వస్తే తాను మాత్రం చెట్లకింద కూర్చుని పుస్తకాలు చదువుకునే మూర్తి. ఇప్పుడు తన నమ్మకాలని వదులుకుంటున్నాడా? సడలించు కుంటున్నాడా?

4

“ఇంతకీ కార్యక్రమం ఎవరు చేస్తారు” ఆ ఊరి పెద్దాయన అడిగాడు.

“నేను చేస్తానండి. వరసకి ఆయన నాకు పెదనాన్న” గంట క్రితమే వచ్చిన మురళి అన్నాడు.

“సరే బ్రాహ్మడు రావడానికి పదకొండు అయిపోతుంది. వేరే ఊరి నించి రావాల్సిందే. ఈ లోపు నలుగురు బ్రాహ్మలని చూడాలి ఈ ఊళ్ళో. బ్రాహ్మణ పీనుగుని బ్రాహ్మలే మోయాలి. పైగా తండ్రి బతికుండగా ఎవడూ ఈ పని చెయ్యరు” అంటూ తుండు భుజాన వేసుకుని బ్రాహ్మలని వెతక డానికి వెళ్ళాడు పెద్దాయన.

“మీరేనా మూర్తి బావ. విన్నాను” అన్నాడు మురళి

“అవును. మనం మరీ అంత దూరపు బంధువులమేం కాదు. రాక పోకల్లేక ఇలా పరిచయాలు చేసుకోవాల్సి వస్తోంది” అన్నడు మూర్తి.

“అవును బావా. పెద్దమ్మని చూస్తుంటే బాధేస్తోంది. ఎటు వాళ్ళటు వెళ్ళి పోయారు. ఆ గుడిని పట్టుకుని వేళ్ళాడుతూ వీళ్ళు అందరికీ దూరంగా ఉండిపోయారు. ఏమిటో ఆ పిచ్చి” అన్నాడు మురళి.

“పిచ్చి చాలా రకాలు మురళీ. మానాన్న పిచ్చి మా నాన్నది. ఈయన పిచ్చి ఈయనది” మూర్తి.

“ఏంటో. ఈ నమ్మకాలు వల్లెవేసే వాళ్ళంతా జీవితాంతం అలాగే మడి గట్టుకు కూర్చుంటే అవుతుందా. మా వీధిలో ఓ గొప్ప నాస్తిక గురువు. కూతురి పెళ్ళి పీటల మీద కూర్చుని చేశాడు. ఎందుకొచ్చిన తలనెప్పులు, హాయిగా అందరితో పాటు నడవక” అన్నాడు మురళి.

చిన్నగా నవ్వి అన్నాడు మూర్తి

“ఏ నమ్మకాలూ లేకుండా ఉండగలగటం అదృష్టం. నమ్మకాలని ఆచరణలో పెట్టాలని చూసిన వాళ్ళ బతుకుల్లోనే గా మనం వాళ్ళేమి రాజీ పడ్డారో చెప్పగలం. ఏ కట్టు బాటూ లేని వాడికి గొడవే లేదు. వాణ్ణి ఫలానా చోట రాజీ పడ్డావు అనలేం గా. అందుకే ఏదొ ఒక పద్ధతిగా బతకాలనుకునే వాళ్ళలోనే మనకి లోపాలు కనపడతాయి. గాంధీ గారు కూడా అబద్ధం అడారు అని చెప్పుకోవడం మనకి చాలా రిలీఫ్. “

మురళి మరేమీ మాట్లాడలా.

“ముగ్గురు మాత్రమే కూడారు. నాలుగో మనిషి కావాలి.” అన్నాడు పెద్దాయన తిరిగివచ్చి.

కూర్చున్న చోట నించిలేచి వచ్చాడు మూర్తి. మామయ్య శవం దగ్గరకి వెళ్ళి చూశాడు. శవం మీద జంధ్యం అలాగే ఉంది. భుజమ్మీద కప్పిన దుప్పటి లోంచి లోపలికి వెళుతూ మెడ దగ్గర కనపడుతోంది. తిరిగి పెద్దాయన దగ్గరకి వచ్చి అన్నాడు.

“నేను వస్తాను. జంధ్యం ఒకటి తెప్పించండి” అన్నాడు

“నీకు వొడుగు అవలేదుటగా అబ్బాయి” అన్నాడు పెద్దాయన

“మీకేమన్న అభ్యంతరమా. మా అత్తయ్య కయితే ఏ అభ్యంతరం ఉండదు నాకు నమ్మకమే”

“ఇంతకు ముందు వేసుకున్నావా జంధ్యం ఎప్పుడన్నా” పెద్దాయన వదిలి పెట్టలా

“లేదు. మానాన్న పోయినప్పుడుకూడా శాస్త్ర ప్రకారం చెయ్యలా. అప్పుడు కూడా వేసుకోలా. ఇప్పుడు నేను మామావయ్యకోసం వేసుకుంటున్నాను. నాకోసం, మీకోసం చుట్టుపక్కల వాళ్ళకోసం కాదు” సూటిగా చెప్పాడు మూర్తి. గొంతులో దుఃఖం కూడా స్పష్టంగా ధ్వనించింది.

ఇంకేదో అన బోయి ఆగిపోయాడు పెద్దాయన. “సరే అయితే” అని మాత్రం అన్నాడు చివరికి.

గుమ్మం దగ్గర నించున్న మాలతి ఆశ్చర్యంగా చూసింది. దగ్గరగా వచ్చి భుజంమీద చేయి వేసి ఓదార్పుగా అంది, వేరేవాళ్ళకి వినపడకుండా “మూర్తీ అయ్ కెన్ అండర్స్టాండ్ . యూ అర్ డూయింగ్ ద రైట్ థింగ్”.

(వామపక్ష వాదిగా ఎనభై ఏళ్ళు ఏ మాత్రం రాజీ పడని జీవితం గడిపినా, మా తాతయ్య తద్దినం పెట్టాడానికీ, పల్లెటూళ్ళలో బ్రాహ్మణ శవాల్ని మోయడానికి మాత్రం జంధ్యం వేసుకున్న మానాన్న స్మృతికి – రచయిత)

(సాక్షి – మే 2010)

 

 

అక్కిరాజు భట్టిప్రోలు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ కధ నాకెంతగా నచ్చిందో చెప్పలేను , నా జీవితంలో జరిగిన అనేక విషయాలు , రాజీపడటంలో నేను పడ్డ వేదన గుర్తు వచ్చాయి , నిజమే సిద్ధాంత౦ వున్నవాళ్ళు ఎలా దొరుకుతారో అని చూస్తారు , లేనివాళ్ళకి రాజీ అక్కర్లేదు ,

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు