1974 జూన్ లో అనుకుంటాను, నేను మా గురువు గారి సూచనల ప్రకారం నా డాక్టరేట్ థీసిస్ అంతా జి.వి.వి.ఎస్. మూర్తి చేత నాలుగో, ఐదో కార్బన్ కాపీలు వచ్చేలాగా టైపు చేయించి ఒ రోజు రాత్రి పది దాటాక ఆయనకి ఇవ్వడం, “నీ ఎక్స్ టర్నల్ ఎక్జామినర్ అయిన జపాన్ ప్రొఫెసర్ వటానబే కి నచ్చాలంటే కాస్తో కూస్తో థియోరేతిటికల్ బేసిస్ కూడా చూపించి దానికి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ జోడించు” అని బాంబ్ పేల్చడం, నాకు ఒళ్ళుమండి పోయి అక్కడి ఉంచి తిన్నగా రైల్వే స్టేషన్ కి వెళ్లి కాకినాడ పారిపోదాం అనుకున్నా, అలా పారిపోకుండా రెండు, మూడు వారాలలో నేను ప్రయోగ శాలలో రెండేళ్ళ డేటా కి తగిన సిద్దాంతపరమైన ఈక్వేషన్స్ తయారు చెయ్యడం, వాటిని నిరూపించడానికి మా కేంపస్ లో ఉన్న రష్యన్ కంప్యూటర్ కి ఉన్న సత్తా పనికిరాక పోవడం గురించి ఇది వరలో చెప్పుకున్నాం. నా సిద్దాంతపరమైన ప్రతిపాదనలకి మూలం నేవియర్- స్టోక్స్ పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి. ఇప్పటికీ, ఫిజిక్స్, లెక్కలు, మరీ ముఖ్యంగా మా “ద్రవ యంత్ర గతి శాస్త్రం .అనగా ప్ల్యూయిడ్ మెకానిక్స్ లో చిక్కదనం (విస్కాసిటీ) ఉన్న ద్రవాలు వాటి ప్రవాహాన్ని నిర్దేశించుకునే ఫార్ములా. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలూ ఆ ఈక్వేషన్స్ ప్రతిపాదించి సుమారు 200 ఏళ్ళు అయినా, ఇప్పటికీ వాటి మూడవ క్రమ సమీకరణం” (3rd order partial differential equations) ని ఎవరూ పూర్తిగా నిరూపించ లేక పోయారు. అలా నిరూపించిన వారికి $1 మిలియన్ డాలర్ల బహుమతి ఇస్తాం అని బోస్టన్ లో ఉన్న మేసచ్యుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు 2000 లో “మిలీనియమ్ ప్రొబ్లెమ్” అనే పేరిట ప్రకటించిన బహుమతి ఇంకా అందుబాటులోనే ఉంది.
1974 లో ఆ ఈక్వేషన్స్ కి అత్యంత “రూడిమెంటరీ” స్థాయిలో ఉన్న నా ప్రయోగ ఫలితాలని అన్వయించడానికి కావలసిన కంప్యూటర్ యావత్ ఇండియా మొత్తం మీద ఒకే ఒక్క చోట ఉంది. అది మా ఐఐటి కి సరిగ్గా గంట దూరం లో ఉన్న టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (TIFR). నేను పుట్టిన ఏడాదే.. నాకు మూడో నెల అనుకుంటాను…అప్పుడు….హోమీ భాభా గారి ప్రేరణతో జే.ఆర్.డి టాటా గారు నెలకొల్పగా, దేశ స్వాత్రంత్ర్యం తరువాత నెహ్రూ గారి ప్రోద్బలంతో అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆ T I F R అప్పుడే కాకుండా ఇప్పుడు కూడా ప్రపంచ స్థాయి శాస్త్ర పరిశోధనా శాల. మేము బొంబాయి వెళ్ళిన కొత్తలో పార్శీ అమ్మాయిల సౌందర్య వీక్షణ కోసం వెళ్తూ ఉండే కొలాబా లో సముద్ర తీరం లో ఎంతో అందంగా ఉండే ఆ T I F R లో “అడుగు పెట్టడమే ‘ ఒక పూర్వ జన్మ సుకృతం. చాలా గొప్ప శాస్త్రవేత్తలు అక్కడ మౌలికమైన పరిశోధనలు చేసి దేశానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చే ప్రతిష్తాత్మక సంస్థ.
ఆ రోజుల్లోనే TIFR లో ఉండే CDC Computer అత్యంత శక్తివంతమైనది. నాకు తెలిసీ వేక్యూమ్ ట్యూబ్ లు వాడకుండా తయారైన మొట్టమొదటి సాలిడ్ స్టేట్ కంప్యూటర్ అదే అనుకుంటాను. నేను సిద్దాంత పరంగా ఎన్నుకున్న సమీకరణాల నిరూరణకి కంప్యూటర్ అయితే సరిపోతుంది అని మా కంప్యూటర్ విభాగం వారికి TIFR తో ఉన్న ఒప్పందం ప్రకారం నాకు కావలసిన సమయం ‘కొనుక్కున్నాను’. ఈ మొత్తం తతంగం అంతటికీ సూత్రధారి నా ఆప్త మిత్రుడైన చందూ. అతను నాకు ఏడాది సీనియర్. నా మొట్టమొదటి నాటకానికి దర్శకుడు. మొత్తం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అతనే రాశాడు. నా పని అల్లా రోజూ లోకల్ రైల్ గాడీలో పోలో మని కొలాబా లో TIFR కి వెళ్ళడం, అక్కడ PDP 11 కంప్యూటర్, CDC-3600 కంప్యూటర్లతో “ఆడుకోవడం”. అవతల కంప్యూటర్ ప్రోగ్రాం గంటల తరబడి నడుస్తూ ఉంటే TIFR వారి కాలక్షేపం చేసేవాడిని. ‘అమెరికన్’ స్థాయిలో అప్పటి దాకా నేణు కనీ వినీ ఎరగని పదార్ధాలతో ఉండే ఆ కేఫటీరియాలోనే ఆ సంస్థ డైరెక్టర్ అయిన ఎం. జి.కె. మీనన్ గారినీ, నోబుల్ బహుమతికి నామినేట్ అయిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త జయంత్ విష్ణు నర్లీకర్ గారిని చాలా సార్లు కలిశాను. మిగతా వాళ్ళ పేర్లు గుర్తు లేవు కానీ అంత మంది మేధావులు నాలాటి కుర్రాడితో కబుర్లు చెప్పడం నా అదృష్టమే!.
ఈ వైభోగం సుమారు రెండు నెలలు జరిగింది. ఐఐటి ని మించిన ప్రపంచ స్థాయి మేధావులతో సంపర్కం ఒక అపూర్వమైన అనుభవం అని చెప్పితీరాలి. మొత్తానికి చందూ రాసిన ప్రోగ్రామ్ ని అనుబంధంగా పెట్టి, TIFR వారి CDC -3600 ఇచ్చిన సమాచారాన్ని నా పరిశోధనా అంశాలతో సరి చూసీ చూడనట్టు నా థీసిస్ లో పొందుపరిచే టప్పటికి మా తాతలు దిగి వచ్చారు. ఉదాహరణకి, మొట్టమొదటి సారి ఆ CDC కంప్యూటర్ నా మీద కోపంతో చందూ గాడి ప్రోగ్రామ్ కోడింగ్ ని తిరగ్గొట్టి, సుమారు యాభై పేజీల పాటు అన్నీ సున్నాలతో వెనక్కి పంపించింది. మళ్ళీ మొదలు. అలా అనేక సవరణల తర్వాత వచ్చిన కంప్యూటర్ ఫలితాలు వాడుకోగలిగాను.
మొత్తానికి అన్నీ సరి చేసి తిరగ వ్రాసిన థీసిస్ కాగితాలు అన్నీ మళ్ళీ మూర్తి గారు నాలుగైదు కార్బన్ కాపీలతో సహా మళ్ళీ టైప్ చెయ్యవలసి వచ్చింది. అన్నీ అయ్యాక, ఒక్కొక్కటీ సుమారు 210 పేజీలు ఉన్న ఆ ఐదు కాపీలు రబ్బర్ పట్టీలతో విడి విడిగానూ, అన్నీ కలపీ నా సైకిల్ సీటు వెనకాల గట్టిగానే కట్టాను. ఆ తరవాత నాకు వచ్చిన కష్టం పగవాడికి కూడా వద్దు.
ఆ సాయంత్రం ఆరు గంటలకి ఒక పక్క బొంబాయి వర్షం, మరొక పక్క నేను ఒక చేత్తో గొడుగు పట్టుకుని, వెనక కట్టి ఉన్న నా నాలుగేళ్ల జీవిత సారాన్ని బైండింగ్ వాడికి ఇవ్వడానికి ఒంటి చేత్తో సైకిల్ మీద వెళ్తూ ఉండగా ఆ సన్నటి రోడ్డు మీద పెద్ద కారు నా సైకిల్ ని రాసుకుని దూసుకుంటూ పోవడం, నేను దభీమని బురదలో పడడం క్షణాలలో జరిగిపోయింది. నేను లేచే లోపుగా సైకిల్ వెనకాల కట్టిన నా సిద్దాంత గ్రంధం తాలూకు రబ్బర్ పట్టీ తెగిపోవడం, బంధ విముక్తులైన కొన్ని కాగితాలు స్వేచ్చగా ఎగురుతూ, వానకి తడిసి ఎగర లేక నేల మీదే అన్ని చోట్లా చతికిల పడడం చూస్తూ నా ప్రాణం అవిసి పోయింది. అవి మళ్ళీ ఎగిరిపోకుండా , గబ గబా సుమారు వంద కాగితాలని పోగేసి, అలసిపోని విక్రమార్కుడి లా మళ్ళీ సైకిల్ ఎక్కి ఆ కొండల మీద కిందా, మీదా పది మొత్తానికి నా స్టాఫ్ హాస్టల్ గదికి వెళ్ళగలిగాను.
ఇక ఆ మానసిక గండం నుంచి ఎలా బయట పడ్డానో ఆ దేవుడికే ఎరుక. కానీ మళ్ళీ అన్నీ సద్దుకుని, నా థీసిస్ ని పునరుధ్ధరించి అధికారికంగా మా గురువు గారి ద్వారా ఐఐటి రిజిస్ట్రార్ కి 1974, ఆగస్ట్ నెలాఖరుకి అందజెయ్యగలిగాను. మా ఐఐటి స్నాతకోత్సవం అక్టోబర్ లో ఉంటుంది కాబట్టి మా ‘గండడు’ గారు ఆఘమేఘాల మీద నా థీసిస్ ని అటు జపాన్ లో వటానబే గారికీ, ఇటు ఇంటర్నల్ ఎక్జామినర్ అయిన ఐఐటి, ఢిల్లీ లో ప్రొఫెసర్ మల్ హోత్రా గారికీ పంపించారు. వాళ్ళ నుంచి నెల్లాళ్ళలో మంచి రిపోర్ట్ లు రాగానే హమ్మయ్య అని గురు శిష్యులిద్దరం ఊపిరి పీల్చుకుని తర్వాత జరగవలసిన అత్యంత ప్రాధాన్యత ఉన్న “డిఫెన్స్” కి సెప్టెంబర్ లో ఏర్పాటు చెశారు. ఢిల్లీ నుంచి ప్రొ. మల్ హోత్రా, మా గురువు గారూ, కెమికల్ ఇంజనీరింగ్ లో ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్.ఎన్. మూర్తి గారు (ఆయన్ని తెలుగు వాళ్ళం గసరన్ గారు అనే వాళ్ళం!), ఇంకా ఒకరిద్దరు నా వైవావోసీ అనే ఆ థీసిస్ డిఫెన్స్ కి పరీక్షకులు గా వచ్చారు. ఒక గంటన్నర సేపు నా వాగుడు విని, ఇక భరించ లేక “ఇక చాల్లే. బయటకి వెళ్ళు’ అని వినడానికి వచ్చిన వంద మందినీ కూడా బయటకి గెంటేసి, అరగంట చర్చించుకుని మొత్తానికి నా పరిశోధనకి డాక్టరేట్ అర్హత ఉంది అని నిర్ణయించారు. అక్టోబర్ లో జరిగిన ఆ 12వ స్నాతకోత్సవం ఫొటోలు నా దగ్గర ఏమీ లేవు కానీ మా ఐఐటి వారి వెబ్ సైట్ లో అప్పటి ఒక ఫొటోలో నేను డీగ్రీ తీసుకోడానికి వేదిక మీద నిలబడిన ఫొటో ఒకటి దొరికింది. అది జత పరిచాను. అలాగే TIFR కి వెళ్ళినప్పుడల్లా స్పూర్తి కలిగించిన హోమి భాభా, జె.ఆర్.డీ. టాటా, పండిట్ నెహ్రూల ఫొటో, CDC 3600 కంప్యూటర్ మొదలైనవి జతపరిచాను.
1974, సెప్టెంబర్ రెండో వారం లో జరిగిన ‘వైవావోసీ’ విజయవంతంగా జరిగి, అక్టోబర్ లో జరిగిన స్నాతకోత్సవం లో నేను పట్టా తీసుకోడానికీ మధ్య పనీ పాటూ లేని ఆ నెల్లాళ్ళ లో అత్యంత విచిత్రం జరిగింది. అది నా జీవితాన్నే మార్చేసింది. దానికి నాందీ ప్రస్తావన జరిగి అప్పటికి ఆరేళ్ళు అయింది. ఆ విషయం గురించి నా 38వ వ్యాసం (సారంగ, 15 ఫిబ్రవరి 2019) లో వ్రాశాను. ఇప్పుడు జరిగిన కథ వచ్చే సంచికలో..
*
చిట్టెన్ రాజుగోరండీ,
హోమి భాభా, జె.ఆర్.డీ. టాటా, పండిట్ నెహ్రూల, CDC 3600 కంప్యూటర్ ఫొటోలు మొదలైనవి జతపరిచాను అన్నారు. అవి ఇక్కడ అగపడటంలా. మరి యాడున్నాయో సెప్పి పున్నెం మూటగట్టుకోండి సామే.
కుర్రకారు వయసులో PDP 11 కంప్యూటర్, CDC-3600 కంప్యూటర్లతో ఆడుకున్నారు సరి, మరిప్పుడో ? జపానోడి Fugaku (442 petaflops) తోనా లేక అమెరికా వోడి ఐబీఎం IBM’s Summit (148.8 petaflops) తోనా?
మీరు డీగ్రీ తీసుకోడానికి వేదిక మీద నిలబడిన ఫొటో ఒకటి ఐఐటి వారి వెబ్ సైట్ లో దొరికింది అన్నారు సూడండీ. అది పెద్ద సైజుది గావాల. అయినా అందులో ఉన్నది మీరా ? లేక దేవానందా అని నాకు కుంచెం అనుమానంగా ఉంది.
ఇస్కూలు పిలకాయలుగా మమ్మల్ని టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ ( T I F R ) కు తోలకబొయినారు మాఅయ్యోర్లు. కానీ పార్శీ అమ్మాయిల సౌందర్య వీక్షణ చెయ్యడం కుదరలా. ఆమిటికి పెట్టచేతబట్టుకుని చేరుకున్నాక, బొంబాయి వర్షంలో మావూ తడిసినాం బాబో… అదీ దాదర్, చెంబూర్ ప్రాంతాల్లో.
చిట్టెన్ రాజుగోరండీ,
200 ఏళ్ళు క్రితం నేవియర్- స్టోక్స్ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన పార్షల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ “ద్రవ యంత్ర గతి శాస్త్రం… ప్ల్యూయిడ్ మెకానిక్స్ లో చిక్కదనం (విస్కాసిటీ) ఉన్న ద్రవాలు వాటి ప్రవాహాన్ని నిర్దేశించుకునే ఫార్ములా కి మూడవ క్రమ సమీకరణం” (3rd order partial differential equations) ని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా నిరూపించ లేక పోయారు.
Massachusetts Institute of Technology ( MIT ) మేసచ్యుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారు 2000 లో “మిలీనియమ్ ప్రొబ్లెమ్” అనే పేరిట ప్రకటించిన బహుమతి ఇంకా అందుబాటులోనే ఉంది అన్నారు.
మరిహనేవి సైకిలేసుకుని MIT కి ఎలబారిపొయ్యి ఓ పట్టుపట్టి చూడండి. మనఒక్కరి వల్లకాదనుకుంటే ఓ నాలుగడుగులు ముందుకేసి Carnegie Mellon University డా. రాజ్ రెడ్డి ( Dr. Dabbala Rajagopal “Raj” Reddy ) గారి సాయం తీసుకుని… 3rd order partial differential equations ని నిరూపించి MIT వాళ్లిచ్చే $1 మిలియన్ డాలర్ల బహుమతి పుచ్చేసుకుంటే ఓ పనైపోతుందిగా.
నా ‘సోది’ చదువుతున్నందుకు సంతోషం. స్పందించినందుకు మరింత సంతోషం.