ఆ కెమెరా కన్ను ఎన్ని అగడ్తలు దాటిందో…

ప్రతి ఫోటో లో తన మార్క్ ఉండాలి అని తపన పడే అరుదైన ఫోటో గ్రాఫర్ హుస్సేన్.

కాలం కంటి రెటినా మీద పడ్డ ఒక్క క్షణాన్ని నిక్షిప్తం చేస్తే అది ఒక నిశ్చల చిత్రం అవుద్ది దానినే ఫోటో అంటాము. మానవ ఇతిహాసం ఆధునికతలోకి ప్రయాణం చేసే క్రమంలో కనుగొన్న అద్భుతమైన ఆవిష్కరణ ఫోటోగ్రఫీ. ఫోటో గతాన్ని వీక్షించడానికి కిటికీ అయితే భవిష్యత్ కు ద్వారం లాంటిది. ఈ గతానికి భవిష్యత్ కు వారధి లాంటివాడు ఫోటోగ్రాఫర్. గతించిన కాలాన్ని తిది, వార నక్షత్రంవారీగా మన ముందు నిలిపే ఒక కాలనాళిక ఫోటో. మనం సుందరమైన అనేక దృశ్యాలను పేపర్లలో,టివిలలో చూస్తాం. ఒక అరుదైన బొమ్మ మనం చూస్తున్నాం అంటే అది తీసిన యంత్రాన్ని, దాన్ని పట్టుకున్న నిపుణుడు పడ్డ శ్రమను గుర్తించం. ఆ తీసిన వాడి బ్రతుకు ఎన్ని సునామీ సుడిగుండాలలో చిక్కుకుని పోయినా అతి సున్నితమైన భావోద్గ్వేగాలను బంధించే ఆ ప్రయత్నం విలువను కాసులలో తప్ప వేరేలా చూడం. అక్కడ స్థిమితంగా ఓరిమితో ఉండాలి. తన జీవితంలో ఎన్ని విషాదాలు ఉన్నా తాను చూస్తున్న దృశ్యం కు ఒక శాశ్వత చిరునామా ఇచ్చేపనిలో ఉంటాడు. ఆ విద్య కేవలం ఫోటోగ్రాఫర్ కు మాత్రమే ఉంది. నా జీవితంలో కొంత కాలం స్టూడియోల వెంట,డార్క్ రూమ్ లో,కెమికల్స్, హైపో, ద్రావకాల ఉక్కపోతల మధ్య గడిచింది కాబట్టి ఆ చిత్తడి ఒత్తిడిలో చిందిన స్వేద పరిమళాలు తెలుసు. ఆ క్రమంలోనే దేశబోయిన హుస్సేన్ అనే మిత్రుడు దొరికాడు.

హుస్సేన్ దేశబోయిన ఒక సాధారణ ఫోటోగ్రాఫర్, గంగ పుత్రుడు. బ్రతుకంతా బురద తిని బ్రతికిన జాలరి వృత్తి. ఫోటోగ్రఫీ ఈ కాలంలో ఒక హాబీగా చూసేవాళ్ళు,వాస్తవైకి సొంత వ్యాపకాలలో ఉంటూ సరదాగా ఆ పనిచేసేవాళ్ళను మనం చూస్తూ ఉన్నాం. అదొక ఖరీదైన వ్యాపకం. పెరిగిన ఆధునిక మాధ్యమాల మూలంగా ఇప్పుడిప్పుడే సంపన్న సమాజాల నుండి ఈ వృత్తిలోకి వస్తున్నారు కానీ ఒక నాడు వందలాది మందికి బ్రతుకు దెరువు.

హుస్సేన్ ఈ వృత్తిలోకి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మొదటిది తనకు అది తప్ప ఏపనీ రాదు.రెండోది ఆ వృత్తిలో తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అర్ధంతరంగా చదువు ఆపడం మూలంగా ఒక కిరాణా కొట్టులో పనిచేస్తున్న క్రమం లో ఒక మిత్రుడు చూపిన దారి ఆయనను ఈ రంగం లోకి దింపింది. ఒక చిన్న నిట్టాడి భూమికి ఆనుకొని ఉన్న చుట్టు గుడిసెలాంటి బెంగుళూరు పెంకు దూలపు ఇల్లు వాళ్ళది. ఆ ఇంట్లో హుస్సేన్ అమ్మా,నాన్న ఇద్దరు తమ్ముళ్ళు. ఒక మూలకి చిన్న ఉట్టి ఇంకో మూల వలలు, ఇతర సామాగ్రి. కాసిన్ని కూరగాయలు తట్టలో వేసుకొని ఊరంతా తిరిగి అమ్మి వచ్చిన నాలుగు పైసలు తన అమ్మానాన్న ఇద్దరు తమ్ముళ్ళకు గాసం. ఒక డొక్కు సైకిల్ మీద హుస్సేన్ తండ్రి చేసిన బ్రతుకు యుద్ధం మా ఊరిలో ఏ ఇల్లు అయినా చెప్పుద్ది.

దశాబ్దాలు పాలేరుగా వెట్టి చేసిన దేశబోయిన మల్లయ్య అతని సహచరి పుల్లమ్మవి. అతని పూర్వీకులు బ్రతుకు దెరువు కోసం ఏ దేశాలు దేశాటన చేసారో కానీ మా ఊరిలో స్థిరపడ్డారు. కాలం కలిసిరాక ఆయన ఎక్కని గడప దిగని గడప లేదు. వానొస్తే కురిసే పూరిల్లు, కారిన ధారలు, గోడల మీద చారికలు, చినుకు చినుకు సత్తుగిన్నెల్లో ఎత్తి పోసిన యాది, కాసిన్ని ఆకలి,కన్నీళ్ళు వర్షపు నీరు కాల్వలై పారింది. ఇంట్లో ఒక పక్క ఊత,మావు, ఎలుము, బద్ద, మాలుకర్ర, మట్టి పూసలు, సీసం, శానుకు, నానుపు ,కచ్చు, బెండు, పాండి,చిక్కోలు, సోనపాల, చిన్న రుసు పెద్దరుసు లాంటి రకరకాల చిక్కు వలలు, గాలాలు, తెప్ప ఇవే ఆ ఇంటిసంపద. చెరువు నిండితే పచ్చి చేపలు, చెరువు ఈడుబోతే ఎండబెట్టి అమ్ముకున్న ఎండు చేపల. రొయ్యలు, మిగతా కాలం మొత్తం దొరికిన పనిలో బట్వాడా అయిన బ్రతుకు యుద్ధం. ఇది దేశబోయిన హుస్సేన్ అనే ఒక సాధారణ ఫోటో గ్రాఫర్ వారసత్వంగా పొందిన ఆస్తులు. హుస్సేన్ బాల్యాన్ని వెంటాడిన అమ్మ నాన్న ఎడబాటు. ఇద్దరు తమ్ముళ్ళు మిగిలిన పూరిల్లు. చిన్నప్పుడే ఆటకెక్కిన చదువు. గమ్యం తెలియని నడక. ఏదారీ తెలియని సముద్ర యానంలో సారంగడి బ్రతుకు హుస్సేన్ ది.

అతి కష్టంమీద పది వరకు చదివాడు.ఇంకా ముందుకు సాగలేదు మధ్యలో డ్రాప్ అవుట్, ఆ చదువు ఆయనకు ఏ దారీ ఇవ్వదు అని తెలుసు. నేను ఇంటర్ చేసే రోజుల్లో ఖమ్మం సారధినగర్ సుధా సౌండ్స్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ చదువు కుంటున్నా. అక్కడే నాకు హుస్సేన్ పరిచయం. అతను అక్కడికి రావడానికి ముందు ఆయన అనుభవించిన సుడిగుండాలు కొద్దిగా తెలుసు. అప్పటికే ఇంట్లో మృత్యువు తిష్ట వేసింది. పదహారు ఏళ్ళకే దూరం అయిన అమ్మా నాన్న. పదిహేడు ఏళ్ళకే పెళ్లి, రెండేళ్ళకి ఇద్దరు కొడుకులు. పెద్దోడు సాయి లిఖిత్ వాడికి రెండేళ్ళు, చిన్నోడు గణేష్ నెలల బాబు, కన్ను తెరవని పసి బాల్యం .పట్టుమని పది రోజులు పాలుకూడా తాగని వయసు గణేష్, కాలం హుస్సేన్ బ్రతుకుతో ఆట మొదలు పెట్టింది. విధి ఉందొ లేదో మరొక్క సారి విరిగి నెత్తినపడి విక్కట్ట హాసం చేసింది. వెయ్యి టన్నుల కల్లోలం ఒకే సారి నెత్తిన పిడుగులా పడ్డది. ఒక ప్రశాంత ఉదయాన ఒక మిత్రుడి ఇంట్లో ఫోటోలు తీసే పనిలో ఉండగా తన సహచరి ఇక లేదనే కబురు. పద్దెనిమిది ఏళ్ళకే వంద వృద్దాప్యాల భారం మోయడం అంటే హుస్సేన్ మాత్రమే గుర్తుకు వస్తాడు. ఎక్కడ మొదలైందో బ్రతుకు అక్కడే మిగిలింది.

అప్పు చేసి కొన్న తొమ్మిది వేల రూపాయల నికాన్ కెమెరాతో మొదలైన యుద్ధం. తొలిసారి కెమెరా చేతికి వచ్చాక ఊరి చెరువు ప్రయోగశాల కనబడ్డ ప్రతి పిల్లవాన్ని ఫోటో తీయడం మొదలు పెట్టాడు. మొత్తానికి మా ఊరిలో ఒక ఫోటోగ్రాఫర్ పుట్టాడు. జీవితం మొత్తం అంధకారం ఆవరించినా వెన కడుగు వేయలేదు. జీవితంలో తాను కోల్పోయిన అనేక వసంతా లను చూసాడు. ఎన్ని పెళ్ళిళ్ళు,ఎన్ని పురుళ్ళు,ఎన్ని అన్న ప్రాసనలు, ఎన్ని సీమంతాలు, ఎన్ని జన్మదిన వేడుకలు.పాతికేళ్ళ నిరంతర శ్రమ తన కెమెరా కన్ను ద్వారా వీక్షించాడు. లేమి ఆయనను బాగా కుంగ దీసింది అయిన వాళ్ళు లేరు ఆదు కోవడానికి ఎవరూ లేరు.అమ్మ తరుపు నాన్న తరుపు ఆనవాళ్ళు లేవు. ఒంటి నిట్టాడిలా కనీసం యుక్త వయసు కూడా దాటలేదు. నిట్టాడి అయిన అమ్మ నాన్న సహచరి ఒక్కొక్కరు అసహజ మరణంతో అర్ధాంతరంగా దూరం అయ్యారు. భార్య పోయిన నాడు పిండం పెట్టినరోజు కాసింత అన్నం ఇంట్లో కొరివి కారం కలిపి నాలుగు ముద్దలు కాకులకు వేసిన యాది ఈ నాటికీ గుర్తు. తాను తినే ప్రతి ముద్దనూ తమ్ముళ్ళకు ఇద్దరు కొడుకులకు పెట్టి ఎన్ని నిద్రలేని సాయంత్రాలను కోల్పోయాడో దగ్గరగా చూసిన నాలాంటి వాళ్ళకు తెలుసు.

ఏళ్ళుగా ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు. నలభై ఏళ్ళు వైవాహిక జీవితానికి దూరం అయ్యాడు ఇద్దరు తమ్ముళ్ళకు పెళ్లి చేసాడు. మంచి ఇల్లు కట్టుకున్నాడు. ఒక హై ఎండ్ బుల్లెట్, ఫోర్డ్ కారు. చేతిలో అతి ఖరీదైన కెమెరాలు. అయినా అతి సాధారణ ఒక తెల్ల అంగి, తెల్ల పాంట్ అదే ఆయన వస్త్రధారణ. ఇద్దరు కొడుకులు ఇంజనీరింగ్ లో చేరారు. మా ఖమ్మం సర్కిల్ లో మంచి ఫోటోగ్రాఫర్. ఇప్పుడు హుస్సేన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఊరిలో ఒక విలువ ఉంది. కాస్తంత భూమి ఉంది.తనకొక అడ్రెస్ ఉంది.ఒకనాడు అతి సాధారణ కెమెరాలతో మొదలైన ప్రయాణం వివిటర్, యాషికా, కొనికా, మినోల్తా, కోషినా, పెంటాక్ష్, మీదుగా ఇప్పుడు నికాన్ , కెనాన్ ఫైవ్ డి. డ్రోన్ తో ప్రి వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్. ఇప్పుడు హుస్సేన్ తో ఫోటోలు తీయించుకోవాలి అంటే కొద్దిపాటి సినిమా బడ్జెట్ కు సిద్దపడాలి. ఒక నాడు ఐదొందలు ఇస్తే రెండు పెళ్ళిళ్ళు ఫోటోలు తీసిన ఆయన ఇప్పుడు ఒక్క రోజు పది మంది ఫోటోగ్రాఫర్లను పెట్టుకుని రెండు మూడు పెళ్ళిళ్ళు తీయగల సామాగ్రి సంపాదించుకున్నాడు. ఫ్యాషన్ ఫోటోగ్రఫీ లో తనదైన మార్క్ ఉంది. మోడలింగ్, వెడ్డింగ్, డాక్యుమెంటరీలు, ఎడ్ల పందేలు,పది పదిహేను డాక్యుమెంటరీలు,షార్ట్ ఫిలింలు,ఒకటా రెండా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తన కెమెరా పనితనం తో తడిమాడు. తీస్తున్న ప్రతి ఫోటో మొదటి సారి తీసిన రోజుల ఓరిమి పోలేదు.

సత్తుగిన్నెలు, పూరిపాక, మాసిన అంగీలు తో మొదలైన హుస్సేన్ ఇప్పుడు ఒక పెళ్లి ఫోటోలు తీయాలి అంటే కనీసం ఐదు నుండి పదిలక్షలు డిమాండ్ చేసే స్థాయికి ఎదిగాడు. అతను విధి తరిమినా ఎదిరించాడు. అమ్మా,నాన్న,భార్య అర్ధాంతరంగా దూరం అయ్యారు. ఎన్ని ఎడబాట్లు వెక్కిరించినా పారిపోలేదు. ఊరు ఒంటరితనం,ఆకలి,అవమానాలను ధిక్కరించి అక్కడే మిగిలాడు. ఎక్కడ కోల్పోయాడో అక్కడే నిలబడి సమరం చేస్తున్నాడు. తన సహచరి వియోగం అనేక కాల పరీక్షలు పెట్టింది. మళ్ళీ పెళ్లి చేసుకో అన్నారు, అమ్మ నాన్న లేరు కన్న వాళ్ళకి, తోడ బుట్టిన వాళ్ళకి కూడా తన పెళ్లి ఒక ఆసరా అవుద్ది అని ఎందరో అన్నారు. ఎన్ని మాటలు చెప్పినా వినలేదు. యాడాదిలో ఒక నెల పుట్టపర్తి లో సేవ అదే ఆయన లోకం.

ఖమ్మం సుధా సౌండ్స్ లో ఆరేళ్ళు కెమరా అసిస్టెంట్ తొలి జీతం రెండు వందలు. పని నేర్చుకోవాలి అక్కడే ఫోటోలు వీడియో తీయడం నేర్చుకున్నాడు. సొంతంగా ఫోటోస్టూడియో పెట్టాడు. ఇక వెనకకు తిరిగి చూడలేదు. బ్రతుకు గుదిబండలాగా పెళ్లి పురుళ్ళు మాత్రమే కాదు ఆ కెమెరా తన విస్తరణను పెంచుకుంది. అనేక వర్క్ షాప్ లకు తిరిగాడు. అసోసియేషన్ లలో భాగం అయ్యాడు. ఫోటోగ్రఫీ కాంపిటిషన్ లలో పాల్గొన్నాడు. హైదరాబాద్ లో జరిగిన ఒక వర్క్ షాప్ లో జాతీయ స్థాయి లో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ లో మొదటి బహుమతి పొందాడు. ఐకానిక్ ఫోటో గ్రాఫర్ రాజన్ బాబు చేతుల మీదుగా మొదటి అవార్డు, మళ్ళీ పాపి కొండలు లో పదేళ్ళ కింద జరిగిన ఒక వర్క్ షాప్ లో తను తీసిన మోడలింగ్ ఫోటో కి మరో జాతీయ స్థాయి ప్రధమ బహుమతి. అనేక అవార్డులు. కాలంమారింది ప్రతి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ , ఇప్పుడు ప్రత్యేకంగా ఫోటోగ్రాఫర్ అవసరం లేకుండానే డిజిటల్ ఫోటోలు అరచేతిలో ఉంటున్న ఈ కాలంలో కూడా హుస్సేన్ ఫోటోల కు మాత్రం విరామం లేదు. అతను నిజంగా అరుదైన ఫొటోగ్రాఫర్. పెద్దగా చదవక పోయినా మార్కెట్లో ఉన్న ప్రతి లెన్స్ కొంటాడు.పెద్ద పెద్ద అంబరిల్లాలు , ఫ్లాష్ లు, కంప్యూటర్ లు, హార్డ్ డిస్క్ లు ఆయన నోటితో పలకలేని అనేక మోడ్రెన్ సామాగ్రి ఉంది.

కరోనా లాక్ డౌన్ పుణ్యాన చాలా ఏళ్ళ తర్వాత హుస్సేన్ ఇంటికి వెళ్ళా. ఉన్న స్థలం లోనే కింద నాలుగు గదులు పైన ఇంకో రూమ్ వేసాడు. ఇంట్లో ఇంచు కూడా సందు లేకుండా రకరకాల పూలు, దేశి విదేశీ మొక్కలు, సీతాకోక చిలుకలు, క్రీపర్స్, ఇంట్లో ఒక ఫోటో నన్ను కట్టిపడేసింది.ఎప్పుడో కూల్చేసిన పాత మట్టి ఇల్లు పెద్ద ఫ్రేమ్ కట్టి ఇంట్లో వేలాడ దీసాడు.ఒక్కసారి ముప్పై ఏళ్ళు వెనక్కు వెళ్లాను. బల్లులు గుడ్లు పెట్టిన గోడలు, పొగచూరిన కట్టెల పొయ్యి మసిఆనవాళ్ళు, కప్పు సందుల్లో నుంచి జారుతున్న సూర్య కిరణాలు. కిరసనాల దీపం. లోపల గోడలకు కారిన వర్షపు దారలు, అవి కేవలం వాన చినుకులు కావు ఆ కుటుంబం రాల్చిన కన్నీళ్ళు. అమ్మ నాన్న తమ్ముళ్ళు పసి కందులు. కనీసం ఐదడుగుల ఎత్తుకూడా లేని ఆ ఇల్లు నావుండతో వాళ్ళ అమ్మ గోడ మీద గీసిన నిలువు పట్టీలు, శుభ్రంగా అలికిన అరుగు, చుక్కల ముగ్గు. ఎన్ని కొత్త వస్తువులు ఇంటి అలంకరణ సామాగ్రి ఇంట్లో చేరినా గోడ మీద వాళ్ళ అమ్మ నాన్న చెమటతో కట్టిన ఇంటి ఫోటో జ్ఞాపకాల పొదరిల్లు మాత్రం చెక్కుచెదరకుండా ఉంచుకున్నాడు. ఆ ఇంట్లో ఫోర్డ్ ఐకాన్ కారు, రాయల్ ఎన్ఫీల్డ్, ఇంకో బైక్, ఎయిర్ కండిషన్ లు, ఆపిల్ ఫోన్లు లక్షరూపాయల ప్లాస్మా టివి, చల్లని చలవ రాతి బండలు, వాటికన్నా ముఖ్యం గా ఇంటి నిండా వందలాది పూల మొక్కలు ఇవేమీ నాకు నచ్చవు. ఆ ఇంట్లో గోడకు వేలాడుతున్న అమ్మ నాన్న పక్కన శిధిల జ్ఞాపకంగా మిగిలిన ఇంటి ఫోటో నాకు బాగా ఇష్టం. ఒకనాటి మా పూరిల్లు ఆనవాళ్ళు నాకు లేదాయనే అనే బెంగ నాకు. అలా ఇష్టంగా ఒక చిన్న పెంకుటిల్లు ఫోటో పెట్టుకోవడానికి ఆ ఇంట్లో ఆయనకు మధురమైన జ్ఞాపకాలు ఏమీలేవు.. సేద తీరిన ఆనవాళ్ళు కూడా మిగలలేదు. అన్నీ విషాదాలె. తొమ్మిదేళ్ళ నిరేక్షణ తర్వాత జానపాడు దర్ఘా మొక్కు ద్వారా హుస్సేన్ అయ్యాడు. అమ్మ కంచంలో తినిపించిన గోరు ముద్దలు, నాన్న జోల పాటలు లేవు. మిగిలింది అంతా చేపల వాసన, కలికుండ పులుపు,ఉట్టి,అంబలి, ఇంటి ముందు రోట్లో జొన్నలు దంచి గంజి, గటక, ఉండ్రాళ్ళు, దోసకాయ ఒరుగులు, ఇవే ఆయన బాల్యాన్ని సాకినవి. ఆ ఫోటో చూసినప్పుడు వాళ్ళ బాల్యం, సునామీ లో చిక్కిన జాలరి బ్రతుకే యాదికి వస్తది. కానీ ఇప్పుడు తాను అనుభవిస్తున్న కాసిన్ని సౌకర్యాలు సీద తీరుతున్న సాయంత్రాలు ఆ ఇల్లు ఇచ్చిన భిక్షఅని నమ్మే అమాయకుడు హుస్సేన్.

ది లాస్ట్ ఫోటో గ్రాఫర్ లాగా ఆ రంగాన్ని కుమ్మేసిన డిజిటల్ యుగం మిగిల్చిన విషాద కాలానికి చివరి ప్రతినిధి అతను. రీల్ నెగిటివ్ ఫిలిం మాయం అయిపోయాయి. డార్క్ రూమ్ కనుమరుగు అయ్యింది ఒక నాటి ఫాగీ, దిఫ్యూజర్,స్టార్ ఫిల్టర్,కలర్ పేపర్స్, ఎం సెవన్ వీడియో, హైపో ద్రావకాలు. కొనుకున్న రీళ్ళు లేవు. నలుపు తెలుపు పోయి పంచె వన్నెల రంగుల మయా లోకం మిగిలింది. అతను నలుపు తెలుపు నుండి రంగుల డిజిటల్ యుగం మధ్య వారధి. ఆయన బాల్యం నలుపు తెలుపు తోనే మొదలైనా నాన్ టరబుల్, కరిష్మా, స్నూట్, సాఫ్ట్ బాక్స్, రిఫ్లేక్టర్స్, స్లేవ్ యూనిట్, డిజిటల్ ఫ్లాష్ లో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు ఆయన తీస్తున్న ప్రతి ఫ్రేమ్ లో కనిపించే రంగవల్లుల వెనక దాగిన అఘాతపు లోతు మా లాంటి వాళ్లకు మాత్రమే తెలుసు. ప్రతి ఫోటోలో తన మార్క్ ఉండాలి అని తపన పడే అరుదైన ఫోటో గ్రాఫర్ హుస్సేన్. అసలెందుకు ఇతని గురించి ? ఏదో నాలుగు ఫోటోలు తీసుకొని తన మానాన తాను బ్రతికే అతని అవసరం ఏమిటి? ఇటువంటి వాళ్ళు వాడకు ఒకరు ఉంటారు అనుకోవచ్చు. ఒక డబ్బా స్టూడియో లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో వేస్తుంటే ఆ స్టూడియో యజమాని ‘అరె నువ్వు బరిగోడ్లు కాయడానికి కూడా పనికి రావు’ అని చేసిన అవమానం తనను తాను నిలబెట్టుకోడానికి సోపానం అయ్యింది. ఒక్కసారి హుస్సేన్ తీసిన ఫోటోలు చూస్తే ఆ మాట ఎవరూ ఒప్పుకోరు. ఏ మాత్రం ప్రాధమిక స్థాయి విద్య లేకున్నా ఎక్కడో ఫ్యాషన్ ఫోటోగ్రఫీ లో అనుసరిస్తున్న ఆధునిక పద్దతులు, మాధ్యమాలు మా ఊరికి తీసుకొని వచ్చిన జ్ఞాన సంచారి. గురువు లేకుండా చదువు సాధ్యం ఏమో గాని, ఏమాత్రం చదువు లేని వాడు కనీసం ఆంగ్ల అక్షరాలు కూడా తెలియని వాడు జపాన్ మేడ్ లేటెస్ట్ సాధనాల మీద సాధికారత పొందడం వెనక ఆకలి కేకలు ఉన్నాయి. హుస్సేన్ ఫోటోలు తీస్తే పదికాలాలు మన జ్ఞాపకాలు పదిలం అనే పేరు పొందాడు. ఒకటి రెండు అని వేళ్ళ మీద లెక్క బెట్టుకునే ఒక ఊరి మనిషి కసితో ఫోటో ప్రపంచంలో చేసిన విహారం అసామాన్యమైనది. ఆయన నడిచి వచ్చిన కన్నీళ్ళ సునామి చిన్నది కాదు. అయినా బ్రతుకు మీద మరింత బరోసా తో తన ఇద్దరు కొడుకుల్లో తన భవిష్యత్ ని నిలుపుకొని దిగుడి లో దీపం లా నిలబడ్డాడు…

*

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

10 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అన్న నమస్తే
    హుస్సేన్ దేశబోయిన మీద మీరు రాసిన వ్యాసం కన్నీళ్లు పెట్టించింది. హుస్సేన్ జీవితంలో ఎంత సౌందర్యం, అద్భుతాలు ఉన్నాయో మీ వాక్యంలో అంతే సౌందర్యం అంతే అద్భుతాలు దాగి ఉన్నాయి. ఫోటోగ్రాఫర్ గా కొంతకాలం పని నేర్చుకునే క్రమంలో మీకు ఆ జీవితం ఉండటం మీ వ్యాసానికి మరింత బలాన్ని ఇచ్చింది. హుస్సేన్ వంటి జీవితాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 2000 ప్రాంతంలో కందుకూరి రమేష్ బాబు గారు సామాన్య జీవితాలపై రాసిన వ్యాసాలన్నీ ఒక్కసారిగా నా కళ్ళముందు కదలాడాయి. అన్న పొద్దుగాల పొద్దుగాల మంచి వ్యాసాన్ని, హృదయాన్ని ద్రవింపజేసే వ్యాసాన్ని మీ ద్వారా చదివే అవకాశం కలిగినందుకు ధన్యవాదాలు. ఉంటాను అన్న.

  • ఒక పోరాటకారుడిని పరిచయం చేశారు .అభినందనలు.

  • ఊత,మావు, ఎలుము, బద్ద, మాలుకర్ర, మట్టి పూసలు, సీసం, శానుకు, నానుపు ,కచ్చు, బెండు, పాండి,చిక్కోలు, సోనపాల, చిన్న రుసు పెద్దరుసు లాంటి రకరకాల చిక్కు వలలు, గాలాలు, తెప్ప
    చేపలు పట్టడానికి నువ్వే ఇన్ని పదాలు చెప్పావు ఇక ఆ ఉత్తరాంధ్ర లో అదే కుల వృత్తిగా బతికే జనుల కెన్ని పదాలున్నవో …
    చక్కటి వ్యాసం సీతా , అందించిన సారంగ సారథులకు వందనం …

  • Great to now about the photographer and his life. As i cannot type in unicode, i may not express my feelings exactly in English. But this is like watching him from my childhood and feel the narration totally came from me. Heart touching.

  • ఫోటోగ్రఫీను ఫ్యాషన్ గా భావించి, అదో స్టయిల్ అనుకునే ఈరోజుల్లో, తమ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఓ చిన్ని కెమెరాతో ఏవో రెండు మూడు మంచి ఫోటోలు తీసి ఫోటోగ్రాఫర్ అనేసుకునే నా లాంటి పిల్లలకు, ఫోటోగ్రఫీ విలువ తెలిపారు, హుస్సేన్ జీవిత ప్రయాణం ద్వారా. చాలా అద్భుతంగా రాశారు అండి.

  • పోరాడి గెలిచిన జీవితం అంటే ఇదే. కళ్ళు చెమర్చాయి ముందు బాధతో తర్వాత పట్టుదలగా జీవితాన్ని గెలిచిన తీరుకు ఆనందంతో. Thank you for the article.

  • గొప్ప స్ఫూర్తి నిస్తున్న హుస్సేన్ గారి సమరశీల జీవితాన్ని పరిచయం చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు