ఆరామలక్ష్మి 

ది 1975 అనుకుంటా.

విజయవాడ ఫిలిం చేంబర్ హాలు పెళ్లి మండపంలా కళ కళ లాడింది కిటకిట లాడింది. అది రచయిత్రుల కాలం .వాళ్ళని ప్రత్యక్ష్యంగా చూడ్డం ఒక థ్రిల్..సీట్లు చాలలేదు . అయినా నిలబడి తమ అభిమాన రచయిత్రులని చూసి విని ఆనందంతో తడిసి ముద్దయిపోయారు ప్రేక్షకులు. ఆ సభా నిర్వాహక బృందంలో భవదీయురాలు వుంది. సెలబ్రిటీ లను మండపంలోనూ, విడిదిలోనూ దింపడం వగైరా పనులకి అన్నమాట.ఆ సభకు రంగనాయకమ్మ గారు, మాలతీ చందూర్ గారు రాలేదు అదొక అసంతృప్తి. అప్పటికి కొంచెం వ్రాస్తూ వున్నాను. తారల మధ్య ఒక పిచ్చుక లాగా లేదా ఒక పిల్లకాకి.. అప్పుడు రామ లక్ష్మి గారిని దగ్గరగా చూసాను.అంతకు ముందు ఆవిడ అహంకారంగురించి ఒకాయన వ్రాయగా విన్నాను.కొంచెం  భయం భయంగా పరిచయం చేసుకున్నాను. ఆవిడ “విన్నా నీ గురించి “ అంది నవ్వుతూనే .

అమ్మయ్య !  రామలక్ష్మి గారిని చూసాను మొదటిసారి .

“స్వతంత్ర”లో ఆవిడ పార్వతి కృష్ణమూర్తి కథలు చదివి ఇష్టపడి ,ఆవిడ ప్రశ్నలు జవాబులు చదివి  కూడా వున్నాను .కొందరు రచయిత్రులు బాగా నచ్చేవాళ్ళు.కొందరివి కాలక్షేపానికి చదివేదాన్ని .ఏమైనా  రచయితలను దూరంనుంచైనా చూద్దాం ఒక హర్షాతిరేకం (ఇప్పటికీ అదే ఉత్సాహం అనుకొండి) వుండే ఉత్సాహంతో ఆరుద్ర గారు బస చేసిన హోటెల్ కు వెళ్లాను ఇంకో సారి. ఆయన  ఏదో పని మీద నాకు ఫోన్ చేయిస్తే . ఆయనకు పరిచయం చేసుకున్నాను  .ఆయనతో ఏదో ఉత్సాహంగా మాట్లాడ బోతూ వుంటే ఆవిడ ఆయన భుజం మీద చెయ్యివేసి ముందుకు తోస్తూ “పద పద టైం అయింది “ అని దాదాపు నెట్టుకుంటూ పోయారు .అప్పటికి నాకింకా భార్యాభర్తల మధ్య ఆ చనువు కొత్త. చాలా ముచ్చటేసింది .ఇదికదా సహచర్యం అనిపించింది . తరువాత రెండు మూడు సార్లు కలిశాము.

తన పెద్దరికం ( వయసూ సీనియారిటీ గుర్తుంచుకునే నన్నొక పిల్ల కింద చూసేదావిడ.ఆవిడ తో  మాట్లాడ్డం బాగుంటుంది.మంచి హాస్యం .”అది కాదోయ్ “ అంటూ  చాలా చెప్పేవారావిడ. నేను నా మంత్ర నగరి పుస్తకం వచ్చినప్పుడు ఆవిడకి పంపాను. వారంరోజుల్లో నాకు జవాబు వ్రాసారు. కొంచెం మెచ్చుకుంటూనే. అదే మరొక నా అభిమాన రచయిత్రికి పంపితే వాళ్ళాయన “మీరు తనకి పంపిన బుక్ అందింది థాంక్స్” అని ఒక నెల తరువాత ఒక పోస్ట్ కార్డ్ వ్రాసారు. ఇదంతా మామూలే.

కానీ భూమికలో నేను “స్వాతంత్ర్యానంతర తొలి తెలుగు రచయిత్రులు” శీర్షికన కొంతమంది రచయిత్రుల గురించి వ్రాసేటప్పుడు  రామలక్ష్మి గారితో  ఎక్కువ ఫోన్లు నడిచేవి అవి ఆవిడ గురించిన సమాచారంకన్న ఎక్కువ సాదా సీదా  కబుర్ల క్రింద వుండేవి. నవ్వులు చెణుకులు వుండేవి. ఎవరినైనా యిట్టే విమర్శించేది ఆవిడ. ఒక్కర్తీ వుండేది, అలా ఉండాల్సి  వచ్చిందనే  విచారం లేదు.

అలా దాదాపు స్నేహితులం అయిపోయాం. తరువాత ఎన్నిసార్లు హైదరాబాద్ వచ్చినా ఆమెను కలవలేక పోయాను.ఆవిడ కథల గురించి నవలల గురించి ఇక్కడ ప్రస్తావించను. ఎన్ని సార్లు మాట్లాడినా తన ఆరోగ్య సమస్యలని గురించి గానీ ఎవరిమీదా కంప్లైంట్లు గానీ చెప్పకుండా నవ్వుతూ మాట్లాడే జీవనోత్సాహం ఆవిడది. అయితే ఈ మధ్యన వచ్చిన ఇంటర్వ్యూలు నాకు నచ్చలేదని ఆవిడతోనే ఆవిడలాగానే ముక్కుసూటిగా చెప్పేసాను. అప్పుడూ “సరే నీకు నచ్చక పొతే నాకేంపని” అనేసింది ఆవిడ.ఆ తరంలో బాగా చదువుకుని ఇంగ్లీష్ జర్నలిజంలో వుండి స్వతంత్రమైన నిర్ణయాలు తీసుకుని నెగ్గుకొచ్చిన వ్యక్తి.పార్వతి కృష్ణమూర్తి కథలు ఇప్పటికీ ఇష్టమే నాకు. ఎవరైనా ఈ కథలన్నీ ఒక చోట చేర్చి ప్రచురిస్తే స్త్రీల సాహిత్యంపై ఆసక్తి కలవారికి పరిశోధకులకు ఉపయోగం.

సీ యూ లేటర్  ఆరామలక్ష్మి.

*

కె. రామలక్ష్మి కథలు ఇక్కడ చదవండి:

అద్దం రామలక్ష్మి కథ అద్దం

రామలక్ష్మి కథ అదెక్కడ

పి .సత్యవతి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఆ మహా రచయిత్రి ని వారింట్లో హైదరాబాద్ లో లేఖిని సభ్యులను వారింటికి ఆహ్వానించగా కలవడం జరిగింది. ఆవిడ రచనలు చదువుతూ పెరిగాను ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు.మాతో ఆవిడ అనుభవాలు పంచుకున్నారు అలాగే మాలతీ చందూర్ గారి ని ఢిల్లీ లో మిమ్మల్ని మీ ఇంట్లో కలవడం నా అదృష్టం. చిన్నప్పట్నించీ.అందరి రచనలూ చదివి ఆరాధన పెంచుకుని రచయిత్రి గా ఎదిగాను.రామలక్ష్మి గారు తను అనుకున్నది స్పష్టంగా చెప్పేవారు

  • రామలక్ష్మి గారు ప్రశ్నావళిలో కూడా ముక్కు సూటిగా సమాధానం ఇచ్చేవారు. ఎటువంటి దొంగతిరుగుడులు ఉండేవి కాదు. నాకు 80 లో అనుభవం. మీ ఆ రామలక్ష్మి ద్వారా మరొకసారి గుర్తు చేసుకున్నాను.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు