అప్పుల ఊబిలో  అల్లాడుతున్న జీవితాల వ్యథ

మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చేసే దురాగతాల పైనా, బలవంతంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి మరీ అప్పులు వసూలు చేసే విధానం పైనా విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది.

సాహిత్య పరిశోధకులుగా, కవిగా, కథకులుగా, సంపాదకులుగా,విమర్శకులుగా…ఇలా బహుముఖ కోణంలో సాహిత్య కృషి చేస్తున్న రచయిత వెల్దండి శ్రీధర్.  కథా రచయితగా ‘పుంజీతం‘ కథా సంపుటి, పరిశోధకుడిగా‘ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాహిత్యం – సమగ్ర పరిశీలన, విమర్శకుడిగా ‘తెలుగు కథ – ప్రాంతీయ అస్తిత్వం‘ వ్యాస సంకలనం వెలువరించారు. అధ్యాపకుడిగా పనిచేస్తూనే… నిరంతరం సాహితీ సేవలో నిమగ్నమతూనే ఉన్నారు. ఇక కథకుడిగా వెల్దంఢి…. తానెప్పుడు పేద ప్రజల పక్షపాతిని అని చాటుకుంటూనే ఉన్నారు. చేనేత కార్మికుల కడగండ్లు రాసినా, రైతుల కష్టాలు రాసినా…మహిళల కన్నీళ్లు అక్షరీకరించినా సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చారు. అటువంటి కథ వెనుక కథనే…. మర్చిపోలేని కథానుభవం శీర్షిక కోసం సారంగ పాఠకులతో పంచుకున్నారు.   

                                         ***

పేదరికం మీద యుద్ధం చేయడం అంత సులభం కాదు. ఆ యుద్ధం వల్ల కలిగిన గాయాలతో నడుస్తూ మనిషి ఏమైనా చేయడానికి సిద్ధపడుతాడు. బతకాలి.. బతకాలి అనే తపన ముందు ఎంతటి ప్రమాదకరమైన పని అయినా చేసి తీరుతాడు. అప్పులు చేసైనా సరే జీవితంలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తాడు. కొన్ని సార్లు జారి పడవచ్చు. మరి కొన్ని సార్లు చేసిన అప్పులు తీర్చలేక మానం అమ్ముకోవచ్చు. ప్రాణం  తీసుకోవచ్చు. పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావచ్చు. జీవన పోరాటం ఎన్నింటినో నేర్పిస్తుంది. వ్యవస్థ మనిషిని రాకాసి పక్షుల్లాగా, ఇనుపముక్కు కాకుల్లాగా పొడుచుకు తింటుంది. జలగలాగా పీల్చి పిప్పి చేస్తుంది. ఆఖరి రక్తపు బొట్టు దాకా తోడేస్తుంది. ఎన్నో ఇక్కట్లను కల్పించి మనిషిని చెరుకు మిషన్లో వేసి నలిపేస్తుంది.

2016లో అనుకుంటాను బైక్ పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఒక ముసలివాడిని  ఎస్సై బెదిరిస్తున్నాడు. ఒక్కోసారి కొట్టడానికి లేస్తున్నాడు. పళ్ళు కొరుకుతున్నాడు. నేను కొద్ది దూరంలో వెయిట్ చేస్తున్నాను. ఇంతలో ఒక మధ్య వయసు  స్త్రీ వచ్చినాకు కొద్ది దూరంలో నిల్చుంది. ఎస్సై ఆమె దగ్గరకు వచ్చి డబ్బులు వెంటనే కట్టాలి. లేదంటే పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడుతానని దుర్భాషలాడుతూ బెదిరించాడు. ఆమె ఏదో చెప్పబోయింది. కానీ ఆ ఎస్సై వినిపించుకునేలా లేడు. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే వెళ్ళిపోయింది. కాసేపటికి నా వైపు చూసి ఏమిటన్నట్లు  తలతోనే అడిగాడు. నేను రాసుకొచ్చిన కాగితాన్ని చేతిలో పెట్టి నిలబడ్డాను. సరే! మీరు వెళ్ళండి.  ఎంక్వైరీ చేస్తాము. దొరికితే మా వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. కోర్టుకు వచ్చి తీసుకువెళ్ళాలి అన్నాడు. సరేనని చెప్పి బయటకు వచ్చాను.

బయట ఇందాకటి మధ్య వయసు స్త్రీ ఏడుస్తూ గోడకు ఆనుకొని నిలబడి కనిపించింది. కొంగుతో కళ్ళు తుడుచుకుంటుంది. ఏమైందమ్మా? అన్నాను. కూతురి పెళ్ళికి లక్షా ఇరవై వేలు అప్పుగా తీసుకున్నానని, అప్పు కింద ఇప్పటికే మూడు లక్షలు కట్టానని, ఇంకా కావాలని ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఏడ్చింది. ఎక్కడి నుంచి తెచ్చి కట్టలో తెలీడం లేదని ఏడుస్తూనే వెళ్లి పోయింది.

ఈ సంఘటన నన్ను చాలా రోజులు వేదించింది. వెంటాడింది. దీన్ని కథగా రాయాలని అనుకున్నప్పుడు ఎలా? ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాలేదు. అన్ని డబ్బులు కట్టినా ఇంకా అప్పు ఎందుకు తీరలేదని కాస్త ఎంక్వైరీ చేశాను. అప్పుడు తెలిసింది అప్పు ఇచ్చేవాళ్ళు ‘కాబూలీ’ (Micro Finance) వడ్డీ తీసుకుంటారని. కాబూలీ వడ్డీ ఇచ్చేవారి కండిషన్లు చాలా విపరీతంగా ఉంటాయని, అప్పు ఇవ్వక పొతే వాళ్ళు చేసే పనులు దారుణంగా ఉంటాయని  అర్థం అయింది.  ఈ స్కెల్టన్ చుట్టూ అల్లిందే నేను రాసిన ‘పుండు’ కథ.

 ఇక్కడ  ‘పుండు’  కథ చదవండి.

        కథ ఆంద్రజ్యోతి నవ్య వీక్లీలో ప్రచురింపబడ్డప్పుడు చాలా ఫోన్లు వచ్చాయి. పరిస్థితి మీరు రాసినంత ఇదిగా ఏమీ లేదండి. అప్పు తీసుకున్నప్పుడు తిరిగి కట్టాలి కదండీ అని. ఈ సమస్యకు పరిష్కారం మీరు చూపించింది కాదేమోనని, ఆచరణ సాధ్యమైన మరో పరిష్కారం వెతకాలి. మా వంతు సహాయం తప్పక చేస్తామని. కాబూలి సాలెగూడులో చిక్కుకొని శల్యమైపోతున్న బతుకులెన్నో. రైతులు, మధ్య తరగతి జీవితాలు, చిరు వ్యాపారులు ఎన్నో సమస్యల్లో చిక్కుకొని నలిగిపోతున్నారు. సహాయం చేసే అదృశ్య హస్తం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని సహాయం చేసే నాథుడే కనిపించడు.

సంసారపు బండిని కొంత దూరం లాక్కుపోయిన ఆలుమగల్లో ‘కాని’ అక్కడ పడేసి భర్త మధ్యలోనే వెళ్ళిపోతే మిగిలి ఉన్న స్త్రీ జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో చూపించాలనుకున్నాను. బహుశా ఆ మధ్య వయసు స్త్రీ గనక నాకు కనిపించి ఉండక పొతే నేను ఈ కథ రాసేవాడ్ని కాదేమో! ఎప్పుడైనా రైతు ఆత్మహత్య అని, లేదా ఒక స్త్రీ అప్పుల బాధ భరించలేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడిందని పేపర్లోనో, టీవీలోనో చూసినప్పుడు నాకు ఈ కథలోని నీలవేణి పాత్రే గుర్తుకు వస్తుంది. ఆమె చుట్టూ ఎంత చీకటి పర్చుకున్నా తన పిల్లల జీవితాల్లో వెలుతురు నింపడానికి ఆమె తన శక్తి మేరా ప్రయత్నిస్తుంది. నీలవేణి మా ఊరు చివరి వాడకు చెందిన అమ్మాయి అని చెప్పడంలో ఆమె ఒక దళిత యువతి అని పాఠకుడు సులభంగానే గ్రహిస్తాడు. దళిత, బహుజన కులాల వారే ఈ మైక్రో ఫైనాన్స్ కు ఎక్కువగా బలవుతున్నారు. మైక్రో ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇలాంటి బలహీనులను ఎన్నుకొని అప్పులు ఇస్తారు. ఏదో ప్రాణం మీదికి వచ్చినపుడు విధిలేని పరిస్థితుల్లో అప్పులు తీసుకుంటారు. నూటికి పది రూపాయల వడ్డీ దాకా వసూలు చేయడం వలన చేసిన అప్పు అసలే తీరదు. అలా అప్పుల ఊబిలో కూరుకుపోతారు.

కథను సినిమాకు పనికి వచ్చే దృశ్యాలు దృశ్యాలుగా రాయడం మనకు అలవాటైంది కాని జీవితం అలా ఉండదు కదా! వాస్తవ జీవితం ఎంత తడిగా ఉంటుందో, ఎంత కటువుగా ఉంటుందో ఈ కథలో చెప్పడానికి ప్రయత్నించాను. కథంథా రాసిన తరువాత ప్రముఖ విమర్శకులు డా. ఎ. కె. ప్రభాకర్, ప్రముఖ కథకులు పెద్దింటి అశోక్ కుమార్ గారికి ఒకసారి చూడమని పంపించాను. వారు చదివి కొన్ని విలువైన సూచనలు చేశారు. వారు చెప్పిన సూచనల ప్రకారం మార్పులు చేసి కథకు తుది రూపం ఇచ్చాను. వాళ్ళ సహృదయతకు ధన్యవాదాలు.

మైక్రో ఫైనాన్స్ వాళ్ళు చేసే దురాగతాల పైనా, బలవంతంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పి మరీ అప్పులు వసూలు చేసే విధానం పైనా విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది. ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలు, యువకులు, రైతులు ఎక్కువగా ఈ మైక్రో ఫైనాన్స్ అఘాయిత్యాలకు గురవుతున్నారు.

సాదరణంగా వాడే ఫ్లాస్ బ్యాక్ టెక్నిక్ నే ఈ కథకు వాడాను. మరో శిల్పంలో చెప్పవచ్చేమో! కాని ఈ శిల్పమే దీనికి బాగా సరిపోయిందనిపించింది. నా తొలి కథల పుస్తకం ‘పుంజీతం’ లో ఈ కథను చేర్చాను. ఈ కథను సమీక్షించిన చాలా మంది విమర్శకులు వాస్తవ పరిస్థితికి అద్దం పట్టిందని వ్యాఖ్యానించారు. ఈ కథను చదివి స్పందించిన, ఇప్పటికీ స్పందిస్తున్న అశేష కథా ప్రేమికులకు నా హృదయ పూర్వక వందనాలు.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • షేక్స్ పియర్ “ది మార్చంట్ ఆఫ్ వేనిస్” నవల మొదలు… అప్పుల ఊబిలో ఇరుక్కున్న జీవితాల నేపథ్యంతో అనేక కథలు వచ్చాయి. ఆదరణ పొందాయి. మారిన కాలమాన పరిస్థితుల దృష్ట్యా అధిక వడ్డీ మోసాలు ఏదో రూపంలో అంతటా కొనసాగుతూనే ఉన్నాయి.
    అమాయకత్వంతోనో, ఆపదలోనో అధిక వడ్డీలులాగే కథలోలాంటి కాబూలీ అప్పుల పాలైన జీవితాలకు రాజ్యం భరోసా అవసరం.
    అట్టడుగు రక్షణలేని జీవితాలకు నీలవేణి పాత్ర ప్రతీక. ఆర్ధిక స్వావలంబన, సామాజిక గౌరవం, భరోసా ఉండని ఇలాంటి జీవితాల పట్ల నాగరిక సమాజం చూసే చిన్న చూపును రచయిత ఒడిసి పట్టి కథలో చూపాడు. ఈ పాత్రకు ప్రేరణ నిజ జీవితంలో ఎదురు కావడం, కథ రూపంలోకి వచ్చే వరకు రచయితను, వచ్చాక పాఠకుల హృదయాలను మెలిపెట్టడం గమనార్హం.

    నీలవేణి కుటుంబానికి అప్పు అనే గాయం, తరువాత ‘పుండు’గా మారినా, రక్తం తాగే జలగకు ఆకలి తప్ప సానుభూతి ఉండదు. అధిక వడ్డీనాశించే వడ్డీ వ్యాపారులకు లాభాపేక్ష తప్ప మానవత్వం ఉండదు. ఈ విషయాన్ని “పుండు” కథలో చక్కగా చెప్పారు.

    కథ, నవల అనేవి కేవలం సృజనాత్మక ప్రక్రియలు. ఇవి వాస్తవానికి దగ్గరగా ఉండి పాఠకునికి ఆసక్తిగా, ఆలోచింపజేసేదిగా ఉండే ప్రక్రియలు. కథ జీవితమనే తానులో కత్తిరించిన ముక్క. జీవితం మొత్తం కథగా మార్చలేం. కథలో ఇమడ్చడం కష్టం. కథ వాస్తవిక జీవితానికి నకలు లేదా కొన్నిసార్లు సృజనాత్మకతకు, ఊహాత్మక సంఘటనల సంభావ్యతకు, చిరునామాగా ఉండొచ్చు. అంతకు మించి ఉండొచ్చు. కథల్లో వాస్తవికత అనేది పాఠకుడిని దగ్గరకు చేరుస్తున్నదన్న విషయం నిర్వీవాదం. తక్కువ కథల్లో ఈ లక్షణం ఉంటుంది. ఏ కథలోనైనా కొంతైనా అవాస్తవికత ఉంటుంది. అలా లేకపోతే అది జీవిత చరిత్రనో లేక ఆత్మకథనో అవుతుంది తప్ప కథ కాదు కదా.

    ఏరకమైన సాహిత్య ప్రక్రియ అయినా మనిషిని ఆలోచింపజేసేదిగా మాత్రమే ఉంటుంది. పరిష్కారం చూపే మందు బిళ్ళ కాదు.

    మంచి కథ. పది కాలాలపాటు చర్చించుకునే కథను అందించినందుకు రచయిత డా. వెల్డండి శ్రీధర్ గారికి, సారంగ నిర్వాహకులకు శుభాకాంక్షలు.

  • పుండు కథ చాలా బాగా రాసారు సర్ 👏
    మీ కలం ఎప్పుడూ
    కష్టజీవుల గళమై గర్జిస్తుంది ✍️🌹

  • శ్రీధర్ గారికి…విమర్శ ఎదురైనప్పుదు కోపం వస్తుంది. విమర్శించే వారిపై ఆగ్రహం తన్నుకువస్తుంది. కానీ మీరు విమర్శకులు కాబట్టి అర్థం చేసుకుంటారని ఈ విమర్శ చేస్తున్నాను. మంచి ఇతివృత్తం. కథ శీర్శిక ‘పుండు’… పేలిన అగ్నిపర్వతంలా ఉంది. కానీ కథనం జీవం లేకుండా సాదాశీదాగా సాగింది. హృద్యంగా సాగి ఉంటే ఇంకా మంచి కథ అయి వుండేదని నా అభిప్రాయం.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు