ఉడుమలపేటలోని సాయిరాం వెలినెలవు(లే అవుట్)లో ఉండినప్పటి కత ఇది. కతంటే నిక్కంగానే కత అనుకొనేరు. కతలను రాసే ఓపిక లేనివాడిని. ఇదొక చిన్న తలపుమాట, నేను గురుతుంచుకోవలసిన తీపిముచ్చట.
అప్పుడు నేను ఉండినది రెండుగదుల రేకులిల్లు. ఇంటికీ ఇంటిముందు చుట్టుగోడకీ నడుమ, ఇరవై అడుగుల చోటు ఉండేది. అచ్చోటులో పచ్చటి మొక్కలను పెంచుకొంటూ ఉండేవాడిని. ఆ ఎర్రనేలన నిలువెత్తున ఎదిగి నిలిచినాయి కొన్ని గోంగూర మొక్కలు.
ఇప్పటి తమిళనాడులోని అన్ని తావుల వారికీ గోంగూర గురించి తెలియదు. తొండనాడులో గోంగూరాకు అంటారు, బాగా తింటారు కూడా. నేను తొండనాటి వాడినే కదా. తొండనాడుకు దిగువన, తమిళనాడు నట్టనడుమన ఉండే చోళనాటి తెలుగువారు పులుసుకూరాకు అంటారు, తక్కువగా తింటారు. మొరసునాడులో చిన్నముక్క అయిన హోసూరు తావున పుండ్రికాకు అంటారు, ఒడ్డెరవారు మట్టుకే తింటారక్కడ. కొంగునాడు తెలుగుపేరు పులిమంచి కూరాకు, నాటుమందుగా తప్ప కూరగా ఎవరూ నోట పెట్టరక్కడ. పాండెనాడులో దానికి పేరూ లేదు, వాడుకా ఉండదు.
ఉడుమలపేట కొంగునాడులోనిది. కొందామన్నా తిందామన్నా గోంగూర దొరకని నేల అది. నాకేమో నాలుగునాళ్లకు ఒకసారన్నా పుల్లటి గోంగూర చవి నాలుకకు తగలవలసిందే. అందుకని నేనే పెంచుకొన్నాను ఆ నాలుగు వరసల గోంగూరను. వేళ్లతోపాటు పెరికేయకుండా, ఆకులను మట్టుకే గిల్లుకొంటూ పచ్చడో పప్పో పుల్లగూరో పొడో చేసుకొంటూ ఉండేవాడిని.
ఆపొద్దూ అట్లే, వంటింటిలో గంటెను కదిలిస్తూ ఉండాను. బయట తెరువునుండి “సీమారమ్మా సీమారూ…” అనే అరుపు వినబడింది. ఆతావులో అట్లంటారు, ఈచోటులో ఇట్టంటారు అని మిమ్మల్ని విసిగించడం బాగుండదు. చీంపిరి, చీంకలి, చీమారు, చీటికట్ట, ఈనకట్ట, తుడుపుకట్ట, పొరక, పరక… ఇవీ ఇప్పటి తమిళనాట చీపురుకు వాడే తెలుగు తావుమాటలు. చీమారు అనేది కొంగుమాట. దిగువకొంగు తావున 65నూర్పాలు(శాతం) తెలుగులూ, 25నూర్పాలు తమిళులూ ఉంటారు కాబట్టి, అక్కడి తమిళంలో బోలెడు తెలుగు మాటలు కలసిపోయి ఉంటాయి. అటువంటి వాటిలో చీమారు కూడా ఒకటి.
“అమ్మా సీమారు వేణుమా(కావాలా)…సీమారు” అంటూ ఇద్దరు ఆడవాళ్లు తలవాకిలి తడక(గేట్) దగ్గర నిలబడి గట్టిగా అరుస్తుండారు.
వాళ్లు నాకు కనబడుతుండారు కానీ, నేను వాళ్లకు కనబడడం లేదు. ఏపుగా ఎదిగుండే గోగులను చూస్తూ గుసగుసలాడుకొంటుండారు. నడుమ నడుమ “సీమారమ్మా సీమారు” అని అరుస్తుండారు.
“ఈడ అమ్మ ఓరూ(ఎవరూ) లేరు. అయ్యను మట్టుమే ఉండాను. సీమారు వొద్దు” అని కొంగు తెలుగులో నుడువుతూ వెలుపలకు పోయినాను.
“తెలుగోళ్లా నా నువ్వా” అనడిగింది ఒకామె. అరె ఈమె ఎగువ తొండనాడు తెలుగును పలకతా ఉందే అనుకొన్నాను. ఎగువ తొండనాటి వేలూరు, తిరువళ్ళూరు వాళ్లు మట్టుకే తెలుగు అంటారు, మిగతా తమిళనాడంతా తెలుంగు అంటారు.
“ఏవూరుమా మీదా” తొండనాడు తీరులో అడిగినాను.
“పొళ్ళాచ్చి నా” మారాడింది.
“మోవ్ ఇప్పుడుండే ఊరు గాదు, మీ సొంతూరేదో చెప్పండి. మాపక్క మాటలు మాట్లాడతుండారని అడగతుండా. మా సొంతూరు తిరప్తి లే” అన్నాను.
అంతే, వాళ్ల జంకూగొంకూ ఎట్ల పోయిందో, తెంపుగా తడకను తోసుకొని లోపలకు వచ్చినారు. తిన్నెమీద నీడలో మేనులను ఆనించినారు. దప్పిగొని ఉండామంటూ చెంబుడు నీళ్లను ఇప్పించుకొని తాగినారు. సుంతసేపు ఓపు(విశ్రాంతి) తీసుకొని అప్పుడు నోరు విప్పినారు.
“అనా మాది కాళాస్తిరి నా, ఎరికలోళ్లం నా, పొరక్కట్టలు అమ్ముకోని బతకదామని నాలుగిళ్లోళ్లం వొచ్చి పొళ్లాచ్చి కాడ గుడారాలు యేసుకోనుండాం. అనా నా కోడాలు నీళ్లు పోసుకోనుండాది. నీకు తెలవంది ఏముండాది. ఈడేడా గోగాకు దొరకదు గదా. అంత గోగాకు పెట్నావంటే, ఆయమ్మికి పుల్లంగా అంత పులగూర ఎణిపి పెడతాం” అన్నారు నవనవలాడుతున్న గోంగూరని ఆబగా చూస్తా.
నేను ఇంట్లోకి పోయి, రెండు మైనంతిత్తులను(పాలితిన్ కవర్లు) తెచ్చి ఇచ్చి, “ఆకుల్నే గిల్లుకోండి, ఉండేదంతా గిల్లుకోండి, నాలుగునాళ్లకు ఇగిరిస్తాదిలే మళ్లా” అన్నాను.
నమ్మలేనట్లుగా నావైపు చూసినారు. నా మొగంలోని నగవును చూసి, పొంగుతూ లేచి గోంగూర పొదలో దూరినారు. నాతోట గోంగూరతో, నేనిచ్చిన తిత్తులే కాక వాళ్ల ఒడులు కూడా నిండిపొయినాయి. నిక్కం చెప్పాలంటే ఆ తల్లుల ఒడులు నిండింది ఆకులతో కాదు, ఎలమి(సంతోషం)తో. వాళ్లటు తలవాకిలిని దాటంగనే, నేనిటు ఇలులోపలకు వచ్చేసినాను.
ఓ పావుగంట అయుంటుంది. “అనా ఓ అనా” అంటూ బయటి నుండి మరలా అవే ఎలుగులు. వెలుపలకు పోయినాను. వాళ్లిద్దరే.
“అనా ఇంత గోగాకు ఇస్తివే, ఈ రెండు పొరక్కట్టలన్నా పెట్టుకో నా” అని, నేను వద్దంటున్నా వినకుండా రెండు చీపుర్లను నా ముందుంచి, గిరుక్కున తిరుక్కొని వెళ్లిపోయినారు.
ఈ దానవీరశూర కర్ణుడు సిగ్గుతో తల వంచుకొన్నాడు. ఎందుకంటే, గోంగూర పెంపకం వీడి బతుకు కాదు, చీపుర్ల అమ్మకం వాళ్ల బతుకు.
*
నయనాలు,చెవులు చవులూరే కత ఇది.. జేజేలు.
చివరి మూడు వాక్యాలూ.. పుల్ల గోంగూర ఘట్టం ఫుల్లు వైన్ తాగినంత కిక్కు ఇచ్చేలా చేశాయి.
బలే బాగా రాశారు మేము కూడా హోసూరు పక్క చందాపురం లో వుంటాము ఈ గోంగూర కరువు మాకు వుండేది 10 ఏళ్ల క్రితం ఇప్పుడు బాగా పెరిగిన తెలుగు జనాల వల్ల విరివిగా దొరుకుతోంది , నేను మీ ప్రళయకావేరి కథలు చదివా నాకు చాలా నచ్చింది sir.
మీ అభిమాని
రాజేశ్వరి
భలే ఉంది సార్ గోగాకు కథ