గత భాగంలో సంభాషణలు ఎలా ఉండాలి అనే చర్చ మొదలుపెట్టి కొంత భాగం మాట్లాడుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈ వ్యాసం చదవండి. ముందుగా, క్రింద ఇచ్చిన కథని పరిశీలనగా చదవండి. అందులో మీకేమైనా లోపాలు కనిపిస్తే నోట్స్ రాసిపెట్టుకోండి. ఆ తరువాత నా విశ్లేషణ చదవండి.
>> క్షణభంగురం
హాస్పిటల్ కెఫెటేరియాలోకి వస్తూనే కిరణ్ చుట్టూ చూసి, చెయ్యి ఎత్తిన సమీర్ వైపు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. రెండు మూడు క్షణాలు ఇద్దరూ మాట్లాడుకోలేదు.
“మనుషులు ఇలా ఉన్నట్టుండి రోగాన పడినప్పుడు జీవితం తల్లకిందులైపోయినట్లు ఉంటుందిరా,” కిరణ్ ఆలోచిస్తూ అన్నాడు.
“అవును, ఆసుపత్రులు, స్మశానాలు మన చేత మరణం గురించి, మన బలహీనతల గురించి లోతుగా ఆలోచించేలా చేస్తాయి,” సమీర్ ప్రశాంతంగా బదులిచ్చాడు.
“నాన్న సర్జరీ వల్ల నాకు ఒక విషయం అర్థమైంది.. మనం ఏదో సాధించాలని పరిగెత్తడం ఒక వృధా ప్రయాస. విజయం, ఆశయాలు ఇవన్నీ ఎంత తాత్కాలికమో కదా!” కిరణ్ భావోద్వేగంతో అన్నాడు. “ఇన్నేళ్లు నేను కెరీర్‌లో పైకి రావాలని, ఉద్యోగంలో ఎదగాలని, ఫైనాన్షియల్‌గా స్థిరపడాలని, సమాజంలో గుర్తింపు పొందాలని ఏవేవో కోరుకున్నాను. వాటిపైనే శ్రద్ధ పెట్టాను. కానీ ఇప్పుడు తెలుస్తోంది బంధాలు, ఆత్మీయతలే వీటన్నింటికంటే ఎంతో విలువైనవని.”
“నిజమే. చాలా తాత్వికంగా ఆలోచిస్తున్నావు నువ్వు. పోయిన సంవత్సరం మా అమ్మగారు ఇలాగే స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో చేరినప్పుడు, నా జీవిత దృక్పథంలోనూ, నా కుటుంబ బాధ్యతల విషయంలోనూ ఇలాంటి మార్పే కలిగింది.” సానుభూతిగా అన్నాడు సమీర్.
“ఆధునిక సమాజం మనుషులను సంతృప్తి అనే చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసేలా తయారు చేస్తోందని నా అభిప్రాయం. సంతోషానికి అసలైన పునాది మానవ బంధాలేనని గ్రహించకుండా.. ఏదో సాధించాలనే తపనతో మనుషులు తమ జీవితాలను గడిపేస్తున్నారు.” కిరణ్ గంభీరంగా వ్యాఖ్యానించాడు.
“అవును, మన నగర జీవనశైలిలో ఒకరినొకరు పట్టించుకోకపోవడం అనేది లేకుండా పోయింది. ఎంతసేపూ టెక్నాలజీ వెనుక పరుగు, మితంలేని ఆశయాల వైపు పరుగు. ఈ పరుగుల్లో మనం మనుషుల మధ్య మానసిక దూరాన్ని పెంచుకున్నాము.”
“కరెక్ట్‌గా చెప్పావు. మనుషులు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోలేనంతగా విడిపోతున్నారు.”
కొన్ని క్షణాల పాటు వాళ్లిద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
“జీవితం ఎంత త్వరగా ముగిసిపోతోందో చూస్తుంటే నీకు భయంగా అనిపించడం లేదా?” సమీర్ మెల్లగా అడిగాడు.
“అనిపిస్తోంది. అసలు మన జీవితమే ఇంత బలహీనమైనదా అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. మనం ఊహించని ఒకే ఒక్క ఫోన్ కాల్ అప్పటిదాకా నడుస్తున్న జీవితాన్ని శాశ్వతంగా తల్లకిందులుగా మార్చేయగలదు.” కిరణ్ మృదువుగా సమాధానమిచ్చాడు.
“బహుశా ఇలాంటి బాధలు, కష్టాలే మనుషులకు ప్రేమ, కుటుంబం, ఆత్మీయుల తోడు లాంటి వాటి విలువను నేర్పుతాయేమో.” సమీర్ అన్నాడు.
“నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. సాధారణ జీవితంలో మనుషులు ఏ వాస్తవాలని ఎదుర్కోవడానికి భయపడి పారిపోతారో, అవి ఖచ్చితంగా వచ్చి ఎదురుగా నిలబడతాయి.”
బయట అంబులెన్స్ సైరన్ల శబ్దాలు మెల్లగా వినపడుతోంది. లోపల ఆ ఇద్దరు వ్యక్తులు మరణం, ఒంటరితనం, ఆధునిక సమాజంలో అనిశ్చిత జీవిత నైజం గురించి చాలాసేపు చర్చించుకుంటూనే ఉన్నారు. <<
పై కథ చదవగానే అంతా బాగానే ఉంది కదా? దీంట్లో తప్పులు వెతకమంటాడేమిటి ఈయన? అని అనిపిస్తే అనిపించి ఉండచ్చు. “సన్నివేశం చాలా చక్కగా నడిచింది. ఆ రెండు పాత్రల మధ్య సంభాషణ ఎక్కడా ఆగకుండా సాగింది. వ్యాకరణం బాగుంది. వాళ్లిద్దరు చర్చించిన అంశాలు — మరణం, బలహీనతలు, ఒంటరితనం, కుటుంబం — ఎంతో అర్ధవంతమైనవి. అలా రచయిత పరిణతి కూడా కనిపిస్తోది” అని కొంతమంది రివ్యూలు కూడా రాసేయచ్చు. చాలామంది కొత్త రచయితలు “లోతైన విషయాలు” ఎంచుకుంటే ఆటోమేటిక్‌గా సంభాషణలు కూడా లోతుగా మారిపోతాయని అనుకుంటారు. చాలామంది విమర్శకులు కూడా అలాగే అనుకోవడానికి వాళ్లు కూడా స్వతహాగా రచయితలే కావడం ఒక కారణం కావచ్చు. అదలా పక్కన పెడదాం. ఇంతకీ ఈ కథలో ఉన్న లోపాలేమిటి?
నిశితంగా పరిశీలిస్తే, సంభాషణల రాసేటప్పుడు చాలామంది రచయితలు తరచుగా చేసే కొన్ని తప్పుల ఈ కథలో కూడా ఉన్నాయనీ, వాటి వల్ల ఈ సన్నివేశం పేలవంగా తయారైందని మీకే అర్థమౌతుంది. ఒక్కసారి మీకు ఆ ఆ తప్పులు కనపడితే పైపైన ఎంతో సాహితీ విలువలు, తాత్విక చింతన ఉన్న కథలా అనిపించిన ఇదే కథ లోపల ఉన్న డొల్లతనం కనిపిస్తుంది. రండి, ఆ లోపాలను ఒక్కొక్కటిగా పరిశీలించి, అవి కథను ఎలా బలహీనపరుస్తున్నాయో, అలా జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
- వాగుడు కాయల సిండ్రోమ్
ఈ మధ్య రాస్తున్న కుర్ర రచయితలు చాలా తరచుగా చేస్తున్న తప్పు ఇది. వీళ్లంతా నవలలు రాసేస్తున్నారు. అయితే సాహిత్యమో, మరో పుస్తకమో చదివి రాసినవి కావు. ఇవన్నీ సినిమాలు చూసి చూసి రాసిన నవలలు. అందువల్ల సంభాషణలే పేజీలని ఆక్రమించేస్తాయి. అక్కడ చుట్టూ ఉన్న ప్రపంచం కథనంలో అస్సలు పాలుపంచుకోదు. పై సన్నివేశంలో చూడండి. రెండు పాత్రలు నిరంతరాయంగా మాట్లాడుకుంటూనే ఉన్నాయి. వాళ్ల చుట్టూ ఉన్న పరిసరాలు మాత్రం ఎటువంటి చలనం లేకుండా, ఆ భావోద్వేగాలతో ఎలాంటి సంబంధం లేనట్లు ఉండిపోయాయి. వాళ్లు హాస్పిటల్ కెఫెటేరియాలో ఉన్నారని చెప్పారు, కానీ ఆ ప్రదేశం ఎక్కడా వాళ్ల సంభాషణతో మమేకం అవ్వదు. అక్కడ నర్సులు ఎవరూ కనపడరు, యాంటిసెప్టిక్ వాసన రాదు, స్టీల్ గ్లాసుల చప్పుడు ఉండదు, రోగులు ఎవరూ అటుగా వెళ్లరు, ఆ రెండు పాత్రల అలసటనుగానీ అసౌకర్యాన్నిగానీ మనకి అర్థమయ్యేలా చెప్పే శారీరక హావభావాలు (Body language) ఆ పాత్రలకి ఉండవు.
దీనివల్ల ఏం జరుగుతుంది? పాత్రలు నిజంగా ఒక భౌతికమైన స్థలం ఉన్నట్లు కాకుండా ఏదో గాలిలో తేలుతున్న గొంతుల్లా అనిపిస్తారు. సంభాషణ జరుగుతున్న స్థలానికి కథలో స్పష్టమైన ఆధారాలు అందకపోవడం వల్ల పాఠకులు ఆ సన్నివేశాన్ని ఊహించుకోవడం మానేస్తారు. చాలు కదా? కథకి జరగాల్సిన నష్టం జరిగినట్లేద్ కదా?
దీన్ని ఎలా సరిచెయ్యాలి? మనం నిజంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందో ఊహించుకోండి. మాట్లాడుతున్న వాళ్లలో ఏవో కదలికలు, మాటలకు అంతరాయాలు, సైగలు, పరిసరాల ప్రభవం – ఇవన్నీ ఉంటాయి కదా? తన తండ్రి సర్జరీ గురించి మాట్లాడే కొడుకు అనాలోచితంగా టేబుల్‌పై నీళ్లను వేళ్లతో తిప్పుతూ ఉండవచ్చు, పదే పదే కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉండవచ్చు, మోగుతున్న ఫోన్‌ను పక్కన పెట్టవచ్చు, స్ట్రెచర్ వెళ్తున్నప్పుడు ఒక్కసారిగా మాటలకు ఏదో అడ్డం పడ్డట్లు ఆగిపోతూ ఉండచ్చు. ఇలాంటి వివరాలే పాఠకులని కథలో లీనమయ్యేలా చేసి, సన్నివేశాన్ని వాస్తవికంగా మార్చి, భావోద్వేగానికి మూలమై నిలుస్తాయి. ఆ ఆధారం లేనప్పుడు, సంభాషణ అరూపంగా, ఒక నాటక ప్రదర్శనలా మారిపోతుంది.
ఎలా సరిచేసుకోవాలి? చెప్పానుగా – సన్నివేశం జరుగుతున్న పరిసరాలను ఆ సన్నివేశంలో భాగమయ్యేలా చేయడమే. సంభాషణ అనేది చర్యలు, కదలికలు, శబ్దాలు, వస్తువులు, అంతరాయాలు, ఇంద్రియానుభవాలతో కలిసి సాగాలి. పాత్రల చుట్టూ ఉన్న ప్రపంచమే వారి సంభాషణ యొక్క లయను నిర్ణయించాలి. పరిసరాలు శ్వాసించినప్పుడే, సంభాషణలు కూడా జీవం పోసుకుంటాయి.
- నా మాట నీ నోట
సంభాషణలలో చాలా తరచుగా కనిపించే తప్పు – అన్ని పాత్రలు ఒకేలా మాట్లాడటం. పై సన్నివేశం చూడండి – కిరణ్, సమీర్ ఇద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు. వాళ్లిద్దరి విద్యా నేపథ్యం, భావోద్వేగ స్థితి, పదజాలం, మాట్లాడే శైలిలో ఎటువంటి తేడా లేదు. ఉదాహరణకు ఈ వాక్యాలను గమనించండి:
>> “ఎంతసేపూ టెక్నాలజీ వెనుక పరుగు, మితంలేని ఆశయాల వైపు పరుగు. ఈ పరుగుల్లో మనం మనుషుల మధ్య మానసిక దూరాన్ని పెంచుకున్నాము.”
“కరెక్ట్‌గా చెప్పావు. మనుషులు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకోలేనంతగా విడిపోతున్నారు.”<<
ఎవరు ఏ వాక్యం చెప్పారో ఠక్కున చెప్పగలరా? చెప్పలేము. ఈ రెండు వాక్యాలను ఏ పాత్రైనా చెప్పుండచ్చు. ఎందుకంటే వాళ్లిద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు కాబట్టి.
ఏ మనిషికైనా మాట్లాడే తీరు వాళ్ల వ్యక్తిత్వం, పెరిగిన వాతావరణం, భావ వ్యక్తీకరణ విధానం, ప్రాపంచిక దృక్పథం మొదలైన ఎన్నో విషయాలపైన ఆధారపడి ఉంటుంది. ఏ ఇద్దరైనా ఒకే విధంగ మాట్లాడాలంటే పైన చెప్పిన ప్రభావాలన్నీ వాళ్లిద్దరి మీద సమానంగా ఉండి ఉండాలి. అదెలా సాధ్యం. కానీ కథలో సన్నివేశం అలాగే ఉంది. నిజం చెప్పాలంటే – ఇద్దరు భిన్నమైన వ్యక్తులు మాట్లాడుకుంటున్నట్లు కాకుండా, రచయిత ఒక్కడే ఇద్దరి నోళ్ల ద్వారా మాట్లాడుతున్నట్లు పాఠకులకి అనిపించే అవకాశం ఎక్కువగా ఉంది.
సంభాషణలు రచనకు చేసే అత్యంత ప్రమాదకరంమైన చేటు ఇదేనేమో. ఎందుకంటే పాత్రల ‘గొంతు’ (Voice) మాత్రమే వారిని పాఠకులకు గుర్తుండేలా చేస్తుంది. నిజ జీవితంలో మనుషులు వారి వయసు, వృత్తి, ఆత్మవిశ్వాసం, మానసిక స్థితి, విద్య మరియు సామాజిక వాతావరణాన్ని బట్టి విభిన్నంగా మాట్లాడుతారు. ఒకరు సూటిగా మాట్లాడితే, మరొకరు పరోక్షంగా చెప్తారు. ఒకరు తన బాధను దాచుకోవడానికి హాస్యాన్ని వాడితే, మరొకరు తాత్విక ధోరణిలోకి వెళ్ళిపోవచ్చు. ఒకరు ముక్కలు ముక్కలుగా మాట్లాడితే, ఇంకొకరు చక్కని వాక్యాలలో వ్యక్తపరచవచ్చు. ప్రతి పాత్ర ఒకే లయ, ఒకే స్వరంతో మాట్లాడినప్పుడు కథ సహజత్వాన్ని కోల్పోతుంది.
చూడటానికి చిన్నదిగా కనిపించినా దీని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. పాత్రలు స్వతంత్ర జీవులు అనే నమ్మకాన్ని పాఠకులు కోల్పోతారు. రచయిత తన తాత్విక ఆలోచనలను, సిద్ధాంతాలను చెప్పడం కోసమే ఈ సంభాషణను నడిపిస్తున్నాడనే విషయం వాళ్లకి అర్థమైపోతుంది. ఇది కథలోని సహజత్వాన్ని, భావోద్వేగంలో ఉండాల్సిన విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.
రచయితలు పాత్రలకు విభిన్నమైన శైలిని నిర్మించడం ద్వారా లోపాన్ని నివారించవచ్చు. పాత్ర గొంతు అనేది కేవలం కథలో ఒక శిల్ప విన్యాసమో, అలంకరణో కాదు— అది ఆయా పాత్రల వ్యక్తిత్వానికి శబ్ద రూపం. అలాంటి బలమైన పాత్ర గొంతులు కల్పించేందుకు ఈ క్రింది ప్రశ్నలు ఉపయోగపడతాయి:
ఈ పాత్ర ఏ పదాలను తరచుగా మాట్లాడుతుంది? ఏ పదాలు అసలు ఉపయోగించదు? ఈ పాత్ర సుదీర్ఘమైన వాక్యాలలో మాట్లాడుతుందా లేక చిన్న చిన్న ముక్కలుగా చెబుతుందా? తమ భావోద్వేగాలను దాచుకుంటుందా లేక బహిరంగంగా వ్యక్తపరుస్తుందా? మాటల్లో హాస్యాన్ని, వాడుక భాషను, మౌనాన్ని, అంతరాయాలను లేక ఉపమానాలను ఉపయోగిస్తుందా?
- చెక్కిన వాక్యాలు
పైన నేను ఇచ్చిన సన్నివేశంలో ఎవరూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచకపోయినప్పటికీ, సంభాషణ అంతా “టీవీ సీరియల్” సంభాషణలా సాగింది. (మీకూ అలాగే అనిపించిందా? లేదా?). టీవీ సీరియల్ సంభాషణ అంటే ఏమిటి? పైన ఇచ్చిన సన్నివేశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. రెండు పాత్రలు ఎదురెదురుగా కూర్చుని బాగా మెరుగుపెట్టిన, చక్కగా చెక్కిన, పూర్తి తాత్వికమైన భాషలోనే మాట్లాడుతున్నారు. దాదాపు ప్రతి వాక్యం ఆసుపత్రి కెఫెటేరియాలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేలా కాకుండా, ఏదో మోటివేషన్ సెమినార్‌లోనో, తాత్విక చింతన గురించి జరుగుతున్నఒక చర్చలో మాట్లాడుతున్నట్లు ఉన్నాయి.
కావాలంటే ఈ వాక్యం చూడండి –
>> “సాధారణ జీవితంలో మనుషులు ఏ వాస్తవాలని ఎదుర్కోవడానికి భయపడి పారిపోతారో, అవి ఖచ్చితంగా వచ్చి ఎదురుగా నిలబడతాయి.” <<
కథ ప్రకరాం ఒక పాత్ర తండ్రి అదే హాస్పిటల్‌లో చావుబతుకుల మధ్య ఉన్నాడు. అలాంటి ఒక తీవ్రమైన భావోద్వేగ ఒత్తిడిలో ఉండి, ఆత్మీయుడైన మిత్రుడు కలిస్తే ఆ పాత్ర మాట్లాడే విధానం ఇలాగే ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. బాధలో ఉన్న పాత్ర ఇలా ఒక వ్యాసంలో మంచి మంచి కొటేషన్లు చదివినట్లు మాట్లాడదు.
వాస్తవ ప్రపంచంలో ఇలాంటి సందర్భాలలో సంభాషణలు చాలా గందరగోళంగా ఉంటాయి. మాటలు తడబడతాయి, ఒక్కోసారి అలాంటి సందర్భంలో ఉన్న వ్యక్తులు తాము చెప్పింది తామే ఖండించుకుంటారు, వాక్యాలని పూర్తి చేయకుండా ఆపేస్తారు, తమ బలహీనతలను దాచుకోవడానికి ప్రయత్నిస్తారు, ఉన్నట్టుండి టాపిక్ మారుస్తారు, తమ భావాలను మాటల్లో చెప్పడానికి నానా అవస్థలు పడతారు. కానీ ఇక్కడ, ప్రతి వాక్యం ఎంతో పరిపూర్ణంగా, మేధోవంతంగా మెరుగుపెట్టిన వాక్యాల వరుసలా ఉంది.
ఈ శైలి వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే—సంభాషణ మనుషులు మాట్లాడుతున్నట్లు కాకుండా, ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నట్లు అనిపిస్తుంది. పాఠకులు పైపైన ఆ వాక్యాల అందాన్ని మెచ్చుకోవచ్చు కానీ, భావోద్వేగ పరంగా కథ నుంచి విడిపడిపోతారు. ఎందుకంటే ఆ సంభాషణలో సహజత్వం ఉండదు.
రచయితలు సహజమైన మాటల కంటే “వినడానికి గొప్పగా ఉండే వాక్యాల”కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఈ తప్పు జరుగుతుంది. చాలామంది రచయితలు ప్రతి వాక్యమూ లోతుగా ఉండాలని కోరుకుంటారు. కానీ నిజమైన భావోద్వేగ శక్తి మౌనంలో, అసంపూర్ణతలో, అంతర్లీనంగా ఉండే అర్థంలో (Subtext) ఉంటుంది తప్ప, చెక్కినట్లు ఉండే కొటేషన్ల లాంటి డైలాగుల్లో ఉండదు.
ఇది ఎలా వస్తుంది. మీ చుట్టుపక్కల నిరంతరం జరిగే సంభాషణలను వినండి. ఆ సంభషణలలో ఉండే విషయం, అర్థం లాంటి వాటి మీద ధ్యాసపెట్టకుండా, మాట్లాడుతున్న వ్యక్తుల పదాల ఎంపిక, వాక్య నిర్మాణం, వ్యక్తపరిచే తీరు మొదలైనవి గమనించండి. అలాంటి పరిశీలనలో పుట్టే సహజమైన సంభాషణల లక్షణాలు కొన్ని ఇస్తున్నాను. పరిశీలించండి – ఒకరి మాటను ఒకరు అడ్డుకోవడం, అసంపూర్ణమైన ఆలోచనలను చెప్పే ప్రయత్నం, మాటల్లో వచ్చే అసౌకర్యం/కంగారు, పరస్పర విరుద్ధమైన మాటలు, మౌనం, రోజువారీ వాడుక భాషా శైలి. వీటిని ఇలాగే కథలోకి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యండి. అందుకు పాత్రల భావోద్వేగ స్థితి, సన్నివేశంలో ఉన్న భావోద్వేగం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఆ రెండింటికి జమిలి కుదిరేలా సంభాషణాల రచన చెయ్యాలి. ప్రయత్నించండి.
- అంతర్లీనార్థం
మనం చర్చిస్తున్న సన్నివేశంలో అన్నింటికంటే పెద్ద లోపం — సబ్‌టెక్స్ట్ (అంతర్లీనార్థం) లేకపోవడం. పాత్రలు తాము ఏం అనుభవిస్తున్నారో, ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తున్నారు. ఆ మాటల వెనుక దాగి ఉన్న భావం ఏదీ లేదు.
ఉదాహరణకి ఈ వాక్యాలు చూడండి –
>> “అసలు మన జీవితమే ఇంత బలహీనమైనదా అని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను.
“బహుశా బాధలు, కష్టాలే మనుషులకు ప్రేమ, కుటుంబం, ఆత్మీయుల తోడు లాంటి వాటి విలువను నేర్పుతాయేమో.” సమీర్ అన్నాడు. <<
ఇలాంటి తాత్విక విషయాల గురించి మనుషులకి ఇంత స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అరుదు. ఒకవేళ ఉన్నా దాన్ని ఇంత స్పష్టంగా చెప్పగలగడం ఇంకా అరుదు. అలాంటి అవగాహన, వ్యక్త పరచగలిగే నేర్పు ఉన్న రెండు పాత్రలు ఒకే కథలో, ఒకే చోట కలిసి మాట్లాడుకోవటం ఇంకెంత అరుదో ఊహించండి. కేవలం రచయిత తన సౌలభ్యం కోసం అంత అరుదైన సంఘటనని తన కథలో జరుగుతున్నట్లు రాసారేమో అన్న అనుమానం పాఠకులకి రాకూడదు.
బలమైన సంభాషణలు ఎప్పుడూ పరోక్షంగా పనిచేయ్యాలి. మనం మన భావోద్వేగాలను, అభిప్రాయాలను, బలహీనతలను ఇంత బహిరంగంగా, ఇంత స్పష్టంగా చర్చించడం చాలా అరుదు. అలాంటివి చెప్పాల్సి వస్తే మాటలు ఆ విషయం చుట్టూ తిరుగుతూ ఉంటాయి తప్ప స్పష్టంగా బయతికి రావు. తండ్రిని కోల్పోతానేమో అనే భయంలో ఉన్న కొడుకు, ఆ భయం గురించి మాట్లాడకుండా ఆసుపత్రి బిల్లుల గురించి చర్చించవచ్చు. ఒంటరితనంతో బాధపడుతున్న వ్యక్తి, తన లోపలి శూన్యాన్ని ఒప్పుకోకుండా ట్రాఫిక్ గురించో లేదా టెక్నాలజీ గురించో కంప్లెయింట్ చేయవచ్చు. మనుషులు మాట్లాడేటప్పుడు నిజాలను దాచే ప్రయత్నం ఉండచ్చు, మాట మళ్లించే ప్రయత్నం ఉండచ్చు, పరోక్షంగా ఇంకే సూచించచ్చు, జోకులు వేయచ్చు, తప్పించుకోవడానికి మాట్లాడాచ్చు, తమకు తామే ఖండించుకుంటూ మాట్లాడటానికి ప్రయత్నిస్తుండచ్చు. ఇలాంటివన్నీ రచనలో ప్రతిబింబించేలా రాయాలి. మంచి సంభాషణ అంటే పైకి మాట్లాడే విషయం గురించి మాత్రమే కాదు. అసలైన సంభాషణ ఎప్పుడూ లోపల, నిశ్శబ్దంగా జరుగుతుంది. అదే సబ్‌టెక్స్ట్.
సబ్‌టెక్స్ట్ అనేది ఒక రకమైన ఉత్కంఠను సృష్టిస్తుంది. ఎందుకంటే పలికే మాటల వెనుక ఏదో ఉందనే విషయం పాఠకుడికి అర్థమవుతుంది. ఆ దాగి ఉన్న భావోద్వేగ పొరలే సంభాషణకు లోతును, నిగూఢతను ఇస్తాయి.
సబ్‌టెక్స్ట్ లేకపోతే సంభాషణలు చప్పగా మారతాయి. ఆ సన్నివేశంలో లేదా ఆ పాత్ర ఎదుర్కుంటున్న భావోద్వేగం పాఠకుల ఊహకి కాకుండా నేరుగా మెదడుకి అందుతాయి. దాంతో సన్నివేశాలు నాటకీయతని పోగొట్టుకుంటాయి. పాఠకులు కేవలం నిస్సహాయ (Passive) ప్రేక్షకులుగా మిగిలిపోతారు.
ఈ సమస్యని ఎలా అధిగమించాలి. సన్నివేశాన్ని, సంభాషణలను రాసేటప్పుడు ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం రాసిపెట్టుకోండి. దాన్ని కథలో వ్యక్తపరిచే ప్రయత్నం చెయ్యండి.
పాత్ర నేరుగా చెప్పడానికి ఇష్టపడని విషయం ఏంటి?
ఏ భావోద్వేగాన్ని దాస్తున్నారు?
ప్రస్తుతం చర్చిస్తున్న విషయం వెనుక ఎటువంటి అంతర్గత ఘర్షణ నడుస్తోంది?
ఆలోచిస్తే ఇలాంటి ఇంకా ఎన్నో మార్గాలు దొరుకుతాయి. మీరు ఆ పనిలో ఉండండి.
ఈ భాగం ఇక్కడితో ఆపుతున్నాను. సంభాషణల గురించి ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవి – వాగుడుకాయ సిండ్రోమ్ (రచన మొత్తం సంభాషణలతో నింపేయడం), నా మాట నీ నోట (అన్ని పాత్రలు ఒకేలా (రచయితలా) మాట్లాడటం), చెక్కిన వాక్యాలు (కృతకమైన సంభాషణలు రాయటం), సబ్‌టెక్స్ట్ లేకుండా రాయడం గురించి మాట్లాడుకున్నాం. మళ్లీ కలిస్నప్పుడు ఇదే కథని ఉదాహరణగా కొనసాగిస్తూ “డైలాగులకి అతికించే తోకల” గురించి మాట్లాడుకుందాం.
*








కథా రచనలో చాలా విలువైన సూచనలు ఇస్తున్నారు. ధన్యవాదాలు అరిపిరాల గారూ!