సన్నివేశాన్ని వడపోసే పరికరం

ఇక్కడ సమస్య ఏమిటంటే, పాఠకులు ముగింపులతో మమేకం కాలేరు—వారు అనుభవాలతోనే మమేకం అవుతారు.

>> అనిశ్చితి

తెల్లవారకముందే అర్జున్ హాస్పిటల్ చేరుకున్నాడు. ఆ ఊరిలో చాలా పేరున్న హాస్పిటల్ అది. లోపల కారిడార్‌లు పొడవుగా, చాలా శుభ్రంగా ఉన్నాయి. తెల్లటి గోడలు, అద్దాల కిటికీలు, గోడల వెంబడి వరుసగా అమర్చిన ఇనుప కుర్చీలతో ఆ ప్రాంతమంతా ఒక పద్ధతిలో సర్దినట్లుగా ఉంది. అక్కడక్కడా కొందరు నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. నర్సులు అటుఇటు హడావిడిగా తిరుగుతున్నారు.

అతను ICUకి దగ్గర్లో ఉన్న ఇనుప కుర్చీలలో కూర్చుని చుట్టూ పరికించి చూశాడు. అంతా చాలా క్రమబద్ధంగా, చూడగానే ఆ హాస్పిటల్ నిర్వహణ చాలా బాగుందని అనిపించేలా ఉన్నాయి. మెరుస్తున్న లైట్లు, శుభ్రం చేసిన నేల, గదుల అమరిక — ఇవన్నీ చూస్తుంటే పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్న నమ్మకం అతడినికి కలిగింది. ఆ ఆలోచన అతని తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి అతడిలో ఉన్న ఆందోళనని కొంత ఉపశమింపజేసింది.

ఉన్నట్టుండి అంతా ఎలా తారుమారు అయ్యిందో అర్జున్‌కి అర్థం కావట్లేదు. రెండు రోజుల క్రితం వరకు ఆయన ఆరోగ్యంగా తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఐసీయూలో కదలకుండా పడి ఉన్నాడు. జీవితం ఏ క్షణం ఎలా మారిపోతుందో అతనికి అర్థమైంది.

“ఆయన కోలుకునే అవకాశం ఉంది కానీ అది చాలా తక్కువ. చెప్పలేం, ఏమైనా జరగచ్చు” ముందు రోజు రాత్రి డాక్టర్లు చెప్పిన మాటలు అతని ఆలోచనలలో మెదిలాయి. అందువల్ల, మనసంతా ఆందోళనతో నిందిపోయింది. అయినా ఎక్కడే ఒక ఆశ కూడా మిణుకు మిణుకుమంటోంది. పరిస్థితులు మెరుగుపడతాయని అతను బలంగా నమ్ముతున్నాడు.

ఒక డాక్టర్ అతని పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లాడు. అర్జున్ అతనిని పట్టించుకోకుండా తన ఫోన్ తీసి చూశాడు. బంధువుల నుంచి తండ్రి ఆరోగ్యం గురించి అడుగుతూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. అందరూ ఎంత ఆందోళన చెందుతున్నారో అతనికి అర్థమైంది. ఇలాంటి సమయాల్లో కుటుంబం ఎంత ముఖ్యమో అతను గ్రహించాడు. కష్టకాలంలోనే బంధాల విలువ తెలుస్తుందని అనిపించింది. తనపై ఇంతమందికి ఉన్న ప్రేమాభిమానాలకు అతని మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోయింది.

కొంతసేపటి తర్వాత మీరా అక్కడికి చేరుకుంది. ఆమె అతని చెల్లెలు. ఆమె చాలా అలసిపోయినట్టు, ఆందోళనగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమె కళ్ళను చూస్తే ఎప్పటి నుంచో ఏడుస్తున్నట్లున్నాయి. ఇద్దరూ తమ తండ్రి ఆరోగ్యం గురించి క్లుప్తంగా మాట్లాడుకున్నారు. ఇద్దరిలోనూ భయం ఉన్నా, ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నించారు.

అర్జున్ ఐసీయూ తలుపు వైపు చూశాడు. లోపల ఏం జరుగుతుందో అని అనుకున్నాడు. లోపల డాక్టర్లు హడావిడిగా వైద్యం చేస్తున్నట్లు, రకరకాల మిషన్ల సహాయంతో చికిత్స చేస్తున్నట్లు అతను ఊహించుకున్నాడు. అంతా సవ్యంగా జరగాలని కోరుకున్నాడు. అర్జున్ అక్కడే కూర్చుని తన బాల్యం గురించి, తన తండ్రి చేసిన త్యాగాల గురించి, జీవితంలో ఉండే అనిశ్చితి గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు. మనసు నిండా భావోద్వేగాలు నిండినా, అతను నిబ్బరంగా ఉండటానికి ప్రయత్నించాడు.

***

ఒక సన్నివేశాన్ని పాఠకులకి చూపించే క్రమంలో నాటకరంగంలో వాడే మీజాన్‌సేన్ని ఎలా ఉపయోగించాలో చెప్తూ వస్తున్నాను. అందులో భాగంగా ఇప్పటి వరకు నేపథ్యాన్ని, అందులో ఉండే వస్తువులను వాడటం, పాత్రల కదలికలు, ముఖ కవళికలు, ప్రవర్తన చూపించడం, ఆ సన్నివేశంలో ఉండే శబ్దాన్ని, నిశ్శబ్దాన్ని వినిపించడం, ప్రతీకలు వాడటం, కథ నడిచే వేగాన్ని అవసరాన్ని బట్టి నియంత్రించడం లేదా పరుగెత్తించడం గురించి ఇప్పటిదాకా చెప్పాను. మరికొన్ని అంశాలు ఈ రోజు చూద్దాం.

పైన ఇచ్చిన కథా భాగాన్ని పరిశీలించారు కదా? ఈ కథలో ఎవరి దృష్టికోణంలో నడుస్తోందో మీరు సులభంగానే గురించి ఉంటారు. గతంలో ఒక వ్యాసంలో పాయింట్ ఆఫ్ వ్యూ (POV) గురించి కొంత చెప్పాను. ఇప్పుడు ఆ దృష్టికోణం అనే అంశంలోకి ఇంకొంచెం లోతుగా వెళ్లి చూద్దాం.

ఏదైనా ఒక సన్నివేశంలో, ఎవరి అనుభూతిని పాఠకుల అనుభవంలోకి తీసుకురావాలి అనేదే పాయింట్ ఆఫ్ వ్యూ (POV). కథ చెప్పేటప్పుడు ప్రధమ పురుష, ఉత్తమ పురుష లాంటి వ్యాకరణ సూత్రాల ఆధారంగా మాత్రమే POV ఎంపిక జరగకూడదు. పాఠకులు ఏం చూడాలి, ఏం వినాలి, ఏం అనుభవించాలి ముఖ్యంగా కథ ద్వారా పాఠకులకి ఏ విషయం తెలియాలి, ఏది తెలియాల్సిన అవసరం లేదు అనేవి POV నిర్ణయానికి అధారం కావాలి. POVని సరిగ్గా నిర్వహిస్తే, అది పాఠకులని ఒక పాత్రతో, ఆ పాత్ర మనసుతో, ఆ మనసులోని ఆలోచనలతో మమేకం చేస్తుంది. అదే తప్పుగా నిర్వహిస్తే, కథ కేవలం జరిగిన సంఘటనల గురించిన నివేదికగా (ఋఎపొర్త్) మిగిలిపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోడానికి పైన ఇచ్చిన “అనిశ్చితి” అనే కథని ఉపయోగించుకుందాం. ముంది పైన చెప్పిన కథలో ఏం జరిగిందో గమనించండి.

కథ ఏం చెప్తోంది? ఒక తండ్రి హాస్పిటల్ ICUలో ఉన్నాడు. అతని కొడుకు అర్జున్ అందోళనగా బయట కూర్చుని ఉన్నాడు. తండ్రి బ్రతుకుతాడో లేదో అన్న ఆందోళనలో ఉన్న కొడుకు హాస్పిటల్‌ని ఎలా చూస్తాడు? ఆ అనుభవం ఎలా ఉంటుంది? అతని భయం, తన తండ్రితో అతనికి ఉన్న అనుబంధం, అతని మానసిక స్థితి, అతనిలోని ఆత్రుత ద్వారా అతని అనుభవం రూపుదిద్దుకుంటుంది. అలా అనిపించేలా కథ నడవాలి. ఆ పాత్ర మానసిక స్థితి ద్వారా వడపోసిన అనుభవమే పాఠకులకి అందాలి. కథలో అలా జరిగిందా?

ఈ వాక్యాలను గమనించండి: “జీవితం ఎంత అనిశ్చితమైంది అని అతను చాలాసేపు ఆలోచించాడు”, “ఇలాంటి సమయాల్లో కుటుంబం ఎంత ముఖ్యమో అతను గ్రహించాడు.”, “మనసంతా ఆందోళనతో నిండిపోయింది. అయినా ఎక్కడో ఒక ఆశ కూడా మిణుకు మిణుకుమంటోంది.” మామూలుగా చూస్తే ఈ వాక్యాలు అర్థవంతంగానే అనిపిస్తాయి, కానీ POV కోణంలో చూస్తే వీటిలో ఒక పెద్ద లోపం ఉంది. ఇవి ఆ పాత్ర ఆలోచనలను అతిగా వివరిస్తున్నాయి. ఒక భావం ఎలా పుడుతుందో పాఠకుడికి చూపించే బదులు, రచయిత ఇక్కడ కేవలం ఆ ఆలోచనల సారాంశాన్ని మాత్రమే చెబుతున్నాడు. పైన ఉదహరించిన వాక్యాలను మళ్లీ చూడండి. ఇవి ఆ పాత్ర ఆలోచనలు కావు; ఇవి ఆ ఆలోచనల ముగింపు వాక్యాలు మాత్రమే.

ఇక్కడ సమస్య ఏమిటంటే, పాఠకులు ముగింపులతో మమేకం కాలేరు—వారు అనుభవాలతోనే మమేకం అవుతారు.

>> అతను తన తండ్రి గురించి ఆందోళన చెందాడు

అనే చప్పని ముగింపు వాక్యాన్ని

>> అర్జున్ చేతిలో ఉన్న ఫైల్‌లో డాక్టర్ రాసిన condition critical & unstable అనే పదాల వైపు ఎనిమిదోసారి చూశాడు. ఒక్కసారైన అవి మారతాయేమో అన్నట్లుందతని ధోరణి.

అని రాస్తే ఎలా ఉంటుంది? ఈ వాక్యాలలో అర్జున్ భావోద్వేగాన్ని ఒకరు చెప్పాల్సిన పనిలేకుండా పాఠకులే స్వయంగా గుర్తిస్తారు. కేవలం ఒక రిపోర్టును చదవడం అనే సన్నివేశ చిత్రణలో, పాత్ర యొక్క అంతర్గత ప్రపంచంలో పాఠకులు కూడా పాలుపంచుకుంటారు. ఇక్కడ నేను చెప్పదల్చుకున్న సూత్రం చాలా సరళమైంది: మీరు ఒక ఆలోచనను నేరుగా వివరించినప్పుడు, ఆ కథలో పాఠకుల భాగస్వామ్యాన్ని తప్పించినవాళ్లౌతారు. సరైన POV పాఠకులని ఆ క్షణంలో జీవించేలా చేస్తుంది. తప్ప, కేవలం ముగింపులను గమనించేలా చేయదు. అందుకు ఏం చెయ్యాలి? ఆలోచన గురించి చెప్పాలనుకుంటే దాన్ని ఆలోచన పుట్టినదగ్గర్నుంచి ఆ ఆలోచన సరళిని వివరిస్తూ చివర్లో ఆ ఆలోచన ఎలా ముగిసిందో చెప్పడం ఒక పద్ధతి. పాత్ర ఏం ఆలోచిస్తోందో తెలిసేలా సన్నివేశ రూపకల్పన చెయ్యడం మరో పద్ధతి. ఎక్కువసార్లు, రెండో పద్ధతే పాటించదగినది. సరళంగా చెప్పాలంటే – POVని ఒక అనుభవంగా పాఠకులు అర్థం చేసుకోవాలంటే, దాన్ని ఒక కెమెరాలా ఊహించుకోవాలి తప్ప గాలిలో ఎగిరే డ్రోన్ కెమెరాలా చెయ్యకూడది. ఇది ఇంకా బాగా అర్థం చేసుకోడానికి పాయింట్ ఆఫ్ వ్యూ విషయంలో రచయితలు తరచుగా చేసే పొరపాట్లను తెలుసుకోవాలి.

‘పాయింట్ ఆఫ్ వ్యూ’ను నిర్వహించడంలో తరచుగా జరిగే పొరపాటును ‘ఇంటీరియర్ ఓవర్‌లోడ్’ (అంతర్గత మథనం ఎక్కువవ్వడం) అనచ్చు. పైన ఇచ్చిన సన్నివేశం గమనిస్తే అంతా కేవలం ఆలోచించడం, ప్రతిబింబించడం, గ్రహించడం, విశ్లేషించడం లాంటి వాటికే పరిమితమైపోయింది. అర్జున్ తన సమయాన్ని ఎక్కువగా “భవిష్యత్తు గురించి ఆలోచించడం,” “బంధాల గురించి మథనపడటం,” “జీవితంలో మార్పుల గురించి విశ్లేషించడం” కనపడుతోంది. కానీ అతను అసలు అక్కడ ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నించుకుంటే, అందుకు సమాధానం చెప్పగలిగిన విషయాలు ఏమీ లేవని అర్థమౌతుంది. కథలు కేవలం ఆలోచనల మీద మాత్రమే నిర్మించబడవు; అవి ఆ ప్రదేశంలో పాత్రల కదలికలు, పరిసరాలకు వారు ఇచ్చే ప్రతిచర్యలు లాంటి భౌతికమైన పనుల మీద ఆధారపడి ఉంటాయి. ఒక పాత్ర కేవలం ఆలోచిస్తూనే ఉంటే, ఆ సన్నివేశం నిశ్చలమైపోతుంది.

ఉదాహరణకు,

>> ఒక వైరాగ్య ధోరణి అతనిని అంటిపెట్టుకోని చాలాసేపు ఉండిపోయింది

అనే అరూప (abstract) వాక్యాని బదులు

>> ICU బయట అటొకటి, ఇటొకటిగా పడి ఉన్న తండ్రి చెప్పులవైపు తదేకంగా చాలాసేపు చూసి, భారంగా నిట్టూర్చాడు

అనే క్రియాశీలక వాక్యం వాడితే ఎలా ఉండేది? రెండవ వెర్షన్‌లో, వైరాగ్యం అనేది ఆలోచనలా కాకుండా “చెప్పులవైపు చూడటం” అనే ఒక ‘చర్య’ ద్వారా నాటకీయంగా వ్యక్తమైంది. దీన్ని ఒక సూత్రంలా చెప్పాలంటే  –  ఒక సన్నివేశాన్ని కేవలం పాత్ర ఊహించుకోవడం కాదు, దాన్ని జీవించాలి. అది కథలో వ్యక్తమవ్వాలి.

ఒక సన్నివేశాన్ని మెరుగుపరచాలంటే, మనం వివరణల నుండి అనుభూతుల్లోకి మారాలి.

>> “మనసంతా ఆందోళనతో నిండిపోయింది. అయినా ఎక్కడో ఒక ఆశ కూడా మిణుకు మిణుకుమంటోంది”

అని రాసే బదులు, ఆ భావోద్వేగాన్ని ఒక చర్య ద్వారా చూపవచ్చు:

>> “ఐసీయూ తలుపు తెరుచుకున్న ప్రతిసారీ అతను ఆశగా ముందుకు వంగుతున్నాడు. అది తమ కోసం కాదని తెలియగానే నిరాశతో కుర్చీలో వెనక్కి వాలిపోతున్నాడు”

అని చెప్పచ్చు. ఇలా చేయడం వల్ల పాఠకులు ఆ పాత్ర ఉత్కంఠను నేరుగా అనుభవిస్తారు. అదేవిధంగా, అంతర్గత మథనాన్ని తగ్గించి భౌతికమైన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి.

>> “ఇలాంటి సమయాల్లో కుటుంబం ఎంత ముఖ్యమో అతను గ్రహించాడు”

అనే బదులు

>> బాబాయ్ నుంచి మెసేజ్ వచ్చింది. “నా దగ్గర లక్ష ఉంది. నీకు పంపిస్తున్నాను. తరువాత చూసుకుందాం. అన్నయ్యని బ్రతికించరా” అది చదివి ఆస్తి గొడవలు పెట్టుకున్నది ఇతనేనా అని ఆశ్చర్యపోయాడు అర్జున్. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి.

ఇందులో చెప్పాల్సిన విషయం చెప్పాం. కుటుంబం అవసరం ఒక ఒక అరూప భావంలా కాకుండా, కళ్లముందు జరుగుతున్న ఒక సజీవ దృశ్యంలా మారింది చూశారా?

POVకి ఒక ఉద్దేశం లేకపోవడం

ఇది సర్వ సాధారణమైన మరో సమస్య. ఒక సన్నివేశాన్ని ఈ నిర్దిష్ట పాత్ర ద్వారానే ఎందుకు చెప్పాలి అనే విషయాన్ని రచయిత సరిగ్గా నిర్ణయించుకోకపోవడమే దీనికి కారణం. మన ఉదాహరణలో, అర్జున్ అక్కడ ఉన్నాడు కానీ అతను ఏం పరిశీలిస్తున్నాడో చూడండి. అతను శుభ్రమైన అంతస్తులు, పద్ధతిగా ఉన్న కుర్చీలు మరియు సమర్థవంతమైన వ్యవస్థలను గమనిస్తాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి: ఆందోళనలో ఉన్న ఒక కొడుకు ఆసుపత్రిలోని ‘సమర్థత’ను గమనిస్తాడా? లేదా అక్కడ ఉన్న ప్రమాదాలను, జాప్యాలను (Delays) మరియు అనిశ్చితిని గమనిస్తాడా? ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఫోవ్ అంటే కేవలం అక్కడ ఎవరున్నారనేది కాదు—ప్రపంచం వారి ద్వారా ఎలా వడపోయబడుతోంది అనేదే ముఖ్యం. అలా వడపోసేందుకు ఉపకరించే సాధనం – భావోద్వేగం (Emotional filter). అది ఇక్కడ బలహీనంగా ఉంది.

సరైన ఫోవ్ ఒకే వాతావరణాన్ని రకరకాలుగా మార్చగలదు. ఒక ఆసుపత్రిలో, ఒక డాక్టర్ ‘పని విధానాన్ని’ గమనిస్తాడు, ఒక చిన్న పిల్లవాడు అక్కడి ‘యంత్రాలను’ చూసి భయపడతాడు, కానీ తన తండ్రి కోసం ఎదురుచూస్తున్న కొడుకు సమయాన్ని, నిశ్శబ్దాన్ని, అనిశ్చితిని మాత్రమే అనుభవిస్తాడు. మన ఉదాహరణలో, అర్జున్ ఆందోళనతో ఉన్న కొడుకులా కాకుండా, కేవలం ఒక ప్రేక్షకుడిలా గమనిస్తున్నాడు. ఇదీ గమనించాల్సిన లోపం. అలా జరగకూడదంటా ఏం చెయ్యాలి? POV# అంటే కేవలం అక్కడుండి చూడటం మాత్రమే కాదు; అది ఆ పాత్ర దృక్పథం (ఫెర్స్పెచ్తివె) నుంచి రాయాలి.

ఫోవ్ ఉద్దేశాన్ని బలపరచాలంటే—ప్రస్తుత క్షణంలో అర్జున్ దేనికి ఎక్కువగా భయపడుతున్నాడో అర్థం చేసుకుని, ఆ భయం ద్వారానే పరిసరాలను చూడాలి. ఆసుపత్రిని

>> అంతా చాలా క్రమబద్ధంగా, చూడగానే ఆ హాస్పిటల్ నిర్వహణ చాలా బాగుందని అనిపించేలా ఉన్నాయి

అని వర్ణించే బదులు,

>> అన్నీ అమర్చినట్లు ఉన్న ఆ కారిడార్ అతని ఆందోళనని అధికం చేస్తున్నాయి.

అని రాయవచ్చు. ఇక్కడ ఆ వాతావరణం కేవలం ఒక పరిశీలనలా కాకుండా, ఒక భావోద్వేగ వడపోత (Emotional filter) ద్వారా వ్యక్తమవుతోంది. చివరగా, ఆలోచన అనేది ఒక చర్య నుండి సహజంగా పుట్టాలి.

>>జీవితం ఎంత అనిశ్చితమైంది అని అతను ఆలోచించాడు

అని ప్రకటించే బదులు,

>> రెండు రోజుల క్రితం తన తండ్రి “ఏమిట్రా ఈ ఫోన్లు, లాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచీలు? చిరాకేస్తోంది. మన బ్రతుకంతా మెషీన్ల మీద ఆధారపడి నడుస్తోంది” అన్న మాటలు గుర్తుకొచ్చాయి. జీవితం ఎంత అనిశ్చితమైనదంటే ఇప్పుడు ఆ మెషీన్లే ఆయనకి ఊపిరి పోస్తున్నాయి

అని రాయవచ్చు. ఇక్కడ ఆ సత్యం నేరుగా చెప్పబడలేదు, సజీవమైన ఒక సందర్భంలో ఇమిడి ఉంది. ఇందులో ఐరనీ ఉంది, భాధ వైరాగ్యం అనే ప్రధాన పాత్ర భావోద్వేగం ఈ వాక్యాలలో కలిసిపోయి ఉంది.

మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటే: ‘పాయింట్ ఆఫ్ వ్యూ’ అనేది కేవలం ఒక సాంకేతిక అంశం కాదు—అది సన్నివేశం యొక్క ఆత్మ. దాన్ని సరిగ్గా నిర్వహించకపోతే, అది అనుభవానికి బదులు వివరణగా, జీవితానికి బదులు ఆలోచనగా, దృక్పథం లేని వాక్యంగా మిగిలిపోతుంది. అదే POVని సమర్థవంతంగా నిర్వహిస్తే, ప్రపంచం మొత్తం ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంది, ప్రతి చిన్న వివరానికి ఒక భావోద్వేగం తోడై సన్నివేశానికి బలాన్ని ఇస్తుంది. అప్పుడు పాఠకులు కేవలం గమనించడం ఆపేసి, ఆ పాత్రలో లీనమవ్వడం మొదలుపెడతారు.

***

పైన మనం చదివిన కథని మరోసారి చూడండి. “షో డోంట్ టెల్” అనే మాట మీరు చాలాసార్లు వినే ఉంటారు. కథలు రాయడం ఎలా, నవలలు రయడం ఎలా లాంటి పుస్తకాలు ఏవి చదివినా, పెద్ద పెద్ద రచయితల ఇంటర్వ్యూలు పాడ్‌కాస్ట్‌లు లాంటివి విన్నా మీకు తరచుగా వినపడే వాక్యమిది. కథని కేవలం చెప్పడం మాత్రమే కాదు, చూపించాలి అని దాని అర్థం. మనం గత కొన్ని వ్యాసాలుగా చేస్తున్న పని దాన్ని దాటి మరో అడుగు ముందుకు వేసి, కేవలం కళ్లకి మాత్రమే కనిపించేలా చూపించడం మాత్రమే కాదు, మిగిలిన ఇంద్రియాలకు కూడా కథ అనుభవంలోకి వచ్చేలా (ఇంద్రియానుభవం అన్నాను గత వ్యాసాలలో) కథ చెప్పాలి అని అనుకున్నాం. ఈ దృష్టితో ఒకసారి కథని చూస్తే నాలుగు లోపాలు మీకు కనిపిస్తాయి. అవేమిటో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకోవడం ఎలాగో తెలుసుకుందాం.

ఇంద్రియానుభవం అంటే కథలో ఉన్న ప్రపంచాన్ని పాఠకులు అన్ని ఇంద్రియాలతో ఎలా అనుభవిస్తున్నారు అని కదా అనుకున్నాం. అంటే అక్కడ ఏముందో తెలుసుకోవడం కన్నా, ఆ సన్నివేశంలో పాఠకులు నిలబడి ఉంటే వాళ్లకు ఏమేమి అనుభవంలోకి వస్తాయో వాటిని చెప్పడం. కథైనా, నవలైనా అందులో ఉండే సన్నివేశం నిశ్చలంగా ఉండే పెయింటిగ్ లాగా ఉండకూడదు. అందులో శబ్దం, స్పర్శ, వాసన, ఉష్ణోగ్రత, స్థలం తాలూకు ఉనికి లాంతివి చాలా ఉంటాయి. చాలా మంది రచయితలు ఆ సన్నివేశంలో ఏమి కనిపిస్తుందో వర్ణిస్తే సరిపోతుందని అనుకుంటారు, కానీ అది సరిపోదు. పాఠకులు కేవలం కనిపించే సన్నివేశాన్ని మాత్రమే చూస్తే అది సినిమా అవుతుంది. రచన గొప్పదనం ఏమిటంటే అది సినిమా కన్నా లోతైనా అనుభవాన్ని పాఠకులకి ఇవ్వగలదు. అందుకు ఈ ఇంద్రియానుభవం బాగా పని చేస్తుంది. కథలో ఉండే ఒక పాత్ర లేదా కథకుడు ఆ సన్నివేశంలో ఉండి ఇంద్రియాలతో గ్రహించే అనుభవాన్ని పాఠకులు కూడా అనుభవించేలా రాయడమే ఇందుకు మార్గం. దీనివల్ల పాఠకులు సన్నివేశాన్ని చూడటమే కాకుండా, అందులో లీనమవుతారు.

ఇంద్రియానుభవం రాయాలంటే అడగాల్సిన ప్రాథమిక ప్రశ్న – పాత్ర శరీరం ఆ సన్నివేశంలో ఆ సందర్భాన్ని ఎలా గ్రహిస్తోంది? అని. సరిగ్గా రూపొందించబడిన సన్నివేశం ఆ సందర్భానికి అవసరమైన ఇంద్రియాలకు ప్రాధాన్యత ఇచ్చి, వాటిని అనుభవాలని పాత్ర యొక్క మానసిక స్థితి ద్వారా వడపోస్తుంది. అప్పుడు వర్ణనలు కేవలం అలంకరణ కోసం కాకుండా అనుభూతిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలా కాకుండా కేవలం దృష్టి పైన ఆధారపడి ఇంద్రియానుభవంలో సమతుల్యత సాధించలేని సన్నివేశంలోని వర్ణనలు పైపై మెరుగులుగానే ఉందిపోతాయి. ఉదాహరణకు, మన అర్జున్ కథలో, ఆసుపత్రి వరండా పొడవుగా, తెల్లటి గోడలతో, అద్దాల కిటికీలతో, వరుసగా ఉన్న ఇనుప కుర్చీలతో శుభ్రంగా ఉన్నట్లు రచయిత వర్ణన చూడచ్చు. ఇవన్నీ కేవలం దృశ్యమానమైన (అంటే కనిపించే) సమాచారం మాత్రమే. అదే హాస్పిటల్‌లో మందుల వాసన వస్తుండచ్చు, ICUలో ఉన్న పరికరాల చప్పుడు వినడుతుండవచ్చు, ఇనుప కుర్చీ వల్ల అతనికి అసౌకర్యం కలుగుతుండచ్చు, గొంతు తడి ఆరిపోవడం వల్ల మంటగా అనిపించచ్చు. ఇవన్నీ ఆ ప్రపంచంలో ఉన్నాయి, కానీ ఒక ఫోటోగ్రాఫ్‌లా సన్నివేశాన్ని వర్ణిస్తే, ఇవేవీ పాఠకుల అనుభవంలోకి రావు. ఇదీ పై కథలో ఉన్న ప్రధాన సమస్య. ఇంద్రియానుభవం విషయంలో రచయితలు తరచుగా చేసే పొరపాట్లను మళ్లీ కలిసినప్పుడు చూద్దాం.

*

అరిపిరాల సత్యప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు