వర్తమాన దుఃఖంతో కలగలిసిన పద్యాలు

కొత్త కవిత్వ పుస్తకాలపై సమీక్షల శీర్షిక

    మతంలోనైనా పండుగ నింపే ఉత్తేజం తతిమా సాంస్కృతిక సందర్భాల కన్నా భిన్నంగా వుంటుంది. సామూహిక జీవనంలోని సౌందర్యాన్ని రంగురంగుల బొమ్మలుగా అందిస్తుంది. ఐతే పండుగ ఏదైనా అది బాల్యంలో వున్నంత స్వచ్ఛంగా తర్వాత తర్వాత వుండదు. అనేక భయాలు, స్పృహలు,అనుభవాలు వచ్చి చేరుతాయి.
      పొద్దుటి ఆహారంలో
      రొట్టెను తాకగానే –
      ప్రతి తునకలో గాజా కనిపిస్తోంది
అని కవి అఫ్సర్ అన్నప్పుడు సరిగ్గా ఇదే అనుభవం పద్యం నిండా చిక్కగా అల్లుకుంది. ముస్లిం సమాజంలో రంజాన్ ఒక పవిత్ర మాసం. ఉపవాసాల సమయం. ఒంటి పొద్దుల కాలం. ఎంతో సంబరంగా గడపాల్సిన సందర్భంలో కవి ఎందుకు దుఃఖగానం చేస్తున్నాడు? దీనికి సమాధానంగా అఫ్సర్ Fasting Hymns పేరుతో 30 పద్యాలుగా రాసుకున్నారు. పి.శ్రీనివాస్ గౌడ్ వాటిని తెలుగులో “ఉపవాస పద్యాలు” గా అందించారు.
     ఇవాళ భూమ్మీద అతి ఎక్కువగా దాడులకు గురవుతున్న మతం – ముస్లిం మతం. గడిచిన కొన్ని దశాబ్దాలుగా అనేక యుద్ధాలను చూసింది.వివక్షతో అంతర్గత మౌఢ్యాలతో అనుమానాలతో తీవ్రవాదం పుట్టుమచ్చలతో పోరాడుతూనే వుంది. అనేకానేక జీవన సంక్షోభాలు, భౌతిక – సాంస్కృతిక విధ్వంసం ముస్లిం సమాజాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న స్థితిలో కవి ప్రతి దృశ్యాన్ని ప్రతి సందర్భాన్ని వర్తమాన దుఃఖంతో పోల్చుకోవడం కనిపిస్తుంది.
       ఒక రొట్టెముక్క కోసం
       వేడుకుంటున్న
       ఖాళీ కడుపులా వుంది –
       కుంగిన నెలవంక.
       *
       ఈరోజు ఉదయానే కూర్చొని
       అన్నం ముద్దని చూసినపుడు –
       అది
       వెంటనే అఖ్లాక్* ముఖాన్ని గుర్తుచేస్తుంది
      (*అఖ్లాక్: 2015లో ఆవును చంపాడనే అనుమానంతో దాద్రీలో చంపబడ్డాడు)
       *
       శుక్రవారాల్లో నేను కొత్త బట్టలు వేసుకుంటా.
       నాకు తెలియకుండానే,
       అది శవం మీద కప్పిన వస్త్రంలా అనిపిస్తుంది
       విషయాలు లోతుగా గ్రహిస్తున్నకొద్దీ వేదన గమనింపుకొస్తున్నకొద్దీ దుఃఖాన్ని పదేపదే తడుముకుంటున్న కొద్దీ పరిష్కారం వైపు నడుస్తున్న కొద్దీ గత కొన్ని కాలాలుగా పరిచయం వున్న ప్రపంచం మారిపోతున్నట్టు అనిపించడం సహజం. ‘ఏ యుద్ధంలోనైనా మొట్టమొదట గాయపడేది కవే’ అని నేను ఓ కవితలో రాసుకున్నాను.
      రాత్రంతా చేస్తున్న ప్రార్థన
      ఎప్పటికీ ముగిసిపోదు –
      రక్తమూ కన్నీళ్లలో తడిచి
      ఒకరి చేతుల్లోకి ఒకరం ఒరిగిపోయాం.
      కవి లోతుగా గాయపడ్డాడు అని చెప్పడానికి ఈ పద్యం సాక్ష్యం చాలు అనిపిస్తుంది.
        ఎప్పుడు నేను
        రంజాన్ రొట్టె గురించి మాట్లాడినా
        మొహర్రం రక్తం గురించి కూడా మాట్లాడతాను
        *
       అమ్మ ఎప్పుడూ అంటూ వుండేది –
       ” ఉపవాసికి నీరు అందిస్తే
       పది నేకీ(దైవ ప్రతిఫలం)లు పొందుతావు” అని.
       అసలు రంజాన్ మాసమంతా
        ఒక దేశానికి దేశమే
        కూడూ నీళ్ళకు 
        దూరమైందని తెలిస్తే
        అమ్మ ఏమంటుందో?!
       వర్తమాన సంక్షుభిత కాలాల లోంచి సంక్షిష్టతలలోంచి కవి ప్రయాణిస్తాడు. వివక్ష లేని విద్వేషం లేని భూమి కోసం ఆరాటపడుతున్నాడు.
        ఈ పండుగ రోజున కూడా
        అసలు మరిచిపోవద్దు
        మన నెలవంక 
        సుసంపన్న వర్గాల కల్మషచేతుల్లో
        బందీ అయిందని..
       మన శరీరాలు 
       మనుషులంత గాయాలుగా మిగిలాయని..
       అయినా 
       మనం ముందుకే కదంతొక్కి 
       అగ్గినైనా ఆలింగనం చేసుకుందాం.
        మనిషిగా అఫ్సర్ కు కలలు కనే స్వేచ్ఛ వుంది. ప్రపంచం ఒక పూలతోట కావాలన్నది అతడి కలల్లో అందమైనది కావచ్చు. కానీ, ప్రతి మనిషి చేతుల్లో అన్నం ముద్దో రొట్టె ముక్కో ఉండాలనేది అతడు కనే కలల్లో ముఖ్యమైంది. భయాల్లేని అభద్రతలేని అవమానాల్లేని ప్రపంచం గురించి అతడి ఆత్మ ఘోషిస్తూ వుండొచ్చు. అది నెరవేరనప్పుడు, నెరవేరుతుందన్న ఆశ కూడా సమీపంలో కనబడకపోవడం అతడిని ఎక్కువ గాయపరిచి వుంటుంది. కవి కాబట్టి అతడు తన సమూహ గాయాలను అట్లాస్ లా భుజానికెత్తుకుని మోస్తున్నాడు. దశాబ్దాల సాహితీ సేద్యం వల్ల రాటుదేరి ఉపవాస పద్యాల్లో మరింత నిర్ధిష్టంగా శక్తివంతంగా కనిపిస్తున్నాడు.
        కవి,అనువాదకుడూ వేరు వేరు ప్రపంచాల నుండి వచ్చినవారు. కానీ కవిత్వం అనే వంతెన మీదకు వచ్చేసరికి ఇద్దరూ ఇద్దరే. సహజ ప్రతిభకు సాధనతో మెరుగులు దిద్దుకుని పాఠకుడిలో ప్రతిధ్వని కలిగించే నేర్పున్నవాళ్ళు. ఇద్దరిదీ సఫల ప్రయత్నం అని చెప్పడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
ఉపవాస పద్యాలు ప్రతులకు: శ్రీనివాస్ గౌడ్ ని సంప్రదించండి.  WhatsApp 99494 29449
*

సాంబమూర్తి లండ

నేను సాంబమూర్తి లండ. టీచర్. బోధన తర్వాత ఎక్కువగా ప్రేమించేది కవిత్వం. చదవడం మరీ ఇష్టం. వర్తమాన సమాజంలోని వ్యత్యాస్తాలు, మూకస్వామ్యాలు, బతుకు రొద, శూన్యం నన్ను కదిలిస్తాయి. 2020 లో "గాజురెక్కల తూనీగ" కవితా సంపుటి ప్రచురించాను. నాదైన వాక్యాన్నీ, నాదైన గొంతునీ, నాదైన భాషనీ వదిలివెళ్లాలనేది నా స్వప్నం.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు