వరిపొలాల వేపు తెరిచిన కిటికీ….యల్ ఆర్ స్వామి

ఎల్.ఆర్, స్వామి గారితో సారంగ కి ప్రత్యేక అనుబంధం వుంది. సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం పొందిన ఆయన అనువాదం “సూఫీ చెప్పిన కథ” సారంగ ప్రచురణ. వారికి సారంగ నివాళి

మిళ మూలాలున్న కుటుంబం…కేరళ లో స్థిరపడితే పుట్టిన పిల్లాడికి రెండు భాషలు నోటికొచ్చేస్తాయని ఎవరమైనా ఒప్పుకోవచ్చు. ఆ పిల్లాడు సంస్కృతం నేర్చుకుంటే అప్పుడు మూడు. అదీ సరే…అంతలోనే పెద్ద వాడై మహారాష్ట్ర లో ఉద్యోగం వచ్చి, ముంబై వెళ్ళాక, మరాఠీ కూడా నేర్చుకుని… ఆపై ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో స్థిరపడడం జరిగాక, తెలుగును ఔపోసన పట్టాడనుకోండి…అయిదు భాషలు తెలిసిన వాడో లేదా నేర్చుకున్న వాడో అంటూ పొగడొచ్చు. అన్నట్టు ఆంగ్లం ఎలానూ కూడా కూడా ఉంటూనే ఉందని మన ‘ టెల్గోస్ ‘ కి చెప్పక్కర్లేదు…కదా.

ఇవన్నీ చాలా మంది విషయంలో జరిగే ఉండొచ్చు గానీ, యల్ ఆర్ స్వామి అని ప్రపంచానికి పరిచయం అయిన లక్ష్మణయ్యర్ రామ స్వామి గారు ఇంకా చాలా మెట్లు పైనున్న గొప్ప వ్యక్తి. ఎలాగంటే, పైన చెప్పిన భాషలన్నీ ఆయనకి కరతలామలకాలు…అనర్గళంగా మాట్లాడడమే కాకుండా ఆయా భాషల సాహిత్యాల మీద పట్టు, అభినివేశాన్ని మించిన ప్రేమ ఆయన సొంతం. ఏ భాషలో కవిత్వం రాస్తే, ఆ భాషే ఆయన మాతృ భాష అని పందెం కట్టొచ్చు.

బహుశా చాలా మందిలో పైన చెప్పుకున్న లక్షణాలు కూడా సాధారణంగా ఉండేవే అయ్యుండొచ్చు. మరి, యల్ ఆర్ స్వామి గారిని ప్రత్యేకం ఎందుకు చెప్పుకోవాలంటే… వారి వ్యక్తిత్వం. ఆయన పాండిత్యానికి తోడు వారి సౌమ్యత, సాహిత్యం పట్ల నిబద్ధత, అపురూపమైన స్నేహ పూర్వక పలకరింపు వగైరాలన్నీ బంగారానికి అబ్బిన తావులు. ఇన్ని విధాల పరిమళించే వ్యక్తి ప్రత్యక్ష పరిచయం నాకు జీవితంలో దొరికిన ఒక అరుదైన అదృష్టం.

గోదావరి స్టేషన్ కథలు…అన్న పుస్తకంతో ఆయన ప్రత్యక్ష పరిచయం అయినా…అప్పటికే స్వామి గారు సచ్చిదానందన్ గారి శరీరం ఒక నగరం అనువాదకులు గా నాకు పరోక్షంగా అభిమానం. జ్ఞాపకం వరిపొలాల వేపు తెరిచిన కిటికీ అన్న ఒక అద్భుత వాక్యం తో (అది అనువాదమే అయినా…) ఆయనకి అభిమానినైపోయాన్నేను. ఆ తర్వాత ఆయనతో మాట్లాడినప్పుడు, మొత్తం.పుస్తకాన్ని కేవలం ఏడు రోజుల్లో అనువదించానని ఆయన చెప్పినప్పుడు, ఒకానొక సంభ్రమం, ఉత్సాహం ముంచెత్తిన క్షణాలు మర్చిపోలేనివి. ఎందుకంటే…ఆ పుస్తకం (కాస్త పెద్దదే) లో ఉన్న ఏ కవితా కూడా అనువాదంలా అనిపించదు. అచ్చ తెలుగు కవితలానే ఉంటుంది. పైగా అది రాసినాయన తెలుగాయన కాదు. ఇంతకంటే చెప్పుకోడానికి సాహిత్యంలో మంచి ముచ్చట ఉంటుందని నేననుకోను. ఇక మరో గొప్ప సంగతి…ఆయన ఎవర్నీ విమర్శించక పోవడం. తన సాహితీ ప్రయాణం ఎంచక్కా చేసుకుంటూ పోవడం. సాహితీ సభల్లో సైతం నిదానంగా ప్రశాంతం గా మాట్లాడడం. కరకుదనం తెలీని మంచితనం. కవితలోనో కథలోనో మంచి వాక్యాలు కనబడితే మెచ్చుకోవడం. అంతే.

తెలుగు భాషలో సామెతలతో కొన్ని కథలల్లి ప్రచురించారు. గోపీగారు, శిఖామణి గార్ల కవిత్వాన్ని మలయాళీ భాషలో అనువదించారు. అయ్యప్ప పనిక్కర్ గారి మలయాళ జానపద కథల్ని తెలుగు వాళ్ళకి అందించారు. తెలుగు మలయాళీ నిఘటువు తయారీలో ముఖ్య పాత్ర పోషించారు.

ఎప్పుడైనా ఏదైనా అనువాదం ఆయనకి చూపించనప్పుడు, బాగా లేకపోతే మాత్రం కుండా బద్దలు కొట్టేవారు. ముఖస్తుతి అన్నది ఆయన నిఘంటువులో లేని పద. అది ఆయనలో నాకు బాగా నచ్చిన అంశం. సాహిత్యం పట్ల నిర్ధిష్టమైన నిబద్ధత.

స్వీయ రచనలు, అనువాదాలు సాహిత్యోపన్యాసాలు, మొజాయిక్ లాంటి సాహితీ సంస్థల నిర్వహణ ఇలా ఏదైనా తనదైన ముద్ర వేసిన ఈ బహుభాషావేత్త తన జ్ఞాపకాన్ని సాహితీ క్షేత్రం వేపు తెరిచిన కిటికీ చేసి…నిన్న తన ఎనభై రెండేళ్ల నిండైన ప్రయాణం ముగించారు.

వారికి సవినయ నివాళి.

*

యల్. కె. సుధాకర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బాహుభాషావేత్త, విశాఖ సాహిత్య సభలని దశాబ్దాలుగా తన వ్యక్తిత్త్వం, పాండిత్యం, రం జీంపజేసిన అధ్బుత రచయిత, తమిళ, తెలుగు మలయాళ భాషల మధ్య అనువాదం వారధులు నిర్మిస్తూ జీవితాన్ని సుసంపన్నం చేసుకున్న వ్యక్తి. అన్నీటిని మించి బహు సౌమ్యులు, నిరాడంబరులు. విశాఖ ఒక సాహిత్యవేత్తని కోల్పోయింది. వారికీ నివాళి

  • 2011 మే నెలలో అనుకుంటాను. నేను విశాఖపట్నం దగ్గరలోని యలమంచిలిలో ఉద్యోగిస్తున్న కాలంలో, అద్దేపల్లి రామమోహన్ రావు గారికి,కొలకలూరి ఇనాక్ గారికి యలమంచిలి పౌర సేవా సమితి తరపున ఐ యస్ రావు(IAS) గారి ఆధ్వర్యంలో పౌర సన్మానం జరిగింది. ఆ కార్యక్రమానికి ఎవరెవరు
    అతిథులు ఉంటే బాగుంటుందో నిర్ణయించి వారిని ఆహ్వానించడానికి, కార్యక్రమ నిర్వహణలోను నన్ను ప్రధాన భాగస్వామిని చేశారు. నా సూచన మేరకు అతిథులుగా యల్.ఆర్.స్వామి గారు,రామతీర్ధ గారు వక్తలుగా,జగద్ధాత్రి. గారిని ఆత్మీయ అతిథులుగా ఆహ్వానించడం జరిగింది. సన్మాన గ్రహీతలను, అతిథులను సభకు పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. సభానంతరం మా ఇంటిలో అతిథులకు విందు ఏర్పాటు చేసాము. రాత్రి 10 గంటల వరకు వారితో గడిపే అవకాశం దొరికింది. ఆ తరువాత కాలంలో రామతీర్థ, జగద్ధాత్రి గార్లతో వారు జీవించి వున్నంతకాలం ఆ పరిచయం కొనసాగింది. యల్ ఆర్ స్వామి గారు తన కథల సంపుటాలు,అనువాద సంపుటాలు గురించి తరచూ మాట్లాడుకుంటేనే ఉన్నాము. గోవా మాజీ గవర్నర్ శ్రీధరన్ పిళ్ళై కథల సంపుటిని “రామచిలుక” శీర్షికతో స్వామి గారు అద్భుతంగా అనువాదం చేశారు. దానిని పాలపిట్ట బుక్స్ వారు ప్రచురించారు. ఆ కథల సంపుటిపై డా. కె.జి.వేణు గారు వ్యాసం రాస్తే మా సృజననేడు దినపత్రిక సాహిత్యపేజీలో ప్రముఖంగా ప్రచురించాము. వ్యాసానికి.మంచి స్పందన వచ్చింది. ఈ రామచిలుక కథల సంపుటి తెలంగాణ గవర్నర్ నివాసంలోని దర్బార్ హాలులో ఆవిష్కరించారు. ఆ సభకు అప్పటి తెలంగాణ రాష్ట్ర గవర్నర్, ప్రస్తుత భారత ఉప రాష్ట్రపతి గౌ.రాధాకృష్ణన్ గారు,ప్రస్తుత తెలంగాణ
    రాష్ట్ర బిజిపి అధ్యక్షులు రామచందర్ రావు, కొలకలూరి ఇనాక్, కె.శివారెడ్డి, యల్ ఆర్ స్వామి గవర్నర్ సెక్రటరీ గార్లు అతిథులుగా హాజరయ్యారు. అతిథులతోపాటు కొందరు సాహితీవేత్తలను కూడా ఆహ్వానించారు. ఆ సాహితీవేత్తలలో నేను కూడా ఉండటం నాకు కలిసొచ్చిన అవకాశం. దాదాపుగా 3 గంటలసేపు యల్.ఆర్.స్వామి గారితో గడిపి వారితో కలిసి లంచ్ చేయడం, వారికి కూరలు, మంచి నీళ్ళు అందించి భోజనం చేసేవరకు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఆ తరువాత అప్పుడప్పుడు వారు పలకరించేవారు,నేను కూడా సమయం.దొరికినప్పుడల్లా మాట్లాడుకుంటూనే ఉన్నాము. నా కవితానొకదానిని మలయాళం లోకి అనువాదం చేసి, కేరళ సాహిత్య అకాడెమీ వారి నిర్వహణలో వస్తున్న పత్రికలో ప్రచురణకు పంపానని కూడా చెప్పారు. అది ప్రచురణ జరిచినది లేనిది తెలియదు.

    చివరిగా మేము మాట్లాడుకుంది ఫిబ్రవరి 12,2026. 2 లక్షల కాపీలకు పైగానే అమ్ముడుపోయిన “అమ్మ డైరీలో కొన్ని పేజీలు” గ్రంథాన్ని మలయాళంలోకి అనువాదం చేసి ఆ కవర్ పేజీ నాకు పంపుతూ అది తన 25వ అనువాద గ్రంథంగా పేర్కొన్నారు.

    ఒక మంచి మనిషికి ఉండవలసిన లక్షణాలు, ఏమిటని ఒక సందర్భంలో అడిగినప్పుడు “నీవలే నీ పొరుగు వారిని ప్రేమించు”, ‘చేతనైతే ఎవరికైనా సహాయం చెయ్’, ‘తెలిసి ఎవరికీ హాని చేయకు చాలు” అన్నారు. ఇంతకంటే ఏ తత్త్వవేత్త ఎక్కువగా చెప్పగలరు. స్వామి గారు, మీరు సృజించిన అక్షరం ఉన్నంతవరకు భౌతికంగా మీరు మా మధ్య లేకపోవచ్చు గానీ, మేము మీతో,మీరు మాతో ఎల్లప్పుడూ వుంటారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు