2
నీ భర్తకి ఒక నమ్మకమైన భార్యగా వున్న నీ గురించి ఈ విషయం తెలియడం కన్నా దారుణం ఇంకేముంటుంది చెప్పు?
నేనా? అక్కడ కనిపించానా? అసలా ప్లేస్ ఎక్కడుందో నాకు తెలియదు. నేను వెళ్ళడం ఏమిటి? అంటావు అంతే కదా?
అవసరమైతే నందు మీదే ప్రమాణం చెస్తావు. నమ్మడా?
తెలిసి తెలిసీ పచ్చని సంసారంలో నిప్పులు పోస్తావా? అంటావు. పచ్చని సంసారం.. హ.. హ.. హ…
నీ సంసారం సరిగ్గా లేదు. ఆ విషయం నీకూ తెలుసు, నందుకి కూడా తెలుసు. కానీ నువ్వు అది ప్రకటించడానికి ఇద్దరూ సిద్ధంగా లేరు. ఆ ప్రకటన ఒక సంజాయిషీ అయ్యే అవకాశం వద్దనుకుంటున్నావు కాబట్టి నువ్వు చెయ్యగలిగింది ఒకటే – బుకాయించడం.
బుకాయిస్తే విషయం దాగుతుందనుకోవడం అవివేకం కావచ్చు. ఏమో చెప్పలేము. నిజానికి బుకాయింపు రంగు పూసి మాయ చేయచ్చేమో. ప్రయత్నించు.
కానీ అలా జరగాలంటే నందుకి నీ మీద వందకి వంద శాతం నమ్మకం వుండాలి. నందుకి నీ మీద అంత నమ్మకం వుందా? నువ్వు చెప్పేది ఏదైనా, ఆఖరుకి అతను నిజం అని నమ్మినదానికి పూర్తి విరుద్ధంగా వున్నదైనా సరే, నువ్వు చెప్పావు కాబట్టి నమ్మేంత గుడ్డి నమ్మకం వుందా?
వుందా?
నందు నమ్మడు. నమ్మకపోవటం అటుంచు నువ్వు ఏది చెప్తే దానికి పూర్తి వ్యతిరేకంగా వుండేదే నిజమని నమ్ముతాడు. అందువల్ల అతను అడిగినప్పుడు బుకాయించడం సరైన మార్గం అని నమ్మే ముందు ఇతర అవకాశాలను పరిశీలించడం అవసరం.
నందుకి అసలు తెలిసే అవకాశం వుందా? వుంటే ఈ పాటికే తెలిసిపోయి వుండాలిగా? ఒకవేళ తెలిసిపోయి వుంటే?
అవకాశం లేదు అనకు. బహుశా అవకాశాలు తక్కువేనని అనుకోవచ్చు. కానీ వుందో లేదో అన్నట్లు వున్న అవకాశం నిజమై అతనికి తెలిసిపోతే? ఎలా తెలుస్తుంది?
ఎవరో చెప్తారు. ఏ శ్రేయోభిలాషో చూచాయగా చెప్పి జాగ్రత్త అనచ్చు. ఏ శత్రువో వెటకారంగా చెప్పి పగలబడి నవ్వచ్చు. లేదా నందు తనంతట తానే తెలుసుకోని వుండచ్చు.
తెలిస్తే ఏమౌతుంది? ఏం కాదని మాత్రం అనుకోకు నువ్వు. అలా అనుకుంటున్నావంటే నందు ఎలాంటివాడో మర్చిపోయావన్న మాటే.
గుర్తుందా? ఖరీదైన రెస్టారెంట్లకి తీసుకెళ్ళేవాడు నిన్ను. దర్పం అతనికి ఆభరణం అనుకునేదానివి. నియతి రియల్ ఎస్టేట్స్ యజమానిగా ఆ మాత్రం వుండాలని అనిపించేది నీకు. ఒక రాజ్యాన్ని స్థాపించి క్రమక్రమంగా ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ, విస్తరిస్తూ ఒక మహాసామ్రాజ్యాన్ని తయారు చేసే లక్షణం అతనిలో వుంది. పునాది వేస్తాడు. ఒక్కో అంతస్థు కడుతూ వెళ్తాడు. ఎంత ఎత్తుకి వెళ్ళాలో అంత ఎత్తుకి వెళ్ళి అక్కడ ఆగిపోతాడు. సుస్థిరం అతనికి ఇష్టమైన పదం. అలా ఎదిగినవాడు అలాగే వుంటాడు. ఇదంతా నువ్వు గమనించి గుర్తించినదే కదా. ఆ రోజు ఆ పబ్ లో జరిగింది గుర్తొస్తేనే నీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది, ఇప్పటికీ.
వాడెవడో. నీ వైపు చూశాడు. నువ్వు అతని వైపు చూశావు. అతని చూపు నీ ముఖం నుంచి కిందకి జారి, మెడని దాటి అక్కడే నిలిచిపోయింది. సరదాగా అనిపించింది నీకు. ఒక వైపు నందు మాటలు వింటూ, టేబుల్ మీద వున్న సలాడ్ తింటూ ఓరకంట చూశావు. అతని చూపు అలాగే వుంది. నవ్వొచ్చింది నీకు. అతను లేచి దగ్గరకు వచ్చాడు.
భయం వెయ్యలేదు నీకు. నందు పెద్దగా పట్టించుకోకపోయినా సరే. వచ్చినవాడు పక్కనించి నడుస్తూ ఈల వేస్తూ థర్టీఫైవ్ అన్నాడు. కోపం కన్నా ఆశ్చర్యం నీకు. అయినా కోపంగానే చూశావు. నందు పట్టించుకోకపోవడం తెలుస్తూనే వుంది. వచ్చినవాడు నవ్వి – ఎండ్ థర్టీఫోర్ ఆల్సో అన్నాడు అసహ్యంగా నవ్వుతూ. నందు ఎప్పుడు లేచాడో తెలియదు. ఎప్పుడు వాణ్ణి రెండు చేతులతో అమాంతంగా ఎత్తి విసిరేశాడో తెలియదు. నీకు అతను చేసిన కామెంట్ అర్థం అయ్యేలోపు అతను తొమ్మిదడుగుల దూరంలో పడి వున్నాడు.
ఒక ఎద్దు తన కొమ్ములతో ఎత్తిపడేసినట్లు! లేచిపైకెత్తిసిరేయడం. అంతా ఒకేసారి!
మళ్ళీ తన కుర్చీలో స్థిరంగా నందు.
“ఎందుకలా రియాక్ట్ అయ్యావు? ఇప్పుడేమైందని?” అన్నావు నువ్వు. నింపాదిగా కేరెట్ ని నమిలాడు తప్ప సమాధానం ఇవ్వలేదు.
“తాగున్నాడు. ఏదో కాప్లిమెంట్ అనుకోని…” ఉరిమి చూశాడు. అంతే, నీ మాటలు ఆగిపోయాయి.
“పద” అని మాత్రం అంటూ తన మొబైల్ అందుకోని లేచి నిలబడ్డాడు. చుట్టూ చూశావు తప్ప లేవలేదు నువ్వు. అతను నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. నీ హ్యాండ్ బ్యాగ్ అందుకోని, ఒకసారి కింద పడిన అతని వైపు చూసి, చిత్రంగా చూస్తున్న అందరి వైపు చూసుకుంటూ బయటికి వచ్చే సరికి వాలేలో వున్న కారుని తెప్పించి, డ్రైవింగ్ సీట్లో వున్నాడతను. వెళ్ళిపోయి వుండచ్చు, కాని నిన్ను వదిలేసి వెళ్ళడతను.
కారు ఏక్సిలేటర్ రైజ్ చేస్తుంటే వస్తున్న శబ్దం కోపంతో వున్న ఎద్దు వదులుతున్న బుసలా ధ్వనించింది.
నువ్వు పక్కన కూర్చోగానే దూసుకెళ్ళింది కారు.
అతను సారీ చెప్తాడేమోనని చూశావు. నువ్వు సారీ చెప్తావని అతను ఎదురుచూస్తున్నట్లు అనిపించింది నీకు. అనిపించినా చెప్పాలనిపించలేదు. నీ తప్పేం లేదు – నీ దృష్టిలో. అతని తప్పేంలేదు – అతని దృష్టిలో. మాట్లాడటం మానేశాడు. నాలుగు రోజులు మాటల్లేవు. ఐదో రోజు అతని మాటలు మాత్రమే లేవు. ఆరో రోజు నుంచి మాట్లాడాడు కానీ మళ్ళీ నీతో బయటికి రాలేదు. ఈ రోజుకి కూడా. రాడు. అంతే. ఒకసారి నిర్ణయించాడంటే అది అలాగే జరిగితీరుతుంది. జరిగితీరాలి.
ఏదైనా ఇటాలియన్ తినాలని వుంది అనే తెలివైన ప్రతిపాదన చేశావు. బయిటికి తీస్కెల్తాడేమో అని. మర్నాడు అతనే వండిపెట్టాడు. వంట చాలా బాగా చేస్తాడు కాబట్టి, నీకు అతనితో పెద్దగా బయట తిరగాలన్న ఆశ కూడా లేదు కాబట్టి అలాగే కొన్ని వారాలు కొనసాగింది. ఆ తరువాత సడలింపు.
“నువ్వు కావాలంటే బయటికి వెళ్లి నీకు కావాల్సింది తిను. నేను మాత్రం రాను.”
ఆగాగు. గమనించావా? అప్పుడెప్పుడో ఆ గొడవ జరిగినప్పుడు నిన్ను బయటి వెళ్లనివ్వకుండా వుంచడానికి వండి పెట్టాడు. మళ్లీ ఈ మధ్య, నాలుగైదు రోజుల నుంచి మళ్లీ వండుతున్నాడు. కారణం? మళ్లీ ఇల్లు దాటద్దని ప్రకటిస్తున్నాడా? అతనికి నీకూ నందుకి మధ్య నడుస్తున్నదేంటో తెలిసిపోయిందా?
వంట అతని హాబీ. అంత మాత్రానికే అతనికి తెలిసిపోయిందని చెప్పలేం. కానీ ఆ వండటంలో, వండినది వడ్డించడంలో, వడ్డించేటప్పుడు నవ్వే చిరునవ్వులో… ఓ మైగాడ్. దట్ స్కేరీ స్మైల్… నువ్వే అన్నావు అలా. కారణం లేని నవ్వు. కప్పిపుచ్చే నవ్వు. కళ్ళలోకి సూటిగా చూస్తూ నాకు తెలుసులే అని ప్రకటించే నవ్వు. అది చాలు.
తెలిసిపోయిందా?
తెలిసిపోయింది! అనుమానం లేదు.
ఎవరో తాగి కామెంట్ చేశాడని ఎత్తి విసిరేసిన నందుకి, తన భార్యకి ఒక బాయ్ ఫ్రెండ్ వున్నాడని తెలిసిపోయింది. ఏమీ జరగనట్టుగానే తెలిసిపోయింది. ఏమీ జరగనట్టుగానే వుండిపోయాడు. ఆ కోపం ఏమైందని కదూ నీ అనుమానం. పిచ్చి నియతీ, కోపం నీ మీద ఎప్పుడైనా ప్రదర్శించాడా అతను? నీతో మొండికేస్తాడు. అంతే. అతని కోపం అంతా ఇతరుల మీదే. అంటే ఇప్పుడు శశాంక్ ని…! ఓ మైగాడ్! చంపేసినా చంపేస్తాడు. తన నేలని కబ్జా చేసిన వాళ్ళనే వదలలేదు. తన భార్యని కబ్జా చేసినవాడిని వదులుతాడా?
అనవసరంగా ఆలోచిస్తున్నావు నియతీ. నందుకి ఏం తెలిసిపోయిందని అనుకుంటున్నావు?
అఫైర్ వుందని అనుమానమా? లేక శశాంక్‍తో అఫైర్ అని అర్థమైపోయిందా? ఎలా తెలుస్తుంది? నో. ఇదంతా నీ పిచ్చి అనుమానం కావచ్చు. బట్ ఒకవేళ తెలిసిపోయి వుంటే? ఏదో ఒకరోజు నిన్ను నిలదీసి అడిగితే?
నాకేం తెలియదు. ఇదంతా నీ భ్రమ! అంటావా?
అతని అలిగేషన్ ఏదైనా సరే తిరస్కరించడమే మార్గం.
“నీకు తెలిసిందంతా అబద్ధం. ఎవరో గిట్టని వాళ్ళు పుట్టించిన ప్రచారం. నీ హోదా చూసి, నిన్ను బిజినెస్ లో దెబ్బకొట్టలేక నీ మనసుని పాడు చెయ్యాలని ఇదంతా చేస్తున్నారు.”
అనుకోడానికి నీకు బాగానే వుంది. కానీ నిలబడుతుందా? నందు ముందు?
ఎందుకు నిలబడదు. నువ్వు చెప్పింది అబద్దం అనాలంటే అతని దగ్గర నిజం వుండాలి. ఏదో ఆధారం వుండాలి. ఒక వేళ వుందేమో? నందు దగ్గర ఏ ఆధారం వుండే అవకాశం వుంది? కిట్టీపార్టీ అని ఒకసారి. ఫ్రెండ్ బర్త్ డే అని ఒకసారి. పెయింటింగ్ క్లాసెస్ లో చేరతానని మరోసారి. షాపింగ్ అని ఇంకోసారి…
శశాంక్ భార్య రేఖ డెలివరీకి వెళ్ళింది కాబట్టి కలిసినదంతా అతని ఇంట్లోనే. ఒకసారి నువ్వు బలవంతం చేస్తే సినిమాకి వచ్చాడు. ఆ తరువాత కలిసి వర్షంలో నడక. అంతే! కాదు కాదు. గుర్తొచ్చింది. మూడు రోజులు వైజాగ్ టూర్. మాధవి పెళ్ళని నువ్వు, బిజినెస్ ట్రిప్ అని అతను. విడివిడిగా వెళ్ళారు. విడివిడిగా వచ్చారు. కలిసున్నదంతా అక్కడ రిసార్ట్ లోనే. ఇవన్నీ నందుకి తెలిసే అవకాశమే లేదు. ప్రైవేట్ డిటెక్టివ్ ని పెట్టి కూపీ లాగితే తప్ప.
కాబట్టి అతని అనుమానాలన్నీ అబద్దాలని వాదించడం చాలా సులభం. బుకాయించడమే సరైన పరిష్కారం. అది కూడా అతనంతట అతనే అడిగితే.
ఒకవేళ మాధవితో మాట్లాడి వుంటే? ఎందుకు మాట్లాడతాడు? ఆమె ఎవరో కూడా తెలియదే! ఏమో నువ్వు స్నానం చేస్తున్నప్పుడు మాధవి ఫోన్ చేస్తే అతనే లిఫ్ట్ చేసి…! ఓ మైగాడ్! ఛ ఛ అనవసరమైన అనుమానాలు. వాటికి తోడుగా ఊహలు.
కాదేమో! రెండు మూడుసార్లు నీ మొబైల్ అతని చేతిలో చూశావు. గుర్తుందా? ఒకవేళ అతను నీ మొబైల్ ఓపెన్చేసి… ఎందుకలా భయపడతావు? అనలాక్ పిన్ తెలియాలికదా… తెలుసు! అతనికి తెలుసు! జీరో ఫైవ్ జీరో సిక్స్. నీబర్త్ డే!!!
ఏ అర్థరాత్రో నీకు మెలకువ వచ్చినప్పుడు అతను బెడ్ మీద కూర్చోని దీర్ఘంగా ఆలోచించడం! బిజినెస్ టెన్షన్ అనుకున్నావు. దాదాపు కంపెనీ మూతపడే పరిస్థితిలో కూడా అతను నిద్రని వదులుకోలేదు. గమనించావా? నాలుగైదు నెలల నుంచే ఇలా!
తెలిసిపోయింది. ఖచ్చితంగా తెలిసిపోయింది. నీ మొబైల్ అతని చేతిలో వుందంటే నీ చరిత్ర మొత్తం అతని చేతుల్లోకి చేర్చినట్లే.
నాలుగైదునెలలుగా అతని ప్రవర్తన గుర్తు చేసుకో నియతీ… అందులో అడుగడుగు జాగ్రత్తగా పరిశీలించు.
దాదాపు అంతే కాలంగా శారీరికంగా కలిసింది లేదు. దగ్గరగా రమ్మంటాడు. గట్టిగా హత్తుకొని పడుకుంటాడు. నువ్వు చొరవ తీసుకున్నా అతను ముందుకు వెళ్ళనివ్వలేదు.
హత్తుకొని పడుకున్నాడా? పట్టుకొని పడుకున్నాడా?
ఇంకా అర్థం కాలేదా? నువ్వు అతనిని వదిలి వెళ్ళకూడదన్న ఆజ్ఞ బలమైన చేతులుగా నిన్ను చుట్టుకున్నాయి నియతీ!
సుస్థిరం అతనికి ఇష్టమైన పదం. మొండితనం స్వభావం. బలం అతని శారీరిక లక్షణం.
అనుమానమేలేదు! అతనికి అనుమానం కలిగింది. బహుశా అనుమానం తీరిపోయి అదే నిజమని నిర్ధారణ కూడా జరిగిపోయి వుండచ్చు.
ఇప్పుడు చెప్పు. నాకేం తెలియదు అని తిరస్కరించాలా? బుకాయించగలవా?
అవును. అదే కరెక్ట్. ఇప్పుడు నిండా మునిగావు. ఇంక చలెక్కడుంది? అతనికి తెలిసిపోయింది.
నువ్వు నవ్వుతూ “ఛ ఆపండి మీరు మీ అనుమానాలు” అంటావు. అక్కడితో అయిపోతుంది.
అయిపోతుందా? అతను ఆధారాలు చూపిస్తాడు. ఏం చూపిస్తాడు? అతని దగ్గర ఏ ఆధారం వుండచ్చు? గుర్తుచేసుకో నియతీ, అతనికి ఏ ఆధారాన్ని ఇచ్చావు? అతనికి అనుమానం వచ్చేలా ఎప్పుడైనా ప్రవర్తించావా? గత నాలుగైదునెలలుగా, శశాంక్ మళ్ళీ నీ జివితంలోకి వచ్చిన తరువాత నీలో వచ్చిన మార్పులేంటి?
ఆనందం. సంతోషం. ఎలా బ్రతకాలని అనుకుంటున్నావో, అలా బ్రతకడం. అంటే అంతకు ముందు అలా లేవా? ఉన్నావేమో. లేవేమో. అప్పుడు కూడా సంతోషం వుంది. స్థిరంగా ఆలోచించే భర్త, నీ చపలచిత్తానికి సరైన జోడి అనుకున్నావు. రేపటి గురించి ఆలోచించే మనిషి అతను. సంపాదన? – ఆశించినదానికన్నా ఎక్కువ. ఇల్లు? – పెద్ద బంగళా. కానీ నువ్వు కోరుకున్న కలల సౌధం కాదు.
నీ పదిహేనో ఏట బాబాయి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు అనిపించింది – పెద్దైయ్యాక ఒక ఇల్లు కావాలని. అప్పటి నుంచి పదేళ్ళు నీ కలల్లో ఒక ఇల్లు కడుతూనే వున్నావు. ఒకసారి పెద్దగార్డెన్ వున్న ఇల్లు. కొన్నాళ్ళకి అది కూల్చేసి మండువా లోగిలి… అపార్ట్మెంట్ అయితే చాలా మంది మనుషుల మధ్య, చిన్నపాక అయితే? బయటికి అలా, లోపల మాత్రం ఏసీ వుండాలి, అన్నీ వుండాలి.
పెళ్ళైన వారానికి “పద” అనే ఒక్కమాటతో నిన్ను లాకెళ్ళాడు. బంగ్లా చూపించాడు. థ్రిల్ అయ్యావు. కానీ నిన్ను అడగలేదే అని లోపల ఎక్కడో… రంగురంగుల గోడలు వుండాలని నీకు… వైట్ అతను కోరుకున్నాడు. సంతోషం లేదా? వుంది. వుందా? లేదు.
శశాంక్ కనపడకపోతే ఇదే సంతోషం అనుకోని గడిపేసే దానివేమో! కానీ కనపడ్డాడు. అప్పుడు నీ సంతోషం సంతోషం కాకుండాపోయింది.
ఒకవేళ అదంతా నీ ప్రవర్తనలో, మాటలలో ఎక్కడైనా బయటపడిందా? ఆలోచించు నియతీ ఆలోచించు. శశాంక్ కలవడం వల్ల నీలో వచ్చిన మార్పులేంటి?
నువ్వు వేసుకునే డ్రస్లు మారిపోయాయి. నువ్వు అలంకరించుకునే విధానం మారిపోయింది. అతనికి ఇష్టమైన నెమలినీలం నుంచి నీకు ఇష్టమైన పింక్, రెడ్లోకి మారినప్పుడు ఏమైనా గమనించాడా? అతనంతగా ఇష్టపడని వెస్ట్రన్ వేసుకున్నప్పుడు ఆ మార్పుని గుర్తించాడా? అద్దం ముందు నిలబడి లిప్ స్టిక్ వేసుకుంటున్నప్పుడు – నందు ఎక్కడో ఒక చురక వేశాడు. పరధ్యానంలో గమనించలేదు నువ్వు.
“నువ్వెళ్లేది కిట్టీ పార్టీకేనా” అన్నాడు.
అతను ఆ ఒక్కమాట అన్నాడు అంటే లోపల ఎక్కడో నెలల తరబడి గమనించి, దాన్ని విశ్లేషించి నిర్థారించుకున్న నిజం ఆధారంగా ఒక నిర్ణయానికి వచ్చి వుంటాడు. లేకపోతే అలా నోరు జారడు. తెలిసిపోయింది! శశాంక్ రాకతో నీ పున్నమి చంద్రుడి పై నుంచి మబ్బుతెరలు పక్కకి తప్పుకున్న విషయం నందుకి కనపడిపోయింది.
నువ్వు పింక్ లాంగ్ ఫ్రాక్ వేసుకున్నప్పుడు కన్నార్పకుండా చూశాడు. అతను ఇంటికి వచ్చేలోపు వచ్చేద్దామని వెళ్ళావు. శశాంక్ వెళ్ళనివ్వలేదు. నువ్వు వచ్చేసరికి ఇంట్లో నందు. అప్పుడు చూశాడు అలా కన్నార్పకుండా. చాలాసేపు.
నువ్వు ఇలాంటి డ్రస్లు కూడా వేస్తున్నావా ఈ మధ్య?
ఆ ప్రశ్న బరువు ఎంతో తెలుసా? ఆ ప్రశ్న లోతు ఎంతో తెలుసా? తెలిసే అన్నాడా? తెలిసి అన్నట్లు నీకు అర్థం కావటం లేదా? మామూలు సందర్భం అయితే ’వెళ్ళి చీర కట్టుకో’ అని ముగించాల్సిన వాక్యం. అతను అనలేదు. ఓ మైగాడ్!
ఇంకా వున్నాయా ఇలాంటివి? ఆలోచించుకో!
అవసరానికి మించి చనువుగా వుండటానికి ప్రయత్నించడం. అవసరం లేకపోయినా చిరునవ్వులు చిందించడం. ఆ నవ్వులో ఎక్కడో దాగి వున్న కోపం. నీకు భయం వేసే నవ్వు. అదే నిదర్శనం.
ఇప్పుడేం చేస్తావు?
నాకేం తెలియదు. ఇదంతా అబద్ధం. బూటకం. నీ ఊహ. భ్రమ.
అనగలవా నువ్వు? అనగలవా?
అంతకన్నా ఏం చెయ్యగలవులే! కళ్ళ ముందు కనపడ్డ నిజమైనా నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి అని చెప్పి తప్పించుకోవచ్చు. అతను నమ్మితే. నమ్ముతాడనే అనుకుంటున్నావా? అతని దగ్గర ఏదో ఆధారం వుంది. బలమైన ఆధారం. ఒకవేళ లేకపోయుండచ్చు కూడా. లేదనే అనుకో నువ్వు. ఎందుకంటే ఆధారం వుంటే ఈ పాటికి నిలదీసేవాడు. నిలువునా చీరేసేవాడు. భయాన్ని, అవమానాన్ని అంచలంచెలుగా నీ మీదకు దూసేవాడు. నిన్ను మనిషిగా మిగిల్చినా లోపల నుంచి దగ్ధం చేసేవాడు.
నీ కాలేజీ ఫ్రెండ్స్ రీయూనియన్ కి వెళ్ళిన రోజు గుర్తుందా? శశాంక్ వస్తాడనుకోని వెళ్ళావు. నందుని రమ్మని నువ్వే పిలిచావు. పిలిస్తే కదలడుకదా?
చంద్రిక ఇంటికి డిన్నర్ వెళ్దామంటే వాళ్ళింట్లో వుండే కుర్చీలలో కంఫర్ట్ వుండదు వద్దన్నవాడు. ఇష్టం లేకపోతే అటు కాలు ఇటు కదపనివాడు నందు. నువ్వు పిలిస్తే నీ కాలేజి గెట్టుగెదర్కి ఎలా వస్తాడు? ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద, ఒక కుర్చీని ఎన్నుకుంటే ఆ కుర్చీ మీద కదలకుండా వుండగలిగినవాడు. నీకు ఎంత కోపమైనా రానీ. నువ్వు మానుకోవాల్సిందే. సురభి నాటకం వదులుకున్నావు చూడు అలా. అర్థరాత్రి దోసెల బండి దగ్గరికి వెళ్ళాలన్న కోరికని చంపుకున్నావు చూడు అలా. ప్లానిటోరియంలో గ్రహణం సందర్భంగా వేసిన స్పెషల్ షోకి వచ్చి లోపలికి రానన్న నందు కోసం నువ్వు కూడా వెనక్కి తిరిగావు చూడు అలా. కానీ నీకు మాత్రం కాలేజి రీయూనియన్ కి వెళ్ళాలనివుంది. బ్రతిమిలాడావు. ప్రాధేయపడ్డావు. అయిష్టంగా ఊపిన తల కోసం ఊపిరి ఆపినంతగా విలవిలలాడాడు నందు. నీతో వచ్చాడు.
డిన్నర్ టేబుల్ దగ్గర అతని చేతిలో మెనూ లాక్కొని – ఆయన కన్నా నేనే బాగా ఆర్డర్ ఇస్తాను. ఆయనకేం తెలియదు చూడండి ఆ టై ఎలా కట్టుకున్నాడో అన్నావు. ఏదో నీ సంసారంలో నీదే పై చెయ్యి అని నిరూపించే ప్రయత్నమేమో తెలియదు. అనాలని అనలేదు. అన్న తరువాత ఇక వెనక్కి వచ్చేమాట కాదు. నందు లేచాడు. ఆశ్చర్యంలో నువ్వు మునిగితేలేలోపు – “ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, బట్ వీ హావ్ టు గో. నేను నియతితో మాట్లాడాల్సింది చాలా వుంది. మేమిద్దరం ప్రేమగా మాట్లాడుకోని చాలా రోజులైంది అనిపించింది సడన్ గా”. అతను కోట్ అందుకున్నాడంటే, నువ్వు నీ హ్యాండ్ బ్యాగ్ అందుకోవాల్సిందే అని నీకు తెలుసు. ఆ హోటల్ ఫ్లోర్ నిన్ను మింగేస్తే బాగుండు అని అనుకుంటూ నడిచావు బయటికి.
ఇలాంటి విషయాలకే ఇంత కఠినంగా వుండగలిగినవాడు శశాంక్ విషయం నిజంగానే తెలిసుంటే! అతని కోపాన్ని ఎందుకు ఆపుకుంటున్నాడు? అది ఏదో ఒకరోజు బ్రద్దలై నిన్ను ముంచేస్తుంది. అలాంటి నందు ముందు నిలబడి అసలేం జరగలేదని బుకాయిస్తావా? చెయ్యగలవా?
అతను మొండికేస్తాడు. ఏమంటాడు?
నీకు ఎవరితోనో ఎఫైర్ వుందంటాడా? శశాంక్ తో ఎందుకు ఎఫైర్ పెట్టుకున్నావంటాడా? నీకు నా పైన ఇంటరస్ట్ ఎందుకు చచ్చిపోయిందని అడుగుతాడా? ఏది అతని కంప్లైంట్ అయ్యే అవకాశం వుంది? అతనికి ఎంత వరకు తెలుసు అన్నదాని మీద ఆధారపడి వుంటుంది. అవునా?
నీ మీద అనుమానం వుండి, నీకు ఎవరితోనో ఎఫర్ వుంది అని తెలిస్తే నందు అడిగే ప్రశ్నలు వేరు. శశాంక్ అనే వ్యక్తితో నీకు సంబంధం వుందని తెలిస్తే అప్పుడు అతను అడిగే ప్రశ్నలు వేరు. నువ్వు సమాధానం ముందుగా అనుకోని సిద్ధపడి వుండాలంటే, అతను అడగబోయే ప్రశ్న ఏమిటో ఊహించగలగాలి. అది ఊహించాలంటే అతనికి ఏ నిజం తెలుసో, ఎంత వరకు తెలుసో తెలియాలి.
అతనికి ఎంత వరకు తెలుసో తెలియదే? ఇప్పుడు ఏ సమాధానంతో సిద్ధపడతావు. నేనేం తప్పు చెయ్యలేదని ఎలా బుకాయిస్తావు? ఒకవేళ అతనిది కేవలం అనుమానమే అయితే? ఇప్పుడు అది నిజమని అతనికి నిరూపించి మరీ నాకేం తెలియదు అని చెప్పినట్లు అవుతుందేమో. ఎందుకలా చెయ్యాలి? పోనీ చెప్పకుండా మొదట అనుకున్నట్లు ఇలాగే కొనసాగిస్తే? ఎప్పటికైనా తెలియకపోతుందా?
అవును ఎప్పటికైనా తెలియకపోతుందా? తెలియకుండా ఏమీ వుండదు. తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ ఇదే డైలమాలోకి రాక తప్పదు. దానికన్నా నిజం అతనికి తెలిసేట్టు చెప్పేసి ఆ తరువాత పర్యవసానాన్ని భరించడమే మేలేమో? ఆలోచించుకో నియతీ.
ఇష్టంలేని బంధాన్ని, తెగిపోవడానికి సిద్ధంగా వున్న దారాన్ని ఇంకా లాగడం అనవసరం కదా? ఒకసారి నిజం చెప్పేస్తే నీకు ఇష్టమైనట్లు ఉండచ్చు.
చెప్పేయ్!
డియర్ నందు, శశాంక్ అని మా కాలేజ్ మేట్, అతనితో నాకు శారీరిక సంబంధం వుంది.
ఎవరో వచ్చి నీకు చెప్పడం కన్నా, నా అంతట నేనే నీకు చెప్పేస్తే మేలు అని చెప్పేస్తున్నా.
అంతేనా? చెప్పేసిన తరువాత? నందు ఏం చేస్తాడు? ఎలా రియాక్ట్ అవుతాడు? ముఖ్యంగా ఆ తరువాత నువ్వు ఏం చెప్తావు? క్షమించమని అడుగుతావా? నువ్వు ఏ తప్పు చెయ్యలేదని కదా నీ వాదన? మరి క్షమించమని ఎందుకు అడగాలి? మరి ఇంకేం చేస్తావు?
(ఇంకా వుంది)
Add comment