‘రాయలసీమ నా భౌతిక జీవితానికి కేంద్రం’

‘రాయలసీమ : సమాజం – సాహిత్యం’ పుస్తకం ద్వారా వ్యాసకర్తగా మన ముందుకు వస్తున్నాడు బండి నారాయణస్వామి.

నీళ్లు! నీళ్లు!! నీళ్లు!!!

ఇదే మన ప్రాథమ్యం.

ఏ ఉద్యమమైనా నీటి ప్రాతిపదికగా మాత్రమే చేద్దాం.

రాజధానిని నిర్మించుకోవచ్చు.

కానీ ; నీళ్లను నిర్మించుకోలేం.

 రాయలసీమ నిర్దిష్టతని సృజనాత్మక సాహిత్యంగా మలుస్తున్న ప్రాతినిధ్య రచయితల్లో బండి నారాయణస్వామి అగ్రగామి. కథకుడిగా నవలాకారుడిగా స్వామి స్వరం విలక్షణమైంది. సీమ మట్టి పొరల్లోంచి దళిత – బహుజన వాదాన్ని బలంగా వినిపించిన రచయితా నారాయణ స్వామి యిప్పుడు ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో రాజకీయ – సామాజిక – ఆర్ధిక రంగాల్లో అన్యాయానికి గురౌతున్న తన నేల చరిత్ర లోతుల్లోకి చూపు సారిస్తున్నాడు. ఎదారిన రాయలసీమ ప్రజల గొంతు తడిపే నీటి చుక్కల్ని వొడిసిపట్టే ప్రయత్నంలో కొత్త ఆలోచనలు, ప్రతిపాదనలు, సూత్రీకరణలు చేస్తున్నాడు. రాయలసీమ సాహిత్యంలోనూ సాహిత్య విమర్శలోనూ ఖాళీల్ని గుర్తించి పూరించే పనికి పూనుకున్నాడు. తెలంగాణ స్ఫూర్తితో రాయలసీమ సమాజం వేయాల్సిన కొత్త అడుగుల గురించి, రాజకీయ పరిష్కారాల గురించి నిశితంగా అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలో ‘రాయలసీమ : సమాజం – సాహిత్యం’ పుస్తకం ద్వారా వ్యాసకర్తగా మన ముందుకు వస్తున్నాడు. Perspectives ప్రచురణలో త్వరలో విడుదల కానున్న ఆ పుస్తకం కోసం బండి నారాయణస్వామితో ఏ. కె. ప్రభాకర్ చేసిన సంభాషణ    

 రాయలసీమ రెండు దఫాలుగా మోసపోయిందని చెబుతారు. ముందు 53లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, తర్వాత విశాలాంధ్ర నినాదంతో 56లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పుడు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మూడోసారి మోసపోకుండా వుండాలనే ఆలోచన మొదలైందా? మొదలైతే అది ఏ రూపం తీసుకుంటోంది? తీసుకోవాలని మీరు, మీలాంటి రచయితలు ఆలోచిస్తున్నారా?

తెలంగాణ విభజనకు పూర్వమూ, విభజన తరువాత అన్న క్రమంలోనే రాయలసీమ చైతన్యం గురించి మాట్లాడవలసి వుంటుంది. 1972 జై ఆంధ్ర ఉద్యమంలో ఈ రాయలసీమ చైతన్యం లేదు. సమైక్యాంధ్ర ఉద్యమంలోనే రాయలసీమ చైతన్యం వెలుగు చూసింది. రాయలసీమ భావన వ్యాప్తి చెందే క్రమంలో అది ఎప్పుడు ఏ రూపం తీసుకుంటుందో ఎవరు చెప్పగలరు?

అనంతపురం నుంచి శాంతినారాయణ, ఉప్పరపాటి వెంకటేశులు, సడ్లపల్లి, స్వామి, కర్నూలు నుంచి వెంకటకృష్ణ, సుభాషిణి, హరికిషన్‌, ఉమా మహేశ్వర్‌, కడప నుండి తవ్వా ఓబుల్‌రెడ్డి, దాదా ఖలందర్‌ వంటి రచయితలు రాయలసీమ గురించి రాస్తున్నారు. ఆలోచిస్తున్నారు. మల్లెల నరసింహమూర్తి, రాధేయ వంటి సీనియర్‌ కవులతోపాటు వందమంది వర్ధమాన కవులు తమ ధిక్కారపు గొంతులు వినిపిస్తున్నారు. కానీ అరవై డెబ్భై పైబడిన కొందరు సీనియర్‌ రచయితలు మాత్రం కౌరవసభలో భీష్ముని మాదిరి నోరు నొక్కుకుని కూర్చున్నారు.

 • తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాయలసీమ నీటి సమస్యలో స్వభావపరంగా ప్రత్యేకమైన మార్పులు వచ్చాయా? సీమ నీటిసమస్య ప్రాంతాల మధ్య వైరుధ్యంగా కాకుండా రాష్ట్రాల మధ్య తగాదాగా మారే అవకాశముందా? ఉంటే దానికి పరిష్కారాలేంటి?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిం తరువాత తెలంగాణ ఇంజనీరు స్వర్గీయ విద్యాసాగర్‌రావు ఒక మాట అని వున్నారు- తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకుంటామనీ, అందువల్ల రాయలసీమ ఎడారి కాక తప్పదనీ! రాష్ట్రాల మధ్యా ప్రాంతాల మధ్యా నీళ్ల తగాదాలు ఎప్పుడూ వుంటాయి గానీ వాటికి పరిష్కారాలు వుండకుండా పోవు.

 • భాష, సంస్కృతి, ఆర్థిక రాజకీయ రంగాల్లో ఏ రంగం రాయలసీమ అణచి వేతకు, ఆధిపత్య రాజకీయాలకూ ఎక్కువగా గురైందని మీరు భావిస్తారు?

అన్ని రంగాల్లోనూ అణచివేతకు గురైంది. ఇక్కడి నాయకులు పార్టీలకు ప్రాతినిధ్యం వహించేవారే కానీ, సీమ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేవారుకారు. వారు రాయలసీమ కోసం గొంతెత్తలేరు. వారు వారి పార్టీల నియంతృత్వం కింద అణచివేయబడినారు.

 • తెలంగాణ భాషా సంస్కృతులు హేళనకు గురైనంతగా రాయలసీమ భాషా సంస్కృతులు హేళనకు గురి కాలేదని భావించడం సరైనదేనా? లేదా ఆ వివక్షపై రచయితలు, మేధావులు ఎక్కువ దృష్టి సారించలేదా?

సరైనదే! కానీ పోలికలతో ఎక్కువ తక్కువలు వున్నంత మాత్రాన రాయల సీమకు దాని భాషాసమస్యలు దానికి వున్నాయి.

 • రాయలసీమ అనగానే కరువులు, ఫ్యాక్షనిజం గుర్తుకు వచ్చేంతగా సీమ సాహిత్యం ఒక ముద్ర వేసింది. సీమ అస్తిత్వం అదేనా? అందుకు భిన్నమైన అస్తిత్వం లేదా?

కరువు మాకు కన్నతల్లి! ఫ్యాక్షనిజవ్‌ు సవతి తల్లి!! అంటాడొక రాయలసీమ కవి. కరువు కక్షలలో మార్పు వస్తే తప్ప, మీరు చెప్పినట్లు రాయలసీమ భిన్న అస్తిత్వం సంతరించుకోదు. నూటికి డెబ్భై శాతంగా వున్న కరువు రైతులను మినహా యిస్తే, రాయలసీమకు వేరే అస్తిత్వం ఏముంటుంది?

 • ఒక సినిమాలో సీమలో ప్రేమలకు తావులేదు వంటి డైలాగ్‌ వుంది. ఫ్యాక్షన్‌ హింసతో కూడిన విలనీకి రాయలసీమని పర్యాయపదం చేసిన సిన్మా పెట్టుబడుల దుర్మార్గంపై రావలసినంత వ్యతిరేకత రాలేదు?

సమాజంలో అతి బాధ్యతారహితమైన రంగాలు రెండు. ఒకటి సినిమా, రెండు రాజకీయాలు. ఫ్యాక్షన్‌ హింస రాయలసీమ ప్రజల డిఎన్‌ఎలోనే వుందా? అనే సందేహం సృష్టించిపెట్టే వరకూ తెలుగు సినిమా ప్రయాణించింది. రాయల సీమ యువకులు సోషల్‌ మీడియాలో ఈ సినిమాలను బాగానే ఎండగట్టు తున్నారు.

 • సీమలో ఫ్యాక్షనిజానికి మూలాలు పాలెగాళ్ల వ్యవస్థలో వున్నాయని చెప్పొచ్చా? లేక అది ఈనాటి భూస్వామ్య రాజకీయాల వికృతరూపమా? లేదా ఆధిపత్య కులాలు మొత్తం సమాజం మీద తమ అధికారాన్ని సడలకుండా చేసుకునే వ్యూహమా? దీన్ని మీరెలా చూస్తారు?

ఫ్యాక్షనిజానికి మూలాలు అమర నాయకుల నుండి కొనసాగుతూ వస్తున్నాయి, కాకపోతే రూపాలు మార్చుకుంటూ. అది చరిత్ర. కానీ ఆధునిక వ్యవస్థలో భూస్వామ్య రాజకీయాలు మాఫియా రూపం తీసుకున్నాయి. భూస్వామ్యం రూపాలు మార్చుకున్నా అందులోకి కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు తప్ప ఇతర సామాజిక వర్గాలేవీ రాలేదు. భూస్వామ్య వ్యవస్థలోనూ ఆ రెండు సామాజిక వర్గాలే! అప్పుడు వారికి కులమే వనరు. మాఫియా వ్యవస్థలోనూ ఆ సామాజిక వర్గాలే! మాఫియావ్యవస్థలో వారి ప్రధాన వనరు డబ్బు. ఆధిపత్య కులాల దగ్గరే సమాజాన్ని శాసించే డబ్బు వుంటుంది. అదే ఇప్పుడు మన ప్రజా స్వామ్యాన్ని పరిపాలిస్తూ వుంది.

 • నాలుగు జిల్లాలు, 400 టీఎంసీల నీళ్లు. ఈ ఒక్క నినాదం ప్రత్యేక రాయల సీమకో అభివృద్ధి రాయలసీమకో చాలా?

ఒక ప్రాంతంలో కనీసం 1/3వ భాగం ఇరిగేషన్‌ కిందికి వస్తే తప్ప అక్కడి ప్రాంతం మనుషులు జీవించడానికి అనువైన ప్రాంతం కాదు. ఇది ఎప్పుడో యాభై ఏండ్ల కిందట భారత ప్రభుత్వ వ్యవసాయ శాఖ కమీషన్‌ సిద్ధాంతీకరించిన మాట. 400 టీఎంసీలు రాయలసీమ ప్రజలకు కనీసం జీవించే హక్కును కలుగజేస్తాయి. అంతే! అది మాత్రమే అభివృద్ధి కాదు. మన సోకాల్డ్‌ కమ్యూనిస్టులు కొందరు నీళ్లను మినహాయించిన అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. వారిది దొంగ భాష. నీళ్లను మినహాయించిన అభివృద్ధి వ్యవసాయదారులది కాదు, వ్యాపార వర్గాలది.

 • పరిశ్రమల ద్వారా రాయలసీమను రత్నాలసీమగా మారుస్తాం అన్న కొత్త రాజకీయ నినాదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

వారికి స్వాగతం. భూగర్భ ఖనిజాల లభ్యతలో రాయలసీమ ప్రాంతం దేశంలోనే రెండవది కదా! మరి పరిశ్రమలకు నీళ్ల మాటేమిటి?

 • పారిశ్రామిక అభివృద్ధి పేరున జరిగే సామాజిక పరిణామాల్ని, సాంస్కృతిక విధ్వంసాన్ని ఎలా చూడాలి? ఉదాహరణకి కియా కార్ల కంపెనీ. ఈ అభివృద్ధి ప్రయోజనాలు ఎవరికి దక్కుతున్నాయి?

పారిశ్రామిక అభివృద్ధి వల్ల వచ్చే సామాజిక పరిణామాలు, వ్యవసాయ అభివృద్ధి వల్ల వచ్చే సామాజిక పరిణామాలు వేరువేరుగానే వుంటాయి. జీవిక అవసరమైనప్పుడు ప్రజలు ఆ పరిణామాలకు తప్పకుండా సిద్ధపడతారు. ఇక్కడి భూమి, నీళ్లు, మానవవనరుల్ని కారుచౌకగా ఉపయోగించుకోవడానికి కియా కార్ల కంపెనీ వచ్చింది. ప్రజలకు (అది కూడా బీహారీ కార్మికులకు) అంతో ఇంతో జీవనోపాధి దక్కడం తప్ప, ఇక్కడి భూగర్భ ఖనిజాల ఆధారితం కాని విదేశీ కంపెనీలు దేశానికి సంపదను కొత్తగా సృష్టించి పెట్టలేవు. ప్రభుత్వాలు దొంగ ప్రభుత్వాలు కాకపోతే పరిశ్రమల వల్ల మరీ అంత దుష్పరిణామాలు ఏమీ వుండవు. కాబట్టి సమస్య పరిశ్రమలతో లేదు. ప్రభుత్వాలతో వుంది. ప్రస్తుతం కియా పరిశ్రమ చుట్టూ వాతావరణ కాలుష్యం పొంచి వుంది.

 • ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో పోరాడి సాధించుకునే ఫలితాలు ఆధిపత్యవర్గాల కులాలు చేతిలో కేంద్రీకృతం అయ్యే ప్రమాదం (తెలంగాణ నమూనాను దృష్టిలో వుంచుకుని) నుంచి ఎలా కాపాడుకోగలం?

ప్రాంతీయ అస్తిత్వ పోరాటం ఏ ప్రాంతంలో జరిగినా ఆ పోరాటాన్ని         ఉత్పత్తికులాలతో పాటు ఆధిపత్యకులాలు కూడా కలిసి చేస్తుంటాయి. రాజకీ యాల్లో వున్నట్లే ఉద్యమంలో కూడా ఆధిపత్య కులాలే ముందు భాగంలో వుంటాయి. వారికి వున్న వనరులు కూడా అటువంటివి. ఉద్యమం విజయవంత మైనప్పుడు దాని ఫలాలు కూడా ముందుభాగంలో వున్న ఆధిపత్యకులాల చేతుల్లోకే పోతాయి. ఇది అనివార్యంగా జరిగే క్రమం. అస్తిత్వ ఉద్యమాల్లో ఉత్పత్తి కులాలకు రాజ్యాధికార స్పృహ ఉండటం సహజమే! కానీ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం తరువాతనే వారి రాజ్యాధికార పోరాటం ఆచరణలోకి రావటానికి అవకాశ ముంటుంది.

 • తెలంగాణ రాష్ట్రోద్యమ కాలంలో ప్రత్యేక రాయలసీమ ప్రస్తావన వచ్చినప్పుడల్లా తెలంగాణ విద్యావంతులు, ఉద్యమ నాయకులు ఆ నినాదం తెలంగాణ ఆవిర్భావానికి ఆటంకం కలిగించడానికి సీమాంధ్ర నాయకుల ఎత్తుగడగా భావించడం జరిగింది. తెలంగాణ వాదాన్ని సమర్థించిన రాయలసీమ వాసులు ప్రత్యేక తెలంగాణకు విఫూతం కలగకూడదని, తమ ప్రజాస్వామిక ఆకాంక్షను అణచుకున్నారు. ఇది రాయలసీమ చైతన్యం వెనకతట్టు పట్టడానికి కారణమైందని భావించవచ్చా??

అట్లేం జరగలేదు. రాయలసీమ ఉద్యమం ఉధృతం కాలేకపోయింది. అంతే!

 • తరిమెల నాగిరెడ్డి వంటి కమ్యూనిస్టు మేధావుల అంతర్జాతీయ దృక్పథం వారిని సీమప్రాంతీయ అస్తిత్వానికి పూర్తి న్యాయం చేయనివ్వలేదు అని ఒకచోట వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

తరిమెల నాగిరెడ్డి అనంతపురం కరువుల గురించి కదిరిలో దీక్షలు చేసినా, ఆయన రాయలసీమ కరువుల్ని మొత్తం జాతీయ రాజకీయాల్లో భాగంగా మాత్రమే చూపినారు. పప్పూరు రామాచార్యులు, భుజంగరావు, టి. రామకృష్ణారెడ్డి వంటి వారు ప్రత్యేక రాయలసీమవైపు మాట్లాడుతుండగా నాగిరెడ్డిగారు ఆంధ్రరాష్ట్రంలో చేరిక గురించే మాట్లాడినారు. ఈ విధంగా ఆయన నమ్మిన సిద్ధాంతంలోని వైశాల్యం రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వానికి ఏమాత్రం న్యాయం చేయలేక పోయింది. ఆయన అవగాహనలో లోపం వుండొచ్చుగాని ఆయన నిజాయితీ మాత్రం శంకింపలేనిది. కోస్తా కమ్యూనిస్టులు ఇదే అంతర్జాతీయ దృక్పథాన్ని అడ్డుపెట్టుకుని మన కృష్ణా పెన్నార్‌ నీళ్లని ఏ విధంగా తమ ప్రాంతానికి తరలించుకు పోయిందీ అందరికీ తెలుసు.

 • తెలంగాణ ఉద్యమానికి అన్ని మావోయిస్టు పార్టీలతో సహ ఎం.ఎల్‌. పార్టీలు బహిరంగంగా మద్దతు నివ్వడం గమనించినప్పుడు ప్రాంతీయ నిర్దిష్టతపట్ల, ఉద్యమాల పట్ల కమ్యూనిస్టుల వైఖరి మారిందని తెలుస్తుంది కదా! అదేవిధంగా కులం గురించిన అవగాహనలో సైతం పార్టీలో విస్తృతంగా చర్చ జరగడం, భారతదేశంలో కుల వాస్తవికతను గుర్తించకుండా వర్గపోరాటాలు ముందుకు సాగవు అనే స్పృహ పెరగడం… ఇదంతా బడుగు కులాల వర్గాల ఐక్యపోరాటాల వైపు దారితీయడానికి దోహదం చేస్తుందని భావించవచ్చా?

ప్రాంతీయ నిర్దిష్టత పట్ల ఉద్యమాల పట్ల ఎం.ఎల్‌. పార్టీల ఆలోచనాధోరణి చాలా ఔచిత్యవంతంగా వుంది. కుల వాస్తవికతను వర్గపోరాటంలోకి ఒడిసిపట్టి దేశీయ మార్క్సిజవ్‌ు నిర్మించడానికి ఇంకా చాలా దూరమే ప్రయాణించవలసి వుంది.

 • బయటివాళ్ల రాజకీయ ఆధిపత్యాల్ని అటుంచితే, రాయలసీమ వెనుకబాటుకు స్థానిక రాజకీయ నాయకుల స్వార్ధపరత్వం కూడా కారణమే అని మీరు అంగీకరిస్తారా? నీటికోసం చేసే లాబీయింగ్‌ రాజకీయాల్లో సీమ నాలుగు జిల్లాల మధ్య చోటు చేసుకునే వైరుధ్యాల కారణంగా జరుగుతున్న అనర్థం ఏమిటి? దీనికి విరుగుడుగా వచ్చిన రాజకీయ చైతన్యం రాయలసీమ విమోచన సమితి వంటివి విశాల ప్రజాసమీకరణ దిశగా కొనసాగకపోవడానికి కారణాలేంటి?

అంగీకరించకపోవడం ఏమిటి? అది నీలం సంజీవరెడ్డి నుండి చంద్రబాబు వరకు కళ్లకు కనిపించే సత్యమే కదా? కోస్తాంధ్రలో రెండు జిల్లాలకు 400 టీఎంసీలు ఇచ్చి, రాయలసీమలో నాలుగు జిల్లాలకు కలిపి 100 టీఎంసీలు కూడా ఇవ్వడంలేదు. చెంచాడు నీళ్లిచ్చి పంచుకోమంటే, జిల్లాల మధ్య తగాదాలు, వైరుధ్యాలు రావా? ఈ తగాదాల్ని పెంచి పోషించి రాయలసీమ ప్రాంత ఏకత్వాన్ని దెబ్బతీసే రాజకీయ కుట్ర జరిగినా ఆశ్చర్యంలేదు. రాయలసీమ విమోచన సమితి గురించి రాయలసీమ పెద్దాయనను అడిగితేనే బాగుంటుంది.

 • కోస్తాంధ్ర భాషాధిపత్యాన్ని అధిగమించడానికి రాయలసీమ సాహిత్యకారులు తొలినాటి ‘సభా’ నుంచి ఏదో ఒక మేరకు ప్రయత్నిస్తూనే వున్నారు. భాషాపరమైన ఈ స్పృహకు ప్రత్యేకమైన కారణాలున్నాయా? తెలంగాణలో జరిగినట్టే ప్రాంతీయ అస్తిత్వ వేదనలో భాగంగా పరిణమించడంలో అది ఎందుకు విఫలమైంది?

కోస్తాంధ్రవారు రాయలసీమ భాషను అణగదొక్కడం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వున్నప్పటి నుంచి జరుగుతూ వుంది. అప్పటి నుండే వారు రాయలసీమ భాషను పాఠ్యపుస్తకాలకు దూరం చేస్తూ వచ్చినారు. కోస్తావారి ఈ భాషాధిపత్యాన్ని 1920-30ల నుంచే పప్పూరు రామాచార్యులు వంటి మేధావులు ప్రశ్నిస్తూ వచ్చినారు. ఈ భాషాస్పృహే సభా వంటి కథకుల వరకూ ప్రయాణించి వుంటుంది. తెలంగాణ భాష ప్రాంతీయ అస్తిత్వవేదనలో భాగం కావడానికి ఆ ప్రాంతం నవాబుల పాలనలో వుండటమూ, వారి పాలనలో భాష మతంతో ముడిపడి వుండిన చారిత్రక సందర్భమూ కారణాలు. ఈ కారణాలు రాయలసీమలో లేవు. తెలంగాణది భాషా (ఆత్మగౌరవ) సమస్య. రాయలసీమది బతుకుతెరువు సమస్య.

 • రాయలసీమ మాండలికం కోస్తాంధ్ర ప్రామాణిక మాండలికాధిపత్యంపై ధిక్కారంగానో, లేదా ఆధిపత్యభాషకు ప్రత్యామ్నాయంగానో సాహిత్యంలో ప్రవేశించడంలో ప్రాదేశికవాద స్పృహ ఏ మేరకు వుంది? నామిని, శాంతినారాయణ వంటి వారి రచనలు కావచ్చు, మీ రచనలు కావొచ్చు- వాటి భాషలో ప్రాంతీయ చైతన్యం వుందా?

భాషకు సంబంధించి ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయ చైతన్యం అని రెండింటి గురించి విడివిడిగా మాట్లాడితే స్పష్టంగా వుంటుంది. భాషలో ప్రాంతీయ అస్తిత్వం తొంగి చూడటానికి ప్రాంతీయ చైతన్యం తప్పకుండా వుండాల్సిన అవసరంలేదు. ప్రాంతీయ అస్తిత్వం మనం పుట్టి పెరిగిన నేల మీద అనివార్యంగా వ్యాపించి వుంటుంది. నామిని అమ్మలో కోస్తాంధ్ర అమ్మను ఊహించుకోలేం కదా! ఈ ప్రాంతీయ నిర్దిష్టతే ఆ నామిని అమ్మ పాత్రకు ఊపిరి పోసింది. ఆధిపత్య భాషను ధిక్కరించడంలో ప్రాదేశికవాద స్పృహ వుండకుండా వుండదు అనడానికి శాంతినారాయణ, బండి నారాయణస్వామి రచనలు ఉదాహరణ.

 • ఉత్తరాంధ్ర కథని విప్లవ కథగానూ, కోస్తాంధ్ర కథని సంస్కరణదృష్టితో కూడిన భావవాద కథగానూ, తెలంగాణ కథని తిరుగుబాటు కథగానూ, రాయలసీమ కథను కరువు, ఫ్యాక్షన్‌ వంటి భూస్వామ్య అవశేషాల ప్రాదేశిక కథగానూ పేర్కొన్నారు. ఈ విభజన స్థూలదృష్టితో చేసిందే కాని లోతుకు వెళ్లి తరచి చూస్తే దీనికి సమగ్రమైన సైద్ధాంతిక ప్రాతిపదిక లేదనీ, అతివ్యాప్తి, అవ్యాప్తులు చాలా వున్నాయనీ నాకని పిస్తుంది? మీరేమంటారు?

విప్లవమూ, సంస్కరణ, తిరుగుబాటు (రైతాంగ), కరువు- ఈ నాలుగు పంథాలకూ ప్రారంభం ఆ నాలుగు ప్రాంతాల్లో వుందని స్థూలంగా నా ఉద్దేశం. మీరు లోతుకు వెళ్లి తరచి చూస్తే ఇంకొక అభిప్రాయం కూడా తేలవచ్చు. ఆలోచించవలసిందే కదా!

 • కేశవరెడ్డి, నామిని, కేతు, స్వామి, దేవపుత్ర, సుంకోజు, శాంతినారాయణ, పాణి, పలమనేరు బాలాజి, సన్నపురెడ్డి, పిళ్లౖ, పి. రామకృష్ణారెడ్డి, రాజారాం, రాసాని, నరేంద్ర, జొన్నవిత్తుల (కోస్తా నుంచి వచ్చిన రచయిత)… ఇలా డజనుకు పైనే రచయితలు గ్రామీణ వాస్తవికతను చిత్రిస్తూ నవలలు రాశారు. ఈ కోణంలో రాయల సీమలో వచ్చినన్ని నవలలు మిగతా ప్రాంతంలో రాలేదని చెప్పాలి. దీనికి ప్రత్యేకమైన కారణాలేమైనా వున్నాయా?

కుంకుమపువ్వు కశ్మీరంలోనే ఎందుకు పూస్తుంది? చింతచెట్లకు అనంత పురం మాత్రమే ఎందుకు ప్రసిద్ధి? సాహిత్యానికి కూడా ఒక వాతావరణం వుంటుంది. ఇంతమంది మంచి రచయితలు ఇన్ని ఉత్తమ గ్రామీణ నవలలు రాయడానికి ముఖ్య కారణం రాయలసీమ వాతావరణమే! రాయలసీమ           ఉద్యమ శూన్యప్రాంతం. ఉత్తరాంధ్రలోని విప్లవ పోరాటాలుగానీ, తెలంగాణలోని రైతాంగ విప్లవపోరాటాలుగానీ ఇక్కడ లేవు. పలు తెలుగు ప్రాంతాలలో జమిందారీ వ్యవస్థ మీద తిరుగుబాట్లు వచ్చినా ఇక్కడ భూస్వామ్యవ్యవస్థ మీద తిరుగుబాట్లు రాలేదు. కందుకూరి వీరేశలింగం సంస్కరణోద్యమాలు ఈ నేలను తాకలేదు. గురజాడ, చలం, బుచ్చిబాబు వంటి వారి ఆధునిక ఆలోచనాక్రమాలు ఇక్కడి వారికి పరిచయం కాలేదు. ఈ ప్రభావాలు ఏవీ లేని రాయలసీమ గ్రామాలలో మనుషులూ, వారి జీవితాలూ, వ్యథలూ, కథలూ మరింత తేటగా కనబడతాయి. ఈ తేటతనమే ఇక్కడి గ్రామీణ నవలను విరివిగా సృష్టించిందేమో అనుకుంటాను.

 • మీ రాయలసీమ వ్యవసాయ కథ వ్యాసంలో స్త్రీ రచయితలని ప్రస్తావించక పోవడం మీలోని పితృస్వామ్య భావజాలానికి నిదర్శనమని కిన్నెర శ్రీదేవి వంటివారు ఆరోపించారు. దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు?

సుభాషిణి కూడా ఆ విషయాన్ని విమర్శించింది. ‘ముద్ద కంటే చింతకాయ తొక్కు ఎక్కువ’ అని రాయలసీమలో ఒక నుడి వుంది. శ్రీదేవి విమర్శ అట్ల వుంది. ఒక వ్యాసంలో స్త్రీ రచయిత్రులను అణచివేస్తున్నాడనే దురుద్దేశాన్ని అంటగట్టి, దానిని మళ్లీ పితృస్వామ్య భావజాల చర్చలలోకి లాగే తతంగమంతా ఎవరికోసం? ఎవరికి అవసరం? (నేను పితృస్వామ్య వ్యవస్థ నుండి నిర్మాణ మవుతూ వచ్చినవాడినే! అది వేరే విషయం.) నేను ఆ విమర్శకు సమాధానం చెప్పవలెనంటే, జెండర్‌ గురించి మాట్లాడవలసి వస్తుంది. జెండర్‌తో ముడిపడిన కులం గురించి మాట్లాడవలసి వస్తుంది. కానీ ఈ పుస్తక స్వభావం అదికాదు. ఇది ప్రాంతీయ అస్తిత్వ వ్యాసాల సంపుటి. ఈ పుస్తకం జెండర్‌, కులం, వ్యక్తిగత విమర్శకు వేదిక కావడం ఔచిత్యవంతంగా వుండదు. ఇది రచయితల గురించి దీ¸సిస్‌ గ్రంథం కాదు. వారి పేర్ల గురించి కేటలాగ్‌ పుస్తకం అంతకంటే కాదు. ఇది రాయలసీమ అస్తిత్వం గురించి రచన మాత్రమే! ఆ పరిధిలోకి వచ్చే కొన్ని (కొన్ని మాత్రమే) కథలను, రచయితలను స్వీకరించడం జరిగింది. స్థలాభావం చేత కొన్ని రాయలసీమ అస్తిత్వ కథలను వదులుకోవలసి వచ్చింది కూడా!

అయినప్పటికీ, పురుష రచయితలను వదులుకోవడం ఈ పుస్తకానికి లోపం కాదుగానీ, స్త్రీ రచయిత్రులను వదులుకోవడం మాత్రం లోపమే! అందుకే ఇంతకుముందు పేర్కొనని స్త్రీల కథల్ని సీమ వ్యవసాయ కథలో చేర్చవలసి వచ్చింది. జయ, చంద్రకళ వంటివారు కూడా రాయలసీమ అస్తిత్వ రచనలు చేస్తున్న వారిలో వున్నారు.

రాయలసీమ అస్తిత్వానికి మరో ఇద్దరు కొత్త రచయిత్రులు అదనంగా చేరుతున్నందుకు, ఒక ప్రాంతీయ అస్తిత్వవాదిగా నాకు కూడా సంతోషమే కదా!

 • గ్రామీణవాదం ప్రాంతీయవాదానికి ఎలా దోహదం చేస్తుంది? రెండిటి మధ్యా సామీప్యంగానీ, సాన్నిహిత్యంగానీ ఉందా? ప్రపంచీకరణకు విరుగుడు ప్రాంతీయత అన్న సిద్ధాంతంలో గ్రామీణవాదం స్థానం ఏమిటి?

ప్రాంతీయవాదానికి గ్రామీణవాదం మైక్రోలెవెల్‌. వాటి మధ్య సామీప్యమూ, సాన్నిహిత్యమూ అదే! ప్రపంచీకరణకు ప్రాంతీయత విరుగుడు అయినట్లే, గ్రామీణ వాదం కూడా మరో విరుగుడు. ఇదే ‘తెల్లదయ్యం’ కథలో చిత్రితమైంది.

 • మీ రచనల్లో సాధారణీకరణ కన్నా, నిర్దిష్టతే ఎక్కువగా కన్పిస్తుంది. మొదటి నుంచీ రాయలసీమ సమాజం మీ రచనలకు కేంద్రం కావడానికి ప్రధాన కారణం ఏమిటి?

సాధారణీకరణ తాత్త్విక సంబంధమైనది. నిర్దిష్టత సాహిత్య సంబంధమైనది. మనిషి కుటుంబ జీవితమూ, సామాజిక జీవితమూ నిర్దిష్టమైనవే! అందుకే నిర్దిష్టత సాహిత్యంలో మౌలికమైన అంశం అవుతుంది. రాయలసీమ సమాజం నా భౌతిక జీవితానికి కేంద్రం. ఇక్కడి భాష, చరిత్ర, సంస్కృతి, వ్యవసాయము, గ్రామాలు, మనుషులు నా అనుభవజ్ఞానంలో కలిసిపోయినాయి. తన అనుభవ ప్రపంచాన్ని రచనల్లోకి ఒడిసిపట్టడమే కదా రచయిత చేసే మొదటిపని. జీవితంలో వున్నది సాహిత్యంలోకి రావడానికి విప్రతిపత్తి ఏముంటుంది? ఉద్యమాలు కూడా ఈ భౌతిక జీవితంలో భాగమే!

 • వర్గం-కులం-ప్రాంతం ఈ మూడు అస్తిత్వాలు ఒకదానితో మరొకటి విడదీయ లేనంతగా పరస్పరం ప్రభావితం అవుతాయన్న అవగాహన మీ రచనల్లో కనిపిస్తుంది. మీ యీ అవగాహనకి కారణమైన సామాజిక నేపథ్యం ఏమిటి?

అరవై డెబ్భైలలో పాతూరు గాంధీపార్కు వద్ద తరిమెల నాగిరెడ్డి బహిరంగ సభలు, మా తోటలోని కామ్రేడ్లకు అన్నము, నీళ్లపప్పు, చింతకాయ తొక్కుతో సద్దులు మోయడము, శూద్రుల పండక్కు శలవివ్వలేదని మమ్మల్ని బడికి పంప కుండా మా అప్ప బడిమీద చేసిన బ్రాహ్మణ ధిక్కారము, మాదిగవాడల్లో గోరాసదన్‌ సహపంక్తి భోజనాలు, మా నీళ్లులేని సేద్యంలో అమ్మ కష్టము, అప్పకు అప్పుల బాధ, మా కళ్ల ముందే పురుగుల మందు తాగి చచ్చిపోతున్న ఇరుగు పొరుగు రైతులు… ఇటువంటి సామాజిక నేపథ్యం నుండే నేను నిర్మాణమయి వచ్చినాను. అందుకే వర్గం-కులం-ప్రాంతం అనే ఈ మూడు అస్తిత్వాలనూ నా రచనలు ప్రతిబింబించినాయని అనుకుంటాను.

మనిషిలో ఒక మొత్తం వుంటుంది. ఇది రచయితలో కూడా వుంటుంది. ఆ మొత్తంలో అనేకమైన అస్తిత్వాలు, పార్శ్వాలు సమాంతరంగా జీవిస్తుంటాయి. వర్గం-కులం-ప్రాంతం అనే మూడు అస్తిత్వాలూ ఈ రచయిత మొత్తంలోనివే! నా మొత్తంలో వున్న అనేకంలో ఆధ్యాత్మికత కూడా ఒకటి. అది ఇక్కడ అప్రస్తుతం.

 • సామాజిక చలనసూత్రాల్ని ఇంత లోతుగా ఆవిష్కరించడానికి కారణమైన తాత్త్విక బీజాలు మీ జీవితంలో ఎక్కడ పడ్డాయి?

మొదటి విషయం ఏమంటే- సామాజిక చలనసూత్రాలను గుర్తించే అవకాశం మార్క్సిజవ్‌ు అధ్యయనంలోనే ఉంది. సింగమనేని నారాయణ సాన్ని హిత్యంలో సామాజిక చలనసూత్రాలు సాహిత్యపరంగా అర్థంకావడం మొదలు పెట్టినాయి. కేతు విశ్వనాథరెడ్డి, కుటుంబరావు సాహిత్యం గురించి మాట్లాడినప్పుడు ఈ సామాజిక చలనాలు నాకు దగ్గరగా వచ్చినాయి. కాళీపట్నం రామారావు కథ ‘యజ్ఞం’ నాకు రచనల్లో సామాజిక చలన సూత్రాలను వ్యక్తీకరించే చారిత్రక దృష్టిని పరిచయం చేసింది.

 • సామాజిక దుర్నయాల పట్ల మీ గొంతు కటువుగా తీవ్రంగా పలుకుతుంది. ఈ ఆగ్రహస్వరం మీ సృజనాత్మక రచనల్లో సైతం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అది మీ రచనల్లో బలమా? బలహీనతా??

బలమూ కాదు, బలహీనతా కాదు. అది రచనల్లో కనిపించే రచయిత ఆత్మీయముద్ర. ఆవేశరహితమైన తాత్త్వికత కూడా నిరర్థకమైనదే. రచయితకు ఆగ్రహస్వరం అవసరమే కానీ ట్రాన్క్విలిటి కోల్పోకూడదు. పాత్రల స్వభావం నుంచి వచ్చిన ఆవేశానికి మాత్రం నియంత్రణ వుండనవసరం లేదు.

 • కుల మత జెండర్‌ అస్తిత్వాలు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కన్నా వెనకబడిన ప్రాంతాల్లో విలక్షణంగానూ, ప్రత్యేకంగానూ, భిన్నంగానూ ఉంటాయా? ఉంటే, రాయల సీమ దళిత బహుజన ముస్లిం అస్తిత్వాలు మిగతా ప్రాంతాల కంటే, ఎలా వివిధతని కలిగి వున్నాయి? అవి అక్కడి సాహిత్యంలో ఎలా ప్రతిఫలించినాయి?

తప్పకుండా విలక్షణంగానే వుంటాయి. కానీ అదంతా పెద్ద పరిశోధన జరగవలసిన అంశం.

 • రాయలసీమ కల సాకారం కావడానికి, సమస్త ప్రజానీకాన్ని కలుపుకుపోవడానికి చేపట్టవలసిన స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికల గురించి రెండు మాటలు… చివరిగా…

ప్రణాళికల రచనలో నాది అంత చురుకైన బుర్ర కాదు. ఈ విషయానికొస్తే- ఎవ్‌ు.వి. రమణారెడ్డి, మైసూరారెడ్డి వంటి సీనియర్‌ రాజకీయవేత్తలు వున్నారు. భూమన్‌, అరుణ్‌, పాణి వంటి మేధావులు వున్నారు. నాగార్జునరెడ్డి, సీమకృష్ణ, అశోక్‌ వంటి కార్యకర్తలు వున్నారు. వీరంతా ఆ పని చేయగలరు. రాయలసీమ ఉద్యమాన్ని విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల మధ్యకు మరింత బలంగా తీసుకుపోవలసిన అవసరమైతే వుంది. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రంలోనూ, విశాలాంధ్ర లోనూ, మళ్లీ 2014 ఆంధ్ర రాష్ట్రంలోనూ తాము ఏం పోగొట్టుకున్నారో రాయలసీమ ప్రజలు గుర్తించవలసి వుంది.

*

Avatar

ఏ.కె. ప్రభాకర్

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • చాలా గొప్ప పరిశీలన అన్నా, రాయలసీమ పట్ల ఇతర ప్రాంతాల ప్రజలకు వున్న అపోహలను తొలగించి సీమ పట్ల సదభిప్రాయాన్ని కలిగించాయి మీ మాటలన్ని..త్యాంక్యూ అన్నా

 • రాయలసీమ అస్తిత్వ వేదన ఏమిటో , ఎలా అర్థంచేసుకోవాలో, రాయలసీమతరులకే కాకుండా రాయలసీమ వాసులకూ అర్థమయ్యేలా చెప్పిన ఇంటర్వ్యూ. గొప్పగా వుంది.
  ఇంటర్వ్యూ చేసిన ఎ.కె.ప్రభాకర్ గారికి అభినందనలు.

 • రాయ‌ల‌సీమ ప‌ట్ల నాకు సందేహాల‌కు *సారంగ‌* ప‌త్రిక బండి నారాయ‌ణ‌స్వామి గారి ద్వారా తీర్చింది. ఆధునికకాలంలోని సాహితీ ప‌త్రిక‌లకంటే మిన్న‌గా ఇంట‌ర్య్వూలు చేయిస్తూ.. త‌ద్వారా మాలాంటి యువ‌త‌రానికి మార్గ‌సూచిక‌గా నిలుస్తోన్న సారంగ యాజ‌మాన్యానికి ధ‌న్య‌వాదాలు.
  ఇంట‌ర్వ్యూలో బండి నారాయ‌ణ‌స్వామి గారు మాట్లాడిన ఈ మాట‌లు ఎంతో న‌చ్చాయి. ఇలాంటి మంచి మాటామంతీ చేసిన ఏ.కె. ప్ర‌భాక‌ర్ గారికి ధ‌న్య‌వాదాలు.

  1. ఇక్కడి నాయకులు పార్టీలకు ప్రాతినిధ్యం వహించేవారే కానీ, సీమ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించేవారుకారు. వారు రాయలసీమ కోసం గొంతెత్తలేరు. వారు వారి పార్టీల నియంతృత్వం కింద అణచివేయబడినారు.
  2. ఆధునిక వ్యవస్థలో భూస్వామ్య రాజకీయాలు మాఫియా రూపం తీసుకున్నాయి. భూస్వామ్యం రూపాలు మార్చుకున్నా అందులోకి కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలు తప్ప ఇతర సామాజిక వర్గాలేవీ రాలేదు. భూస్వామ్య వ్యవస్థలోనూ ఆ రెండు సామాజిక వర్గాలే! అప్పుడు వారికి కులమే వనరు. మాఫియా వ్యవస్థలోనూ ఆ సామాజిక వర్గాలే! మాఫియావ్యవస్థలో వారి ప్రధాన వనరు డబ్బు. ఆధిపత్య కులాల దగ్గరే సమాజాన్ని శాసించే డబ్బు వుంటుంది. అదే ఇప్పుడు మన ప్రజా స్వామ్యాన్ని పరిపాలిస్తూ వుంది.
  3. నీళ్లను మినహాయించిన అభివృద్ధి వ్యవసాయదారులది కాదు, వ్యాపార వర్గాలది
  4. రాజకీ యాల్లో వున్నట్లే ఉద్యమంలో కూడా ఆధిపత్య కులాలే ముందు భాగంలో వుంటాయి. వారికి వున్న వనరులు కూడా అటువంటివి. ఉద్యమం విజయవంత మైనప్పుడు దాని ఫలాలు కూడా ముందుభాగంలో వున్న ఆధిపత్యకులాల చేతుల్లోకే పోతాయి.
  5.తెలంగాణది భాషా (ఆత్మగౌరవ) సమస్య. రాయలసీమది బతుకుతెరువు సమస్య
  6. రాయలసీమ ఉద్యమ శూన్యప్రాంతం. ఉత్తరాంధ్రలోని విప్లవ పోరాటాలుగానీ, తెలంగాణలోని రైతాంగ విప్లవపోరాటాలుగానీ ఇక్కడ లేవు. పలు తెలుగు ప్రాంతాలలో జమిందారీ వ్యవస్థ మీద తిరుగుబాట్లు వచ్చినా ఇక్కడ భూస్వామ్యవ్యవస్థ మీద తిరుగుబాట్లు రాలేదు. కందుకూరి వీరేశలింగం సంస్కరణోద్యమాలు ఈ నేలను తాకలేదు. గురజాడ, చలం, బుచ్చిబాబు వంటి వారి ఆధునిక ఆలోచనాక్రమాలు ఇక్కడి వారికి పరిచయం కాలేదు. ఈ ప్రభావాలు ఏవీ లేని రాయలసీమ గ్రామాలలో మనుషులూ, వారి జీవితాలూ, వ్యథలూ, కథలూ మరింత తేటగా కనబడతాయి. ఈ తేటతనమే ఇక్కడి గ్రామీణ నవలను విరివిగా సృష్టించిందేమో అనుకుంటాను.

 • చాలా విలువైన విషయాలు. రాయలసీమ
  విద్యార్ధులు
  ప్రజలు
  తప్పకుండా
  వారి బతుకులు మారడానికి పోరాడాలి.
  అలాంటి పోరాటాలకు
  నా మద్దతు.
  మంచి పుస్తకం
  ప్రభాకర్ కు
  Perspective ku
  Abhinandanalu
  Allam Rajaiah

 • ఏ.కె. ప్రభాకర్ గారూ!

  యీ ఇంటర్వ్యూ ద్వారా రాయలసీమ వెనుకబాటుతనం గురించి చాలా విలువైన వాస్తవాలను నలుగురు దృష్టికీ తెచ్చిన మీకు, బండి నారాయణస్వామి అన్నకు కృతజ్నతలు.

  బండి నారాయణస్వామి అన్నా!

  రాజకీయ, సామాజిక, ఆర్ధిక రంగాల్లో అన్యాయానికి గురౌతున్న రాయలసీమ వెనుకబాటుతనం నుండి విమోచన పొందలేదంటూ కా. తరిమెల నాగిరెడ్డి పట్ల ( ఆయన నమ్మిన సిద్ధాంతంలోని వైశాల్యం రాయలసీమ ప్రాంతీయ అస్తిత్వానికి ఏమాత్రం న్యాయం చేయలేక పోయింది అంటూ ) మీరు చూపిన కినుక నన్ను కొంచెం నొప్పించింది.

  ” నీలం సంజీవరెడ్డి నుండి చంద్రబాబు వరకు కళ్లకు కనిపించే సత్యమే … ” అన్నా! ఇద్దరి వల్లా సీమకు గొప్ప మేలు జరగలేదు కాని, కాలమాన పరిస్థితుల పరిమితులను పరిగణలోకి తీసుకుంటే వారిద్దరినీ ఒకే గాట కట్టవచ్చా? రాజధాని ముఖ్యమా? రాయలసీమ శ్రీకాకుళల అభివ్రుద్ది ముఖ్యమా? అని ఆ రెండెకరాల రైతు బిడ్డకు ఎందుకు తలపుకు రాలేదు? సీమ ప్రజలెందుకు గొంతెత్తి ప్రశ్నించలేదు?

  నీళ్లులేని సేద్యంలో అమ్మ కష్టము, అప్పకు అప్పుల బాధ, కళ్ల ముందే పురుగుల మందు తాగి చచ్చిపోతున్న ఇరుగు పొరుగు రైతులు… ఇటువంటి సామాజిక నేపథ్యం అభివృధ్ధి చెందాలని విద్యార్థులు, నిరుద్యోగులు, రైతుల కలల రాయలసీమ సాకారం కావాలని ఆశిస్తున్నా ( సీమ ఉప్పు తిన్న వాడిగా ).

  కరువు రక్కసి కోరలబారి నుండి దూరంగా … పొట్టకూటి కోసం బెంగుళూరు సిటీ, కేరళ రాష్ట్రం లోని వివిధ ప్రాంతాలకు వరకూ రోజువారి కూలీలుగా వలసపోయి రోడ్డున బడ్డ, పేవ్మెంటు బతుకుల పాలైన రాయల సీమ బిడ్డలను, రైతు బిడ్డలను తలుచుకుంటే ఎవరికైనా రక్తం ఉడికిపోదా ?

 • బండి నారాయణస్వామి గారి ‘రాయలసీమ : సమాజం – సాహిత్యం’ పుస్తకం ప్రచురణకర్తలు పర్స్పెక్టివ్ పబ్లికేషన్స్ కు, ఆర్.కే. అన్నగారికి ధన్యవాదాలు.

 • Even after 72 years of India’s Independence, the Rayalaseema region of Andhra Pradesh state is pathetically backward with crippling drought.

  The A.P. state’s first two chief ministers Neelam Sanjiva Reddy and Damodaram Sanjivayya were both from Rayalaseema. However, they did little for their people. This is because the other regions ( Coastal Andhra and Telangana ) in the state have a far greater representation in the state legislature.

  For the people of Rayalaseema who live from drought to crippling drought, the man who articulates their basic demands for more governmental attention to the long-neglected districts of Chittoor, Cuddapah, Anantapur and Kurnool, is the deceptively soft-spoken scholarly Malla Venkata Ramana Reddy, 40, a former Naxalite activist and member of the ultra left-wing writers’ forum, Virasam.

  He began the new year with an indefinite fast and called for a general strike throughout the region on January 22 and 23, 1985.

  The four districts of Rayalaseema comprise 69.299 sq km of land with a population of 102.1 lakhs. But they have received a disproportionately small share of the development cake, and Ramana Reddy hopes to reverse the situation drastically over the next few years. His six-point charter of demands:

  • allocation of 350 billion cu ft of Krishna waters out of the total 800 billion cu ft awarded to the state by the Bachchawat tribunal;

  • spending half the state budget over the next ten years for the development of Rayalaseema’s four districts; reservation of two out of every five government jobs for the people of the region;

  • scrapping the corpus fund rule for starting schools and colleges; installation of a 250 mw thermal power station at Muddanur to improve power supply: and

  • the construction of a statutory Rayalaseema Development Authority.

  Irrigation is certainly a major problem, and Rayalaseema’s share of it is pathetically small. Irrigation covers 56 per cent of the cropped area in coastal Andhra, 31 percent in Telengana, but a mere 4 per cent of Rayalaseema.

  The Telugu Ganga and Srisailam right canal projects will give the region an additional 50 million cu ft. which is hardly adequate.

  A perspective plan for drought relief in the region showed that only 26 per cent of the sown area of Rayalaseema could be irrigated even if the entire water potential there were tapped.

  Three-fourths of the area would have to depend on monsoons and chance rains. And rains are very uncertain here because Rayalaseema is too far from the east coast to attract the north-east monsoon, and the high ranges of the ghats in the west cut off the south-west monsoon too effectively. Thus farming is something of a gamble.

  All these factors have contributed to an alarming situation: “The desert is edging forward in Rayalaseema,” warns K. Ananthacharyulu, retired government economist and president of the Rayalaseema Employees Association. He points out that the area under farming is dropping dangerously with the net sown area down from 75 lakh acres in 1953-54 to 64 lakh acres in 1982-83.
  Thus depending on agriculture could be suicidal for Rayalaseema. “The economic strategy for development may be reduced to one of survival unless industrialisation is planned in a big way,” cautions a senior bureaucrat.

  In fact, an official of the state planning department suggests that farm labour could be dispersed in other industries including dairying, because the returns from farming are likely to be poor for at least another 10-15 years.

  But Ramana Reddy argues that this wouldn’t solve the problem at all. “There are at least 12 lakh farm workers and another eight lakh persons on the waiting lists of employment exchanges,” he says.” More ways should be found to irrigate the land and more water brought to the dry lands.”
  Evidently, the Government at least is keen on industrialising the region.

  All this could be changing now. As a Rayalaseema bureaucrat remarked: “We are regarded as people with big hearts and small brains – essentially emotional, and highly volatile on issues concerning us.”

  https://www.indiatoday.in/magazine/indiascope/story/19850215-in-backward-rayalaseema-region-of-andhra-peoples-hero-is-ramana-reddy-not-ntr-769766-2013-11-26

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు