మొగిలి మేసే పొద్దు

మొగిలిమేసే పొద్దుటేలా
నది కావల చేరి నిరాశ పాడితే ఎట్టా?
అబయా..!
నదికీవల మనసొంచి చూడు
నెత్తిమీద నారుమోసే న్నానలు
నడుంవొంచి నారేతలేసే అమ్మలు
నారు కట్టలు సాలతో
ఎంత సుందరమైనవో పాదులు
కాడిమోసే ఎద్దులు
పారమోసే పొద్దులు
ఎంత అందమైనవో
మనసులోతు ప్రేమలో
అడుసుని అలుముకునే పూటలు
వొడ్డున చేరి
గుడ్లప్పగించి చూస్తావే గాని
ఒకతూరి అడుసులోకి దిగి చూడు
ప్రేమను పచ్చగా పండించే కార్యంలో
ఎంత నిష్ఠ వుందో
ఎంత నీతి వుందో
నిగనిగలాడుతూ మురిసే
చేలకై ఊళ్ళకై
ఊపిరిలూదే తపన ఏమాదిరుందో
తల్లిగుండె వంటి వానతడి ఎంత వుందో
వాన కురిసి వెలిశాక
లోకమెంత తేటగా కదులుతోందో
మొగిలి మేసే పొద్దుటేలా
పిడికిట నమ్మకపు పగ్గాలు పట్టుకుని
నదికీవల చూడు
కాలమెంత కాంతివంతంగా
ప్రేమలు పాడుతూ పిలుస్తుందో..
*
నా జీవన తాత్విక పునాధుల్లోంచి..
కవిత్వమే మీ భావ వాహిక ఎందుకు అయింది.?
– సమకాలీన సామాజిక వాస్తవికతను వ్యాఖ్యానించడానికి, చర్చించడానికి చక్కటి సాధన కవిత్వం అని నా అభిప్రాయం. సామాజిక స్పృహను, చైతన్యం నిండిన ఆలోచనలను అందించే సామాజిక జీవనోద్వేగాల వాహికగా  కవిత్వానికి విశిష్టమైన స్థానం ఉంది. చెప్పాలనుకున్న విషయాన్ని కళాత్మకంగ, క్లుప్తంగా, సూటిగా చెప్పడానికి కవిత్వం ఉపకరిస్తుందని నిస్సందేహంగా చెప్పవచ్చు.
        అందుకే, నేను జీవిస్తున్న కాలం గురించి, నాదైన గమనింపునును, అవగాహనను వ్యక్తీకరించడానికి, నా జీవన తాత్విక పునాధుల్లోంచి మాట్లాడడానికి నేను కవిత్వాన్ని ఆశ్రయిస్తాను.  నన్ను నేను వ్యక్తీకరించుకునే క్రమంలో రాస్తున్నదే  నా కవిత్వం.  అది నేను జీవిస్తున్న  కాలపు భావోద్వేగాలల సమాహారం.

పల్లిపట్టు నాగరాజు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నాగరాజుగారూ… పల్లీయతలోని శ్రమ సౌందర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. “పిడికిట నమ్మకపు పగ్గాలు పట్టుకుని” పనిలేనితనపు పనికిమాలిన నిరాశావాదం వీపు చెళ్లుమనిపించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు