మీరా సంఘమిత్రగా…నేను!

2019 సంవత్సరం బాషా మెమోరియల్ అవార్డును జూలై 21న అనకాపల్లి లో అందుకోబోతోంది మీరా సంఘమిత్ర.

పుట్టుకతో నాకివ్వబడిన అస్తిత్వం నుంచి నన్ను నేను స్వతంత్రంగా నా ఇష్టపూర్వకంగా మీరా సంఘమిత్ర గా ఆవిష్కరించుకోవటం కోసం లెక్కలేనన్ని సవాళ్లు ఎదుర్కొన్నాను. సమాజం నుంచే కాదు, నా నుంచి నేను కూడా! నాతో పాటు అనేక సవాళ్లను అమ్మ కూడా ఎదుర్కొంది. ఇప్పటికీ ఇద్దరం ఇంకా కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొంటూనే వున్నాం!

నర్మదా ఉద్యమంలోకి వెళ్లిన తర్వాత అక్కడ అన్ని విషయాలలో పూర్తి స్థాయిలో పనిచేయటంతో చిన్నప్పటి నుంచి నాలో చెలరేగుతున్న లోలోపలి భావాలను లోపల ఎక్కడో దాచేసాను. కానీ, అది ఎంతో కాలం సాగలేదు. 2012 లో నాలోపలి భూతం మళ్లీ వెనక్కి తిరిగి వచ్చింది. the ghost of myself came back to me. రావటం కూడా చాలా తీవ్రతతో వచ్చింది. భూతం అని నేను దీన్ని నెగెటివ్ అర్థంతో అనటం లేదు. ఈ భూతం చిన్నప్పటి నుంచీ నాలోనే వుంది. ఎప్పటికప్పుడు దాన్ని దాచేస్తూ వచ్చాను. ప్రతిసారీ ఒక యుద్ధం జరిగేది. అయితే ఇప్పుడు వచ్చినదాన్ని ఇంక నేను దాచలేకపోయాను. ఇక యుద్ధాన్ని, దాచటానికి కాదు బయటకు చూపించటానికే చేయాలనుకున్నాను.

నిజానికి, 2006-2007 ప్రాంతంలోనే నన్ను నేను బయట ప్రపంచానికి ఒక పద్ధతిలో ఆవిష్కరించుకునేదాన్ని! అప్పుడే ఇ-మెయిల్ వాడకం పెరుగుతోంది. నాకు అప్పుడు yahoo mail id వుండేది. ఎవరికైనా మెయిల్ పెట్టినపుడు కింద సంతకం పెడతాం కదా, నేను ఒక ఎరుకతోనే your’s Queerfully అని రాసేదాన్ని. అది నన్ను నేను చెప్పుకునే ఒక పద్ధతిగా ఎంచుకున్నాను.

ఆ తర్వాత, నేను 2008 మార్చిలోనర్మదా ఉద్యమంలోకి వెళ్ళిన కొద్ది నెలలకే కేరళలో జరుగుతున్న NAPM జాతీయ సదస్సుకి మొదటిసారి వెళ్లాను. అప్పుడు ట్రైన్ లో నాతో పాటు గుజరాత్ నుంచీ పర్యావరణ సురక్షా సమితిలో పనిచేసే ఆనంద్ మార్గొంకర్, మహారాష్ట్ర నుంచి ఆహార హక్కు ఉద్యమంలో వున్న ముక్త శ్రీవాత్సవ ఉన్నారు. వాళ్ళిద్దరూ NAPMలో సీనియర్ సామాజిక కార్యకర్తలు. . ఇద్దరూ సెన్సిటివ్ గా వుండేవారు. వారితో నాలోపలి ఆలోచనలను పంచుకున్నాను. అలా నా అంతరంగ ఆలోచనలను కొద్దికొద్దిగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ వుండేదాన్ని. 2012 లో నా లోపలి ఆ భావాలు తీవ్రమైపోయాయి. ముందు అమ్మతో చెప్పలేదు. ఎందుకంటే అమ్మతో నేను దగ్గరగా లేను. ఫోన్ లో చెప్పే విషయం కాదనిపించింది. చెప్పటానికి అనువైన ప్రదేశం, ఏకాంతం కూడా ఎంతో అవసరం. నేను అమ్మకు దూరంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. తర్వాత మేథా తో కూడా మాట్లాడాను. అందరి నుంచీ ఒక మిశ్రమ స్పందన వచ్చింది. ఎవ్వరూ కూడా మొత్తంగా ఒకేసారి అంగీకరించలేదు కానీ నన్ను అర్థం చేసుకోవటానికి చాలా ప్రయత్నించారు. ఆదివాసీ కార్యకర్తలు కైలాష్ భాయి అవస్త్య, దేవరాజ్ భాయి, ముఖేష్ భాయి, కమలీ దీది, ఇలా అందరికీ నా భవిష్యత్ జీవితం మీద ఒక ఆందోళన ఉండింది. ఈ మిశ్రమ స్పందన అప్పటికీ ఈ అంశాల మీద ఎప్పుడూ ఏ చర్చ జరగక పోవటం వల్లనే అని నాకు అనిపించింది. ప్రతిఒక్కరూ నా పట్ల ఎంతో ఆప్యాయంగా, మానవీయంగా వుండేవారు. అప్పటికే ఉద్యమంలో అందరికీ పరిచయం వున్న వ్యక్తిని నేను. అలానే ఉద్యమానికి బాగా పనికొచ్చిన వ్యక్తిని కూడా! ఉద్యమానికి సంబంధించి నేను ఏదన్నా చెబితే అర్థం చేసుకునే వాతావరణమూ వుంది.

అయితే ఈ విషయంలో నేను చెప్పింది విన్నారు కానీ, దాన్ని వెంటనే అంగీకరించలేకపోయారనిపించింది. కొంతమంది, “ఇలాంటి అంశాలు విన్నాము, ఫలానా గ్రామంలో కూడా కొంతమంది ఇలానే వున్నారు” అంటూ చర్చించేవారు. అలానే నాకు చెప్పేవారు. మరికొంతమంది సహానుభూతితో అర్థం చేసుకుంటున్నట్లు వుండేవారు. వేసుకునే బట్టల విషయం లో, ‘నాకు ఇలాంటి బట్టలు వేసుకోవడం నచ్చడం లేదు, నేను ఇంక వీటిని వేసుకోను’ అని చెప్పినప్పుడు అది వాళ్లకి, నాకూ పెద్ద సవాలుగా అనిపించింది.

ఎందుకంటే ఒక ఉద్యమంలో చాలాకాలం పాటు ఒక అస్థిత్వంతో పరిచయమయి, అన్ని ప్రదేశాల్లో అంటే మీడియా, పోలీసు స్టేషన్, కోర్ట్, గ్రామాలు –ఇలా అన్ని చోట్లా ఇప్పుడు నా అస్థిత్వం మారుతుంది అంటే నిజంగా పెద్ద సవాలే! ఇది నిజంగా అసలు ఒక విషయమా, లేక కాదా, అసలేమిటిది? ఈ కొత్త పరిణామాన్ని ఎలా ఎదుర్కోవాలి? మిగిలినవాళ్లకే కాదు, నాకు కూడా ఇదంతా ఒక సవాలును ఎదుర్కునే క్రమమే! మేథా చాలా మంచి మనిషి. ఒక గాంధియన్ భావజాలంతో, సోషలిస్ట్ మనస్థత్వంతో వుండే వ్యక్తి. అలాంటి తనకే నా నిర్ణయాన్ని అంగీకరించటానికి బాగా సమయం పట్టింది. నా గురించి ఎంతో ఆరాటపడింది. అనేకమందితో చర్చించింది. ఎందుకంటే ఒక ఉద్యమానికి కేంద్ర బిందువుగా వున్న తనమీద ఈ మార్పుని వివరించాల్సిన బాధ్యత వుంటుంది కదా! నన్ను అర్థం చేసుకోవటానికి చాలా ప్రయత్నం చేసింది. ఇది హార్మోన్స్ తో వచ్చే సమస్య అని, తాత్కాలికమైన పరిస్థితి అని, తర్వాత నీకు బాగైపోతుంది అని నన్ను సముదాయించటానికి, నన్ను వొప్పించటానికి ప్రయత్నించింది.

కానీ, నేను ఎప్పుడైతే నా నిర్ణయాన్ని గట్టిగా చెప్పటానికి ప్రయత్నిస్తూ వచ్చానో, ఎవరికీ ఏం చేయాలో అర్ధం కాలేదు. యాక్టివిస్టులుగా వుండే మగవాళ్ళకి ఇది పెద్ద సవాలు. ముందు అంగీకరించలేకపోయారు. అలా అని నాపట్ల ఎవ్వరూ వ్యతిరేకత చూపించలేదు. ఎవరన్నా నన్ను ప్రభావితం చేస్తున్నారేమో, ఇది తాత్కాలికం, ఎక్కువకాలం ఇట్లా వుండదు అనే చర్చలన్నీ వచ్చేవి. దీనివలన ఉద్యమానికి నష్టం అనే చర్చ కూడా తీసుకువచ్చారు. అప్పుడు నేను నా కెదురైన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తూ ప్రశ్నలు-జవాబుల రూపంలో ఒక పెద్ద నోట్ రాసాను.

నన్ను నేను సమర్ధించుకోవటం అంత అవసరం లేనప్పటికీ, ఈ రకమైన ప్రశ్నలు సమాజంలో ఎప్పుడూ ఎదురయ్యే విషయాలే కాబట్టి, నాకు తోచిన విధంగా వాటికి సమాధానాలు ఇచ్చుకుంటూ రాశాను. నేను మీరాగా ఎలా వుండబోతున్నాను, నా అస్థిత్వం ఉద్యమంలో ఎలాంటి విషయాలని ముందుకి తీసుకు రాబోతోంది, ప్రజలతో, నిర్వాసితులతో పనిచేస్తున్నప్పుడు, ఆ విషయాలకీ దీనికీ ఎలాంటి సంబంధం వుంటుంది –ఇలా వీటిని చర్చిస్తూ, నా అస్థిత్వం ఉద్యమానికి సంఘర్షణ కాదని చెబుతూ రాశాను. నిజానికి నేను అంతకు ముందుకంటే ఇప్పుడు మీరాగా ఇంకా బాగా పనిచేయగలుగుతాను. ఎందుకంటే ఇదే నా అసలు అస్థిత్వం. కానీ, సమాజం సృష్టించిన జండర్ మూసల్లో నా శరీరం కనిపిస్తోంది. అది నాకు నచ్చటం లేదు. కాబట్టి, నేను నా శారీరిక రూపురేఖలను నా ఆలోచనలకు అనుగుణంగానే మార్చుకోవాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు ఆత్మవిశ్వాసం వుంది. ఇదే తెలియచెప్పటానికి ఎంతో ప్రయత్నం చేశాను.

వాటి మీద అనేక చర్చలు జరిగాయి. మీరు మీ భూమి కోసం చేసేది సత్యాగ్రహం కదా, అలానే నేను నా అస్థిత్వం కోసం చేసేది కూడా సత్యాగ్రహమే అని వాదించాను. ‘సత్య కేలియే ఆగ్రహ్’, యే మేరె సత్య కేలియే ఆగ్రహ్’. అప్పటికి అమ్మ రెండు మూడు సార్లు అక్కడికి వచ్చింది. నాన్న కూడా వచ్చారు. నాన్నకు నా నిర్ణయం నచ్చలేదు. మామూలుగానే చిన్నప్పటి నుంచీ ఆయనకు నా విధానం పట్ల ఇష్టం వుండేది కాదు. అయితే అమ్మ ఊరుకోలేదు. మన బిడ్డను మనం ఎట్లా వదిలేస్తాం అని వెంటపడి ఆయన్ని కూడా తీసుకు వచ్చింది. కనీ ఇప్పటికీ ఆయన వాస్తవాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా లేరు. నా విషయమై చర్చించటానికి మొత్తం ఉద్యమంలో వుండే ముఖ్యమైన వారందరితో (కోర్ టీం) ఒక పెద్ద సమావేశం జరిగింది. ‘ఏ కార్యకర్త పెహలె ఓ ఐడెన్టిటి థా, అబ్ ఏ మీరా కి ఐడెన్టిటి హై’ అని చెప్పటం కోసం జరిగిన సమావేశం అది. గ్రామస్థాయి నుంచీ ప్రతి ఒక్కరూ దానికి హాజరయ్యారు. 50 -60 మంది దాకా వుంటాం. ఆ మీటింగ్ లో అమ్మ కూడా వుంది. ఎక్కువమంది మగవాళ్లే. కొంతమంది మహిళలు ఉన్నారు. దాదాపు 5-6 గంటల సమావేశం సీరియస్ గా జరిగింది. అన్నిరకాల సందిగ్ధతలూ అందులో చర్చకు వచ్చాయి. ‘అసలు అలా వుండటం సాధ్యమా? ఇది సహజమేనా’ అనే దగ్గరి నుంచీ చర్చలు జరిగాయి. ‘నువ్వు ఇప్పటికిప్పుడు మీరాగా ఎలా ఉంటావు, పోనీ ఒక సంవత్సరం రెండేళ్లు మీవూరు వెళ్ళిపోయి పూర్తిగా మార్పు చేసుకుని ఒక కొత్త వ్యక్తిగా మళ్లీ రా అని కొంతమంది; నువ్వు మీరావే, కానీ ఇలా ఆడవాళ్ల బట్టలు వేసుకోకుండా, మామూలు పాంటు షర్టు వేసుకొమ్మని మరికొందరు చెప్పారు. ఇలాగ కూడా చర్చ నడిచింది.

కొంతమంది బొట్టు పెట్టుకోవద్దన్నారు. మరికొంతమంది దుపట్టా వేసుకోవద్దన్నారు. నిజానికి నేను ఆ మీటింగ్ లో ఒకరి అనుమతి కోసం అక్కడ కూర్చోలేదు. అక్కడ మేథా, అమ్మ ఇద్దరూ వున్నారు. అయితే, ఎందుకు కూర్చోవాలనుకున్నానంటే, ఈ ట్రాన్సిషన్ అన్న క్రమం, ముఖ్యంగా ఇలాంటి ఉద్యమ నేపథ్యంలో వున్నప్పుడు, ఇది కేవలం నా ఒక్కదాని విషయంగానే కాకుండా, అనేకమంది జీవితాలతో వివిధ స్థాయిల్లో ముడిపడిన అంశం. నా గురించి నేను రాడికల్ గా అనుకున్నాగానీ, నా జీవితం ఒకరకంగా మిశ్రమ క్రమంలో వుంది. ఈ మార్పుని సాఫీగా అందరూ అర్ధం చేసుకునే విధంగా చర్చించటం అవసరం అనిపించింది. ఒకరకంగా అది నా బాధ్యతే. అంతే కాకుండా ఇది కేవలం నావ్యక్తిగతమైన విషయంగా అనుకోవటం లేదు. సమూహంతో ముడిపడిన మార్పు కూడా. నా జీవితంలో నర్మదా ఉద్యమానికి ఎంతో ముఖ్య పాత్ర వుంది. నాతో పాటు అనేకమంది వున్నారు. నాలో జరిగే ఈ మార్పుని వాళ్ళందరూ అర్థం చేసుకోవటం ఎంతో ముఖ్యమని భావించాను. చర్చకు పెట్టడం, ప్రశ్నించడం, ఒప్పించడం, రకరకాల భిన్న వాదనలు వినడం, ఒక ముగింపుకి రావడం అన్నీ కూడా ఒక సమూహపు ప్రయాణంలో భాగం. నిజానికి జండర్ కి సంబంధించి, ముఖ్యంగా ట్రాన్స్ జండర్ విషయాలకి సంబంధించి నగర ప్రాంతాలలో అర్ధం చేసుకునే వాతావరణం ఉంటుందని, ఒక స్పేస్ ఉంటుందని భావిస్తాం. కానీ, నాకు బలమైన సహకారం కొండప్రాంతాల్లో వుండే ఆదివాసీలు, గ్రామీణ ప్రాంతాల్లో వుండే దళిత మత్స్యకార మహిళల నుంచి ప్రధానంగా వచ్చింది. వాళ్ళంతా కూడా పేద మహిళలు. ‘ఠీక్ హై, థారీ జిందగీ, థారీ మర్జీ, ఛలో తుమ్ ఆజ్సే హమారా మీరా దీదీ హై’ అని వెంటనే చెప్పేశారు. వీళ్ళెవ్వరూ కూడా నన్ను ఏ ప్రశ్నలూ వేయలేదు. వేసినదంతా వేరేవాళ్లు. మేథా కూడా నన్ను మీరా అని పిలవటానికి దాదాపు తొమ్మిది నెలలు తీసుకుంది. తను నిజానికి నా విషయంలో ఎంతో కష్టపడింది. నాతో తనకి ఒక ఎమోషనల్ బాండింగ్ వుంది. నా పని పట్ల గౌరవంగా వుండేది. కానీ, ఉద్యమంలో వున్న ఇతరులకి, సానుభూతిపరులకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనమీదే ఉండింది. ‘యే క్యా నాటక్ చల్రహాహై ‘ అనే వాళ్ళకి సమాధానం చెప్పి వొప్పించవలసిన బాధ్యత తనదే అయిపొయింది. ఈ అంశాన్ని ఎలా పరిష్కరించటం అన్నది తనకి పెద్ద సవాలుగా అయిపోయింది. కొన్ని నెలల పాటు అసంకల్పితంగానే నన్ను నా పాత పేరుతోనే పిలిచేది. తర్వాత కొన్ని నెలలపాటు పేరు లేకుండానే మాట్లాడేది. తన నోటినుంచీ వెంటనే నా కొత్తపేరు రాలేదు. తర్వాత వేలాదిమంది హాజరయిన ఒక పెద్ద బహిరంగ సభలో ‘హమారీ మీరా బెహెన్’ అని పరిచయం చేసింది. వ్యక్తిగతంగా కన్నా పబ్లిక్లో నన్ను నా వ్యక్తిత్వాన్ని ఎలా నిలబెట్టాలి అని ఆలోచిస్తూ వుందనుకుంటా! ఆ విధంగా తను స్పష్టంగా వుండేది. ఇక అప్పటినుంచీ నన్ను మీరా గానే పిలవటం మొదలు పెట్టింది.

ఇది ఒకరకంగా నా వ్యక్తిగత, రాజకీయ ప్రయాణంలో ఎదురైన సవాళ్లకు రాతపూర్వకంగా నేను ఇచ్చిన రూపం ఈ ప్రశ్నలు-జవాబులు. నేను ఒక రాజకీయపరమైన వ్యక్తిగా వివిధ ప్రజా ఉద్యమాలను అర్ధం చేసుకోవటానికి ఈ విషయంలో నేను ఎంచుకున్న ఈ ప్రయాణం నాకు చాలా ఉపయోగ పడింది.

నేను ఆదివాసీ ప్రాంతాల్లో సౌకర్యంగా వుండేదాన్ని. నేను ఈ విషయాన్ని రొమాంటిసైజ్ చేయటం లేదు. కానీ, నగర ప్రాంతాల కన్నా కూడా అక్కడ జెండర్ పట్ల స్ప్రుహ, స్పేస్, సున్నితత్వం వేరే విధంగా వుంటాయి. నేను ఈ విషయంలో అక్కడ ఏ అసౌకర్యానికీ గురి కాలేదు. అక్కడికి వెళ్ళినపుడు కనీసం ఐదారు రోజులు అక్కడే ఉండాల్సి వచ్చేది. అందరూ స్నేహంగా వుండేవారు.

అందరి జీవితాల్లో పితృస్వామ్యం అనేది వివిధ రకాలుగా వ్యక్తమవుతూ వుంటుంది. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భూతం లాంటిది. ట్రాన్స్ వ్యక్తులుగా మాకైతే దానితో పోరాటం చేయటం ఒక పెద్ద సవాలు. సిస్ జండర్ వ్యక్తులుగా(స్త్రీలైనా పురుషులైనా) సామాజికంగా ఆశించే అంశాలు వుంటాయి. అంటే అబ్బాయిగా నువ్వు ఇలానే జీవితాంతం వుండాలి అనే ఒక నిబంధన వుంటుంది. అమ్మాయిలకు వేరేవిధంగా! ప్రవర్తనా నియమావళులు అనేకం వుంటాయి. దానివల్లనే సెక్సువాలిటి కూడా రూపుదిద్దుకుంటుంది. బయటకు ఒక స్త్రీగానో లేదా పురుషుడుగానో గుర్తించబడి, ఆపాదించబడిన ఆ ఆస్థిత్వంలో ఇమడలేక నలిగిపోతారు. ముఖ్యంగా, వైవాహిక వ్యవస్థలో ఇమడలేక ఎంతో సంఘర్షణకు లోనవుతారు. ఇష్టం వున్నా లేకపోయినాగానీ అవతలి జండర్ వ్యక్తిని మాత్రమే పెళ్లిచేసుకోవాలనే ఒత్తిడి వుంటుంది. దీనివలన సంతోషం లేని సంబంధాలలో ఉండాల్సి వస్తుంది.

2012 నుంచీ నాలోలోపల తిరుగుతున్న ఆలోచనలకు ఒక స్పష్టమైన రూపాన్ని ఇవ్వటానికి ప్రయత్నించాను. అప్పటినుంచీ నా జీవితంలో ఒక కొత్త ప్రయాణం మొదలైంది. నర్మదా ఉద్యమ కార్యకర్తలతో మాట్లాడటం, వారితో ఒక చర్చలోకి వెళ్ళటం అంతా కూడా నన్ను నేను ఆవిష్కరించుకోవటానికి చాలా దోహదపడ్డాయి. అలానే బెంగుళూరులో వుండే నా ట్రాన్స్ మెన్ స్నేహితులు జీ, బిట్టు ఇద్దరూ కూడా నాలోవున్న ప్రశ్నలకు ఒక రూపాన్ని ఇవ్వటానికి ఎంతో సహాయం చేసారు. నర్మదా ఉద్యమం నుంచీ నేను ఇంక పూర్తి కాలం NAPM కార్యకర్తగా వుండాలని నిర్ణయించుకున్న తర్వాత ముందుగా వెళ్ళింది వీళ్ళిద్దరి దగ్గరకే. అక్కడే దాదాపు నెలరోజులు వున్నాను. ఆ తర్వాతే అమ్మ దగ్గరకు వచ్చాను.

విభిన్నమైన ప్రజా ఉద్యమాలను ఒక దగ్గరకు చేర్చే NAPM ఒక విశాల వేదిక. వివక్ష లేని సమానత, ప్రజాస్వామ్య, మానవీయ, న్యాయబద్ధ విలువతో వుండే పోరాటాలకు సంఘీభావంగా పనిచేస్తూ వాటిని నిరంతరం కలుపుకువెళ్లే వేదిక ఇది. NAPM ఒక వ్యక్తి నడిపించే ఉద్యమం కాదు. ఒక సమూహ ఆచరణ. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేశంలోని వివిధ ప్రాంతాలలో జాతీయ సదస్సులు నిర్వహిస్తూ ప్రజా ఉద్యమాలను కలుపుకు వెళుతుంది. అందులో జెండర్ అంశాలు, అందులో కూడా అణగారిన, అంచుల్లోకి నేట్టేయబడిన సమూహాల పోరాటాలు అత్యంత ముఖ్యమైనవి. ప్రారంభంలో ఈ అంశాల పట్ల పెద్దగా స్పష్టత లేనప్పటికీ పనిచేస్తున్న క్రమంలో ఈ సమూహాలన్నింటి హక్కులకోసం బలమైన గొంతుకగా పనిచేస్తున్నాము. అలాంటి స్పేస్ వుంది కాబట్టే నాలాంటి వ్యక్తులం మా అస్థిత్వంతో బహిరంగంగా ఉద్యమంలో ప్రధాన భాగస్వామ్యం తీసుకోగలుగుతున్నాము. యువ సంవాద్ పేరుతో దేశంలో సామాజిక అంశాలపై పనిచేస్తున్న యువతరాన్ని ఒక వేదిక మీదకు తీసుకువచ్చి వారు పనిచేస్తున్న అంశాల మధ్య ఒక సారూప్యతను తీసుకు రావటానికి ప్రయత్నం చేస్తున్నాము. అన్ని రాష్ట్రాలలోనూ ఈ యువ సంవాద్ లను నిర్వహిస్తున్నాము. విభిన్న అస్థిత్వాలతో ట్రాన్స్ వ్యక్తులుగా వున్న మేము మనుషులందరిలో ఒక భాగం. మా అస్థిత్వాన్ని గుర్తించ నిరాకరించడమంటే అది స్త్రీలుగా మా మీద జరుగుతున్న హింసే అవుతుంది. జల్, జంగల్, జమీన్ అనేవి ఎంతో ముఖ్యమైన అంశాలు. అలానే, జిందగీ అంటే ప్రతి జీవితం కూడా ముఖ్యమైనదే. స్వతంత్రంగా, సహజంగా ప్రాథమిక హక్కులతో, గౌరవంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికీ వుండాలి. అందుకోసమే నా ఈ ప్రయాణం, ఉద్యమం, పోరాటం. ఎక్కడైనా, ఎప్పుడైనా భయం లేని, గౌరవంతో కూడిన ఒక మనిషిగా, ఒక స్త్రీగా జీవించే హక్కు కోసం నిరంతరం విభిన్న ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేస్తూనే వుంటాను. నా గళం ఎత్తుతూనే వుంటాను.

…….

వయసు చిన్నదైనప్పటికీ మీరా జీవిత ప్రయాణం ఎన్నో ముఖ్యమైన ప్రశ్నలను మనముందుకు తీసుకు వస్తుంది. తన అస్థిత్వ ప్రకటన కోసం తాను లేవనెత్తిన ప్రశ్నలు కేవలం ఒక నర్మదా ఉద్యమానికి మాత్రమే పరిమితమైనవి కావు. చిన్నప్పటి నుంచీ తనకు అండగా నిలబడిన అమ్మంటే మీరాకు ప్రాణం. అలానే తన ప్రయాణంలో తన సవాళ్లను వోపిగ్గా భరించిన మేథాపాట్కర్ అంటే అత్యంత గౌరవం. సామాజిక న్యాయం వైపుగా తన ఆలోచనలను ప్రభావితం చేసిన ప్రతివ్యక్తి పట్లా అత్యంత స్నేహభావం. వర్తమాన రాజకీయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొంటూ తనదైన ముద్రను వేస్తున్న మీరా సంఘమిత్ర ప్రయాణం ఎవ్వరికైనా స్ఫూర్తిదాయకమే.

అందుకే 2019 సంవత్సరం బాషా మెమోరియల్ అవార్డును జూలై 21న అనకాపల్లి లో అందుకోబోతోంది. ఒక సామాజిక కార్యకర్తగా మారుమూల గ్రామీణ ప్రాంతంలో ప్రజలను చైతన్య పరుస్తూ పనిచేసిన బాషా అనే యువకుడి అకాల మరణం తరువాత అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన ఈ అవార్డుని ప్రతి సంవత్సం వివిధ సామాజిక అంశాల మీద పనిచేసే యువతకు అందిస్తున్నారు. మీరా సంఘమిత్ర పని అవార్డులను ఆశించేది కానప్పటికీ, దేశమంతా అలుపెరగని చైతన్యంతో తిరుగుతూ, అనేక ఉద్యమాలకు, సామాన్య ప్రజలకు అండగా నిలబడుతున్న తన సమష్టిపనికి గుర్తింపే. మీరా, నీకు యాక్టివిస్ట్ డైరీ తరఫునా, సారంగా తరఫునా అభినందనలు. జిందాబాద్.

*

 

 

 

 

సజయ. కె

సజయ. కె

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • సజయ గారు… మొదట మీకు నమస్కారాలు మరియు Love You . ఒక మంచి వ్యక్తి కోసం మీరు వివరించిన విధానం , సులభమైన మరియు అర్ధవంతమైన బాష నాకు చాలా బాగా నచ్చింది. ఈ ఎపిసోడ్ కోసం నేను ఇప్పటివరకు ఎదురుచూసాను. మీరాతో కలిసి గత మూడేళ్ళుగా చాలా దగ్గర సంబంధంతో ప్రయాణం చేస్తూ వస్తున్న వ్యక్తులలో నేను ఒకడిని అయినందుకు చాలా గరవంగా అనిపించింది.
  బాషా మెమోరియల్ అవార్డుకి పూర్తి అర్హత కలిగిన వ్యక్తి మీరా… వీళ్లద్దరికి నేను మిత్రుడ్ని అయినందుకు proud to be myself
  Balu Gadi
  State Secretary
  APVVU
  And
  RSV ,STATE COMMITTE MEMBER
  NAPM-AP

 • మీరా జీవితాన్ని పరిచయం చేసిన మీకు, అద్భుతంగా తనని తాను నిలబెట్టుకున్న మీరా కి ప్రేమ పూర్వక ఆలింగనం..

 • చాలా అద్భుతంగా ఉంది…ఎంతో మంది ఇది ఇన్స్పిరేషన్…ఇది ఒక విజయం లాంటిదే..జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ….అవమానాలను ఎదుర్కొని..ఓర్చుకొని…కృంగిపోకుండా ….ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగిన మీరా గారికి నా నమస్సులు..ఇలాంటి ఎందరో మీరా లకు స్ఫూర్తి…. సమాజంలో ఎందరో ఇలాంటి వారు ఉన్నారు…వాళ్ళు కేవలము స్వలాభం కోసం కాకుండా….సమాజం కోసం పాటుపడితే…వారిపట్ల మరింత గౌరవం మర్యాద పెరుగుతుందని భావిస్తూ….ఇంత చక్కటి వ్యాసాలను తెలుగులో తర్జుమా చేసి మాకు అందించినందుకు సజయా గారు మీకు నా నమస్కారాలు మరియు అభినందనలు తెలుపుతూ….మీరా గారికి నావంతు సపోర్ట్ చేస్తున్నాను

 • చాలా అద్భుతమైన వ్యాసాన్ని అందించారు. Very inspiring. Thank you.

 • “ ఎక్కడైనా, ఎప్పుడైనా భయం లేని, గౌరవంతో కూడిన ఒక మనిషిగా, ఒక స్త్రీగా జీవించే హక్కు కోసం నిరంతరం విభిన్న ప్రజా ఉద్యమాలతో కలిసి పనిచేస్తూనే వుంటాను. నా గళం ఎత్తుతూనే వుంటాను “ అంటున్న మీరా సంఘమిత్రకి సలాం.

  యాక్టివిస్ట్ డైరీ సజయక్కా! మీరా సంఘమిత్ర గారికి ప్రముఖ ట్రాన్స్-జెండర్ యాక్టివిస్ట్, గౌరవ డాక్టరేట్ అందుకున్న కర్ణాటక ట్రాన్స్ జెండర్ కార్యకర్త అక్కై పద్మశాలి తెలుసు కదూ ?!

  అత్యంత చిన్న వయసులో నోబెల్ బహుమతి గెలుచుకున్న పాకిస్థాన్ సాహస బాలిక మలాలా యూసఫ్‌ జాయ్తో తో సంయుక్తంగా 2014 నోబెల్‌ శాంతి బహుమతిని అందుకున్న బాలలహక్కుల ఉద్యమకారుడు కైలాస్‌ సత్యార్థి గారి గురించి కూడా మీ నుండి వినాలని ఉంది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు