మనిషి పరిచయం – 4

మొదటి పుటలోనే ఒక ఉపోద్ఘాతం వంటి నాలుగు వాక్యాలను రాసుకున్నాడు ఆ యువకిశోరం.

          ల.

అడవిలో పడి ఎక్కడికో పరుగెత్తుతూ సుభద్ర.

ముందు పిలుపుకు అందనంత దూరంలో.. దూరంగా కొండలవైపు పరుగెత్తుతూ మొగిలి.

ఇంకా కనుచూపుమేర దూరాన కొండ అంచు.. దానికి అవతల .. పెద్ద లోయ.

తన వెనుక బిగ్గరగా ” సుభద్రా ” అని ఎలుగెత్తి పిలుస్తూ, పరుగెత్తుకొస్తూ రాజేశం.

అందరూ పరుగుత్తుతున్నారు ఒకరికోసం ఒకరు.. ఒకరినొకరు అందుకోవాలని తాపత్రయపడ్తూ. కాని ఎంత పరుగెత్తినా మధ్య దూరం తరగదు.. ఒకరికొకరు అందరు. ఒకటే పరుగు.. నిర్విరామంగా.. చుట్టూ చిక్కగా అడవి.. పచ్చగా.. ఏపుగా చెట్లు.. కిందంతా ఎండిన ఆకులు. బోసికాళ్ళు ఎండు పుల్లలు గీసుకుపోయి.. రక్తాలు కారుతూ.. నొప్పి.

‘ ఇక మొగిలి అందడా.. ఎన్నటికీ అందడా తనకు ‘

‘ వెనుక రాజేశం ఆవేదనగా పిలువడం ఆపడా.. తను అతనికి అందుతుందా.? ‘

‘ రాజేశంకు మొగిలి ఎవరో తెలియదుకదా.. మరి అతను కేవలం ఒక్క తనకోసమే వస్తున్నాడా వెంటబడి.. అతని పిలుపులో ఎంత మార్దవమో .. ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి రాజేశంను చూచి.. దగ్గరికి చేరి ఒక్కసారి కలుసుకుంటే ఎంత బాగుండును.. కాని ఈ లోగా మొగిలి దూరమై అందకుండా పోతేనో .. ఉహూ ‘

చూస్తూ చూస్తూండగానే మొగిలి ఆ కొండ చరియ అంచుకు చేరి.. ఎదుట ఎర్రగా మండుతున్నట్టున్న ఆకాశంలోకి చూస్తూ చటుక్కున దూకేశాడు లోయలోకి. పెద్దగా.. ఆకాశం దద్దరిల్లేట్టు కేక.. కొండలూ, అడవీ ప్రతిధ్వనించేయి పెద్దగా.

” మొగిలీ లీ లీ లీ..” అని అరిచింది సుభద్ర.

ఊపిరి బిగబట్టి.. అంతా స్థంభించినట్టయి.,

కళ్ళు తెరిచి.. చటుక్కున లేచి కూర్చుంది సుభద్ర .. ఒళ్ళంతా చెమట. బిగ్గరగా కొట్టుకుంటూ గుండె.

‘ ఏడి మొగిలి ‘

అప్పటినుండి కలనా ఇదంతా.

మొగిలి చేతికి దొరికి .. వాణ్ణి దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుని.. అట్లాగే చచ్చిపోతే ఎంత బాగుండేది.

రాజేశమేడి.. అడవి ఏది.. ఆ పచ్చని చెట్లూ.. ఎండుటాకులు.. పాదాలకు గుచ్చుకునే కొయ్య ముక్కలేవి.. ఎర్రని ఆకాశం.. లోతైన భీకర లోయ.. ఏది?

చుట్టూ చీకటి.

బొమ్మలు: మిత్ర

తను తన ఇంట్లోనే ఉందా. మరేదీ కనబడదే.. అంతా చీకటి.

మెలమెల్లగా .. స్పృహ .. చేతన.. మనసు మేల్కొంటూ.. కొండమీదినుండి జారుతున్న బండరాయిలా దొర్లుతూ వస్తూ వస్తూ.,

చటుక్కున లైట్ వెలిగింది.

అప్పటినుండి చీకట్లో ఉందా తను.. కరంటు పోయి.. చీకట్లో తను.. తనలో నిండా చీకటి.

కొంగుతో ముఖానికి పట్టిన చెమటను తుడుచుకొని ప్రక్కనే ఉన్న కూజాలోని నిన్నటి నీళ్ళను గుటగుటా తాగింది దాహంగా.

జ్ఞాపకమొస్తూ.. హైదరాబాద్ కు వెళ్లడం.. అమరుల తల్లుల కడుపుకోత సభ.,

మళ్ళీ నీటి చుక్కలా తెగిపడిపోయింది వాస్తవ స్పృహలోకి.

ఈత చాపపై తను.. ప్రక్కనే రెపరెపాలాడ్తూ మొగిలి డైరీలోని పేజీలు.

టైం తెలియదు. దూరంగా ఉన్న గోడ గడియారం కనిపించడంలేదు.

డైరీని దగ్గరకు లాక్కుని.. మళ్ళీ మొదలు పెట్టింది చదవడం.

తేది: 30-06-2009

చాలా మంది మిత్రుల ద్వారా.. ప్రతిరోజూ యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి రెఫర్ చేసిన పత్రికల ద్వారా తెలుసుకున్న విషయమేమిటంటే.. మొదటినుండీ తెలంగాణా రాజకీయ నాయకుల్లో చాలా నిజాయితీగా , స్థిరంగా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకోసం శ్రమించిన ఏకైక వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. నిజంగా చాలా గొప్పవాడతను.

కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి:

ఒక మనిషిని గురించి తెలుసుకోవడమంటే చరిత్రను తెలుసుకోవడమే. కొండా లక్ష్మణ్ బాపూజీ గురించి తెలుసుకోవడమంటే.. ఒక నిజాయితీ, నిబద్ధత గల రాజకీయ నాయకుల తరం గురించి అర్థం చేసుకోవడమే.. తద్వారా ఇప్పుడు రాజకీయాలు భారతదేశంలో ఎంత నీతిహీనంగా, అనైతికంగా మారి కుళ్ళిపోయాయో గ్రహించడమే.

బాపూజీ అదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో 17 సెప్టెంబర్ 1915 న పద్మశాలి కుటుంబంలో పుట్టారు. లా చేసి హైదరాబాద్ లో న్యాయవాదిగా స్థిరపడ్డారు. భార్య శకుంతల ఒక ప్రముఖ డాక్టర్. ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఆయనకు. ఒక కొడుకు భారత సైన్యంలోని వాయుసేనలో పనిచేస్తూ దేశంకోసం వీరమరణం పొందారు.

నిజాం నిరంకుశపాలనను వ్యతిరేకిస్తూ జరిపిన వీరోచిత పోరాటంలో చురుగ్గా పాల్గొని బద్ధ తెలంగాణావాదిగా ఇక్కడి ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారు.

బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో ఉంటూ 1969 తొలి ప్రత్యేక తెలంగాణ ఉద్యమావసరాలకోసం మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించారు.

1958 లో హుస్సేన్ సాగర్ ప్రక్కన విశాలమైన స్థలాన్ని కొనుక్కుని దాతృ హృదయంతో ‘ జలదృశ్యం ‘ ను నిర్మించుకున్నారు. అది అనేక బలహీన వర్గాలకు రాజకీయ ఆశ్రయంగా ఉపయోగపడ్తూ వచ్చింది. అప్పటి శాసనసభ ఉప సభాపతి పదవికి, సిద్ధిపేట శాసన సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికీ రాజీనామా చేసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 27 ఎప్రిల్, 2001 న చారిత్రాత్మక ‘ తెలంగాణ రాష్ట్ర సమితి ‘ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసమైన ‘ జలదృశ్యం ‘ నుండే. అటు తర్వాతకూడా అక్కడినుండే టి.ఆర్.ఎస్ తన ప్రాథమిక కార్యకలాపాలను నిర్వహించింది .

బాపూజీ మీది కక్ష్యతో ‘ శాసనసభలో తెలంగాణా పదాన్ని వింటానికే ఇష్టపడను ‘ నేను అని ప్రకటించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్రపూరితంగా ‘ జలదృశ్యం ‘ ను ఒక సెలవురోజు బాపూజీ ఢిల్లీలో ఉన్నపుడు, అక్కడినుండి పనిచేస్తున్న టి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్యులు ప్రొఫెసర్ జయశంకర్, బియ్యాల జనార్థనరావు, వి. ప్రకాశ్ శ్రీరాం సాగర్ గెస్ట్ హౌజ్ లో జరుగుతున్న శిక్షణా తరగతుల నిర్వహణలో ఉండగా ఏ నోటీసూ ఇవ్వకుండా, టి.ఆర్.ఎస్ కేంద్ర కార్యాలయ కార్యకర్తలు అడ్డుకుంటూంటే వాళ్ళపై లాఠీ చార్జ్ జరిపి దౌర్జన్యకరంగా రికార్డ్ లను ధ్వంసం చేసి.. సామానులనూ పుస్తకాలనూ చిందరవందరచేసి విధ్యంసం సృష్టించారు. దరిమిలా తిరిగివచ్చిన తర్వాత బాపూజీ ప్రభుత్వ దౌర్జన్యాన్ని హైకోర్ట్ లో ప్రశ్నించి ముఖ్యమంత్రి పై చెంపపెట్టు వంటి తీర్పును పొంది మళ్ళీ తన జలదృశ్యాన్ని స్వాధీనపర్చుకున్న ధీశాలి బాపూజీ. ఆ తర్వాత తన ఆస్తులన్నింటినీ ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి పేద ప్రజలకోసం అంకితం చేశారు. త ర్వాత సెప్టెంబర్ 21, 2012 న తెలంగాణా కోసం పరితపించిన కొండా లక్ష్మణ్ మరణించినప్పుడు ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలను ఈ ‘ జలదృశ్యం ‘ వద్దే నిర్వహించారు.

తను చనిపోడానికి కొద్ది నెలలముందు 1-11-2011 న దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వద్ధ కొండా లక్ష్మణ్ బాపూజీ సత్యాగ్రహ దీక్ష చేశారు.

ఇక చదవడం ఆగిపోయి.. ఎందరో మహానుభావులు.. ఎన్ని త్యాగాలు చేశారో ఈ పుణ్యభూమికోసం.,

అక్షరాలపై చూపులు నీడలా కదుల్తూ కదుల్తూ.. లోపలినుండి ఏదో కమ్ముకొస్తూ.,

సుభద్రను మళ్ళీ నిద్ర ఆవరించింది. ఏదో ఒక మత్తు.. నిన్నటినుండీ ఒక రకమైన మాయలో కూరుకుపోయి.. అందులోనే సుడిగాలిలో చిక్కిన కాగితపు ముక్కలా అక్కడక్కడే గిరికీలు కొడ్తూ.,

అంతా చావు వాసన. కన్నీళ్ళ వాసన.. యుగయుగాలుగా ఎక్కడో ఒక పురాగుహలో కూరుకుపోయి సమాధి ఐపోయినట్టు చేతనాచేతన సందిగ్ధ స్థితి.

ఎంతసేపూ మొగిలి ఆత్మహత్య.. దుఃఖపూరితమైన ఆ ఘటన ఊహా చిత్రం.. మాంసపు ముద్దలా వచ్చిన శవం.. మార్చురీ దగ్గర ఎదురుచూపులు.. పోస్ట్ మార్టం.. శవం అప్పగింత.. ఎక్కడినుండి వచ్చారో.. వందలు వేలమంది ఉద్యమకారులు.. నాల్గయిదు రోజులు అనేకమంది ఉద్యమనేతల ఓదార్పులు .. ప్రతిరాత్రీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా మిగిలి.. ఒక్కతే ఈ ఒంటరి రేకుల గదిలో.

జీవితమంతా బిక్కు బిక్కున .. ఏమిటిది.

ఏం చేయాలి తనిప్పుడు.. ఏదీ తోచదు.

ఎటైనా పారిపోయి.. దిగంతాల్లోకి మాయమై.,

అంతరించిపోతేనో.. అంతరించిపోవడమంటే .. అంతమై తరించిపోవడమా.. ఏదో పొగమంచులా పైపైకి కమ్ముకొస్తూ.,

నిద్రలోకి జారిపోయింది మళ్ళీ సుభద్ర. ఆమె ఎదపై ఉన్న డైరీ మూతపడి ప్రక్కన పడిపోయింది.

*                                                 *                                                         *

ఉదయం తొమ్మిది దాటి కిటికీలోనుండి ఎర్రగా ఎండ పొడ వచ్చి మీదపడి చుర్రుమంటూంటే తెలివొచ్చింది సుభద్రకు.

ఒళ్ళు తెలియని గాఢనిద్ర కొద్ది గంటలనుండి. లేచి కూర్చోకుండానే కళ్ళు తెరిచి ఆలోచనల్లో మునిగిపోయింది. రాత్రి బస్సులో హైదరాబాద్ నుండి వస్తున్నప్పుడే ‘ తల్లుల సభలో ‘ తనవంటి ఇంకో ఐదారుగురు తల్లులు ఈ రోజు అంటే 12-09-2011 న కరీం నగర్ లో సాయంత్రం నాలుగు గంటలకు జరుగవలసిన టి.ఆర్.ఎస్ పార్టీ ‘ జనగర్జన సభ ‘ కు వెళ్ళాలని అనుకున్న సంగతి జ్ఞాపకమొచ్చిందామెకు. గోడ గడియారం దిక్కు చూచింది. పదీ ఇరవై నిముషాలు. బాగా పొద్దెక్కింది.

వెళ్ళాలె ‘ జనగర్జన సభకు ‘ , రాత్రినుండి పుస్తకాలను చదువుతూ.. మొగిలి డైరీలను చదువుతూ.. సంగ్రహిస్తున్న ఉద్యమ పరిస్థితులను ఆకళింపుచేసుకుంటూ.. తనుకూడా ఒక కార్యకర్తగా ఉద్యమబాటలో నడువగలదా. తన కొడుకు నిష్క్రమించిన బాటలోనే అడుగులు వేస్తూ.. గమ్యాన్ని ముద్దాడుతూ ‘ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ‘ సాధించేదాకా పోరాడ్తే.,

సార్థకత.. ఈ జన్మకు ఒక సార్థకత.. ఒక సాఫల్యత.. ఒక తృప్తి.

మర్నాడు.. 13 తారీఖ్ నుండి ఈ పదేండ్ల రక్తపాత రహిత, అహింసాయుత తెలంగాణ మహోద్యమంలో ఒక కీలకమైన మలుపు ‘ సకల జనుల సమ్మె ‘ ఆరంభం కాబోతున్నది. ఇక సకలమూ, సర్వమూ, ఆఫీసులూ, బస్సులూ, ఫ్యాక్టరీలూ, గనులూ, పనులూ అన్నీ బంద్ రేపటినుండి. తెలంగాణ ఎక్కడికక్కడ స్థంభించిపోతుంది. దేశం దేశం యావత్తూ కళ్ళప్పగించి దిగ్భ్రాంతితో చూస్తుంది తెలంగాణ వైపు.

మెల్లగా లేచి .. కుర్చీలో కూర్చుని ముఖాన్ని దోసిట్లో పెట్టుకుని అలా ఉండిపోయింది మౌనంగా.

ఉండీ ఉండీ.. నేలమీద కనబడ్డ మొగిలి డైరీ – 2010 ని తీసుకుంది చేతుల్లోకి.

మొట్టమొదటి పుట. అప్రయత్నంగానే అక్షరాలను తాకుతున్నాయి చూపులు.

అసలు ఈ ‘ మలి దశ ప్రత్యేక తెలంగాణా ‘ ఉద్యమం మళ్ళీ ఎట్లా పుట్టింది.. ఎట్లా 1952 తర్వాత, 1971 లో తెలంగాణా భూస్వామ్య శక్తుల కుట్రల్లో భాగంగా ‘ ప్రజా సమితి ‘ పేరుతో గెలిచి ఓడి చల్లారిన ఉద్యమం మళ్ళీ ఎట్లా పునరుద్ధరించబడ్డదో .. తెలుసుకోవాలె.

దీనికి.. ఈ ప్రశ్నకు జవాబు మొన్న విశాలాంధ్ర బుక్ స్టాల్ లో కొన్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ రాసిన ‘ వొడువని ముచ్చట్లు ‘ పుస్తకంలో దొరికింది.

ఈ ఒడువని ముచ్చట్లు పుస్తకమే చాలా గమ్మత్తుగా పుట్టి వెలుగులోకి వచ్చింది. సార్ కు కేన్సర్ అని తెలిసి మృత్యువుతో యుద్ధం చేస్తున్నపుడు కొంపెల్లి వెంకట్ గౌడ్ అనే యువ ఉద్యమకారునికి జయశంకర్ గారు మౌఖికంగా తన జీవితకాల ఆకాంక్ష ఐన ‘ తెలంగాణ రాష్ట్ర సాధన ‘ దిశగా సాగిన కీలక అనుభవాలను ఉర్దూలో ఆలోచిస్తూ, ఇంగ్లిష్ లో రాసి, తెలుగులో మాట్లాడే అలవాటుతో చెబుతూంటే రికార్డ్ చేసి అక్షరబద్ధం చేసిన పుస్తకం అది. మొన్ననే కొన్న జూలైలో ‘ ఒడువని ముచ్చట్లు ‘ ను .

‘ ఒడవని ముచ్చట్ల ‘ల్ల 14 వ పేజి లో.. ఉంది జయశంకర్ సార్ మళ్ళీ ఈ మలి దశ తెలంగాణ పోరాటం ఎట్ల మొదలైందో.

సుభద్ర క్రితంరోజు కొన్న ‘ ఒడవని ముచ్చట్లు ‘ పుస్తకాన్ని తీసి 14 వ పేజీని తెరిచింది.

శీర్షిక ..’ ఎంత చిన్నగ మొదలైందో జూడు. ‘ జయశంకర్ భాష మనిషి మన ముందట కూర్చుని మాట్లాడుతున్నట్టుంటది.

‘ ఒకటి.. నిజంగ కేసీఅర్ కు నాకు పరిచయం 2000 కంటె ముందు లేనేలేదు. 2000 వరకు నేను జూడ్నే లేదు. నేను జెప్తి గద 96 నుంచి 2000 వరకు మేం మా పని జేసుకుంట పోయినం. ఇంక అప్పటికి తెరాస రాలేదు. ఏం జరిగిందంటే.. అసలు ఇపుడు నడుస్తున్న ఉద్యమం ఎట్ల మొదలైంది. అంటె రివైవల్, పునరుద్ధరణ ఎట్ల జరిగింది? సరే 1952, 68 అవన్ని నడిసినయ్ గాని బ్రేక్స్ వచ్చినైగద! ఈ పునరుద్ధరణ ఎప్పుడు జరిగింది. 27 అక్టోబర్ 1996 కు ముందు నిజామాబాద్ నుండి కొంతమంది అడ్వకేట్స్ నా దగ్గరికి వచ్చిండ్రు. 27 అక్టోబర్ రోజు మీటింగ్ ఒకటి బెట్టిండ్రు వాల్లక్కడ. మీరు రావాలె సార్, మాకు జెప్పాలె అంటె .. ఎందుకయ్యా మీకు ఇంట్రెస్ట్ అన్న. లేదు సార్ చాలా మంది మీరైతే మాకన్ని జెప్పగలుగుతరు అన్నరు. అంటె నేను కొంత మంది ఫ్రెండ్స్ కలిసి నిజామాబాద్ పోతిమి. ఇరవై మంది యంగ్ లాయర్స్. దినమంత కూర్చుని జెప్పిన. స్టార్టింగ్ పాయింట్ ఎంత చిన్నగ మొదలైందో జూడు. ఎందుకో అది స్ప్రెడ్ అయింది. అది తెలుసుకోవాలె. చాలా .. స్ప్రెడ్ అయింది.

దానికితోడు ఏమైందంటే ‘ తెలంగాణ ప్రజా సమితి ‘ అని ఒక పాత పార్టీ ఉన్నది. భూపతి కృష్ణమూర్తి తెలుసుగదా! పాపం దాన్ని బట్టుకుని గూర్చున్నడాయన.. పెద్దమనిషి ఊరికె అట్ల కాపాడుతున్నడాయన. ఆయన ఏమన్నడంటే వరంగల్ లో సదస్సు బెడదాం. ఫస్ట్ నవంబర్ ఆయన పెడుతుంటడు. 1996 ఫస్ట్ నవంబర్ నాడు పెడదాం, కొంచెం పెద్ద ఎత్తున జేద్దామంటె.. నేను, కాళోజీ నారాయణరావు, జస్టిస్ మాధవరెడ్ది ముగ్గురం మాట్లాడతమని జెప్పినం. అది ఫస్ట్ నవంబర్ 1996 రోజు. ఐతె వరంగల్ లో చిన్న హాల్లో.. మొగిలయ్య హాల్.. ఓ రెండొందల మంది కూర్చునే హాల్లో మీటింగ్ బెట్టినం. మీటింగ్ రోజు లోకల్ పేపర్ల ఏదో చిన్న మ్యాటర్. మీటింగ్ కి ఐదువేలమంది వచ్చిండ్లు. ఎక్స్ పెక్ట్ చేయలే మేం. మాకే ఆశ్చర్యమేసింది. నిండిపోయింది బయటంత, హాలంత! నేను, జస్టిస్ మాధవరెడ్ది, కాళోజీ నారాయణరావు ఇంక చాల మంది పాతవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నరు. దినమంత నడిచింది. ఆ రోజు వుపన్యాసాలన్నీ మొత్తం ప్రెస్ లో బాగా హైలైట్ అయినయ్. దానిమీద తెల్లారి చంద్రబాబు నాయుడు ఒక స్టేట్ మెంట్ . వేర్పాటువాదం సహించను, తెలంగాణకు అన్యాయమంటూ జరుగుతే సవరించే ప్రయత్నం చేస్తం గాని, వేర్పాటువాదం వస్తే ఉక్కు పాదంతో అణచివేస్తాను అని ఆయన మాటలు. దాంతోని కొంత ప్రొవోక్ అయింది. ఇగ వరుస మీటింగులు మొదలుపెట్టినం. హైదరాబాద్, అక్కడ, ఇక్కడ! చంద్రబాబు నాయుడు ఆ స్టేట్ మెంట్ తోని చాలా అలర్ట్ అయ్యిండు. మరి ముందుకు బోవాలె గదా ఏం జేయాలె? అపుడు అదే సందర్భంలో ఏమైంది అంటే.. నేను చెప్పేది 1996 నవంబర్ సంగతి. నా వుపన్యాసాలు విన్నవాళ్ళు, పేపర్లు జూసి కొంత మంది వచ్చి ఇంక ఎక్కువ మీరు వుపన్యాసాలివ్వాలె, పుస్తకాలు రాయాలె అన్నరు.. వెనుకట రాసిన గాని కొత్తగ రాయనీకి మల్ల గ్యాప్ వచ్చింది ‘

మనుషులు .. తరాలు తరాలుగా ఎదుగుతూ తమ తమ సామాజిక బాధ్యతలను తెలుసుకుని విలువలతో వికసించాలనుకుంటున్న జిజ్ఞాసువులుగా మారుతున్నపుడు వాళ్ళకు సరియైన మార్గదర్శనం చేయగల వరిష్ట తరం బోధకులుగా మారి చిటికెన వ్రేలునందించి ముందుకు భవిష్యత్తులోకి నడిపించాలి. అది నిజమైన, అరోగ్యవంతమైన సమాజాన్ని సృష్టిస్తుంది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చేస్తున్నదదే. ఆయన జీవితకాలమంతా చేసిన పని ‘ తెలంగాణా ప్రజలను దోపిడి నుండి విముక్తం చేయడం ‘. నిజానికి ఆయనొక ఋషి.

ఇక ఇప్పుడు మలితరం ‘ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ‘ జరిగిన పోరాటాన్ని ప్రతిష్టించడానికి ‘ వొడువని ముచ్చట్లు ‘ తర్వాతి చాప్టర్ చదవాలి.. పుట 17 లో.

పదిహేడవ పేజీని తీసింది సుభద్ర.

శీర్షిక: ఇదేం గుస గుస

‘ ఇగ రాయడం, చేయడం, ఉపన్యాసాలివ్వడం. ఏం జరిగిందంటే.. అప్పుడు 1998 వచ్చింది. 98 లో ఏం జరిగిందంటే అదిలాబాద్ లో కలరా ఇన్సిడెంట్ . చంద్రబాబునాయుడు కాలం. ట్రైబల్స్, కలరా ట్రీట్ మెంట్ లేక చనిపోవడం.. మేమంతా వరంగల్ నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ గ్రూప్ బోయి స్టడీ జేసి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్స్ అన్నీ గూడ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో రిపోర్ట్ అయినయ్.

నేను నా పర్సనల్ పనిమీద అమెరికా పోయివుండింటి. పోతే కొంత మంది స్టూడెంట్స్ , ఫ్రెండ్స్ వాల్లంత సార్ మీరు వస్తున్నరు గదా! ఏంది ఈ కలరా సంగతి ఏంది ? మీరు రిపోర్ట్ రాసింద్రు గదా ? పేపర్ల వచ్చింది . మాకు జెప్పాలె సార్ అన్నరు. నేను న్యూయార్క్ లో దిగంగనే వొక మీటింగ్ బెట్టిండ్రు. ఆ రోజు కేవలం కలరా గురించి జెప్పిన. దాంట్లో అప్పుడేంది.. అంతకు ముందు చంద్రబాబునాయుడు అది విజన్ 20-20 ఇదెంత పెద్ద స్వర్గతుల్యమైందో జెపుతు ఆయన అట్ల అంటడు, ఇట్ల అంటడు మొత్తం ఆయన ఏం జేస్తున్నడు, ఏం జరుగుతుందో జెప్పిన. తర్వాత అయితే ఆ రోజు ప్రధానంగ జెప్పింది నేను కలరా గురించె. గాని తెలంగాణ ఇష్యూ వచ్చింది. అయ్యెటప్పటికి చాలా మంది ఇంత ఘోరంగనా, ఇట్ల గాదు మీరు మల్లొకసారి రావాలె చాలా మందిని పిలుస్తం అంటె , నేను రెణ్ణెల్లు బోయుంటిని

జనవరి 1999లో న్యూయార్క్ లో మీటింగ్ బెట్టి చుట్టుపక్కల రాష్ట్రాల్లో వున్నటువంటి చాలా మంది తెలంగాణ వాళ్లను పిలిపించి ఒక మీటింగ్ పెట్టిండ్రు. ఒక రోజంత నాతోని మాట్లాడిచ్చిండ్రు. ఒక రోజు మొత్తం తెలంగాణ గురించే క్వశ్చెన్స్, ఆన్సర్స్, వాల్ల ఇంట్రస్ట్! మరి మేం ఏం జేయాలె సార్. ఏంది అంటె .. ఏముంటది మీరు ఇంట్రెస్ట్ జూయించాలె అని జెప్పిన.

అపుడు వాళ్ళు ‘ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం ‘ అని ఒక సంస్థను స్థాపించిండ్రు. అమెరికాలో అది చాలా స్ప్రెడ్ అయ్యింది. టిడిఎఫ్. దానికి ఇక్కడ బాగా ప్రచారం వొచ్చింది. ఇండియాలో కూడా బాగా ప్రచారం వొచ్చింది. అయిన తర్వాత ఏందంటె.. ఇట్ల గాదు సార్! మీరు మొత్తం అమెరికాలో చాలా స్టేట్స్ తిరగండి అన్నరు. 2000 లో నన్ను బిలిపించుకుని పది సిటీస్ లో లెక్చర్ టూర్ మొదలుపెట్టించిండ్లు నాతోటి. నాతో పాటు జనార్థనరావు వచ్చిండు అపుడు. తెలుసుగదా జనార్థనరావు? టెన్ సిటీస్ లో రెణ్ణెల్లు విస్తృతమైనటువంటి ప్రచారం వచ్చింది. అపుడేం జరిగింది? అదే సమయంలో ఏం జరిగిందంటే.. తెలంగాణ కాంగ్రెస్ వాళ్లందరు 41 మంది ఎమ్మెల్యేలు సోనియా గాంధికో రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. అదేదో ఒక కమిటీ వేసింది. అదే ప్రణబ్ ముఖర్జీ కమిటీ. ఎవరన్నా వచ్చి మీరు మీ వాదన వినిపించండి అని జెప్పిండ్రు. ఆ కమిటీలో మన్మోహన్ సింగ్ కూడా ఉండె అపుడు. మన్మోహన్ సింగ్ తో నాకు పాత పరిచయం ఒకటుంది అది వేరు విషయం. మరి ఎవరన్న వచ్చి వినిపించాలె అంటె అపుడు రాజశేఖరరెడ్డి అనుమతితోనే బోయిండ్రు గదా వీల్లు! ఎవరు వినిపించాలె, ఎవరు వినిపించాలె అని తర్జనభర్జన జేసుకొని , జయశంకర్ అయితే మంచిగుంటది అని నా దగ్గరికి పొన్నాల లక్ష్మయ్యను పంపిండ్రు. ఇంటికి, వరంగల్ కు. పరిచయమే బాగ. మరి నేనేం కాంగ్రెసోన్ని కాదు, ఎమ్మెల్యేను గాదు, నేనెట్ల జెప్పాల్నయ్యా అంటె , లేదుసార్ మీరయితే బాగా జెప్తరు అన్నడు. మంచిది తెలంగాణ గురించి నీ మాటగ నా నోట జెప్పిస్తే తప్పకుండ వస్త అన్న.

17 అక్టోబర్ 2000 రోజున ఢిల్లీ, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ లో ప్రణబ్ ముఖర్జీ కమిటీ ముందు నేను రెండున్నర గంటల సేపు వాదించిన అఫీషియల్ గ. ఇదేంటి .. ఇదేం గుసగుసగాదు. తెలంగాణ నుండి రెండువందలమంది సీనియర్ లీడర్స్, ఎంపి లు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు , కాబోయే వాళ్ళు, అయినవాళ్ళు, ఆల్ సీనియర్స్! టూ అండ్ హాఫ్ అవర్స్ వాదించిన. గివె.. ఇవే సమస్యలు.

చదవడం ఆపింది సుభద్ర.

విషయం తెలుసుకోవడం వేరు.. దాన్ని ఒడుపుగా ఒక పద్ధతి ప్రకారం వాదనగా వినిపించడం వేరు. జయశంకర్ సార్ కాంగ్రెస్ కమిటీ ముందు ‘ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలె ‘ అని వినిపించిన చారిత్రాత్మక వాదన కాంగ్రెస్ హై కమాండ్ పెద్దల్లో ఒక పరివర్తనను తెచ్చింది.

ఇక ఉద్యమం గర్భస్థ శిశివుగా రూపుదాల్చవలసిన సమయం ఆసన్నమై.,

‘ వొడువని ముచ్చట్లు ‘ తర్వాతి పుటను తిప్పింది సుభద్ర.

శీర్షిక : నేను ఇంప్రెస్ అయ్యింది ఏందంటె

‘ ప్రణబ్ ముఖర్జీ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత.. అపుడు కేసీఅర్ వచ్చిండు మిమ్మల్ని గలవాలె సార్, తెలంగాణ గురించి మాట్లాడాలె సార్ అని. కేసీఅర్ తెలుగుదేశంలో డిప్యుటీ స్పీకర్ గదా? నా గురించి తెలుసుకున్న తర్వాత , విన్న తర్వాత .. మీ గురించి కాన్ స్టెంట్ గ వింటున్నం, చాలా మంది జెప్పిండ్రు, మిమ్మల్ని గలుసుకోవచ్చా అంటె .. ఒకరోజు గలిసినం. ఫస్ట్ డేనే దాదాపు డే అంత గూర్చున్నం. ఆయన అడుగుడు , నేను జెప్పుడు! నేను ఇంప్రెస్ అయ్యింది ఏందంటె, ఆయన లోతుకు బోయి అడిగేది. మిగతా వాళ్ళు ఎవరైనా లోతుకు బోయేవాళ్ళు గాదు. విశ్లేషించి , దాన్ని ఇట్ల ఎందుకుగాదు, అట్ల ఎందుకు గాదు క్రిటికల్ గ.. మనం జెప్పిందె వినడంగాదు క్రిటికల్ గ చర్చించేటోడు. అది నేను చాలా ఇంప్రెస్ అయిన! ఎందుకంటె మనిషికి విషయ అవగాహన వుంటె గనుక ఆ క్వశ్చన్స్ వస్తయ్ లేకపోతె రావు. పోతె జూస్తుంటె ఆయన భాష .. ఆయన తెలంగాణ ప్రజల భాషలో చెప్పేటువంటి ఆ లక్షణాలు కనబడ్డయ్ నాకు. విషయ అవగాహన ఉండి తెలంగాణ ప్రజల్లో ప్రజల భాషలో, నుడికారంలో తీసుకపోయేటువంటి వ్యక్తిని మొదటిసారి చూచిన నేను. నా 50,60 ఏండ్ల అనుభవంలో. నన్ను ఇంప్రెస్ జేసింది అదే. విషయం అడ్డగోలుగ మాట్లాడడు ఆయన. అన్ లెస్ హి స్టడీస్. ఆయన ఇట్ల గూడ అంటడు. అకడమీషియన్ మీరిట్ల జెప్తే, నేను పార్టీగా ఇట్ల జెప్పాల్సి వస్తది. ఇపుడు అకడమీషియన్ జెప్పే పద్ధతుల్లో జెప్తం, పార్టీ విషయంలో ఇపుడు నేను జెప్పేది ఆయన జెప్పడం తేడా వుంటది. సార్ మీరు జెప్తే అట్ల జెప్తరు, నేను జెప్తే ఇట్ల జెప్పాల్సి వస్తది అంటడు. దేర్ వజ్ లాజిక్ ఇన్ దట్.

సుభద్ర కు ఏదో చాలా లోతుగా అర్థమైనట్టనిపించి.,

చేతిలోని పుస్తకాన్నీ, డైరీనీ మూసి ఇక లేచి నిలబడింది కుర్చీలోనుండి.

కేసీఅర్ జయశంకర్ అనే ఋషి నుండి జ్ఞానాన్నీ, ఆశీస్సులనూ పొంది ఒక చారిత్రాత్మక మహోద్యమ నిర్మాణంకోసం ఎట్లా కార్యోన్ముఖుడయ్యాడో అర్థమైంది.

ఇక తను తయారై.. బయల్దేరవలసిన సమయం ఆసన్నమైందని స్పృహించి ఆమె గబ గబా తయారయ్యేందుకు గదిలోనే ఒక మూలనున్న నీటి జాలరి దగ్గరికి నడిచింది.

వెళ్ళాలి తనిక .. కరీం నగర్ కు.. ‘ జన గర్జన సభ ‘ కు.

టైం చూస్తే.. సమయం పన్నెండు గంటల ఇరవై నిముషాలు.

ముఖం కడుక్కునుడు ఐపోంగనే స్నానం చేసి.. చీర మార్చుకుంటూ.. ఆలోచిస్తోందామె.

ఎందుకో తెలంగాణా కోసం ఆత్మాహుతి చేసుకున్న మొగిలి ఆత్మ తనలోకి ప్రవేశించి నరనరాన వ్యాపించి ఒక అంతఃశక్తిగా శరీరమంతా విస్తరించి ప్రజ్వలితమై ఉద్దీపిస్తున్న అనుభూతి కలుగుతోందామెకు.

‘ మానవుడే మహనీయుడు.. శక్తిపరుడు, యుక్తిపరుడు.. అజేయుడు.’ అని ఎప్పుడూ మొగిలి అనే మాట మనస్సులో ప్రతిధ్వనిస్తోంది.

మున్ముందు తను ఏదో చేయబోతోంది.. చేయాలె తప్పక.. ఇక అందరికంటే భిన్నంగా ఆలోచించడం.. భిన్నంగా కార్యాచరణను రూపొందించుకుని ఆచరించడం.. భిన్నమైన లక్ష్యాలతో అడుగులు ముందుకు వేయడం .. అంతిమంగా ఈ జీవితానికి ఒక సార్థకతను ఆపాదింపజేసుకోవడం.. ఇవీ జరుగాల్సినవి.

టి. ఆర్.ఎస్ పుట్టి పెరిగి .. విస్తరిస్తూ.. ఓడుతూ గెలుస్తూ.. పడుతూ లేస్తూ.. అనేక ప్రతిఘటనలనూ, ఇంటి దొంగల అవహేళనలనూ అడ్డంకులనూ అధిగమిస్తూ జరుపుతున్న జైత్రయాత్ర గురించి చాలా వరకు తనకు తెలిసినా.. మొగిలి డైరీ ద్వారా ఇంకా స్పష్టమైన సత్యాలను తెలుసుకుని సాధికారికతను పొందాలె. ఈ రోజు ‘జనగర్జన సభకు ‘ వెళ్ళడం ద్వారా ఒక కొత్త ఆధ్యాయం మొదలౌతోంది జీవితంలో. ఒక బట్ట సంచీలో రెండు మూడు పుస్తకాలు.. మొగిలి డైరీ 2011 బాపతుది పెట్టుకుని, భుజానికి తగిలించుకుని సిద్ధపడ్తూండగా బయట తలుపుపై ఎవరో తడుతున్న చప్పుడయ్యింది.

వెళ్ళి గొళ్ళెం తీసి చూస్తే .. కమల. ఉద్యమకర్త. గత మూడు నెలల క్రితం పరిచయమైంది. తనవలెనే తెలంగాణ గురించి ప్రాణసమానమైన ఆసక్తి ఉన్న ఒంటరి గృహిణి.

” బయల్దేరుదామా.. లేటయ్యింది. నాలుగ్గంటలకే సభ ” అంది.

సుభద్ర నిశ్శబ్దంగానే ఆమె దిక్కు స్నేహపూర్వకంగా చూచి ఇంటికి తాళమేసుకుని అడుగు బయట పెట్టింది.

*                                                   *                                                 *

” అక్కా.. నిన్న హైదరాబాద్ ‘ తల్లుల కడుపుకోత ‘ సభకు వెళ్ళొచ్చినప్పటినుంచి నీలోపల స్పష్టమైన ఏదో మార్పు కనిపిస్తాందక్కా.. కరెక్టేనా నేను ” అంది కమల. ఆ సభకు వెళ్ళకముందూ.. వెళ్ళొచ్చిన తర్వాత కూడా కమల కలిసింది తనను. ప్రక్క వాడలనే ఉంటదామె. ఒకే రకమైన ఉద్యమ ఆలోచనలు ఇద్దరివీ కావడంవల్ల కావచ్చు మనసులు కలిసి మంచి దోస్తులయ్య్హిండ్లు వాళ్ళు.

వాత్సల్యపూరితంగా కమల ముఖంలోకి చూచిన సుభద్ర అంది.. ” కరక్టే కమలా.. నువ్వు సరిగ్గనే పసిగట్టినౌ. ఈ మధ్య చాలా పుస్తకాలను చదువుతాన. మొన్న హైదరాబాద్ వెళ్లినపుడు దాదాపు పన్నెండు పుస్తకాలు కొనుక్కొచ్చుకున్న.. నిన్న వచ్చినప్పటినుండి వాటిని చదువుతనే ఉన్న. నా కొడుకు మొగిలి హాస్టల్ మేట్.. పిల్లగాడొచ్చి వాడు రాసుకున్న మూడు డైరీలను ఇచ్చిపోయిండు. వాటినీ చదువుతాన. ఇన్నాళ్ళబట్టి చీకటి గుహవలె ఉన్న మనసు తలుపులు తెరుచుకుని అంతా కాంతివంతమై నానిండా వెలుగు నిండింది ఆ పుస్తకాలతో. ఇప్పుడు ఈ మన తెలంగాణ నేపథ్యాన్నంతా స్పష్టంగా తెలుసుకుంటున్నా.. ఎంత పుణ్య భూమో మనది. పోరుగడ్డ ఇది. వందల సంవత్సరాలనుండి తన దాస్య శృంఖలాలను తెంచుకుని విముక్తం కావడానికి ఇక్కడి ప్రజలు జరుపుతున్న శతాబ్దాల పోరాటం ప్రపంచ ప్రసిద్ధమైంది. ఇప్పుడు కేసీఅర్ నాయకత్వంలో జరుగుతున్న ఈ సుదీర్ఘ కాల యుద్ధం చారిత్రాత్మకమైంది. అంతిమమైంది కూడా. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఒక సాటి తెలంగాణ పౌరులుగా మనం అన్న కేసీఅర్ కు సర్వవిధాలుగా మద్ధతు పలికి వెంట ఉండడం, నడవడం మనందరి కర్తవ్యం.

ఇక నువ్వంటున్న ముఖంలోని కాంతి సంగతంటవా.. అది మనిషి మనసులోకి రాగి తీగలోకి కరంటు ప్రవేశిస్తే విద్యుత్ బల్బ్ వెలిగినట్టు.. మనిషికి పుస్తకాల సాంగత్యంతో సంక్రమించే జ్ఞానం బాపతు కాంతి అది. ఆత్మోన్నతి. ఒక విషయం చెప్పనా కమలా.. మనిషికి ఎప్పుడూ ప్రయోజనం మాత్రమే కలిగిస్తూ, నిరంతరం నీ వెంట ఉంటూ , శాశ్వత సాహచర్యం అందించే స్నేహితుడు ఒక్క మంచి పుస్తకం మాత్రమే. పుస్తక సాంగత్యంతో మనిషి మహాత్ముడౌతాడు. మన ఆలోచన పరిధి విస్తృతమౌతూ మనిషి విస్తరిస్తాడు. ” అంది.

కమల ఆశ్చర్యపోయింది. సుభద్ర భాష, సరళి, వ్యక్తీకరణా, అవగాహనా.. అన్నీ కొత్తదనాన్ని సంతరించుకుని తాజాగా అనిపించాయామెకు. నిజమే.. తనుకూడా ఈ పుస్తక ప్రపంచంలోకి ప్రవేశించాలె. అప్పటికే సుభద్ర దగ్గరున్న అనేక పుస్తకాలనుండి ఒక్కొక్కటి అడిగి తెచ్చుకుని చదువుతూ తనను తాను పుననిర్మించుకోవాలె.. అనుకుంది.

బస్సు కిటికీలోనుండి బయటికి చూస్తూంటే.. ఎండిపోయిన పొలాలు.. బీడుబడ్డ భూములు.. రాళ్ళు విస్తరించి ఉన్న చెల్కలు కనిపిస్తున్నాయి దీనంగా. ఆ ప్రాంతాలకు దేవాదుల ప్రాజెక్ట్ నీళ్ళు రావాలె.. కాని ఏవి.. పదేండ్లు దాటుతున్నా అతీగతీ లేదు. కాంట్రాక్ట్ లు చేజిక్కించుకుని రాజకీయ నాయకులందరూ ప్రతి ఊరిలో నిర్మించిన ‘ డిస్త్రిబ్యూటరీ ‘ కాలువలు మాత్రం నీళ్ళు రాక ఏండ్ల పర్యంతం ఉండీ ఉండీ, ఎండీ ఎండీ పిచ్చి మొక్కలతో నిండి నిరర్థకమై.. పాడుబడిపోతున్నై.

తెలంగాణ ప్రాంతమంతా నీటి వసతి లేని వ్యవసాయ భూములే. తరతరాలుగా పాలకుల చేత విస్మరించబడ్ద ప్రాంతాలివన్నీ.

బస్సు మద్దూరు పైనుండి వెళ్తోంది.

ఇద్దరూ అలా అభావంగా బయటికి చూస్తున్నారు కిటికీలోనుండి.

కాస్సేపటికి సుభద్ర సంచీలోనుండి 2011 బాపతు మొగిలి డైరీని తీసి తెరిచింది.

మొదటి పుటలోనే ఒక ఉపోద్ఘాతం వంటి నాలుగు వాక్యాలను రాసుకున్నాడు ఆ యువకిశోరం.

గత పదేళ్లుగా అహింసాయుతంగా.. రక్తపాత రహితంగా తెలంగాణ ప్రజల ‘ ప్రత్యేక రాష్ట్ర సాధన ‘ ఆకాంక్షను సఫలీకృతం చేసే దిశగా సాగుతున్న ఉద్యమంలో భాగంగా నా వంతు పాత్రను పోషించాలని ఒక పౌరునిగా పడ్తున్న ఆవేదనను శాస్త్రీయంగా అర్థం చేసుకోడానికి ఈ ఉద్యమ నేపథ్యాన్ని సంక్షిప్తంగా కింద క్రోడీకరించుకుంటున్నాను.

ఒక ప్రక్క వర్షాభావ పరిస్థితులు, మరో ప్రక్క బోర్లలో, బావుల్లో నీరు లేకపోవడం తెలంగాణ రైతులను సంక్లిష్ట జీవన సంక్షోభంలోకి నెట్టింది. అందువల్ల 1997- 2000 మధ్య కాలంలో కొన్ని వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయం భరించలేని భారమయ్యింది. ఈ స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ షరతులను అమలుచేయడంలో భాగంగా కరంట్ చార్జీలను భారీగా పెంచింది. ఆ పెంపుకు వ్యతిరేకంగా తొమ్మిది ప్రతిపక్షాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చి జరిపిన ఊరేగింపుపై బషీర్ బాగ్ దగ్గర పోలీసులు కాల్పులు జరుపగా ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఈ దయనీయ స్థితి అప్పటి శాసనసభ ఉప సభాపతిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును తీవ్రంగా కలచివేసింది. వెంటనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాస్తూ అందులో తెలంగాణా రైతుల దయనీయ పరిస్థితిని వివరించాడు. కరంట్ చార్జీల పెంపు వల్ల ‘ తెలంగాణా రైతులకు ఉన్న గోచీ కూడా ఊడిపోతుందని ‘ వేదనతో అన్నారు. ఈ లేఖ మర్నాడు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చినప్పుడు తెలంగాణా వాదులు, పలు తెలంగాణా ఉద్యమ, ప్రజా సంఘాలు కెసీఅర్ ను కలిసి తెలంగాణా సాధన ఉద్యమానికి నాయకత్వం వహించమని ఆహ్వానించారు. అప్పుడే తెలంగాణా గత దశాబ్దాలుగా ఎట్లా ఆంధ్ర పాలకుల చేత దగా చేయబడ్తున్నదో సవివరంగా తెలుసుకోడానికి జయశంకర్ సార్ ను వరంగల్ లో కలిశాడు కేసీఅర్. ఆ కీలక సమావేశంలో జయశంకర్ ప్రధాన అనుచరుడు, తర్వాత ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక సభ్యునిగా ఉన్న రాజకీయ విశ్లేషకులు వి.ప్రకాశ్ కూడా ఉన్నారు.

తర్వాత దాదాపు ఏడు నెలలు ప్రతిరోజూ నిజాయితీగల తెలంగాణా వాదులతో సుదీర్ఘమైన చర్చలు జరిపి ‘ తెలంగాణ రాష్ట్ర సమితి ‘ ని స్థాపించాలని కేసీఅర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు.

27-04-2001 న హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న ప్రముఖ తెలంగాణా వాది శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గృహం ‘ జలదృశ్యం ‘ లో ‘ తెలంగాణ రాష్ట్ర సమితి ‘ ఆవిర్భవించింది. వెంటనే ప్రసిద్ధులతో జయశంకర్ గారి మార్గదర్శనంలో ఇక జైత్ర యాత్రను ప్రారంబించారు.

05-05-2001 న ‘ ఉస్మానియా ఫోరం ఫర్ తెలంగాణ ‘ లో కేసీఅర్ ప్రసంగించి ఇక సమరయాత్రను ఆరంభించారు.

11-05-2001 న తెలంగాణలోని వేలాది గ్రామాల్లో గులాబీ జెండాను ఎగురవేశారు.

17-05-2001 న ఉదయం హైదరాబాబ్ నుండి రెండు వందల వాహనాల్లో బయలుదేరి కరీం నగర్ కు చేరేసరికి వేల వాహనాలుగా మారిన మహా జనహోరుతో ‘ సింహగర్జన ‘ సభను జయశంకర్ సార్ పాదాభివందనంతో సముద్రకెరట సదృశంగా నిర్వహించి యావత్తు తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆశలను రేకెత్తించారు. మళ్ళీ అగ్ని రగిలింది ఆ రోజు

01-06-2001 న మహబూబ్ నగర్,

02-06-2001 న నల్గొండ,

04-06-2001 న నిజామాబాద్,

05-06-2001 న అదిలాబాద్,

21-06-2001 న వరంగల్ లలో ఉధృతమైన సభలు జరిగాయి. ఉద్యమాగ్ని అంటుకున్న అడవిలా విస్తరించడం మొదలైంది.

22-09-2001 న తను రాజీనామా చేసిన సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో కేసీఅర్ మళ్ళీ ఎన్నికయ్యారు.

తర్వాత ‘ జలసాధన ‘ పై దృష్టి సారించి ప్రజలకు ఏ రకంగా తెలంగాణా నీళ్ళనూ, నిధులనూ ఆంధ్రులు తరలించుకుపోయారో ప్రజలకు 2002 డిసెంబర్ నుండి తెలియజేస్తూ 2003 జనవరి 6 వరకు జలసాధన ఉద్యమాన్ని రోజుకొక సభ చొప్పున నిర్వహిస్తూ ఉద్యమ సెగ తగ్గకుండా సజీవంగా , ప్రజ్వలితంగా కాపాడుతూ వస్తూ, ప్రతి సభలోనూ.. టీఅరెస్ ఏ రాజకీయ నిర్ణయం తీసుకున్నా ‘ తెలంగాణా సాధన దిశ ‘ గానే అడుగులు వేస్తుందని ప్రకటించారు స్పష్టంగా. ఒక దశలో ‘ తెలంగాణా కోసం గొంగళి పురుగును ముద్దాడుతా.. కుష్టు రోగిని కౌగలించుకుంటా ‘ అన్నారు కేసీఅర్. జనవరి 6 న జలసాధన ముగింపు సభను భారీగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించి కేంద్ర మంత్రులు రాం విలాస్ పాశ్వాన్, శిబూ సిరేన్, మేధా పట్కర్ లను ఆహ్వానించి జయప్రదం చేసారు.

2004 లో రాష్ట్ర శాసనసభ, లోకసభ లకు ఎన్నికలొచ్చినై.

10-05-2004 న జరిగిన ఎన్నికలకు ముందు వరంగల్ లో 15 లక్షల మందితో జరిపిన టీఅరెస్ భారీ బహిరంగ సభతో ఖంగు తిన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తుకోసం గులాం నబీ ఆజాద్ ను రాయబారం పంపి చర్చలు జరిపారు. టి ఆర్ ఎస్ ‘ తెలంగాణ రాష్ట్రాన్ని ‘ ఏర్పాటు చేస్తామని ‘ కామన్ మినిమం ప్రోగ్రాం ‘ లో ప్రకటింపజేసి పొత్తులో భాగంగా 6 లోకసభ స్థానాలకు ఐదింటినీ, 26 శాసనసభా స్థానాలనూ కైవసం చేసుకుంది.

ఒప్పందంప్రకారం ఇక్కడ రాష్ట్రంలోనూ, అక్కడ యుపిఎ కేంద్ర ప్రభుత్వంలో కేసీఅర్, ఆలె నరేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు.

తెరాస విజయం తర్వాత 07-06-2004 న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తన ప్రసంగంలో ‘ కన్సెన్సెస్ ‘ ద్వారా భవిష్యత్తులో ‘ ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ‘ కేంద్రం ఏర్పాటు చేస్తుందని హామీ ఇవ్వడంతో.. ప్రజలకు తెలియవచ్చింది టీఅరెస్ వ్యూహం.

ఎన్నికలప్పుడు కరీం నగర్ సభలో సోనియా గాంధీ ఇచ్చిన ‘ తెలంగాణ రాష్ట్ర ‘ ఏర్పాటు హామీ, తర్వాత ఏర్పాటు చేసిన ‘ప్రణబ్ ముఖర్జీ కమిటీ ‘ నిర్వ్యాపకం, యుపిఎ పార్లమెంట్ లోని భాగస్వామ్య పార్టీలలో 222 మంది మద్దతును కూడగట్టినా మోసపోవడంతో విసిగిపోయిన కేసీఅర్, నరేంద్ర కేంద్ర ప్రభుత్వంనుండీ. ఇక్కడ రాష్ట్రం నుండీ 2006 ఆగస్ట్ 23 న అందరూ వైదొలగారు.

( మిగతాది వచ్చే పక్షం )

రామాచంద్ర మౌళి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు