అపుడెపుడో పతంజలి రాతలు చదివి ఉంటాం ఈ టోన్ లో. ఇపుడు మరింత విస్తారంగా మహర్షిజం. ఇజం లాంటి బరువైన సఫిక్స్ అవసరమా అనొచ్చుగానీ, ఎందుకూ? పోయేదేముంది. మహర్షి కూడ అంత బరువుగా అనుకుని ఉండకపోవచ్చు. మరి, మన కెంతుకంత బాధ! లేని పోని మూల శంకలు అనిపించుకోవడం తప్పితే! మనిషి కోసం అన్వేషణలో తెలిసిన జీవితపాఠాల్ని చెప్పే ప్రయత్నంగా అర్థం చేసుకోవచ్చు. ఇజం అన్నారు కదాని లాంగ్ ఫేస్ పెట్టుకుని ముళ్లకిరీటం అద్దెకు తెచ్చుకుంటారేమో అని భయపడి రచయిత చిద్విలాసంగా నవ్వుతుంటారు అట్టమీద. సో నో బుర్ర గోకుడ్స్, నో గడ్డం కింద చేతుల్స్. జస్ట్ రీడ్ అండ్ ఎంజాయ్!
ఇట్స్ ఏ ప్యూర్ రీడింగ్ ఎక్స్ పీరియెన్స్. వజ పోసినట్టో నస పెట్టినట్టో ఉండదు. అలతి పదాలు, అందమైన వాక్యాలు. ఆ సొగసు కోసం చదవొచ్చు అసలు. అంత పొగరు విగరున్న రచయితలెంతమందున్నారని ఇపుడు!
ఇంతకీ ఏముంది, ఎందుకు చదవాలి! అనుభవ శకలాలు, వాటినుంచి పుట్టుకొచ్చిన జ్ణాన బొడిపెలు. చదువుతున్నపుడు నీకేదో గుర్తుకు రావడం ఖాయం. ఇంకెక్కడో రిలేట్ చేసుకోవడం ఖాయం. అర్రె భలే చెప్పాడే దగ్గర్నుంచి ఏం కొట్టాడ్రా దెబ్బ దగ్గర్నుంచి ఇరగదీశాడు మామా దాకా అనేక షేడ్స్ లో అనిపించడం ఖాయం- నువ్వున్న చోటును బట్టి, నువ్వున్న కంపెనీ బట్టి. అది చాలుకదా!
స్వర్గంలో మద్యనిషేధం ఉందని తెలిస్తే నరకానికి డిమాండ్ పెరుగుతుంది అన్నపుడు ఈల వేయాలనిపించదూ! గొర్రెల లోకంలో పొడుగు తోకవాడు రాజు అన్నపుడు ఏం చెప్పాడు మామా అనిపించదూ! ఇదిగో ఇట్లా పేజీకి కనీసం ఒకటైనా తీసుకోదగిన కొటేషన్ దట్టించిన పుస్తకం ఇది.
జింకకు పులికి దేవుడు ఒకడే, ఆ పూటకు ఎవరో ఒకరి వైపు ఉంటాడు అని జీవవసారాన్ని విప్పి చెప్తారు. జలగకు తీసుకోవడమే తెలుసు, అది రక్తదానం చేసే వాళ్లని నమ్మదు అని లోకం పోకడ వివరిస్తారు. దుక్కం ఆవరించినపుడు మనకు చిటికెన వేలు అందించిన వాళ్లే ఆప్తులు, పగటి పూట కంటే రాత్రి పూటే మనుషులు స్పష్టంగా కనిపిస్తారు అని ఆధునిక గీతాసారంగా చెపుతారు. అట్లా ఎన్నో…
ఎంతో జీవితాన్ని చూస్తే కానీ ఇది సాధ్యం కాదు. గానుగలో ఎంత నలిగితే ఎంత యాతన పడితే మనముందుకీ అక్షరం!
‘‘ఈ ప్రపంచం మాయలోంచి పుడుతోంది. మాయ అర్థమయ్యేలోగా మనం మాయమైపోతాం’’ అంటారు మహర్షి. ఈ మాయ తాలూకు మంత్రాంగమే ఈపుస్తకం. గోడో లేడు రాడు అని వెయిటింగ్ ఫర్ గోడో అనేది అర్థం లేని అన్వేషణ అని తెలిసిన మనిషి చేసిన సత్యాన్వేషణ ఈపుస్తకం. 
వయసు పెరిగేకొద్దీ, అనుభవం జ్ణాపకంగా మారేకొద్దీ బరువుగా తయారవుతుంది. తడుముకుంటే గాయాలు బొడిపెలు బొడిపెలుగా తగులుతుంటాయి. కొన్నిచిరు దరహాసాలనిచ్చే జ్ణాపకాలుకూడా ఉంటాయి కానీ వాటి నిడివి తక్కువ. ఆనందాన్ని క్షణ భంగురం చేయడం అనేది సృష్టి రహస్యాల్లో ఒకటి. నమ్మకం మోసం, ధైర్యం పిరికి తనం, జింక తోడేలు లాంటి అనేక ద్వంద్వాల మధ్య గీత చాలా పలుచటిది. ఒకడే ఒక్ఖడే ఒక్కో సందర్భంలో ఒక్కోలా. నువ్వే అన్నీ. ద్వంద్వాలున్నదే అందుకు. అలాంటి అనేకానేక రహస్యాల్ని ఈ పుస్తకం ద్వారా పంచుకుంటారు మహర్షి. జింక చర్మం పై కూర్చొని శాంతి కోసం ధ్యానం చేసే ప్రపంచ స్వభావాన్ని నీ ముందుంచుతారు.
మొట్టికాయలేసినట్టో, చెళ్లున చరిచినట్టో, మృదువుగా వెన్ను నిమిరినట్టో, భుజం మీద చెయ్యేసి ఓదార్చి చెపుతున్నట్టో రకరకాల భంగిమల్లో కనిపిస్తారు మహర్షి. కొన్ని చోట్ల పద్మాసనం వేసుకుని చిటికెన వేలుకు బొటన వేలు ఆనించిన భంగిమలో కూడా. అతిగా నమ్మొదంటాడు. నమ్మి చెడిన వాడులేడంటాడు. జింకా తోడేలు నువ్వేనంటాడు. కాకపోతే జింకల వైపే ఉండమంటాడు. గడ్డిపరక అస్తిత్వాన్ని గౌరవించమంటాడు. రైతు నాగలికి నమస్కరించమంటాడు. పెద్ద విషయమేమీ కాకపోవచ్చు గానీ మనిషిగా ఉండమంటాడు. అట్లా ఏవోవో చాలా అంటాడు. డ్రై గా చెప్పడు. ఒద్దికగా పద్ధతిగా అందంగా చెపుతాడు.
అందమైన వచనం కోసం అందమైన వ్యక్తీకరణ కోసం మాత్రమే కాకుండా కాస్త సున్నితత్వం కోసం కూడా పుస్తకం చదవొచ్చు. పేజీకి ఒకటైనా కోటబుల్ కోట్ గ్యారంటీ కాబట్టి నిరాశపడరు. జీవితాన్ని తనదైన రీతిలో రసాత్మకంగా స్కాచి వడపోసి చిక్కగా వడ్డించిన విస్తరి ఇది.
వచనం రసాత్మకంగా ఉండే వారిలో చాలామందిలో ఉన్నట్టే మహర్షిలోనూ ఎక్స్ ట్రీమ్స్ ఉంటాయి. ఒక ఎక్స్ ట్రీమ్లో కార్పోరేట్లు ఉంటే మరో ఎక్స్ ట్రీమ్ లో రైతులు ఉంటారు. కచ్చ ప్రేమ రెండూనూ. కార్పోరేట్ల ప్రస్తావన వచ్చినపుడల్లా అందులోనూ హెచ్ ఆర్ అనే ప్రస్తావన వచ్చినపుడల్లా మూడో కాలు అద్దెకు తెచ్చుకుని మరీ తంతారు. రైతు ప్రస్తావన వచ్చిన చోటల్లో ప్రపంచంలోని మార్దవమంతా అక్షరంలోకి ఒంపుకుని పాదాభివందనం చేస్తారు.
అలాగే చాలా మంది రచయితల్లాగే అబ్సెషన్ గా మారిన ఇష్యూస్ ఇక్కడా ఉన్నాయి. రైతులతో పాటు జింకలు, రాజకీయనాయకులు, ఉచితాలు రికరింగ్ థీమ్స్. రిపిటీడ్ ఎక్స్ ప్రెసన్స్. వీటన్నింటిమీద రచయితకు చాలాబలమైన అభిప్రాయాలున్నాయి. కాకపోతే చాలా సందర్భాల్లో జింక వైపు ఉంటాడు. ఉండమంటాడు. అక్కడ రచయిత నిలబడతాడు. ఏం రాస్తావు ఎంత బాగా రాస్తావు అనేదొక్కటే ప్రామాణికం కాదు, ఎక్కడ నిలబడతావు అనేది ముఖ్యం.
ట్రాఫిక్ లైట్ల దగ్గర విసుక్కునే సన్నివేశాలుంటాయి కదా, చాలామంది అంటుంటారు కూడా ‘‘డబ్బులు వేయకండి సర్, దొంగ ముండలు సర్, ఇదొక మాఫియా సర్, చిన్న పిల్లల కాళ్లు చేతులు విరిచి అద్దెకిస్తారు. రెండ్రూపాయల పెన్నుకు పదిరూపాయలిద్దామని నువ్వు విండో దించితే బ్యాగ్ గుంజుకుని పారిపోతారు సర్’’ అని కూడా గుసగుసగా హెచ్చరించేవారుంటారు. అది నిజమే కావచ్చు. కానీ మహర్షి మరో కోణం చూపిస్తారు. ‘‘కొనకపోయినా పర్లేదు, ఈసడించుకోకు. ఎరుపు, ఆకుపచ్చ వెలుతురు మధ్య జరిగే జీవన పోరాటం అంటారు. ఇది కూడా నిజమే కదా! ఇన్ని నిజాల మధ్య ఏ నిజాన్ని చూస్తావు అనేది కదా విషయం. ‘‘పెద్ద దొంగలకు గౌరవం చిన్న దొంగలకు శిక్ష, శతాబ్దాలుగా లోకనీతి’’ అని గుర్తుంచుకుంటే కిందికి చూసేటపుడు సహానుభూతో సానుభూతో ఏదో ఒకటి కలుగుతుంది. పై చూపులో ఎపుడూ గౌరవమూ కింది చూపులో ఎప్పుడూ ఈసడింపు ప్రదర్శించే మనిషిని పురుగు అనవలె కదా! ఇలాంటి లోచూపు అవసరమైన చూపు ఇందులో చాలా ఉంది.
‘‘తనలో ఒక సీతాకోక చిలుక ఉందని గొంగలిపురుగుకు తెలుసు, కానీ తాను ఒకప్పుడు గొంగలిపురుగని సీతాకోక చిలుక మర్చిపోతుంది. గతాన్ని మర్చిపోవడం పురుగుల లక్షణం’’ అని స్థితి మార్పుతో మతిమరపు తెచ్చిపెట్టుకునే మరో రకమైన పురుగు లక్షణాన్ని వివరిస్తారు మహర్షి.
ఇబ్బందులు అస్సలు లేవని కాదు. ఏ పేజీకాపేజీ సాఫీగా జారుడుబల్లలాగా సాగిపోతుంది. ఏ వాక్యానికా వాక్యం రసాత్మకంగా ఉంటుంది. పుస్తకం అంతా ముగించాక ఏం మిగులుతుంది అంటే చెప్పడం కష్టం. అంటే ఒక కనెక్టింగ్ ధార లేకపోవడం వల్ల తాను చూసిన జీవితాన్ని అర్థం చేసుకున్న జీవితాన్ని కలవరించి పలవరించడం వల్ల అందులోని అందం లాక్కెలుతుంది కానీ గట్టిగా ఇదిగో ఇది తీసుకున్నాను అని చెప్పడానికేమీ ఉండదు.
అనుభవపాఠాలను సింథసైజ్ చేసి బైట్ సైజ్లో అందించేప్పుడు అక్కడక్కడా ఎక్స్ ప్రెషన్ ఉన్నీస్ బీస్ అవుతుంటది. జెన్ జీ భాషలో సిక్స్ సెవెన్ అనాలేమో. అలాగే హృదయమెక్కడుందో చాటాలని ప్రయత్నించినపుడు దాని ఆధిపత్యం అక్కడక్కడా మోతాదు మీరుతుంది. గ్లామరైజేషన్ చొరబడుతుంది. వచనాన్ని కవిత్వం చేసేటప్పుడు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులు కూడా అక్కడక్కడా తగలొచ్చు.ఇవ్వన్నీ అక్కడక్కడా కనిపిస్తాయి.
ఎక్స్ ట్రీమ్స్తో , ద్వంద్వాలతో వచ్చే ఇబ్బందే అది. వ్యవసాయం పట్ల మక్కువ రైతుల పట్ల గ్లామర్గా మారుతుంది. కార్పోరేట్ ప్రపంచం కంటే రైతాంగం కేంద్ర స్థానం పోషించే పాత గ్రామీణ సమాజం గొప్పదేమీ కాదు. గత కాలము వచ్చు కాలము కంటే మేలు కాదు. కొత్త సమాజంలో రిసోర్స్ బేస్డ్ అసమానతలుంటాయి. అవమానాలుంటాయి. అవి కనీసం దాటడానికి అవకాశమున్నవి. పాత సమాజంలో అవి పుట్టుకతో ముడిపడ్డవి. దాటడానికి అవకాశమే లేని అసమానతలు, అవమానాలు. రైతాంగం పట్ల ఆర్ద్రత కలిగి ఉండడం అవసరమే కానీ దాన్ని మరీ గ్లామరైజ్ చేస్తే ఇబ్బంది.
‘‘పల్లెటూళ్లు కూడా మాయనేర్చుకున్నాయి. మొహానికి రంగులద్దుకుంటున్నాయి. మాటలు ఘనీభవించి టీవీలు మాట్లాడుతున్నాయి. బస్సులు సర్వీస్ ఆటోలు పట్నపు గాలిని మోసుకొస్తున్నాయి, నాగరికత అంటేనే నైతిక వంచన’’ …ఎప్పటి కథ ఇది. ఏదో పాత నోస్టాల్జియా, పాతలో సౌకర్యాన్ని వెతుక్కునే నోస్టాల్జియా. పాతలో నైతికత, కొత్తలో నైతిక పతనం రెండూ వాస్తవాలు కావు. ‘‘చేపలు కథ చెపితే జాలరి విలన్, జాలరి కథ చెపితే తిమింగళం విలన్. ఎవరు చెపుతున్నరనేదే ముఖ్యం’’ అని మహర్షినే మరోచోట చెప్పినట్టు పాత పల్లెటూరి కథల్లో నైతికత గురించి న్యాయం గురించి పాలేర్లు, కూలీలు, దళిత వాడబిడ్డలు, ఆడవాళ్లు కథల్లో విందాం. ఏదీ సూనృతం కాదు.
అలాగే వ్యక్తీకరణ మీద మమకారం పెంచుకున్న చాలామంది రచయితల్లాగే అనవసర కొనసాగింపులు, రిపిటీషన్స్, వగైరా కొన్ని ఉంటాయి. ఏ వ్యాసానికా వ్యాసం విడిగా రాసింది కాబట్టి తప్పేట్టు లేవు. ఉదాహరణకు వినడం నేర్చుకో అనేది ఉందనుకోండి. ఫటా ఫటా దెబ్బ మీద దెబ్బ కొట్టి పాఠకుడిని ఒక మూడ్ లోకి తీసుకెళ్లినతర్వాత ఆసీరియెస్ మూడ్ ను డిస్టర్బ్ చేసే వాక్యం అనసవరంగా చివర్లో చొప్పిస్తారు. ‘‘బాగా బతకడం అంటే కలలు లేకుండా నిద్రపోవడం, కల కావాలి అనుకుంటే పీడకలకు కూడా సిద్ధపడాలి’’ -అయిపోయింది క్లయిమాక్స్. ఎండ్ కార్డ్ పడాలి. ఒక ధారలో ఒక ఆలోచనలో పాఠకుడిని లాక్కొచ్చారు. అక్కడ మళ్లీ తీయటి కల వస్తే షుగర్ చెక్ చేసుకో అనేది ఆ ధారలో ఇమడని ఆ మూడ్ కు సూట్ అవ్వని ఎక్స్ ప్రెషన్. దాని తాలూకు సారాంశం అంతకుముందు వాక్యాల్లోనే ఉంది.. ఇందులోని చమత్కారం అప్పటివరకూ ప్రయాణిస్తూ వచ్చిన మూడ్ కు భిన్నమైనది. అయితే అందమైన వాక్యం రాసే వాళ్లందరికీ, అంతటి రావిశాస్ర్తితో సహా తప్పని లౌల్యం ఇది.
ఉచితాలమీద రచయితకు కోపం ఉంది అని అర్థం అవుతుంది. ఏ ఉచితం అనుచితం అనేది కాస్త కాంప్లెక్స్ సబ్జెక్ట్. అన్ని ఉచితాలకు టోకున ఇంటు మార్కు పెట్టలేం.
కమ్యూనిస్ట్ స్కూల్ నుంచి వచ్చిన వాసన దాచుకోవడం కష్టం. అందులో అనివార్యంగా కనిపించే ఆశావాదం అక్కడక్కడా బయటపడుతూనే ఉంటుంది. మూడో కన్ను ఉంటుందని సామాన్యులకు తెలీదు. అది తెరిస్తే ప్రభువులు పారిపోతారు అని ఆశను జెండాగా ఎగరేస్తారు. మనిషి కళ్లు తెరుస్తాడో లేడో డౌటొచ్చిందో ఏమో! ‘‘అన్యాయం మీద ప్రకృతి పగబడుతుంది. ప్రతీకార రూపం మనకు అర్థం కాకపోవచ్చు’’ అని న్యాయం వైపు నిలబడి ప్రకృతి మీద భారం మోపుతారు.
మనిషిని మనిషి ఎందుకు దోచుకుంటాటండే మనిషిని మనిషి తినలేడు కాబట్టి అని ఫెటీల్మని కొట్టినట్టు చెపుతాడా! అదే నోటితో …‘‘ముళ్ల కంచెలు, విషవృక్షాలున్న మాట నిజమే. సూర్యోదయాలు, పసిపిల్లల నవ్వులు,గాలికి ఊగే చిన్నగులాబీలు, కొత్త పెళ్లి కూతురి కనురెప్పలు మోసే కలలు, ఎక్కడికో తెలీకుండా పరిగెత్తే వాగు, లోకం పచ్చగానే ఉంది. మనకే రెటీనా సమస్య’’ అని తూరుపు దిక్కుకు వేలు చూపిస్తారు సూర్యోదయం కోసం. పురోగామి సంప్రదాయంతో పాటు మనిషికి ఉండాల్సినంత కోపం ధర్మాగ్రహం దండిగా ఉండి అక్షరం మీద వాక్యమ్మీద పట్టుండి ముఖ్యంగా జీవితం మీద ప్రేమ ఉండి… ఇన్ని ఉంటే కానీ ఈ పుస్తకం మన ముందుకు ఈ రూపంలో రాదు. చిన్న పుస్తకమే, భయపెట్టే సైజు కాదు. ఇంకెందుకాలస్యం. కొని చదవండి.
*








Add comment