మనస్సంచీ

మొదటి అర

“ఝలాం జశోన్తే!” అరిచాను పెద్దగా.  నేనంతే. అరుస్తాను.

బ్రష్ చేయడం మధ్యలో ఆపి శూన్యాలని వెతుకుతూ పోతాను.

అన్నం తింటూ పెద్దగా కొరబోయేంతగా నవ్వుతాను.

కూర్చున్న చోట నుండి అమాంతంగా లేచి తలుపు ధడేలని వేసి వస్తాను.

చాకుని వేళ్ళకి దగ్గరగా తెస్తూ తెస్తూ చటుక్కున పక్కకి విసిరేస్తాను.

పది, ఇరవై, వంద… రీల్స్ చూస్తూ పోతాను. విసుగెత్తి మరో యాభై చూస్తాను.

మొబైల్ తీస్తాను, పక్కన పెడతాను, మళ్లీ తీస్తాను. పుస్తకం హస్తభూషణమా…హహ్హ. చరవాణ్యాయుధభూషితుండనై, అంతర్జాలంపై నా సార్వభౌమత్వాన్ని చాటుతూ స్వైరవిహారం చేస్తాను.

అడుగుపెడితేనో, వేలు కదిపితేనో నాకేం లాభమో కదలకుండా కూర్చుని ఆలోచిస్తాను.

వినోదవీక్షణామనస్కుడినై మరో పావుకిలో పాపాన్ని మూటగట్టుకుంటాను.

‘నాన్ మిచ్యోస్యో’ అంటూ ఓ కొరియన్ వెబ్ సిరీస్ కేరెక్టర్లా స్టైల్ గా పైకి అంటూ ఉంటాను.

ఏదో చెయ్యాలనుకుంటాను, ఇంకేదో సాధించాలనుకుంటాను, ఎవరినో దాటేయాలనుకుంటాను.

కానీ ఏదీ చేయను, విశృంఖలమనోసంచారం తప్ప.

‘భగవద్గీతా కించిదధీతా, గంగా జలలవ…’ ఎమ్మెస్ ని వింటూ వెక్కి వెక్కి ఏడుస్తాను.

నేనే గొప్ప, ఆడెవడసలు గొప్ప… అనే గాఢాంధకారశైత్యాల్లో సంచరిస్తాను.

పోయి‌ పోయి హిపాక్రసీ గోతుల్లో ఇరుక్కుపోతాను.

వెతుక్కుతెచ్చుకుని మరీ అంధకారాన్ని గాఢంగా ఉఛ్చ్వాసిస్తాను.

సీదంతి మమ గాత్రాణి, ముఖం చ పరిశుష్యతి… హఠాత్తుగా మోకాళ్ళమీద కూలబడిపోతుంటాను.

ఇన్-బాక్స్ మరోసారి రిఫ్రెష్ చేస్తాను, వాట్సాప్ ని గట్టిగా కిందకి లాగుతాను.

కొండెక్కుతున్న నా మనోదీపాన్ని మరో లైక్ తోనో, ఇంకో కామెంట్ తోనో వెలిగించుకోవాలని తపనపడతాను.

ఫోమో…కాదు నాది ఫోనీ‌! ఫియర్ ఆఫ్ నాట్ ఇంపార్టెంట్.

నడుం పైన ఒకడిలా, కింద మరొకడిలా… వాడు ఆ సెంటార్ లా జీవిస్తాను.

లేస్తూ ఆలోచిస్తాను, ఆలోచిస్తూ ఏడుస్తాను, ఏడుస్తూ…

“కన్నానులే… కలయికలు ఏనాడు ఆగవులే…”

వచ్చింది. ఏం చెప్పుకోనివ్వదిక.

“నోర్ముయ్!” నేను.

“నువ్వే ముయ్… నీ కళ్ళలో… పలికినవి…”

“నిన్నూ… చెప్పుతో…”
“ఆగాగు… ముందా జిప్ ముయ్!”

***

చిన్నదైపోతున్న ఓ పెద్ద అర

 ఆఫీసుంది…వెళ్ళాలి.

వెళ్ళను… వెళ్ళాలనిపించదు.

కానీ వెళ్ళాలి, ఆఫీసుంది కాబట్టి.

ఆఫీసుకెళ్ళడమంటే ఓ పర్వతం నుండి కిందికి నడవడం నాకు.

అదీ వెనక్కి, ఆ‌ శిఖరాన్ని చూస్తూ…

ఒకప్పటి నా శిఖరాన్ని తలెత్తి చూస్తూ…

చూసి తల దించుకుంటూ…

ఇంకెంతలే, కిందదాకా వచ్చేశాను…

ఇవాళ వెళితే ఇంకొంత వస్తాను…

వస్తాను (రాజపూజ్యం), పడతాను (అవమానం)

 

నేనో మహాద్భుతాన్ననుకునే అధఃపాతాళాన్ని…

నేనో విశాలోధృతజలపాతాన్ననుకునే గ్లాసుడు నీళ్ళని…

నేనో నిరాశావాదిననుకునే ఫక్తు ఆశావాదిని…

నేనో సగటు ప్రాణిని కానేకాదనుకునే సగటున్నర ప్రాణిని…

“మిమ్మల్నెక్కడో చూస్తాననుకున్నా సార్!” అన్నాడు మోహన్ మొన్న చాట్ చేస్తూ.

నేనో రోల్ మోడల్ని వాడికి.

అప్పట్లో, ఆ ఆరేళ్ళ ముందు కలిసినినప్పుడు.

నేనో స్నాప్ షాట్ రోల్ మోడల్ని.‌

ఓ భూతకాలపు మేధావిని.

ఎన్నాళ్ళని ఫెయిల్యూర్స్ ని మెళ్ళో వేసుకుని తిరుగుతాడు ఏ‌ మోహనుడైనా…

“ఏంటి సార్…ఇంకా…”

“వాట్ గాట్ యూ హియర్, వోంట్ గెట్ యూ దేర్” అంటాడు బాస్.

“దేర్” అంటే మరో శిఖరం.

ఎవడిస్తాట్ట ఇంకో శిఖరం ఎక్కడానికి? చిన్న స్టూలు ఇచ్చేవాడే కనపడడు.

“యావత్ జ్ఞానం శ్రీకరస్య, తావత్ జ్ఞానం మమ‌ న !”

యావత్…తావత్…నేను చెప్పే క్లాసే.

ఇంతకీ ఆ శ్రీకరెవ్వడు?

నా అవరోహణకి మూలకారణంబెవ్వడు?

నా అనాది మధ్య లయుడెవ్వడు?

చుట్టూ చూశాను.

ఎవడూ కనబడడే!

దూరంగా…చాలా దూరంగా ఎండ్ అవుతూ కనపడుతున్న రేస్ ట్రాక్.

ఆగి దాన్నే తీక్షణంగా చూస్తున్న నేను.

ఇంకా ఎంత దూరం ఉండొచ్చంటావ్?

అబ్బో అంత దూరముందా ఇంకా?

వెళ్ళగలవంటావా?

నేనొక్కడినే ట్రాక్ లో!

నా రేసులో నేనే భయపడుతూ…

ముక్కుతూ, మూలుగుతూ…

మధ్యలో ట్రాక్ పక్కన బెలూన్లమ్మే వాడితో సొల్లు కబుర్లు చెబుతూ…

పుల్ల ఐస్ క్రీం వాడితో పోట్లాటకి దిగుతూ…

పుచ్చకాయల బండమ్మాయితో చిలిపి బేరాలాడుతూ…

కదలికే గమనమని భ్రమపడుతూ…

అసలు లేనివాడికంటే మేలేనని ఊరటపడుతూ…

లింక్డ్ ఇన్ చూసి చివుక్కున ఈర్ష్యపడుతూ…

శిఖరాన్ని మనస్సులోకి నింపుకుని మళ్ళీ దుఃఖపడుతూ…

ఐసుముక్కలా కరిగిపోతున్న నా అస్తిత్వానికై ఆరాటపడుతూ…

ఇక్కడ కాకపోతే మరో‌చోట…

ఏదో కించిత్ సాధిస్తున్నానని గర్వపడుతూ…

దమ్ముంటే రండిరా! నీ పతాపమో, నా పతాపమో చూచుకుందాం…

ఆ కాఫీ కప్పంత ప్రపంచాలకి…

ఆ చెంచాడంత భవసాగరాలకి…

ఆ సూది బెజ్జమంత రాజ్యాలకి…

నేనే సామ్రాజ్యపతిని, సమ్రాట్టుని…

ఏయ్ ఎవరక్కడ? వచ్చి నాకు మోకరిల్లండి!

“జారే జలతారు పరదా కొంచెం కొంచెం…”

“ఛీ, ఆపు?”

“…ప్రియమగు ప్రాయాల కోసం…”

“ఫో, లోపలికి ఫో!”

“పోతా, నువ్వూ రా”

***

 ఉబ్బుగా ఉన్న మూల అర

 “బావా పెళ్ళి చేసుకుంటున్నా. మా పేరెంట్స్ లేరు తెలుసుగా, మీ పేరెంట్స్ హెల్ప్ చేయగలరా?”

పుట్టి తెలివి‌మీదికొచ్చాక స్వార్థాన్నో కళలా ప్రాక్టీస్ చేసినోడొచ్చి అడిగాడు.

ఏమాటకామాట, రాస్కెల్ కి ఏం తెలివని? అయస్కాంతమే మళ్ళీ.

నేనైతే వెర్రిగా ఎనకేపోయా కాలేజ్ అంతా.

ఏదో ఫ్రీక్వేన్సీలు కలిశాయనో జస్టిఫికేషనొకటేసుకుని.

ఇద్దరు స్వార్థపరుల మధ్య ఫ్రీక్వేన్సీ – ఓ పొగమంచు…

ట్రాష్!

వాళ్ళందరూ ఇగ్నొరెంట్ ఇడియట్స్, మనిద్దరమే ఇంటెలిజెంట్ జెంట్స్ అనుకుంటూ.

నా ఇంటెలిజెన్స్ నోరు తెరిస్తే ఇట్టే బైటపడుతుంది.

“సమ్మర్ అకేషన్లో ఏంటి ప్లాను?” జూనియర్ని అడిగా ఫ్లర్ట్ చేస్తూ.

“యూ మీన్ సమ్మర్ వెకేషన్ సర్?!”

శూలంతో నాలిక మీద పొడిచింది.

ఇంకా‌ పోదే ఆ గాటు?

తింటుంటే, నాలుక్కి తప్పుడు పదాలడ్డు తగులుతూ…

గంభీరావివేకపుజ్ఞాపకాలతో నా ఒళ్ళంతా గగుర్పొడుస్తూ…

బావ కాని బావ పెళ్ళి అయ్యింది మొత్తానికి.

చేశాం ఎలాగొలా.

అంతే. గాయబ్ మనోడు…

హూ కేర్స్… యూ లో లైఫ్స్…

అవతలోడిని మ్యాక్సిమమ్ వాడుకోగలిగినోడే తెలివైనోడు.

వాడుకోబడడాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునేవాడినేమనాలి మరి?

“చాలా కష్టపడి రాశాను, నువ్వు చదవాల్రా” అన్నాడు దశాబ్దం తర్వాత కనపడి.

నవలట!

మళ్ళీ ఎగురుకుంటూ నేను…

బుద్ధిలేని, ఎప్పటికీ రాని నేను…

ఉన్నా సెలెక్టివ్ గా వాడే నేను…

పేజీలు పేజీలన్నీ, ప్రవచనాలే…

వాక్యాలన్నీ, అటు పో, ఇటు చూడు, నా మాట విను… అనే దిక్సూచులే…

నవలంతా స్వమేథాఘనప్రదర్శనమే…

అదే అన్నాను.

కట్…కట్…ఫట్…తెగిపోయింది.

తెంపేశాడు.

“ఎలా ఉన్నావ్ రా?” తర్వాతెప్పుడో నేను.

“ “ వాడు.

“ఇంట్లో ఇలా ఉందిరా” నేను.

“ “ వాడు.

“కంగ్రాట్స్ రా, గ్రేట్ అచీవ్ మెంట్!” నేను.

“ “ వాడు‌‌.

ఘోస్టింగ్…స్టింగ్…నెగ్లెక్టింగ్…వాడు.

ఫ్రస్ట్రేటింగ్…బ్లాకింగ్…లాకింగ్…నేను.

ఎవడికి చెప్పనిదంతా?

చెబితే నోటితో నవ్వడు.

చీకట్లకో, శబ్దం బైటికి చిందని వాక్యూం ఛాంబర్లకో చెప్పుకోడమే గతి…

రాయడమే‌ గతి…

రాసి దాయడమే గతి…

దొంగనా…

 

“నీ పేరు నా పేరు తెలుసా మరీ…”

“ష్ ష్…”

“హృదయాల కథ మారే నీలో…”

“చెత్తముండా…స్టాప్!”

“నువ్వాపు ముందు…”

 ***

 ఎందుకుందో అర్థంకాని అర

 జనాలు…

ఎనిమిదో వింతేంట్రా అంటే వీళ్ళే.

రాజుగారి వస్త్రాల్లా అందరూ ‘ఉన్నారు ‘ అంటే మనమూ ఉన్నారనుకోవడమే…

బైటకెళితే నగ్నంగా రోడ్దు మీద పడేసే జనాలు…

బంగారు పళ్ళెం తీసుకోవాలి..‌.

దానిపైన మెరిసే వెండిగిన్నె పెట్టుకోవాలి…

గిన్నెలో నాణ్యమైన కుంకుమ పోసుకోవాలి…

వెళ్ళి వాడి తలుపుతట్టాలి…

“బాగున్నారా ఎక్స్ గారూ”  బొట్టుపెట్టాలి…

పిలిచి తిండి‌పెట్టాలి. పార్టీ అనే మారు పేరుతో, అఫ్ కోర్స్…

అప్పుడు, అప్పుడు కదులుతాయి జగన్నాథ రథచక్రాలు…

పలావూ, పన్నీరులకి లేచే కుంభకర్ణులు…

నీ ఇంటికొస్తే నాకేమిస్తావ్, నా ఇంటికొస్తే నాకేం తెస్తావ్ బాపతు గాళ్ళు…

“బయ్యా ఇది కొంచెం చెయ్యగలవా?”

“బలేవోడివి బాసూ, అడగాలా, అహ అడగాలా అంట?”…ఇవాళ.

నెలరోజుల తర్వాత

“అన్నా…అది చూస్తానన్నావ్!”

“అయ్యో తమ్ముడూ, అన్నీ రెడీ చేసా, జస్ట్ సెండ్ బటన్ నొక్కడమే లేటు.”

ఏదేశమేగినా ఎందుకాలిడినా, చూపరా నీ నీచ ఘనమైన జన్మ…

కాళ్ళు కిందికి లాగడానికి కప్పల్నీ, పీతల్నీ ఉదాహరణలుగా పీకేసి, మనోళ్ళని పెట్టాలి…

కప్పలు ఆర్ అన్ ఫిట్ టు కంటిన్యూ దేర్…

ఇదో కమ్యూనిటీ…

ఇదే నా కమ్యూనిటీ…

ఆ, నీకందరూ వచ్చి వందిమాగధుల్లా ఊడిగాలు చేస్తారా…?

హలో…హలో…హోల్డాన్…”ఎలా ఉన్నావ్?” అన్న రెండు పదాల వాక్యానికి దిక్కు లేదు కానీ…వంది, మాగధులంట… ఒద్దురరేయ్…

కూల్…కూల్…సర్వేభవంతు సుఖినః…

అందరం బావుండాలి…అందులో నేనుండాలి…

అందరూ బావుండాలా? అందులో నువ్వూ ఉండాలా?

ఏదో ఒకటే, రెండూ కుదరవ్!

అసలు కలవవు కూడా…

కలవమన్నా ఏం కలుస్తార్లే…

ఎవడి జెండా వాడిది, అజెండా వాడిది.

వాడు రైట్ వింగ్, ఈమె లెఫ్ట్ వింగ్.

వాడి కజిన్ ఫార్ లెఫ్ట్, ఆమె బ్రదరు ఫార్ రైట్.

వాడో లిబరల్ ఫాసిస్టు, వీడో కులపిచ్చ కమ్మ్యూనిస్టు.

దాంట్లో తప్పేముందంటాడొకడు.

నా ఒళ్ళూ నా ఇష్టం అటుందొకామె.

రేయ్, సేయ్…

తెల్లటి ఇసుకమీద, మచ్చకూడా లేని ఇసుకమీద…

ఎడాపెడా, గజిబిజిగా గీతలు గీసింది నువ్వు కాదా…

ఇది నా గీతంటే, నా గీతని విర్రవీగింది నువ్వు కాదా…

ఇప్పుడదే గీత దాటితే తప్పేంటటున్నావ్…

గీతలెవడు గీశాడసలు ట్రాష్ గాడంటున్నావ్…

ఎవర్నడుగుతున్నావీ ప్రశ్నలు?

అవతలి వాడినా?

వాడూ నువ్వేగా…

నువ్వు కాకపోతే నీ తాతో ముత్తాతో…

మా మీదోచ్చి పడతావే!

అయినా అటెటో నడుస్తూ నడుస్తూ మరో గీత గీయట్లేదా నువ్వు…?

 

ఈ జనాలే, ఈ తిమింగిలాలే నన్ను జన్మంతా ఓడిస్తూ పోయారు…

యే దోస్ తీ…హమ్ నహీ ఛోడెంగే…

క్లాప్స్, క్లాప్స్…కన్నీళ్ళు రుమాళ్ళు… సినిమాలో

యే దోస్ తీ… హమ్ నహీ పకడెంగే…

కటీఫ్స్, కటీఫ్స్… రాళ్ళు రువ్వుళ్ళు… జీవితంలో

ఫ్యాక్ట్ ఈస్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్…

స్ట్రేంజర్ కాదు, ఫిక్షన్ అమ్మ మొగుడు జీవితం…

 

“ప్రపంచంలో అత్యంత ఒంటరి స్థలము ఏదో తెలుపుము?” ఇరవై మార్కుల ప్రశ్న.

“జనాల గుంపులు…” ఠక్కున చెప్తాను.

ఇన్స్టంట్ ప్రవచనకర్తలు పుడతారక్కడ…

తకిట తధిమి తకిట తధిమి తంతాను…

ఈడ్చి తన్ని పోయేవాళ్ళుంటారక్కడ…

‘సుత్తి’ అనే ఆయుధాన్ని అసమాన పరాక్రమంతో ప్రయోగించేవాళ్ళుంటారక్కడ…

నేను సైతం ప్రపంచసుత్తికి ఘడియనొక్కడి ధారవోశానూ…

ఒకటా…వందలు, వేల ఘడియలు…

పనికొచ్చేదేమైనా చేద్దాం రా…

ఠాట్…నా పనికొచ్చేది వేరు… నీ పనికొచ్చేది వేరు…

కానీ సుత్తి కామన్… కామన్ సుత్తి…

 

ఈ మాత్రం దానికిన్ని చదువులూ, డిగ్రీలూ, అప్పులూ…

ఆ మొక్కజొన్నలమ్మే చప్పాల శీను గాడ్ని తెచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ని చెయ్యచ్చు…

ఆ బట్టలుతికే రవణమ్మని సేల్స్ హెడ్ గా పెట్టుకోవచ్చు…

ఆ టీ కొట్టు కాటం రాజు (అలియాస్ బంగారం) గాడిని హెచ్చార్ గా…

అయామ్ స్క్రూడ్ దెన్…!

కుమ్మేస్తారు వాళ్ళందరూ జాబుల్లో… నో డౌట్!

ఏం తెలివో ఒక్కొక్కడిదీ…

నమిలి మింగేస్తారు నన్ను…

నిన్ను కూడా…

డబ్బున్న యావరేజ్ గాడు సేఫ్…

యావరేజ్ గాడి యావరేజ్ గుండె సేఫ్…

యా ఖుదా తేరా గవా…వా…

 

“శృతి మించేటి పరువపు వేగం వేగం…”

“పరువమా!”

“ఉయ్యాలలూగింది నీలో…”

“నన్ను చంపెయ్ వే…చంపెయ్…”

“రా మరి…”

***

వెడల్పైన మధ్య అర

 డబ్బా, కీర్తా, జ్ఞానమా, సుఖమా…?

ఏదో ఒకటి కోరుకో వత్సా.

ఆబగా నాలుగు పాయసాల్నీ అందుకుని కలిపి తింటున్న నేను…

ఆయాసంతో ఏదీ పూర్తిచేయలేక‌ పోయిన‌ నేను…

ఎర్రగా మారుతున్న నేత్రాల్నీ,

శాపానికై పైకెత్తుతున్న హస్తాల్నీ,

గమనించలేని స్థితిలో నేను…

 

అన్నీ స్వల్పాలే, అన్నీ అల్పాలే…

స్వల్పాల్పానందస్వామిని!

అధికానందస్వామినయ్యేదెలాగ?

 

ఎహె, పోతే పోయింది, ఒదిలిపడెయ్ అన్నీ…

ధైర్యే సాహసే కీర్తీ…

విన్నట్టు లేదే అలా‌.

బోడి, నువ్వూ నీ నాలెడ్జూ…

పోనీ ధైర్యం ప్రీ-రిక్విసిట్ కదా, అదెవడిస్తాడిప్పుడు నాకు, నీ బాబా?

బాసూ…!

 

ఓ రోజు తేల్చుకుందామని కీర్తిని కాఫీకి తీసుకెళ్ళా.

“నాకూ నీతో వచ్చెయ్యాలనే ఉంది స్వల్పా, కానీ…”

“ఏంటో, కానీ…”

“ఆ డబ్బునీ, సుఖాన్నీ ఎలాగొలా వదిలించుకోగలవా?” అంది.

“శని ముండలవి” అంది మళ్ళీ ఆశగా నా కళ్ళలోకి చూస్తూ.

నేనంటే ఇష్టం దానికి. పడి చస్తుంది.

దాని వేళ్ళు తడుముతూ కాసేపు ఆలోచించా కానీ, చివరికి వల్లకాదనేశాను.

అమ్మో! అవి లేకుండానా? పూట గడవదే!

“పో పో వాటితోనే కులుకు పో” తిట్టిందది.

 

డబ్బా, జ్ఞానమా, కీర్తా, సుఖమా…?

అదే‌ కూడల్లోకొచ్చి పడ్డాను.

నీయబ్బ… మ్యాట్రిక్స్ రిటర్న్స్, దట్ కూడలి మ్యాట్రిక్స్ రిటర్న్స్…

 

ఎందుకు జీవితం పదే పదే అక్కడికే తెస్తోంది?

ఎందుకది మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తోంది?

ఎందుకది తిప్పి తిప్పి నన్నిలా వేధిస్తోంది?

 

“భగవంతుడా, నువ్వే నాకోదారి చూపించాలి.”

“అదేంటి, నాలుగు దార్లు చూపించాగా!”

“అన్నైతే కష్టం, దారితప్పిపోతున్నా.”

“మెదడొకటి ఇచ్చాను గుర్తుందిగా”

“తెలుసు స్వామీ, కానీ దాన్నెలా వాడాలో కూడా చెప్పు దయచేసి.”

“మెదడు‌తో కాదు కొన్ని గుండె ధైర్యంతో చెయ్యాలి.”

హహ్హ…నా యావరేజు గుండెతోనా?

 

“ఆ పని చేస్తానే…” నేను

“చెయ్యి కానీ వాళ్ళేమంటారో…” గుండె

“ఇటు పోతానే…”

“పో, కానీ చూడు వీళ్ళేమనుకుంటారో…”

“ఓయ్, అది కొంటానే…”

“ఉమ్…ఏమో మరి…నీ ఇష్టం!”

“ఎహె ఇది తింటానే…”

“తిను తిను…బాగా తింటున్నావీ మధ్య.”

“పోనీ ఓ సారి నవ్వుతానే…”

“దాన్దేముంది, నవ్వు. నోరు పెద్దగా తెరవకు…”

 

నన్ను ఫక్తు యావరేజ్ గాడిగా మార్చేసిన నా గుండె…

దిల్ మే‌ దమ్ కమ్ హై బా…

యాడ దొరికిద్దో సెప్పి సావు బా…

ఓ పావుకిలో తెచ్చుకుంటా…

 

ఎలా పుడతాం? ఆడా, మగా…

ఏ మతంలో పుడతాం? హిందువా, ముస్లిమా, క్రిస్టియనా…

ఏ కులంలో, ఏ ప్రాంతంలో…

ఏ గుండెతో పుడతాం?

ప్చ్…తెలీదయ్యా తెలీదు.

చూడూ, పైవేవీ మార్చలేకపోవచ్చు కానీ చివరిది మార్చచ్చు.

నోర్ముయ్! మార్చచ్చంట మార్చచ్చు… ప్రవచనాలు…

ప్రతోడూ చెప్పొచ్చే వాడే…

 

పరాక్రమంతో, తెలిసి తెలిసి అభిమన్యుడా పద్మవ్యూహంలోకి ప్రవేశించినట్టు…

ఆకలితో, చూస్తూ చూస్తూ పురుగు సాలెగూడు‌లోనికి పాకినట్టు…

వీరత్వంతో, అంగలేస్తూ వేస్తూ గుర్రం ఊబిలోకి దిగినట్టు…

భయంతో, పెరుగుతూ పెరుగుతూ, స్వయంగా అష్టదిగ్బంధనం చేసుకున్న నా గుండె…

అష్ట కాదు, సహస్ర దిగ్బంధనం…

సహస్ర దిగ్బంధనాలు దేనిలో ఉన్నవో అది…

బహువ్రీహి సమాసమైన నా యావరేజు గుండె.

 

నాతో నేనే సహగమిస్తూ…

గమిస్తూ, శ్రమిస్తూ, భరిస్తూ…

చేతనాచేతనల మధ్య దూరాల్ని కొలుస్తూ…

మనిషనే పాత్రని నాటకీయంగా పోషిస్తూ…

నాతో నేనే అనుగమిస్తూ…

హెల్…నాతో నేనే రమిస్తూ…

 

స్వప్నం…ఫ్యాంటసీ…

కిటుకుని కనుక్కున్న నా గుండె…

నయాగరాలకి ఎదురెళ్ళక్కర్లేదు…

హిమశిఖరాలని అధిరోహించక్కర్లేదు…

బిజీకూడళ్ళలో రోడ్దు దాటక్కర్లేదు..‌.

‘ఐ డిసగ్రీ’ అని మీటింగుల్లో బల్లగుద్దే పెద్దపనులేవీ చెయ్యక్కర్లేదు…

 

అన్నీ కలల్లోనే…

అరచేతిలో వైకుంఠం…

అరగుండెలో కైలాసం…

 

ఓ సిగరెట్టందుకో బాసూ…

ఓ మాంచి పెగ్ ఫిక్స్ చెయ్ బాసూ…

ఓ పగటి కల పంపు బాసూ…

సుఖాల లిస్టు పెద్దది..‌.

గుండె సైజ్ చిన్నది…

దమ్‌ థోడా కమ్ హై నా బా…

కలలకి దమ్మెందుకురా బట్టేబాజ్…

 

గుండెనొకసారి చూడాలి. కలవాలి దాన్ని పర్సనల్గా…

కనిపించే గుండెని కాదు బా…

కనిపించని పిరికిని…

ఎలా ఉంటుందో అది?

నగ్నంగానా?

అన్నీ కప్పుకునా?

 

ఆ అర…మూలున్న ఆ అరేంటి?

ఎప్పుడూ తెరిచినట్టు లేదే…!

చూద్దామా?

వద్దులే…మళ్ళీ గొడవ…

ఎహె, లెట్స్ ఓపెన్…

 

ఆహ్, కటిక చీకటి!

 

“గుముసుం గుముసుం గుప్పు ఛుప్పు,

గుముసుం గుప్పు ఛుప్పు…”

“నువ్వా!”

“మామా‌ కొడుకూ రాతిరికొస్తే… ఊ…పాడు.”

“వద్దే“

“ఎహె పాడు!”

“….వ ద ల కు రేచుక్కో…”

*     

పాణిని జన్నాభట్ల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.