పొద్దు మొగ్గలపై
ఇంకా మంచుతడి ఆరకముందే
గాలి కాదు
బాంబుల వర్షం పడింది.
ఆకాశం
పిట్టల పాటలు వినిపించాల్సిన వేళ
లోహవిహంగాల క్రూరశబ్దాలతో
బెదిరిపోయింది.
ఇంకా అక్షరాలు నేర్చుకోని
బొమ్మలు పట్టుకున్న చేతులు
బిక్కుబిక్కుమని భయాన్ని కావలించుకున్నాయి.
మట్టిలో పూల పరిమళం ఆవిరై
అంతటా పసిమాంసం దహిస్తున్న
దుర్వాసనే వ్యాపించింది.
నెత్తిన గూడు కూలి
సజీవ సమాధులయ్యాయి.
లక్షల మంది క్షణంలో
అనాధలయ్యారు.
రాజకీయ క్రీడల ఆధిపత్య పోరులో
అమాయక ప్రజలు సమిధలు.
యుద్ధవ్యాపారంలో లాభపడేది
ఆయుధ వ్యాపారులు.
లాభనష్టాల తక్కెడ లెక్కలు చూసి
యుద్ధవిరమణ జరుగుతుంది.
లెక్కకు మించిన సమాధుల లెక్కలు
భూస్థాపితమవుతాయి.
రెక్కలు తెగిన శాంతి పావురాలకు
కళ్ళు కనపడకుండా కుట్లేస్తారు
సమాధులన్నింటిని ఒక తోటగా చేసి
ఒక స్మారక కట్టడం మొలిపిస్తారు.
మొదలు కూలిన లక్షలాది జీవితాలు
చావు జ్ఞాపకాల నరకయాతనతో
సమాధుల ముందు దీపాలై కాలుతుంటాయి.
క్షిపణులు చేసిన భవనాల బూడిద మీద
రాబందుల రాజకీయులు
శాంతి ఒప్పందాల సంతకాలు చేస్తారు.
కళ్ళు తేలేసి పడివున్న అంతర్జాతీయ చట్టాలన్నీ
మళ్లీ జీవచ్ఛవాల్లా పైకి లేస్తాయి.
యాభై సంవత్సరాలు వెనక్కి నెట్టబడిన నాగరికత
కుంటుతూ ముందుకు అడుగేస్తుంది.
భూమి గుండెల మీద గాయాలు పూడ్చే కాలం
కలికాలం గుప్పెట్లో రక్తకన్నీరు కారుస్తుంది.
*








బావుంది.