అవునో కాదో !

ఉందో లేదో ల నడుమ

ఆమె జ్ఞాపకం శూన్యంలో ఊగిసలాడుతున్న చందమామ.

ఇన్నేళ్ళ ఎడబాటు కాని ఎడబాటు

గమ్యాగమ్యాల చివరంచు జరీ బూటా.

 

నాదీ నాదికాని ఆమె ఊహ

పేరీ పేరని మీగడ తరక.

చూపుల పరిమళాలు పెనవేసుకున్న అలనాటి అనిమిష క్షణికం

అలలను ఈదడం తెలియని మీనరేఖ.

వెన్నెల తడిపిన మేఘం కురిసిన మెరిసీ మెరువని మెరుపు

కురిసీ కురువని తొలకరి జల్లు.

 

మాటలను కూర్చలేని మౌనం మాటున

చిగురించీ చిగురించని చిగురు గుండెల

స్నిగ్ధరాగం

చిలికీ చిలకని సుమకోమల పరిమళ పరాగం.

 

అది మారాకు వేయని తటిల్లత,

ప్రేమో కాదో తెలియని దశాబ్దాల సందిగ్ధ అపురూప అమృత స్ఫురణ.

 

– ‘ఆమె’కు అంకితం.

నాగరాజు రామస్వామి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.