భాషతో పని లేని ఎరుక

  ఇప్పుడంటే మనం మన ప్రతి స్పందననూ ఇతరులతో పంచుకునేటప్పుడు భాషను వాడుతున్నాము. అలాగే ఇతరుల స్పందనను గ్రహించడానికి కూడా. కాని భాష మన జీవితంలో ఎప్పుడు ప్రవేశించింది? అంతకు ముందు వరకూ వున్న ఎరుక మనకు ఎలా వచ్చింది?

నేను ఏ ఊటీ, గేంగ్టాక్ లాంటి ప్రదేశానికి వెళ్తే అలా స్థాణువునై ఆ అందం విశాలత్వాన్ని నోరు వెళ్ళబెట్టి చూస్తూ వుంటాను. అప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనా వుండదు. అంటే భాషలో వ్యక్తీకరించగల అని నా అర్థం. ఎందుకంటే ఆ స్వచ్చతకు ఏ భాషా సరిపోదు. ఏ నిద్రపోతున్న పసిపాపను చూసినా, కారణంలేకుండానే నవ్వే పిల్లలను చూసినా, దూడనూ కోతి పిల్లనూ చూసినా, పూలను చూసినా, ఉన్నట్టుండి కురిసిన వర్షంలో తడిచినా, అప్పుడు మనకు భాషకు మించిన ఎరుక కలుగుతుంది. వొకసారి నేనూ మా ఆవిడా తిరుపతి కెళ్ళాము. అనుకున్నదానికంటే తొందరగా దర్శనం అయిపోయింది. అయినా మర్నాటిదాకా అక్కడ వుండాలి. తెల్లారకముందే అర్చనానంతర సేవ అని వుంటుంది వెళ్దామా అని అడిగా. అంత తొందరగా లేవగలమా అని సంశయించింది. టికెట్లు తీసుకుందాం, కుదరితే వెళ్ళొచ్చు అన్నా. ఇద్దరికీ నిద్ర మహా ప్రియమైనది. కాని మర్నాడు ఎవరూ లేపకుండానే మూడింటికి మెలకువ వచ్చింది. అంత చలిలోనూ చన్నీటి స్నానం చేయగలిగాను. దర్శనానికి వెళ్ళాను. ఆ క్షణమో, అర క్షణమో నాకు కలిగిన అనుభవాన్ని నేను ఏ భాష సాయంతోనూ చెప్పలేను. బయటికి వచ్చాక తను నా కాళ్ళకు నమస్కరించింది. బిత్తర చూపులు చూస్తూ లేపి, యేంటిది అన్నా. నీ వల్లే నాకు ఈ అనుభూతి దక్కింది, ఇంతకంటే చెప్పలేను అంది.

మనం తల్లి కడుపులో వున్నప్పటినుంచీ మెదడులో ఆలోచనలు, హృదయ స్పందనలు కలుగుతూ వుంటాయి. ఏ భాషా అవసరం లేకుండానే. డాక్టర్ స్పాక్ కూడా వ్రాస్తాడు, పసి వయసులో పాప స్పర్శ ద్వారా ఎవరినైతే గ్రహిస్తుందో, గుర్తుపడుతుందో ఆ మనిషితో అటాచ్మెంట్ కలుగుతుంది. అందుకే పాప స్నానం తల్లిదండ్రులే చేయించాలంటారాయన. మా బాబు పుట్టి, రెణ్ణెల్లప్పుడు ఊయలలో వుంటే, మా ఆవిడ కిటికీ బయటినుంచి కూ కూ చుకు చుకు అని పాడేది. వీడు తల తిప్పి చూడాలని ప్రయత్నించే వాడు. ఆ గొంతును వాడు కడుపులో వున్నప్పటి నుంచీ వింటున్నాడు. అందుకే ఆమె జోల పాడితే హాయిగా నిద్రపోతాడు. నేను చాలా సిగ్గరిని. కాని వీడు పుట్టాక అదంతా ఎటో పోయింది, బోల్డంత బేబీ టాక్ చేశాను. వాడు కిలకిలా నవ్వేవాడు. ఇదీ మా ఇద్దరి మధ్య నడచిన సంభాషణ. రకరకాల శబ్దాలతో కూడుకున్న ఇది ఏ భాష?

ఆరు నెల్లు గడిచి పోయాయి. మెటర్నిటీ లీవ్ అయి పోయింది. తను బేంక్ మరలా చేరింది. మాకు అదృష్టవశాత్తు మంచి క్రెష్ దొరికింది. అయినా మొదటి రోజున వాణ్ణి వదిలినపుడు నా స్పందన నా కంటి నుంచి వచ్చింది. అలాంటి మరో సందర్భం వాణ్ణి స్కూల్లో వేసినపుడు. రోజూ వాణ్ణి క్రెష్ లో దించి, తను బేంక్ కి వెళ్ళేది. సాయంత్రం అయిదు-అయిదుంపావు మధ్యలో తీసుకురావడానికి క్రెష్ కెళ్ళేది. వో రోజు అక్కడి నిర్వాహకురాలు చెప్పింది. రోజూనట ఇంచుమించుగా అయిదయ్యే సరికే వాడికి అమ్మ వచ్చే వేళ అయిందని అర్థమయ్యేదిట. ఆ వేళప్పుడు గోడ గడియారం చూసేవాడట. గోడగడియారాన్నీ, కిటికీనీ మార్చి మార్చి చూసేవాడట. తర్వాత కిటికీ దగ్గర కూచుని అమ్మ కోసం చూసేవాడట. మాకు చాలా వింతగా అనిపించింది. గోడ గడియారం చూసినా వాడికి ఏం అర్థమవుతుంది అనుకున్నాము. (సందర్భం వచ్చింది కాబట్టి మరో సంగతి కూడా చెప్తాను. మా ఇంటి గోడ గడియారం పగిలిపోయినపుడు ఆ గాజు పెంకులన్నీ ఎత్తి పక్కన పెట్టాం. గాజు లేని గడియారం పడెయ్యాలి. అప్పుడు వాడికి మూడేళ్ళు కావచ్చు. వాణ్ణి వొళ్ళో కూచోబెట్టుకుని ఆ గడియారం తీసుకుని ముళ్ళు తిప్పుతూ వాడికి టైం చూడటం నేర్పుతున్నాను. వాడికి అర్థం అవుతుందని కాదు, వూరికే చెప్పి చూద్దామని, ఎలాగూ గడియారం పడేసేదే. ఆ వొక్క సారికే వాడికి అర్థమైపోయింది. తర్వాత యెప్పుడు టైం అడిగినా గోడ గడియారం చూసి చెప్పేసేవాడు.)

ఇప్పుడు ఇద్దరు పిల్లలూ పెద్దవాళ్ళయిపోయారు. మూడవ కొడుకే (పమరేనియన్) ఎనిమిదేళ్ళు వచ్చినా ఇంకా పసి పాపడే. నేను గుంతకల్లులో పని చేస్తూ ప్రతి ఆదివారం ఇంటికి వచ్చేవాణ్ణి. పిల్లలు ఇద్దరూ కుక్క పిల్లను తెచ్చుకుందాం అంటే వద్దు వద్దు అంటూ చివరికి తలాడించాల్సి వచ్చింది. అలా వచ్చాడు స్నోవి మా ఇంటికి. మొదటి రెండు రోజులు చాలా ఏడ్చాడు. విని గుండె ద్రవించేది. తల్లినుంచి వేరు చేసి పెద్ద పాపం చేశాననిపించేది. పిల్లలతో ఆడుకునేది. బుజ్జిగాడు చాలా ముద్దొచ్చేవాడు. చాలా తొందరగా దూకడం, అదీ నేర్చుకున్నాడు. వాడి కోసం ఏర్పాటు చేసిన పరుపు మీద ఇప్పుడు వాడికి పడుకోవడం ఇష్టం లేదు. గెంతి మా మంచం మీదకు వచ్చేవాడు. నేను వాణ్ణి దించ, వాడు మళ్ళా పైకెక్క ఈ ఆట సాగుతూనే వుంది, మా పిల్లల నువ్వుల మధ్య. చివరికి నేనే వోడిపోయాను. అప్పటికి కూడా నాకు వాడితో అంత అనుబంధం ఏర్పడలేదు. ఎందుకంటే నేను వాణ్ణి చూసేది వారానికి వొక్క రోజు. వో ఆదివారం ఇంటికొచ్చాను. తోక వూపుకుంటూ నాదగ్గరికి వచ్చాడు. ఎత్తుకున్ని కుర్చీలో కూర్చున్నా. కాసేపు ముద్దు చేసి ఇక దించుదామనుకుంటే దిగడే, ఇంకా సర్దుకుని నా వొళ్ళో కూచుంటాడు. అది ముఖ్యమైన మలుపు, మా అనుబంధంలో. అది మాటల్లో చెప్పగలనా? ఇప్పుడున్న ఇంట్లో పాత ఇంటిలాగా వాడికి రోడ్డు చూడటానికి ఏర్పాటు లేదు. వాడికోసం రోడ్డు మీద వున్న బాల్కనీ లో గోడ కొంతవరకు పగలగొట్టించి వూచలు వేయించి కిటికీ లా చేయించాము. వాడికి బోర్ కొట్టకుండా అక్కడ కాలక్షేపం అవుతుందని. మేము బేంకికి వెళ్ళే సమయం వాడికి తెలుసు, అప్పుడు మారాం చెయ్యడు. ఆ వేళప్పుడు కాక మరెప్పుడైనా బయటకు వెళ్తే మాత్రం కాళ్ళను చుట్టేసి వెళ్ళొద్దంటాడు. అసలు నేను బట్టలు వేసుకుంటున్నప్పుడే వాడికి అర్థమైపోతుంది. చెప్పులో కాలు దూర్చడం ఆలస్యం కాళ్ళకు చుట్టుకుపోతాడు.

నేను స్వేచ్చా విరమణ తీసుకున్న తర్వాత ఇంట్లోనే వుండే వాడిని. అప్పుడు అటాచ్మెంట్ ఎక్కువైంది. నేను ఎక్కడ వుంటే అక్కడికొచ్చి నన్ను ఆనుకునే కూచునేవాడు. కంప్యూటర్ టేబిల్ దగ్గర్ వుంటే నా కుర్చీ కింద దూరి కూచునేవాడు. మా అన్న కొడుకు పెళ్ళికి నాగపూర్ వెళ్ళాం, వాడిని కెనెల్ లో వుంచి. అక్కడ వదులుతున్నప్పుడు చూడాలి వాడి చూపులు. సరిగ్గ పెళ్ళి రోజునే కెనెల్ నుంచి ఫోన్ వచ్చింది, మీ వాడు చాలా బెంగెట్టుకున్నాడు, మంచినీళ్ళు కూడా ముట్టట్లేదు అని. ఇక పెళ్ళి వరకూ ఆగక ఫ్లైట్ ఎక్కి వచ్చేశా. వాడిని తీసుకురావడానికి వెళ్ళినపుడు చూడాలి వాడి ఆనందం. ఇంటికి తెచ్చాక ఇల్లంతా వంద సార్లు గెంతుతూ తిరిగాడు. వాడు మాకు ప్రత్యేక (special) సంతానమా, మేము వాడికి ప్రత్యేక కుటుంబమా? కొన్ని చెప్పుకోవడానికి భాషలోని పదాలు సరిపోవు. శరీరం స్పందన కళ్ళతో, నిక్కబొడుచుకున్న రోమాలతో, వొంట్లో ప్రవహించే సన్నటి విద్యుత్తుతో తెలుపుతుంది.

ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళడం లేదు, కాని తను వెళ్తూనే వుంది. ఆమె ఇంటికి వచ్చే సమయం అయిదున్నర ప్రాంతం. ఆ సమయం వాడికి ఎలా తెలుస్తుందో గాని, అప్పటి దాకా నన్నే అంటిపెట్టుకుని తిరుగుతున్న వాడు కాస్తా బాల్కనీలోకెళ్ళి అమ్మ కోసం ఎదురు చూస్తాడు. ఆమె రావడంతోటే మొరగడం, తోకాడించడం, కాలు గాలిన పిల్లిలా అటూ ఇటూ పరిగెత్తడం, తర్వాత తలుపు దగ్గర కాపు కాయడం. “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, పూలిమ్మనీ రెమ్మ రెమ్మకూ?” గుర్తొస్తుంది. నేను బయటికెళ్ళి వచ్చినా అంతేనట, నా కోసం తలుపు దగ్గరే కాపు కాస్తాడు. ఇంట్లో మేము ముగ్గురు సభ్యులం, వాడు కాక. అందరూ ఇంటికొచ్చాక గాని వాడు పడుకోడు. ఎదురు చూస్తూ వుంటాడు రాని వ్యక్తి కోసం.

వీడు వచ్చాక మా పిల్లలు పెద్దయిన కాలంలో నేను మళ్ళీ బేబీ టాక్ మొదలు పెట్టాను. వాడి కోసం లాలి పాటలు పాడాను. వాడికి అర్థం కాకపోయినా రాముడి కథలు చెప్పాను (మా అబ్బాయికి చిన్నప్పుడు చాలా ఇష్టం అడిగి మళ్ళీ మళ్ళీ చెప్పించుకునేవాడు). బోల్డంత మాట్లాడాను. మొదట్లో పిల్లలిద్దరూ నాన్నకి పిచ్చి పట్టిందా అన్నారు, తర్వాత అలవాటై అమ్మా మా చిన్నప్పుడు నాన్న ఇంత ముద్దు చేశాడా మమ్మల్ని, నిజం చెప్పు అని అడిగేవారు.

ఇలా గుర్తు తెచ్చుకుంటూ వుంటే ఊటబావిలో నీళ్ళలా జ్ఞాపకాలు ఊరుతూనే వున్నాయి.

భాష మనకు ఇచ్చే విజ్ఞానం ఎంత ముఖ్యమో, దాని కంటే బహుశా ఈ ఎరుక, ఎరుక వల్ల కలిగే స్పందనలు ఎక్కువ ముఖ్యం అనుకుంటాను. మొదటిది స్థాయీ భేదాలతో అందరికీ వున్నా, రెండోది మాత్రం అందరికీ సమానంగా వుంటుంది. గ్రహించాలి, విలువ ఇవ్వాలి అంతే.

*

పరేశ్ దోశి

6 comments

Leave a Reply to కృష్ణ మోహన్ బాబు Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • విలువ ఇవ్వాలి. అంతే👌👌👍!ఎరుక గురించి, బాగా చెప్పారు. జీ!💐💐ధన్యవాదాలు.

  • చాలా బాగా రాశారండి! నాకు స్వ అనుభవం! ఇంట్లో మనిషి అంతే! అంతకన్నా ఎక్కువే!!!

    • Thankyou Padmapv garu. Thankyou Suseelagaru.
      Thankyou Mohanbabu garu.
      Thankyou Nitya garu.
      Thankyou Narayanaswamy garu.

  • అద్భుతమైన వ్యక్తీకరణ. అకరక్షరం ఏకీభవిస్తా.

  • ఈ భాషతో పనిలేని ఎరుకను ఎలా చెప్పినా కొద్దిమందికి అర్థం కాదు. Trash అని కొట్టిపారేస్తారు…కొన్ని moments ని అనుభవించాల్సిందే. మా snoopy పోయి రెండేళ్లు. 9 ఇళ్లకు ఉన్నట్టుండి పోయాడు. అచ్చు మీరు చెప్పినట్టుగానే ఉండేవాడు. Chennai నుంచి కార్ లో వచ్చేవాడెప్పుడూ. Suitcase కనిపించకుండా దాచేసి బయలుదేరాలి పొద్దున్నే లేదంటే తెల్లవార్లూ పడుకోనీయకుండా కార్ కీస్ తెచ్చి మీద పడేస్తూనే ఉండేవాడు.
    భాష వచ్చినా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండిపోతాము. ఆ అనుభూతిని ఇలా పంచినందుకు సంతోషంగా ఉంది. చిన్న చిన్న gestures ఎంత ఆనందాన్ని పంచుతాయో అవతలి వ్యక్తి తెలుసుకోగలిగితే అంతా సంతోషమే కదా. I agree with you.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు