బొడ్డుతాడు వెచ్చదనం కోసం చిన్నిమనసు తడుములాట

‘నాళ్’ లో కొన్నికొన్ని సందర్భాలలో  సత్యజిత్ రాయ్ ‘పథేర్ పాంచాలి’ లో కనిపించే లిరిసిజం స్థాయి కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు.

ప్పటికీ బాగుపడదేమో అనుకున్న తెలుగు సినిమా గత మూడేళ్ళనుంచి ఒక్కసారిగా కొత్తకొత్త వెలుగుల్ని చిమ్మటం  మొదలెట్టింది. ‘అర్జున్ రెడ్డి’ తెలుగు సినిమా గ్రామర్ ను సరికొత్తగా సవరిస్తే, ‘C/O కంచరపాలెం’ కథను నేలకు దింపి సహజత్వాన్ని పీఠం మీదికి ఎక్కించింది. ‘ఆ’ అసలు మన తెలుగువాళ్ళు తీసిన సినిమాయేనా అనిపించేలా అద్భుత రసాన్ని ప్రపంచ సినిమాకు తీసిపోకుండా ఆవిష్కరించింది. ‘ఫిదా’, ‘పెళ్లిచూపులు’, ‘ఘాజీ’ పిల్లగాలుల్లాగా సేద తీర్చాయి. స్క్రిప్ట్ రైటర్స్ గా దర్శకులుగా మనకొత్తకెరటాలు ఇలా ఎగిసిపడటం ఎంత బాగుందో.

తెలుగువాళ్ళలోంచి దూసుకొచ్చిన మరో కొత్త సినీకెరటం యక్కంటి సుధాకర్ రెడ్డి. కాకపోతే ఇతను తెలుగులో కాకుండా మరాఠీలో సినిమా తీశాడు. వారం కిందటే రిలీజ్ అయిన ఈ సినిమా పేరు “నాళ్” (బొడ్డుతాడు). నాగరాజ్ మంజులే మరాఠీలో తీసిన ప్రసిద్ధ సినిమా ‘సైరత్’ కు సినిమాటోగ్రఫీ చేసినది ఇతనే. అందువల్ల సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా తెలుగువారికి బాగానే తెలుసు. మరాఠీలో నాలుగైదు సినిమాలకు కెమెరా వర్క్ చేశాడు. వీటిలో ఉమేష్ కులకర్ణి తీసిన ‘దేవూల్’, నాగరాజ్ మంజులే ‘సైరత్’ ఇతనికి సినిమాటోగ్రాఫర్ బాగా పేరుతెచ్చిన సినిమాలు. కొన్ని తెలుగు సినిమాలకు, హిందీ సినిమాలకు కూడా పనిచేసినా ‘వీరే ది వెడ్డింగ్’ లాంటి పెద్ద సినిమాతో బాలీవుడ్ బిగ్ లీగ్ లోకి అడుగు పెట్టిన సుధాకర్ రెడ్డికి దర్శకత్వమే అసలు కల. దానిని తన మొదటి ప్రయత్నమైన ‘నాళ్’తో అందంగా నెరవేర్చుకున్నాడు.  తనకు బాగా పేరొచ్చిన మరాఠీ సినిమారంగంలోనే దర్శకుడిగా ప్రవేశం చేశాడు. స్టార్లను ఆరాధించే వాతావరణం లేని మహారాష్ట్రలో సినిమా తీయటం సులువుగా ఉంటుందని అతని ఉద్దేశ్యం.

‘నాళ్’ కథకొద్దాం. ఓ ఏడేళ్ళ అల్లరి పిల్లాడు చైత్య (శ్రీనివాస్ పోక్లె). నది పక్కనున్న ఓ పల్లెటూరు వాడి రాజ్యం. ఆటల్లో తనకంటే పెద్ద పిల్లలు వాడికి ఫ్రెండ్స్. పక్కింట్లో ఉంటూ చిన్నచిన్న పనులు చేసుకునే బచ్చన్ వీడికి గైడ్. ఇద్దరూ కలిసి చెంబులు పట్టుకుని బైటకు పోయి కూచున్నప్పుడు పెట్టుకున్న ముచ్చట్లలో తల్లిదండ్రులతో వ్యవహారాలు ఎలా చక్కబెట్టాలో తెలుసుకుని అమలు చెయ్యడాలవీ ఉంటాయి. టెంపో ఎక్కి స్కూల్ కి పోయి కాగితపు విమానాలు  ఎగరేసుకుంటూ రంగురంగుల సబ్బు బుడగలు ఊదుకుంటూ సుఖంగా బతుకుతున్న చైత్యకు ఓ వరసైన మేనమామ వచ్చి కలుస్తాడు. చేతిలో రంగురంగుల డిజైన్లు చూపించే కెలైడోస్కోప్ ను బహుమతిగా పెడుతూనే ‘నీ అసలు తల్లి వేరే ఊళ్ళో ఉంది, ఇక్కడున్నది నిన్ను ‘దత్తత’ చేసుకున్న తల్ల’ని చల్లగా చెప్తాడు. దీనితో అసలు తల్లిని చూడాలన్న ఆరాటం మొదలౌతుంది బుజ్జి చైత్యగాడికి.  ఈ గొడవే లేకపోతే, కాలికి గుచ్చుకున్న ముళ్ళు తీసి, నూనె రాసి పడుకోబెట్టే అమ్మ, ఆ అమ్మను సతాయిస్తూవుండే ముసలి నాయనమ్మ, పొలం పనుల్లో తీరిక లేకుండాఉంటూ అప్పుడప్పుడు తనను ముద్దు చేసే నాన్న, నదిలో నీళ్ళను ట్యాంక్ లో నింపి తెచ్చే పక్కింటి బచ్చన్, చాకలిరేవులో ఆటలకో ఫ్రెండ్ దేవి, గంపలోని కోళ్ళను పొద్దున్నే లేవగానే బైటకు విడిచిపెట్టే డ్యూటీ, లోగిట్లో ఈనిన గేదె, దాని దూడ .. ఆహా ఎంత అందమైన ప్రపంచం కదా చైత్యది. వొట్టి అందమే కాదు జీవితపు విషాదం కూడా చైత్యకు ఎదురౌతుంది. దూడ కనిపించకపోతే బెంగ పెట్టుకుని, చేటపెయ్యను (stuffed calf) చూపించితే గానీ పాలివ్వని గేదెలోని అమ్మతనం ఏమిటో చివరకు అర్థమవుతుంది.  పెద్దవాళ్ళ మాటలతో అల్లిబిల్లిగా నడిచిన ఆలోచనలు కెలైడోస్కోప్ లోంచి జీవిత దృశ్యాలను చూసినప్పుడు సరైన దారిలో పడతాయి.  ఇదంతా అతి చురుకైన ఏడేళ్ళ అల్లరి పిల్లవాడి ఆలోచనల, ఆచరణల స్థాయిలోనే నడుస్తుంది. అదే ఈ సినిమా అందం. అలా స్క్రిప్ట్ రాసుకుని తీయగలగటం, దానికి ఆ పిల్లవాడు (శ్రీనివాస్ పోక్లె) ఇంచక్కా సహకరించటం సాధారణమైన విషయం కాదు. చైత్య పాత్రకు దీటైన చురుకుదనంతో తెలివైన నాజూకైన భావప్రకటనతో సినిమాను నడిపిస్తాడు శ్రీనివాస్ పోక్లె.

తన అసలు అమ్మ వేరే ఎవరో ఉన్నదన్న సంగతి చైత్యను నిలబడనివ్వదు. ముసలమ్మను ఇక్కడినుంచి తీసుకెళ్ళి వేరేవూళ్ళో ఉన్న బంధువుల ఇంటికి చేర్చి కొంతకాలం పాటు అక్కడుంచాలని  నాన్న ప్లాన్. ఎలాగో తీరిక చేసుకుని తీసుకువెళ్దామని అనుకుంటే చైత్య తనూ వస్తానని వెంటపడతాడు. అక్కడే వుండే  తన అసలైన అమ్మను చూడాలనీ, తరువాత ఆమె దగ్గరే ఉండిపోవాలనీ వాడి ప్లాన్. కానీ పాపం పరీక్షలు అడ్డువస్తాయి. పరీక్షలు అయిపోయేవరకూ నాన్నా నాయనమ్మల ప్రయాణం ఆపుదామని ప్లాన్స్ వేస్తాడు. అనుకున్నది చేసి తీరాలనే పట్టుదలలో వున్న వాడి ప్లాన్స్ లో పొంచివున్న ప్రమాదాలేమిటో వాడికి సరిగ్గా అర్థం కావు. అవన్నీ అటుతిరిగీ ఇటుతిరిగీ చైత్య కోరిక నీళ్ళలోని కాగితం పడవలాగా ఏ ఒడ్డుకు చేరిందో, ఈ పిల్లాడు తనవడినుంచి వేరొక వడికి చేరిపోతాడేమోనని బెంగెట్టుకుని కల్లోలపడిపోయే అమ్మ స్తిమితపడిందో లేదో..

కథ చెప్పటానికి కాదు నేనిది రాస్తున్నది. ‘నాళ్’ చూస్తున్నంతసేపూ నేనుండిన ప్రపంచాన్ని కొద్దిగా పరిచయం చేశాను. చైత్య చేసినది నటన అనుకుంటే దానిని మాటలతో వర్ణించలేను. ఎక్కువసేపు చైత్యనైపోతూ, కొంతసేపు పెద్దవాళ్ళ ఘర్షణాపూరితమైన జీవితాన్ని అనుభవిస్తూ ఊరితో అమ్మతో పెనవేసుకున్న బొడ్డుతాడుకోసం తడుముకుంటూ ఉండిపోయానంతే.  ఊళ్లలో పెరిగిన చాలామందికి బాల్యం కళ్ళముందు గిర్రున రీవైండ్ అవుతుంది.  క్లాస్ బయట గోడకుర్చీ వేసుకుని నోట్ బుక్ లో నిశ్చింతగా దూడబొమ్మ వేసుకుంటూ పక్కనున్న పిల్లాడితో ముచ్చట్లు పెట్టే చైత్యతో ఎంతటి స్నేహబంధం వచ్చేస్తుందో!

 

—- సుధాకర్ రెడ్డి యక్కంటి      

ముంబైలో ఎప్పటినుంచో స్థిరపడిపోయినా సుధాకర్ రెడ్డి మనసు తను చిన్నప్పుడు తిరిగిన సిరోంచా (గడ్చిరోలి జిల్లా) పక్కనున్న నదిమీదే సుడులు తిరుగుతోందేమో!  అతను తీసుకుందామనుకున్న లొకేషన్ ఆ ప్రాంతమే. కానీ అక్కడి  పరిస్థితులు సినిమావాళ్ళు మకాం వెయ్యటానికి ఇప్పుడు అనుకూలంగా ఉండకపోవటంచేత నాగపూర్ దగ్గరలోని భండారా జిల్లాలో ఓ నది పక్కనున్న పల్లెటూళ్ళో సినిమా తీశానన్నాడు. చైత్య నటన సినిమాను ఎంతో ఎత్తున నిలబెట్టింది నిజమే కానీ  బాల్యపు తీపి, మమకారం తనను ఇంతగా ఆవరించి నిలిచినందువల్లే ‘నాళ్’ను చక్కగా తీర్చిదిద్దగలిగాడు సుధాకర్ రెడ్డి. తనలోని స్క్రిప్ట్ రైటర్ను డైరెక్టర్ నూ ముందువరసలో నిలబెట్టి, తనలోని సినిమాటోగ్రాఫర్ తో సరిగ్గా తను అనుకున్నట్టుగా సంధానించుకుని పని చేయటంతో సినిమాకు మంచి బాలన్స్ వచ్చింది.

‘నాళ్’ లో కొన్నికొన్ని సందర్భాలలో  సత్యజిత్ రాయ్ ‘పథేర్ పాంచాలి’ లో కనిపించే లిరిసిజం స్థాయి కనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. కెమెరా మూవ్స్ ఇప్పటి సినిమాల్లాగా ఫాస్ట్ పేస్ లోనే ఉన్నా అవసరమైనచోట గతిని  తగ్గించుకుంటూ ఆలోచనకు అవకాశం ఇస్తాయి. పథేర్ పాంచాలిలో లాగే ఇక్కడా లొకేషన్ ది ఒక బలమైన వ్యక్తిత్వం. ఇసుకపర్రలూ, మోకాల్లోతు స్వచ్ఛమైన నీళ్ళ మధ్య ఎడ్లబండి నడకలూ, జిల్లేడు పొదలూ కథకు లొంగేవుంటాయి తప్ప గ్లామర్ కోసం వుండవు.  దేవకీ యశోదల్లాంటి అమ్మలిద్దరూ కొంచెం కూడా ఎక్కువా తక్కువా కాకుండా నటించారు. నాన్నగా వేసిన నాగరాజ్ మంజులే మంచి దర్శకుడే కాదు మంచి నటుడు కూడా. సంగీతం మితి మీరకుండా నిశ్శబ్దాల గాంభీర్యానికి చోటు ఇస్తుంది.

ఎటు చూసినా గ్రాండ్ ప్లాన్స్, కుట్రలూ, larger than life కేన్వాస్ లతో నిండిపోయిన సినిమాలూ సిరీస్ చూసి చూసి విసుగు పుడుతోంది.  ‘నాళ్’ చూస్తూ ఏటి పక్కని పల్లెటూళ్ళో చైత్య బుజ్జి జీవితంలోని చిన్న ఘర్షణలూ, స్వార్థాలూ  పరిష్కారాలూ అర్థవంతమైన భావగీతంలాగా సాగుతుంటే  చిన్నచిన్న అనుభూతులకూ ఉద్వేగాలకూ లోను కావటం ఎంతో బాగుంది. ఇది కేవలం పిల్లల సినిమా కాదు.  పిల్లలకోసమూ పెద్దలకోసమూ కూడా తీసిన సినిమా. జీవితంలోని కొన్ని ముడులు మనుషుల సంస్కారం వలన పీటముడులైపోకుండా ఎలా వదులవుతాయో కూడా చెప్తుంది.

‘నాళ్’ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో హైదరాబాద్ లో థియేటర్స్ లో నడుస్తోంది. చూడాలనుకున్నవారు వెంటనే చూడటం మంచిది. మరాఠీ సినిమా కావటం వలన ఎక్కువ రోజులు ఉంటుందో లేదో చెప్పలేము.

                               *

Avatar

ల.లి.త

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ సమీక్ష చదివాక వెంటనే చూసేశాం. లేకపోతే
    ఒక గొప్ప సినిమాను మిస్ అయ్యే వాళ్ళం. ధన్యవాదాలు.

  • Beautifully written, felt like some one sat with us and shared their cherished experience! Iam sure the picture would be a equally beautiful. Will watch it.

  • Beautifully written, felt like some one sat with us and shared their cherished experience! Iam sure the picture would be anequally beautiful one. Will watch it.

  • …రీడర్ ని ప్రేక్షకుడిగా మార్చేసే అద్భుతమైన రివ్యూ…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు