బుడగ

నేను బుడగ కింద నిను కలిసాను, సరిగ్గా నువ్వు నార్వే నుంచి తిరిగి వచ్చినపుడు. అది నాదేనా అనీ నువ్వు అడిగావపుడు. అవును నాదే, కానీ ఒకపుడు అన్నాను. ఈ బుడగ అప్పటికప్పడు రేగిన ఒక ఆత్మకథాత్మక ఒప్పుకోలు.

?దాకా థక దిఇ

అయితే ఎందుకు? కాకపోయినట్టయితే ఎందుకు?

అసలు బుడగ దేనికి సూచిక? బుడగ ప్రయోజనం ఏమిటి?

బుడగ అస్తిత్వానికి లక్ష్యం ఏమిటి?

బుడగ చలనానికి, వ్యాప్తికి అర్థం ఏమిటి? అంగీకారం ఎంత? ఈసడింపు మరెంత?

అనుభూతి వెలుగులో, స్పందనల వెలుతురులో, వ్యాఖ్యానాల ప్రసారాలలో, దృక్పథాల నిబద్ధతలలో అర్థంపర్థం, పరమార్థం, నిర్వచనం, విశ్లేషణ, వివేచన, విమోచన లాంటి ప్రశ్నలను వేస్తుంది లేదా లేవనెత్తుంది ఈ కథ కాని కథ.

లేదా అకథ.

నిజానికి ఇందున్న వేలాడే బుడగ మన జీవితాన్ని వర్ణించే పోలికా?

నిజానికి బుడగ మన లక్ష్య, నిర్లక్ష్య మయమైన జీవన గమనానికి ప్రతీకా?

నిజానికి ఈ బుడగ అలసత్వానికీ, కేవలం వినోద, కాలక్షేప, సాక్షీభూతాలుగా మనల్ని మనం ‘తర్ఫీదు’ చేసుకుంటూపోతున్న అవకాశవాద, పలాయనవాద, వినియోగదారీ తెన్నులకు దారం తెగి గాలిలో ఊగిసలాడే మన ఉనికికి ప్రతిబింబమా?

*

నిజానికి ఈ బుడగ మనదేనా?

లేక మనమేనా?

ఇంతకీ ఈ బుడగ ని  మనం చూస్తున్నామా? లేక ఊహిస్తున్నామా?

ఇంతకీ ఈ బుడగ మనకు తారసపడిందా?

లేక దర్శనానికి వేచి చూస్తున్నామా?

ఇంతకీ ఈ బుడగ కాల్పనిక వాస్తవ చిత్త చాంచల్యమా?

లేదా వాస్తవికత పైన పడిన అపరిచిత ఛాయా విశేషమా?

ఇది ఆ రకంగా కథ కాదు.

అంటే ఈ రకంగా కూడా కాదు.

ఒక రకం పదాల అమరిక అర్థాన్ని నిర్మిస్తే, మరో రకం అమరిక వాటిని బోనెక్కిస్తుంది.

ఒక రకం దృక్పథం పడికట్టుని నిర్మిస్తూ పోతూనప్పుడు, మరో విలోమ పడికట్టు ఆ దృక్పథాన్నే వినిర్మిస్తుంది.

గాలిలో వేలాడుతున్న దృగ్విషయాల వెంట ఒక దృష్టికోణం బలంగా పరిగెడుతూ వుంటే, మరో మూలాధార విశ్లేషణ బుడగలాంటి వేలాటకి దారం కట్టేందుకు పూనుకుంటుంది మంద నుంచో, విడిగానో.

హేతువు, కారణం కనుమరుగు చేసే అత్యాధునికులు సలిపే విశ్లేషణలు గమ్యాగమ్యాల వాదనపై గొడ్డలివేటే వేస్తే, సమతను, సమిష్టిని పొదుముకున్న విత్తనం భళ్ళున మొలకెత్తి కార్య రూపాలకు చైత్ర పూత వేయిస్తుంది.

*

పాదుకున్న రకాలు, రూపాలు, శైలులు, గుణగణాలు, లక్షణాలు, పద్ధతులు వగైరాల నడ్డివిరిచే మరో రకం, రూపం, శైలి, గుణగణం, లక్షణం, పద్ధతి ఈ కథనంలో బుడుగలా వ్యాకోచించి, విశాలించి, విస్తరిస్తాయి.

ఈ కచ్చడాల నుంచి మన ఆలోచనలు, ఈ పంజరాల నుంచి మన అభిప్రాయాలూ, ఈ పోతల్లోంచి మన ప్రతిపాదనలూ, ఈ కంచెల నుంచి మన చూపు దాటి రాకపోతే మన కథ ముమ్మాటికీ భద్రంగా, సాంప్రదాయికంగా, కట్టుబాటుగా నిన్నటిదే!

మరి నేటిది ఎన్నటికి?

బుడగ

 

వీధి నంబరు – 14 లో బుడగ.

సరిగ్గా ఎక్కడ? అని అడిగితే ఫలానా చోట అని చెప్పలేను.

రాత్రికి రాత్రే బుడగ ఉత్తర దిశగా ఇంతది అంతదవుతోంది.

జనాలు నిద్రపోతుండగానే, పార్కు దాకా విశాలించింది. అక్కడే దాన్ని నేను ఆపాను. ప్రభాతంలో ఉత్తరాంచలపు మూలలు మహలుపై నడయాడుతాయి.

దాని అల్లిబిల్లి సయ్యాట ఉబుసుపోని లాలిత్యంగా తోస్తుంది.

కానీ దాన్ని ఆపడంలో మతిపోయే చికాకు అనుభవించడం, పైగా చెట్లను రక్షించడం, అలా బుడగ పైపైకి ఎగబాకటాన్ని ఏ కారణం చేత అనుమతించాలి?

అప్పటికే నగరం పలుచోట్ల దాని ఛాయలు పడ్డాయి.

దాన్ని అలా గాల్లోకి చూస్తూనే, నేను ఇంజనీర్లని అడిగాను దాని సంగతి కాస్త చూడమని.

తెల్లవారంతా అది బలుస్తూనే వుంది.

సున్నితమైన, అంతుబట్టని వాయువు బుసలు దాని కవాటాల దగ్గర అలికిడవుతూ…

45 ఆవాసాలను ఉత్తరం-దక్షిణంగా; అడ్డదిడ్డమైన మరికొంత చోటును తూర్పు-పడమరగా ఆవహించింది బుడగ.  ఆవాసాలకి కొన్ని చోట్ల అటు ఇటు వున్న మరో ఆరు గల్లీలపైనా దాని నీడపడింది.

ఇదీ పరిస్థితి అప్పుడు.

“పరిస్థితులు” అని మాట్లాడటం తప్పు.

ఏదో ఒకటి తేల్చుకునేందుకు దారి తీసే పరిసరాలు, వత్తిడి తప్పించుకునేందుకు కొందరి పలాయనాలూ.

అక్కడ అలాంటిదేమీ లేదు.

కేవలం బుడగ వేలాడుతోందంతే!

పల్చని, చిక్కని బూడిద వర్ణాలూ, ఎక్కువ భాగం నశ్యం రంగువీ,

వాటికి సమతూచుతూ వక్క రంగులో, లేత పసుపులూ.

కావాలనే ముగించకుండా వదిలిన ముక్తాయింపులో ఇనుమడించిన ప్రతిష్ఠాపన దానిది.

దానివల్ల దయచేసిన గరుకుదనం, నాణ్యత పట్ల పట్టనితనం, లోపలి మోతకు ఊగిసలాటలు, జాగ్రత్త సవరింతలు, తగినట్టు తూలిన, తూగిన సరంగుతనం. చాలా చోట్ల చొచ్చుకువచ్చిన దాని దేహం.

ఇక మనకు మీడియాలో వార్తల వరదల పండగే. అంతా పక్కా నిజాల ప్రసారాలే. ఈ ఏకైక సౌందర్యం గురించిన, చరిత్రలో ఈ బలుపు గురించిన మైలురాళ్ళ మీద ఎడతెగని కథనాలు.

కానీ ఇప్పుడు మాత్రం కేవలం నికార్సుగా అక్కడే వేలాడుతున్న ఈ బుడగ మాత్రమే వాస్తవం.

అందరూ తలోమాట అనుకున్నారు. కొంత మందికి ఈ బుడగ చాలా “ఆసక్తికరంగా” తోచింది. ఒక స్పందనలో ఈ బుడగ ఇంత ‘మెగా’ అవ్వడం అసంబద్ధం అనిపించింది. ఇంత హఠాత్తుగా ఈ నగరం మీద ఈ బుడగ దర్శనం కావడం కూడా.

పూనకం లేదా అలాంటి సామాజిక రుగ్మతాయుత ఆందోళన లేకపోయినట్టయితే ఇదంతా తూచ్ అనో, ఇదెంతలే అనో అనుకునేవారే.  మొదట్లో కొంత గణనీయమైన వాదన జరిగింది ‘బుడగ నిజమైన అర్థం ఏమిటి?’ అన్న అంశంపైన. మనకు అర్థాల పట్ల పెద్ద పట్టింపు వుండకూడదు అన్న విషయం తెలిసిపోయింది కాబట్టి ఈ చర్చ టకీమని సద్దుమణిగింది. అయినా అర్థాలని ఎవరు పట్టించుకుంటున్నారనీ ఇవాళా రేపూ.  మహా అయితే బాగా సులువైన, సుభద్రమైన సంగతుల్లో అయితే పోనీ కొంచెం పట్టించుకుంటే గింటే కోవచ్చునుగాక!

బుడగ యదార్థం నికార్సుగా తెలిసే అవకాశమే లేదు కాబట్టి, చర్చను పొడిగించడం ఇక అర్థంపర్థం లేని ఫక్తు కాలయాపనే అని గ్రహించారు అంతా. లేదా తాము చేసే ప్రయోజనకర పనులకన్నా పరమ పనికిమాలిని పని ఇదే అని మాత్రం అనిపించింది కొందరికి.

ఎవరికీ?

ఉదాహరణకి, నులివెచ్చని పురాతన నేలమాళిగల నుంచి ఆకుపచ్చవీ, నీలం రంగువీ కాగితపు లాంతరలని ఎగరవేసిన కొంత మందికీ (కొన్ని వీధుల్లోంచే), లేదా బుడగపైన అసహజ కార్యకలాపాల ప్రదర్శనకు తాము తూ.చ. వున్నామని ప్రకటించుకునే సందేశాలు రాసేందుకు వీలు దొరికించుకున్న కొంతమందికీ, లేదా మనోల్ళున్నారులే అనుకునే భరోసాలోని ఇంకొంత మందికీ.

పిల్లలు సాహసించి దూకేసారు.

మరీ ప్రత్యేకించి బుడగ ఏదైనా భవంతి దగ్గరకు వచ్చినప్పుడు. అంటే, భవంతులకు కొన్ని ఇంచుల దూరంలో బుడగ వచ్చినప్పడు. లేదా భవనాన్ని దాదాపు బుడగ తాకినప్పుడు. భవంతి ఒక భుజానికి ఆనుకుని కొద్ది పాటి ఒత్తిడికి బుడగ గురైనప్పుడు. అప్పుడు భవంతి, బుడగ ఒక జట్టులాగా తోచాయి.

దాని ఉపరితలం చాల చక్కగా ఒక మైదానాన్నిదాల్చింది. తలపించింది.

అంతా చిన్న లోయలు, వాలు గుట్టలు, లేదా కుప్పలు.

ఒకసారి బుడగ నెత్తిన చిన్నపాటి తీరిక నడక సాధ్యమయ్యేంత చదునుగా, లేదా ఒక వ్యాహ్యాళికి సరిపడా, ఒక చోటినుంచి ఇంకో చోటికి, దాని వాలు నుంచి అలా అమాంతం పరుగు తీయడం చాలా ఆహ్లాదంగా వుండింది. ఆ తర్వాత మళ్ళీ అభిముఖంగా వున్న జారుడు ఎక్కడం.

ఈ రెండూ లేసుగా వేరు చేసి వున్నాయి. లేదా ఒక వైపు నుంచి ఇంకో వైపు ఒక్క ఉదుటున గెంతడం చాలా హాయిగా తోచేది.

మరీ ఇంత పేద్ద మొత్తంగా దఢాలున అవతరించడం అసాధ్యం; కారణం దాని ఉపరితల వాయు వత్తిడే. లేదా అది అమాంతం పడిపోనూ వచ్చు. ఒకవేళ అదే మీ కోరికయితే.

అలా ఈ భిన్న చలనాలు, వీటితో పాటు ఇతరాలూ, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళకి  వారి వారి సాధ్యాల పరిధిలోనే ఒదిగి వున్నాయి.

బుడగ పై “అంచు” అనుభవించినపుడు, పిల్లలకు చెప్పలేనంత ఉల్లాసంగా వుంది. నగరపు మంద-మౌన, బల్లపరుపు చర్మం అలవాటైపోయి.

అయితే బుడగ ప్రయోజనం పిల్లలకు వినోదం పంచడం మాత్రం కాదు.

అందివచ్చిన అవకాశాన్ని అదనుగా తీసుకున్న మొత్తం జనాలు, పిల్లలూ, పెద్దలతో సహా, ఇచ్చిన వివరణ వుండవలసినంత విస్తరణగా ఏమీ లేదు. కొంత బిడియం, బుడగపైన కొంత అపనమ్మకం మాత్రం కనిపించింది అందులో.  దీంతో పాటు కొంత దుందుడుగుతనం కూడా ఇమిడి వుండింది. ఎందుకంటే మేము పంపులను దాచాం, ఆ పంపుల నుంచే హీలియం గాలి లోపలకెళ్ళేది. అదీ కాక  ఉపరితలం చాలా విశాలంగా వుండటంచేత అధికారులు ఎక్కడి నుంచి ఎక్కించాలో తేల్చుకోలేకపోయారు. అంటే గాలిని లోపలికి పంపే కంత గురించి అన్నమాట.  ఇంతకీ మామూలుగా ఇటువంటి తతంగమంతా ఎవరి పరిధిలోకి వస్తుందనే విషయం తేలక నగర అధికారుల మధ్య కించిత్ నిరాశ, చికాకు చోటు చేసుకుంది.

బుడగ తాలూకు ప్రస్ఫుటమైన నిష్ప్రయోజనం చాలా విసుగ్గా వుంది. (అసలు అది నిజానికి “అక్కడే” వుందా అని కూడా).

నిజానికి మేమే తాటికాయంత అక్షరాల్లో “ ప్రయోగశాలల పరిశోధనలు రుజువు చేసాయి” అని గనక రాసి వుంటే, లేదా “18% అదనపు గుణం కలిగినది.” అని బుడగ ఒక వైపు ఆకర్షణీయంగా రాసివుండి వుంటే ఈ అవాంతరం అధిగమించి వుందుము.

అయితే అదంతా నా వల్ల కాదు.

మొత్తానికి, ఈ అధికారులకు సహనం చాలానే ఎక్కువ.

తారతమ్యాల కొలతలను పరిగణలోకి తీసుకుంటే మాత్రం, ఈ సహనానికి రెండే రెండు కారణాలు కనబడుతున్నాయి.

ఒకటి : రాత్రి జరిగిన రహస్య పరీక్షల ఫలితాలు వాళ్ళలో కొంత సమ్మతి రగిలించి, కలిగించి వుండవచ్చు, లేదా ఈ బుడగని ఛిద్రం చేయడానికి, తొలగించడానికి వీలుకాదని తమకే తెలిసిపోవడమూ కావచ్చు,

రెండు : బుడగ పట్ల మామూలు పౌరుల్లో కలిగిన వెచ్చని భావన(గతంలో పేర్కొన్న దుందుడుకుతనం తాలూకు తాకిడులతో ప్రేరణ పొందనిది ఇది (భావన).)

ఒక ఏకాకి బుడగ తన జీవిత పర్యంతం తక్కిన బుడగల గురించి ఆలోచిస్తూ ఆ వైపు నిలబడాలనీ, ఇలా ఒక్కో పౌరుడు/రాలు తమకు తోచింది చెప్పారు. తమదైన ఎంపిక చేసుకున్న తీరుల్లో. చాలా కంగాళీ తీరులు అవి. పాప పంకిలం అనే ఈ భావన గురించి బుడగ ఏదైనా చేయాలని ఒక వ్యక్తి బహుశా అనుకుంటూ వుండవచ్చును. మహా బుడగ నిర్మలమైన, తేజోవంతమైన మ్యాన్ హట్టన్ ఆకాశాన్ని పంకిలపరచింది. – అన్న వాక్యంలోలాగా. అంటే, ఆ బుడగ, ప్రతి వ్యక్తి దృష్టిలో ఒక దగాకోరు, అక్కడ క్రితం వుండి వుండిన ఆకాశంకన్నా న్యూనమైనది ఈ బుడగ. జనాలకీ, వారి ఆకాశానికీ మధ్య దూరేసింది ఇది. వాస్తవానికి అది జనవరి మాసం, ఆకాశం కారుమబ్బుగా, అందవిహీనంగా వుంది.

అది చూడ్డానికి ఆకాశమే కాదు. వీధిలో నీ భుజం పై దర్జాగా వాలి, పైగా అది లేకుంటేనే నీకు దర్జా, బెదిరింపుకు గురయినట్టు మొదలుపెట్టి దురుపయోగమైనట్టుగా పయనించింది. ఇక బుడగ కింది భాగం చూడటం ఆహ్లాదమే. మనం ఇది వరకే చూసేసాం, నిశబ్ద బూడిద వర్ణం, నశ్యం రంగులతో ఎక్కువ భాగం నిండి వుండి,

అలా ఓ వ్యక్తి పంకిలం తాలూకు భావనల్లో తలమునకలయి వుండగా, అతని ఆలోచనల్లో ఆనందసమ్మిళితమైన ప్రజ్ఞానమేదో, మూలాధార అవగాహనతో సతమతమవుతూ.

ఇంకో వ్యక్తి – మరోపక్క, ఒక అనూహ్యమైన కానుకల వ్యవస్థలో ఈ బుడగ ఒక అంతర్భాగం అని తలపోస్తుండనూ వచ్చు.

మీ యజమాని టకీమని వచ్చి, “హేయ్! హెన్రీ, ఇదిగో ఈ డబ్బుల మూట తీసుకో, ఇది నీకేనోయ్! ఎందుకంటే మన వ్యాపారం కత్తిలా నడుస్తోంది. పైగా టులిప్ పువ్వులకు కూడా బొబ్బలు తెప్పించే నీ పనితీరుకు నేను వీరాభిమానిని. అదే లేకుంటే నీ శాఖకు బొబ్బలు తెప్పించి ఇంతటి ఢంకా భజాయించి వుండేవాడివే కాదు, లేదా అసలీ విజయమే హుళక్కి కదా!”

ఇక ఒక వ్యక్తికి బుడగ అంటే బహుశా “బలం మరియు పెకిలింత” అనుభవాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన ధీర అంశ కావచ్చును. ఆ అనుభవం ఎంత చెత్తగా ఆకళింపు అయినా సరే.

మరో వ్యక్తి బహుశా ఇలా అనవచ్చు, — ఉదాహరణ లేకున్నట్టయితే  ఇవాళ తన ప్రస్తుత రూపంలో— అసలు వుండేదే కాదేమో!,  పైగా ఇతను తన వాదనకు బలం చేకూరేందుకు చాలా మంది అంగీకారమూ పొందుతాడేమో. లేదా అతని వాదనకోసం.

బలుపు, తేలడం వంటి భావనలు పరిచయం అవుతాయి. అదే విధంగా స్వప్నం, బాధ్యత భావనలు కూడా. ఇతరులు చాలా సవివరాత్మక కల్పనల్లో తలమునకలై తమను తాము బుడగలో కోల్పోయే లేదా వ్యాకోపింపజేసే కోరికకు గురవుతారేమో. ఈ కోరికల స్వకీయ గుణాలు, వాటి మూలాలు, బాగా లోతుల్లో పూడ్చేయబడి, అనామాకంగా, (ఎంత అనామకంగా అంటే అసలు వాటి ఊసే ఎవరూ ఎత్తనంతగా) అయిపోయినప్పటికీ అవి సర్వత్రా వ్యాపించి వున్నాయన్న ఆధారాలున్నాయి మరి. అయితే బుడగ కింద నిలబడి వున్నప్పుడు నీవు(అంటే నీవే) ఏమి అనుభూతి చెందావో అదే ప్రధానం అన్న వాదన కూడా వినిపించింది. కొంత మంది తాము నీడపట్టున, గూడుపట్టున వున్నట్టు, వెచ్చగా, ముందెన్నడూ లేనట్టుగా అనుభూతి చెందామని దావా కూడా వేసేసారు.

ఇక బుడగ శతృశిబిరం మాత్రం ఒక కట్టిపడేసిన “భారమైన” భావనకు లోనయ్యారని చెప్పారు, లేదా నివేదించారు.

కీలక అభిప్రాయం విడివిడి అయ్యిందిలా:

“వికృతమైన ధార”

“తంత్రీ వాద్యం”

XXXXXXX  “చీకటి భాగాలకు కొంత విరుద్ధత”

“ఆంతరిక ఆనందం”

“విశాల, చతురాకార మూలలు”

“ఇప్పటి వరకు ఆధునిక బుడగ నమూనాని పరిపాలించిన సాంప్రదాయ సంవరణము”

“అసామాన్య ఓజస్సు”

“వెచ్చని, మెత్తని, సోమరి దారులు.”

“క్రమరహిత నాణ్యత కోసం ఐక్యత బలి ఇవ్వబడిందా?”

“ఏమి ఈ విలయం!”

“బొక్కడం”

బుడగ కొలతలతో పోల్చుకుంటూ తమను తాము స్థిరపరచుకోవడం మొదలుపెట్టారు జనాలు కుతూహలంగా.

“నేను అక్కడ వుంటాను, ఆలమో చిలె గృహం దగ్గర కుంగి పోయి దాదాపు 47వ వీధిలో కాలి నడక దారిలో లీనమవుతుందో సరిగ్గా అక్కడ.

లేదా

ఎందుకు మనం నేరుగా పైకి ఎక్కి నిలబడకూడదు? ఎంచక్కా గాలి తీసుకుంటూ.

అలా కొంచెం నడిచి, గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ప్రవేశభాగం దగ్గర బిగుతైన, వంకర రేఖ ఏర్పరుస్తుందో అక్కడిదాకా – “అనుకున్న సమయంలో ప్రవేశాలకు ఇచ్చే సన్నని అంతర్ ఖండనలతోపాటు వెచ్చని, మెత్తని, సోమరి దారులు, అందులో, కానీ సన్నని అంతర్ ఖండనల గురించి  మాట్లాడటం తప్పు.

ప్రతి అంతర్ ఖండన కీలకమే, దేన్నీ విస్మరించలేం, (అక్కడికి నడిచాక, నీ చూపు తిప్పే వారు ఎవరూ అక్కడ నీకు ఎదురుపడనట్టు, చిటికెలో, పాత అభ్యాసాలనుంచి కొత్త అభ్యాసాలకు, ప్రాణాలకు తెగించడాలు, తీవ్ర పరిణామాలు.)

ప్రతి అంతర్ ఖండన చాలా కీలకం, బుడగ-మనిషి కలయిక, బుడగ-బుడగ కలయిక.

చిట్టచివరికి బుడగ గురించిన అభిమానం ఇలా వ్యక్తం అయ్యింది : ఇది అమితం. అనిర్వచనీయం.

కొద్దిసార్లు బలిసిన బొబ్బ, లేదా విభాగాలు స్వంత చొరవతో తూరుపు నుంచి నదికి బట్వాడా అవుతాయి. ఒక దేశపటంలో సిపాయిల కదలికల మాదిరి, పోరాటాలకు దూరంగా ఎక్కడో వున్న నియంత్రణాలయాలలోని కదలికలలాగా. అప్పుడు ఆ భాగం ముందు ఎక్కడుందో అక్కడికి విసిరి వేయబడుతుంది. లేదా కొత్త ప్రవృత్తులలోకి విరమణ చెందుతుంది.

ఆ తర్వాత ప్రభాతం;

ఆ భాగం మరో దాడికి దిగుతుంది లేదా మాయమైపోతుంది. ఇలా బుడగ తన రూపాన్ని మార్చుకునే గుణం, మార్పు చెందే సామర్థ్యం కలిగి వుండటం చాలా ముదావహం.  మరీ ప్రత్యేకించి ఎవరి జీవితాలయితే పోతల్లో ఇరుక్కుపోయినట్టు వుంటాయో అట్లాంటి వారికి, ఎంత మారదామనుకున్నా మార్పు అందుబాటులోకి రానివారికీ.

22 రోజులుగా వేలాడే మనుగడలో వున్న బుడగ సాధ్యాసాధ్యాలు తెలిపింది, తెలీని గందరగోళతనంలో. తనెక్కడున్నానో కూడా కూడబలుక్కోలేని స్థితిలోనూ, క్లుప్తత పట్టీనీ విడమర్చేంత విరుద్ధంగా, పైగా మన కాలి కింద నేల దీర్ఘచతురస్రాకారంగా ఉంది.

మన నిష్ణాతనైపుణ్యం మొత్తం కూడి తోడురావాలిపుడు, పైగా మనం తరచూ పాల్పడే పర్యవసాన దీర్ఘకాలిక నిబద్ధతలు, సందర్భానుసారం క్రమంగా పెరిగే సంక్లిష్ట యంత్ర కీలకత, విడిగా, ఎడంగా చూస్తే అన్ని కలాపాలూ; ఈ తీరు ఇలా పెరుగుతూవుంటే,  మరింత ఎక్కువ మంది ఇటు తరలుతారు, తలాతోకా తెలీని తెలిసీతెలీని తనంతో,

బుడగలు పరిష్కారాలుగా నిలిచిన నమూనాకీ, లేదా “చిత్తుప్రతికీ.”

నేను బుడగ కింద నిను కలిసాను, సరిగ్గా నువ్వు నార్వే నుంచి తిరిగి వచ్చినపుడు. అది నాదేనా అనీ నువ్వు అడిగావపుడు. అవును నాదే, కానీ ఒకపుడు అన్నాను. ఈ బుడగ అప్పటికప్పడు రేగిన ఒక ఆత్మకథాత్మక ఒప్పుకోలు.

ఇబ్బందిని తలపోస్తూ నీ పరోక్షానికి లోనయ్యాను, లైంగిక సంపర్కం నిరాకరించబడీ. కానీ  బెర్జన్ కి నీ రాక రద్దయ్యింది కనుక ఇక అది అంతగా సరైనదీ కాదు, అంత అవసరమైనదీ కాదు.

బుడగని తీసేయడం చాలా సులువు. అటుఇటు తిరిగే ట్రక్కులు ఆ నుజ్జు డొక్కునంతా తీసుకెళ్ళిపోయాయి, అదంతా పశ్చిమ వర్జీనియాలో భద్రపరిచారు, అసంతోషానికి మరో కాలం కోసం వేచి చూస్తూ, కొద్ది సార్లు, బహుశా, మనమిద్దరం ఒకరితో ఇంకొకరం ఇంకా కోపంగా వున్నప్పుడో.

English :  Donald Barthelme

తెలుగు : అనంతు చింతలపల్లి

పెయింటింగ్: పఠాన్ మస్తాన్  ఖాన్

https://www.youtube.com/watch?v=RNAFCwG2BdM

 

అనంతు

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

 • ఇలాంటి కథలకి ఇంతటి మహా నిరాదరణ నను ఆశ్చర్యపరచడం లేదు. తెలుగు కథల చదువరి చొరవని నా అనుమానాల గుమ్మానే నిలబెడుతూనే వుందీ ఇంకా ఈ సానుకూల మౌన గుంభనం. నా ఈ అనువాద, పరిచయ ప్రయాస వృధా ఎంత మాత్రమూ కాలేదని తెలుగు కథా చట్రపథులు మరో మారు తేటతెల్లం చేసారు నామటుకు నాకు. డోనాల్డ్ బార్థల్మేకు ద్రోహం చేసినందుకు(అతని కథని అనుమతి లేకుండా అనవసర చొరవ చేసి కాపీ రైటు హక్కులను ఉల్లంఘించి మరీ తెలుగించినందులకు నేను కాస్త నేరపడుతున్నాను.)
  ఇక నేను ‘మీ’ గంపగుత్త ఆధిపత్యమైన తెలుగు కథజోలికి ససేమిరా వెళ్ళనుగాక వెళ్ళను.
  అనువాదం ఇక అసలే చేయనని సవినయంగా ఒట్టు పెట్టుకుంటున్నాను.
  ఇలాంటి కథ చదివి ఇంతటి ఫిల్మ్ కూడా తీయలేకపోయానే అని మాత్రం చాలా సేపు కంటనీరు తుడుచుకున్నాను.
  ఎవరైనా కథా నేస్తులు మౌనం వీడి కరచాలిస్తే ఈ తీరును అధిగమించి మరో తరహా బెలూన్ బద్దలుగొట్టవచ్చు తెరపైన, చిన్నదయినా, దొడ్డదయినా! నిస్సందేహంగా.

 • బలిసిన బొబ్బ, వర్తమాన తెలుగు కథ, మీటితే చాలు టప్ మంటుంది.

  పదం పదంగా చదవాల్సిన కథ, చదువుతూనే ఉన్నాను. పోతల్లో ఇరుక్కుపోయిన చదువులు కదా, కూసింత సమయం కావాలి మరి.

 • నిన్నా ఇప్పుడూ మళ్లీ చదివాను. చాలా ఆశ్చర్యం అనిపించింది మొదటిసారి చదవగానే. తెలుగులో అనువాదాలు చిన్ని కథలు మొదలు …ఇప్పుడూ అప్పుడప్పుడూ చదువుతూనే ఉన్నాము.’నీవు ఏమి అనుభూతి చెందావో అదే ప్రధానం’ అని కథలో అన్నట్లుగా…కథా విస్తరణ జరిగినంత మేరా పొందిన అనుభూతిని అక్షరాల్లో రాయడం సాధ్యం కావట్లా. కొన్ని ఇటువంటి అనువాదాలు మనసుకు హత్తుకునేవి కొన్నాళ్ళు వెంటాడుతూంటాయి…ఈ కథలోని మీ కొన్ని వాక్యాల్లా. కథను చదివి చర్చించేంత సహనం మనుషుల్లో రావాలని కోరుకుంటూ..మరిన్ని రాస్తారని ఆశిస్తున్నా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు