నేను కథ,నవల రచనను ప్రధానంగా చేస్తూ,అపుడపుడూ నాటకం,నాటిక,వ్యాసాలూ రాసే వాడిని. వ్యాసాల్లో సాహిత్య సంబంధ వ్యాసాలే కాక, రాజకీయ వ్యాసాలూ రాసేను. రాజకీయ వ్యాసాలను మరో సంపుటిగా తీసుకొస్తాను. దాదాపు పదిహేనేళ్ళుగా రాసిన సాహిత్య సంబంధ వ్యాసాలను ‘తంపర’ పేరిట సంపుటి ప్రచురించాను.
నిత్యం నీటి వూటలతో నిండే … చిక్కగా రక,రకాల మొక్కలు, వాటి వేళ్ళు, కాండాలు – నిలువుగా కాక, వాలుగా ప్రాకే వాటి కొమ్మలు,రెమ్మలతో – నీటి అడుగున బురదలో చేప, జెల్లలతో, క్రిమి,కీటకాలతో, పిట్టలతో నిండి వుండే నేల‘తంపర’. దిగితే కాలు కదపలేమన్నట్టు ఉంటుంది. అంచేత ఏదేన విషయం గురించి వివరించబోతే అనేక అంశాలు చుట్టుముట్టిన స్తితిని తంపర లో దిగిపోయాడని మా ప్రాంతీయులు అంటారు.
ఇందులో 31 సాహిత్యవ్యాసాలు – ప్రసిధ రచయితలు – గురజాడ, శ్రీశ్రీ,కాళీపట్నం రామారావు, మల్లాది రామ క్రిష్ణ శాస్త్రి, గరిమెళ్ళ సత్యనారాయణ, సుబ్బారావు పాణిగ్రాహి తదితరుల రచనలను విశ్లేషించే వ్యాసాలూ, పెద్దిభొట్ల, చలసాని,కారా,వంగపండు తదితర ప్రముఖులపై నివాళి వ్యాసాలూ , వామపక్ష కథ,నవలల ప్రయాణం,కళింగాంధ్ర కథ,నవల,నాటకం,పాట తదితర ప్రక్రియల ప్రయాణాల గురించిన చర్చ చేసాను. అలగే సారంగ వెబ్ పత్రికలో రాసిన ఉత్తరాంధ్ర ఊసులు కాలం (కొన్ని), స్థానికంగా నడిచే పత్రిక జనం లో కొన్నాళ్ళు రాసిన కాలం (15) , ఇవి గాక ఉత్తరాంధ్ర రచయితలు,కళాకారుల వేదిక నడిపిన ఉత్తరాంధ్ర మాసపత్రిక సంపాదకీయాలు (14) వున్నాయి. ఇంకా నాలుగు పత్రికలలో వచ్చిన నా ఇంటర్వ్యూలు ఉన్నాయి.
నేను విమర్శకుణ్ణి కాను. విమర్శకు సంబంధించిన సూత్రాలు,సిద్ధాంతాలు ఎరిగిన వాన్నీ కాను. కానీ సామాజిక ప్రయాణం మీద, సాహిత్య ప్రయాణం మీద నా వరకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. చలామణి అవుతోన్న కొన్ని అభిప్రాయాల పట్ల అభ్యంతరాలు ఉన్నవి. కొందరి రచనల మీద కొన్ని ప్రశ్నలు ఉన్నవి. ప్రశంశలు ఉన్నవి. వాటిని నా లోపల దాచుకోలేక, బయటకు వెల్లగక్కినవే ఈ వ్యాసాలు!
కళింగ సీమలో జరుగుతోన్న పాలక వర్గ ఆర్ధిక,రాజకీయ క్రీడలను, వాటిని ఎదుర్కొనే ప్రజల పోరాటాలను సారంగ పత్రికలో “ఉత్తరాంధ్ర ఊసులు”, గా, జనం పత్రికలో “జజ్జనకరి” శీర్షికన వ్యంగ్య పూరిత కాలం రాసేను. ఉత్తరాంధ్ర పత్రిక సంపాదకీయాల్లో కళింగ సీమ మాండలికంలో వర్తమాన సామాజిక స్తితిని సంపాదకీయాలు రాసేను. ఇవన్నీ సాహిత్యావరణం గురించిన నా స్పందనలు.
మొత్తం 64 వ్యాసాలు, 308 పేజీల పుస్తకం. వెల.౩౦౦. కావలసిన వారు 9440031961 ఫోన్ కి ౩౦౦ రూపాయలు చెల్లించి,చిరునామా వాట్సాప్ చేస్తే, రిజిస్టర్డ్ పోస్ట్ లో పంపిస్తాము
*








Add comment