ధీరవనితకి అభినందనలు!

కోటేశ్వరమ్మ గారికి అభినందనలు ఇక్కడ తెలియజేయండి

శ్రీమతి కొండపల్లి కోటేశ్వరమ్మగారు సి.ఆర్‌.ఫౌండేషన్‌లో దాదాపు పదేళ్ల క్రితమే నాకు పరిచయం అయినా, ఆమెతో కలిసి ఇక్కడ ఉండే భాగ్యం నాకు కలుగలేదు. ఆమె ఇక్కడ నుంచి విశాఖపట్నం వెళ్లాక నేను ఇక్కడ చేరాను.

కోటేశ్వరమ్మగారు మన స్త్రీలు సగర్వంగా చెప్పుకోదగినవారు. జీవితంలో బాల్యం నుంచీ ఎన్ని కష్టాలు ఎదురైనా ఎదుర్కొంటూ కొండంత ధైర్యంతో “నిర్జన వారధి”ని దాటుకుని, ఆత్మస్థైర్యంతో ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికీ, సమాజంలో స్త్రీల గౌరవాన్ని నిలబెట్టడానికీ ఉద్యమస్ఫూర్తితో కృషిచేసిన ధీరవనిత!

ఆమెకి ఇప్పుడు “నూరవ జన్మదినోత్సవం” జరుగుతుందంటే మనందరికీ గర్వకారణం! ఆమె వ్యక్తిత్వం మనందరికీ స్ఫూర్తిదాయకం. జీవితంలోని ఆఖరిదశలో ఆమెకి మనవరాళ్లు అండగా ఉండగలగడం ఆమెకే కాదు, వాళ్లకి కలిగిన అదృష్టం!

వాళ్లకి మనందరం హృదయపూర్వకంగా కృతజ్ఞతలూ, ఆమెకి హృదయపూర్వక అభినందనలూ చెప్పవలసిన శుభసందర్భం ఇది!

– అబ్బూరి ఛాయాదేవి

ఎడిటర్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమ్మమ్మ మా చిన్నప్పుడు విజయవాడ సిద్ధార్థ కాలేజీ దగ్గర బాలల సంఘం ఏర్పాటు చేశారు. పరకాల పట్టాభి రామయ్యగారి మేడపైన బాలల సంఘం కార్యక్రమాలు జరిగేవి. వాళ్లింటికి ఎదురుగానే మూడు పోర్షన్ల తాటాకుల ఇల్లు ఉండేది. అందులో ఒక పోర్షన్లో మేము అద్దెకుండేవాళ్లం. మా ఇంటికి కొంచెం అవతలకి ’మో‘ అంకుల్ వాళ్లది (మమత వాళ్లిల్లు). నేను ఎస్ఆర్ఆర్లో చదివా.. అప్పుడు అక్కడే ఉన్నాం. తమ్ముడు సిద్ధార్థలోనే డిగ్రీ వరకూ చదివాడు. అమ్మ అంగన్వాడీ టీచర్. ఆ ఇల్లు ఓనర్స్ అమ్మేయడంతో ఆ తర్వాత సున్నబట్టీల సెంటర్ కి ఇల్లు మారాం.
    బాలల సంఘంలో అమ్మమ్మ మాకు భలే భలే ఆటలు, కథలు చెప్పేవాళ్లు. మాతో సైన్సు పాఠాలు తయారుచేసి పట్టాభి గారి అమ్మాయి ఉషా టీచర్ తో రేడియో ప్రోగ్రాములు చేయించారు. అమ్మమ్మకు మొక్కలంటే భలే ఇష్టం. నిమ్మకాయ మొక్క ఒకటి అమ్మమ్మ ఇంట్లో ప్రత్యేకంగా ఉండేది. చెట్టు చిన్నగానే ఉండేది. ఆకులు చాలా తక్కువ. కాయ కాస్త పొడవుగా, పెద్దగా ఉండేది. లోపల ఆరంజ్ రంగులో ఉండేది. ఇది చాలా మంచిదని ఇంటికి వెళ్లినప్పుడు నాలుగు కాయలు అమ్మమ్మ ఇచ్చేవారు. పేర్లు తెలియని వెరైటీ వెరైటీ స్నాక్స్ అమ్మమ్మకే సాధ్యం. వెళ్లినప్పుడు పాపా ఇటురా అంటూ పెట్టేవారు. నిర్జన వారధి చదివే వరకూ అమ్మమ్మ గుండె లోతులు తెలుసుకోలేకపోయాను. కాకపోతే అమ్మమ్మ కష్టాల్లో ఉందని నా పసి మనసుకు అర్థమయ్యేది.. కానీ ఏమీ చేయలేనుగా.. అయినా అప్పుడప్పుడు అమ్మమ్మను నీకు బాధేస్తుందా? అని అడిగేదాన్ని.. ఏమీ లేదురా.. ఎందుకలా అడుగుతున్నావు అంటూ.. అప్పటికప్పుడు ఓ మంచి కథ చెప్పి మయిమరిపించేవారు.
    డాక్టర్ కరుణా ఆంటీ, మా మేనత్త (సివి గారి భార్య భారతి), డాక్టర్ భాస్కరరావుగారి భార్య అరుణా ఆంటీ మంచి దోస్తులు. వీరంతా అప్పుడప్పుడు కలుస్తుండేవాళ్లు.. మేము చిన్నవాళ్లమైనా వారి మాటలు చెవిన పడుతూనే ఉండేవి. వాటిని బట్టి కరుణా ఆంటీ గురించి అమ్మమ్మ దిగులు కాస్త తెలుసు. కరుణా ఆంటీ చనిపోయినప్పడు తెలుసు.
    మా తాతయ్య (అమ్మ నాన్న.. గుండాబత్తుల ఆంజనేయులు సిపిఎం తరఫున మాజీ ఎమ్మెల్యే) ఒకసారి వస్తే అమ్మమ్మ దగ్గరకు తీసికెళ్లమంటే తీసికెళ్లా.. వాళ్లిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. నేను అప్పటికీ ఆడుతూ పాడుతూ ఉండే వయసే.. మా తాతగారిని అమ్మమ్మ చాలా అభినందించారు. చిన్నపాటి స్థలం కూడా లేకుండా కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారని జాలిపడ్డారు.
    అమ్మమ్మ ఎన్నెన్ని కష్టాల కాల్వల్ని దాటుకుంటూ దాటుకుంటూ సాహిత్యాన్ని పెనవేసుకుంటూ, సమాజహితాన్ని పలవరిస్తూ ఉండడమే మనందరికీ స్పూర్తిదాయకం.. అమ్మమ్మ సీతారామయ్య తాతయ్య గురించి ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా పరుషంగా మాట్లాడలేదు. పుస్తకంలో పేజీ చినిగిపోయిందని బాధపడటం కన్నా మిగిలిన పేజీల గురించే ఆమె ఎక్కువ ఆలోచించారు.
    మనవరాళ్ల గురించి ఎంతో తపన పడ్డారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నిండు నూరేళ్లు ఇలా అదే స్ఫూర్తితో ఉన్నారంటే అది అమ్మమ్మ ఆచరణే. అదే మనమంతా అనుసరించాలి.
    బాధలు, కష్టాలు, కన్నీళ్లు వస్తాయి.. వాటినే తలుచుకుంటూ మిగిలిన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు.. ఆ మిగిలిన జీవితాన్ని సార్థకత చేసుకోవడమే అమ్మమ్మ జీవిత పాఠం… లవ్ యూ అమ్మమ్మ.. నీ చేతి స్పర్శతో, నీ కథలతో, నీవు ప్రేమ రంగరించి పెట్టినవి తిని, నీ ప్రేమను పొందినందువల్ల ఈ రోజు నేనిలా ఉన్నానేమో…
    అమ్మమ్మ లవ్ యూ సోమచ్
    శాంతిశ్రీ

  • కోటీశ్వరమ్మ గారిని విజయవాడలో మొగల్రాజపురంలో కరుణక్క ఇంట్లో చూశాననుకుంటాను. ఇప్పుడు అయితే ఏదో ఎదిగినట్లు రాయగలుగుతున్నాం కాని అప్పుడు కోటీశ్వరమ్మ, కరుణక్క లాంటి వారిపై ఒక గౌరవభావం మాటల్ని హృదయాన్ని దాటనిచ్చేది కాదు. ఒక చరిత్ర మొదటి పేజీ ప్రారంభం నుంచీ చూసిన ఆమె చివరి అధ్యాయం వరకూ నిర్జన వారధి నడిపించారు.కోటీశ్వరమ్మ, కరుణక్క ఇద్దరూ వైవిధ్య భరితమైన సమాజానికి ప్రతిబింబాలు. ఒకరు సముద్రాన్ని తనలో ఇముడ్చుకున్న వ్యక్తి అయితే మరొకరు నిత్యం నదిలా గుండె తడితో ప్రవహించిన వ్యక్తి. ఒకరోజు ఒక బహిరంగ సభకు వచ్చిన కరుణక్కను లక్డీకాపూల్ వద్ద విజయవాడ బస్సు ఎక్కించమని వసంతలక్ష్మి గారు బాధ్యత అప్పగించారు. ఆ చిన్న పనిచేసినందుకే ఎంతో సంతోషించి, ప్రేమను కురిపించి కరచాలనం చేసి ఆశీర్వదించిన కరుణామయ మూర్తి కరుణక్క. దీన్ని బట్టి కోటీోశ్వరమ్మ గారు ఎంత ఆర్ద్రత గలవారో అర్థం చేసుకోవచ్చు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు