నేను పదేళ్ల క్రితం మొదటిసారి దక్షిణాఫ్రికా వచ్చినప్పుడు ఇక్కడి పచ్చదనం చూసి మైమరచిపోయాను. కడుపు నింపుకోడానికి వచ్చి మొదట మనసును నింపుకున్నాను. ఎటు చూసినా ఆకుపచ్చని ఆకాశాన్ని కప్పుకున్న దేశంలో కొంచెం నీడ దొరకడం నాకు పెద్ద కష్టమేమీ కాలేదు. నా తొలి ఉద్యోగానికి కేప్ టౌన్ ఆఫర్ లెటర్ చాచి ఆహ్వానించింది. అది మరింత అందమైన, ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక నగరం. కార్లు మాత్రమే తిరిగే దేశంలో చిన్న బైక్ కొనుక్కొని కేప్ టౌన్ ను ఆస్వాదించడం మొదలుపెట్టాను.
ఒకవైపు సముద్రం, మరొకవైపు అంతం లేదేమో అన్నట్టుగా ప్రవహిస్తున్న పర్వతశ్రేణి. అందులో కుర్చీ వేసుకొని దర్జాగా కూర్చున్న టేబుల్ మౌంటెన్. సముద్రానికి దగ్గరగా ఉండాలనే నా స్వార్ధపు కోరిక వలన భారతీయ వంటసరుకులు తెచ్చుకోడానికి చాలా దూరం వెళ్లాల్సొచ్చేది. అయినా ఆనందంగానే వెళ్ళేవాడిని. అక్కడ ఉద్యోగం చేసిన మూడేళ్లు దాదాపు ప్రతీ వారాంతం ఏదో ఒక ప్రదేశాన్ని పలకరించాను.
ఇప్పటికీ కేప్ టౌన్ ఇసుకలో నా పాదముద్రలు ఉంటాయి. జొహానెస్బర్గ్ వచ్చాక ఇక్కడ పరిచయమైన సాహితీమిత్రుల ప్రోత్సాహం వలన మరుగునపడిన ‘రాత’ మెరుగునపడింది. ఇది కూడా అందమైన నగరమే అయితే తన సగం అందాన్ని మనుషుల్లోకి ఒంపి జీవనదిలాగా ప్రవహిస్తుంది. ఇక్కడకు వచ్చాక ‘అనర్ఘ్య’ అనే పేరుతో కవితా సంపుటిని వెలువరించాను. అది నా మొదటి సంతకం. ఇక్కడే ఆవిష్కరణ చేసుకొని మరింత రాయడానికి స్ఫూర్తిని పొందాను.

1
ప్రపంచంలో పేరు లేని దేశం దక్షిణాఫ్రికా. ఆఫ్రికా ఖండానికి ‘దక్షిణాన’ ఉంది కాబట్టి దక్షిణాఫ్రికా అనడమే కానీ నిజానికి మిగతా దేశాల్లా అది పేరు కాదు. లక్షల సంవత్సరాల క్రితం మొదటి మనిషి ఇక్కడే పుట్టాడు. బహుశా బొడ్డు తెంపుకుని పుట్టిన బిడ్డలు అమ్మలాంటి దేశానికి పేరు పెట్టకూడదనేమో? ఎవ్వరూ ఏ పేరూ పెట్టలేదు. స్వాతంత్రోద్యమానికన్నా ముందే, వర్ణ వివక్ష పోరాటాల కన్నా ముందే ఈ మట్టికి ఘన చరిత్ర ఉంది. చాలా తెగలు ఇక్కడ ఆనందంగా అడవుల్ని కప్పుకొని బ్రతికాయి. చాలా దేశాల్లో మనిషి అడుగు పెట్టకముందే ఇక్కడ కంటిపాపరంగు తనువులు కొండకోనలకు మాటలు నేర్పాయి. చాలా నాగరికతలు మొదలవ్వకముందే ఇక్కడి సాయంత్రాలు నిప్పుల చప్పుళ్ళ ముందు నాట్యపు సెగలయ్యాయి. చాలా నేలల్లో గులకరాళ్లు పండుతున్నప్పుడు ఇక్కడి మృత్తికలు వెచ్చని చనుబాలనిచ్చాయి.
ఆకుపచ్చని ఆకాశం కింద ఈ నేలకు మూలవాసులు పుట్టారు. బండరాళ్ళ మొదళ్ళలో బతుకు చిత్రాన్ని గీసుకున్నారు. గోధుమరంగు గడ్డి పొదల కింద నల్లని సెలయేళ్ళై ప్రవహించారు. ఆకాశానికీ నేలకు మధ్యలో ఉన్నదంతా మనందరిదీ అని నమ్మి ప్రకృతమ్మ పొత్తిళ్ళలో కుందేలు పిల్లల్లా గెంతులేశారు. దేన్నీ కోరుకోకుండా, ఏదీ దాచుకోకుండా నదీ ప్రవాహంలా ఉరకలేశారు. చీకటేలకి సంద్రమంత అడవిలో తెరచాపల్లా విచ్చుకున్నారు. పుట్టనూ, గుట్టనూ, మట్టినీ, మానునూ అన్నింటినీ పూజించి అన్నం ముద్దల నుదుటిన చెమట బొట్లు దిద్దారు. అరచేతిని తిప్పి చూస్తే అందరి ఒంటి రంగూ ఒక్కటేనని వాళ్ళకు తెలియదు, అలా చూసుకునే అవసరమైనా రాలేదు. ఆనాటి వెన్నెలలు దేశమంతా సమానంగా కురిసేవి. వెచ్చని అడవిదార్లు అన్ని పాదాలనూ సమానంగా ముద్దాడేవి. వర్ణవివక్ష లేకుండా సూర్యుడు సప్త వర్ణాలతో ఉదయించేవాడు. తెల్లటి శుక్లాలున్న కళ్ళు అప్పటికింకా తీరందాటి ఈ దేశంలోకి జొరబడలేదు.
మనుషుల్ని కనాలంటే అమ్మలు కనాలి, లేదంటే అడవులు కనాలి. ఈ దేశపు అడవులు మనుషులతో పాటు భాషల్ని, సంస్కృతిని కన్న అమ్మలు. చాలా తెగలు ఈ నేల కింద బొరియలు తవ్వుకొని బతుకుల్ని మొదలుపెట్టాయి. ఈ దేశంలో ప్రతి మనిషీ ఏదో ఒక ఆటవిక తెగకు చెందిన వాడే. ఇక్కడి రకరకాల అడవి జాతులు, వాటి చుట్టూ అల్లుకున్న సంస్కృతి, సాహిత్యం, ఆరాధనా పద్ధతులు, ఆహారం, ఆహార్యం అన్నీ భిన్నంగా ఉన్నా మౌళిక జీవన విధానంలో ఎలాంటి తేడాలూ ఉండవు. ఒక్కో తెగ ఒక్కో భాష మాట్లాడుతుంది. ఒక్కోలా పాటలు పాడుతుంది. కొండల్లో కోనల్లో ఎత్తుపల్లాలు ఎక్కి దిగుతున్నప్పుడు ఆయాసపడుతూ మాట్లాడే ఊపిరితిత్తుల భాష అన్ని తెగల్లోనూ సమానంగా ప్రతిధ్వనిస్తుంది. జూలు (Zulu), ఖోసా (Xhosa), సోతో (Sotho), త్స్వానా (Tswana), వెండా (Venda), న్దెబెలె (Ndebele) ఇక్కడి ప్రధాన తెగలు. ఆరాధించే పద్ధతులు మారినా అన్ని తెగలూ చేతులు జోడించేది మాత్రం ప్రకృతికే.

అమ్మ కడుపునుండి బయటకు రావడమే మొదటి వలస. మనుగడకు అది అనివార్యం. సామాజిక, సాంస్కృతిక, మానసిక చైతన్యమంతా వలసలవల్లనే సాధ్యమైంది. అయితే ఎక్కువ సార్లు వలసలకు ఆకలి, ప్రకృతే కారణాలు. వలసపోవడమంటే పాలు తాగుతూ అమ్మ రొమ్ములు ఒకవైపునుంచి మరోవైపుకు మార్చుకోవడమే. మరీ ముఖ్యంగా మొదటి మనిషి పుట్టిన దక్షిణాఫ్రికాకు రావడమంటే పుట్టినచోటును వెతుక్కుంటూ రావడమే. భారతదేశాన్ని బ్రిటీషు వాళ్ళు పరిపాలిస్తున్న కాలంలో వివిధ దేశాల పంటపొలాల్లో చెమట చుక్కలు పారించడానికి, అన్నం ముద్దలు మొలిపించడానికి తక్కువ ధరకు కూలీలు అవసరమయ్యారు. పర్యవసానంగా మనదేశంనుంచి చాలా దేశాలకు ఓడల్లో కూలీలు తరలించబడ్డారు. వారిలో కొందరు కొన్నేళ్ళకు తిరిగి వచ్చేసినా చాలామంది ఆ దేశాల్లోనే ఉండిపోయారు. అలా వందల ఏళ్ళక్రితం భారతదేశంనుంచి దక్షిణాఫ్రికాకు మొదలైన వలసలు రూపాన్ని, అవసరాన్ని మార్చుకొని ఇప్పటికీ కొనసాగుతున్నాయి. కొంచెం వెనక్కు వెళితే దక్షిణాఫ్రికాలో భారతీయుల చరిత్ర 1860 సంవత్సరంలో ప్రారంభమైంది. ట్రూరో (Truro) అనే నౌకలో వచ్చిన మొదటి భారతీయ కూలీల పాదముద్రలు నటాల్ (Natal) సముద్రతీరంలో పడ్డాయి. వీరు ప్రధానంగా చక్కెర తోటలలో పని చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ద్వారా తీసుకువచ్చిన ఒప్పంద కార్మికులు (Indentured Labourers).
ఈ కార్మికులు భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చినా వీరిలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు ఎక్కువగా ఉన్నారు. అప్పట్లో సముద్ర ప్రయాణం నెలల తరబడి సాగేది. కొత్త భూమి, కొత్త భాష, కొత్త జీవితం మొదట్లో ఇవన్నీ వారికి ఒక పెద్ద సవాలుగా మారాయి. దక్షిణాఫ్రికాకు వచ్చిన మొదటితరం భారతీయులలో తెలుగు మాట్లాడే ప్రజలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలామంది అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీకి చెందిన ప్రాంతాల నుండి వచ్చారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, గోదావరి ప్రాంతాలు, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల నుండి కూడా వచ్చారని చరిత్రపుటలు, అప్పటి ఓడల శాఖ రికార్డులు చెబుతాయి. వారందరూ చెక్కెర తోటలలో, వ్యవసాయ క్షేత్రాల్లో, చిన్నచిన్న పరిశ్రమల్లో పనిచేశారు. దేశాలు దాటి, ఖండాలు దాటి ఇక్కడిదాకా వచ్చినా వాళ్ళు పండుగలను, సంస్కృతిని, భాషను వీలైనంత వరకు కాపాడుకోగలిగారు. మొదట్లో చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి ఉత్సవాలు జరుపుకునేవారు. వాళ్లలో వాళ్లే పెళ్లిళ్లు చేసుకున్నారు. అప్పటికే ఈ నేల వివక్షబువ్వను సంపూర్ణంగా తింటుంది. కొత్తగా వచ్చిన కూలీలు కూడా అనివార్యంగా ఆ తిండినే తినాల్సొచ్చింది.
1860 నుండి 1911 వరకు సుమారు 384 ఓడల్లో తరలించబడిన మొత్తం భారతీయ కార్మికుల సంఖ్య అధికారిక లెక్కల ప్రకారం 1,52,184. వారిలో చాలా మంది ఒప్పందం పూర్తయ్యాక కూడా దక్షిణాఫ్రికాలోనే స్థిరపడ్డారు. ఈరోజుకు దక్షిణాఫ్రికాలో భారతీయ మూలాలున్న ప్రజలు దాదాపు 1.5 మిలియన్ (15 లక్షలు). వీరిలో ఎక్కువ మంది KwaZulu-Natal ప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రత్యేకంగా Durban నగరాన్ని “భారతదేశం వెలుపల అతిపెద్ద భారతీయ జనాభా కలిగిన నగరం”గా గుర్తిస్తారు.
దక్షిణాఫ్రికా చరిత్రలో అత్యంత కఠినమైనది Apartheid (జాతి/వర్ణ వివక్ష) కాలం. ఆ సమయంలో వలసవచ్చిన భారతీయులు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఒంటి రంగును బట్టి నివసించే ప్రాంతాలు వేరుగా ఉండేవి, విద్యలో పరిమితులు, ఉద్యోగాలలో అడ్డంకులు, భారతీయులను ఇక్కడి నల్లజాతి ప్రజలు కూడా వాళ్ళతో సమానంగా చూసేవాళ్ళు కాదు.1893లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకు వచ్చారు. ఇక్కడ భారతీయులు ఎదుర్కొంటున్న వివక్షను చూసి ఆయన తీవ్రంగా స్పందించారు. ఆయన ప్రారంభించిన సత్యాగ్రహ ఉద్యమం భారతీయుల హక్కుల కోసం జరిగిన ఒక గొప్ప పోరాటంగా నిలిచింది. ఈ ఉద్యమం భారతీయ సమాజానికి ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. తరువాతి కాలంలో భారతీయ మూలాలున్న అనేక మంది నాయకులు దక్షిణాఫ్రికా స్వేచ్ఛా పోరాటంలో పాల్గొన్నారు. వారు నెల్సన్ మండేలా వంటి నాయకులతో కలిసి వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కాలం మనిషిని ముందుకు వెళ్ళమని ప్రోత్సహిస్తుంది. తరాల తరువాత భారత సంతతి దక్షిణాఫ్రికాలో భాగమైంది. ఒకప్పుడు తోటలలో పనిచేసిన వారి సంతతి ఈ రోజు డాక్టర్లు, ఇంజినీర్లు, వ్యాపారవేత్తలు, శాస్త్రవేత్తలు అయ్యారు. అది మనకు ఖచ్చితంగా గర్వకారణం.
దక్షిణాఫ్రికాకు స్వాతంత్య్రం వచ్చాక, మొదటి ప్రజాస్వామిక ఎన్నికలు జరిగి నెల్సన్ మండేలా దేశాధ్యక్షుడు అయ్యాక కూడా అనేకమంది భారతీయులు వ్యాపార, ఉద్యోగ అవసరాల నిమిత్తం దక్షిణాఫ్రికాకు వస్తూనే ఉన్నారు. మొదటితరంలో వచ్చిన అనేకమంది భారతీయ డాక్టర్లు ఇప్పటికీ ఈ దేశపు నాడిని చూస్తున్నారు. 2000 సంవత్సరం తరువాత సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెందాక ఇక్కడకు వలసలు మరింత పెరిగాయి. దక్షిణాఫ్రికా సాంకేతిక రంగంలో చెందుతున్న అభివృద్ధిలో భారతీయుల పాత్ర అసామాన్యం. ఒకప్పటి కూలీలుగా గాక గౌరవప్రదమైన ఉద్యోగాలకోసం, నైపుణ్యతను నిరూపించుకోడానికి అనేకమంది ఈ దేశానికి రెక్కలు కట్టుకొని వస్తున్నారు. ఇక్కడ పెరుగుతున్న పిల్లలు భాషల్ని, సంస్కృతిని అర్ధం చేసుకొని రెండు దేశాలకు వారధులుగా మారుతున్నారు.
బ్రిటీష్ పరిపాలనా ప్రభావంతో ఇక్కడ అందరూ ఇంగ్లిష్ భాషనే మాట్లాడతారు కాబట్టి భాషాపరమైన సమస్య అప్పుడూ, ఇప్పుడూ లేదు. బహుశా రెండు దశాబ్దాలక్రితం ఇక్కడకు వచ్చిన భారతీయులకు కొన్ని ఇబ్బందులు ఎదురై ఉండొచ్చు. ఆహారపు అలవాట్లు, సాంప్రదాయ వంట సరుకులు దొరకకపోవడం లాంటివి కొంత ఇబ్బంది అయ్యుండొచ్చు కానీ గత పదిహేనేళ్లుగా ఆలాంటి సమస్య లేదు. వర్తక వ్యాపారాలు పెరిగి గ్లోబలైజేషన్ తలుపులు అన్ని దేశాల్లో తెరుచుకున్న తరువాత విసనకర్రలనుంచీ వినాయకుడి విగ్రహాల దాకా భారతదేశంలో ఉన్నవన్నీ ఇక్కడా లభిస్తున్నాయి.
ఇక్కడి ప్రవాసులు అనేక సంఘాలుగా విస్తరించారు. భాషా ప్రాతిపదికన, రాష్ట్రాల, సంస్కృతి ప్రాతిపదికన సమూహాలుగా మారి అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. అన్ని సంఘాల వాళ్ళు పండుగల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దాదాపు తెలుగు పండుగలన్నీ ఇక్కడా జరుగుతున్నాయి. మరింత సామూహికంగా, వైభవంగా కూడా జరుగుతున్నాయి. గణతంత్య్ర, స్వాతంత్ర్య దినోత్సవాలను భారత ప్రభుత్వమే నిర్వహిస్తుంది.
ఇప్పుడు అవకాశాలను అందిపుచ్చుకుంటున్న యువతకు దక్షిణాఫ్రికా మరో అమ్మ. కీబోర్డ్ నేలల్లో సాంకేతికతను పారిస్తున్నారు. మునివేళ్లతో దేశాలమధ్య దూరాల్ని తగ్గిస్తున్నారు. కంప్యూటర్ స్క్రీన్లకు నల్లసూర్యుడి ఉషోదయాల్ని పరిచయం చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ రంగంతోపాటు ప్రముఖంగా విద్యా, వైద్య, మైనింగ్, వ్యాపార రంగాల్లో భారతీయులు వృద్ధి చెందుతున్నారు. సాంస్కృతిక, సాహిత్య, క్రీడారంగాల్లో ఇక్కడనుంచి ప్రపంచానికి గట్టి పోటీని ఇస్తున్నారు. ఈ మట్టి మీద నుంచి అనేక భారతీయ భాషల్లో రచనలు జరుగుతున్నాయి. పుస్తకావిష్కరణలు, సాహితీచర్చలు నల్లమల్లెల నేలలో కూడా విరబూస్తున్నాయి. ఒకప్పటిలా కాక ఇప్పుడు ప్రవాసం మరింత సులభమైంది. దేశాలు దాటి ఇక్కడకు వచ్చి ఒక్క జట్టుగా బ్రతకడమే సామాజిక సౌందర్యం. మన బ్రతుకును, భవితను కాపాడుకోవడం, భాద్యతగా పిల్లలకు మాతృభాషను నేర్పించడం, పండుగలకు కలసికట్టుగా తోరణాలవడం, తోటిమనిషిని నిస్వార్ధంగా ప్రేమించడమే అసలైన సాంస్కృతిక మాధుర్యం. దక్షిణాఫ్రికా అన్ని కళలకు వేదికవుతుంది. సింగిడి రంగుల నేలలో మనజెండారంగును ఎగురవేస్తుంది.

2
ఉద్యోగాలు మారినా సాహితీ చర్చల్ని, మిత్రుల్ని తరచుగా కలవడాన్ని ఎప్పుడూ మానలేదు.
దక్షిణాఫ్రికా చరిత్ర, సంస్కృతి పట్ల భిన్నమైన అభిప్రాయాన్ని ఏర్పరుచుకోడానికి అదే దోహదపడింది. అయిదు సంవత్సరాల తరువాత కృష్ణపక్షం పేరుతో దక్షిణాఫ్రికా మట్టి గాధల్ని రాయడానికి అదే ప్రేరణ.
ఎక్కడో ఖమ్మం జిల్లాలో మారుమూల కొండల్లో ఉన్న మా ఊరు ఇక్కడనుంచి చాలా దగ్గర. తలచుకుంటేనే కనిపిస్తుంది. రోజూ తలచుకుంటున్నా చిరాకు పడకుండా రోజూ కనిపిస్తుంది. ఇక్కడా అక్కడా ఒకటే నేల, ఒకటే ఆకాశం, ఒకే లాంటి మనుషులు. ఆకలి, దానికోసం పోరాటం అన్నీ ఒక్కటే. అందుకే ఇది కూడా నా ఊరే. నేను కూడా ఇలాంటి వాడినే. ఇలాంటి నేలలోనే పుట్టాను. అక్కడి స్నేహితుల్ని, అమ్మా నాన్నల్ని, అక్కా చెల్లెళ్లని తరచుగా కలవలేకపోతున్నాననే భాధ తప్ప ఈ నేల నన్ను ప్రేమగా హత్తుకుంది. ఆర్నెల్లకో, సంవత్సరానికో ఖచ్చితంగా అమ్మ నేలకు వెళతాను. నెలో రెణ్ణెల్లో అందర్నీ పలకరించి తిరిగి మళ్ళీ అమ్మ నేలకే వస్తాను. కవలతల్లులు కన్నబిడ్డను నేను. నాకు రెక్కలు కట్టి అక్కడికీ ఇక్కడికీ తిప్పుతూ ఆడిస్తున్న ఇద్దరు అమ్మల తనయుడ్ని నేను, దన్యుడ్ని నేను.
ప్రవాసమంటే అమెరికా, ఆస్ట్రేలియా లేదంటే మధ్య ప్రాచ్య దేశాలు మాత్రమే అనుకునే వాళ్ళున్నారు. ఇప్పటికీ ఆఫ్రికాను ఒకటే దేశం అనుకునే వాళ్ళూ ఉన్నారు. కెన్యాలోనో, కాంగో లోనో ఏదైనా జరిగితే ఇక్కడి ఫోన్లు కంగారు పడతాయి. ఇక్కడి మనుషులంటే ఇప్పటికీ ఎంతో కొంత చిన్న చూపు ఉంది. అధికంగా దొంగతనాలు, హత్యలు జరుగుతాయనే భావనా ఉంది. అది ఇక్కడి పేదరికం వల్లనో, వందల యేళ్ళ అణచివేత వల్లనో వచ్చుంటుంది.
ఇక్కడ అంతా బాగుంది అని చెప్పను. కానీ నా కళ్ళు చూపించినంత మేరా, నేను అర్ధంచేసుకున్నంత మేరా మిగతా ప్రపంచం కళ్ళుమూసుకొని ఊహించుకుంటున్నదానికంటే ఎక్కువే బాగుంది. ఏ పరిచయం లేకపోయినా పలకరించే మనుషులు, అందమైన ప్రకృతి, పెద్దపెద్ద సఫారీలు ప్రవాసాన్ని మరింత ఆనందమయం చేస్తున్నాయి. ఇది దక్షిణాఫ్రికా… పాలపుంతల అగాధాల్లోంచి రాలిపడ్డ వజ్రపు ముక్క. తెల్లటి కాకులతో కొట్లాడి ఆకాశంలో హరివిల్లు జెండా ఎగరేసిన నల్లటి హంస.
*








చదువుతుంటే చాలా బాగా అనిపించింది. మీలో బోలెడు పాజిటివిటీ ఉంది, అది పదిలంగా కాపాడుకోండి. మీకూ మీ రచనల ద్వారా మళ్ళీ ఇవ్వొచ్చు. మాదీ ఖమ్మం జిల్లా నే, మీదే ఊరు?
“…పాలపుంతల అగాధాల్లోంచి రాలిపడ్డ వజ్రపు ముక్క. తెల్లటి కాకులతో కొట్లాడి ఆకాశంలో హరివిల్లు జెండా ఎగరేసిన నల్లటి హంస.”
గౌతమ్ గారూ,
దక్షిణాఫ్రికా దేశ ‘పురా-నూతన’ లోతులను ఒక్క మాట లో
చాలా బాగా చెప్పారు. మీరు మరింత రాయగలరు.
అభినందనలు.
సుందరం శొంఠి
కొత్త ఢిల్లీ.
01st April 2026.